Jump to content

ఆండ్రూ కార్నెగీ (జీవితచరిత్ర)/నిశ్రేణికా రోహణం

వికీసోర్స్ నుండి

నిశ్రేణికా రోహణం

4

వార్తాహారి బాలుడుగా ఆండ్రీ వుద్యోగం సంవత్సరం మీద మరికొద్దికాలం గడిచింది. మొదటినుంచి అతడు తంతి సాధనాలంటే విశేషమైన ఆసక్తిని చూపిస్తుండేవాడు. అవకాశం దొరకినప్పుడల్లా ఆపరేటర్లు వార్తలను ఎలా పంపిస్తారో చూస్తూ, ఎలా స్వీకరిస్తారో వింటూ వుండేవాడు. ఉదయం కార్యాలయాన్ని చిమ్మి పరిశుభ్రంచేయటానికి వచ్చిన సమయాలల్లో అతడు మోర్స్ అక్షరమాలను నేర్చుకున్నాడు. చుక్కలకుగాను వేగంగాను, తీక్షణంగాను నొక్కటము, డాష్‌లకోసం దీర్ఘమైన కటక్కుమనే ధ్వనులు చేయటము సాధనచేశాడు. కార్యాలయంలోని ముచ్చట్ల వల్ల అతడు పదకొండు పంతొమ్మిది సంవత్సరాల మధ్యవయస్సు కుర్ర వాళ్ళే ఇతరచోట్ల వార్తలను పంపించటం, పుచ్చుకోటం చేస్తుంటారని గ్రహించి ప్రక్కస్టేషన్లను పిలవాటానికికూడా సాహసించాడు. అక్కడ వుండే పిల్లలతో తాను నేర్చుకుం టున్న వాడినని చెప్పి వాళ్ళకు కొన్ని మాటలను అందించి, వాళ్ళజవాబు మాటలను అందుకుంటుండేవాడు. ఒకరోజు ఉదయం అతడు ఒంటరిగా వున్నప్పుడు ఫిట్స్‌బర్గుకు ఒక వార్తను అందుకుంటారా అని తీవ్రంగా అడగటం జరిగింది. అలా అడగటం ఫిలడల్పియానుంచి.

"మరణాన్ని తెలియజేసే అతి జరూరైన వార్తను మీరు అందుకుంటారా ?" అని ఫిలడల్ఫియానుంచి అడిగింది.

"అందుకుంటాము" అని ఆండీ సమాధానం చెప్పాడు.

వార్తలను అందుకునే సాధనాలు ఆ రోజుల్లో చుక్కలను, డాషులను చిన్న కాగితపు ముక్కలమీద ముద్రిస్తుండేవి. ఆండీ ఆ వార్తకు మేలు ప్రతి వ్రాసుకొని అందిచటంకోసం పరుగెత్తాడు. తాను చేసిన సాహసాన్ని గురించి మిస్టర్ బ్రూక్స్ ఏమని భావిస్తాడో అని అతడు కొంత ఆందోళన చెందాడు. "అది చాలా జరూరయినది కావటంవల్ల తాను అందుకున్నా" నని క్షమాపణ చెప్పుకున్నాడు.

"మంచిపని చేశావు. ఇక్కడ నీవు ఒంటరిగా వుంటున్నప్పుడు అలా చెయ్యవచ్చు" అని మిస్టర్ బ్రూక్స్ ఆర్ద్రంగా అన్నాడు. అయితే, కడు జాగ్రత్తగా వుండాలి. తప్పులు అవటానికి వీల్లేదు సుమా !" అనిహెచ్చరించాడు.

ఈ సంఘటన జరిగిన కొద్దికాలంనుంచి ఆపరేటర్లు మధ్యాహ్న భోజనానికి బయటికి వెళ్ళినప్పుడు ఆండిని ఒంటరిగా కార్యాలయంలో వుంచి పోతుండేవాళ్లు.అతడు బల్ల దగ్గరవుండి వార్తలను పుచ్చుకోవటమే కాకుండా పంపిస్తుండే వాడుకూడా. ఇప్పుడు అతని జీతం పెరిగి వారానికి నాలుగు డాలర్లు అయింది. టేపుమీద ఉబ్బెత్తుగా ముద్రింపబడె చుక్కలను, డాషులను చూడకుండానే యంత్రాలుచేసే ధ్వనులనుబట్టి వస్తున్న వార్తలను తెలుసుకోవచ్చునని అతడు త్వరలోనే గమనించాడు. కేవలం చెవితో వినటంతోనే వార్తలను గ్రహించి కెంటకీలో ఆపరేటరుగా పనిచేస్తున్న ఒకకుర్రవాడు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాడని చెప్పుకొంటున్న వార్తలు నిజమని చులకనగా విశ్వసించాడు.

హ్యూస్ అనే వృద్ధుడు టేపునుంచి వార్తలను చదివి, వ్రాసి యిస్తూ కార్యాలయంలో వ్రాయసగాడుగా పనిచేస్తున్నాడు. అతడు ఆండీ వార్తలను పంపిస్తు అందుకొంటూ వున్నప్పుడు గునవటం ప్రారంభించాడు. ఒక బాల వార్తాహారికి అందించే వార్తలను తనను ప్రతి వ్రాయమంటున్నందుకు అతడు తన అసంతృప్తిని వెల్లడిస్తున్నాడు. అందువల్ల ఆండీ అతనికి తెలియచెప్పటంకోసం వార్తలు వస్తున్నపుడు టేపు చుట్టును ఆపివేసి కేవలం అవి చేస్తున్న ధ్వనులను వినటం మూలంగానే వాటిని అందుకోవటం ప్రారంభించాడు.

హ్యూస్‌కు నింద వచ్చింది. "నీ విలా చేయటానికి వీల్లేదు" అని అతడు అడ్డు పెట్టాడు. "యిది పద్ధతికా"దన్నాడు.

"జిమ్మాలియొనార్డు కెంటకీలో ఇలాగ వస్తున్నా" డని ఒక వంక వార్తనువింటూ, మరొకవంక దాన్ని వ్రాస్తూ ఆండీ ఎదురు చెప్పాడు.

