అహల్యాసంక్రందనము/ద్వితీయాశ్వాసము
శ్రీరస్తు
అహల్యాసంక్రందనము
ద్వితీయాశ్వాసము
శ్రీకనకవిమానాంతర
కాకోదరరాజతల్ప కలితాపేక్షా
శ్రీకనకాంగీప్రేమ ధు
రాకలితవిశాలవక్ష రంగాధ్యక్షా!
వ. అవధరింపుము.2
క. ఆయెడ నవ్వలికథ సౌ
ఖ్యాయతి జనమేజయుండు కరుణింపుమనన్
ధీయుతవర్యుఁడు వైశం
పాయనుఁ డిట్లనుచుఁ బలికెఁ బరమప్రీతిన్.3
ఉ. ఆమెయిఁ జిన్నినవ్వు వదనాబ్జనివాసినియైన చానకున్
గోమలకాంతి వింతమెఱుఁగుల్ ఘటియింప విరించి యిట్లనున్
″సేమమె నీకు సర్వసురశేఖర! భద్రమె దేవకోటికిన్,
ధీమహితుల్ మునుల్ సఖులె, నీ విటువచ్చిన దేమి?" నావుడున్.4
ఉ. "స్వామికటాక్షవీక్ష లనిశంబును గల్గుటఁజేసి యేమెయిన్
సేమమే మాకు సర్వసురశేఖర! నే నొకప్రశ్న చేసెదన్
నీ మును సృష్టిసేసిన యనేకవిధప్రమదాజనంబులో
నేమదిరాక్షి చక్కనిది యేర్పడ నానతియిమ్ము” నావుడున్.5
క. మోమునఁ జిఱున వ్వెలయఁగఁ
దామరచూ లనియె నముచిదమనునితోడన్
"నామనసుకు సరిపోయిన
భామామణిఁ గాన నీప్రపంచములోనన్.6
సీ. "రంభ యెన్నఁగ జడప్రాయ యూర్వశి నల్పు
జీవంబు లేనిది చిత్రరేఖ
వామన పొట్టిది వక్రాంగి శశిరేఖ
హరిణి యటంటిమా యడవిమెకము
గానుగరోల్ చాయఁ గను నత్తిలోత్తమ
పగలు చూచినచో నభాస తార
ధాన్యమాలిని మోము దర్శించిన ఖరంబు
పాండువుమేనిది పుండరీక
తే. నాగకన్య లటంటిమా నడలు కుంటు
తక్కువారలచందంబుఁ దలఁపనేల
ముజ్జగంబులలో నున్న ముదితలందు
నొచ్చె మొకయింత లేనిది యొకతె లేదు!7
సీ. "కన్నులైతే సరే, కన్నవిన్నదిగాని
మించుఁదళ్కులు గ్రుమ్మరించవలదె!
చన్నులైతే సరే, స్మరరాజ్యపట్టాభి
షేకకుంభంబులై చెలఁగవలదె!
వదనమైతే సరే వరమనోహర్షాబ్ధి
శరదిందుబింబమై మెఱయవలదె!
రూపమై తేసరే, చూపరకనులకు
నిర్వాణసౌఖ్యంబు నింపవలదె
తే. కాంతయైనంత సరియె నిష్కాముఁ డైన
మౌనివరునైన మరునిబందానుగాఁగఁ
జేయవలవదె యిటువంటి చిన్నిచాన
ముజ్జగంబులలోఁ గాన బుధనిధాన!8
మ. “కుదురై యొప్పులకుప్పయై తనువునం గోరంత యొచ్చెంబు లే
నిదియై నొవ్వని జవ్వనంబు గలడై నిద్దంపుటొయ్యారియై
మదనోజ్జీవితయై గరాగరికయై మాణిక్యపుంబొమ్మయౌ
మదిరాక్షిన్ సృజియింతు నే నొకతె మ న్మాహాత్మ్యమున్ జూడుమా!"9
క. అని పలికి పద్మగర్భుఁడు
తనగురుఁ డగు బద్మనేత్రుఁ దలఁచి ప్రయత్నం
బొనరఁ జతుర్దశలోకీ
వనితాజనతాతిశయిత వైఖరి యెసఁగన్.10
సీ. చందురులో మైల జలజంబులో దువ్వ
యూడ్చి పోఁద్రోచి రెం డొకటి సేసి
అరుణాశ్మకాఠిన్య మమృతపాండుగుణంబు
నుడిగించి యారెంటి నొకటి సేసి
అరులజో డెడయించి గిరులప్రతాపంబు
పెకలించి యారెంటి నొకటి సేసి
యిభతుండచాంచల్య మిల ననంటులజాడ్య
మొడిచి యారెంటిఁ దా నొకటి సేసి
తే. కులుకునెమ్మోము కెమ్మోవి గుబ్బచన్ను
లరిదియూరులు నిర్మించి యంగజునకు
వింతకైదువుగా నొక్కదంతిగమన
నబ్జభవుఁడు సృజించె నహల్య యనఁగ.11
వ. ఇట్లు నిర్మించిన.12
ఉ. అంబుజగంధి చక్కఁదన మల్లనఁ గన్గొని విస్మితాత్ముఁడై
యంబుజనేత్రుఁ డప్పుడు త్రియంబకభావముఁ గోరె నాతఁ డ
ష్టాంబకలీలఁ గోరె మది నాతఁడు గోరె సహస్రలోచన
త్వంబు నతం డనంతనయనత్వముఁ గోరె మఱేమి చెప్పఁగన్.13
చ. వనితను గాంచి రంభ తల వంచెఁ, దిలోత్తమ మోము నల్లచే
సెను, శశిరేఖ లోఁగమలెఁ, జేష్టలుదక్కెను జిత్ర రేఖ, కాఁ
కనొగిలె హేమ, మైమఱపు గాంచె మదాలస, తగ్గుఁ జెందె వా
మన, కరఁగెన్ ఘృతాచి, యవిమానత మేనక గాంచె నెంతయున్.14
సీ. రాజయోగారంభరతులైన యతులైన
వదనంబుఁ గని పారవశ్య మొంద
వరకుండలీంద్రభావనులైన మునులైనఁ
జికురపాశముఁ గాంచి శిరము లూపఁ
బద్మసనాభ్యాసపటులైన వటులైన
బదకాంతిఁ గన్గొని ప్రస్తుతింప
నిర్గుణపరతత్వనిధులైన బుధులైన
నవలగ్నలతఁ గాంచి యాసఁ జెంద
తే. వినుతసకలాగమాంతవాసనలు గన్న
ధన్యులైనను నెమ్మేనితావిఁ గోర
నలిససంభవుకడ నిల్చె నయనవిజిత
ముగ్ధసారంగి యాజగన్మోహనాంగి.15
ఉ. బాలకురంగనేత్రి నునుఁబల్కులకున్ విరివింటివానిబా
బాలకువాదు పెన్ దొడల బంగరురంగుమెఱుంగు లంటికం
బాలకు రాదు నెమ్మొగము బా గలపున్నమచందమామ దం
