అష్టాంగయోగసారము/పాఠం

వికీసోర్స్ నుండి

శ్రీగురుభ్యో నమః.

అష్టాంగయోగసారము


కం॥ శ్రీగణనాథుని దుర్గను
    బాగుగ శంకరుని క్షేత్రపాలుని వాణిన్
    శ్రీగురు సుబ్రహ్మణ్యుని
    యోగుల సురమౌని భక్తియుతులన్ గొలుతున్॥

సీ॥ వన్నె కెక్కిన నందవరచౌడమాంబను
           శ్రీనివాసుని విరించిని నుతించి
    శ్రీతరిగొండ నృసింహుని కీర్తించి
           యా వరాహపురాణ మలఘుపద్య
    కావ్యంబుఁ జేసి యోగములందు విస్తార
           ముగ రచించితిఁ గాన మొనసి సభల
    నీ యోగమర్మంబు లెఱిఁగి చెప్పం దగు
           ననుచుఁ గొందఱు వల్కి రందువలన
గీ॥ నా వరాహపురాణమం దమరు యోగ
    సరణి నీవలఁ దీసి యెచ్చటను భక్తి
    యోగమే యుంచి యష్టాంగయోగసార
    మనఁగ నీకృతి రచియింతు నార్యులార॥

వ॥ మదపచారంబు క్షమించి తత్కథాక్రమం బెట్లన్నను.

చం॥ వెలయు పురాణధర్మములు వేడ్కగ సూతుఁడు దెల్ప శౌనకా
    దులు విని యొక్కనాఁడు బహుదుస్తర యోగవిధానమర్మముల్
    దెలుపుమటన్న నా ఘనుఁడు ధీరతమీరఁగ నమ్మునీంద్రులన్
    గలయగఁ జూచి యిట్లనియె గౌరవమొప్ప గురుందలంచుచున్॥

సీ॥ వినుడి సంయములార మును భూమిదేవి కీ
        యష్టాంగయోగంబు లా వరాహ
    దేవుండు దయ నుపదేశించిన విధంబు
        సాత్యవతేయుఁ డాశ్చర్యముగను
    విని నాకుఁ జెప్పినవిధము మీకెఱిఁగింతు
        నారీతు లెట్లన్న నమర మీకుఁ
    జెప్పెద నొకనాఁడు శ్వేతకిటిస్వామి
        నీక్షించి ప్రణమిల్లి యిష్టముగను
గీ॥ ధారుణీదేవి యడుగఁగా దయను బోత్రి
    వైష్ణవాచారధర్మముల్ వరుసగాను
    జెప్పగా విని సంతోషచిత్త యగుచు
    నల మహీకాంత విభు నిట్టు లడుగఁ దొణఁగె॥

శా॥ దేవా! జ్ఞానవిరక్తిభక్తులను సాధింపన్ ద్విజుల్ నిత్యమున్
    ధీవిశ్రాంతి నొసంగు మోక్షగతియందే లక్ష్యమున్ నిల్పుచున్
    గావింపందగినట్టి సత్క్రతువులన్ గావింపగావచ్చునో
    పోవీడం దగునో యథార్థముగఁ దత్పుణ్యస్థితిన్ జెప్పవే॥

వ॥ అని యడిగిన భూదేవిని జూచి వరాహస్వామి యిట్లనియె.

బ్రహ్మసాయుజ్యప్రాప్తి విధానము



సీ॥ భాసురవిజ్ఞాన భక్తివైరాగ్యముల్
        గలిగినవారైనఁ గర్మములను
    విడువగాఁ దగ దది వేదోక్తమార్గంబు
        గాన సల్పందగుఁ గ్రమముగాను
    స్నానసంధ్యాదులు సవనముల్ నిజశక్తి
        కొలఁది సల్పందగుఁ గోర్కె విడచి

