Jump to content

ఆండ్రూ కార్నెగీ (జీవితచరిత్ర)/మరువరాని సంవత్సరం

వికీసోర్స్ నుండి

మరువరాని సంవత్సరం

9


1881 సంవత్సరమంతా ఆండ్రూ కార్నెగీ జీవితంలో ప్రత్యేకంగా గమనింపదగ్గ సన్ని వేశాలతో నిండినది. ఐదు మిలియన్ల డాలర్లు పెట్టుబడి పెట్టి ఆ సంవత్స రారంభంలో కార్నెగీ బ్రదర్స్ అన్న మహాసంస్థను స్థాపించటంతో ఆండ్రూ బాల్యంలో తమ్ముడి కిచ్చిన వాగ్దానాన్ని చెల్లించాడు. ఈ సంస్థలో కార్నెగీ పెట్టుబడి సగానికి కొంచెం ఎక్కువ. ఇది సామాన్యమైన సంస్థల వంటిది కాదు. దీని యజమానులు షేరు హోల్డర్లు కాదు. సహ వ్యాపారస్థులు. ఆండ్రూ కార్నెగీ ఎవడయినా పైకివచ్చే లక్షణం గల యువకుణ్ణి చేర్చుకోటానికి నిర్ణయించిన సందర్భాలలలో తప్ప సామాన్యంగా ఈ బృందంలోవారు స్టాకును తమలో తమకు కాక ఇతరుల కెవ్వరికి అమ్మ రాదు. అంటే ఈ సంస్థ స్టాకు ఆండ్రూ కార్నెగీ విశేషంగా అసహ్యించుకొనే స్టాక్ ఎక్స్‌ఛేంజిలోకి ఎన్నడు వెళ్ళదన్నమాట. ఈ నూతన మహాసంస్థలో ఎడ్గర్ థామ్సన్ స్టీల్ వర్క్స్, ది యూనియన్ ఐరన్ వర్క్స్, ఎన్నో కోల్‌మైన్లు, కోల్ ఒవెన్లుగా ప్రస్తు తంతో పరిణమించివున్న లూసీఫర్నేసెస్ అన్న సంస్థలు విలీనం చెయ్యబడ్డాయి. కార్నెగీ స్టీలు గ్రామసీమలలో వేలకొద్ది మైళ్లు రైలురోడ్లను నిర్మించటానికి, బ్రిడ్జిలను నిర్మించటానికి, అప్పటి కాలంలో యుగాద్భుతంగా భావింపబడ్డ న్యూయార్క్‌లోని ఈస్టునది మీది పెద్దస్వానును నిర్మించటానికి తోడ్పడింది.

ఈ సంవత్సరమే తన తొలిదానంగా ఉచితజ్ఞుడై అతడు ఒక ప్రజాగ్రంథాలయాన్ని డన్ఫ్‌ర్మ్‌లైన్‌కు ఇవ్వటం జరిగింది. ప్రపంచంలో మరే నగరమయినా సరే తన కాదానాన్ని ఇచ్చినందుకు అతణ్ని ఆ నగరం ప్రశంసించినట్లు ప్రశంసించి ఉండేది కాదు.

అతడు వాస్తు శిల్పి (Architect) తో ఆ భవన పధకాలను గురించి ఆలోచిస్తున్నప్పుడు అతడు "మిష్టర్ కార్నెగీ మీకు శలాచనం (కోట్-ఆప్ ఆమ్) చిత్రమొకటి నాకు కావలె అది ఈ భవనంలో ఎక్కడో ఒకచోట అది వుండాలి." అన్నాడు. ధనసంపాదనం చేసిన అమెరికన్లు తమకు పారంపర్యంగా వచ్చిన ఆ ప్రాచీన కాలపు 'లాంఛనాలు' లేకపోతే వాటిని తయారుచేయటంలో ప్రత్యేక నైపుణ్యమున్న వాళ్ళను పిలిపించుకొని కొత్తగా కల్పితమైన వాటిని చేయించుకుంటుండే వారు. కార్నెగీకూడా ఈ విధానాన్నే అనుసరించి, అటువంటి లాంచనమేదో చేయించుకొని ఉంటాడని ఆ గృహ నిర్మాత భావించి వుంటాడు. అయితే అలా జరుగ లేదు. "నీకు శుభ మగుగాక! నాకు అటువంటి లాంచ నాడంబరా లేవీ లేవు" అని ఆ నిత్య ప్రజాస్వామిక వాది వెల్లడించాడు. "నీకు ఏదో విధమైన డిజైను కావాలంటే ద్వారం మీద ఉదయకాల రవి తన కిరణాలను అన్ని దిక్కులకూ ప్రసరిస్తున్నట్లు చిత్రించి దానిక్రింద తేజస్సుప్రాప్తించు గాక!" అన్న వాక్యాన్ని ఎందుకు వ్రాయకూడదు" అని సూచన చేశాడు. చివరకు అలా చేయటమే జరిగింది.