బాలకుమీఁదు దానిసరిబాలిక లేదు జగత్త్రయంబునన్.16
క. కుందరమా దంతావళి
మందరమా చన్నుఁదోయి మై[1]జగ్గుజగా
హొందరమా యాభామిని
ముందర మానినియుఁ గలదె ముజ్జగములలోన్.17
ఆ. తూపు రూపుమాపుఁ దొయ్యలి నునుజూపు
సోముగోయు నోము భామమోము
కెంపుసొంపు నింపు శంపాంగియధరంబు
గౌరు సౌరు దేరు కలికినడలు.18
ఆ. లతల వెతలఁ బెట్టు లలితాంగినునుమేను
కలువఁ గెలువఁజాలుఁ జెలువచూపు
శుకముమొగముఁ గొట్టు సుకుమారిమాటలు
దరముఁ దఱుము లీలఁ దరుణిగళము.19
సీ. గిండ్లుగా గజనిమ్మపండ్లుగా బంగారు
చెండ్లుగా నింతిపాలిండ్లు దనరుఁ
గావిగా నమృతంపుబావిగా రుచిఁ దేనె
క్రోవిగా నలివేణిమోవి దనరు
రూపుగా మరుచేతితూపుగా సిరులకు
బ్రాపుగాఁ బూఁబోణిచూపు దనరుఁ
గుల్కుగాఁ గపురంపుఁబల్కుగా రాచిల్క
కళ్కుగా లతకూనపల్కు దనరు
తే. తమ్ము లనుకొనుఁ దమ్ములఁ గొమ్మముఖము
సరులు నీలంపుసరులకుఁ దరుణిగురులు
వింటికొనలకు సమము వాల్గంటిబొమలు
వర్ణితములౌనె శ్రీ లింతికర్ణములకు.20
సీ. పల్లవమ్ములకాంతినెల్ల వమ్ముగఁ జేయు
కామినీపాదపంకజము నిజము
తామేలుసొగసు న న్నేమేలు ననిమించు
బింబాధరీప్రపదంబుడంబు
వరిపొట్టకఱ్ఱ లావరిపొట్టని తలంచు
కలికిపిక్కలరంగు కలహొరంగు
రంభ మైపట్ట లారంభమంద విదుల్చు
తొయ్యలిబంగారుతొడలుకడలు
తే. చిలువబాగారు నయ్యారె, చెలువయారు!
తొలుకనాకాశతులకౌను చెలియకౌను
లలితపున్నాగముసనాభి లలననాభి
కనకలికుచంబు వరబాలికాకుచంబు.21
క. వరమా కరతల, మిందీ
వరమా కనుదోయి, హంసవరమా నడ, ని
ల్వర మాచెలిఁ గన మరుదే
వరమాయగఁ దనరె లోకవరమా యనఁగన్.22
క. కరమా నునుదొడ, దర్వీ
కరమాజడ, జంఘ మే ల్మకరమా, చపలా
కరమా తనులత, కమలా
కరమా చెయి, చెలిని ధర సుకరమా పొగడన్.23
చ. కినిసి కుచాననాంగరుచి గిన్నెలతో నెలతో లతోన్నతిన్
ఘనకచ కంఠ రూపములు కందరమై దరమై రమైక్యమై
గొనబగు వాక్కటీక్షలటు కోయిలకో యిలకో లకోరికో
వనితనొసల్ వళుల్ నడుము బాలహరిన్ లహరిన్ హరి న్నగున్.24
క. గోరస మాపల్కులరుచి
సారస మాముఖవిలాససంపద మరుచే
నారస మావీక్షణ మళి
కౌరస మాకేశపాశ మబ్దాననకున్.25
శా. బంతే చన్గవ నిగ్గు మేనురుచిపోల్పన్ జాళువామేలుడాల్
దొంతే కన్నులధాళధళ్యరుచు లెంతో కల్వకున్ జూడ మేల్
బంతే కంతునిదంతినేలునడలున్ బాగైన యీభామకున్
ఎంతేలేదు సమాన మెంచుటకుఁగా నీరేడులోకంబులన్.26
సీ. తనుసృజించినబ్రహ్మ తనయంద మీక్షించి
తన్మయత్వము నొంది తత్తరింప
నైష్టికులైన సనత్సుజాతాదులు
మది జల్లుమన హరిస్మరణ సేయ
నధ్యాత్మవిజ్ఞానులైన సన్యాసులు
పరవశులై గగుర్పాటుఁ జెంద
వాణియు నప్సరోవనితాజనంబులు
'మగవారు కామైతి' మని తలంప
తే. ముద్దుముంగుర్లు కొనగోట దిద్దుకొనుచుఁ
దెలివిచూపు లకాలచంద్రికల నీన
నడలుగని ధాతతేజీలు జడనుపడఁగ
బాల్యయావనకల్య యహల్య యొప్పె.27
సీ. 'అమృతాశనాధిపత్యము చెల్లునా దీని
యధర మానక' యంచు నమరవిభుఁడు
'దక్షిణనాయకత్వము పోలునా దీని
రతులఁ దేల్పక ' యంచు రవిసుతుండు
'నవరసరసికత హవణించునా దీని
సారెఁ గూడక' యంచు శరధివిభుఁడు
'సార్వభౌమస్థితి సమకూరునా దీని
వెంట నంటక' యంచు విత్తవిభుఁడు
తే. నలఘుశతకోటికాంక్షలు నతనుదండ
భృతులు నంజనతృష లలకేహితములు
నిన్మడింపఁగ ననిమిషదృష్టు లైరి
అంబుజభవోపలాల్య నహల్యఁ జూచి.28
సీ. కల్కికటాక్షంబు కల్గితేగద తాను
గుసుమాస్త్రుఁడ నటంచుఁ గుసుమశరుఁడు
కొమ్మవాతెఱతేనెఁ గ్రోలితేగద తాను
మధువు నౌదునటంచు మాధవుండు
నెలఁతముద్దుమొగంబు నిమిరితేగద తాను
ఘనకళానిధి నంచుఁ గమలవైరి
సుదతియూరువుతావి సోకితేగద తాను
గంధవాహుఁ డటంచు గాలివేల్పుఁ
తే. దలఁచి రచ్చట సిద్ధగంధర్వయక్ష
చారణాదులు దత్కాంతిపూరవార్ధి
మగ్నులై చిత్రరూపులమాడ్కి నుండి
రంత శచికాంతుఁ డెంతయు నాత్మలోన.29
మ. ఎలమించున్ దులమించు హేమలతయో యీరేడులోకంబులన్
వలపించందగు కామదివ్యకళయో వాంఛన్ ద్రిలోకీదృగు
త్పలనీహారమయూఖరేఖయొ జగద్భాగ్యంబె యీరూపమై
లలిఁ [2]గన్పట్టెనొకాక యింతులకు నీ లావణ్యమున్ గల్గునే?30
