అహల్యాసంక్రందనము/పీఠిక

వికీసోర్స్ నుండి

ఒక కొమ్మనే రెండుపూవులు పూసినప్పుడు, ఆకారవిశేషాల్లో, అందచందాల్లో గోరువాసి ఒకదానికొకటి తీసిపోయినా, పరిమళం హాయి చిమ్మేస్వారస్యం రెంటికీ సమానంగానే అలవడి ఉండటం సాధారణంగా సహజం. చుక్కల మినుకు మినుకుల్లో అంతదూరాన్న ఎక్కువతక్కువ లెవరెంచుతారు, వెలుగుకు ముచ్చటపడటమే కాని!

అటు తంజావూరులో, సర్వజ్ఞుడు, సకలకలారసికుడు, రఘునాథరాయలు: ఇటు మధురలో వరాంగనా అనంగసర్వస్వమూర్తి రసికరాజు తిరుమలేందుడు. రెండురాజ్యాలూ ఒకదానికొకటి క్షాత్రమర్యాదలలో, వైరాలలో, పంతాలు సాధించుకుంటూన్నా, సారస్వతంలో జోడుపంచకల్యాణుల బారుగా హెచ్చుతగ్గుకాని కదను చూపించినవి. కన్నడసామ్రాజ్యవైభవాలలో వారసత్వంగా చిక్కించుకున్న కావ్యవినోదపారవశ్యం, దక్షిణదేశాన, హోయసల సామంతులకు జన్మహక్కు అయిపోయి, తరతరాలుగా, తామరతంపరగా ఫలించినది.

ఇద్దరు రాజులూ, తమపేరు నిలువబెట్టి తమ అంతవారయే సంతతి కలుగుతూండవలెనని, కోరుకోవడం ఉచితమేకదా: రఘునాధరాయలవైభవం విజయరాఘవునిలో కోటికి తీరి కొండయెక్కింది. తిరుమలేంద్రుని మనుమడు[1] రాజ్యమునకు వచ్చిన తరువాతగాని, మళ్లీ తొలికాలవువెలుగు జ్యోతిగా మెరయలేదు.

పితామహి మంగమ్మదేవి గారాబాలు చెల్లే పెంపకంలో, తిరుమలేంద్రుని మించగలవు అనే పెద్దల ఆశీర్వాదబలంతో చొక్కానాథుడు యుక్తవయసున రాజ్యానికి వచ్చి, ఆహోదా నిలువబెట్టగలిగాడు. సమ రాల్లో, సారస్వతవిహారాల్లో తనను మీరేవారు, ఆకాలంలో మరొకరు లేరనిపించాడు. సామ్రాజ్యపోషణలో అప్రమత్తుడుగా కళాసామ్రాజ్యాన్ని కూడా తోడునీడల్లో వర్ధిల్లచేశాడు. దేశంలో ప్రజల కన్నులూ మనసులూ ఆనందంతో విప్పారించాడు.

సముఖ మేకటకృష్ణప్పనాయకుడు[2] చొక్కనాథుని దళవాయి. కావ్యగీతావినోదాల్లో అతనితో సరిసమానుడుగా అరమరికెలు లేకుండా పాలుగొంటూండే నెచ్చెలి. స్వయముగా కవి, కవుల కాశ్రయము.[3] నిరంతరం రాజసముఖాననే ఉండటంవల్ల తిరుమలేంద్రుని కొలువులో, మీనాక్షినాయకుని[4] యింటిపేరు సముఖమని మారి అప్పటినుంచీ ఆకోవకు అదే నిలిచిపోయిందని వాడుక. నిశ్చయించే ఆధారాలు స్పష్టంగా లభించడం లేదుకాని, వేంకట కృష్ణప్పనాయకుని వంశక్రమం చెపుతూ, వెంకటపతి, పూర్వీకుల, నామములు మాత్రమే తెలుపుతూ, మీనాక్షినాయని దగ్గరకు రాగానే యింటిపేరు కలపడం, పైఆలోచనకు కొంత ఊత యిస్తూన్నది.

విజయరంగచొక్కనాథుడు విలాసచతురుడైన దక్షిణనాయకుడు అని ప్రసిద్ధిలో ఉన్న చాటువులు ఋజువు చేస్తున్నవి.

'రమ్మనెరా తనదే నే
రమ్మనెరా వంచశరుని రాపోర్చుట భా
రమ్మనెరా నీవేతన
సొమ్మనెరా విజయరంగ చొక్కవజీరా!
'మాటికి మాబోటిని నొక
చోటికి రమ్మనుచు నెనయ జూచితి...'

ఇత్యాదులు చాలా లభిస్తూన్నవి. రసికుడైన కవి. ప్రభువు సముఖాన మెలగే సదస్యులకు రాజప్రీతికని కాని, స్వయముగానే కాని, ఆధోరణులు, ఆపోకడలు అలవాటు అయిపోవడంలో వింత ఏమీలేదు. వేంకటకృష్ణప్పనాయకుడు ఒకవంక ప్రభువుతో సమానంగా అన్నివిధాలభోగాలూ అనుభవించాడు, శేషము వేంకటపతి మొదలైన కవులను పోషించాడు, తాను కావ్యాలు రచించాడు. మరోవంక, యుద్ధాలలో గడిదేరి సంగరసవ్యసాచి అనే బిరుదందుకున్నాడు.[5] విజయ రాఘవరాయలను ససైన్యంగా రూపుమాపి, తంజావూరు రాజ్యాన్ని కూలద్రో శాడు.[6] వీటన్నింటినీ మించే మరోగౌరవం పొందాడు. వాగ్గేయకారుడు క్షేత్రయ వేంకటకృష్ణప్పనాయకునిమీద పదములు రచించాడు.[7] ఈవిషయంలో మహారాజుకన్న కూడా ధన్యుడు.

ఈతడు విజయరంగచొక్కనాథునివల్ల సమస్తమర్యాదలూ పొందుతూ, మహావైభవంగా రాజు సెబాసనే ఠీవితో అతనికి కుడిభుజమై ఉండేవాడు.

వచన జైమినీభారతము వేంకటకృష్ణుని రచనలలో మొదటిది. తరువాత సంకల్పించిన అహల్యాసంక్రందనంలో దీనిప్రశంస ఉంది. నరాంకితము చేసిందల్లా దీనిని ఒకదానినే: కృతిపతి, విజయరంగచొక్కనాథుడు.

అహల్యాసంక్రందనమును కోరి కృతిపుచ్చుకున్నది, కులదైవము ప్రభువుతో నామసారూప్యమున్న, ప్రభువుల ప్రభువు - శ్రీరంగనాథుడు సారంగధర, ఆదేవునకే.

అహల్యాసంక్రందనము

వేంకటకృష్ణప్పనాయకుని రచనల్లో ఉత్తమమైనది. ఆశ్రయమిచ్చి, ఆంధ్రవాణీవిలాసములను అంత అలజడిరోజులలోనూ వన్నె తరగకుండా కాపాడుకుంటూ వచ్చిన ప్రభువుల మనసు వచనకావ్యముల మీదికి మరలినప్పటికిన్నీ, రాచబాటనే, కావ్యనిర్మాణం విషయాల్లో, అనుచరులు అనుసరించవలసిఉన్నప్పటికిన్నీ, నిరంకుశత్వం పరిపాలనలోనేకాని, కావ్యాలాపాలమీదికి మహారాజులు దుమికించనందువల్ల, కవులకు, తామేర్చి కూర్చిన కుసుమాలతో, తమ మనసుకు నచ్చేరీతుల్లో మాలలల్లి కావ్యకన్యకు నేపథ్యశృంగారపు అందాలు దిద్దడానికి వీలైంది. ఆశ్రయుడైన రసికమూర్తి వచనకావ్యములు కృతులందుతూ, కృతులుగా నిర్మించుతూ ఉంటే ఆశ్రితుడై ఆతనిచేత బహువిధముల సన్మానింపబడుతూ ఉన్న కవి-సేనాని, పద్యప్రబంధాలు భగవదర్పణ చేసి ప్రశంసలందుతూండటం కలిగింది. రాజు తలచుకొంటే, రక్తిరహదారులనే ముక్తిమార్గాలుగా మార్చగలుగుతాడుకదా!

ఇతివృత్తము, ప్రఖ్యాతంగా ఉన్నదానినే, ప్రఖ్యాతిలో, ప్రామాణికములుగా ఉన్నగ్రంథాలలోంచి సంగ్రహించుకొని, కల్పనలలో, కథాగమనచాతుర్యంలో, మాత్రం తమపనితనం చూపించడం ప్రబంధకవులలో చాలవరకు పరిపాటిగా వస్తూఉన్నది. వేంకటకృష్ణుడు తెనుగునాటను తెనుగుమీరిపోయి అన్నిమూలలా అల్లుకుపోయిన పురాణగాథను తీసుకుని, ఏదృశ్యానికి ఆదృశ్యం చదువరులకు కళ్ల యెదుట మెరసేలాగా, అన్నిదృశ్యాలూ కలసి ఏకచిత్రంగా చమకితమయే జాణతనపు ఔచిత్యం ఈప్రబంధము రచనలో ప్రదర్శించాడు. అందువల్లనే రసప్రవాహంలో, శాస్త్రరీత్యా గమనానికి ఎప్పటికప్పుడు అడ్డుతగులుతూండవలసిన విస్తరవర్ణనలు, విప్రలంభోపాలంభఉపన్యాసాలు, గాలించినా ఇక్కడ కానరావు. మామూలు మహాప్రబంధాలు, మోడులు కిక్కిరిసి దొర్లుకు వచ్చేనదులవరదలు అయితే, అహల్యాసంక్రందనం, గాలికి చెదరి రాలే కొండపూవులను అలలమీద తేలికగా తేల్చిమోసుకుంటూ, అలసగమనంతో పరవళ్లుపోయే సెలయేరు. తిక్కనను మించిపోయింది ఈతని 'దర్శకత్వం.'

