అహల్యాసంక్రందనము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

అహల్యాసంక్రందనము


సముఖము వేంకట కృష్ణప్పనాయకుఁడుసర్వస్వామ్యములును

మచిలీపట్టణము

శృంగారకావ్యగ్రంథమండలివారివి.

శ్రీకామేశ్వరకవి సత్యభామాసాంత్వనమును బ్రకటించునప్పుడే మాకు, మధురనాయకుల యాదరణమున వర్థిలిన సారస్వతమును తెలుఁగునాట వ్యాప్తిగావించవలయుననెడి తలంపుగల్గినది. తంజావూరు మహారాజుల రాసిక్యము చలువను వెలసిన కావ్యగ్రంథములు, చాలకాలముక్రిందనే ముద్రితములై జనాదరణమును బడసినవి. మధురవాఙ్మయమునకు, మాయోపిన సేవలనొనరించి, యుధ్ధరించుటకు సారస్వతాభిమానుల ప్రోత్సాహ, ఆదరణముల నర్ధించెదము.

విజయరంగచొక్కనాథుని దళవాయిగా నుండిన వీరరాహూతుఁడు సముఖ వేంకటకృష్ణప్ప నాయకుఁడు, స్వయముగా కవియై, కవులను పోషించుచు, తెన యేలిక జాడలను, వదాన్యత్వవైఖరుల ననుగమించి, చిరప్రతిష్ఠనందినవాఁడు. అతనికృతులతో మిగుల నుత్తమమగు నహల్యాసంక్రందనము పాఠకులకు, శృంగారకావ్యగ్రంథమండలి తృతీయప్రచురణముగా నందించుచున్నారము. మఱియు, ననుబంధములుగా నాకవియే రచియించెనన్న రాధికాసాంత్వనమను నేకాశ్వాస శృంగారప్రబంధమును, వచన సారంగధర నుండి, యాతని రచనానైపుణిని జదువరు లెఱుంగుటకు రసవద్ఘట్టము నొకదానిని, వచన జైమినిభారతము నుండి, ఆంధ్రసాహిత్యపరిషదధిపతులు, శృంగారమయమని, తమప్రచురణమున విడిచిన భాగమును—నీమూఁటినిఁ గూడ చేర్చినారము.

గ్రంథపాఠపరిశోధనావసరముల మా కత్యంతము నుపకారకులైన మిత్రుల కియ్యెడఁ గృతజ్ఞతఁ దెలుపవలసియున్నది. శిరోమణి తిరుమల వేంకట రంగాచార్యులవారు (ఆంధ్రపత్రికాకార్యాలయము, మదరాసు.) ప్రాచ్యలిఖితభాండాగారమునందున్న రెండుప్రతులను బట్టి మా 'అహల్యాసంక్రందనము’ ను బరిష్కరించుట యే గాక, రాధికాసాంత్వనమును వాసి పంపినారు. శతాధికగ్రంథక ర్తలగు మద్దూరి శ్రీరామమూర్తి కవిగారు, తీరిక జేసికొని, మాకోరికను మన్నించి, ఆంధ్రసాహిత్య పరిషత్భాండాగారమునుండి, రాధికాసాంత్వనము, సారంగధర, జైమినీభారత భాగములను, శ్రమపడి, వ్రాసి యొసఁగినారు. సాహిత్యపరిషత్ గౌరవ కార్యదర్శి యగు శ్రీకొత్తపల్లి సూర్యారావుగారు, మాకు వలసిన గ్రంథములు వ్రాయించుకొనుటకు, తగిన సదుపాయములు చేసినారు. ఈసారస్వతజీవను లందరకు మావినతులు మఱి యొకమా రెఱుకపఱచుచున్నాము.

ఆంధ్రసాహిత్యపరిషత్తు భాండాగారమునందలి,
సారంగధర చరిత్ర వచనము (శిధిలమైన ప్రతి) నెం. 62
అహల్యాసంక్రందనము (అసమగ్రము) నెం. 2
వచన జై మిని భారతము నెం. 142, 308
రాధికాసాంత్వనము నెం. 177
ప్రాచ్యలిఖితపుస్తక భాండాగారమునందలి,
రాధికాసాంత్వనము కాగిత ప్రతి నెం. R 199
అహల్యాసంక్రందనము కాగిత ప్రతి నెం. D 386
                           తాళపత్ర ప్రతి నెం. D 887

—పై వాని ఆధారమున, ముఖ్య ప్రబంధమును, అనుబంధములును బరిష్కృతములై ముద్రణము నందినవి. సారస్వతాభిమానులయొద్ద నింక పాఠభేదములుగల ప్రతులున్న మాకు దెలియఁజేసిన ద్వితీయముద్రణమున వానిఁ జేర్చెదము మఱియు నిటువలె నుత్తమశ్రేణికి జెందిన యముద్రిత ప్రబంధములను సాహితీపరులు మాకు దయతో నొసఁగిన వానిఁ బ్రకటించుట కెల్లప్పుడును సంసిద్ధులము.

చదువరులు, మాకృషికిఁ దగిన దోహదమును సర్వదా యొసఁగుచు నితోధికముగా మాచే నాంధ్రవాణి నర్చనల నోలలాడించి చరితార్థతం బ్రసాదింతురుగాక, యని మనవి.

వ్యవస్థాపకుఁడు.