ఉ. డంబులు శైలశేఖరవిడంబులు దీనికుచంబు లెన్న నొ
చ్చెంబులువల్కుఁ గుందనపుఁ జెంబుల, నిద్దపుటద్దముల్ గపో
లంబులు, నీలమేఘపటలంబులు పెన్నెరు లౌర, యౌర యా
యంబుజగంధి రత్న మిలయందలి సుందరులందు నెంచఁగన్.31
శా. రేరాజున్ నగుమోముతో వనరుహశ్రీఁ గేరుకందోయితో
బారన్ గొల్వఁగవచ్చు పెన్నురముతో బాగైన నెమ్మేనితో
'నీ రాజెవ్వఁడు సానురాగమున నన్నే చూచుచున్నాఁడు మే
లౌరా సోయగ'మంచు జిష్ణువు నహల్యాభామయున్ గన్గొనెన్.32
క. అప్పుడు పూర్వకకుప్పతి
తప్పక యత్తరుణిఁ జూచె తరుణీమణియున్
ఱెప్పల నార్పక చూచెన్
గుప్పెన్ మరుఁ డిద్దఱన్ లకోరులచేతన్.33
క. జగముల నన్నిటి నేలుచు
నగణితసౌందర్యవిక్రమైశ్వర్యములన్
బొగడొందెడు తనకంటెను
మగువకుఁ దగినట్టి వేఱె మగఁడుం గలఁడే.34
చ. అని తనుఁజూచి తోడనె యహల్యను గాంచి సభాసదావళిన్
గనుఁగొని తాను వేఁడునెడఁ గాదనఁడంచు సురేంద్రుఁ డిట్లనున్
“వనరుహగర్భ మీమహిమ వర్ణనసేయఁ దరంబె యద్భుతం
బనుపమ మక్షిభాగ్యఫలమై సృష్టి యొనర్చి [3]తింతలోన్.35
ఉ. చక్కఁదనాలకుప్పయగు చక్కెరబొమ్మను సృష్టి చేయుటే
యెక్కువగాదు దీని మది కింపగు నాథుని నిర్ణయించినన్
జక్కనితారతమ్యములు సర్వ మెఱుంగుదు వైనఁ దెల్పెదన్
దక్కొరు లెవ్వరుం[4]గలరు తన్వికి నేనొకరుండు దక్కఁగన్.36
క. నరులన్ గిన్నరులన్ గిం
పురుషులఁ జారణుల సిద్ధపురుషుల ఋషులన్
బరికింపుము వీరలలో
విరిబోఁడికిఁ దగినవాఁడు వీఁడని చెపుమా!37
ఉ. ముందుగ నేను వేఁడితిని మున్నుగ నే నినుఁ బ్రశ్న సేయఁగా
నిందుముఖిన్ సృజించితివి యెవ్వరికిన్ బనియేమి దేవరా
జ్యేందిరవోలె బాల ననుఁ జెందుటయుక్తము జాతిరత్నము
కుందనమున్ ఘటించినఁ దగున్ మఱియొక్కటి యొప్పియుండునే."38
క. అనుటయుఁ బకపకనగి య
వ్వనజజుఁ డను “నీకు నీవే వడ్డించుకొనన్
జనునే యిప్పుడు నీ కి
వ్వనిత పొసఁగ దరుగు మగుడ వచ్చినత్రోవన్."39
క. అనిపల్కి యచటనుండెడి
మునులం గని వీర లెల్ల + ము న్నొకతొకతెన్
గొనియుందురు గౌతముఁ డొకఁ
డనఘుఁడు నైష్ఠికుఁడు వాని కర్హ మటంచున్.40
క. అక్షపదున్ భావితకమ
లాక్షపదున్ బిలిచి ధాత “యబ్జదళాక్షిన్
రక్షింపు మిది భవద్వ్రత
దీక్షకు శుశ్రూషఁజేయు ధృతమతి” ననుచున్.41
ఉ. తేఁటిమెఱుంగుముంగురులుఁ దేటకనుంగవ లేఁతకౌనులున్
వాటపుముద్దుమేనులును వట్రువచన్గవ గల్గువారిఁగా
నాటకుఁ బాటకున్ గవిత లల్లుటకున్ దిటమైనవారిఁగాఁ
బాటలగంధులన్ సఖుల బల్వుర నిచ్చి యహల్య కిట్లనున్.42
క. "మునికిన్ దినకరసమధా
మునికిన్ బరిచర్య సేయు ముదితాశయవై
ముని కింశుకవనికిం జను
మునికిన్ నీ కగుశుభంబు లుత్పలగంధీ!”43
చ. అని పనిపంచ మంచిదని యంచితభక్తి విరించికిన్ వచో
వనితకు మ్రొక్కి యక్కలికి వల్గువిభూషణభూషితాంగియై
మునిపతి వెంట నేఁగె సురముఖ్యుని వీక్కొని; యింద్రుఁ డయ్యహ
ల్యను మది నెంచియెంచి మరునమ్ము లురమ్మున డుస్సి పాఱఁగన్.44
క. అమరావతికిన్ వెసఁ జని
యమరావలిఁ బనిచి కుసుమితారామములో
నమరారిన పువ్వులశ
య్య మరాళిగమనఁ దలఁచి యాత్మగతమునన్.45
ఉ. ఎన్నికలేల నీలమణు లెన్ని సరోజము లెన్ని దొండపం
డ్లెన్ని దరంబు లెన్ని గిరు లెన్ని మృణాళము లెన్ని పొన్నపూ
లెన్ని యనంటు లెన్ని దొన లెన్ని ప్రవాళము లెన్ని రత్నముల్
చెన్నుగఁ గూర్చి యేర్పడిచి చేసెను ధాత తదంగమాలికన్.46
చ. మదనునిపొందుఁ గోరి రతి మానిని నోమిననోములెల్ల నీ
యదన ఫలించెనో యనఁగ నంగనగుల్ఫము లుల్లసిల్లుఁ ద
త్పదము లొనర్చి పద్మజుఁడు పాణితలంబు విదుర్పఁ జిందుత
త్సదమలకాంతిబిందులు రసాలకిసాలబిసప్రసూసముల్.47
చ. మదవతిపాదముల్ దనకు మాతృసమానములంచు ధాత స
మ్మదమునఁ బూజచేసినసుమంబులనన్ నఖపంక్తి యొప్పగున్
మృదుగమనాగమంబు లెలమిన్ బఠియించి యుపన్యసించు చా
యఁ దనరు మంద్రనాదకలహంసకముల్ విలసిల్లు నింతికిన్.48
చ. నవముగ మోముచంద్రుఁడు గనంబడి కప్పురతావిగుప్పెడిన్
రవికనె పిక్కటిల్లెను ఘనస్తనచక్రము లొప్పెఁదారకల్
నవిసెను బాల్యపుంజడదినంబు లటంచని జైత్రయాత్రకై
