ఆండ్రూ కార్నెగీ (జీవితచరిత్ర)/దొర్లిపొయ్యే మంచుముద్ద

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

దొర్లిపొయ్యే మంచుముద్ద

5

రైల్‌రోడ్ కంపెనీ మీదికి అభియోగ మొకటి తీసుకొరాబడింది. సమన్లు పంపించి యిందులో సాక్ష్యం చెప్పటంకోసం ఆండ్రూను పిలిపిస్తారని మిష్టర్ స్టోల్స్ అనుమానించాడు. అందుకు సిద్ధపడటం కోసం కొంత కాలవ్యవధి అతడు విచారణకు వాయిదా కోరాడు. అతని యువుకుడైన అసిస్టెంటును కొంతకాలంపాటు రాష్ట్రం బయటికి ఎక్కడికైనా తరిమి వెయ్యమని మిష్టర్ స్టోర్స్ మేనేజర్ స్కాట్‌ను అర్ధించాడు. ఈ కారణంగా ఆండ్రూ క్రిష్టలైను ఓహైయోలకు వెళ్ళి టామ్ మిల్లర్, జిమ్మీ విల్సన్లతో [వీళ్ళిద్దరూ అక్కడ రైల్ రోడ్ లో పనిచేసేవాళ్ళు] చాలా రోజులు గడిపాడు. వారందరూ కొద్దికాలం క్రితమే గుర్రంమీది నుంచి పడటంవల్ల మరణించిన జాన్‌ఫిప్స్ కోసం దు:ఖించారు. యిది ఆ యువకబృందానికి కలిగిన మొదటి విచ్ఛిత్తి. ఈ మహాఘోరమైన ప్రమాదాన్నిస్వీకరించటానికి వాళ్ళు ఏమాత్రం సంసిద్ధులైన వాళ్లుకాదు. జాన్ చిన్న తమ్ముడు హెన్రీ ఆండ్రీకి ఎంతో ప్రీతిపాత్రుడై అతని బహు వ్యాపారాలల్లో భాగస్థుడైనాడు.

బండి యెక్కి ఓహైయోగుండా క్రిష్ణలైనుకు వెళ్ళుతున్నప్పుడు ఆండీ పచ్చని సంచీని మోసుకుపోతున్న ఒక మనిషిని చూశాడు. బండగా కనిపించే అతడు అన్నాడు. మీరు పెన్సిల్వేనియా రైల్‌రోడ్‌కు సంబంధించిన వారట, బ్రేహ్‌మాన్ నాతో చెప్పాడు."

"అవును. నిజమే!" అని సమాధాన మిచ్చాడు ఆండీ.

ఆ అపరిచితుడు "నాపేరు థియొడోర్ పూడ్రఫ్ నా దగ్గిర రాత్రి ప్రయాణాలకు పనికి వచ్చే ఒక కారునమూనా వుంది. దాన్ని నేనే కనిపెట్టాను. మీకు చూపించనా!" అన్నాడు.

"తప్పకుండా"

మిష్టర్ వూడ్రఫ్ తన నమూనాను సంచిలోనుంచి బయటికి తీశాడు. అది నిద్రపోవటానికి వీలైన ఒక కారుభాగం. రెండు వైపులా దానికి జంటలుగా కూర్చోటానికి సీట్లు వున్నాయి. ఈ సీట్లు ఒక దాని కొకటి ఎదురు మళ్ళుగా వున్నవి. రాత్రివేళ రెంటిని కలిపే ఎటుబడితే అటు వంచడానికి అనువైన దిండు, పరుపుల మూలంగా మొత్తాన్ని ఒక శయ్యగా మార్పి వేయవచ్చు. కిటికీపైన మరొకప్రక్కగా వుంది. పగటివేళదీన్ని తెలివిగా లోపలదాచి పెట్టే ఏర్పాటువుంది. గొలుసుల ఆధారంతో రాత్రిళ్లు దీనీక్రిందికి దించవచ్చ్చు. పడుకొనేందుకు ఉపయోగించనప్పుడు దీనిని పరుపు, ప్రక్కగుడ్డలను పెట్టుకోటానికి గిడ్డంగిగా వినియోగించుకోవచ్చు. సంగ్రహంగా చెప్పవలసివస్తే ఇది 18 0 నుంచి ఈనాటివరకూ మనకు తెలిసివున్న పుల్మన్ స్లీపింగ్ కార్.

స్లీపింగ్ కార్లని పిలువబడే ఇటువంటివి రైల్‌రోడ్లు మీద ఇప్పటికి దరిదాపుగా ఇరవై సంవత్సరాలనుంచీ వుంటూనే వున్నవి. అయితే ఆత్మగౌరవ మున్నవాళ్లు అందుమీద నిద్రపోవటానికి అసహ్యించుకొన్నారు. స్త్రీలు ఆ పని ఎన్నడూ చెయ్య లేదు. ఇవి ఇరువైపులా రెండుమూడు అంతస్థులున్న బాక్స్ కార్లకంటే కొంచెం బాగున్నవి. కొందరు ప్రయాణీకులు వాటిమీద గుడ్డలు పరుచుకొని, మరి కొందరు బూట్లు విప్పుకొని ఈ షెల్ఫ్‌లమీద వెన్ను వాల్చేవారు..

