ఆండ్రూ కార్నెగీ (జీవితచరిత్ర)/ఉక్కు యుగం

వికీసోర్స్ నుండి

ఉక్కు యుగం

8

అంతర్యుద్ధ సమయం వరకూ అమెరికాలో రైలుబండ్లు ఇనుప పట్టాలమీదనే నడుస్తుండేవి. ఉక్కు పట్టాలు తొలిసారిగా 1863 లో ఇంగ్లాడునుంచి దిగుమతి అయినవి. అయితే యుద్ధం ముగిసిన తరువాత అమెరికాలో ఇనుమును ఉత్పత్తిచేసేవాళ్లు తమ దృష్టిని బెన్సిమరే విధానం మీదికి మార్చారు. బాండ్ల అమ్మకంకోసం కార్నెగీ ఇంగ్లండుకి రాకపోకలు సాగుస్తున్నప్పుడు ఒక సందర్భంలో ఉక్కు ఉత్పత్తిని స్వయంగా చూడటం తటస్థించింది. అంతవరకూ అతడికి ఉక్కు విషయంలో ఆసక్తి లేదు. చూడగానే అతడికి ఉద్రేకం కలిగింది. న్యూయార్కులో ఓడదిగి రేవునుంచే అమాంతంగా పిట్స్‌బర్గు చేరుకున్నాడు. తన సంస్థలోని భాగస్థులను మహోల్లాసంతో యిలా హెచ్చరించాడు.

"ఇనుముకు కాలం చెల్లిపోయింది. ఉక్కు! ఇక ఉక్కే రాజు! మనం ఉక్కు పట్టాలను తయారుచేయటం మొదలుపెట్టాలి. వెంటనే మొదలుపెట్టండి!" మందకొడి అయిన క్లోమన్ తన అభిప్రాయానికి అడ్డు చెబుతారు కార్నెగీ ముందే ఊహించాడు. కానీ తన ఇతర భాగస్థులు - తన సోదరుడు టామ్‌తో సహా - తన్ను కాదంటారని అతడు అనుకోలేదు. ఏమైనా వాళ్ళందరికీ ఇనుమంటే ఇష్టం. తమ అలవాట్లను, అభిప్రాయాలను అంత హఠాత్తుగా మార్చుకోలేరు. వాళ్ళు అప్పుడే ఒక క్రొత్త కొలిమిని నిర్మించారు. టామ్‌భార్య గౌరవార్ధంగా దీనికి 'ది లూసీ' అని పేరు పెట్టారు. దీని నిర్మాణానికి ఎంతో పెద్దమొత్తం వ్యయమైంది. ఎంతకూ భాగస్థుల్లో - ముఖ్యంగా టామ్‌లో, చలనం కలుగ లేదు. వాళ్ళందరూ ఎక్కువ తాపీ అయినవాళ్లు. ఆండ్రూ అకారణంగా ఉద్రిక్తు డవుతున్నాడన్న భావం వాళ్ళకు కలగక తప్ప లేదు. ఆండ్రూ విజయానికి అతని ప్రతిభ, ధృఢమైన కృషి. ఎంతగా కారణాలలో అదృష్టంకూడా అంతగా హేతువని అతని సమకాలికుల్లో కొందరు నిరంతరం విశ్వసిస్తుండేవారు. సోదరుని నూతన భావాలను అనుసరించి వ్యవహరించటానికి తాను అన్ని వేళలా సంసిద్ధుడు కాకపోయినప్పటికీ విషయమేమో టామ్ బాగా తెలుసుకున్నాడు.

"ఆండీ! త్వరపడకు. ఉక్కును గురించిన ఉద్రేకం ప్రస్తుతం ఎంతో విశేషంగా వుంది. అది ప్రమాదకరం. ఇక ఇనుమా! అన్ని అమెరికన్ పరిశ్రమలకూ అది పునాది. ఇంకా కొంతకాలం అది అలాగే వుండి తీరుతుంది. మన వ్యాపారమార్గంలోది కానిదానికోసం మనం అధిక ధనాన్ని కుమ్మరించట మెందుకు?" అని సుఖంగా కుర్చీలో వెనక్కు వ్రాలుతూ అతడు సలహా యిచ్చాడు.