"ఇలా అయితే గందరగోళం జరుగుతుంది." అని ఆవృద్ధుడు గట్టిపట్టుపట్టాడు. "ఇందుకు నీవు అనుభవించవలసి వస్తుంది"

అయితే, అత డన్నదానికి బదులుగా ఆండీ చేసిన అద్భుతచర్య అతనికి వుద్యోగంలో ప్రమోషన్ తెచ్చిపెట్టింది. కార్యాలయ వ్యాపారం వేగంగా వృద్ధిపొందుతున్నది. మరొక ఆపరేటరు కావలసివచ్చాడు. ఆండీ ఆ వుద్యోగాన్ని సంపాదించుకున్నాడు. జీతం నెలకు ఇరవై అయిదు డాలర్లు.

తరువాత కొద్దికాలానికే మిష్టర్ బ్రూక్స్ ఆండీని బల్లదగ్గరికి పిలిచి అన్నాడు. "గ్రీన్స్‌బర్గు ఎక్కడుందో నీకు తెలుసా!"

"తెలుసు. ఇక్కడికి తూర్పున వుంది" - అన్నాడు గౌరవపూర్వకంగా.

"అక్కడి ఆపరేటరు మిష్టర్ టైలర్ రెండువారాలు సెలవు తీసుకోదలచాడు! అతనికి బదులుగా అక్కడ ఒక మనిషి కావాలి. నీవు ఆపని చేయగలవా !"

"చేయగలను" అన్నాడు ఏమాత్రం అనుమానించకుండా.

"మంచిది. నిన్ను అక్కడికి పరీక్షక్రింద పంపిస్తున్నాము. ఆండీ ఈ వార్తను తీసుకువచ్చినప్పుడు ఇంట్లో ఆనందోద్వేగం అతిశయించింది. తల్లి వెంటనే ఆతని దుస్తుల విషయం ఆలోచించింది. తల్లి "అతనికి క్రొత్తషర్టుకావా" లన్నది, తండ్రి ఈ సంఘటనకు నివ్వెరపోయాడు.

"బాధ్యత ఎంతో తెలిసిందా !" అన్నాడు కేక పెట్టినట్లు. "నవంబరు వస్తేగాని అతడికి పదిహేడేళ్ళు రావు. ఆండీ ! ఈ పనిని నిర్వహించగల శక్తి నీ కున్నట్లు భావిస్తున్నావా ?"

"అవును. నిర్వహింపగలననే భావిస్తున్నాను!" అని ఆత్మవిశ్వాసపూర్వకమైన సమాధానం వచ్చింది.

"నీవు యోగ్యుడ వనిపించుకొనటానికి ఇది తగిన గౌరవమని నా నమ్మకం!" అన్నాడు తండ్రి.

స్టేజికోచ్ మీద ముప్ఫదిమైళ్లు ప్రయాణం చెయ్యటమనేది ఎప్పుడోగాని తటస్థపడని పండుగ. ప్రధానంగా ఫిలడల్ఫియానుంచి ఫిట్స్‌బర్గువరకూ తన రైలుమార్గాన్ని విస్తృతం చేస్తున్న రైలురోడ్డు వారికోసం దారిపొడుగునా లోతుగా గుంటలు తీసి కట్టలు పోసేందుకు మూగుతున్న నిరంతర శ్రామిక జనదర్శన నయనోత్సవం అతనికి కలిగింది. అనతి కాలంలోనే ఆ సాహసిక చర్యతో తనకు సంబంధం కలగబోతున్న దన్న సంగతిని చిన్ని ఆండీ అణుమాత్రమైనా కల గనలేదు.

ఆండీ తొలిసారిగా ఒక ప్రజా భోజనశాలలో భుజించింది గ్రీన్స్‌బర్గు హోటల్లోనే. అతడు అక్కడి భోజనం
బాగున్న దనుకున్నాడు. నిగనిగలాడే మోముతో, ఎర్రవారే బుగ్గలతో, పీచువలె రేగిన జుట్టుతో లోపలికి ప్రవేశించి తనకు బదులుగా వచ్చానని చెప్పినప్పుడు ఆపరేటరయిన టైలర్ తన అబ్బురపాటును దాచుకో లేకపోయాడు. కానీ అతడు యువకుడయిన కార్నెగీతో కలిసి కొన్ని వార్తలను ప్రసారం చేసినప్పుడు ఆతని శక్తినిగురించి తెలుసుకొన్నాడు. ఒక్క పిలుపునుకూడా విడిచిపెట్టకుండా అందుకోటంకోసం సాయంకాలం పొద్దుపోయినదాకా కార్యాలయంలో వుండి ఎంతో పనిచేద్దామని అతడు ఆదుర్దాగా వున్నాడు. ఒక తుఫాను రోజున సాయంత్రం తన తంతి యంత్రంమందు కూర్చున్నప్పుడు - ఏదో పుస్తకం చదువుతూనే, మెరసిన సమయంలో అతడు 'కీ'ని ముట్టుకోటానికి సాహసించాడు. ఏదో పెద్దభూతం పెనుగడతో తన్ను మోదినట్లు తోచింది. అతడు, అతడు కూర్చున్న బల్లా నేలమీద పడిపోవటం జరిగింది. నరాలు ఝల్లుమన్నవి. అప్పటినుంచీ ఈ ఉలికిపాటువల్ల పాఠంనేర్చుకొనడంచేత తుఫానువేళల్లో అతడు ఎంతో జాగరూకుడయి మెలగుతుండేవాడు.

గ్రీన్స్‌బర్గులో ఆండీ ప్రసిద్ధుడైనాడు. అతడు కేవలం చెవులతోటే వార్తలను గ్రహించే ప్రజ్ఞగలవాడని విని జనం అతణ్ని చూడటం కోసం కార్యాలయానికి వస్తుండేవారు. అతడు తాత్కాలికంగా తనకు ఒప్ప చెప్పిన పనులను ఎంతో సమర్థంగా నిర్వహించాడు. ఫిట్స్‌బర్గుకు తిరిగివచ్చిన తరువాత ఈష్టరస్ టెలిగ్రాఫిక్ కంపెనీ మేనేజరు చేసిన పనిని మెచ్చుకొంటున్నందుకు చిహ్నంగా అందమైన బైండుగల బరస్స్ కవి కావ్యసంపుటాన్ని అతనికి బహూకరించాడు. మరొకటి ఏదయినా అతనికి ఎక్కువ సంతోషాన్ని కలిగించేది కాదు.