    హరి కర్పితం బని యాచరించిన హరి
        సంతుష్టుఁడగు నదే సత్ఫలంబు
గీ॥ గనుక విప్రులు వేదమార్గక్రమమున
    జన్నములు సేయుచున్న నీశ్వరుఁడు మెచ్చి
    యిష్టఫలములఁ దా[1] వారి కిచ్చుచుండు
    నందుచే జన్నములొనర్తు రార్యులెల్ల॥

వ॥ ఇవ్విధంబున మదాజ్ఞాధారులై నిష్ణామసత్కర్మంబుల నాచరింపవలయు నట్లాచరింపక మదాజ్ఞోల్లంఘనంబుఁ జేసినవారు దోషయుక్తు లగుదురు గావున సద్రాహ్మణులు యజనాదిషట్కర్మంబు లాచరించుదురు. అందుఁగొందఱు బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థధర్మంబు లాచరించి, తత్త్వజ్ఞులై సన్యసించి కర్మముక్తులై ప్రణవోచ్చారణంబు సేయుచు నీశ్వరధ్యాననిష్ఠాగరిష్టులై మఱువక నారాయణస్మరణంబుఁ జేయుచు నివ్విధంబున సన్యాసవిధిఁ గొన్నియ[2]బ్దంబు లాచరించి పరిపూర్ణజ్ఞానోదయంబైన
పిమ్మట విధివత్తుగా దండకమండలువుల విడిచి యవధూతాశ్రమంబు నంగీకరించి శీతోష్ణసుఖదుఃఖాదిద్వంద్వాతీతులై సచ్చిదానందనిత్యపరిపూర్ణబ్రహ్మానుసంధానంబు సేయుచుండవలయు నట్లు చేసినవారు బ్రహ్మసాయుజ్యంబు నొందుదురని చెప్పి వరాహస్వామి మఱియు నిట్లనియె.

బ్రహ్మద్వైవిధ్యము


సీ॥ వెలఁది బ్రహ్మము రెండు విధములై యుండుఁ బ
        రాపరంబు లనంగఁ బ్రబలు నందుఁ
    బర మక్షరంబు నపరమౌ క్షరం బీ క్ష
        రంబు జీవుం డక్షరంబు విమల

    కూటస్థుఁడనఁబడు, పాటింపఁ బరమాత్ముఁ
        డతఁడె, పరేశ్వరుం డతఁడె గురుఁడు
    పురుషోత్తముఁడు సర్వపూర్ణుఁడౌ బ్రహ్మాంశ
        జుండనఁదగిన జీవుం డవిద్య
గీ॥ నంటి పరిమితిలేని దేహంబులందుఁ
    జొచ్చి వెడలుచు బహుమోహశోకవార్డు
    లందు మునుఁగుచుఁ దేలుచు నహముఁ బెంచి
    భూరికర్మంబు లొనరించి పుట్టు గిట్టు॥

వ॥ అట్టి జీవుం డవిద్యోపాధిచేత భిన్నుండగుచు ననేకదేహంబు లెత్తుచుండు, నందుఁ గొన్నిదేహంబులందుండి మిక్కిలి పాపకర్మంబులు చేసి యధోగతి నొందుచు నిష్కామపుణ్యకర్మంబులు చేసి యూర్ధ్వగతిఁ బొందుచుఁ బుణ్యపాపమిశ్రకర్మంబులు చేసి సుఖదుఃఖంబు లనుభవింపుచు మర్త్యలోకంబునఁ బుట్టుచు గిట్టుచు నుండు నందుఁ గొందఱు కామభోగాదిసక్తులై యుందురు మఱియును.

ఉ॥ కామముచేఁ గ్రతుప్రముఖకర్మము లొప్పుగ నాచరించి సు
    త్రామపురాదిలోకములఁ దక్కగఁజేరి సుఖంబు లొంది యం
    దేమఱియున్న పుణ్యతతు లెప్పుడు నాశమునొందు నప్పుడే
    భూమినిఁ బుట్టి క్రమ్మఱను బోవుచు వచ్చుచునుందు రెప్పుడున్॥

వ॥ అందుఁ గొందఱు యోగాభ్యాసనిష్ఠులై సత్పదంబు నొందుదురనిన విని భూదేవి యిట్లనియె.