ఇతర భాగస్థులంతా టామ్‌తో ఏకీభవించారు. ప్రయోజనంలేక వాదన కొంత సాగించిన పిమ్మట ఆండ్రూ అన్నాడు. "సరే, నన్ను మీరు అనుసరించ లేకపోతే నేను క్రొత్త భాగస్థులతో ఒక బృందాన్ని కల్పించుకొని మరొక ప్రత్యేక సంస్థను ప్రారంభించవలసి వుంటుంది."

"అహహ అది కాదు ఆండీ! నేను నీ పథకంలో కొంత పెట్టుబడి పెట్టననటం లేదు. మిగిలిన మనవారుకూడా అందులో కొద్ది కొద్దిగా పెట్టుబడి పెడతారు. కాని మన ప్రస్తుతసంస్థ ఈ పనికి పూనుకొనడం నాకు ఇష్టంలేదు. అంతే" అన్నాడు. వెంటనే అందుకొని టామ్.

"బహుశ: నీ వన్నది సమంజస మైనదే కావచ్చు" నని ఆండ్రూ అంగీకరించాడు:

అందువల్ల అతడు మరొక క్రొత్త బృందాన్ని సమకూర్చుకున్నాడు. హోమ్‌వుడ్ ఇరుగు పొరుగు లైన్ కోల్మన్ స్టువార్టులు, రైలురోడ్డు కార్యకర్తలయిన థామ్సన్, స్కాట్‌లు ఆరబెట్టిన సరుకుల గుత్తవ్యాపారం మెక్కాన్డ్‌లెస్ లు ఉన్నారు. వీరందరిలో మెక్కాన్డ్‌లెస్ ప్రధానభాగస్థుడు కార్నెగీ కుటుంబం పూర్వం రెబెక్కా వీథిలో అతి దారిద్ర్యదశను అనుభవిస్తున్న దినాల్లో ఆంట్ ఐట్కిన్ ద్వారా మెక్కాన్డ్‌లెస్ వారికి అప్పు కావలసివస్తే ఇస్తానని మృదువుగా కబురు చేశాడు. అప్పుడు ఆఅప్పు అవసరం లేదని చెప్పటం జరిగింది. కానీ, ఆ సమయంలో మెక్కాన్డ్‌లెస్ చూపించిన అనుగ్రహాన్ని ఆండ్రూ ఎన్నడు మరచిపోలేదు.

కార్నెగీ క్రొత్తగా స్థాపించిన సంస్థలో అతని ఇనుము సంస్థలో ఉన్న భాగస్థులందరూ స్వల్పంగా పెట్టుబడులు పెట్టారు. ఈ క్రొత్త సంస్థకు సోదరుడు టామ్ స్థల నిర్దేశంచేశాడు. ఇది పిట్స్‌బర్గునుంచి మోనోన్గ్ హేలాకుపైన, పన్నెండుమైళ్ళదూరాన, బ్రాడ్డాక్ గ్రామందగ్గరవుంది, 177 లో ఫ్రెంచి - ఇండియన్ సైన్యం బ్రిటిష్ సైన్యాధికారి జనరల్ బ్రాడ్డాక్ ను పరిపూర్ణ వినాశాన్ని పొందేటట్లు ఓడించి చంపివేసింది ఇక్కడే. ఈ ప్రదేశంలో వుండటంవల్ల ఉక్కు కర్మాగారానికి రెండు రైలుమార్గాలు, మోనోన్గ్ హెలా ద్వారా ఓహైయో నది అందుబాటులో వుంటవి.

కార్నెగీ దీనికి "రైల్‌రోడ్డు కాలంనాటి నా పూర్వమిత్రుని గౌరవార్ధం 'ఎడ్గర్ థామ్సన్ స్టీల్ వర్క్స్‌' అని పేరు పెడతా" నన్నాడు. థామ్సన్ సంస్థలో పెద్దమొత్తం పెట్టుబడిపెట్టాడు. అయినా అతడు ఈ అభిప్రాయానికి సుముఖత చూపించలేదు. "ఆండీ! అమెరికన్ ఉక్కు పట్టాలతో నాపేరుకు సంబంధం వుండటానికి నేను ఎంతవరకూ ఇష్టపడుతానో నాకు బోధపడటంలేదు. ఇంతవరకు తయారైనవి ఎవరికీ గౌరవ మిచ్చేటట్లు లేవు." అన్నా డతడు.