కవదొన లుంచె నిర్గముగఁ గంతుఁడనన్ జెలిజంఘ లొప్పగున్.49
క. ఊరుయుగం బనుపేరన్
బారెడుబంగారునీటివాఁకను రతియున్
మారుఁడును జిన్నిగరిగలు
సౌరుగ ముంచిరనఁ జెలికి జానువు లమరున్.50
క. కదలికలన్ మలినంబై
కదలికలన్ బొరలువిచ్చు కర్పూరంపున్
కదలికల నవ్వు శశిపా
కదలిక యూరుజిగి తెలిజగాచల్వ రుచిన్.51
క. కుందనపువు గెంటెనపూ
వందంబున ముద్దు గుల్కు నంగన వలరా
మందిరము చంద మెన్నఁగ
సౌందర్యపు మూలబొక్కసం బన నమరున్.52
క. కుందనపుతగడొ బంగరు
కెందమ్మిదళంబొ మిసిమి కేతకిరేకో
చందురుమెకముపదంబొ య
నం దగు కందర్పునగరునారీమణికిన్.53
క. కలదని కొందఱు లేదని
యిలఁ గొందఱుఁ బలుక రెంటి కీరట్టుగ న
చ్చెలికౌను మధ్యమస్థితి
మలయుచునుం డట్లుగాన మధ్యంబయ్యెన్.54
చ. నలువగురోమరాజి యమునానదినారి తదీయవీచికా
వళి వళులయ్యె నందు సుడివర్తులనాభి తదంతరీప మ
చ్చెలియనితంబబింబ మటు చేరువ గన్పడునట్టి రాజనం
బుల పొటకఱ్ఱలున్ మఱియుఁ బోవఁగ నాగెటిచాలు నొప్పగున్.55
సీ. తమ్మిమొగ్గలు గాదు తారావళీహృద్య
శృంగారభంగి నెసంగుకతన
గజకుంభములు గావు కంఠీరవేంద్రావ
లగ్నభంగైకఖేలనమువలన
జక్కవకవ గాదు సరసల నెలవంక
లుంచంగ యోగ్యమై యుండుకతన
శైలేంద్రములుగావు శైలేంద్రగర్వంబు
ద్రుంచునె మున్ను భ్రమించుకతన,
తే. మున్ను శంకరుఫాలాగ్నిఁ బొసఁగఁబడిన
యతను బ్రతికించునట్టి దివ్యామృతంబు
లునుచు బంగరుకలశంబు లనఁగవలయు
వనితకుచములు పొగడ నెవ్వరితరంబు?56
క. తరుణి కరద్వయసామ్యముఁ
బొరయన్ బ్రాయోపవేశ మొనరించెఁ గుశా
స్తరణమునన్ గమలంబులు
ధరణిఁ గుశేశయపదంబు దానం బూనెన్.57
చ. ధరణిని గంధరాహ్వయముఁ దాల్చి కుచాద్రితటోపరిస్థితిన్
దిరముగ నుండి క్రొమ్మెఱుగుఁ దీగె చెలంగఁగ మౌక్తికచ్ఛటా
భరణ మెసంగఁ గంబురుచి పాటిల మోహతమంబు నించి య
మ్మరువపుబంతి యింతికి సుమంగళమౌ గళ మొప్పు మెప్పుగన్.58
మ. సకలాభీష్టము లిచ్చునంచు సుమనస్సందోహముల్ నన్ను నా
యకరత్నంబని యెన్నునట్టి నను నాహా కొమ్మకెమ్మోవి యెం
చకయుండన్ గఠినంబటంచు ననుచింతాభారమున్ మీఁదఁ దా
ల్చికదా వేలుపు మానికంబుగనియెన్ జింతామణీనామమున్.59
క. పగడంబుడంబు వలదను
జిగురాకున్ రాకుమనునుఁ జెలివాతెఱ యా
వగలాడినాస యా సం
పగిమొగ్గన్ బగుల ద్రొక్కుఁ బగ[5]మగలీలన్.60
ఉ. క్రొన్నెలవంకశంక లిడు కుల్కుబొమల్ గని యచ్చకోరముల్
పన్నుగ నొప్పు ఱెప్పల నెపంబునఁ జొక్కపుఱెక్క లార్చుచున్
కన్నులు గల్కికన్నులయి కన్పడె నా జిగిడాలుఁ జూచి యా
కన్నులవింటిరాయఁడు జగంబులు గెల్వఁగ డాలుఁ గైకొనెన్.61
క. నాసా కాంచనకోశచ
కాసాదృగ్విభ్రమంబు కర్ణాటశ్రీ
భాసురమై చెలిమోము వి
భాసిల్లెన్ రాజరాజపట్టాంచితమై.62
చ. అలికచమోముఁ బోలను సుధాంశుసరోజము లొక్కపుష్కర
స్థలమునఁ బ్రార్థనల్ సలుపఁ జంద్రుఁడు పొందెఁ బ్రసాద మంతలో
పల బహురాజపానమధుపస్పరిశంబున యోగభంగమై
జలజమటుండెఁ గానియెడం జందురునిం గని సైఁచియుండునే?63
ఉ. భామినియారు సూదిమొనపైని జనుంగవపోక లుంచి యా
పై మఱినిల్చి కంఠము తపస్థితి నబ్జత నొందె మోవియున్
దా మదిఁ జూచి యబలను దప్పక పొందె మొగంబు నట్లనే
యేమఱకబ్జతం బడసె నింపుగఁ గన్గవ చెందె నబ్జతన్.64
చ. తొలి నవపత్రమై పటిమ దోఁపమిచే శతపత్రమై చలం
బెలయ సహస్రపత్రమయి యింతిపదంబులు దాఁకి తోడనే
దళములఁ బాసి రోసి బిసదండముఁ జెండెఁ గముండ లుత్తగన్
నలినము హంస సంగతి దినంబునుగాంచు నభీష్టయోగమున్.65
ఉ. మారుఁడు లోకముల్ గెలిచి మాతృగృహంబున నుంచె జైత్రతూ
ణీరము లన్నయట్లు తరుణీమణిపాదయుగంబుమీఁద జం
ఘారమఁ జూడ నొప్పె నటుగాకయ హేమమయోరుకాండముల్
మీఱునె తత్సమీపమున మించి సమంచితశైత్యసంపదన్.66
ఉ. అంబుజగంధి యూరువుల యందముతో సరిబోరవచ్చి హే
రంబు గజేంద్రహస్తము తిరంబుగఁ జెందెను దంతభంగ మ
య్యంబరదంతిరాట్కరము నభ్రముఁ బట్టుక ప్రాఁకు దాని చే
తంబడు నంటికంబములుఁ దార్కొనినం దలవంపు లౌఁగదా!67
తే. చిన్నిపదముల హలరేఖచేత సీత
దీలుపడు కౌనుచేత విదేహజాత