గీ॥ ఘనతరములైన యోగప్రకారములను
    దేవ సత్కృపతో నాకుఁ దెలుపవలయు
    ననుచుఁ బ్రార్ధింప ముదమంది యా వరాహ
    దేవుఁ డిట్లనె నాభూమిదేవి కపుడు॥

యోగమార్గక్రమము


వ॥ యోగమార్గక్రమం బెట్లనిన గురూపదేశక్రమంబుగా యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యానధారణ సమాధులనియెడి యష్టాంగయోగంబు లభ్యసింపపలయు నందు యమం బెట్టిదనిన.

యమస్వరూపము


సీ॥ జగతి నహింసయు సత్య మస్తేయంబు
        బ్రహ్మచర్యం బార్జవంబు క్షమయు
    నతిదయ ధృతి మితాహారముల్ శౌచంబు
        నీపది యమము లవెట్టు లనిన
    సకలజీవులకుఁ గ్లేశంబు బుట్టింపకు
        న్నట్టిచంద మహింస యనగఁ బరగు
    నవని నందఱ కిష్టుఁడై దబ్బరాడకు
        న్నట్టి చందము సత్య మన్యధనముఁ
గీ॥ గోరి మాయలఁబన్ని కైకొనఁదలంప
    కుండు టస్తేయ మనఁబడు నొరులసతుల
    మాతృభావముగాఁ జూచుమతము బ్రహ్మ
    చర్యయన నొప్పుచుండునో సరసిజాక్షి॥

గీ॥ సారదయ భూతమైత్రి, యార్జవమనంగ
    నకుటిలత్వ మగున్ క్షమయనఁగ నోర్పు
    ధృతి యనఁగ ధైర్యమనఁదగు, మితసుభుక్తి
    యనగ మితభోజనము, శౌచమనఁగ శుద్ధి॥

వ॥ యమం బీపదివిధంబులఁ జెప్పందగు నింక నియమంబు లెయ్యవి యనిన.

నియమస్వరూపము

యోగశాస్త్రరతియు, సత్పాత్రదానంబును, సంతోషంబును, లజ్జయు, వ్రతంబును, మతియును, ఆస్తిక్యంబును, ఈశ్వరార్చనంబును, దపంబును, జపంబును, నననొప్పు నీ దశవిధంబులైన నియమంబులందు, వాదాస్పదశాస్త్రంబు లుదరపోషణార్థంబని నిరసించి, మోక్షప్రదశాస్త్రంబు లభ్యసించుట యోగశాస్త్రరతియగు. తనకుఁ బ్రాపంబైన ధనంబు గురుద్విజార్థులకు సమర్పించుచుండుట పాత్రదానంబగు. లాభాలాభ శుభాశుభ సంయోగవియోగ మానావమాన స్తుతినిందాదుల మోదఖేదంబులు లేక యుండుటె సంతోషంబగు. సుజనసాంగత్యంబువలనఁ దన దుర్గుణంబులఁ దాఁ దలఁచి తన్ను దా నిందించికొని దుర్గుణంబుల మాని సుగుణంబు లభ్యసించుటె లజ్జయగు. తా సంకల్పించి చేయు మోక్షసాధనంబు విడువక యాచరించుట వ్రతంబగు. తాఁజేయు యోగంబునకు రోగదారిద్ర్యసంశయ శాస్త్రవాద రసవాద దుర్జనసహవాసాది విఘ్నంబులు వచ్చినప్పటికిని జలింపకుండుటే బుద్ధియగు. మతభేదపురాణేతిహాసాది సద్గ్రంథంబులను శ్రద్ధతోఁ జూచి సారార్థగ్రహణంబుఁ జేయుటే ఆస్తిక్యంబగు. అతితేజోమయంబైన యీశ్వరస్వరూపంబును గురుముఖంబుగా నెఱిఁగి హృత్కమలమందు మనంబున ధ్యానించి పూజించుటే యీశ్వరార్చనంబగు. గురువాక్యంబు సత్యంబుగా నమ్మి చెప్పిన నియమంబు తప్పక కష్టంబున కోర్చి నడపుటె తపంబగు. జప్యాజప్యంబులయందుఁ దనకు గురుం డుపదేశించినమంత్రంబు నిశ్చలుండై విడువక జపించుటే జపంబగు. నీ పదియు నియమంబులగు నిట్టి యమనియమంబు లిరువదియు నంతశ్శుద్ధిప్రదంబులగుం గావున వీని నభ్యసించి యంతశ్శుద్ధి నొంది కీటాది జంతువులు మెదలకుండునట్టి విజనస్థలంబునందుఁ జేలాజినకుత్తరోత్తరంబుగా నాసనంబు నిర్మించి యంద ఆసనంబు లభ్యాసంబు సేయవలయు నవ్విధం బెట్లనిన.