ప్రాచ్యవై దేశిక వార్తలను తీసుకురావటం కోసం ఫిట్స్‌బర్గులోని వార్తాపత్రికలు విడివిడిగా తమ విలేఖకులను తంతి వార్తాకార్యాలయానికి పంపిస్తుండేవి. ఇప్పుడు అవి అన్నీ కలిసి ఏకంగా ఒక విలేఖకుని మా త్రమే పంపటానికి నిర్ణయించుకొన్నవి. ఆ విలేఖకుని సూచన మీద ఆండీ వార్తలకు అయిదుప్రతులను తయారు చేసి ఇస్తుండేవాడు. ఈ పని చేసినందుకు అతనికి వారాని కొకడాలరు వస్తుండేది. అంతాచేరి ఇప్పుడు అతనికి నెలఒకటికి దరిదాపుగా ముప్పది డాలర్ల రాబడి అయింది.

కార్నెగీ కుటుంబం అద్దె యివ్వటం మానివేసి స్వంత యిల్లు కొనుక్కొనేందుకు తగ్గ ఆర్థికస్తోమతు తమకు లభించినట్లు భావిస్తున్నది. రెండు సంవత్సరాలల్లో తీర్చేటట్లు అంకుల్ ఆండ్రీ హోగన్ కాటేజి, రెబెక్కా వీధిలో వొక నివేశన స్థలం వాళ్ళు 50 డాలర్లకు కొనుకు న్నారు.

వసంత సమయంలో ఓహైయోనది పొంగి స్టుయిబెన్ విల్లీ ల్హీలింగుల మధ్య తూర్పుకు మధ్య పశ్చిమానికి మధ్య వార్తా తంత్రులను త్రెంచివేసి, ఇరవైమైళ్ళ పొడుగు తంతి తీగను దూరంగా కొట్టిపారేసిన నాటికి ఆండీ వయస్సు పదిహేడున్నర సంవత్సరాలు. తీగలను తిరిగి ముడిపెట్టేటంత వరకూ స్టేషన్లమధ్య సంబంధాన్ని నిలవబెట్టటం కోసం ఆండ్రీని స్టుయిబెన్ విల్లీకి పంపించారు. తూర్పునుంచి వార్త అనుగ్రహించి ఒక గంటో లేక మరికొంతసేపో ఆలస్యంతో చిన్ని పడవలమీద అతడు హీలింగ్‌కు పంపించేవాడు. తిరిగివస్తూ పడవలు కొలంబస్, సిన్సినాటి, టాయివిల్లీ నుంచీ సెయింట్ టాయీ ఇంకా ఇతరప్రదేశాలనుంచీ కొల్లకొల్లలుగా వార్తలను తీసుకొవచ్చాయి. వార్తాప్రసరణ ఒక వారానికి మించి నిలిచిపోని రీతిగా ఆండీ ఈ వార్తల నన్నింటినీ ప్రసారం చేశాడు.

అతడు అక్కడ వున్న సమయంలోనే సిన్సినాటి, ల్హీలింగులలో అమ్ముదామనే ఉద్దేశంతో కొన్ని బల్లగుడ్డలను తీసుకొని నదిమీదుగా తాను వస్తున్నట్లు తండ్రిదగ్గిర నుంచి ఆండీకి ఒక ఉత్తరం వచ్చింది. ఆండీ పడవవచ్చే సమయానికి రేవుదగ్గిరికి వచ్చాడు. తండ్రికోసం కొద్దిసేపు వెతుక్కొని, కనిపించిన తరువాత వొడ్డుకు రమ్మని సైగ చేశాడు. విలియం క్రింధ డెక్కుమీద సామానులను ఎక్కించే వొక మూలకు దారితీశాడు.

"దొంగభయంవల్ల మూటలదగ్గిర నుంచీ ఎక్కువదూరం వెళ్ళటం నాకిష్టం లే"దని అతడు అందుకు కారణం చెప్పాడు.

"నీ కొక గది అంటూ లేదా"అని కొడుకు జంకుతూ అడిగాడు.

"లేదు ఖర్చు తగ్గించవలెనని ఉద్దేశించాను. అందువల్ల నేను డెక్కమీదనే ప్రయాణం చేస్తున్నా" నన్నాడు.

ఆ మాటలు వినటంతోటే "అలాగా నాన్నా!" అంటున్నప్పుడు ఆండీ గొంతుక గాద్గద్యం వహించింది. "అదేమీ చెడ్డపనికాదు" అని తండ్రి అతని అభిప్రాయాన్ని సరుదిద్దాడు. "ఇదుగో నాకు నా దుప్పటి వుంది. చాలా బాగా నిద్ర పోగలను అమ్మకం అంత చులకనగా లేదు బాబూ, అందువల్ల నేను జాగ్రత్తగా మెలగాలి."

"కానీ నాన్నా! నీవు అమ్మ స్వంత బండిలో ప్రయాణం చెయ్యటానికి యింకా ఎంతో కాలం వేచిఉండ వలసిన అవసరం లేదు" అన్నాడు ఆండీ ఉత్సాహంతో.

తండ్రి నిశ్శబ్దంగా అతనిచేయి పట్టుకున్నాడు. ఆయన కళ్లు చెమ్మగిల్లాయి. తరువాత ఒక పావుగంటలో పడువ బయలుదేరి బోతున్నప్పుడు విలియం కుర్రవాడి చేతిని ఉల్లాసంతో నొక్కి అన్నాడు. "ఆండ్రా! నిన్ను చూచుకొని నేను గర్విస్తున్నాను.

ఈ సమయంలో థామస్ ఎ. స్కాట్ అన్న వొక విశిష్ట వ్యక్తి పెన్సిల్వేనియా రైలు రోడ్డువారి ఫిట్స్ బర్గు డివిజనుకు సూపరింటెండెంటుగా వున్నాడు. అల్తూనాలో ఉన్న తన పై వాడయిన లోంబయర్టుతో తంతిద్వారా వుత్తర ప్రత్యుత్తరాలు చేయటానికి అతడప్పుడప్పుడూ తంతి కార్యాలయానికి వస్తుండేవాడు. యిలా వస్తున్న సందర్భాలల్లో యువకుడయిన ఆపరేటరుమీద దృష్టి నిలిపి అతనితో మాట్లాడటం కోసం కొంతసేపు ఆగుతుండేవాడు.