ఈ సూచింపబడ్డ వూడ్రఫ్ కారు ఎంతో భిన్నమైంది. నమూనాను పరిశీలించగానే ఆండ్రూకు ఉద్రేకం ఎక్కువైంది. ప్రయాణరీతినే పూర్తిగా మార్చివేయగల దేదో యిందులో ఉందని అతడు తనలో తాననుకున్నాడు. ఎన్నో ప్రశ్నలడిగాడు.

వూడ్రఫ్ అన్నాడు: "ఇది మీతో చెప్పటం ఎంతో సముచితం. చాలా అననుకూలమైన పరిస్థితి లైనప్పటికీ న్యూయార్క్ సెంట్రల్ వారు నా భావానికి రూపకల్పన చేసే ప్రయత్నం అర్థహృదయంతోనే చేశారు. దానికి సక్రమమైన అవకాశం లభించ లేదు." ఆండ్రూ అడిగాడు: "నీకోసం కబురుచేస్తే అల్తూనాకు వస్తావా!"

"తప్పక వస్తాను"

"సరే. నేను తిరిగివెళ్ళిన తరువాత ఈ విషయాన్ని మిస్టర్ స్కాట్‌కు తెలియ జేస్తాను. నీ చిరునామా నాకివ్వు"

ఓహైయోలో ఉన్నంతకాలం అతణ్ని స్లీపింగ్ కార్ వెన్నాడుతూనే వుంది. తిరిగి అల్తూనాకు వెళ్ళగానే అతడు వేగంగా స్కాట్ కార్యాలయంలోకి చొచ్చుకోపోయి దావాను గురించి కూడా అడగకుండా "మిష్టర్ స్కాట్ నేనొక భావాన్ని సంపాదించాను. అది రాత్రిళ్లు పడుకొని నిద్రపోవటానికి వీలున్న కారు" అన్నాడు.

మేనేజరు మోముమీద సగంనవ్వుతో వింటూ వెనక్కు వ్రాలాడు. అతడు కుర్రవాని ఉద్రేకాలకు బాగా అలవాటు పడ్డవాడు అయినా, అందులో కొంత గట్టి ఆధారం వుంటుందని అతనికి తెలుసు. "ఏమోయ్, యువకుడా! దీన్ని నీవు గట్టిగా విశ్వసించావా!" అన్నా డతడు. "సరే! మీ మిత్రునితో నమూనాను తీసుకోరమ్మను. దాన్ని నేను చూస్తాను."

తంతి మూలంగా తెలియ జేసిన వెంటనే వూడ్రఫ్ అల్తూనాకు వచ్చాడు. స్కాట్‌కు అతని నమూనా గట్టిగా నచ్చింది.

"అయితే నీ మాట యేమిటి!" అతడడిగాడు. "మీ కంపెనీ ఈ కార్లను తయారుచేసి, ప్రవేశపెట్టి నాకు రాయలటీ ఇవ్వాలని" అన్నాడు ఆ వస్తుసృష్ట.

దానికి సంబంధించిన వివరాలను చర్చించటం అయిపోయింది. వెంటనే రెండు కార్లను నిర్మించాలని మిస్టర్ స్కాట్ నిశ్చయించాడు. మిస్టర్ వూడ్రఫ్‌తో బాటు ఆండ్రీ బయటికి వచ్చాడు. కార్యాలయ బహిరంగణంలో ఆ వస్తుసృష్ట అతనివంకకు తిరిగి "మిస్టర్ కార్నెగీ, ఈ వ్యాపారంలో నీవు నాతో కలిసి వస్తావా!" అని అడిగినప్పుడు అత డాశ్చర్య పడ్డాడు.

క్షణకాలం ఆండీ మూకత వహించాడు. అతని దగ్గిర ఉన్న దేమిటి? కొద్ది డబ్బు కాదు సిద్థంగా లేకపోవటం. అయితే ఆడమ్స్ ఎక్స్‌ప్రెస్ స్టాక్ లాగా తనవంకకు డివిడెండ్లను ప్రవహింపజేసే అవకాశాలల్లో ఒకటి సిద్ధంగా వుంది. జారవిడవటానికి వీల్లేదు.

"బహుశ:, కలిసి వస్తాను" అన్నాడు. "నీ అభిప్రాయ మేమిటి!" అని అడిగాడు.