ఆసనములు


సీ॥ పద్మాక్షి విను మెనుబదినాల్గులక్షలై
        నట్టి యాసనము లం దతిశయములు
    నలువొప్ప నెనుబదినాల్గాసనంబు లం
        దధికంబు లష్టాదశాసనంబు
    లటువంటి యష్టాదశాసనంబులలోన
        నతిశయించినవి సిద్ధాసనంబు
    భద్రాసనంబును బద్మాసనంబును
        సింహాసనంబని చెప్పఁదగిన
గీ॥ నాలుగాసనములయందుఁ జాలమేటి
    యనఁగ నొప్పుచునుండు సిద్ధాసనంబు
    పొలఁతి యష్టాదశాసనంబుల విధములు
    వినుము వేర్వేరఁ జెప్పెద విశదముగను॥

వ॥ స్వస్తికాసన, గోముఖాసన, వీరాసన, కూర్మాసన, కుక్కుటాసన, ఉత్తానకూర్మాసన, ధనురాసన, మత్స్యేంద్రాసన, పశ్చిమోత్తానాసన, మయూరాసన, సిద్ధాసన, మతాంతరసిద్ధాసన, భద్రాసన, పద్మాసన, మతాంతరపద్మాసన, బద్ధపద్మాసన, సింహాసన, శవాసనంబు లను నీ యష్టాదశాసనంబులయందు స్వస్తికాసనం బెట్లన్నను.

స్వస్తికాసనము


గీ॥ తరుణి విను జానుజంఘికాంతరములందుఁ
    బదము లొదికిలిగా నుంచి పదిలపరచి
    యున్ననది స్వస్తికాసనంబొనరు గోము
    ఖాసనం బెట్టు లన్నఁ బద్మాక్షి వినుము॥

గోముఖాసనము


వ॥ ఎడమకాలి మెడిమ కుడివీపుప్రక్కగా గుడికాలి మెడిమ నెడమ వీపుప్రక్కగా మోకాటిమీఁద మోకాలు కదియనుంచి కూర్చున్న నది గోముఖాసనం బగు.

వీరాసనము


ఒకపాదము తొడక్రింద నొకపాదము తొడమీదనుంచి కూర్చున్న నది వీరాసనం బగు.

కూర్మాసనము


ఆధారమున కుభయపార్శ్వముల రెండుకాళ్ళమెడిమలు కదియ హత్తించి చక్కగాఁ గూర్చున్న నది కూర్మాసనం బగు.

కుక్కుటాసనము


పద్మాసనముగానుండి మోకాళ్ళతొడలసందులఁ జేతులను దూర్చి రెండుహస్తములు నేలనూని పద్మాసనంబుపై కెగసినట్లుండుట కుక్కుటాసనం బగు.

ఉత్తానకూర్మాసనము


ఇట్లు కుక్కుటాసనస్థుఁడై యుండి రెండు చేతులను మెడను బట్టుకొని కూర్మమువలె వెలికిలబడియున్న నది యుత్తానకూర్మాసనం బగు.