వస్తువును విశేషంమార్చకుండా, ఇతరపురాణాలలోనుంచి విచిత్రసందర్భములేమి అతుకు పెట్టుకోకుండా, రామాయణంలో పద్మపురాణంలో, అగుపించే కథనే తీసుకున్నాడు. గౌతమునియిల్లాలిని, ఏలాగైనా పొందాలని, అంతకుపూర్వం వివాహసందర్భములో విఫలమనోరథుడై పరితపించుతూన్న దేవరాజు, రాయబారాలు నడిపి, అహల్య తనయందు అనురక్త అని తెలుసుకుని, మగనిని కోడికూతతో, అర్ధరాత్రివేళ స్నానానికి సాగనంపి, ఆఅవకాశంలో, మనసుతీర్చుకుంటాడు. చేసినపనికి, ఇరువురికీ శాపాలు తగులుతవి. ఇదీ ప్రబంధంలో ఉన్నకథ. ఈసందర్భములో అహల్యకథనుగురించి కావ్యరసికు లెరుంగవలసిన విశేషాలు చాలా ఉన్నవి.

వాల్మీకిరామాయణంలో ఉన్నకథే, ఉత్తరకాండలోనూ వస్తుంది. నిజానికి సందర్భము అంతగా లేకపోయినా, బ్రహ్మదేవుడు ఇంద్రజిత్తు కోరినవరాలు యిచ్చి ఇంద్రుడిప్ర్రాణాలు దక్కించినప్పుడు గ్రహచారం దాటడం ఎవరితరమూ కాదని ఊరడించుతూ, వెనుకటిగౌతమశాపకథను మళ్లీ ఒకమారు ఏకరువు పెట్టి ఉరిసిన పుండుమీద ఉప్పు కారము చల్లినట్టు, శచీంద్రుని అమాయకంగా ఆయాసపరచుతాడు.

అహల్య — అంటే సర్వాంగసుందరి: అవయవములలో ఆకారంలో ఏవిధమైన ఒచ్చెములున్నూ లేనిది అని అర్ధమట, బ్రహ్మ అభిప్రాయంలో: ఒకేఅచ్చులో అసంఖ్యాకమైన ప్రజను సృష్టి చేసి విసిగి, వాణీపతి, లోపాలులేని క్రొత్తదనపురామణీయకం సంకల్పించి కరువునబోసి, అహల్యను నిర్మించడం కలిగింది: కుమారిలభట్టు, ఈకథ సాంకేతికమని, అహల్య - రాత్రి, ఇంద్రుడు - సూర్యుడు ఇలా తీసుకోవలసిందంటాడు. అహల్య అంటే ఊషరక్షేత్రం - ఇంద్రసమాగమంవల్ల, అంటే వర్షం కురిసి, తడిసి, ఫలించడం: ఇదో నిర్వచనం వైదికవివరణంగా ఉన్నది. బ్రాహ్మణంలో అహల్యాజారుడన్న మాటనుపట్టి, తరువాత పురాణాల్లోకి కథలు కల్పించబడినవని, మీమాంసకుల అభిప్రాయం.

ఆంజనేయుని కథలన్నీ ఒకచోట కూర్చిన పుష్పగిరి తిమ్మన్న సమీరకుమారవిజయంలో అహల్యవృత్తాంతం చిత్రంగా చెపుతాడు. ఏలాగంటే.

బ్రహ్మ, అహల్యను నిర్మించి, గౌతమమునికి భార్యగా యిచ్చిన కొంతకాలానికి ఇంద్రుడు చీకటితప్పు చేసి, భంగపడుతాడు. గౌతముడు భార్యమీద నిప్పులు చెరగడం మొదలు పెట్టడం ప్రజాపతికి తెలిసి ఆశ్రమానికి పరుగెత్తుకుంటూ వచ్చి, కొంతచమత్కారప్రసంగం చేసి [8]అల్లుడి అలుక తగ్గించి, ఆతప్పు కాయించడమే కాకుండా, ఉత్తరత్ర ఒకటి రెండలాటి తప్పటడుగులు పడినా, సహించేటట్టు మాటపుచ్చుకుని, తిరిగి వెళ్లిపోతాడు. కొంతకాలానికి, గౌతమునికి అహల్య అంజన అనే ఒకకూతురిని కంటుంది. ఆపిల్లను, ఇంద్రుడికి మొదట కన్న, వాలి అనేపిల్లవాణ్ణీ పెంచుకుంటూ, ఆదంపతులు ఖులాసాగా సంసారం చేస్తూండగా, ఒకనాడు ఋతుస్నాత అయి, కొలనుఒడ్డున తల తడి ఆరబెట్టుకుంటూ నిలుచున్న అహల్యమీద, అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడికన్ను పడుతుంది. అతడికీ మనసు చెదిరి, రథం ఆకాశంలో విడిచి, చల్లగా క్రిందకు వచ్చి, ఇంద్రుని తాత ననిపించి పోతాడు. ఆప్రణయం పండి సుగ్రీవుడు పుడతాడు. మౌనికి ఈసంగతి తెలుస్తుంది, కాని అన్నమాట తప్పేందుకు వీలు లేదుకనుక, సూర్యుడికి శాపం శాపమోక్షం మర్యాదలు జరిగించినా అహల్యవిషయంలో చూసీచూడనట్లు ఊరుకుంటాడు. తర్వాత కొంతకాలానికి, ఇంద్రుడికి అహల్యమీద మళ్లీ మనసు మళ్లి, కోడికూత కూసి ఆమెతో కోరిక తీర్చుకుంటాడు. ఈ విషయం పసిది అంజన కనిపెట్టి తండ్రి స్నానము చేసి రాగానే ఆయనకు చెపుతుంది. అహల్య, తాను మనఃపూర్వకంగా వృభిచరించలేదనీ, గౌతమవేషంలో వచ్చి యింద్రుడు మోసగించటంవల్ల, ఒగ్గడంలో, పాతివత్యం నెరపుతూన్నానన్న సదభిప్ర్రాయమేకాని, వేరు యోజన లేదనీ, చెప్పి కోపగించవలదని మగనిని వేడుకుంటుంది. కాని లాభము ఉండదు. భార్యను శిల అయిపొమ్మని శపించి, ఆధూకుడులో ఔచిత్యము మరచిపోయి, వాలిసుగ్రీవులను, వానరులుగా పుట్టవలసిందని అనేస్తాడు. దీనివల్లనే ఇంతకు మూడిందికదా అని, వాలీ అహల్యా కలసి అంజనను కోతిరూపై పోతావని శపించి వాళ్లకసి యిలా తీర్చుకుంటారు. సుగ్రీవుడు, చెల్లెలిని ఆదరించి, భయం తీరేమాటలు చెపుతాడు.

ఇంద్రునివల్ల అహల్యకు రెండోసారి కలిగిన కొడుకు శతానందుడు. ఆకుర్రవాణ్ని గౌతముడు వెంటబెట్టుకుని వెళ్లి జనకుడియింటి పౌరోహిత్యం కుదిర్చి, అక్కడనుంచి తపస్సు చేసుకునేందుకు హిమాలయాల్లోకి వెళ్లిపోతాడు. — ఈ కథ నిజంగా కవులు అవలంబనముగా తీసుకో వలసినది. చక్కనికావ్యము, అంతకన్న చక్కనినాటకము తయారుచేయడానికి ఎన్నోవీళ్లు ఉన్నవి. అహల్య మనోగతిని, ప్రవృత్తులను వ్యాఖ్యానించి, పాప. కళంక మంటని రసమూర్తినిగా చిత్రించవలనవుతుంది.

జైనభిక్షువు ఎవడో రచించినటుల ప్రచారంలో ఉన్న ధూర్తాఖ్యాన మనే నిబంధనంలో, ఇంద్రుడు గౌతమశాపంవల్ల శరీరమంతా స్త్రీ చిహ్నలు కలిగి, తిరిగి దేవలోకానికి పోవడానికి సిగ్గుపడి ఆశ్రమప్రాంతాన తచ్చాడుతూండగా, బ్రహ్మచారులు అవి చూసి చెడిపోతూండటం మూలాన, బలవంతాన అక్కడనుంచి అతన్ని తరిమివేశారని ఒకవిచిత్ర కల్పన ఉన్నది.