అందుకు అభ్యంతరం చెబుతూ కార్నెగీ "థామ్సన్! మనం మంచి పట్టాలను తయారుచేయబోతున్నాము. ప్రపంచంలోని ఇతర దేశాలల్లో ఉక్కును ఎంతబాగా తయారు చేయటానికి వీలుందో ఈ దేశంలో కూడా అంతగా అవకాశ ముంది. కీస్టోన్ వంతెనలకు, క్లోమన్ ఇరుసులకూ వచ్చినంత కీర్తిని మన ఇనుప పట్టాలకుకూడా సంపాదించగలమని నా అభిప్రాయ" మన్నాడు.

చివరకు థామ్సన్ తన పేరు పెట్టటానికి అంగీకరించాడు. 1873 లో ఆర్ధికమాంధ్య భయోత్పాతం దేశంమీద వచ్చి పడేనాటికి కర్మాగార నిర్మాణం అట్టె సాగ లేదు. అనేక మంది విమర్శకులు "ఆహా! పొంగులువారిన ఆండ్రూ కార్నెగీ అదృష్టం చివరకు అతనికే ఎదురుతిరిగింది. ఈ దెబ్బతో అతడు నాశనం కాక తప్పదు" అన్నారు. కార్నెగీ తన 2,50,000 డాలర్లు ధనాన్ని ఈ పథకంలో పెట్టుబడి పెట్టాడు. ఇందులో అధికాంశం ఆతనికి బాండ్లు అమ్మకం వల్ల, కమీషన్ల వల్ల చేకూరిన ధనం. విధి విలాసంకొద్దీ తన దాన ధర్మ కార్యక్రమాన్ని ఆరంభించటంకోసం అతడు ఈ సంవత్సరాన్నే ఎన్నుకొన్నాడు. అతని స్వదేశంలోని డన్ఫ్‌ర్మ్‌లైన్‌లో ఒక ప్రజా స్నాన గృహదహనంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ధనంకోసం పుల్మన్ సంస్థలోని పెట్టుబడులను, ఇతర రక్షణ నిధులను అమ్మివేశాడు. కర్మాగార నిర్మాణ పరిపూర్తికి మరికొంత ఆలస్యమైంది. కానీ ఎక్కువ కాలం గడవ లేదు. అప్పటినుంచి అతడు ఉక్కు ఇనుముల మీదనే దృష్టిని కేంద్రీకరించటంకోసం ఇతరత్రా తనకున్న వాటాలను అన్నింటినీ ఒకదాని తరువాత ఒకదాన్ని అమ్మివేశాడు అతడు. "నా మంచి గ్రుడ్లను అన్నింటినీ ఒక గంపలోకి చేర్చి ఆ గంపనే చూచుకొంటూ వుండటం వివేచనగల విధానమని నేను నిర్ణయం చేసుకొన్నాను" అన్నాడు. కార్నెగీ ఇప్పటికే ఒక రైలు మార్గానికి సంబంధించిన పెట్టుబడి విషయంలో చిక్కుబడ్డాడు. అది కొంతగా అతనికి వ్యధ కలిగించింది. అతని పూర్వమిత్రుడైన స్కాట్ చేసిన నిర్బంధంనల ఆతడు రూపొంధిస్తున్న టెక్సాస్ అండ్ పసిఫిక్ రైల్ రోడ్ సంస్థలో 2,50,000 డాలర్లు పెట్టుబడి పెట్టాడు. ప్రస్తుతం ఆ సంస్థ దివాలా తీసే పరిస్ధితిలో వుంది. పెద్ద మొత్తం దానికి అప్పు తేలింది. న్యూ ఇంగ్లండులో పుట్టిన జూనియస్ యస్. మోర్గన్ లండన్ లో బ్యాంకరుగా వున్నాడు. అతనికే ఈ సంస్థ అప్పు తీర్చాలి. కార్నెగీకి అతనితో ఎన్నోలావాదేవీలు ఉంటుండేవి. ఆతనికి టెక్సాస్ అండ్ పసిఫిక్ రోడ్ సంస్థ బాకీపడ్డ మొత్తం పెద్దది. అతడు కార్నెగీ కనక హామీ ఇచ్చి సంతకం చేసే టట్లయితే ఋణ పత్రాన్ని తిరిగి వ్రాయించుకొంటానన్నాడు. కానీ, కార్నెగీ అందుకు నిరాకరించాడు.