ధనురాసనము


పాదాంగుష్ఠముల రెంటిని రెండుచేతుల ధనురాకృతిగా వీపు వెనుకగాఁ జెవులకు సరిగాఁ బట్టియుండుట ధనురాసనంబగు.

మత్స్యేంద్రాసనము


ఎడమతొడమొదట కుడిపాద మునిచి మోకాళ్ళవెలుపలగా నెడమచెయ్యి చుట్టినట్లుగాఁ గుడిపాదము పట్టుకొని పెడమఱలఁబడియున్న నిది మత్స్యేంద్రాసనం బగు. దీనివలన జఠరాగ్ని ప్రకాశించి కుక్షిరోగములు నశించును. అభ్యాసమువలనఁ గుండలిని మేలు కొల్పును. పురుషునకు దండస్థిరత్వంబు కలుగు.

పశ్చిమోత్తానాసనము


భూమిని ఆనునట్లుగా రెండు కాళ్ళు చక్కగా సాఁచి నడుమువంచి మోకాళ్ళమీఁద లలాట ముంచి రెండుచేతులు సాఁచి రెండుకాళ్ళ బొటనవ్రేళ్ళును రెండుచేతులఁ బట్టియున్న నిది పశ్చిమోత్తానాసనం బగు. దీనివలన వాయువు పశ్చిమమార్గముగా నడుచును. జఠరాగ్ని పుట్టి కడుపు పలుచనై రోగములు నశించును.

మయూరాసనము


హస్తములు రెండు నేలఁబూని మోచేతులు రెండు నాభి యిరుప్రక్కల నుంచి ముఖము మీఁది కెత్తి రెండుకాళ్ళు సాఁచి నెమిలితోకవలె పైకెత్తుకొనియున్న నది మయూరాసనం బగు. దీనివలన నుదరగుల్మాదిరోగములు నశించి జఠరాగ్ని ప్రకాశించి, విషమునైనను జీర్ణముజేయును.

సిద్ధాసనము


ఎడమకాలిమెడిమ మూలాధారమందును, కుడికాలిమెడిమ లింగస్థానమందును నుంచి యేకాగ్రచిత్తంబుగా శీరోగ్రీవాభుజంబులు చక్కగా నునిచి నడుము నిక్కించి భ్రూమధ్యావలోకనంబు చేయుచున్న నిది సిదాసనం బగు. దీనివలన మోక్షద్వారకవాటభేదనం బగు.

మతాంతరసిద్ధాసనము


లింగస్థానోపరి యెడమెడిమ నునిచి దానిపైన కుడిమెడిమ నునిచిన నిదియే మతాంతరసిద్ధాసనంబు. ఇదె యుక్తాసనం బగు.

భద్రాసనము


మెడిమలు రెండు నండాధఃప్రదేశ లింగపార్శ్వముల నుంచి రెండుపాదపార్శ్వముల రెండుచేతులఁ బట్టి కదలకుండిన నిది భద్రాససం బగు. దీనివలన విషములు, సమస్తవ్యాధులు హరించును. ఇదె గోరక్షాసనం బగు.

పద్మాసనము


ఎడమతొడమీఁదఁ గుడిపాదము, కుడితొడమీఁద నెడమపాదము నునిచి వెన్నుగుండా కుడిచేత నెడమతొడమీఁదనున్న కుడిపాదముబొటనవ్రేలినిఁ బట్టి, అటువలెనే వెన్నుగుండా యెడమచేతఁ గుడితొడమీఁదనున్న యెడమపాదముబొటనవ్రేలును బట్టి హృదయమందుఁ జుబుకంబు నునిచి నాసికాగ్రంబుఁ జూచుచున్న నిది పద్మాసనం బగు. దీనివలన వ్యాధులు నశించును.