ఒక తంతివార్తను తీసుకొని మిష్టర్ స్కాట్ అసిస్టెంట్లలో ఒకడు ఆండ్రీ కార్యాలయానికి వచ్చాడు. "మిష్టర్ స్కాట్ ఈనాటి ఉదయం నిన్ను గురించి మాట్లాడాడు." "అలాగా! ఏమన్నాడు!' అని ఆండీ వెంటనే సర్దుకున్నాడు.

"తనకు నిన్ను గుమాస్తాగాను, ఆపరేటర్ గాను తీసుకు రాగలవా!" అని నన్నడిగాడు. రోడ్డువారు స్వంత తంతి కార్యాలయాన్ని పెట్టబోతున్నారు. నీకు తెలుసా? అది చాలా అసాధ్యమైన పని. నీవు ప్రస్తుతోద్యోగంలో చాలా సంతృప్తిగా వున్నావని నేను అతనితో చెప్పాను."

"ఆగు! అంత త్వరపడకు" అని చేయి యెత్తి ఆండీ అతణ్ని ఆపాడు.

"ఆయనకు కావాలంటే నన్ను పెట్టుకోవచ్చు. వెళ్ళి ఇలాగని చెప్పు."

దీని పరిణామంగా ఫిబ్రవరి 1 - 1853 న ఆండీ నెల ఒకటికి ముప్పదియైదు డాలర్ల జీతంతో స్కాట్ దగ్గిర పనిచేయటానికి కుదిరాడు. అతడికి కొంత భయపడేటంత వేగముగా ప్రమోషన్లు వచ్చాయి.

అతని తల్లి ఇప్పుడు చెప్పులు కుట్టటం మానేసింది. త్వరలోనే అండు డేవిడ్ మెక్కార్గో, రాబర్టు పిట్కైరస్ లకు రైల్ రోడ్ సంస్థలో ఉద్యోగా లిప్పించగలిగాడు. అల్తూనాలోని జనరల్ సూపరింటెండెంట్ అయిన లోంబర్ట్‌కు అతడు అసిస్టెంటు కాగలిగాడు. అప్పుడు అల్తూనా ఒక చిన్న గ్రామం. అయినా పెన్సిల్వేనియా రైలు మార్గాలకు అది కూడలి.

పిట్స్ బర్గు జీతాల పట్టిక ననుసరించి జరిగే బట్వాడా కోసం డబ్బు తీసుకు రావటానికని ఆండీ అల్తూనాకు వెళ్ళే వాడు. రెండోమారు వెళ్ళినప్పుడు కఠినుడు, మితభాషి అయిన జనరల్ సూపరింటెండెంటు మిష్టర్ లోంబయర్టు అతణ్ని తేనీటి విందుకు ఇంటికి పిలిచి ఆశ్చర్యాన్ని కల్గించాడు. మిష్టర్ లోంబయర్టు వచ్చిన అతిధిని ద్వారం దగ్గిరనే మిసెస్ లోంబయర్టుకు "ఇతడే మిష్టర్ స్కాట్స్ ఆండీ" అని పరిచయం చేశాడు. అతడు కార్యాలయంలో కనిపించేటంతటి శీతలంగా ఇంటిదగ్గర కనిపించలేదు. తన్ను గురించి చేసే పై రీతి పరిచయాన్ని విన్న తరువాత అందరూ తన్ను అలా చెప్పుకొంటుంటే తృప్తిని పొందేటట్లు ఆండీకి స్కాట్ మీద గౌరవం కలిగింది. ఒకనాడు రైల్ రోడ్ అధ్యక్షుడు ఎడ్గర్ థామ్సన్ యువకుడయిన అసిస్టెంటు గదిలోకి తల చొప్పించి చూచి "స్కాట్స్ ఆండీవి నీవేనా!" అనిప్రశ్నించాడు. ఇది అతనికి సర్వసాధారణమైన పేరైపోయింది.

ఒకరోజున ఆండీ కార్యాలయానికి వెళ్ళేటప్పటికి తూర్పు డివిజన్‌లో ఒక ప్రమాదం సభవించుట వల్ల పశ్చిమానికి వెళ్ళవలసిన ఎక్స్‌ప్రెస్ ఆలస్యమైందనీ, తూర్పుకు వెళ్ళే పాసింజెర్లు వంక వంక దగ్గిరా ఒక ఫ్లాగ్ మానును ముందు పంపిస్తూ నెమ్మదిగా ప్రాకుతున్నట్లు నడుస్తున్నవని, రెండువైపులకు వెళ్ళవలసిన సామాను బండ్లు ప్రక్క పట్టాలమీద నిలిచిపోయినవని తెలుసుకున్నాడు. ఒకేదారి వున్న రైలు మార్గాల పద్ధతిలో బండ్లు నడపటం ఇంకా యెంతో అనాగరిక స్థితిలో వుంది.

మిష్టర్ స్కాట్ ఎక్కడ వుందీ ఎవరికీ తెలియదు. బహుశ: అతణ్ని ఏదో పనిమీద పిలిచి వుంటారు...... ఏర్పడ్డ పరిస్థితికి ఆండీ కళవళ పడుతున్నాడు. ఎంతో పనిచేసి చాలా అలిసిపోయిన చోదకులకు విశ్రాంతి నిచ్చి పరిస్థితిని కొంత చక్క దిద్దాలనే కుతూహలాన్ని అతడు ఆపుకో లేకపోయినాడు. ఇటువంటి అత్యయిక పరిస్థితులను పూర్వం ఇతడు మిష్టర్ స్కాట్ సూచనలతొ అతడు సరిదిద్దాడు. అందువల్ల అతడు తన బాధ్యతమీదనే బండ్లను నడిపించటం. అవి కలుసుకునే ప్రదేశాలను నిర్ణయించటం జరిగించాడు. చివరికి పై అధికారి వచ్చేటప్పటికల్లా సర్వం సుగమంగా సాగిపోతున్నది.

ఆండీ బల్లదగ్గిరకి అతివేగంగా చొచ్చుకో వచ్చి మంచిది. పరిస్థితులు ఎలా వున్న"వన్నాడు.