దక్షిణాన్నుంచి ఉత్తరానికి, ఇంగ్లండునుంచి స్కాట్లండుకు, ఆ గ్రంథాలయ భవనానికి కొణశిలను స్థాపించేటందుకు డన్ఫ్‌ర్మ్‌లైన్ చేరుకొనేటట్లు కార్నెగీ ఒక క్రోచ్ ప్రయాణాన్ని ఏర్పాటు చేయించాడు. ఉల్లాస కరమైన ఆ ప్రయాణబృందంలో తాను తల్లితోసహా పదహారుమంది సభ్యు లున్నారు. మిగిలిన వారంతా తాత్కాలికంగా తమపని కట్టిపెట్టి ఆఫీసు బల్లమీదినుంచి లేచి రావటానికి అవకాశం కలిగిన అతని సహచరులు, మిత్రులు. ఇందులో కొందరు భార్యలతోకూడ వస్తున్నారు. ఆ నాలుగు గుర్రాల కోఛ్‌లో డ్రయివరు ప్రక్కన ఎత్తుగా కూర్చున్న డెబ్బది యేండ్ల మార్కెరేటె కార్నెగీ బృంద మంతటిలోనూ ఎక్కువ వుల్లాసంగా కనిపించి వుంటుంది. అనేక పర్యాయాలు ఆమె సెలయేళ్లు దాటవలసి వచ్చినప్పుడు నీళ్ళలోకాళ్ళీడ్చుకుంటూ నడిచింది. ఒకమాటు ఆమె తన షర్టును పైకిమడచి పచ్చగడ్డిమైదానంమీద కొండరువ్వులు (Highland Flings) నటించి చూపించింది. స్కాట్లండుకు ఇదే తన చివరిప్రయాణ మని తెలుసుకోవటంవల్ల ఆమె అందరికంటె ఇందువల్ల అధిక ప్రయోజనాన్ని పొంద దలచింది.

అంకుల్ లాడర్ ఈ బృందాన్ని ఫిర్త్ ఆఫ్ పోర్తు దగ్గరకు వచ్చి కలుసుకున్నాడు. గ్రామసీమయావత్తు డన్ఫ్‌ర్మ్‌లైన్‌కు మూగుతున్న దని వీళ్లు తెలుసుకున్నారు. ఈ బృందం పాత నగరాన్ని చేరేటప్పటికి గుంపులు బాగా పెరిగిపోతున్నవి. స్కాట్లండ్, ఇంగ్లండ్, యునైటెడ్ స్టేట్ల పతాకాలు ప్రాత రాజభవనం మీద ప్రక్క ప్రక్కగా ఎగురుతుండటం వీరి కంటబడ్డది. పెద్ద అందమైన తోరణం ఒకటి ఊరు బయట ఏర్పాటు చేయబడింది. ఇక్కడ ప్రోరోష్ట్, నగర కౌన్సిలు సభ్యులు, న్యాయాధికారులు వారి వారి ఔద్యోగికమైన దుస్తులతో ఈ బృందం వారి రాకకోసం ఎదురుచూస్తున్నారు. స్వాగతం చెబుతూ ప్రసంగాలు చేశారు. ప్రధాన స్వాగతప్రసంగం చేసింది ఒక వుద్యోగి కాదు ఔహిత్య శోభితంగా ఈ పనిని ఒక నేత పనివాడు నిర్వర్తించటం జరిగింది. ఇం దత డెంతో సమర్ధతను ప్రదర్శించాడు. బ్యాండు వాయించేవారు, బాగ్ పైపర్లు, లాడ్జీలు, కార్మికులసంఘాలు - వీళ్ళలో చాలామంది లినెన్ మిల్లులో పనిచేసే స్త్రీలు, బాలికలు ఉన్నారు - వీళ్ళందరితో గూడిన వుత్సవం మైలు పొడుగున నడిచింది. ఇందులో పాల్గొన్నవారు బ్రిటిష్, అమెరికన్ జెండాలను, బానర్లను పట్టుకొని "కార్నెగీకి స్వాగతము" అని వ్రాసిన ఆర్చిల క్రిందుగా ఊరేగింపును నడిపించారు. ఈ వుత్సవం ఆండ్రూ జన్మించిన శిలాకుటి (Stone Cottage) దగ్గిర, అతని తల్లి పెట్టిన స్వీట్ షాపు [ మిఠాయిదుణాం ] దగ్గిర రెండుచోట్ల ఆగింది. రెండోచోట ఆగినప్పుడు ఏర్పడ్డ నిశ్శబ్దంలో వినిపించిన అబ్బీ గంటల తీయనైన ధ్వనులకు "ఉక్కు-రాజు" కన్నులలో ఆనందభాష్పాలు పొంగిపొర్లాయి.