మతాంతరపద్మాసనము


ఎడమతొడనడుమ కుడిపాదము వెలికిల నునిచి కుడితొడనడుమ నెడమపాదము వెలికిల నునిచి హస్తములు రెండును రెండుతొడలమీఁద వెలికిలగా నునిచి నాసాగ్రమందు లక్ష్యంబు నునిచి దంతమూలమున నాలుక హత్తించి వక్షమందుఁ జుబుకంబు నునిచి మెల్లన వాయువును నిలిపియున్న నిది మతాంతరపద్మాసనం బగు. దీనివలన సర్వవ్యాధులు నాశనమౌను. ఇదె ముక్తపద్మాసనం బగు.

బద్ధపద్మాసనము

హస్తములు రెండు హత్తించి పద్మాసనముగా నుండి చుబుకంబు వక్షమందు హత్తించి చిత్తమందు ధ్యానంబు సేయుచు నపానవాయువు నూర్ధ్వముగా నడుపగా కుండలినీశక్తియుక్తమై నిలిపిన ప్రాణవాయువును విడువగా నిది బద్ధపద్మాసనం బగు. దీనివలన నతిశయమైన జ్ఞానబోధ కలుగును. దీనివలన నాడీద్వారములందు వాయువు నిలుచును. ఈ విధముననే మరణమునొందిన ముక్తు లగుదురు.

సింహాసనము

లింగాండోభయపార్శ్వములందు ఎడమకాలి మెడిమ దక్షిణపార్శ్వమునఁ గుడికాలిమెడిమ యెడమపార్శ్వమున నునిచి చేతులురెండు మోకాళ్ళమీఁదుగా సాఁచి వికసింపఁబడిన వ్రేళ్ళుగా నునిచి (నోరు దెఱుచుక నాసికాగ్రమున లక్ష్యము నునిచియున్న నిది సింహాసనం బగు.) దీనివలన మూలౌడ్యాణజాలంధరబంధత్రయానుసంధానంబు కలుగు. ఇది శ్రేష్టమైన సింహాసనం బగు.

శవాసనము

భూమియందు శవమువలె వెలికలగాఁ బడి కాళ్ళురెండు బొటనవ్రేళ్ళు సరిగాఁ గూర్చినట్లుగా సాఁచికొని హస్తములురెండు వక్షమందు గదియనుంచి పండుకయున్న నిది శవాసనం బగు. దీనివలన సమస్తాసనములు వేయుటవలన గలిగిన బడలిక తీరి చిత్తవిశ్రాంతిసాధనమై యుండును.

ఈ క్రమంబుగా నాసనాభ్యాసంబులుజేసిన నాడులు వశీకృతంబులై దేహంబునకు జవలఘుత్వంబులు కలిగి సర్వరోగహరణంబై శరీరంబు వశపర్తి యగుం గావున దీని సాధించిన యనంతరంబునఁ బ్రాణాయామంబు జేయవలయును. అదెట్లనిన,