"నేను వెంటనే ఆరంభింపబోతున్న సంస్థలో ఎనిమిదోవంతు భాగాన్ని నీకు కొనుక్కొని ఇద్దామని ఉద్దేశిస్తున్నా"

అతడు పెట్టుబడి మొత్తం ఎంతెంతుందో అంకెల్లో చెప్పాడు. వెంటనే చెల్లించటానికి తన దగ్గిర డబ్బు లేదని ఆండ్రీ ఒప్పుకున్నాడు. కొంత సంభాషణ సాగిన తరువాత వూడ్రఫ్ అది అంచెలవారీగా చెల్లిమవచ్చునన్నాడు.మొదటి సారిగా చెల్లించవలసిన మొత్తం 217.50 డాలర్ళు అప్పు పుచ్చుకోవటంవల్ల తప్ప మరొక విధంగా దీన్ని పొందే అవకాశం ఆండ్రికి లేదు. అతడు మిస్టర్ లాయిడ్ అనే స్థానికుడై వడ్డీ వ్యాపారస్థుడి దగ్గరికి వెళ్లాడు. పెట్టుబడి పెట్టే నిమిత్తంగా డబ్బును అప్పుగా ఇవ్వటానికి అతనికి అవకాశం ఉంటుందేమో అని అడిగాడు. అతడు చాలా పొడగిరి. ఆరు అడుగుల మనిషి. సాయిలా సాయిలావాడు. ఆండ్రీని యెరుగును. అతడంటే ప్రీతి కూడాను.

"అది మంచి పెట్టుబడి అని నీకు నిశ్చయంగా తెలుసునా!" బరువైన తన హస్తాన్ని ఆ యువ మిత్రుని భుజాలమీద అడ్డంగా వుంచి ఆ వడ్డీ వ్యాపారి ప్రశ్నించాడు.

"తెలుసును, అది స్లీపింగ్ కార్ కంపెనీకిపెట్టుబడి. మా రైల్‌రోడ్ సంస్థ రాయలటీ పద్ధతిమీద అటువంటి కార్లను రెంటిని నిర్మించబోతున్నది.

"తప్పక నీ కిప్పిస్తాను, ఆండీ!" అన్నాడు మిస్టర్ లాయిడ్.

"సాహసించి ఐనా ఇవ్వదగ్గవాడివి నీవు."

ఆండ్రూ తన జీవితంలో ఒకప్రామిసరీనోటు వ్రాసీవ్వడం ఇదే మొదటిసారి. ఈ సంఘటనే తన అదృష్టానికి ఆరంభమని తరువాత కాలంలో అతడు నిత్యం భావిస్తుండేవాడు. ధఫాలువారిగా అతడు చెల్లించవలసిన పెట్టుబడి మొత్తాలను అతడికి వచ్చే డివిడెండ్ల మూలంగా వచ్చే డబ్బుతో చెల్లించ గలుగుతుండేవాడు. పెన్సిల్వేనియా సంస్థ ఇంకా ఇతర జాతి --పర్లను నిర్మిస్తున్నది. ఈ పనికి ఇతర కంపెనీలు, తామూ పూనుకొన్నవి. అతడికి ఇరవయ్యయిదేళ్ళ వయసు వచ్చేటప్పటికి స్లీపింగ్ కార్ల పెట్టుబడిమీద వస్తున్న సంవత్స రాదాయం 5000 డాలర్లు. "సాంకోపాంజా పలికిన ధోరణిలో అంటున్నాను. నిద్రను కని పెట్టినవా డెవడోగాని అతడికి శ్రేయమగు గాక!" అన్నాడు అత డోమాటు.

కార్నెగీలు అల్తునాలో మూడేలున్న తరువాత 1859 నాటి గ్రీష్మంలో, మిస్టర్ స్కాట్ తన అసిస్టెంటుతో అన్నాడు: "ఆండ్రీ! వాళ్లు నన్ను ఫిలడల్ఫియా సంస్థకు ఉపాధ్యక్షుణ్ని చేయదలచుకొన్నారు. ఈవిషయాన్ని మిస్టర్ థామస్‌తో చర్చించేటందుకు నేను వచ్చేవారంలో ఫిలడల్పియాకు వెళ్లుతున్నాను."

ఈ వార్త విని ఆండ్రూ క్రుంగిపోయాడు. ఫిలడల్ఫియా, అతడు విశేషంగా గౌరవిస్తూ , దరిదాపు అతని కాదర్శమూర్తి అని భావించే పెద్దను ఆకర్షించి వేస్తున్నది. దీని పలితం అతని మీద ఎలా వుంటుంది? స్కాట్‌కు అనుబంధంగా వుండటం తప్ప ఇంతవరకూ అతని కొక విశిష్టత అంటూ ఏమీ లేదు. తన అధికారి తనకోసం ఫిలడల్ఫియాలోనే ఏదయినా ఉద్యోగ మిప్పిస్తాడా? అలాగే జరుగుతుందని అతడు తీవ్రోద్వేగంతో ఆశించాడు. మరొకరి క్రింద పని చేయటమన్న భావం కలిగినప్పుడు అమితంగా భయపడ్డాను.