తరువాత విందు జరిగింది ... పరిచికాలైన పూర్వ ప్రదేశాలను, ఇతర ముఖ్యస్థలాలను తిరిగి చూశారు. శంకుస్థాపనోత్సవ సమయంలో ఏరిల్ ఆఫ్ రోస్బరీ ప్రసంగించాడు. ధర్మకర్త లందరూ ఆ వుత్సవపు తంతును కార్నెగీ తానే నిర్వహిస్తున్నాడని వుద్దేశపడ్డారు. కానీ, అతడు ఆ గౌరవాన్ని తన తల్లి కివ్వ వలసిందని ప్రార్థించాడు. సంవత్సరం సంవత్సరం ఆమె మీద అతని గౌరవం వృద్ధికావడమే యిందుకు కారణం. అతడు అప్పు డప్పుడు ఆమె నొసటిని వ్రేలితో తాకి 'టామ్‌కు, నాకు మేధాశక్తి నిచ్చిన తావు యిక్కడే వుంది" అనేవాడు. అతడు తలచినట్లె శితకేశ కిరీటంతో వినీలమైన సిల్కు వస్త్రాలలో విశిష్టమైన మూర్తిని వహించిన ఆతని తల్లి, అమలినమయిన ఆత్మశక్తిని అత్యుదాత్తతను ప్రకటిస్తూ తంతు నంతటినీ పూర్తిచేసింది. సున్నాన్ని వెండి తాపీతో పరచి, ఎత్తిన రాతిమీద ముమ్మారు మూడు దెబ్బలుకొట్టి అక్కడ సమావేశమయిన వారందరికీ వినిపించేటట్లు స్పష్టమయిన కంఠంతో "స్మృతి చిహ్నమయిన ఈశిల సశాస్త్రీయంగాను, సక్రమంగాను నిక్షిప్త మయినదని నేను ప్రకటిస్తున్నాను," పరమేశ్వరు డీ ప్రయత్నాన్ని ఆశీర్వదించుగాక!" అన్నది.

తా నొక రచయిత ననే భావాన్ని ఎల్లప్పుడూ వహించే ఆమె పుత్రుడు "ఆన్ అమెరికన్ పోర్-ఇన్-హాండ్ యిన్ బ్రిటన్" అన్న గ్రంథంలో ఈ కోచ్ ప్రయాణాన్ని వర్ణించాడు. ఈ గ్రంథం 1882 లో ప్రకటితమైంది.

ఆ 1881 సంవత్సరంలోనే పిట్స్‌బర్గు పెట్టుబడిదారులు బ్రతిద్వద్వంగా హోమ్‌స్టెడ్‌లో ఎడ్గర్ థామ్సన్ వర్క్స్‌కు కొంచెం క్రిందుగా మోనాంగహాలా నది ఆవలి ఒడ్డున మరొక ఉక్కు కర్మాగారాన్ని నిర్మించారు. కానీ కొత్త సంస్థకు కార్మిక సంబంధమైన ఇబ్బందులవల్ల దెబ్బతగిలింది. కొంత వెనక్కు తగ్గి వచ్చిన ఆర్డర్లను తగ్గించుకోవలసివచ్చింది. దానిమీదట డైరెక్ట్ర్లు వాళ్ళల్లో వాళ్ళు తగాదాలు పడ్డారు. చివరకు అందరూ వెళ్ళిపోవటానికి ఒప్పుకున్నారు. ఒక మధ్యవర్తి వచ్చి కార్నెగీని కలుసుకున్నాడు. ఈ పరిణామాలను మొదటినుంచి జాగ్రత్తగా పరిశీలిస్తున్న కార్నెగీ ఇటువంటి పరిస్థితి వస్తుందని ఊహిస్తూనే వున్నాడు. ఆ మధ్యవర్తి అతన్ని హోమ్‌స్టెడ్ ను పుచ్చుకుంటారా అని అడిగాడు. అతడు తీసుకుంటానన్నాడు. తరువాత ఒక ప్రతినిథి సంఘం ఆతడిక్కడ తమను స్కాచ్ సంప్రదాయను గుణంగా పిండివేస్తాడో అన్న భయంతో అతని కార్యాలయానికి వచ్చారు.