"మిష్టర్ స్కాట్, నాకు మీరు ఎక్కడా కనిపించలేదు. మీ పేరుమీదనే ఉదయం ఆర్డర్ల నిచ్చాను" అని సమాధానం చెబుతున్నప్పుడు ఆండీకి గొంతు బాగా పెకిలి రాలేదు.

అతడు ఇచ్చిన ఆర్డర్ల కాపీ లన్నింటినీ చూపించాడు. లైనుమీద వున్న బండ్లన్నీ - సామాను బండ్లు, పాసింజరు బండ్లు - ప్రస్తుతం ఏ స్థితిలో ఎక్క డెక్కడ వున్నదీ తెలియజెప్పాడు. చెప్పటం ముగించగానే సూపరింటెండెంటు ఆశ్చర్యపడుతూ ఆండీ ముఖంలోకి చూశాడు. బాలుడు సాహసించి చేసిన పనిని తా నెలా స్వీకరించాడో తెలియజేయకుండానే అతణ్ని ఇంకా అనుమానపడే స్థితిలోనే వుంచి తన గదిలోకి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఫ్రయిట్ ఏజంటు మిష్టర్ ప్రాన్సిస్ వచ్చినప్పుడు ఆతనితో నవ్వుతూ "నా చిన్ని తెల్లజుత్తు. స్కాచ్ భూతం ఏంచేశాడో నీకు తెలిసిందా?" అని మిష్టర్ స్కాట్ అడిగినటు విన్నంతవరకూ అతడి నరాల బిగువు సడల లేదు.

సూచనగానైనా అధికారాన్ని పొందకుండానే నా పేరుమీద డివిషన్ లోని బండ్లను నడిపించి వుండకపోతే నేడు దెబ్బతినేవాణ్ని.

"మరి అతడు సక్రమంగా చేశాడా!'

"అవును - చేశాడు." అది అలా ముగిసింది.

తరువాత మిష్టర్ స్కాట్ ఆండీకి మరింత బాధ్యతను ఒప్ప జెబుతుండేవాడు. ఒకప్పుడు అతడు పది రోజుల కార్యాలయానికి రాలేదు. అప్పుడు మిష్టర్ లోంబయర్టు అంగీకారంతో అతడు డివిజన్‌కు సంబంధించిన మొత్తం బాధ్యతను యువకుడయిన తన గుమాస్తామీద పెట్టి వెళ్లాడు. ఇరవైయేళ్ళ వయసులో వున్న యువకుడిమీద ఇంత బాధ్యతను వుంచట ఎంతో విశిష్టమైన విషయం అతడు ఈ బాధ్యతను వహిస్తున్న సమయంలో నిర్మాణానికి సంబంధించిన ఒక బండి బ్రద్దలైంది. ఎవరి అజాగరూకత వల్ల అది జరిగిందో వారి విషయంలో ఆండీ అతి తీక్షణంగా వ్యవహారించాడు. ముఖ్య దోషిని ఉద్యోగంలోనుంచి పంపించివేశాడు. మరి ఇద్దరిని సస్పెండు చేశాడు. మిస్టర్ స్కాట్ తిరిగివచ్చిన తరువాత అతనివల్ల తాను వాళ్ళ విషయంలో అతి కఠినంగా ప్రవర్తించినట్లు తెలుసుకొన్నాడు. అందుకు అతడు ఎంతో చింతించాడు. తాను తీవ్రంగా శిక్షించిన వారికి యేదో తగ్గ ప్రతిచర్య చేయటానికి యత్నించాడు.

1855 శరత్తులో తాము గొన్న ఇంటికి డబ్బు పూర్తిగా చెల్లించక పూర్వమే విలియం కార్నెగీ కొద్దిగా జబ్బుచేసి తన ఏభైయ్యోయేట మరణించాడు. "తగిన విశ్రాంతిని, సౌఖ్యాన్ని మేము ఇవ్వగల శక్తిని సంపాదిస్తున్న సమయంలో ఆయన మృతినొందా" డన్నాడు ఆండీ. సాధుశీలుడు, నిరాడంబరుడు అయిన తండ్రి మరణించినందుకు కుటుంబమంతా చింతలో మునిగింది. పెద్దకుమారుడు ఎప్పుడూ అతణ్నిగురించి అత్యుదాత్తుడు. ప్రేమార్హుడు అయినటువంటి వ్యక్తిని తాను మరొకణ్ణి ఎరగనంటుండేవాడు.

తండ్రి వ్యాది, మృతి ఆండ్రూమీద, అతని తల్లిమీద మరికొంత ఆర్థిక భారాన్ని పడవైచినవి. తల్లి తిరిగి పాదరక్షలను కుట్టటం ప్రారంభం చేసింది. ఈ పరిస్థితిలోనే ఒకనాడు మిస్టర్ స్కాట్ "ఆండీ! నీదగ్గిర అయిదు వందల డాలర్లు వున్నవా" అని ప్రశ్నించాడు.

ఆండీ జీతం ఇప్పుడు నెలకు ముప్ఫై డాలర్లకు పెంచబడినది. తానే జీతాలు బట్వాడా చేస్తుండేవాడు గనుక అతని కంటికి ప్రపంచంలో అత్యుత్తమ లలిత కళాఖండాలుగా కనిపించె రెండు పక్షీజంటలున్న బంగారు నాణాల రూపంలో అతడు దాన్ని పుచ్చుకునేవాడు. అయితే అనుకోకుండా వచ్చిపడే యిబ్బందులవల్ల వాటిని వెంటనే కరిగిస్తుండేవాడు. పై అధికారి ప్రశ్నించినప్పుడు అతనిదగ్గిర అయిదు వందల సెంట్లుకూడా లేవు.