ఇలా చమత్కారాలు, ఉంటూంటవి వాని కేమి గాని, అహల్య రాయిగా మారిపోయిందా, లేక రాయి అయిపోయిందా, అనేవిషయం విచారించతగినది. రామాయణంలో, మారిపోయినట్లుగా లేదు. గిరీశబాబు తననాటకంలోనూ, ఆలాగే తీసుకొన్నాడు. నవనవోల్లాసాలతో, ఎప్పుడూ విరిపూతలతో మాతృప్రేమ మరందధార లవుతూండవలసిన మనసు, మోడై పోయింది, గుండె రాయై పోయింది, అని పద్మపురాణంలో — 'సా తతస్తస్య రామస్యపాదస్పర్శాన్మహాత్మనః, అభూత్స్వరూపా వనితా సమాకాంతా మహాశిలా' అని రాయి అయిపోయినట్టుగా ఉన్నప్పటికినీ, లక్షణార్థాన్నే తీసుకోవడం ఉచితం,

వాల్మీకి, ఇంద్రు డహల్యను అంటుపరచినది ఒకమారేనని ముక్తసరిగా వదలిపెట్టేశాడు: శతానందుడు గౌతముని ఔరసుడని రామాయణోక్తం.

అహల్య యిన్ని చీకటితప్పులూ బుద్ధిపూర్వకంగా చేసిందా? అలా అని ఘట్టిగా అనడానికి వీలున్నదా? ఒకటి రెండుసార్లు ఓపికపట్టి ఊరుకుని, చివరకు, అంతకుముందల్లా లేనిది అప్పుడే ఏదో మహాముంచుకువచ్చినట్టు శాపాయుధం ఝళిపించిన గౌతముని చేతకు నసి అయిన అర్థం ఉన్నదా?

తత్వార్థాధిగమనము ఇక విరమించి, ప్రస్తుతముగా వేంకటకృష్ణప్పనాయకుని శిల్పాన్ని పరిశీలించనౌను. అతడు కవిమాత్రము కాకుండా దర్శకచాతుర్యములు కూడా అలవరుచుకొన్న విన్నాణి. అహల్యను ప్రజాపతి సృష్టి చేయవలసిన అవసరం కల్పించేందుకు ఇంద్రసభలో,ఋషులందరిచేత ఒకనాటకం ఆడించుతాడు. తగవులతో మొదలు పెట్టినకథ చివరవరకూ అలాగే నడవడం, మునుల శృంగారకళాభిప్రాయాలను పురస్కరించుకొని వచ్చిన అహల్యారూపకల్పన, తుదకు, మునిమండలిలో ఒక అమాయకునకు విషప్రాయం కావడం, తపసుకు ఫలంగా అనుభవించుతూన్న స్వర్గవిలాసినుల ప్రోడతనాల హెచ్చుతగ్గులమీద వాదాలు తెగని మౌనుల ప్రచ్ఛన్నశృంగారప్రకటనలకు ఫలితం గౌతమునికి గార్హస్థంలో శృంగారసాహచర్యం కొన్నియుగాలవరకూ లోపించడం. విధి నిర్ణయక్రమంలో ఒడిదుడుకులు- భర్తమీద భక్తి, పరాయివానిమీద అంతరక్షోభ;వలపూ, రెండూ సరితూగినప్పుడు హృదయం ఉన్న కామిని అనుభవించే ఇవన్నీ - కావ్యం చదువుతూన్నప్పుడు భావనను గిలిగింతలు చేస్తూ తోచే సన్నివేశాలు. ఇలా అనుకునేందుకు ఆస్కారం కలిగించే రచనాప్ర్రాగల్భ్యం వేంకటకృష్ణప్పనాయకుని సొమ్మైనది. స్థూలంగా, ఆలోచించినప్పుడు, ఇంత తోచదు. నాలుగువందలపద్యాలతో మూడాశ్వాసములుగా, చక్కనికవిత్వముతో ప్రబంధము నిర్మించినాడు అనే అనిపించినా, మానసికంగా, కావ్యరసాన్ని అనుభవంలోనికి రా జేసుకున్నప్పుడు, కవి కల్పనలో వుండేసత్తా, ప్రయోగాలు చిగిరించే అర్థశక్తి ద్యోతకమౌతుంది. అర్థవైభవం కలిమిగా ఉన్న మహాకవి, శబ్దాడంబరమును లక్ష్యము చేయడు అనడానికి 'అహల్యాసంక్రందనము' ప్రమాణము.

ఈ కథనే తీసుకుని సంగమేశ్వరుడు 'అహల్యాసంక్రందనవిలాసం' అనే ప్రబంధాన్ని రచించినాడు. అతడు ఇంద్ర అహల్యా సంగమముతో కథను, తా ననుకొనినటుల మంగళాంతముగా, గౌతముడు స్నానానంతరము సూర్యోదయమగుదాకా ఎక్కడో గడిపి యింటికి తిరిగివచ్చి, గొడవలేమీ తెలియకుండా, తెలుసుకోకుండా, సుఖంగా ఉంటూన్నాడు, అని ముగించాడు. ఇలా చేయడం ఉచితమౌనా? అహల్య అనుభవించిన తీయందనము, చివరకు అనుభవించిన బాధ మీదుగా చూస్తేనేకాని, సంపూర్ణముగా అవగతముకాదే! హృదయం వెన్నెలలో పండించుకునేందుకు, కామభోగిని, చేయగల త్యాగం, లజ్జావతి అయిన కులపాలిక చూపించగల నిర్లక్ష్యం, సహించగల యాతన, అప్పుడు కాని ఆనందానికి విలువ కట్టేందుకు వీలుపడదే! హర్షపండితుడు నలుని కథ త్రుంచివేశాడంటే, అక్కడ సబబున్నది. ఆపోలిక యిక్కడ పనికిరాదు.

వేంకటకృష్ణప్పనాయకుని ప్రబంధము ఏవిధమైన అనౌచిత్యానికిన్నీ యెడమీయదు. పాఠమా, ముదిరి కటువు పడదు. శృంగారమా, సభ్యతను ముంచివేసి ఉచ్ఛృంఖలముగా అతివేలముకాదు: కల్పనలా, బింకము తప్పవు సర్వమధురమైన సద్గ్రంథము.

రాధికాసాంత్వనము

ముద్దుపళని, 650 పద్యాలతో, రాధామాధవవిలాసాన్ని కథగా తీసుకుని ప్రబంధముగా రచించినది. ప్రతాపసింహుని ఉంపుడుకత్తె అయిన ఈమె రచన, తంజావూరు సారస్వతములో చివరగ్రంథము - అని బ్రౌను పండితుడి అభిప్రాయం. ప్రస్తుతం దొరుకుతూన్న ఏపతిలోగాని 605 కు మించి పద్యము లుండకపోవడం వల్ల అంకెలు తారుమారుగా పడినవేమో అని సమాధానము చెప్పుకోవచ్చును. తంజావూరు నాయకరాజుల చల్లని యేలుబడిలో వెలసిన కావ్యగ్రంథాలలో నిదే చివరదౌనో కాదో, రూఢిగా నిశ్చయించడానికి ఆధారములు లేవు.

ముద్దుపళని, స్వతంత్రముగానే గ్రంథము రచియించినది, అని యింతవరకున్నూ ప్రసిద్ధిఉన్నది. ఆమెవలలో చిక్కిన రాజగురువు వీర రాఘవాచార్యుడు, గ్రంథరచనలో, అంతో యింతో సాహాయ్యము చేయకుండా ఉండడని, అసలు ఆతడే రచియించి, ఆ వలపుగత్తెపేర వెలయించి ఉండటానికి కూడా వీలున్నదనీ, ఇలా, నిందెలు తప్పకుండా వస్తూన్నవి. వానికి తోడు, ఇప్పుడు వేంకటకృష్ణప్పనాయకుడు ఈ రాధికాసాంత్వనము రచించాడని అంగీకరించేటట్లయితే, ముద్దుపళనికి ఇంత వరకూ సారస్వతంలో, ఎవరి నిర్వాహకత్వం వలనైతేనేమి, సంక్రమించి ఉంటూన్న ప్రతిష్టయావత్తూ మాసిపోయి, గ్రంథచౌర్యం చేసిన నీచురాలు అని అనవలసి వస్తుంది. ఎందుచేతనంటే, పద్యాలన్నీ ఒకటే. ఉన్నంతవరకూ సంభోగవర్ణన, అహల్యాసంక్రందనంలో ఉన్నవచనమే! కథలో, ఉపనాయిక, ఇక్కడ సత్యభామ - ఈ రవంత భేదమే తప్ప.

కాని, ముద్దుపళనికి, ఈ అపవాదు తొలగించేందుకు, సదుపాయములు, కనబడుతూన్నవి. ఏమనంటే,

సముఖ వేంకటకృష్ణప్పనాయకుడు, రాధికాసాంత్వనము ఏకాశ్వాసప్రబంధముగా నిర్మించాడు అనేందుకు, ఇతరగ్రంథాలలో కాని, అతడు రచించిన గ్రంథాలలోనైనాకాని, ఎక్కడా ఆప్రశంస కనబడదు.