"మీ షరతులే" మని వారు ప్రశ్నించారు.

"కార్నెగీ కార్పొ రేషన్‌లోని స్టాకుమూలంగా గాని విడిగా డబ్బురూపంలో గాని మీ రెలా కోరితే అలా ఆ కర్మాగారంలో మీరు పెట్టిన ప్రతిడాలరు మీకూ తిరిగి ఇచ్చివేస్తాం." పడ్డ తబ్బిబ్బులోనుంచి తట్టుకొని ఊపిరి సలుపుకోవటానికి వాళ్ళకి కొన్ని క్షణాలు పట్టింది. వారు తమకు డబ్బే కావాలని గట్టిగా కోరారు. తిరిగి ఆలోచించుకోటానికి క్షణ కాలమైనా ఇమ్మని అడగ లేదు. వారిలో ఒక్కడికి తప్ప తక్కిన వారందరికీ వేరే ఉక్కు వ్యాపారాలున్నాయి. ఆ ఒక్కడు మిస్టర్ సింగర్. ఇతడుమాత్రం ఆలోచించుకోటానికి ఇరవైనాలుగు గంటల కాలవ్యవధి నిమ్మనికోరాడు. అతడు మర్నాటి ఉదయం తిరిగివచ్చి "నిన్న నీ వన్నది నిజంగా చెల్లించే మాటేనా?" నీవు నన్ను భాగస్థునిగా తీసుకొంటావా?

"తప్పక తీసుకుంటాను." నవ్వుతూ సమాధానమిచ్చి "ఏది, కరచాలనం చెయ్యి భాగస్వామీ!? అన్నాడు.

తరువాత ఆతని పూర్వభాగస్థులు తమకు దూరదృష్టి లేకపోయినందుకు ఎంతో చింతించారు. అయితే మిష్టర్ సింగర్ మాత్రం తాను తీసుకొన్న నిర్ణయానికి ఎన్నడూ చింతపడ లేదు. ఉక్కు అప్పుడప్పుడె తన స్థితికి తాను వస్తున్నది. రైలుపెట్టెలు, కార్లు, వంతెనలు, యంత్రసామాగ్రులు, బాయిలర్లు, పైపు, కేబిల్, బార్బుడువైరు, అన్నిటికీ మకుటాయమానంగా కొత్తగావచ్చి అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తున్న స్కైస్క్రేపర్లకు చట్ట నిర్మాణం పూర్వపు పట్టాలకు తోడయినది. వీటన్నిటికీ ఉక్కు కావాలి.

1881 లో విశేష ప్రాముఖ్యాన్ని పొంది అందరి దృష్టినీ ఆకర్షించినవాడు పశ్చిమ పెన్సిల్వేనియా నుంచి వచ్చిన ఒక యువకుడు హెన్రీ క్లే ఫ్రిల్. ఇతడు తెలివిగా కోల్‌ను నిర్మించటానికి పూనుకొన్నాడు. 1881 వచ్చేటప్పటికల్లా ప్రపంచ మంతటిలోనూ మంచి కోకొంగ్ బొగ్గును తయారుచేసే కోనెల్స విల్లీలోని ఎనభైవంతుల వ్యాపారాన్నంతటినీ ఇతడు హస్తగతం చేసుకొన్నాడు. అయితే చాలా అప్పుల్లో పడ్డాడు. అంతేకాకుండా ఈ సంవత్సరం ఇతడు ఒక పిట్స్‌బర్గ్ కన్యను వివాహమాడ దలిచాడు. కొంతకాలంనుంచీ కార్నెగీ దృష్టి ఫిల్బ్‌మీద పడ్డది. ఇతణ్ణి భాగస్వామిని చేసుకోవాలనుకుంటున్నాడు. సర్వం ఇతనిమీద విడిచిపెట్టి సంస్థకు బయట ఉండదగినంతటి సామర్ధ్యం గలవా డితడు. వీ ళ్ళిరువురూ కలుసుకొని ఒక వ్యాపారపు లొడంబడిక చేసుకున్నాడు. హనీమూన్ కోసం ఫిక్. అతని భార్య న్యూయార్క్‌కు వచ్చినప్పుడు కార్నెగీ వాళ్ళను విందు కాహ్వానించాడు. ఆ సమయంలో తల్లి తప్ప మరెవ్వరూ అతిథులు లేరు. భోజనం ముగియబోయేముందు అతిథేయి లేచి నిలిచి అతడు తన ఉత్తమ మిత్రులైన ఫ్రిక్ దంపతులకు శుభాకాంక్షలు చెప్పాడు. అందులో "మిష్టఫ్రిక్ నేను భాగస్వాములము కాబోతున్నామని చేర్చాడు.