మేనేజరు ప్రయాణంచేసి తిరిగి వచ్చాడు. ఆండీని తన కార్యాలయానికి రమ్మని పిలిచాడు. "ఆ నిర్ణయం జరిగింది" అన్నాడు అతడు. "ఉపాధ్యక్షుణ్ని కనుక నన్ను ఫిలడల్ఫియాకు మారుస్తారు."

"నా తరువాత వచ్చే జనరల్ మేనేజరు మిస్టర్ లూయీ."

అతడు మాట్లాడుతున్నంతసేపు ఆండ్రూ నరాలు బిగుసుకు పోతున్నవి.

"ఇక నీ విషయం ఫిట్సుబర్గు డివిషనుకు సూపరింటెండెంటు అయిన మిస్టర్ పాట్స్‌ను ఫిలడల్ఫియాలోని ట్రాన్ప్సేర్టేషను శాఖాకు ప్రమోటు చేస్తున్నారు. ఆస్థానాన్ని నీ కివ్వవలసిందని నేను ప్రెసిడెంటుకు రిక మెండు చేశాను. పశ్చిమ శాఖను నీవు నడపగలవా ?" అన్నాడు. చిట్టచివరకు అతని పై అధికారి.

ఆండ్రీకి క్షణకాలం తలతిరిగిపోయింది. విజయం, అభివృద్ధి అన్న రెండూ, దరిదాపుగా నిశ్చతమన్నంత వరకూ, ఆత్మవిశ్వాసాన్ని కల్పించాయతనికి. అతనికి ఇరవై నాలుగో జన్మదినం ఇంకా కొద్ది రోజూలకుగాని రాదు. తాను కేవలం రాజకీయజ్ఞుడు, అనుభవరహితుడు అయినప్పటికీ తీసుకోమంటే మర్నాడేచానల్ ఫ్లీట్‌మీద ఆధిపత్యాన్ని పుచ్చుకొంటాడని లార్డు జాన్ రస్సెల్‌ను గురించి చెప్పుకొనే విషయాన్ని స్మృతికి తెచ్చుకున్నాడు. బ్రూస్ గాని వాలెస్ లుగాని ఇలాగే ప్రవర్తించేవాళ్లు...

"నడపగలను" అని "నడపగలనని భాగా ఎరుగుదు" నన్న అభిప్రాయాన్ని నిగూఢంగా అనుసంధించి సమాధానం చెప్పాడు. "సరే, మంచిది. నీ కొక అవకాశమిచ్చి చూడటానికి పుష్టర్ థామ్సన్ అంగీకరించాడు." జీత మెంతకావాలని నీ అభిప్రాయం!"

"జీతమా!" అని ఆశ్చర్యపడ్డట్లున్నాడు, ఆ క్రొత్త సూపరింటెండెంటు జీతంసంగతి అతని మనసులో ప్రవేశించనే లేదు. "నేను ఆసక్తిపడేది జీతాన్నిగురించికా"దన్నాడు ఉదారంగా. "నేను కోరేది ఆ పదవి. మీరు వుండి పూర్వం పనిచేసిన ఆ స్థానాన్ని పొందటమే నాకు గొప్ప. అదిచాలు. జీతాన్ని మీ ఇష్టంవచ్చినట్లుగా నిర్ణయించండి. మీ కిష్టమయితే ఇప్పుడిస్తున్న దే ఇవ్వండి.

[అది నెలకు అరవై అయిదు డాలర్లు]

మిష్టర్ స్కాట్ అతని సాధుత్వాన్ని గమనించి వస్తున్న నవ్వును ఆపుకొన్నాడు. "ఆ వుద్యోగాన్ని నేను నిర్వహిస్తున్నప్పుడు సంవత్సరానికి పదిహేనువందలు పుచ్చుకొన్నాను. మిష్టర్ పాట్‌కు పద్దెనిమిదివందలు వస్తున్నాయి. నిన్ను పదిహేనువందలమీద నియమించటం ఉచితం. నీ వీ తొలి పరీక్షలో విజయవంతుడవయితె జీతం పద్దెనిమిదివందల దాకా పెరుగుతుంది. అది నీకు సంతృప్తికరమేనా?"

ఒక్క మాట తలనూచి చేతిని ఆడించటంతో అది అతనికి అప్రధాన విషయమని ఆ క్రొత్త వున్నతోద్యోగి తెలియ జేశాడు.