"ఆండీ! వాళ్ళకు అండగా వుండటానికి అంగీకరింపక నీ పూర్వ మిత్రులందరికీ వినాశనాన్ని తెచ్చిపెడతావా" అని స్కాట్ కార్నెగీని నిందించాడు.

దీనికి ప్రతిగా సమాధానమిస్తూ "సరే, ఈ వినాశం నీ బృందానికి గాని, నా వ్యాపారానికిగాని, నా భాగస్థులకుగాని, వారి కుటుంబాలకుగాని సంబంధించింది అయితే యీ సమస్య విషయంలో నేను అనుకూలమైన నిర్ణయము చేసి తీరవలసిందే. స్కాట్! మిక్కిలి తక్కువ మూలధనంలో రైల్‌రోడ్ నిర్మాణానికి దిగవద్దనీ, యత్కాలికంగా పుట్టిన అప్పులమీద ఆధారపడి వేయిమైళ్ళు రైలు పట్టాలను వెయ్యవద్దనీ నీకు బోధించటానికి నేను ఎంతో యత్నించాను. అయినా, నా మాటలు నీవు విన్నావు కావు. తరువాత నేను యూరప్‌నుంచి తిరిగివచ్చిన వెనుక నాకోసం 2,50,000 డాలర్లు వాటాలు ప్రత్యేకంగా కేటాయించానని చెబితె ఏదో పూర్వమైత్రినిపురస్కరించుకొని సరేనని ఒప్పుకున్నాను. ఇప్పటికీ టి. అండ్. పి సంస్థ కాలక్రమేణ లాభసాటిగా పరిణమిస్తుందనే నా విశ్వాసం. అయినా, ఆ ఋణపత్ర మీద నేను సంతకం పెట్టలేను. అలా జేస్తే మిల్లులలోని నా పెట్టుబడులకు, నా భాగస్థుల భద్రతకు ప్రమాదాన్ని కల్పించడమౌతుంది. కనుక ఆ పని నేను జేయకూడదు" అన్నాడు.

నిస్సంశయంగా ఈ నిర్ణయాన్ని చేసినప్పటికీ కార్నెగీ ఎదుర్కొనవలసి వచ్చిన ఏ ఆర్థిక సమస్యకూడా ఆతనికి దీనివల్ల కలిగినంతటి వ్యధను కల్పించ లేదు. ఈ నిర్నయం జరిగిన తరువాత స్కాట్‌తో మైత్రి పూర్వంవలె సాగకపోవటమే ఇందుకు కారణం. ఆర్థికమాంద్య భయోత్పాతం దెబ్బతీస్తున్న ఆ సమయంలో కార్నెగీ ఆ రీతిగా వ్యవహరించటం న్యాయమే. టెక్సాస్ అండ్ పసిఫిక్ సంస్థలో స్కాట్‌తో కార్నెగీకి కూడా సంబంధం వున్న సంగతి అందరికీ విదితమైన విషయం. కార్నెగీ టెక్సాస్ అండ్ పసిఫిక్ సంస్థకు సంబంధించిన ఋణపత్రాలమీద సంత కాలు చేస్తే అతడు దాని వినాశం లోపలికి ఆకర్షింపబడినవా డౌతాడు. అందువల్ల పిట్స్‌బర్గులోని ఆతని సంస్థలన్నింటికీ ప్రమాద స్థితి కొని తెచ్చుకున్న వా డవుతాడు, అని ఊహించి కార్నెగీ కంపెనీలకు ఆర్థిక నిలయమైన ఎక్‌స్చేంజి బ్యాంకి ఎంతగానో ఆందోళన పడ్డది. ఈ బ్యాంకి కార్నెగీ కంపెనీలకు సంబంధించిన పత్రాలను పెద్ద మొత్తాలకు తన దగ్గిర కుదువబెట్టుకున్నది. అందుచేత ఆ బ్యాంకి డైరెక్టర్లు వెంటనే కనిపించవలసిందని కార్నెగీని పిలిపించారు. తగ్గ సమాధానం చెప్పుకోటం కోసం అతడు అతివేగంగా న్యూయార్క్ నుంచి బయలుదేరాడు.

గంభీరమైన ముఖ కవళికలతో కూర్చున్న ఆ డైరెక్టర్ల ముందు హాజరై కార్నెగీ అతి ప్రశాంతంగా యిలా అన్నాడు.