ముద్దుపళనికావ్యం ద్వితీయాశ్వాసంలోనుంచి మొదలుకొని కొన్నిపద్యాలు ఏరి, చివర అహల్యాసంక్రందనము వచనమూ, ఆశ్వాసాంతగద్యమూ, కలిపి, ఇళ అన్నచోట సత్యభామ అనిమార్చి, కలగాపులగంగా, ఎవరో చిలిపితనానికి, వేంకటకృష్ణప్పనాయకుడికి ఈ అనవసరఖ్యాతీ, ముద్దుపళనికి అపఖ్యాతి కలిగించడానికి చేసినపని అనిపిస్తుందే కాని, రెండుకావ్యాలూ పరిశీలనగా చదివితే, ఒకరు సంగ్రహంగా కూర్చినదానికే మరొకరు వెనుకాముందూ అదుకులు వేసి, గ్రంథమంతా కేవల స్వకపోలకల్పితమనే ప్రతిష్ట కలిగించుకునేందుకు ప్రయత్నించారు అని సూచనగా అయినా కనబడకపోవడమే కాకుండా, స్పష్టంగా, ఈవిషయంలో ముద్దుపళనికి అన్యాయం జరిగిందని తెలుస్తుంది. జయంతి రామయ్యపంతులుగారు ప్రకటించిన జైమినిభారతభూమికలో రాధికాసాంత్వనము వేంకటకృష్ణప్పనాయకుని కృతి అని వ్రాయబడినది. నిడదవోలు వెంకటరావుగారు, సత్యభామాసాంత్వనం భూమికలో, ఆలాగే అన్నారు. కాని ఎవరున్నూ అలా అనడానికి కారణములు ఏమి ఉన్నవో చెప్పారు కారు.

ఇలా సందేహాస్పదంగా ఉన్నా, రాధికాసాంత్వనమును ప్రస్తుతం ఈసంపుటంలో ప్రకాశకులు చేర్చడం, ముద్దుపళని కవిత్వం తీయదనంతో మరోమారు చదువరుల నోరూరించే సాధుప్రయత్నమేకాని, ఆ రసమోహిని ప్రతిభను కళంకితము చేయాలని కాదు, అని సమాధానపడవలసి ఉంటుంది.

సారంగధరచరిత్రము

పడుచుతనంలో ఉండే కుమారుడికి సంసారసౌఖ్యం కలిగించడానికి పూనుకుని, ఆ ఉత్సాహం ఆత్మీయంగా విషమంగా అనువదించుకుని, భంగపాటు వచ్చినప్పడు, చెదరినమనసులతో, యౌవనులైన వృద్ధులు ఇహపరదూరు లయేటట్టుగా చేసే హంగామాలో కవుల కల్పనకు తులతూగకలిగిన ఇతివృత్తలక్షణం తరతరాలుగా, మనదేశంలో, విలాయతీ సారస్వతాల్లో అనేకరూపాలలో గోచరమౌతూనే ఉన్నది. ప్రకృతికి విరుద్ధగమనం తీర్చడానికి యత్నించిఇందువల్ల రేగే ప్రళయజ్వాలలు సారంగధరకథలో ప్రత్యక్షమౌతూన్నవి.

ఈకథంతా మనదేశంలోనే జరిగిందా. ఇంతపరిహాసపాత్రమైన పని, తెలుగువారికి భారతం ప్రసాదించడానికి పూనుకున్న రాజనరేంద్రుడు చేసి ఉంటాడా? నమ్మేవీలులేదు - నమ్మవలసిన అవసరమున్నూ లేదు. చరిత్రలో రాజనరేంద్రుడి కుటుంబంలో, సారంగధరలో వచ్చే పేరు లున్నవారే లేరు. పోనీ, ఇదేమంత చరిత్రలోకి ఎక్కతగిన ఉత్తమసందర్భం అని, సారస్వతంలో నిలిచిపోలేదేమో అనుకుందామన్నా, భారతం ఉపక్రమణికలో కాకపోయినా, వచనగ్రంథముగా అన్నా వెలయకుండా మానేదా? అప్పకవికి పూర్వం ఎవరూ ఈఘటనను తలపెట్టనేలేదు. అతని మాటల్లో నిజాయితీ ఉండేదీ లేనిదీ, తనకు నన్నయభట్టీయం సిద్ధప్రసాదమని తేల్చడంకోసం అసందర్భంగా ఆతడు ఆడిన అబద్ధాలే ఋజువు చేస్తూన్నవికదా? తెలుగులో, ఈకథను పద్యకావ్యంగా రచించి, తంజావూరు రఘునాథరాయలకు అంకితంచేసిన చేమకూర వెంకన్న కథ మాళవదేశానికి సంబంధించింది కాని, తెలుగునాట జరిగింది కాదనీ, చిత్రాంగి రాజనరేంద్రుని భోగస్త్రీకాని, మహిషి కాదనీ చెపుతూండటంలేదా? వంగదేశంలో ప్రచారంలో ఉన్న, కథలో, సారంగధరుడు, పూర్ణుడనేభక్తుడు: చిత్రాంగి, లూనా అనే ఛమర వనిత. మహాకవి గిరీశచంద్రుడు, పూర్ణచంద్ర అనే నాటకం వ్రాశాడు. ఈ ఇతివృత్తం తీసుకుని — శ్యాలకోటను, శాలివాను డనే రాజు పరిపాలించుతున్నాడు. ఇచ్ఛా అనే ఆమె అతని మహిషి. పూర్ణుడు, కుమారుడు: కొంతకాలానికి రాజు, లూనా అనే మోసగత్తెను రాణిగా చేసుకుని, అసలుభార్యను విడిచిపెడతాడు. లూనా, ఆమెతండ్రి, జాంగలికుడైన జంబూ, వీళ్లు ఇద్దరూ చేరి, రాజ్యం అపహరించాలి ఏలాగైనా అని కుట్రలు చేస్తూంటారు. లూనా, పూర్ణుడు తనను బలాత్కరించాడని రాజుతో అబద్ధము చెప్పి, - కళ్లు పొడిపించి పాడునూతిలో కూలదోయిస్తుంది. ఇక రాజును కడతేర్చడానికి, విషం పానీయంలో కలిపి త్రాగించపోయే సమయానికి, గోరక్షనాథుడనే పరమశివరూపుడైన సిద్ధుడిఅనుగ్రహంవల్ల కళ్లు వచ్చి, సన్యాసి అయిపోయిన పూర్ణుడు అక్కడకు వచ్చి తండ్రిని కాపాడుతాడు. రాజు, లూనా చేసిన ద్రోహం అప్పటికి పూర్తిగా గుర్తించినా, ఆమె అదృష్టంవల్ల, పూర్ణుని బోధలలో రాజు మనసు కరిగి ఆమెను క్షమించుతాడు. వలచి, ఆతడే దైవమని నమ్ముకుని, సమాగమంకోసం వేచుకుని ఉన్న సుందరారాణి వలపును ధన్యం చేయకుండా, ఆమెకూ, తల్లికీ ఉపదేశం చేసి వారిఅనుజ్ఞ తీసుకుని పూర్ణుడు, జీవితం సన్యాసిగానే గడపుతాడు.

ఇది, గిరీశబాబు నాటకం కథాసంగ్రహం. సారంగధరుని కథ — కథలలో, నామములలో తేడాలతో హైందవసారస్వాతంలో విశేషంగా వ్యాపించి ఉన్నది.[9] వేంకటకృష్ణప్పనాయకుడు, చేమకూర వానిని అనుసరించి, మధురమైనశైలిలో వచనసారంగధరచరిత్రను రచించాడు. ముద్రింపబడవలసిన గ్రంథములలో ముఖ్యముగా ఇది ఒకటి.

జైమినిభారతము

...ఇందు బ్రమీల యర్జునుని రాక విని, యాతని మదిలో గామించుటయు యుద్ధము జేసి యాతనిని వశపఱుచుకొని యింటికి దీసికొనివచ్చి, యాతనితో గ్రీడించుటయు మిక్కిలి పెంచి వ్రాయబడినది. ఆ భాగము ఇప్పటి లోకమునకు రుచింపదని యిందు ముద్రించుట మానివేసినారము. ఇదిగాక పరిషత్తుకు వచ్చిన రెండుప్రతులలో నొక్కప్రతియందుమాత్రమే, యట్టి విశేషవర్ణనము కనబడుచున్నది.'— ఇలా ముద్రితజైమినిభారతపీఠికలో ఉంది. లోకం అంతటిదీ ఒకేరుచి కాదని, మనకు సిద్ధాంతంగా అంగీకారం అవుతున్నప్పుడు, ఒకేఒకరు, అభిరుచి విషయంలో ఆధారం లేకుండా యావత్తు లోకానికీ ప్రాతినిధ్యం వహించడం అంతసజావు కాదేమో; ఏమైనప్పటికీ, ఉన్న ఆ ఒక్కప్రతినే ఆధారంగా చేసుకొని, వీలైనంతవరకు స్ఖాలిత్యములు రానీకుండా, పరిషత్తువారు విడిచివేసిన భాగం ఈ సంపుటంలో ముద్రించినందువల్ల, స్వల్పగ్రంథపాతములు మినహాగా, జై మినిభారతము[10] ఇంచుమించు సమగ్రంగా, లభించే అవకాశం కలిగింది. వెంకటకృష్ణప్పనాయకుని రచనను - అనౌచిత్యము, అశ్లీలత - వీని కెడమీయని భాగాన్ని అకారణంగా, త్రోసివేసే రసనీరసత్వం లోకులకు అంటగట్టడం భావ్యము కాదుగదా!