అతడు సమాధానం చెప్పెలోగానే, తన యువకు ----------------------------బిత్తరచూపును పట్టించుకో కుండానే, ఒక్కమాటు రెప్పలల్లార్చి మిస్టర్ స్కాట్ ఎందుకయినా మంచిదని ఇలా అన్నాడు. "ఎందుకంటే, అదివుంటే నీకోసం ఒక పెట్టుబడి నిలిచివుంది-ఆడమ్స్ ఎక్స్ప్రెస్ కంపెనీలోని పదిషేర్లు, ఈనాడు విపణిలో ఉన్న వాటిలోకల్లా ఇవి ఉత్తమమయినవి. బహుశ: గిల్ట్ ఎడ్జిడ్ కూడా అయి వుంటవి. ఇవి షేరు ఒకటికి ఒక డాలరు నెలకు డివిడెండుగా యిస్తున్నవి. నాకు తెలిసిన వొక వ్యక్తికి వెంటనే డబ్బు కావలసివచ్చి ఈ స్టాకును అమ్ముతున్నాడు. నీవు మరి ఆ డాబ్బు తీసుకు రాగలవా!"

ఈ సమస్త జగత్తులో అయిదువందల డాలర్లు తన కెలా లభ్యమౌతాయని ఊహిస్తున్నపుడు అతని తలలో మోత పుట్టటం మొదలుపెట్టింది. దయగల తనపై అధికారి ముఖ్యంగా ఈ సదవకాశాన్ని తా నే కబళించకుండా తన కిప్పించటమనే త్యాగం చేస్తున్నాడు. ఇట్టి స్థితిలో ఈ అవకాశాన్ని పోగొట్ట కోకూడదు.

"ఎలాగో చేకూర్చుకోగల"నని సమాధానమిచ్చాడు.

రెబెక్కా వీధిలో ఇంటికి అయిదువందలు చెల్లించటం జరిగింది. మొత్తమంతటికోసం దాన్ని తాకట్టుపెడితే సరిపోతుందని ఆండీ ఆశించాడు. సాహసించి ఆవిధంగా తాకట్టు పెట్టించుకొనే వ్యక్తి ఒక్కడే వున్నాడు. మిష్టర్ స్కాట్ నిర్ణయంమీద పరిపూర్ణమయిన విశ్వాసంగల ఆండీ తల్లి "నేను బ్రదర్ విలియంను ఈ డబ్బిమ్మని అడుగుతా" నన్నది. యాబైమైళ్లు ఆవిరి-పడవలో ఓహెయో నదిమీద దిగువగా ప్రయాణంచేసి ఆమె ఈస్టు అవర్ పూల్ చేరు కున్నది. ఇక్కడ విలియం మారిసన్ కొంత ఆర్జించుకున్న వ్యక్తి. జస్టిస్ ఆఫ్ పీస్. పరిసరాలల్లోని రైతు లకు ఇన్వెస్టిమెంటు బ్రోకరు ఇంటిమీద రెండో తాకట్టు పెట్టించుకొని డబ్బు ఇచ్చాడు. అతని సోదరి పిట్స్ బర్గుకు విజయంతో తిరిగి వచ్చింది.

ఆండీ మిస్టర్ స్కాట్‌కు డబ్బు ఇచ్చేటప్పటికి చాలా రోజులు గడిచాయి. అందువల్ల "ఆవ్యక్తి, రైనాల్డ్సు స్టాకుకు ధర పెంచాడు. అతనికి ఇప్పుడు ఆరువందలు కావాలిట" అన్న ఊహించని మాటలను డబ్బు నిచ్చేటప్పుడు అతడు వినవలసి వచ్చింది.

ఆండ్రూ క్షణకాలం నిశ్చేష్ఠుడయినాడు. అయితే మిస్టర్ స్కాట్ "మిగిలిన వంద నీకోసం తాత్కాలికంగా నేను చూస్తాను. నీవు వీలయినప్పుడు వీలయినట్లుగా ఇవ్వవచ్చు" అన్నాడు.

కొన్నిరోజులు గడిచాయి. వొకనాటి ఉదయం, మూలన ఆడమ్స్ ఎక్స్ప్రెస్ ముద్ర వున్నబరువయిన తెల్లని కాగితపు కవరు బల్లమీద వుంది. విసరినట్లుగా దానిమీద "ఆండ్రూ కార్నెగీ ఎస్క్వైర్" అన్న చిరునామా కన్పించింది. దాని లోపల పదిడాలర్లకు గోల్డ్ ఎక్సేంజి బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ మీద ఇచ్చిన చెక్కు వకటుంది. ఇది అతని మొదటినెల డివిడెండు. ఆ చెక్కుమీద పెద్దదిగా విస్పూర్తితో కనిపించిన కాషియర్ జె. సి. బాబ్ కాక్ సంతకాన్ని తాను శ్రమించకుండా, స్వహస్తాలతో, చెమ టోడ్చకుండా పెట్టిన పెట్టుబడు మీద తొలి ఆదాయాన్ని పొంది నప్పటి ఆనందాస్పందనాన్నీ జీవితాంతం వరకూ అతడు ఎన్నడు మరచి పోలేదు. తనలో తాను 'యు రేకా! [గొప్పది కనిపెట్టాను.] ఇది బంగారు గ్రుడ్లను పెట్టేబాతు' అని నెమ్మదిగా అనుకున్నాడు.

చెక్కును మార్చకుండా వారం చివరదాకా వుంచి తన ప్రియమిత్రులైన టామ్ మిల్లర్, జాన్ ఫిప్స్, జిమ్మీ విల్సన్, విల్లీ కౌల్స్‌లకు నలుగురికీ తమ వనవిహార సమయంలో చూపించాడు. వాళ్ళు "ఎస్క్వైర్" అని అతని పేరుకు చివర తగిల్చిన పదంమీద చతుర క్రీడలాడారు. కానీ వాళ్ళకూ డివిడెండు చెక్కు ఎంతో నచ్చికను కలిగించింది.

"అభ్యుదయానికి ఇదే మార్గ" మన్నాడు ఫిప్స్.

"జాన్, ఇటువంటి అవకాశాలు వస్తాయేమో నేనూ కనిపెడుతుంటాను," అని ఏకీభవించాడు జిమ్మీ!

"ఈపని మన మందరం చేద్దాం. ఒకరికొకరం చెప్పుకుంటుందాం." అంటూ వుత్సాహాన్ని ప్రదర్శించాడు టామ్ మిల్లర్.

"ఒక్కడికి మించిన పెట్టుబడిని గురించి వింటే వీలునుబట్టి అందరం ఒకటై అందులో ప్రవేశద్ధాం మన్నాడు ఆండ్రూ.