టెక్సాస్ అండ్ పసిఫిక్ కంపెనీలోని రెందు వందల యాభై వేల డాలర్ల వాటాలకు నేను యజమానినైన మాట సత్యం. దీని నంతటినీ నేను స్వంత ధన మిచ్చి కొన్నాను. ఎక్కడా నేను వారి పత్రాలమీద సంతకాలు పెట్ట లేదు.

వారు దీన్ని నమ్మలేకపోయినారు.

"ఒక డాలరు విలువజేసే వారి సాహసిక వ్యాపారపత్రంమీద కూడా నా సంతకం లే"దని గట్టిగా నొక్కిచెప్పి కార్నెగీ వాళ్ళతో ఇంకా ఇలా అన్నాడు. "వ్యాపార ప్రపంచానికి సాహసిక వ్యాపారం (Speculation) వంటి ఘనమైన అబిశాసం మరొకటిలేదని నా అభిప్రాయం. స్కాట్ ఎక్ స్చేంజి ద్యూత గృహంకంటే ఇంచుక మంచిది లేదా దానితో తుల్యమైంది." ఈ అభిప్రాయమే అతనికి జీవితాంతము వరకూ నిశ్చలంగా వుంది. "మా సంస్థల సాధన సంప త్తిని వృద్ధిపొందించుకోటం కోసం. మీ రిచ్చిన అప్పులకు తప్ప నేను ఈ కంపెనీతో సహ బాధ్యత వహించిన ఋణ పత్రాలు ఏమీ లేవు. నా సంస్థలనుంచి నాకు తిరిగి వచ్చే ప్రతి డాలరును, మీ బాకీలను తీర్చటానికి నా ఆస్తులు చాలునని చూపించటానికి హామీ ఇవ్వటానికి నేను సంసిద్ధుడనై వున్నాను.

"కార్నెగీ! ఆ ఋణాలను గురించి మాకు అణుమాత్రమయినా ఆందోళన లేదు" అని బ్యాంకి అధ్యక్షుడు బయటపడ్డాడు. ఇదంతా టెక్సాస్ అండ్ పసిఫిక్ కంపెనీ గురించి, వాళ్ళ ఋణపత్రాలమీద నీవు అనుమతి సంతకాలు చేస్తున్నావని మేము విన్నాము" అన్నాడు.

అప్పుడు కార్నెగీ అన్నాడు. "సాహసిక వ్యాపారంతో జోక్యం పెట్టుకొన్న నన్ను, మీరు ఎన్నడూ చూడ లేదు. వాల్‌స్ట్రీట్‌లో నేను మీకి ఎప్పుడూ కనిపించను. ఇక రుణపత్రాలమీద హామీ సంతకం పెట్టటం విషయమంటారా-ఋణం పక్వమైనప్పుడు నేను తీర్చటానికి మార్గం స్పష్టంగా కనిపిస్తుంటేనేగాని లేదా చెల్లించ లేని స్థితి వస్తే దానికి తగినంత ఆస్తి నాకు వుంటేనేగాని ఏ రుణపత్రంమీదా సంతకం చెయ్యకూడదని నా దీక్ష. నా పాశ్చాత్య మిత్రుడొకడు అన్నట్లు నడవ లేనంతటి లోతున్న నీళ్ళల్లోకి నేను ఎన్నడూ వెళ్ళను."

ఆర్ధిక - వ్యాపారిక ప్రపంచంలో కొత్తగా లభ్యమయిన ప్రగాడ గౌరవంతో కార్నెగీ ఈ సమావేశంనుంచి బయటికి వచ్చాడు. ఆనాటి ఆర్థిక భయోత్పాతంనుంచి ధ్వంసం కాకుండా బయటపడ్డ ప్రముఖ పారిశ్రామికుడు అతడు ఒక్కడే. ఈ సమయంలోనే చితికి డబ్బుకు అక్కర కలిగిన తన సంస్థలోని భాగస్థులు కొందరు తమ షేర్లను అమ్మజూపితే అతడు తన పేర వాటిని పుచ్చుకొన్నాడు కూడాను. ఇనుము ఉక్కు పరిశ్రమలు దరిదాపుగా స్తబ్ధస్థితిలో ఉన్న ఆ ఆర్థికమాంద్య సమయంలో కూడా బ్రాడ్డాల నిత్యం క్రమాభివృద్ధినిపొందుతూనే వున్నది. వస్తుసామగ్రి ఆర్థికమాంద్య సమయంలో చౌకగా వుంటుంది. తిరిగి మంచిరోజులు వచ్చినప్పుడు వ్యాపారాన్ని విజృంభించి ఆరంభించటానికి అతిశయమైన అవకాశం వుంటుంది. మంచిదినాలకోసం ఆగినవాళ్లు వస్తుసామగ్రికోసం అధికధనం వెచ్చించవలసి వుంటుంది. అందువల్ల యంత్రాదికం ఖరీదు పెరిగిపోతుంది. వచ్చేలాభాలు తక్కు వౌతవి. డబ్బు వుంటే సంస్థను వృద్ధిచేయటానికి ఆర్థికమాంద్య సమయమే తగిన కాలమన్న అంశాన్ని కార్నెగీ గమనించాడు. అందువల్లనే క్రమంగా ఆ మార్గాన్ని అనుసరించి వ్యవహరించాడు.