——

అనురాగవిలాసభావనలు నురుగులతరగలై యావనపూర్ణవికాసంలో మానసాంబుధిని అల్లకల్లోలం చేయడానికి తలపడిన పారవశ్యవేళల్లో, కలాచైతన్యంతో అందాలమెరుపులు స్పందించే నీ తరుణజీవనం, శాపంతో, జడమైపోయి, లాస్యము పేరుకుపోయిన చాపరాయిగా అయిపోయిందే! ఆనందజ్వాలామాలికలు, పాషాణశీతలత్వానికి దిగిపోయినవే.

గౌతమముని కోపతాపం విసురుతో, ఆదిమూర్తి అయిన క్షమాదేవి, ఓదార్పు కౌగిలింతలోకి నీవు చేరుకొని, కళంకలేశాన్ని, సర్వమూ పునీతంచేసే మృత్తికాస్నానంతో, గోటమీటేశావు. నీకు సంక్రమించిన దోషము, శాంతమూర్తి అయిన ముని హృదయకమలంలో, నీవు నేరక చేసిన తప్పిదంతో, ఔర్వాంగారాలని రగుల్పడమే. కాని, ఆతని అనుగ్రహంలో, ఆగ్రహానికి కూడా సవ్యమైన వినియోగం కలిగించేనేర్పు, తనశాంతిలో, నీకు శాంత - స్థిరావాసం - మోక్షఫలంగా ప్రసాదించడంలోనే కనిపించడం లేదా?

పతి ఈర్షాతపంలో, యౌవనవైభవ-జీవితకుసుమాలు వాడి రాలిపోయినవి, కాని, అంకురఫలితంకోసం బీజరూపములుగా, వృంతాలు వీడిపడి, నవనవోదయప్రాభవం దక్కించుకున్న పరువం వానికి ఉన్నందువల్ల, నీవు రత్నగర్భలో మరుగుపడి ఉన్నంతకాలమైనా, విశ్వలోచనులైన కవుల మాననసీమలను విడనాడలేక పోయినావు.

నీవు జాణవుకావా? ప్రియులను గికురించే ప్రోడతనపు జాడలు ఎరుగని ముద్దరాలవా? శిలవై, బాహ్యసంచారప్రవృత్తులు అరికట్టుకున్నా, అంతర్వాహినిగా గమకించే జీవనకల్లోలినీసీకరరహస్సేచనములతో దోహదాలు దిద్ది, ఆచలువలతో, లతాళీ – ఆళీజనాన్ని వెలయించుకుని, వాని వికసనహాసాలతో, పురాతనప్రియుడైన సూర్యుడికి, వెనుకటి శృంగారగాథలు పుల్కరింతలు జేసి, నీవు ఆ చోద్యానికి మురిసిపోవడం నేర్చుకోలేదా?

పాతివ్రత్యపు వలలో, లోకమోహిని వైన నీ అలవికి మించిన అందాలని ఒడిసివేసి, ఇతరులు తేరిచూడకుండా, చీకటిపాతరలలో నిక్షేపంలాగా పదిలపరచుకున్న గౌతముని స్వార్ధతపస్సమాధికి ఋజుధిక్కారమేనమ్మా - నీ నవపల్లవహృదయం ఇనగరామోదాన తహతహతో కోరకించడం: యామినికి వశంగతుడై, నీకు ఆలోకనభాగ్యం అస్తమింపజేసుకునే దినరాజు త్రపాఅరుణమైన ముఖబింబం శోణ-పాండిమాభాసంతో, విప్రలంభ-దైన్యం నిట్టూర్పుగా, లయ కలిపించుకుంటుందమ్మా. ఫలరూపానికి తెచ్చుకోలేని, ప్రణయకాంక్షలు, తారకాసంతానాన్ని నీకు ప్రదర్శించి, నీమాతృహృదయాన్ని ఒరుసుకుపోయి చీకటితెరలమీద వెలుగులజాలరులు అల్లి, అరుణోదయందాకా, నిన్ను ఎంత అలయించుతా యమ్మా.

మానవలోకానికి హితోపదేశంగా అల్లుకుని పోయినా, నీప్రణయం దేవరహస్యమన్నమాట నీమనసు ఒకటే ఎరుగునేమో? చీకటిలోనే కాదూ, మునిపాదపరిచర్యలతో నవసిపోయిన నీకోమలాంగుళులు, సౌందర్యమూర్తి సంస్పర్శనకు నోచుకున్నవి. తిమిరావకుంఠనం మరుగుననేకాదూ, నీమనసునిండిన ప్ర్రణయం నీవు కోరినతీరుల్లో పండింది! నీవు చేసింది చీకటితప్పుకాదు: అంతవరకూ, నీకన్నెతనాన్ని ఆశ్రమప్ర్రాంతాలలో వెన్నెలగా కాయించిన, ఆతప్పు- చీకటిది.

నీది తప్పిదమని ఎవరు ఆగ్రహించారు? మాధవునికే స్వీయలైన వనదేవతలు, ప్రణయానికి ఆహుతి అయిపోయిన, నీధీరతనానికి కుసుమాంజలులుగా, వర్ణమయములైన వనసీమలను విడిచి, నీవు ఉనికి కాజేసుకున్నందువల్ల ప్రణయపుణ్యభూమి అయిపోయిన ధూసరక్షేత్రానికి, ఫలకేదారాలను విడిచిరాని వసంతుని తర్లించుకునివచ్చి, అడవితీవెల పెనయల్లికలుగా, నిన్ను కౌగిలింతలతో సమాశ్వసించలేదా? ధరిత్రీదేవి, రంగురంగుల కీటకాల అలలు రేపి, భ్రమరగానాలు సన్నివేశరోదసిని మూర్ఛనల తేల్చేవిధానం కలిపించి, ఆశ్రమప్రశాంతికి, ప్ర్రణయాస్థానవిలాసములు అలవరచి నీవంటరితనంలో, మధురభావనలు తీయతేనియల ధారలుగా ఊరించలేదా? అంధకారము, జడశాంతి — నీరాగహృదయంలో ప్రణయంనాటిన వెలుగుతీవలు ననలుసాగడానికి, విరులై కోరికలు సుప్రసన్నంగా విరియడానికి, కామపాలికలు, అర్ధవంతంగా, నిలిపిన రక్షలు.

కాని, ఆవెలుగులు మళ్లా వెలుగులో కాని విప్పారవా? అందుకోసమేనా, ప్రణయపరిపూతమై చంద్రకాంతస్వచ్ఛమైన, నీమూర్తిలో, జీవనవిద్యుత్ప్రభలు నింపుకోవాలని, ఆమహామహుడి స్పర్శకు కాచుకుని, అలికిడికి తలఒగ్గి, యుగాలుగా, రవంత అయినా చలించని ఉత్సాహంతో, ఉండటం? పాపము అని అనరాదు, ఎందుకనీ, అదే నీ కలుషాన్ని అంతా కడిగివేసింది. శాపము. నీకు నూతనశుభ్రజీవనానికి అవకాశం కలిగించింది.

నవనవోదయవిలాసవిభ్రమాలు, నీపునరుజ్జీవితమూర్తిలో, వెలుగులుగా మెరసినా, వాటి తారళ్యాన్ని, చమకితం చేయడానికి అని అయినా, ఆ అంతులేదనుకున్న చీకటి కనుకొలకులనుండి జారిన మంచుబిందువుల బరువులు, నీ కనురెప్పలు నీలోత్పలదళాలుగా మ్రోయక తప్పదు. నీ కైశ్యము, దీర్ఘవర్షాశైవాలపుంజాలకు మెరుగులు పెడుతూండక తీరదు.

నీవు చీకటులు తెమల్చుకుని వెలుగులో తలఎ త్తడంలో- నీప్ర్రబుద్ధ మార్తిలో, అతిప్ర్రాక్తనత, నవనవీనత, చిత్రరీతిలో మిళితమైపోయినవి. విరిసీ విరియని, విరికన్నెలాగా తరుణివి అవుతావు: నగరాణి లాగా, అనాదివై ఉంటావు.

——

మహాకవి రవీంద్రుడు, అహల్య శాపకథాకథనంలో, సుప్తభారత దేవీమూర్తికి, ప్రబోధగీతం ఆలాపించాడు. ఆయనరచనను, వివరణగా విస్తరించుకుని, ఇలా భావమును వ్యాఖ్యానించుకున్న సమాలోచనలలో, శాపాహతికి ప్రణయారంభాన్ని ఆహుతి యిచ్చుకున్న పాపరాశికి, స్మరణమాత్రాన పాపపరిహారం చేసే దివ్యప్రభావం, పాతివ్రత్యబలంచేత దక్కించుకున్న పుణ్యమూర్తులతో జతకలిపి, పంచకన్యలలో ఒకదాన్నిగా గౌరవించిన, పురాణమునుల భావ ఔదార్యం, భావనా-ఔచిత్యం, విస్పష్ట మౌతుంది.