గోముమీఱినకటిచేత భూమిపుత్త్రి
యనఁగ విలసిల్లు నయ్యింతి యతనుదంతి.68
క. కురులో యొమ్మగు తుమ్మెద
గఱులో చకచకితకాంతఁ గనునీలపురా
సరులో యిందీవరపున్
విరులో యిరులో యనంగ వెలఁదికి నమరున్.69
తే. తూండ్లు భుజములు జాళువాగిండ్లు గుబ్బ
లేండ్లుపదియాఱు నెన్నఁటి కెన్నటికిని
విండ్లు కనుబొమ లౌర, యీవెలఁది వేడ్కఁ
బెండ్లియాడినఁగద నేను బెంపుగాంతు.70
ఉ. మాయురె! తత్సమాన యగు మానినిఁ గాన జగంబులోన నా
హా! యిటువంటి చక్కదన మవ్విధి యెవ్విధిఁ జేయనేర్చెనో
హాయిరె! బాలచూపుతుద లక్కట జక్కడపున్ మెఱుంగులై
నాయెద డుస్సిపారె రతినాథుని యాధునికాస్త్రవైఖరిన్.71
సీ. మెలఁత మైజిగిఁ బోలు మెఱుపుఁ జూచెదనన్న
నింపొందఁ గందోయి యెదుట నిలదు
సఖిమోము సొబగొందు చంద్రుఁ జూచెదనన్న
మబ్బు నిబ్బరముగా మరుగువడెను
చెలిగుబ్బసరి జక్కవలను జూచెద నన్న
బక్షపాతము గల్లి బైటఁ దిరుగు
మగువ యా రీడుపన్నగముఁ జూచెదనన్న
బిలములోపల నుండి వెడలు టరుడు
తే. వనిత యవయవసాదృశ్యవస్తువులను
జూచియేనియు నొకపాటిసుఖముఁ బడసి
చింత మదిలోన నుపశమియింతు ననిన
దానికినిసైత మాబ్రహ్మ తాళఁడాయె.72
చ. తన కది కూతురాయె పురదానవవైరికిఁ జెల్లెలాయె న
వ్వనధిసుతామనోహరుఁ డవాప్తసమస్తమనోరథుండు గా
న నది యలక్ష్యమే నొకఁడ నాతికి నర్హుఁడ నన్నటుంచి బా
పనిపరిచర్య కంపె వలబంగరుబొమ్మను బొమ్మ నేమనన్.73
క. కామునిచర్యల కగు చెలి
కా మునిచర్యలకు వగునె యకటా మాధు
ర్యామలసాహితి రసికశి
ఖా[6]మణికినిగాని మడ్డిగానికిఁ దగునే?74
తే. కమ్మవిల్కానియమ్ముల కుమ్మలించి
నెమ్మి నే వేఁడ నెమ్మది సమ్మతిలక
పొమ్మనియె ముద్దుపుత్తడిబొమ్మ నియక
బమ్మయే వాఁడు పెనుఱాతిబొమ్మగాని.75
చ. మునుకొని సిగ్గుతో నళికి మో మటు ద్రిప్పి కరాంగుళిద్వయం
బునఁ జుబుకంబు నెత్తి నునుమోవిని గ్రోలినఁ నొచ్చె నొచ్చె నం
చని తనలోనఁ బల్కుచు రవంతయుఁ గంతునిఁ దోపనీయకే
కనుఁగవ కింపుసేయు నల కన్యను గూడి చెలంగు టెన్నఁడో.76
చ. మిసమిసలీను మొల్కచనుమిట్టల కట్టిటు కేలుసాచఁగా
దుసికిల నట్టె మిట్టిపడి తొయ్యలి చె య్యటుద్రోయ నెయ్యపున్
గొసరులఁ గుస్తరించి కొనగోటను బొక్కిలిఁ జీఱి మెల్లనే
యొసపరి నీవి కొగ్గుచు నయో కడువేడుక లందు టెన్నఁడో!77
చ. చనుఁగవక్రేవఁ జూచినను స్వస్తికహస్తము చేతఁ గప్పుచున్
గొనబుగ ముద్దుపెట్టుకొనఁ గొంకుచు మో మటులిట్టుఁ ద్రిప్పుచున్
గనుఁగవ మూసి నాదు రతికౌశలిఁ జూడక సిగ్గువెల్లిలో
మునుఁగుచు నుండు ముగ్ధయగు ముద్దులగుమ్మను జూచు టెన్నడో!78
సీ. సిబ్బెంపుగుబ్బలం జెనకనీయని సిగ్గు
చెనకినఁ బులక లెంచించు తమియు
కొమరైన వాతెరఁ గ్రోలనీయని లజ్జఁ
గ్రోలినచో మరుల్ గొలుపు వలపు
నెఱికొప్పు కెంగేల నిమురనీయనినాన
నిమిరిన వలపున నిలుచు ప్రేమ
బిగిపోకముడి నంట విడువనీయని వ్రీడ
యెనసిన [7]విడువక మనెడు తమక
తే. మెదను సమముగఁ బెనఁగొన హృద్యమైన
మధ్యమవయస్సుముద్దుగుమ్మయును నేను
నందనోద్యానవనసీమలందుఁ గూడి
పొందికలచేత నానంద మొందు టెపుడొ?79
చ. పలుకులలోనఁ బిక్కు లొకపానుపునన్ బొలయల్కచిక్కులున్
కలఁకలు దీఱు మ్రొక్కులును గాటపుఁగౌఁగిటిలోన సొక్కు ల
గ్గలమగు మోవినొక్కులును గామునిసాములనేర్పుటెక్కులున్
గల యల నిండుజవ్వనపుఁ గన్నియమిన్నను బొందు టెన్నఁడో?80
చ. కలఁగి చలించు ముంగురులు కర్ణములన్ నటియించు కమ్మలున్
చిలికెడు చిన్నిక్రొంజెమట చెక్కుల నించుక జరు కొంచెపున్
తిలకము నొప్పఁ బౌరుషరతిశ్రమతాంతవిలోలనేత్ర యా
కలికిమొగంబు నెన్నఁటికిఁ గన్నులపండువు గాఁగఁ జూతునో?81
ఉ. ఇంకొకసారి పోయి హరిణేక్షణ నిమ్మని వేడుకొందునో
పంకజగర్భు నాతఁడు కృపారహితాత్మత నీయకుండెనా
కొంకు దొఱంగి జంగ యిడి క్రూరుఁడు మారుఁడు లీల బాలచూ
తాంకురసాయకానలశిఖావళికిన్ శలభంబుఁ జేయఁడే?82
ఉ. ఆసరసీరుహాక్షిపయి నాసల సాసరివారు నవ్వ ను
ద్వాసితధైర్యతన్ విసివి వాసనవింటివజీరునమ్ములన్
గాసిలుచున్నవాఁడ ననుఁ గన్నడసేసె విధాత యయ్యయో!