తన కబ్బిన శుభాన్ని గురించి తెలియజేసే ఆతురతో అతడు మరోమారు వేగంగా ఇంటికి చేరాడు. అస లతడు లగెత్తి వెళ్ళ దలచాడు. కానీ అది పెన్సిల్వేనియా రైల్‌రోడ్ వారి పిట్స్‌బర్గు డివిషన్ సూపరింటెండెంటు గౌరవానికి భంగకరమైన పనై పోయింది. అతని తల్లి ఈ వార్తవిని సంక్షేపంగా సంతోషించింది. ఆండ్రూవంటి కుర్రవాడివల్ల ఆశించేది ఇటువంటివి కావటమే ఇందుకు కారణం. ఆమె తిరిగి పిట్స్‌బర్గుకు వెళ్ళటమనే సమస్యను ఎదుర్కోవలసి వచ్చింది. ఆమె "పూర్వ మిత్రుల మధ్యకు, బంధువుల మధ్యకు వెళ్ళటమంటే సంతోషకరమైన విషయమే గాని అక్కడి పొగమసికి భయమేస్తున్న" దన్నది.

పదహా రేళ్ళ వయసుగల టామ్‌తో అన్నాడు: నాకు కార్యదర్శివిగా వుండటం నీ కిష్టమేనా?"

"ఎంతో బాగుం" దని ఆశ్చర్యాన్ని వెలిబుచ్చాడు టామ్. అతడు ఇప్పుడు అద్భుతమైన టెలిగ్రాఫ్ రైనాడు. డివిషన్ సూపరింటెండెంటుకు తంతిద్వారా అనేకమైన వార్తలను పంపించటం, అందుకోవటం వుంటుంది.

సూపరింటెండెంటు బల్లమీద కూర్చుని ఉత్తరువు లిచ్చేటప్పుడు ఆండ్రీ 'అబ్బా!' అని అనిపించుకోకుండా వుండటానికి యత్నించాడు. ఉన్నతస్థాయి వుద్యోగానికి అమాంతంగా ప్రాకి పై కొచ్చిన చిన్నవాడయిన తన్నుగురించి వయోవృద్ధులైన ఇత రోద్యోగస్థులు తమలో తాము గుసగుసలాడుకుంటారని అతడు అనుమానించాడు. అందువల్ల తన చిన్న రూపం సంగతి ఎలా వున్నా, తాను పొందిన ఆ వుద్యోగస్థానానికి తాను తగ్గవాడనని నిరూపించటంకోసం అతడు మరింత నిశ్చయం చేసుకోవటం జరిగింది. తన గుణవిశేషాలను నిరూపించుకోటానికి అతనికి ఆ సంవత్స రపు చలికాలంలో చాలా అవకాశాలు లభించాయి. ప్రమాదం సంభవించినప్పుడు డివిషన్ సూపరింటెండెంటు రాత్రింబవళ్ళూ పనిచేయాలని ఉద్దేశింపబడుతుంది. రాత్రివేళ ఏదైనా ఒక హఠాత్సంభవము జరిగితే అతనికి ఆ రాత్రికి రాత్రే తెలియజేస్తుండేవారు. ఆ ప్రదేశానికివెళ్ళి అతడు దాన్ని చక్కబెట్టి వస్తుండేవాడు.

అంతే కాదు. అది ఎంత గడ్డుచలికాలం ! ఆ రోజుల్లో పట్టాలను అడ్డుకమ్మీలమీద బిగించేటప్పుడు పట్టుపట్టటం కోసం పోతయినుము "ఛైర్స్" ఉపయోగించేవాళ్లు. గట్టిచలిగాలికి అవి తట్టుకోలేక పగుళ్లు చూపి విచ్చిపోతుండేవి. బండ్లు ఆగిపోవటాలు, పట్టాలుతప్పటాలు ఆ చలికాలంలో సరంపరగా ఉంటుండేది. ఒక చిక్కని చలిరాత్రి. ఎక్కడో ఒక చోట, ఇక్కడో అక్కడో, ఆ ఛైర్లు నలభైయేడింటిదాకా బ్రద్ధలైనాయి. అలా చలి విజృంభించే ఆ రోజుల్లో క్రొత్త సూపరింటెండెంటు ఇల్లువిడచి ఎనిమిది దినాలపాటు తిరిగి భంగాలు కలిగినచోట్ల, బండ్లు పట్టాలు తప్పినచోట్లు చూచాడు.

తనకు అలుపు లేదు కనుక తాను ఇతరుల కష్టసుఖాలను ఎరగని కఠినుడైన అధికారివలె ఆ రోజుల్లో ప్రవర్తించానేమో అన్నభావం అతనికి తరువాత కాలంలో కలిగింది. తనచుట్టూ ఎంతోరొద వున్నా లెక్కచెయ్యకుండా బాక్స్‌కార్ నేలమీద గాని లేదా మరెక్కడయినా గాని వెన్నువాల్చి వెంటనే నిద్రపోగలశక్తి అతనికుంది. ఎంత చిన్న కునికిపాటయినా చాలు శ్రమతీరి మహోల్లాసంతో నిద్రలేచేవాడు. దీనికి తోడుగా అతనికి హృదయపూర్వకంగా పనిచేయాలన్న గుణ ముంది. క్రొత్తది బాధ్యతాయుత మైంది. ఐన వుద్యోగాన్ని శక్తితో నిర్వహించిచూపించే ఆశయంగల యువకుడు అతడు.