వంకలు మిగిలిపోని అందాలకు నూతనములైన చందములలో అవయవసారూప్యసహయోగానికి అయి, సాఫల్యం ప్రసాదించి వైదీకవిజ్ఞానాన్ని అన్వర్ధమయిపోయేటట్టు నిలుపుకున్న పుత్రికాపతి, మనసార కన్న సంతానం, కానక కానక, కనిన మోహనమూర్తికి వశం అయిపోయిన నిరంతరప్రణయయోగరూఢిని కాని, కామ-సామగానం, ఉదాత్తధోరణీముఖరితముగా ఉద్గీథ - ప్రణయప్రణవోపాంశువు కాలేకుండా ఉండేది.

అహల్య మధురప్రణయమధుమోహిని. ఆమెకు మనసైన పొలయలుకల కలిమినంతా, కావ్యకన్యకు సింగారపు మురిపెములు అందగించడానికి, రాసిక్యపణంతో విలుచుకున్న మధురనాయకుడి కృతి, మధురకృతులకు నాయకమే అని కావ్యానందులు అంగీకరించి తీరవలసింది.

రామకృష్ణశాస్త్రి

  1. కురుగంటి సీతారామయ్యగారు తమగ్రంథాన, మధురరాజులవంశావళి యిస్తూ, తిరుమలుని కొమారుడు, ముద్దువీరప్ప, అతని కుమారుడు చొక్కనాథుడు అన్నారు. సత్యనాథ అయ్యర్ గారి ఆంగ్ల మధురనాయకచరిత్రములోనూ ఇలాగే ఉన్నది. మఱి రామయ్యపంతులుగారు మనుమడి మనుమడని రెట్టించారు. ఎందువల్ల?
  2. .........జైమిని భారతమునందుగూడ నీతనివంశావతార మభివర్ణింపఁబడియుండును గాని, పరిషత్తునకు దొరికిన ప్రతులయందు నవతారికాభాగము పోయినది. శేషము వేంకటపతికవి తనవంశావతారమును వర్ణించినట్లుగా నొక్కరీతిగా సారంగధరచరిత్రయందు, నహల్యాసంక్రందనమునందును, వర్ణించుకొనిన యాతని వంశక్రమ మిట్లని తెలియుచున్నది.

    కేశవప్పనాయడు (మూలపురుషుడు)
    |
    వేంకటనాయడు
    |
    పెదగురవప్పనాయడు
    |
    ఎల్లి సెట్టినాయడు
    |
    వేంకటనాయుడు = వేంకటాంబ
    |
    మీనాక్షినాయడు = అలమేలమ్మ
    |
    వేంకటకృష్ణప్పనాయడు.

    —జైమిని భారతభూమితే, ఆం. సా. పరిషత్.

  3. ఇక్కవి యైదాశ్వాసముల జైమినిభారత వచనకావ్యమునే గాక సారంగధరచరిత్రమను మూఁడాశ్వాసముల వచనగ్రంథమును, అహల్యాసంక్రందనమను మూఁడాశ్వాసముల శృంగారప్రబంధమును, రాధికాసాంత్వనమనియెడి యేకాశ్వాసశృంగారప్రబంధమును రచియించెను. ఇందు మొదటిది, పాండ్యమండలాధీశ్వరుఁడగు విజయరంగచొక్కనాథున కంకితమొనర్చి మిగిలినవానిని శ్రీరంగస్వామికిఁ గృతి యొసంగెను. ఇందు జైమినిభారతము నైదాశ్వాసముల యాద్యంతములందును,

    శ్రీరాధావరచరణాం
    భోరుహభృంగాయమానభుజకరవీరా
    ధారాఖండితశాత్రవ
    శూరా శ్రీవిజయరంగచొక్కవజీరా!

    ఇత్యాదిగాఁ గృతినాయకవర్ణనపద్యంబులును, బ్రత్యాశ్వాసాంతమునను,

    'ఇది శ్రీపాండ్యమండలాధీశ్వర శ్రీవిజయరంగచొక్కనాథ మహీనాథ కరుణా కటాక్షసంపాదిత గజతురంగ మాందోళికాప్రముఖనిఖల సంపత్పారంపరీ సమేధమాన సముఖమీనాక్షీనాయక తనూభవ....' ఇత్యాదిగా గద్యములు నుండుటంబట్టి యితడు విజయరంగచొక్కభూపాలునకు సమకాలికుఁడై యాతనికిఁ గృతినిచ్చిన కేవలకవి యనియే కాక, యహల్యాసంక్రందనములో శేషము వేంకటపతికవి చెప్పినట్లుగాఁ దన్ను వర్ణించుకొనిన, 'ధైర్యమా శౌర్యమా ... శౌర్యసాంద్ర!' (1-40) అనుపద్యముంబట్టి యితఁడు పాండ్యభూనాథుని యాస్థానమందలి ముఖ్యసామాజికులలో నొకఁడైనట్లును దెలియుచున్నది. —మఱియు

    తే. ...'రంగధరపతి నేను సారంగధరచ
           రిత్ర వచనము చేసి తత్కృతిని నాకు
           నంకితము సేయుము శుభంబు లగును నీకు

    (సారంగధర ప్రస్తావన)

    శా. 'వాసిన్ రంగవిభుండ నేను .. ... నీకు మేలౌనిఁకన్.

    (అహల్య 1–15)

    —'అని యానతిచ్చుటయు నేనును దోడన మేల్కాంచి పురోహితభృత్యామాత్యసామాజికవర్గంబులు గొలువం గూర్చుండి యుభయభాషాకవితావిశేషులైన శేషము వేంకటపతి, బుణిగె శ్రీకృష్ణకవీంద్రులు మాకాప్తసఖులు గావునం బిలిపించి, యాశుభస్వప్నంబు వినిపించుటయు ' అని సారంగధరచరిత్రమునందు, నహల్యాసంక్రందనమునందును దనకుఁ గూడ భృత్యామాత్యసామాజికవర్గము గలదని వ్రాసికొనుటంబట్టి పూర్వగద్యములో వ్రాయబడినట్లుగా నీతఁడు విజయరంగచొక్కనాథుని దయచే సామంతరాజై కొన్నిగ్రామముల కధిపతియైనట్లు కూడఁ దెలియుచున్నది.

    శ్రీవిజయరంగచొక్కనాథుఁడు 1704-31 నడుమఁ బాండ్యమండల మేలినవాఁడగుటచే (ఆo. సా. ప. ప, సంపు: 2- 220) మన కవికూడ నక్కాలముననే యుండెననుట స్పష్టము.

    [—జైమినిభారతం పీఠికలో మల్లాది సూర్యనారాయణశాస్త్రిగారు.]

  4. మీనాక్షీ నాయకుడు ... తిరుమలనాయకుని మంత్రిగా నుండెననియొకప్రతీతి కలదు. వేంకటకృష్ణప్పనాయకుడు తిరుమలనాయకుని మనుమని మనుమడగు విజయరంగచొక్కనాథుని యాస్థానమున నుండెను. దీనినిబట్టి తండ్రికిని గుమారునికిని నడుమ నంతర మధికముగా గనుపట్టుచున్నది. వెంకటకృష్ణప్పనాయకుడు మీనాక్షినాయకుని వృద్ధదశలో బుట్టినవాడనియు, విజయరంగచొక్కనాథుని రాజ్యకాలమునందు వేంకటకృష్ణప్పనాయకుడు కూడ వృద్ధుడుగా నుండెననియు నూహించినచో నీయంతర మత్యధికముగా దోపకపోవచ్చును, గాని, వేంకటకృష్ణప్పనాయకుని తల్లియగు అలమేలక్క 'మంగమ్మసాకుడుకూతు' రను ప్రతీతి యుండుటచే, నామెభర్తయగు మీనాక్షినాయకుడు విజయరంగచొక్కనాథుని పితామహి యగు మంగమ్మదేవిక్రింద మంత్రిగా నుండెనని యూహించుటయే సమంజసముగా గన్పట్టుచున్నది. ఈ మంగమ్మదేవి, 1689–1704 వరకు విజయరంగచొక్కనాథుని సంరక్షణకర్త్రిగా రాజ్యము చేసెను. మీనాక్షినాయకుడు మధురమీనాక్షి యాలయమున కెదుట నొకమండపమును గట్టించి, యఖండదీపముగూడ నిల్పెనట, విజయరంగచొక్కనాథు డనేకధర్మకార్యములు చేసెను. శొంఠిగున్నయ్య యను నాంధ్రబ్రాహ్మణున కొకయగ్రహార మిచ్చెనట. ఈబ్రాహ్మణునిసంతతివా రిప్పటికిని నాయగ్రహార మనుభవించుచు పెరియకొళ గ్రామమందున్నారు. విజయరంగచొక్కనాథుడు గతించినపిదప నాతనిభార్య మీనాక్షమ్మ 5, 6 సంవత్సరములు మాత్రమె రాజ్యము చేసెను. అనంతరము దేశము తురుష్కాక్రాంతమాయెను. అప్పుడు వేంకటకృష్ణప్పనాయకుని కుటుంబమువారు తమ బంధువగు వడగరై జమీందారు నాశ్రయించి, యచ్చటనే నివసించిరి ...'