కార్నెగీ కుశాగ్ర బుద్ధివల్లనే 1875 లో పనిని తిరిగి విజృంభించి ప్రారంభించినప్పుడు ఎడ్గర్ థామ్సన్ కంపెనీ ఇతరమైన ఉత్పత్తిదారు లందరికంటే తక్కువధరలకు పట్టాలని విక్రయించ గలిగింది. అందువల్ల అనేకకర్మాగారాలు పనిలేక మందకొడిగా నడుస్తున్న దినాలల్లో ఈ కంపెనీ ఆర్డర్లను అసంఖ్యాకంగా పొందగలిగింది.

ఉక్కును ఉత్పత్తి చేయటంలో అమెరికాలోని అందరికంటే సమర్ధుడైన వ్యక్తి కెప్టన్ బిల్ జోన్స్ . ఇతడు వెల్ష్ జాతివాడు. అంతర్యుద్ధ 'కురు వృద్ధ' ఎడ్గర్ థామ్సన్ కంపెనీతో స్పర్థవహించి పనిచేసే మరొక సంస్థనుంచి ఇతడు యజమానులు తన సామర్థ్యాన్ని గుర్తించక పోవటంవల్ల విసుగుజెంది బయటికి వచ్చేశాడు. ఇటువంటి వ్యక్తిని కార్నెగీ తన ఉద్యోగిగా సంపాదించటంతో కంపెనీ విజయం మరింత నిశ్చితమయింది.

కార్నెగీ విజయ రహస్యాలల్లో మరొకటి వ్యక్తులను గురించి అతనికి ఉన్న అపూర్వ వివేచనాశక్తి. ప్రసిద్ధిగన్న ఒక ఉత్పత్తిదారు అతణ్ని గురించి "ఒక స్థానంనుంచి ఒక వ్యక్తిని ఎన్నుకొని అతనివలన అత్యుత్తమ ప్రయోజనం కలిగే మరొక స్థానంలో అతణ్ని నిలిపే కౌశలం విషయంలో ఇతడు నే నెరిగిన వాళ్ళందరిలోను మేటి" అన్నాడు. "ఇతరులు యోగ్యతను కొద్దిగా గుర్తించటమో లేక అసలే గుర్తింపక పోవటమో జరిగిన వ్యక్తిని కార్నెగీ ఒక ప్రముఖ స్థానంలో నిలపటం నాకు తెలుసు. అతడు నిల్పిన వ్యక్తి ఆ స్థానంలో ఏల్ తాళపు డిప్పల్లాగా ఒదిగిపోయ్యాడు. వ్యక్తులను ఎన్నుకోటంలో కార్నెగీకి సాటి ఐనవాడు ఉన్నాడని నేను అనుకోను" అని అత డన్నాడు.

"నూతన యంత్ర సష్టనుగా గాని, రాసాయనిక వేత్తనుగా గాని, పరిశోధకు డనుగా గాని, యంత్ర నిర్మాతనుగా గాని నా కొక స్థానమున్నదని అనటానికి నాకు అణుమాత్రమయినా యోగ్యత వేదు." అని కార్నెగీ విస్పష్టంగా చెప్పనే చెప్పాడు. ఆతడికి తెలిసింది యోగ్యులైన వ్యక్తులను గుర్తించటం, వారివల్ల అత్యుత్తమ సేవలను పొందటం మాత్రమే. "పొందవలసిన సేవ కేవలం బుద్ధిసంబంధమైనదీ హస్తసంబంధమైనదీ మాత్రమే కాదు" అన్నా డతడు. గణనకు వచ్చేది హృదయసంబంధి ఐన సేవ. అతనిబుద్ధి అతిశయమైన కుశలతతో పనిచేయటానికి ముందే నీవు నీ ఉద్యోగిలోని వ్యక్తిగత నైజస్వభావాన్ని, హృదయాన్ని ఆకర్షించి అధీనం చేసుకోవాలి" అన్నది కార్నెగీ అభిప్రాయం.