ఇలా చేర్చి చెప్పటం ఈ రహస్యాన్ని ఇంతవరకూ ఎరగని తల్లి ఉపయోగం కోసమే ఉద్దేశింపబడ్డది.

"ఆండ్రా, ఇది ఫ్రిక్‌కు ఎంతో మంచి విషయం" అని ఆమె వెంటనే సంతోషించింది. "ఇందువల్ల మన కేమివస్తుంది?" అన్నది. కొద్దికాలానికే జనవరి, 1, 1882 న పదవ వంతు కార్నెగీ వర్గంవారి యాజమాన్యం గల స్టాకుతో హెచ్. సి. ఫ్రిక్‌ కోక్ కంపెనీ స్థాపితమైంది. ఈ సంస్థలో ఇలా ప్రారంభమైన కార్నెగీల యజమాన్యం కాలక్రమేణ, ఫ్రిక్కే కంపెనీ విధానాన్నంతటీనీ నిర్ణయించేవా డయినప్పటికీ, కాలక్రమేణ అది వారికి అత్యధిక ప్రతిపత్తి నిచ్చేటంతవరకూ పెరిగింది. ఈ మధ్య కాలంలో ఫ్రిక్ కార్నెగీ స్టీల్ కంపెనీలోని తన పెట్టుబడులను పెంచుకొన్నా.

లండన్‌కు వచ్చి బ్రిటిష్ ఐరన్ అండ్ స్టీల్ ఇన్స్టిట్యూట్ ముందు అతని రచనను చదవవలసిందిగా ఆహ్వానింపబడేటంతటి ఖ్యాతి నార్జించుకున్న కెప్టెన్ బిల్‌జోన్స్ ఈనాడు ఉక్కులోకంలో సుప్రసిద్ధు డయినాడు. అతడిప్పుడు హోమ్ స్టెవుడ్ లోని వ్యవహారాలను చూస్తున్నాడు. తనకు ప్రియమయిన మార్గాన్ని అనుసరించి జోన్స్‌కోసం కొంత స్టాక్ ను వేరుచేసి అతడు రెండేండ్ల ధనంతో దాని విలువను చెల్లించుకొనే పద్ధతిమీద అతణ్ని భాగస్వామిని చేద్దామనుకొన్నాడు. ఇందుకు అలా జరిగితే తాను కంపెనీతో ఒకడైపోవటంచేత తనకు కార్మికులకు మధ్య వుండే సంబంధం చెడిపోతుందని జోన్స్ అభ్యంతరం చెప్పాడు.

అతడు "వారు నేను ఏవో పోకిళ్లు పోతున్నా" నను కొంటా రన్నాడు.

"అయితే ఇందుకు నీ సూచనఏమిటన్నాడు ? కార్నెగీ. చాలా పెద్ద మొత్తం మీరు జీతంగా నా కివ్వవచ్చు అని అతడు సమాధాన మిచ్చాడు.

"మంచిది. ఆ పని చెయ్యి" అని బల్లగుద్దాడు యజమాని.

"ఇప్పటినుంచి నువ్వు అమెరికా అధ్యక్షు డెంత జీతం తీసుకుంటాడో అంత తీసుకో. అది సంవత్సరానికి యాభై వేల డాలర్లు."

"అది కేవలం చెప్పుకోటం మాత్రమే ఆండీ అన్నమాటే బిల్ ఇచ్చిన అంగీకారం.

సౌమ్య స్వభావుడయినా ఎళ్ళ వేళలా కార్నెగీ పొడిచి పని చేయిస్తుంటాడు, అభివృద్ధులను గురించి, ఇతర విషయాలను గురించి రిపోర్టులు అడుగుతుంటాడు. "ఉక్కును ఉత్పత్తి చేయటంలో గడచినవారం మనంపూర్వపులెక్కలను అన్నింటినీ అధిగమించాయి" అని తెలియ జేస్తే అతడు సమాధానమిస్తూ "శుభా కాంక్షలు. ప్రతి వారం మన మిలా ఎందుకు చెయ్య గూడదు" అని అడగడమో లేక విలువల పట్టికలను [Cost Sheets] పంపమనటమూ చేసేవాడు. "8 వ నెంబరుకొలిమి ఈ రోజున పూర్వపు రికార్డు నంతటినీ మించింది" అని తెలియజేస్తే "వెంటనే మిగిలినవి ఏంచేస్తున్న"వని ప్రశ్నించేవాడు. బిల్‌జోన్స్ ఈ సోదిపోట్లతో కొన్ని సమయాలల్లో నలిగిపోతుండేవాడు. విపులమయిన రిపోర్టులు, మూల్యపట్టికలుతయారు చెయ్యటమంటే అతనికి అసహ్యం. అతడు గొప్ప ఉక్కు నిర్మాత; కానీ గణనాంక (Statiscics) మంటే అతనికి తలనొప్పి. తని వేసగి యాత్రలను గురించి చెపుతూ, ఒకమాటు కార్నెగీ అతనితో "నేను ఎంత అలసిపోయినా స్టీమ రెక్కిన తరువాత అర్ధగంట గడిచి నూజర్సీ ఉన్నత భూములు నా వెనుక క్షితిజరేఖలోకి దిగజారినవంటే నా బాధ్యతలు, అలసట నన్ను విడిచి జారుకుంటాయి. బిల్, అది ఎంత ఉపశమనమో నీకు తెలియదు" అన్నాడు.