    —జైమినిభారత భూమికలో జయంతి రామయ్యపంతులుగారు.

  5. వేంకటకృష్ణప్పనాయకునికి 'సంగరసవ్యసాచి' 'సంగరకిరీటి' అనేబిరుదము లుండేవని, వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ప్రకటించిన 'తంజావూరు ఆంధ్రరాజులచరిత్రము' అనే ప్రాచీనవచనగ్రంథాన్నిబట్టి తెలుస్తున్నది. కానీ, శేషము వేంకటపతి వర్ణించినట్లుగా ఉన్న అహల్యాసంక్ర్రందనం అవతారిక పద్యాలలో ఎంతవరకు చూసినా, వేంకటకృష్ణప్పనాయకునికి, 'లీలామనోజాకృతీ!', 'కంతుజయంతరూప' 'కవికల్పక’ ‘భాషాఫణిగ్రామణీ' ఇలా సందర్భానికి సరిపోయే విశేషణగౌరవములే కనపడుతూన్నవి కాని, సంగరసవ్యసాచి, సంగరకిరీటి — వీటిప్రశంసే లేదు. 'రిపుజయాధార' 'శౌర్యసాంద్ర' యిలాగని పరాక్రమాన్ని కూడా అభినందించడం మరువనివాడు, ముఖ్యవిషయములను ఎందుకు వదలివేశాడో తెలియకుండా ఉన్నది. బహుశః అప్పటికింకా ఆబిరుదులు లభించి ఉండవనుకోవలెనా? కురుగంటి సీతారామయ్యగారు, తమ ఉపన్యాససంగ్రహములో, ఈమాట ఎత్తనేలేదు.
  6. ఈ ప్రశంస కూడా, వేంకటకృష్ణప్పనాయకుని గ్రంథములలోకి ఎక్కకుండా, చరిత్రాంశంగానే నిలిచిపోవడం చూస్తే, విజయరాఘవుని జయించడంతో కాని, సంగరసవ్యసాచి సంగరకిరీటి బిరుదములు రాలేదేమో; అప్పటికే గ్రంథములు రచించడం ముగిసి చాలా కాలమైందేమో?
  7. 'రమ్మనవే. సముఖానరాయబారమేటికే' మొదలైన మూడు నాలుగు పదాలు 'వేంకటకృష్ణప్పనాయకునిమీద క్షేత్రయ చెప్పాడని వినికిడి. తిరుమలేంద్రుని ఆస్థానాన్ని ఆమహాకవి పావనంచేస్తూ మధురలో నివసించుతూండేనాటికి, వేంకటకృష్ణుడు అప్పుడే అంకురించిన యౌవనంలో విలాసవిహారాలకు కాలు దువ్వుతూండటం; ఆతనిచక్కని విగ్రహం అంతకన్న చక్కని రాసిక్యం, గమనిస్తూ క్షేత్రయ ముగ్ధుడై పోయి, ఆతనిమీద పదము లల్లడం విని, పండుముదుసలి అయిన తిరుమలేంద్రుడు ఎంతో మెచ్చుకుని, మీనాక్షీనాయడు ఏమీ కంటగించుకోకుండా సర్ది చెప్పాడనీ, దక్షిణదేశంలో భరతాభినయవిదుల సంప్రదాయంలో నిలిచిపోయినకథ.
  8. మ. పవడంపున్ జిగివాతెఱన్ సుధయు, రంభామోహనస్ఫూర్తి యూ
         రువులన్, మందగతిన్ సితేభవిభుతీరున్, దంతసంపత్తి వ
         జ్రవిలాసంబు దగన్ స్వవస్తుచయవిశ్రాంతిన్ సురాధ్యక్షుఁ డీ
         నవలా మేకోనె నేరికేల కినియన్ నాతప్పెగా కింతయున్.

    సీ. వదనలోచన కైతవమున రాకాచంద్ర
                        కమలంబులకు బొండు కలుగఁజేయ
         మందస్మితోష్ణదంభంబున జంద్రికో
                        దయరాగములకు బాంధవ్య మునుప
         గమనలీలావలగ్నఛ్ఛలంబునను మ
                        త్తకరికేసరులకు సఖ్యంబు నెఱప
         సరసభాషారదచ్ఛద్మ౦బునను శుకీ
                        దాడిమీబీజాళి దగులు పఱఫ
    తే. నేఁ బ్రయత్నంబు చేసి యీ యిందువదన
         సృజన చేయుట దెలియక జేసెదలుక
         కుమ్మరికి నొక్కయేడును గుదియ కొక్క
         పె ట్టనెడుమాట నిజము గాన్పించె నిపుడు.

    తే. మందయానల డెందంబు మంద మలుకఁ
         జెందనేటికి నాపల్కుఁ జిత్తగించి
         యువిద కిదిగాక నేరంబు లొకటిరెండు
         గావుము...

    —సమీరకుమారవిజయం, ప్రథమాశ్వాసము 182-84

  9. నవనాథుల చర్యలకు ప్రధానరంగము మహారాష్ట్రదేశభాగముగా గనబడుచున్నది. శివపుత్రుడగు మీననాథుడు తండ్రివలన నధ్యాత్మవిద్యోపదేశమును బొంది, ధరణిపై జరియింపబొమ్మన, నాతనియాజ్ఞ వడసి, భూలోకమున సులలితయోగాబ్ధిచంద్రుడై, సకలదేశంబులును దిరిగి, మాళవదేశంబున, రాజమహేంద్ర నరేంద్రపరిపాలితంబగు మాంధాతపురంబున దొలుత విడిసిన వాడయ్యెను. ఈ సందర్భమున నీతడు తిరిగిన దేశములలో నాంధ్రదేశ మున్నట్లు చెప్పబడియుండలేదు. ఈతడు తొలుత వాస మేర్పఱచుకొన్నట్లుగా చెప్పబడినది, మాళవదేశమునందలి మాంధాతపురముగాని, యది యాంధ్రదేశమునం దేపట్టణమును గాదు.

    ఈ మాంధాతపురాధీశుండగు రాజమహేంద్రుని కుమారుడు, సారంగధరుడు. ఈతనికథయంతయు, నీమాలవదేశగతమగు మాంధాతపురముననే జరిగెననియు, తత్ పురసమీపమునందలి కొండలలో వాస మేర్పఱచుకొనియున్న మీననాథుని యనుగ్రహమువలననే యాతనికి గాలుసేతులు మరల గలుగగా, 'చౌరంగి' యనునామమున సిద్ధుడై యాతని శిష్యులలో నొకడయ్యెననియు, నీరాజమహేంద్రుని యాలమందలను గాచు గోరక్షకుడుగూడ, నాతని ముఖ్యశిష్యులలో నొకడై, యోగసామ్రాజ్యపట్టభద్రు డయ్యెననియు జెప్పబడినది....

    ......మీననాథుడు కాని, యాతని 'వెంటనంటియున్న సారంగధరుడుకాని, యాంధ్రదేశమునకు వచ్చినట్టులైన గనబడదు. ఇట్లీ నవనాథుల కధలన్నియు హిందూదేశమున బశ్చిమతీరభాగమునకు సంబంధించిన ట్లగపడుచుండగా నిందు ప్రధానపురుషులలో నొక్కడును మీననాథుని తొలిశిష్యుడును నగు సారంగధరుని గూర్చినకథ యాంధ్రదేశమునకును, నందు నాయకరత్నమునుబోని రాజమహేంద్రవరమునకును సంబంధించినదిగా జిరకాలమునుండి యీదేశమున దలంపబడుచుండుట యాశ్చర్యకరము కాకమానదు ...