పిట్స్‌బర్గులోని పొగ, పొగదుమ్ము, తిరిగి వచ్చినపుడు వాళ్ళను ఆశ్చర్యచకితులను చేశాయి. "ఇది వెనుకటి కంటె చాలా అసహ్యకరమయినది" అని వాళ్లు ఒకరితో ఒకరు చెప్పుకున్నారు - కాని నిజానికి ఇప్పుటికంటె వెనకే ఎక్కువ అసహ్యకరంగా వుండే దనికూడా చెప్పవచ్చు. ఏవస్తువునూ పరిశుభ్రంగా వుంచటం సాధ్యంకానిపని అని మార్గెరెట్ కార్నెగీ గృహిణీ హృదయం నిరుత్సాహంతో తల్లడిల్లింది.

కార్యాలయంలో ఒకనాడు "మాకు గ్రామ సీమలో వుండాలని వుం" దన్నాడు.

"మంచిది. ఎందుకుండ కూడదు" అన్నాడు మిష్టర్ స్కాట్ మేనల్లుడు. రైల్‌రోడ్ సంస్థకు జనరల్ ప్రయిట్ ఏజంటు డి. ఎ. స్టువార్టు. "హోమ్‌వుడ్‌కు వచ్చెయ్యండి వెంటనే కొనవచ్చు మాకు ప్రక్కనే ఒక స్థల ముంది. దాని వునికి ఎంతో బాగుంది. ఏమంతదూరానకూడా లేదు. ఆ పరిసరాలల్లో ఒక డజనుకుమించి కుటుంబాలు లేవు. అవి అన్నీ వున్నతస్థాయిలోవే. మీరు కావాలంటే వచ్చి చూచేటంత వరకూ అట్టిపెట్టమని ఆ ఆస్తిగలవాళ్ళతో చెప్పి ఉంచుతాను."

ఆండ్రీ, తల్లి ఆ ప్రదేశాన్ని పరిశీలించటానికి వెళ్లారు. దాన్ని చూడటంతోటే వారికి ఎంతో ఉల్లాసం కలిగింది. అది మంచి విశాలమయిన మైదానాలు, చెట్లగుంపులు, పొదలు, కోనలు - వీటిమధ్య ఉన్న రెండంతస్థుల కాటేజి, నగరంలోని కార్నెగీల యిల్లు చిన్నజాతిలోది. అయినా కుటుంబనికి చాలినంతగా స్థలముంది. మార్గరెట్ మిత్రబృందాన్ని పెంపొందించుకొని, అల్తూనాలో కంటే అధిక విస్తృతిగల పుష్పోధ్యానాన్ని పెంచుకొని తన జీవితంలోని ఆనందకరమైన అనేక సంవత్సరాలను ఇందులో గడిపింది.

ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు రాత్రి ఏగంటలోనైనా ఆదివారమైనా యువకుడైన ఆ ఉన్నతోద్యోగి పిలుపును అందుకొనే టందుకు వీలుగా ఇంటిలోకి టెలిగ్రాపు తీగ అమర్చబడింది.

ఇరుగుపొరుగు వారైన స్టువార్టులుకూడా నెమ్మదిగా వారికి ప్రీతి పాత్రులైనారు. ఆండ్రూ ఇక్కడ యువకుడైన ఇరుగు పొరుగు జాన్ వాన్డి వోర్డును కలుసుకున్నాడు. ఇతడిలాగనే మిష్టర్ స్టీవర్ట్ కాలంగడిచిన తరువాత కార్నెగీ యినుము-ఉక్కు-వ్యాపారంలో భాగస్థుడైనాడు. ప్రియమైన "వాంటీ" ఆండ్రూ చివర చివరగా చేసిన కొన్ని విదేశ ప్రతూర శాలల్లో అతనికి సహచరుడుగా వుండేవాడు. కార్నెగీల హోమ్‌వుడ్‌కు వలస వచ్చిన తరువాత అక్కడికి ఇంకో వాసితుణ్ని తీసుకోవచ్చారు. అతడు థామస్ ఎన్, మిల్లర్ - యితడు పరీక్ష కాగిన నిజమైన మిత్రుడు. సంగీతం, గ్రంధాలు దేశయాత్ర అన్న విషయాలల్లో ఆండ్రూతో అన్యోన్యత గలవాడు. ఆండ్రూ కార్నెగీలో ఉన్న మనోహరమైన లక్షణాలల్లో ఒకటి మైత్రి నార్జించుటంలోగల సామర్థ్యం. మిత్రులయెడ అతనికుండే ఆసక్తి అతి తీవ్రమైంది. నిత్యమైంది. మిత్రులను అతడెన్నడూ మరిచిపోయేవాడుకాడు. వృద్ధాప్యం వృద్ధిపొంద తున్న సంవత్సరాలల్లో అతనికి అత్యానందప్రదాలైన దినాలు బహుకాల వియోగానంతరం యౌవనం నాటి మిత్రులను కలుసుకొన్న రోజులే.