ఇప్పటికే కార్నెగీ తన జ్ఞాతియైన డాడ్ హృదయపూర్వక సహకారాన్ని సంపాదించాడు. అతడు డాడ్ ను 1870 లో సంస్థలోకి తీసుకువచ్చాడు.

డాడ్ ఈనాడు సంస్థతో అవినాభావ సంబంధం గల వ్యక్తి. ఇతరమైన ఇనుప కంపెనీలు, బ్రిడ్జి కంపెనీలు లాగానే కార్నెగీ ఉక్కు సంస్థకూడా తన ఉపయోగంకోసం బొగ్గు గనులను సంపాదించింది. తన కంపెనీ బొగ్గుగనుల్లో వృథాగాపోతున్న పదార్థాన్నిగురించి, చిట్లెమును గురించి కోల్మన్ బహుకాలం ఆందోళన చెందాడు. ఒక సందర్భంలో ఆతడు ఇంగ్లండులో ఉన్నప్పుడు జార్జి లాడర్ అనే వ్యక్తి అతనికి పై విధం వ్యర్ధమయ్యే పదార్థాన్ని అంతటినీ పరిశుంభ్రంచేసి బొగ్గుకు బదులుగా వాడటం చెయ్యటంకోసం తాను కనిపెట్టిన ఒక విధానాన్ని చూపించాడు. దాన్ని చూసి క్లోమన్ మహోత్సాహంతో ఇంటికి వచ్చాడు. "డాడ్! వెంటనే ఇక్కడికి వచ్చి నీ విధానాన్ని మాకు చూపించాలి" అని కార్నెగీ అతడికి వ్రాశాడు. అతడు వచ్చి అమెరికాలో చిట్లెపు బొగ్గును పరిశుద్ధిచేసే మొట్ట మొదటి కర్మాగారాన్ని నిర్మించాడు. ఇందువల్ల కంపెనీలకు ఎన్నో నిలవలు చేకూ రాయి. కంపెనీలోని భాగస్థులందరూ "మనం ఇతడ్ని తిరిగి ఇంటికి వెళ్ళనీయకూడదు" అని కూడబలుకు కొన్నారు. ఆ కారణం వల్ల లాడర్ అమెరికాలోనే నిలచిపోయినాడు. కార్నెగీ సంస్థలో భాగస్థుడయి చివరకు, మహాధనికుడుగా మరణించాడు.

ఉక్కు సైన్యంలో చేరటానికి డన్ఫ్‌ర్మ్‌లైన్ ఎంతోమందిని చేకూర్చి యిచ్చింది. "మిష్టర్ కార్నెగీ, మీ బంధువొకడు ఇక్కడ పనిచేస్తున్నాడు. మీకు తెలుసునా?" అని ఒకనాడు కర్మాగారంలో నడుస్తున్నప్పుడు సూపరింటెండెంటు కార్నెగీని హెచ్చరించాడు.

"తెలియదే!" అని అతడు ఆశ్చర్యంతో సమాధానమిచ్చాడు.

"పైగా అతడు సిద్దహస్తుడయిన మంచి యంత్రవేత్త కూడాను. అతడు మీకు జ్ఞాతి అని కొలదికాలం పూర్వం వరకూ నాకు కూడా తెలియదు."

"అతడితో నేను మాట్లాడవచ్చునా?"

"తప్పక" అని సూపరింటెండెంటు కార్నెగీని ఒక యంత్రం సరిచేస్తున్న యువకు డొకడి దగ్గిరికి తీసుకు వెళ్ళాడు. "ఇదిగో ఇతడే" అని అతడు "టామ్ ! వీరు మిషటర్ కార్నెగీ అని పరిచయం చేశాడు.

"నీ పే రేమిటి?' అని యజమాని ప్రశ్నించాడు.

"థామస్ మారిసన్. మా తండ్రి రాబర్టు" అని యువకుడు సమాధాన మిచ్చాడు. "ఏమిటి? నా జ్ఞాతి బాబ్!"