    సారంగధరుని గూర్చిన కథలు:- మత్స్యేంద్రనాథుని యనుగ్రహమువలన సిద్దుడై చౌరంగి యనుపేరు వహించిన యీసారంగధరునికథ భిన్నరీతుల గానవచ్చుచున్నది. మహారాష్ట్రభాషలోని నవనాథచరిత్రనుబట్టి రచింపబడిన తెలుగుగ్రంథములో, నీచౌరంగి పేరు కృష్ణాగరుడని కలదు. ఈతడు కౌండిన్యనగరాధిపుడగు శశాంగనృపాలుని పుత్రుడు. ఈతని పట్టమహిషి మందాకిని. వీరికి చిరకాలము సంతానము లేకుండుటచే వీరు మాధవుని ధ్యానించి, సంగమేశ్వరమున నాతని బూజింప, నాప్రదేశమున నొకనాడు రాజు అర్ఘ్యంబిడుసమయంబున శివవీర్యబలంబుచే నాతని యంజలీభాగంబున నర్భకు డుద్భవించెను. అతని దెచ్చి రాజు భార్యకొసగి కృష్ణాగరుడని నామకరణంబొనర్చెను. పిదప నీతనికి వివాహము జేయ, రాజు ప్రయత్నము చేయుసమయంబున మందాకినీదేవి మరణించుటయు, రాజు, కొమరునికై యుద్దేశించిన చిత్రకూటనగరాధిపుని కుమార్తెయగు భుజావంతిని దానె వివాహమయ్యెను. ఈమె యొకప్పుడు నవయౌవనుడగు కృష్ణాగరుని జూచి మోహించి, రాజు మృగయావినోదంబున నరణ్యంబున కేగినతఱి, యొకచెలికత్తెను బంపి యాతనిం బిలిపించి, తనచిత్తంబునగల చిత్తజునితాపమును వెలిబెట్ట, నాత డతికృద్ధుడై యామెప్రార్థనమును దిరస్కరించి, తనయింటికిబోయెను. పిదప, నీవిషయము కృష్ణాగరుడు తండ్రి కెఱిగించునేమో యనుభయముచే, బరితపించుచుండు సమయంబున దనచెలికత్తెచేసిన దుర్బోధనలచే, నేరంబు కుమారునిపై వైచి, రాజునకు గోపము పుట్టించి, కరపాదఖండనము జేయించెను. అప్పుడా యూర ద్రిమ్మరుచున్న గోరక్షనాథు డీవిషయము మత్స్యనాథునికి తెలిపి, కృష్ణాగరుడు శివవీర్యోద్భవు డగుట యెఱింగి, చతురంగపీఠముపై కరచరణంబులు ఖండింపబడినకతంబున నాతనికి చౌరంగనాథ నామం బిడి తండ్రి కెఱిగించి వానిం దోడ్కొని, బదరికాశ్రమంబునకు జని, యచ్చట ఘోరతపోనియమంబున, గరచరణంబులతో గూడ, మహాసిద్ధుల నాతడు బడయునట్లు చేసి, యనుగ్రహించెను.

    చేమకూర వేంకటకవి సారంగధరచరిత్రకు బీఠిక వ్రాయుచు నందాకథకు మూల మనదగిన చౌరంగికథ నవనాథచరిత్రములం దిట్లు కలదని, యీక్రింది కథను వేదము వేంకటరాయశాస్త్రులుగారు ఇచ్చియున్నారు.

    రుద్రపురమున భులేశ్వరుడను రాజు కలడు, అతనికి, చంద్రావతి, శోభావతి యను నిద్దఱుభార్యలు. శోభావతి, సవతిని వేలార్చుటకై, యామెపై ఱంకులు మోపి, గర్భిణీయగు నామె నరణ్యమునకు వెడలగొట్టించెను. ఒకశివాలయముకడ నొకగంధర్వకన్య యీమెకు మత్స్యేంద్రవ్రత ముపదేశించెను. చంద్రావతియు, మునుల యాశ్రమమున నొకసుతుని గని, చంద్రశేఖరుడని మునులచే నామకరణము చేయబడిన యాతనికి మత్స్యేంద్రోప్రాప్తి నుపదేశించెను. ఒకప్పుడు, భువలేశ్వరుడు, యజ్ఞము చేయుచుండగా, మునీశ్వరులతో గూడి యీకుమారు డచ్చటకు బోవుటయు, యజ్ఞభూమికడ మునిశిష్యులతో బంతులాడుచున్న యీకుమారుని, శోభావతి చూసి మోహించి, యాతని బంతి తనచేటికచే చెప్పించుకొనెను. బంతియడుగబోయిన చంద్రశేఖరునికిని శోభావతికిని, పావురమడుగబోయిన సారంగధరునికి చిత్రాంగికి జరిగినవృత్తమే జరిగినది. శోభావతీప్రేరణంబున రాజు చంద్రశేఖరుని కాలుసేతులు తలారులచే దఱిగించెను. మత్స్యేంద్రనాథస్మరణముచే నాతడు కాలుసేతులు మరల బడసి తల్లియొద్దకు బోయెను. రాజు తథ్యమును దెలిసికొని శోకింప, మత్స్యేంద్రనాథు డాతనిచే బ్రాయశ్చిత్తముగా నొకశివాలయము నిర్మింపజేసెను. అదియే బదరికాశ్రమమున భులేశ్వర మనుపేరనున్న దేవాలయమట.

    వీనిని బోలిన కథ యొకటి కొంతభేదముతో గన్నడభాషలో గూడ, 'కుమారరాముని కథ' యను పేరుతో బొడసూపుతున్నది.

    — పదునాల్గవశతాబ్దిని కంపిలిరాయుడను రాజొకడు హంపీసమీపమున గల కంపిలినగరము పాలించుచుండెను. ఈతనికి గుమారరాముడను కుమారుడొకడు కలడు. ఈతడు మహాశూరుడు, బాహుబలపరాక్రమశాలి. దిగ్విజయార్ధము బయలుదేరి, యనేకులగు రాజులనోడించి, తండ్రికి గప్పము గట్టునట్లు చేసెను...

    ఒకనాడు కంపిలిరాయడు వేటకై యరణ్యమునకు బోయినసమయంబున కుమారరాముడు స్నేహితులతో జెండాట నాడుచుండ బంతి, విధివశమున రాజు రెండవభార్యయగు రత్నాజి మేడపై బడెనట. దానిని తెచ్చుకొనుట కీత డచటికి పోయి యామె నడుగగా, నామె యీతనిని మోహించి, క్రీడాగృహమునకు రమ్మనుటయు, నాత డాపాపకార్యమున కంగీకరింపక, విదిలించుకొని పాఱిపోయేను. రా జరణ్యమునుండి యింటికి రాగానే, రత్నాజి, కుమారరాముకు తండ్రి యింటలేనిసమయముజూచి, తనమేడకు వచ్చి తన్ను బలాత్కరించెనని కొండెములు చెప్పగా, రా జామె మాటలను నమ్మి కుమారునికి మరణదండనము విధించెను. మంత్రియగు బైచప్ప రత్నాజి చేసిన మోసమును దెలిసికొని, కుమారు నొకపాతాళగృహమున దాచి, యాతని వధించితినని రాజుతో జెప్పి, యాతనిని సమ్మతింపజేసెను. రా జన్యాయముగా గుమారుని చంపించెనన్న వార్త లోకమున వ్యాపించెను. ఈసందర్భమును, ఢిల్లీసుల్తాన్ దెలిసికొని, కంపిలిరాజ్యమును స్వాధీనము చేసికొనుటకై కొంతసైన్యముతో బహదూర్ ఖానుని బంపి, యాత డద్దానిని సాధింపలేకపోగా, తానె స్వయముగా వచ్చి కోటను ముట్టడించెను. అప్పుడు కుమారరాముడు జీవించియున్నచో, శత్రువును సులభముగా పాఱద్రోలి కోటను రక్షించియుండెడివాడని, జనులందరు రాజును నిందింపసాగిరి. ఆసమయమున బైచప్పమంత్రి భూగృహమునుండి కుమారరాముని దీసికొనివచ్చి, యాతని ముందిడుకొని, కోటవాకిలి దెఱుచుటయు నాకుమారరాముడు శత్రుసేనలను జెండాడి, యావలికి బాఱద్రోలెను. కాని, ఢిల్లీసుల్తాన్ సేన లపారముగా నుండుటచే, వారితో బోరాడుచూ, కుమారరాముడు రణరంగమున బ్రాణముల విడువవలసినవాడయ్యెనట.

    .. ఢిల్లీసుల్తాన్ గా నున్న తుగ్లక్ కంపిలిరాయనిపై దండెత్తి యానగరమును స్వాధీనపఱుచుకొనినట్లు, చారిత్రకనిదర్శనములు గలవు. రాజమహేంద్రవరమందు వలెనె అచ్చటను, గొన్నిస్థలములను ‘చిత్రాంగిమేడ, రత్నాంగిమేడ యున్నస్థలము' అని చెప్పి చూపుచుండువాడుకయు గలదట...

    మఱియు, బౌద్ధజాతకములలో గూడ, వీనిని బోలిన కథయే గలదట—

    [- గౌరన ద్విపద నవనాథచరిత్ర పీఠికలో, కోరాడ రామకృష్ణయ్యగారు]

  10. ఇది అయిదాశ్వాసముల వచనకావ్యము... ఈకవి అధ్యాయక్రమమున గద్యము వ్రాయుటబట్టి సంస్కృతాశ్వమేధపర్వమును గూడ చూసినాడని చెప్పవలసి వచ్చినది. కాని, వచనరచనమంతయు, బదములు వాక్యములు సమాసములు ప్రయోగించుటలో, గూడ, పిల్లలమఱ్ఱి పినవీరభద్రుని పద్యకావ్యమునే వచనశైలిలో వ్రాసెనని చెప్పగలదు. కాని, కవి యందందు, విశేషముగా శృంగారవర్ణనాసందర్భములందును సామాన్యముగా యుద్ధవర్ణములయందు, నాసంస్కృతాంధ్రకావ్యములను రెంటిని గూడ మీఱి, యథేచ్ఛముగా గల్పనము గావించి, స్వకవిత్వమును గూడ గొంతవర కిందు జొనిపెను. మఱియు మూలమును, నాంధ్రపద్యకావ్యమును గూడ మీఱి వర్ణనాతీరేకంబునను, గథితకథనంబునను గ్రంథ మామూలాగ్రముగా బెంచి వ్రాసెను...

    [— జైమిని భారత పీఠిక ]