దోసము కాదొకో తనకుఁ దొయ్యలి నీయక యిట్టు లేచుటల్.83
సీ. [8]చాన కమ్మనిమోవి చవిఁ గ్రోలఁగల్గితే
మధులక్ష్మి కీ పుష్పమంటపంబు
కలికిమోమున మోముఁ గదియింపఁగల్గితే
యబ్జునకును గమలార్పణంబు
అరవిందముఖికొప్పు నఱుమంగఁ గల్గితే
నీలకంధరునకు నెమలిపించె
కలకంఠిపల్కు లాకర్ణింపఁగల్గితే
హృద్యవాగ్ద్విజుల కభీష్టఫలము
తే. అలికచకుచంబు లంటంగఁ గలిగెనేని
యేడుకొండలరాయని కేను భక్తిఁ
గనకశిఖరము లెత్తింతుఁ గంతుకాఁక
తీరుఁగాక, వయారి నన్ జేరుఁగాక!84
క. అని యనిశముఁ జింతించుచు
ననురాగమునన్ దరంగితాశాశయుఁడై
వనితను మనమునఁ దలఁచుచు
ననిమిషపతి వెండియున్ మహామోహమునన్.85
సీ. మగునపాదములని చిగురుటాకుల నెత్తు
సఖియూరులని కదళికల హత్తు
సతినితంబంబని సైకతస్థలి వ్రాలు
చెలువవళులని వీచికలను దేలు
మెలఁతయారనుచుఁ దుమ్మెదచాలుఁ గని సొక్కు
కలికిచన్నులని జక్కవల నొక్కు
పొలఁతి గళంబని పోకబోదియ నూను
వెలఁదిమోవి యటంచు బింబ మాను
తే. రమణినేత్రంబులని చకోరములఁ జూచు
చెలువకొప్పని నెమ్మికై చేయిఁ జాచు
తెలిసి తోడనె విరహార్తి దిగులుఁజెందు
కుందు నందనమందు సంక్రందనుండు.86
సీ. ప్రతిలేని చిత్తరుప్రతిమ నీడ్వఁగఁ బోయి
ముదిత కాదని యెంచి బెదరి చూచు
తననీడఁ గని కౌఁగిటను జేర్పఁగాఁ బోయి
మగువ కాదని యెంచి వగచి నిలుచు
మొనసి యింద్రాణితో ముచ్చటాడఁగఁ బోయి
మునిరాణి కాదని [9]మనసు నొచ్చు
కనుమూయఁ దోఁచురూపును బట్టఁగాఁ బోయి
తరుణి దబ్బరటంచుఁ దత్త రించు
తే. రమ్మనుచుఁ జీరుఁ జెంతల క్రమ్మిచేరు
మోహ మెదఁ గూఱుఁ గళఁదేరు ముద్దుఁగోరు
గోరికల మీఱుఁ బలుమాఱు మారు దూఱు
నమరవిభుఁ డెట్లు దనరారు నట్టెతారు.87
ఉ. జాదులు సూదులంచుఁ దెలిచల్వలు చిల్వలటంచుఁ గప్రపున్
వేదులు నేదులంచు నెలనిగ్గులు నగ్గులటంచు రాజకీ
రాదులు వాదులంచు మణిహారము భార మటంచు నెంచుచున్
పైదలిపైఁ దలిర్చుతమి పర్వ సుపర్వవరేణ్యుఁ డుండఁగన్.88
ఉ. అచ్చట నాయహల్యయు వియచ్చరవల్లభురూపసంపదల్
మెచ్చుచుఁ బచ్చవింటియెకిమీని లోరికి నిచ్చ నొచ్చుచున్
నెచ్చెలిచాలు గొల్వ సవశనీయహుతాశనధూమమండలా
భ్యుచ్చయవేష్టితాగము తపోవనభాగముఁ గాంచె నంతటన్.89
సీ. ఉంఛధాన్యసమర్పితోర్వరాధీశార్హ
షష్ఠభాగాంకితసైకతంబు
త్రిషవణాప్లుతమౌనిధృతవల్కలాంచల
పృషతచంద్రకవజ్ఝరీతటంబు
మునిబాలకానీతపునరంకురత్కుశ
శ్యామికాకోమలక్ష్మాతలంబు
పృషదాజ్యహోమసమేధమానహుతాశ
ధూమగంధావృతవ్యోమభాగ
తే. మతిథి[10]పూజార్హవస్తుసమార్జనైక
సంగ్రహవ్యగ్రగృహమేధిసంకులంబు
శాంతము నగణ్యపుణ్యనిశాంత మగుచు
శ్రమముల నణంచు గౌతమాశ్రమముఁ జేరె.90
క. జలజాతాసనునాజ్ఞన్
కలకంఠీతిలక మపుడు గౌతమమునికిన్
చెలఁగి పరిచర్య సేయుచు
ఫలకిసలయకుసుమసమిదుపాస యొనర్పన్.91
క. తాళీహింతాళీకం
కేళీవకుళామ్రనారి కేళీకుహళీ
పాళీఘనకేళీవన
మాళీతతి గొలువఁజేరె నాళీకముగాన్.92
చ. అళికచముంగురుల్ గనిన, యబ్జములందలితేంట్లు దూఁఱె దొ
య్యలిపలుకుల్ వినంగఁ బొదలంతట గోయిలదండు చేరె నె
చ్చెలికుచకుంభముల్ గనుచుఁ జెట్లకుఁ జక్రములెల్లఁ బాఱెఁ గో
మలినడయందముల్ దెలిసి మానసమున్ వడిఁ జేరె హంసముల్.93
సీ. అందముల్ త్రిభువనానందముల్ స్మరమూల
కందముల్ సరసమాకందము లివె
తుంగముల్ పుషితసారంగముల్ వాసనా
రంగముల్ లలితనారంగము లివె
చారువుల్ నవకేసరోరువుల్ [11]భాజిత
మేరువుల్ వికసన్నమేరువు లివె
సైకముల్ మధురసానేకముల్ కృతజనా
శోకముల్ పుష్పితాశోకము లివె
తే. పొగడ నెగడిన మొగడల పొగడ లివియె
తుంటవిలుదంట నంటుల నంటు లివియె
కొమ్మచనుగుమ్మ యొమ్ముల నిమ్మ లివియె
కలికి! యీతోఁట చిగురువిల్కానికోట.94
ఉ. బాల నిజంబు నీపలుకు భాసిలుకొమ్మలు కొత్తడంబులున్