హోమ్‌వుడ్ లోని విజ్ఞావంతులు, సాంస్కృతికులతో గూడిన సమాజం హృదయ పూర్వకంగా ఆండీని తమలో ఒక సభ్యుడ్ని చేసుకొన్నవి. ఆ ప్రాంతంలోకల్లా పెద్ద న్యాయమూర్తి విలియం జోన్సు, మంచి విద్వాంసుడు. వుద్యోగ విరమణకాలంలో విశ్రాంతి తీసుకొంటున్నాడు. కొన్నాళ్ళు సెనటర్‌గా వ్యవహరించాడు. కొన్నాళ్ళు యుద్ధ కార్యదర్శి, రష్యామంత్రి అతని భార్య రాజనీతి కోవిదులు, దౌత్య తంత్ర నిర్వాహకులు జన్మించిన కుటుంబంలో పుట్టింది. ఈమె బైరన్‌కలికి దూరపు బంధువుకూడాను. వీళ్ళతో కొంతగా భీతిని కలిగించే పరిచయము, దీనికితోడు మిసెస్ ఎడిసన్, ఆమె కుమార్తెల పరిచయం ఆండ్రీ ఆత్మతృప్తికి ఒక కుదుపును కల్పించింది. "తనబోటివారిని ఉన్నత విద్యావంతులనుంచి వేరు చేసే వర్ణనాతీతము. గణనాతీతము అయిన అఘా తాన్ని అర్థం చేసుకొన్నాను" అని అతడు తరువాతా జీవితంలో అంగీకరించాడు. న్యాయమూర్తి బల్కిన్ పఠనకక్ష్యలోనీ చలిపొయ్యి చుట్టూ జరిగే సంభాషణలు డార్విన్,హెర్బర్టు స్పెన్సర్, జాన్ స్టువార్టుమిల్ మొదలయిన ప్రముఖుల రచనలు చదవమని ప్రేరేపించాయి. మిసెస్ ఎడిసన్‌తో కలిగిన పరిచయాలు అతని సంభాషణలోను, ప్రవర్తనలోను కోసులు కోసులుగా మిగిలిపోయిన అంచులను నునుపు చేశాయి. పిట్స్‌బర్గ్గుదాని పరిసరప్రాంతం ఇంతవరకూ ఎందులో చేరివున్నట్లు భావింపబడుతున్నదో ఆ పశ్చిమప్రాంతంలో నివసించేయువకులు వదులైన కాలర్లు, బండబూట్లమీద ప్రీతితో మొరటుతనాన్ని వెలిబుచ్చే అజాగరూకతను ప్రదర్శిస్తున్నారు. ఆ రోజుల్లో 'పిచ్చి సొగసు' (Foppish) అన్న ముద్రను వెయ్యదగ్గ ప్రతిదీ అసహ్యించుకోబడేది. కొన్ని సమయాలల్లో 'కిడ్ గ్లౌ'లను ధరించే రైల్‌రోడ్ వారి సాధారణోద్యోగి పరిహాసపాత్రు డౌతుండేవాడు. యువకుడైన కార్నెగీలోవున్నా అటువంటి అభిప్రాయాల నన్నింటినీ మిసెస్ ఎడిసన్ మృదువుగా తొలగించివేసింది. కొన్ని వేళల్లో ప్రమాదకరంగా పరిణమిస్తున్న ఆతని మంకుపట్టును కొంతగా ఆమె అణచిపెట్ట వలసి వచ్చింది. అయితే అతడు ఎప్పుడూ నైజాన్ని ప్రదర్శించే వాడు కాడు. తన ఆరంభదశలో క్షుద్రమైన స్థితిగతులను గురించి ఎన్నడూ సిగ్గుపడేవాడు కాడు. 'వింత ఏమంటే - అతడు తనకు కొంత మెరుగు, వృద్ధి అవసరమని గుర్తించాడు. ఎంత ఆత్మవిశ్వాస మున్నప్పటికీ అతనిలోని సత్యసంధత, నిష్కాపట్యము, సాధుత్వము అతణ్ని ప్రీతిపాత్రుణ్ని, జనానురాగపాత్రుణ్ని చేశాయి.

విలియం కోల్ మన్ ఆండ్రూకు మరో పొరుగువాడు. ఇతడు పిట్స్‌బర్గులోని ధనికుల్లో ఒకడు. ఇనుము పరిశ్రమ అధిపతి. కళాపోషకుడు. పిట్స్‌బర్గు ఆపేరా గృహానికి చిరకాలం యజమాని. పిట్స్‌బర్గ్, హోమ్‌వుడ్ లలోని యువకుల దృష్టిలో ఇతనికున్న గొప్ప సంపద ఇతని అందమైన అయిదుగురు కుమార్తెలు. వీళ్ళల్లో ఇరువురు థామస్, మిల్లరెకు ఒకతె, థామస్ యం. కార్నెగీకి ఒకతె భార్యలైనారు.