"అది మిగిలిన మా అందరికీ ఎంత ఉపశమనమో నీకు తెలియదు" అని సరసత లేని ఆ కెప్టన్ జోన్స్ బదులు పలికాడు.

యజమాని కార్యాలయానికి రిపోర్టులను తీసుకొని రావలసిన ఒక రోజున బదులుగా ఆరడుగుల ఎత్తు సరివాడు, తేజో వంతుడు అయిన ఒక యువకుడు హాజరై కెప్టెన్ పంపితే వచ్చానన్నాడు. అతడు సంక్షిప్తరూపంలో వున్న రిపోర్టును అందిస్తే తల యెత్తబోయేముందు కార్నెగీ కొద్ది క్షణాలునిశ్శబ్దంగా పరిశీలించాడు.

"కర్మాగారాన్ని గురించి నీ కంతా తెలుసునని కెప్టన్ అంటున్నాడు" అన్నాడు కార్నెగీ.

"ఔను. దాన్ని గురించి నాకు బాగా తెలుసును"అని ఆ యువకుడు సమాధానం చెప్పాడు. అందమయిన చిరునవ్వు యధాప్రకారంగానే ఆతని ముఖాని కందా న్నిచ్చింది.

"నీ పేరేమి" అంటూనే మహావ్యాపారి కెప్టెన్ వ్రాసిన చీటికి క్రింద భాగాన్ని చూస్తున్నాడు.

"ఛార్లెస్ యం. స్క్వాబ్." "మంచిది. చార్లీ అక్కడ మన స్థితి ఎలావుందో చెప్పు. నాకు చాలు." అన్నా డా వ్యాపార ప్రముఖుడు. విపులమయిన నివేధనను వినటానికి అతడు కుర్చీలో వెనక్కు వ్రాలాడు. నివేదన అతనికి ఆశ్చర్యాన్ని కలిగించేటంత విపులంగా వచ్చింది. ఈ యువకుడు నిశ్చయంగా కర్మాగారాన్ని గురించి అంతా తెలిసినవాడు. కార్నెగీ ఎన్నో ప్రశ్నలను కురిపించాడు. అతడు వెంటనే అన్నిటికీ పూర్తిగా సమాధానం చెప్పాడు. ఈ మధ్యకాలంలో కార్నెగీ అతని ముఖం ఎక్కడో కొంత పరిచితమయినట్లు తోచింది.

"మనం పూర్వం ఎప్పుడయినా కలుసుకొన్నామా?" ఇది తరువాతి ప్రశ్న.

"ఔను, క్రెస్సన్‌లో మీ గుర్రాన్ని పట్టుకుంటుండే వాణ్ని."

అక్కడే, ఆ క్షణాన క్రొత్త భాగస్వామి ఇంకొకడు ఏర్పడ్డాడు.

ఉక్కు వ్యామోహం ఆకర్షించటంవల్ల స్క్వాబ్ పద్ధెనిమి దేళ్ళ వయస్సులో బ్రాడ్డాక్ వరకు వచ్చి, అక్కడ ఒక చిల్లరకొట్టులో వుద్యోగానికి కుదిరాడు. అప్పుడు అతడు కెప్టెన్ జోన్సుకు నిత్యం చుట్టలు సప్లయి చేస్తుండేవాడు. "కెప్టన్ జోన్సు, మిల్లులో నా కేదైనా వుద్యోగ మివ్వగలవా?" అని ఒకరో జాయనను డడిగాడు.