"అవును."

"నీవు ఇక్కడికి రావటం ఎలా జరిగింది?"

"ఇక్కడికి వస్తే మేము బాగుపడగలమని భావించాను."

'మేము' అన్న మాటను తిరిగి ఉచ్చరించి" "ఇంకా నీతో ఉన్నావా ళ్ళెవరు?" అని కార్నెగీ ప్రశ్నించాడు.

"నా భార్య."

యజమాని అతణ్ని చిత్రంగా పరికించి చూచాడు. "నేను నీకు బంధువును గదా. మొదట నాదగ్గిర కెందుకు రాలేదు?" అని ప్రశ్నించాడు.

"నీ కొక పరిచయ పత్రాన్ని వ్రాసియిచ్చి వుండేవాణ్ని. ఇంతకంటే మంచి పనిలో చేరే అవకాశం కల్పించి ఉండేవాణ్ని" అన్నాడు.

ఆ యువకుడు "అవకాశం లభించింది గదా అన్యసహాయం ఎందుకులే! అనుకున్నా"నని సూటిగా ఆ పెద్దమనిషి కళ్ళల్లోకి చూస్తూ సమాధాన మిచ్చాడు. ఈ ఉదంతాన్ని వర్ణిస్తూ "ఔను. అదే నిజమైన మారిసస్ స్వభావం అని ఉల్లాసంతో కార్నెగీ పెద్ద పెట్టున అన్నాడు. "స్వశక్తిమీదనే ఆధారపడటం లూసిఫర్ లాగా స్వతంత్రుడుగా ఉండటం నేర్చుకొన్నా" డన్నాడు.

శక్తిమంతుడైన జ్ఞాతి సహాయం లేకుండా నే థామస్ కొద్ది సంవత్సరాలకే డూక్యూస్నీలోని క్రొత్త కర్మాగారా నికి సూపరింటెండెంటు పదవిని అందుకొన్నాడు. భాగస్థుడైనాడు. చివరకు ఇతడుకూడా కోటీశ్వరుడయినాడు.

స్కాట్లండులోని హైలాండ్సును స్మృతికి తెచ్చే పెన్సిల్వేనియాలోని క్రెస్సన్ దగ్గర, కేవలం ఎలిఘనీస్ శిఖరం మీద, కార్నెగీ ఒక కుటీరాన్ని కొన్నాడు. వసంతపు తొలిచిహ్నాలు కనిపించగానే అతడు, అతని తల్లి అతివేగంగా అక్కడికి వెళ్ళేవారు. న్యూయార్క, పిట్స్‌బర్గులకు మధ్య మధ్య అతివేగ ప్రయాణాలు చేస్తూ మాసమో మరికొంత కాలమో అక్కడ గడిపిన తరువాత సెలవలకని వారు స్కాట్లండుకో, యూరప్‌కో పోతూ వుండేవాళ్లు వేసగి చివరిదశలో తిరిగివచ్చిన ఆ సాంధుడు లేదా పాంథు లిరువురూ మళ్ళీ క్రెస్సన్‌కు వెళ్ళి అక్కడనే ఆకురాలు కాలం వరకూ వుండేవాళ్ళు.

క్రెస్సన్‌కు వెళ్ళి కార్నెగీ గోదాముతో ప్రవేశించబోతున్నప్పుడు పలుకా కట్టుకొన్న ఒక యువకుడు, పదునై దేళ్లవాడు తనంతట తానే వచ్చి, అతని గుర్రాన్ని పట్టుకొనేవాడు. అశ్వారోహణముచేసి తిరిగి వెళ్ళిపోతూ ఆ 'ఉక్కు-అధిపతి' ఇచ్చిన పదిసెంట్లో పావు డాలరో పారితోషికాన్ని పుచ్చుకొని ఈల వేసుకొంటా అతడు అక్కడనుంచి అంగలమీద వెళ్ళి పోతుండేవాడు. క్రెస్సన్ కు అతని నివాసనగరమైన లొరెట్టోకు మధ్య ఉన్న కొలది మైళ్ళదూరం ఆ కుర్రవాడు అతివేగంగా పయనించేవాడు. అయితే కార్నెగీకి అప్పుడు అతడి పే రేమిటోకూడా తెలియదు. కానీ తరువాత తెలుసుకొనే సమయం వచ్చింది.