"చాలా దొడ్డఅభిప్రాయం" అని ఒప్పుకున్నాడు. టామ్ అందువల్ల వీలు కలినప్పుడల్లా తరువాత కొన్ని సంవత్సరాల వరకూ వాళ్ళు అలా చేస్తూ వచ్చారు.

ఫిప్స్ పాదరక్షా కార్యాలయంలో అతడికోసం వచ్చిన వాళ్ళందరు తిరిగి వెళ్ళిపోయిన తరువాత సాయం సమయాలల్లో ఈ 'పంచకం' వర్తమాన సమస్యలను గురించి నిత్యం ఉల్లాసకరమైన చర్చలు సాగిస్తుండే వాళ్ళు. ఆండీ విశేషంగా శ్రామికజనతత్వం కలవాడు. ప్రతిసమస్యను ప్రజల్లోకి తీసుకోపోవాలని వుల్లాసపడుతుంటాడు. ఒకప్పుడితడు గంటన్నరకు తక్కువగాని గంభీరోపన్యాసం చేశాడు. తరువాత మిల్లర్ న్యాయాధి పతులను 'జనవాక్యాన్ని' అనుసరించి నిర్దేశించాలని వాదించాడు. అయితే ఇది ఆచరణ యోగ్యమైనది, కాదని అతడు తరువాత కాలంలో గుర్తించాడు. యింతలో ఒక వార్తాహారి ఊపిరిసలుపుకోలేకుండా వచ్చి "కార్నెగీ నిన్ను రమ్మంటున్నారు. డేర్రీదగ్గిర ఒక 'విచ్ఛితి' జరిగిందట" అని చెప్పకపోయి నట్లయితే అతడు ఇంకా ఆవిషయాన్ని గురించి ఎంతసేపు మాట్లాడి ఉండేవాడో చెప్పటం కష్టం-పిలుపును గురించి విన్న వెంటనే హాట్, కోటు అందుకొని "మీలో ఎవరైనా నేను ఎక్కడికి వెళ్లుతున్నానో మా యింట్లో తెలియజేయండి" అని చెప్పి పరుగు పెడుతూ అదృశ్యుడైనాడు.

అవసరం వచ్చినప్పుడు ఆ అయిదుగురు వెబ్ట్సర్ సాహిత్య సంఘం సభ్యులుగా చేరారు. ఇది నగరంలోని ఈ జాతిక్లబ్ లన్నింటిలో శ్రేష్ఠమైంది. ఇందులోని సభ్యత్వానికి యోగ్యులుగా పరిగణింపబడినవారు ఎంతో గర్విస్తారు. యువకుడుగా ఉన్నప్పుడు ఆండ్రూకు పత్రికా రచన మీద ఎన్నో ఆశలుండేవి. ముఖ్యంగా సంపాదకుడుగా పనిచేయటంమీద అతని ప్రీతి తరువాత కొద్ది సంవత్సరాలకు ఇతడు 'న్యూయార్క్ ట్రిబ్యాన్‌' పత్రికకు ఒక ప్రజాహిత విషయంమీద లేఖవ్రాశాడు. పెన్సిల్వేనియా రైల్‌రోడ్ విషయంలో నగరపౌరులు ఎంతటి అనాతథేయ ప్రవర్తనను ప్రకటిస్తున్నారో వివరిస్తూ యిప్పుడితడు 'పిట్స్‌బర్గ్ డిస్పాచ్‌' పత్రికకి ఒక లేఖ వ్రాశాడు. ఈ వుత్తరం 'నామరహితంగా' ప్రచురితమైంది. కాని, రైల్ రోడ్ కంపెనీకి ముఖ్య సంహాదారైన మిష్టర్ స్టోల్స్ లేఖకుని పేరు చెప్పవలసిందని గట్టిగా కోరాడు. దీని ఫలితంగా రచయితను అతడు గ్రీన్స్‌భర్గలోని తన యింటికి వారాంతంలో సెలవుదినం గడపటానికి రమ్మని ఆహ్వానించాడు, మిష్టర్ స్టోల్స్ వంటి తేజోవంతుడు, విద్యా వేత్తతో తృప్తికరంగానే నేం మాట్లాడగలను, వుల్లాసకరంగా ఏం చెయ్యగలనని సంశయిస్తూనే ఆహ్వానాన్ని అందుకున్నాడు ఆండ్రూ. కానీ అతడు తాను సంశయించిన విషయంలో పొరబడ్డాడు.

ఇక్కడే అతడు తనకు పరిచితముగాని ఇంట్లో ఒకరికి తా నతిధియైన మొదటిరాత్రి గడిపాడు. స్టోల్స్ నివేశనాతిశయంవల్ల అతడు ఎంతగానో ప్రభావితు డయినాడు. ముఖ్యంగా ఆ గృహంలోని గ్రంథాలయంలో వున్న ఒక పాలరాతిగూడు అతణ్ని ఆకర్షించింది. ఆ అర్ధచంద్రాకృతిగల గూట్లో మధ్యన ఒక తెరిచిన పుస్తకానికి ప్రతికృతి అమర్చబడివుంది. దానిమీద"ఎవడు హేతువాదం చెయ్యడో వాడు బుద్ధిహీనుడు

ఎవడు చేయటానికి ఇష్టపడడో వాడు దురభిమాని;

ఎవడు చేయటానికి సాహసించడో వాడు బానిస"

అన్న లేఖనం కనిపించింది. ఆండ్రూ ఆ అందమైన నిర్మా కాన్ని నివ్వెరపడి చూస్తుండగా సూటిగా చెప్ప బడ్డ పైవాక్యాల ప్రభావంవల్ల అతని ఆత్మసంచలించింది. అతడు తనతో తాను చెప్పుకున్నాడు. "ఎప్పుడో ఒకప్పుడు నా గ్రంథాలయాన్ని నేను ఏర్పాటుచేసుకొంటాను. అందులోని గూట్లో ఈ మాటలనే చెక్కిస్తానూ." కొంతకాలం గడచిన తరువాత వాటిని న్యూయార్క్ స్కాట్లండ్లలో కార్నెగీ గృహాలల్లో రెండు గూళ్ళల్లో చెక్కించటం జరిగింది.