రాలు రజంబు మందు బలునారికెడంబులపాళెలు ఫిరం
గీ లలపండ్లు గుండ్లు నళికీరచకోరమయూరపాలి యు
త్కూలబలంబు నై న మరుకోటయె యీయెలదోఁట చూడఁగన్.95
చ. తెలివిరిపొన్నగిన్నియల తేనియమద్యము లాని సొక్కులన్
గులుకుచు మొగ్గచంటిలతకూనలమోవుల నొక్కి ముద్దుకో
యిలపలుకుల్ చెలంగ నల యింతుల పయ్యెద లొయ్యఁదీయుచున్
దిలకపుఁ దావు లంటుచును ద్రిమ్మరి తెమ్మెర గ్రమ్ముఁ గొమ్మరో!96
చ. కుసుమసమూహవాసనలఁ గుల్కెడు నీ లతకూనయొక్క తా
పసతరుఁ జేరవచ్చె నదె పద్మదళాయతనేత్రి, కంటివా
కుసుమసమూహవాసనలఁ గుల్కెడు నీలతకూనయొక్క తా
పసతరుఁ జేరి యుండుటిది పద్మజు నానతిఁ గాదె కోమలీ!97
చ. అమితమరందతోయముల నర్ఘ్యము పాద్య మొసంగియున్ మద
భ్రమరరవంబులన్ గుశలభాషణముల్ సవరించి వేడ్కతో
గమలజుముద్దుకూఁతురని కైకొని నిన్ను వసంతలక్ష్మి ప
క్షముదగఁ బూజ సల్పెడు లసద్బిసతంతుసహోదరోదరీ!98
క. దాడింబపండ్లకై వెస
వేడెంబులు వెట్టెఁ జిలుక విరిబోణీ, నీ
కోడెచనుగుబ్బగవకై
వేడుకఁ బడి తిరుగు నమరవిభుమదిఁ బోలెన్.99
ఉ. అన్నులమిన్న శోకహర మౌట యశోకసమాఖ్యఁ గాంచు నీ
సన్నుతశాఖరాజమును సారెకుఁ దన్నెదవేమి న్యాయమే
కన్నులవింటిబోయకును గైదువు లిచ్చి సమస్తపాంథులన్
మన్నిగొనున్ బలాశి యిది మన్నన కర్హ మటే విలాసినీ!100
క. నుడువుచు నీగతిఁ జడలన్
నడుముల్ బిగియంగఁ జుట్టి నారీనివహం
బెడనంతఁ దన్నుఁ బొగడఁగ
నొడిగట్టెను మారుఁ డఖిలయువధృతిహృతికిన్.101
సీ. మైసిగ్గుసొంపు సంపగివసంతములచే
బ్రమ్ముతుమ్మెదబారుఁ బాఱఁ దరిమి
సంకుమదామోదసహజవాసనలచే
జిలుకల నెల్లదిక్కులకుఁ ద్రోలి
లోలమానాపాంగజాలకశ్రేణిచేఁ
బికజాలములఁ బికాపికలు చేసి
నెఱికొప్పు నెఱకప్పు నీలాభ్రపంక్తిచే
మదమరాళంబుల నదరఁ దోలి
తే. తావియుడివోని విరులు క్షతంబులేని
ఫలములు నచుంబితములైన పల్లవములు
నంచ లంచలఁగలఁచని మంచినీళ్లు,
దరుణి యొసగంగ మునిపతి తపము సేసె.102
ఉ. ఆతరళాక్షియందము మహత్తరమౌ కటిమందమున్ వచో
జాతగళన్మరందము నిజంబగు నెమ్మెయిగంధమున్ బెడం
గౌ తరితీపుచందము మహామునిడెందము నొంపదాయె నం
తే తరుణీవిలాసముల ధీరులచిత్తము దత్తరిల్లునే.103
క. ఆనిష్ఠానిధినిష్ఠయు
భూనుతమగు బ్రాహ్మచర్యమును గాంచి యజుం
డానాతిఁ బెండ్లిసేసెన్
గానేతరధైర్యఖనికి గౌతమమునికిన్.104
చ. సతతము నద్నిహూత్రపరిచర్యయు దేవపితృప్రతోషణం
బతిథిసమర్చనంబు మొదలైన గృహస్తవిధానమెల్లఁ బ్ర
స్తుతమతిఁ జేయు గౌతమునికితోడ నహల్య కృతానుకూల్యమై
స్థితి విలసిల్లఁ గాపురము సేయుఁ బురంధ్రులు సన్నుతింపఁగన్.105
క. వనజాక్షి యిట్టులుండియుఁ
బనిదీరినవేళ నొంటిపాటున బలసూ
దను చక్కఁదనమె తలచున్
వనితల నమ్ముదురె శివశివా యెంతైనన్.106
ఉ. జన్నములందు నింద్రు గుణశంసనముల్ విను సాదరంబుగాఁ
బన్నుహవిర్విశేషములు పాకవిరోధికి నిచ్చమెచ్చుగాఁ
గ్రన్నన సన్నుతింపు శచికాపురమే కద కాపురం బటం
చన్నలినాయతాక్షి తనయందముఁ జూచి శిరంబు నూఁచుచున్.107
ఉ. "వేళయెఱింగి కూడి రతిభేదములన్ దనియించి యల్గినన్
బాళిని బుజ్జగించి రసభావములన్ గరఁగించునాయకుం
డేల యదృష్టహీనలగు నింతులకున్ లభియించు" నంచు నా
లోలవిశాలనేత్ర తనలోపలఁ గుందును వెచ్చనూర్చుచున్.108
మ. ప్రమదారత్న మహల్య యింద్రుని మదిన్ భావించుఁ దోడ్తోన ధ
ర్మము గాదంచుఁ దలంచు నెంచినగతిన్ రానిచ్చునా దైవమం
చు మదిన్ వేసరు నిచ్చవచ్చువిభుతోన్ సొంపొందు టిల్గాండ్ర కే
లమరుంబొమ్మను నాఁడుపుట్టువున నాహా, పుట్టనౌనా యనున్.109
తే. కోరఁదగినట్టి కోరికల్ గోరవలయుఁ
గాని రాయలుగను కలల్ గాననగునె?
పంగుఁడైనట్టి జనుఁడేడ, గంగయేడ?