1859 లో పెన్సిల్వేనియాలో నూనెను కనుగోటం జరిగిన తరువాత మిస్టర్ కోల్ మన్ ఆండ్రూలు ఇరువురూ అలిఘనీ వరకు పరిశీలన యాత్ర చేశారు. వాళ్లు వీలు చిక్కినప్పుడు నిద్రిస్తూ, అందినచోట భోజనం చేస్తూ అనేకదినాలు మిట్టపల్లాలతో గూడిన నీలారణ్య దేశంలో సంచారంచేశారు. మిస్టర్ కోల్‌మన్ ఆండ్రూలు కొద్ది బేరం సాగిన తరువాత నూనె ఉన్నట్లు నిరూపితమైన భూమికి సన్నిహితంగా వున్న ఒక క్షేత్రాన్ని ఎంతైనా సరే పెట్టి జూదమాడ దగ్గదాన్ని అన్ని హక్కులతో నలభై వేల డాలర్లకి కొనగలిగారు. తరువాత కాలంలో, అంటే నూనె లాభాలు విశేషంగా ఉన్నప్పుడు, కనిపించినట్లు లాభాపేక్ష గలవారు, అప్పుడు అట్టే వ్యామోహాన్ని ప్రకటించకపోవడం, ఆలోచనలు గాని, కార్యాచరణలుగాని తక్కువ సంఖ్యలో ఉండటం ఈ చౌక బేరానికి కారణాలు.

ఆండ్రూ కార్నెగీ స్కాచ్ వాడైనా కొత్త కొత్త సాహసచర్యల్లో పాల్గొనటానికి జంకే స్వభావం కలవాడు కాడు. ఆత్మశక్తిమీద అతనికున్న విశ్వాసం, విజయమార్గంలో క్రమమైన ఆరోహణము కనిపించటం అన్నవిరెండూ అతని అదృష్టంమీద అతనికి ఎరుకపడని ఏదో నమ్మ కాన్ని కలిగించాయి. ఇంకా ఎన్నో అవకాశాలను స్వీకరించటానికి అతడు సాహసించేటందుకు తోడ్పడ్డాయి.

అప్పుడా క్షేత్రాన్ని విక్రయించిన వ్యక్తి ఆలానా దేవిని గురించి బహుశ ఎంతో సంతృప్తి పొందివుంటాడు. అందులోని సాహసాన్నంతటినీ కొనేవాళ్లు భరించారు. తన తదనంతర జీవితాన్నంతటినీ సుఖంగా గడిపేటందుకు చాలినంత ధనాన్ని వారిచ్చారు. అయితే, మూడు నాలుగేళ్ళకు ఎంతో విలువైన బ్లాక్ పెన్సిల్వేనియా పెట్రోలియంను ఇచ్చి డజనో లేక అంతకంటే కొంచె మెక్కువో బావులు పడ్డ తరువాత ఆ ఆస్థి విలువను రమారమి అయిదు మిలియన్ల డాలర్లని ఆభూస్వామికి హృదయంలో తీవ్రమైన మంటలు చెల రేగి వుండవచ్చు.

కోల్ మన్ [యితనికి భూమిలో ఎక్కువభాగం తప్పదుగదా!] కార్నెగీ, వాండివోర్ట్, టామ్ మిల్లర్ ఇంకా యితరులు హోమ్‌వుడ్ బృందంలోవారు. ఆ క్షేత్రానికి యజమానులుగా కొలంబియా ఆయిల్ కంపెనీని స్థాపించారు. కార్నెగీ యిరవై యేళ్ళయినా నిండని తన తమ్ముడు టామ్ కార్నెగీ కోసం కొంతడబ్బును ముందు తానే పెట్టుబడిపెట్టి భాగమిచ్చి కంపెనీలో చేర్చాడు. శక్తి, నిశితమైన బుద్ధివున్న వాళ్ళకు అది నిజంగా అవకాశ స్వర్ణ యుగం. ఆ తరువాత ఎన్నడూ కార్నెగీకి క్రొత్త పెట్టుబడులకు డబ్బు లేక పోవటమంటూ లేదు. అతడు మరిన్ని ఆడమ్స్ ఎక్‌ప్ర్సెస్ వూడ్రవు పెట్టుబడులను కొన్నాడు. వెష్టరన్ యూనియన్ టెలిగ్రాపు సంస్థలోనుంచి కొనట మారంభించాడు. అతని సంపద దొర్లిపొయ్యే మంచుముద్దలా పెద్దదౌతున్న కొద్దీ, దాని చుట్టూ మరికొంత పేరుకొంటున్నది.