అతడు ఇప్పుడు అధికాధికంగా అతథిగా ఆహ్వానింపబడుతున్నాడు. అందువల్ల అత్యవసరమైన ఆనాటి క్రమమైన సాంఘికాచారాల గురించిన పాఠాలను ప్రత్యక్షంగా నేర్చుకుంటున్నాడు. జనరల్ ఫ్రయిట్ మేనేజరు భార్య మిసెస్ ఫ్రాన్సిస్‌స్ అతని యెడ ఎంతో వాత్సల్యాన్ని ప్రదర్శిస్తుండేది. అతడు సిగ్గరి కావటంవల్ల ఆమెకు తమ యింట్లో భోజనము చెయ్యమని బలవంతం చేయటానికి బహుకాలము పట్టింది.

లొంబొయర్టు తరువాత 1856 లో మిష్టర్ స్కాట్ జనరల్ సూపరింటెండెంటు పదవిని స్వీకరించి తన కార్యాలయాన్ని అల్తూనాకు మారుస్తూ ఆండ్రూను తన వెంట తీసుకు వెళ్లాడు. అల్తూనాలో సుఖమైన ఒక కాటేజిని అద్దెకు తీసుకోగల పరిస్థితి ఏర్పడగానే మిసెస్ కార్నెగీ చెప్పులు కుట్టటాన్ని మళ్ళీ మానివేసింది. ఆండ్రూ ఆమెకు ఒక పరిచారిక అవసరమని నిర్ణయించాడు.

"నీవు జీవితమంతా చాలా శ్రమపడ్డావు. యిప్పుడు సుఖపడటం కొత్తగా ప్రారంభించాలి" అన్నాడు ఆండ్రూ తల్లితో.

ఇందువల్ల అతడు ఊహించనంతటి ప్రేలుడు ధ్వని వినిపించింది. ఆమె ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ అన్నది:

"ఏమిటి? నా యింట్లో మరొక క్రొత్తమనిషి ప్రవేశించి అన్ని వ్యవహారాలల్లో స్వేచ్ఛగా సంచరించటమా? అందుకు నేను అంగీకరించను. ఇన్నాళ్లుగా నా పిల్లలకోసం నేనే ఇల్లు దిద్దుకున్నాను. మీకోసం వంట చేశాను. మీదుస్తులను ఉతికి బాగుచేశాను. నీవు ఇప్పుడు నన్ను చేతులు ముడుచుకొని కూర్చోమంటున్నావు. నీవు నన్ను షెల్ఫ్‌లో పెట్టదలిచావు. మరొక స్త్రీని నేను సహించ లేను. బాలురైన మీకు ఇష్టమైన ఆహారపదార్థాలను ఎలా వండాలో ఇతర స్త్రీ ఎవతెకూ తెలియదు.

ప్రక్కవాటుగా వచ్చిన మాటను పుచ్చుకొని ఆండీ "అమ్మా! నీవు నాకు, టామ్‌కు సమస్తం చేశావు. నీవే సమస్తమైనావు. మరి, మమ్మల్ని నీకోసంకొంత చెయ్యనీ. మనం భాగస్వాములమై ఒకరి కొకరం ఎవరి కేది మంచిదో అది చేద్దాం. నీవు విందుల్లో యజమాను రాలివై వ్యవహ రించవలసిన సమయం వచ్చింది. కొద్ది దినాలల్లో నీవు బండిలో సంచరించబోతున్నావు. ఈ మధ్యకాలంలో నీకు సహాయం చేస్తుంది. ఆ పిల్లని యింట్లోకి రానీ. ఇలా చెయ్యటం టామ్‌కు, నాకు ఎంతో ఇష్టం!

చాలా సేపు గొణిగినా చివరకు ఒప్పుకున్నది. సేవకురాలు వచ్చిన తరువాత ఆమె అల్తూనాలో లభ్యమయినంత ఉన్నత సంఘంలోకి వెళ్ళింది. ఆమె స్వయంగా విద్య నేర్చుకొన్నది. సుళువు బలువులను ఎరిగి వుండటంవల్ల సమత సంపాదించుకున్నది. ఎటువంటి పరిస్థితులయినా చక్కదిద్దుకో గల సౌజన్యం ఆమెకున్నది. ఉద్యానకృషి, పుష్పాలతో ఆమె తన జీవితాని కబ్బిన నూతన దశను అనుభవించుట మారంభించింది.

కొద్ది కాలం క్రితం భార్య చనిపోవటంవల్ల మిస్టర్ స్కాట్ తన గృహ పర్యవేక్షణకోసం తన మేనగోడలు మిస్ రెబెక్కా స్టీవార్డును తీసుకువచ్చాడు. ఆమె సొగసైన యువతి. ఆండ్రూ కంటే వయసున కొన్ని యేళ్లు పెద్దది. అతడికి అవసరమయిన కొన్ని సాంఘి కాచారాలను గురించి నెమ్మది నెమ్మదిగా కొన్ని సలహాలిస్తూ ఆమె ఆండ్రూకు జ్యేష్ఠభగినీ పాత్రను వహిస్తున్నది. కొండలమధ్య యెంతో దూరం వాళ్ళు వాహ్యాళికి వెళ్లుతుండేవాళ్లు. అప్పుడప్పుడు ఆమె ఆండ్రూను మధ్యాహ్న భోజనం కోసం ఇంటికి ఆహ్వానిస్తుండేది. అటువంటి ఒక సందర్భంలో రైల్‌రోడ్డు వ్యక్తిగా పైకి వస్తున్న టాయ్ మిల్లర్ కూడా అతిథి కావటం తటస్థిం చింది. మిస్టర్ స్కాట్ ఊళ్ళో లేడు. వాళ్లు భుజించటం కోసం బల్లముందు కూర్చున్న సమయంలో, రెబెక్కాస్టీవార్డు ఆమె సేవిక అయిన కన్య క్షణకాలం భోజన కక్ష్యలోనుంచి బయటికి వెళ్ళగానే, అప్పుడు తాను అనుభవిస్తున్న జీవితంలోని అద్భుతానికి యింకా అలవాటు పడని ఆండ్రూ సగౌరవంగా అచటి నవనీత పాత్రను పై కెత్తి గొణిగినట్లుగా "ఇది నిజమయిన వెండి. టాయ్" అన్నాడు.