అప్పటికే జోన్స్‌కు ఆ యువకుడిమీద ప్రీతి ఏర్పడి వుంది. "యేమిటి? చార్లీ తప్పక యిస్తా" నన్నాడు. అది అంత చులకనగా జరిగిపోయింది. తెలుసుకొంటున్న కొద్దీ అతడు చార్లీని మెచ్చుకోటం ప్రారంభించాడు. స్క్వాబ్ మంచి బుద్ధికుశలత కలవాడు. పనివిషయంలో అలుపంటూ ఎరగడు. శ్రద్ధ వివేషం, జీవించి వున్న వారిలోకల్లా మనోహరమయిన వ్యక్తి. వెంటనే అతడు వుక్కును నిర్మించటాన్ని గురించిన రసాయనిక శాస్త్రగ్రంథాలు చదవటం ప్రారంభించాడు. కెప్టన్ బిల్ అన్నట్లు అనతికాలంలోనే అతడు ఆ కర్మాగారాన్ని గురించిన అన్ని విషయాలు తెలుసుకొన్నాడు. ఇతని వంటి వ్యక్తులే కార్నెగీకి ప్రీతిపాత్రులు కాగల అర్హతగలవాళ్లు. తొలి సమావేశమయిన క్షణంనుంచీ అతడు ఆ వుక్కు రాజు 'బాలు'లో ఒకడయినాడు. తుదకు వారందరికంటే అతడికి అతి సన్నిహితుడయినాడు. జోన్సు అతనికి వుద్యోగ మిచ్చిన తరువాత ఆరునెలలలోనే స్క్వాబ్ భ్రాడ్డాక్‌లో అసిస్టెంటు మేనేజరయినాడు. అతడు కేవలం స్వశక్తివల్ల ఆస్థానాన్ని సంపాదించుకున్నాడు. తరువాత ఐదు సంవత్సరాలకు కెప్టెన్ జోన్సు కర్మాగారంలో కలిగిన ఒక హఠాత్సంభవంవల్ల మరణించినప్పుడు చార్లీ హోమ్‌స్టెడ్ కర్మాగారానికి సూపరింటెండెంటు అయినాడు. అతని పర్యవేక్షణక్రింద ఉత్పత్తి ప్రశంసనీయంగా పెంపొందింది.

కార్నెగీ తరువాత ఒక కాంగ్రెషనల్ కమిటీలో ప్రసంగిస్తూ "మిష్టర్ స్క్వాబ్ ఒక మేధావి. అతనితో సమానమయినవాణ్ని నే నెన్నడూ కలుసుకోలేదు!" అన్నాడు.

అనేక సంవత్సరాలల్లో అనేకమంది యువకులకు భాగ స్వామ్యం ఇచ్చినట్లే తరువాత స్క్వాబ్‌కు కూడా భాగస్వామ్య మిచ్చి భాగస్థుణ్ని చేయటం జరిగింది. అతనికోసం కార్నెగీ కార్పొరేషనులోని కొన్ని వాటాలను అసలు విలువకు అమ్మటం జరిగింది. వాటినే స్టాక్ ఎక్‌స్చేంజిలో పెడితే ఎంత వచ్చేదో చెప్పటం కూడా జరగ లేదు. డివిడెండ్ల నుంచి ఈ డబ్బును అతడు అతి వేగంగా చెల్లించాడు. అతడు తరువాత మహా భాగ్యవంతు డయినాడు. ఇలా ఎన్నుకోబడ్డ యువక భాగస్థులందరూ భాగ్యవంతులయినారు. కార్నెగీ గ్లౌసెస్టర్ ఫిష్షింగ్ ప్లిట్ తన దృష్టిలో ఆదర్శమయిన వ్యాపార సంస్థ అని చెపుతుండేవాడు. అందులో జీతంపుచ్చుకొనేవాళ్ళంటూ లేరు. అందరూ లాభాలు పంచుకునే వాళ్ళే.

మనుష్యుల గుణ నిర్ణయం చెయ్యటంలో కార్నెగీ మహా ఘటికుడు. అతడు ఒకణ్ని మంచివాడని నిశ్చయించుకున్న తరువాత అతడిమీద గొప్ప విశ్వాసముంచేవాడు. స్క్వాబ్ మీద అతడుంచిన విశ్వాసం దరిదాపుగా పరిపూర్ణమయినది. అతని పై అధికారిని కార్నెగీ స్క్వాబ్‌ను క్రొత్త కన్వర్టింగు మిల్లును కట్టనీయవలసిందని త్వరపెట్టాడు. "ఆమిల్లును నిర్మించటంవల్ల మనం టన్నుకు యాభై సెంట్ల ఉక్కును పొదుపు చెయ్యగల"మని అతడు వాగ్దానం చేశాడు.