యొల్ల నీ వట్టివెతలని యూరకుండు.110
మ. అది యట్లుండె సురేంద్రుఁ డంతట నహల్యాయత్తచిత్తంబుతో
హృదయాంతర్గతచింతతో ననుదినోద్రిక్తానురాగంబుతో
గదియంగూడని కాఁకతో నవిజహద్గంభీరభావంబుతో
మదనోన్ముక్తనవాతిముక్తశరసంపాతంబు సైరించుచున్.111
చ. మదనుఁ డనల్పశిల్పకళ మాటికి నేర్పఁగ రాగసంపదల్
కుదురుగ సంఘటించి యవికుంఠితభావనపేరితూలికల్
హృదయపుఁబల్కయందు నవనీరజలోచనరూపవైఖరుల్
విధితముగా లిఖించుచును లేఖవిభుం డనిశంబుఁ గన్గొనున్.112
సీ. అంగతాపముడింద హరిచందన మలంద
నది మేనికాఁకచే నగ్ని యయ్యె
శ్వాసవేగ మణంప జలజ మాఘ్రాణింప
నది కంతుసమ్మోహనాస్త్ర మయ్యె
తనువుచెమ్మట దీర్పఁ దౌషారజల మార్ప
నది మారభోగివిషాంబు వయ్యె
డెంద మారటదీఱ నందనవనిఁ జేర
నది యసిపత్రవన్యాభ మయ్యె
తే. ముల్లుదీసినయెడఁ గొఱ్ఱు మొత్తినట్టు
లొకటి సేయంగఁబోయిన నొక్కటయ్యె
నెంతగ్రహచారమో నిర్జరేంద్రునకును
మకరకేతుమహాదశ వికటమయ్యె.113
సీ. మందారవని కేగు మందారవనిలోన
డెంద మానందంబు నొందకున్న
మందాకినికి నేగు మందాకినీతటి
మారజ్వరనిదాఘ మారకున్న
మందరగిరి కేఁగు మందరగిరియందుఁ
బొందికగాఁ బ్రొద్దువోవకున్న
బిందుసరసి కేఁగు బిందుసరస్సులో
నారాటమింతేనిఁ దీఱకున్న
తే. బుడమి కేతెంచి గౌతమమునివరేణ్యు
నాశ్రమంబున కేఁగి యహల్యమేని
కమ్మనెత్తమ్మినెత్తావిగాడ్పు సోఁకఁ
గొంతవిశ్రాంతిఁ గనికోరి కుధరవైరి.114
ఉ. ఒక్కొకవేళ వచ్చి పురుహూతుఁడు జాఁగిలిమ్రొక్కి జాళువా
చక్కని కమ్మతమ్మి కవచానపదంబుల నంటునట్లుగా
మక్కువ మౌనికిచ్చు ముని మానిని కిచ్చు వధూటి నవ్వు లేఁ
జెక్కు లఁ దోఁపఁ గన్నుఁగవఁ జేరును నాతనికేలు మాఱుగన్.115
చ. ఎవరది యింటిలోపల?
న దెవ్వరు?
శక్రుఁడ;
చెల్ల! మీరలా,
యివలికి రండు;
నీదుమగఁ డెక్కడ?
మూల ఫలార్థ మేఁగె;
రా
నువిదరొ, తామసంబగునొ?
ఉండుఁడు, పూజలు గాంచి పొండు;
సే
యవలయు పూజ నీ వెఱుఁగవా?
-యన సిగ్గున నేఁగు నవ్వుచున్.116
మ. మునితో నింద్రుఁడు మాటలాడునపు డంభోజాక్షి కీలందె గ
ల్లన మైజల్లన మాట తోఁపక వితాకై యుండఁ దద్భావమున్
గని యాజవ్వని సిగ్గు ప్రౌఢిమయు శృంగారంబు లేనవ్వులున్
మొనయంజూచు నతండు చూచిన మరల్చున్ జూపు వేఱొక్కెడన్.117
ఉ. ఈనళినప్రవాళములు నీకదళీతరు లీమహీస్థలం
బీనడబావి యీఖగము లీలత లీక్రముకాభిరూప్య మీ
భూనుతసోమలక్ష్మియు నపూర్వములంచు నుతించు వాసవుం
డానలినాక్షిచక్కఁదన మాశ్రమవర్ణనగా మునీంద్రుతోన్.118
ఉ. రంగదభంగవైభవము రాజిల యజ్ఞములందు నభ్రమా
తంగము నెక్కి యింద్రుఁడు తదాశ్రమవీథిని వచ్చుచోఁ జెలిన్
ముంగటఁ జూచి కన్నులను మ్రొక్కు మనస్సున గౌఁగలించు న
య్యంగన రెండునుంగని యనంగుఁడు పువ్వుల వైచు కత్తికిన్.119
క. ఈగతి నింద్రుఁ డహల్యా
రాగతిరస్కృతశచీపురంధ్రీరతియై
ద్రాగతివేలకృతస్వ
ర్భూగతియై తిరిగె నానుపోసినరీతీన్.120
ఉ. కౌస్తుభచారువక్ష సితకంజదళాక్ష కళిందకన్యకా
నిస్తులనీలవర్ణ కమనీయ చరాచరమానసనీయ ప
ద్మాస్తనకుంకుమాంక నవమండన దానవదర్పఖండనా
కస్తురిరంగ రంగపురకైరవపూర్ణకురంగలాంఛనా!121
క. కుందారవిందసుందర
మందారసుకీర్తిహార మహితవిహారా
వందారుజనాభీప్సిత
బృందారకరత్న సమరభిన్నసపత్నా!122
మత్తకోకిల.
చంద్ర పుష్కరిణీతటాంచలచార చారణసన్నుతా!
మంద్రనీరదమాలికాసుకుమార మారశతోపమా!
సాంద్రసత్కరుణానవామృతసార సారసలోచనా!
ఇంద్రచంద్రదినేంద్రముఖ్య సుంరేశ యీశవిభావితా!123
గద్య
ఇది శ్రీ పాండ్యమండలాధీశ్వర శ్రీ విజయరంగ చొక్కనాథ మహీ
నాథకరుణాకటాక్ష సంపాదిత గజతురంగ మాందోళికా ఛత్రచామర
విజయదోహళ కాహళ భూరిభేరీబిరుదధ్వజ ప్రముఖాఖిల
సంపత్పారంపరీసమేధమాన సముఖ మీనాక్షీనాయక
తనూభవ శ్రీమీనాక్షీదేవీ కటాక్ష
లబ్ధకవితాసాంప్రదాయక వేంకట
కృష్ణప్పనాయక ప్రణీతంబైన
యహల్యాసంక్రందనంబను
మహాప్రబంధంబునందు
ద్వితీయాశ్వాసము.