అది కార్పొ రేషన్ దేశంలో మిక్కుటంగా ధనమున్న సమయం కాదు, అయినా తుదిమాటగా కార్నెగీ "మంచిది. సాగిపొండి!" అన్నాడు. మిల్లును నిర్మించటం జరిగింది. ఒకనాడు యజమాని దానిని చూడవచ్చాడు. ఎప్పటిలాగానే తేజస్సుతో, పొంగిపొరలే ఆత్మవిశ్వాసంతో మోయవలసివున్న మహాకార్య భారాన్ని వహించే ఉత్సాహంతో స్క్వాబ్ తనకు కనిపిస్తాడని అతడు ఆశించాడు. కానీ, కార్నెగీ అన్నిటినీ పరిశీలిస్తూ నడుస్తున్నప్పుడు అతడి కుశాగ్రమయిన బుద్ధి స్క్వాబ్ ఉయ్సహంతో లేడని గమనించింది. చార్లీ అక్కడ కేవలం ఉద్యోగానికి వున్న ప్రదర్శకుడు (Guide) లా వున్నాడు. ఏదో నిత్యం గడచిపోతున్న పనిలాగానే ఈడ్పుగొట్టు ధోరణిలో అతడికి విషయాలను తెలియ జేస్తున్నాడు.

చివరకు ఆ ప్రముఖు డన్నాడు: "చార్లీ, ఇక్కడ ఏదో లోపం కనిపిస్తున్నది. నీ కేదో ఆశాభంగం కలిగినట్లు నాకు తోస్తున్నది. ఈ కర్మాగారంలో ఏదో దోష మేర్పడ్డది. అటువంటిదేమీ లేదా?"

"లేదు కార్నెగీ!" అని సమాధానమిచ్చాడు స్క్వాబ్.

"ఇది ఎలా వుంటుందని నేను చెప్పానో అలాగే వచ్చింది. నేను చెప్పినట్లు మనం ఖరీదులు తగ్గించుకున్నాము అయితే, దీన్ని నేను మళ్లా నిర్మించమంటూ వస్తే కొద్దికాలానికి పూర్వమే క్రొత్తగా కనిపెట్టబడ్డ మరొకదాన్ని ప్రవేశపెడతాను. అందుమూలంగా మనం టన్నుకు పది సెంట్లు కాదు, డాలరు పొదుపు చేసుకోవచ్చును" అన్నాడు.

"అయితే నీ అభిప్రాయ మేమిటి? ఈ మిల్లును నీవు మార్చగలవా?" ఒక మధ్యాహ్నంవేళ జరిగిన సంఘటనను గురించి చెపుతూ స్క్వాబ్ తరువాతి కాలంలో ఎంతో సంతోషింస్తుండేవాడు. స్క్వాబ్ తానే న్యూయార్క్ చేరిన తరువాత ఒక వ్యాపార విషయాన్ని గురించి కార్నెగీ సలహాను పొందటం కోసం అతని యింటికి వెళ్లాడు. అలా వెళ్ళినది యింకా స్వయంచోదకాలయిన బండ్లు ఏవీ లేని రోజులు. అతడు తనకు సహజమైన రీతికి తగినట్లుగా అందమయిన "కాబ్"ను గాని, లేదా ఒంటి గుర్రపు బండిని గాని పిలవకుండా ఒక "కారేజి"ని పిలిచాడు. యజమానితో మాట్లాడటానికి యింట్లోకి వెడుతూ శకట చోదకుడితో వేచివుండవలసిందని చెప్పాడు. వాళ్ళ సమావేశం అనుకున్న దానికంటె ఎక్కువసేపు పట్టింది. చివరకు అతణ్ని తనతో భోజనానికి వుండిపొమ్మని కార్నెగీ ఆహ్వానించాడు. బండిని గురించి పూర్తిగా మరచిపోయి చార్లీ ఆహ్వానాన్ని అంగీకరించాడు. భోజనానంతరం తన సంభాషణను యింకా పొడిగించాడు. చివరకు బట్లరు వచ్చి ద్వారం దగ్గర నిలచి అన్నాడు.

"క్షమించండి మిస్టర్ స్క్వాబ్ బండిని మీరు యింకా వుండమంటారా?" చార్లీముఖం బీటు దుంపలా ఎర్రవారిపోయింది. తిరిగి స్వస్తాయిని పొందేలోగా అతడు కలవరపాటును పొంది మాటల్లో నోటితుంపరలు రాల్చాడు. అతని పూర్వ యజమాని ఒక మాటయినా అనలేదు. ఊరక కూర్చుని హఠాత్తుగా తోచిన హాస్యాస్పదమయిన అభినయంతో అతనివైపుచూశాడు. మాటలతో పనిలేకపోయింది.