ప్రాణాయామము

ప్రాణవాయువును రేచించి చంద్రనాడిచేతఁ బూరించి, యథాశక్తిగా నిలిపి తిరుగ సూర్యనాడిచేత మెల్లనె యుదరమున విడిచి, తిరిగి ప్రాణవాయువును సూర్యనాడిచేత మెల్లనె యుదరమునఁ బూరించి శాస్త్రప్రకారంబుగాఁ గుంభకమును ధరించి తిరుగ చంద్రనాడిచేతను విడువవలయును. ఏమార్గమున విడుచునో ఆమార్గముననే పూరించి ధరించవలయును. మొదటి మార్గమునకంటె రెండవమార్గమున త్వరపడక మెల్లనె విడువవలయును. ఇడయందు పూరించి కుంభించి పింగళనాడిని తిరిగి పింగళనాడిని పూరించి కుంభించి యిడయందు విడువవలయును. ఈక్రమంబుగా సూర్యచంద్రనాడులచేత వాయువు నెంత యుక్తమో యంత విడిచి యెంత యుక్తమో యంత డించి యెంత యుక్తమో యంతే నిలుపవలయును. ఈక్రమంబున జేయు రేచక పూరక కుంభక త్రయంబు నొక్కప్రాణాయామం బగు. ఉదయమధ్యాహ్నసాయంకాలార్ధరాత్రముల కాలమున కిరువది చొప్పున కుంభకములు మెల్లమెల్ల సేయ నెనుబదిగ దినదినమును నభ్యసింపవలయును. అపుడు ప్రాణనిరోధమగుచుండగాఁ జెమట పుట్టినట్లయినఁ గనిష్ఠం బగు. వణఁకు బుట్టినట్లయిన మధ్యమం బగు. మాటిమాటికిఁ బద్మాసనం బెగసినట్లయిన నుత్తమం బగు. దీని యభ్యాసమునఁ బుట్టిన చెమటను మర్దనంబు చేయగాఁ దనువునకు దృఢత్వలఘుత్వంబులు పుట్టును. ఈప్రాణాయామముచేతను మూడునెలలమీఁదట నాడీశుద్ధి కలుగును. ఇది ప్రాణాయామం బగు. ఇంక ప్రత్యాహారం బెట్లనిన.

ప్రత్యాహారము

సీ. శ్రీగురుబోధావిశేషతఁగల బుద్ధి
        చే మానసమును సుస్థిరముఁ జేసి

    యా మతియం దింద్రియవ్యాప్తు లణఁగింప
        నందొప్పుగా నిల్చు ననిలగతులు
    కమఠ మంగములను గదలనీయక కుక్షి
        యందు దాఁచినరీతి నఖిలవిషయ
    కరణానిలములఁ జక్కగఁ బట్టి నిల్పగా
        నదియే ప్రత్యాహార మనగఁ బరగు
గీ. దాన దేహంబు సుస్థిరత్వంబు నొందు
    దీపితంబుగ నేకాగ్రదృష్టి నిలుచు
    దీని సాధించి యటమీఁద ధ్యానయోగ
    మెలమి సాధింపవలె నది యెట్టు లనిన.

ధ్యానయోగము

గీ. రోషదుర్భావవైకల్యదోషములను
    కపటవంచనముల వీడి గర్వ మణఁచి
    సద్గురూక్తులు వినుచును శాంతుఁ డగుచు
    నెపుడు కరువలి నూని సర్వేంద్రియముల.
చ. అపు డుపసంహరించి గురుఁ డానతి యిచ్చిన లక్ష్యముద్రలం
    దుపముగ(?)మానసంబు నిడి యొండొకచింతయు లేక చిత్తమున్
    జపలత బొందనీయకయు షడ్వనజంబులఁ నూని లోనఁ దా
    నెపుడుఁ జలింపకున్న మతి కింపొనరించెడి ధ్యానయోగమై.
    ఇది ధ్యానయోగం బగు నింక ధారణాయోగం బెద్ది యనిన.

ధారణాయోగము

చరణాది జానుపర్యంతంబు పృథ్వీతత్త్వంబుస కధిదైవతంబైన బ్రహ్మకు లకారయుక్తంబైన వాయుధారణాభ్యాసంబున ధ్యానింపఁ బృథ్వీజయంబు గలుగు. జాన్వాదినాభిపర్యంతంబు జలతత్త్వంబగు, తదధి దైవతంబై విష్ణుని వకారయుక్తంబైన వాయుధారణాభ్యాసంబున ధ్యానింప సలిలజయంబు గలుగు. నాభ్యాదిహృదయపర్యంతం బగ్నితత్త్వంబగు, తదధిదైవతంబయిన రుద్రుని రవర్ణయుక్తమైన వాయుధారణాభ్యాసంబున ధ్యానింప నగ్నిజయంబు గలుగు. హృదయాదికంఠపర్యంతంబు వాయుతత్త్వం బగు. తవధిదైవతం బైన మహేశ్వరుని యకారయుక్తంబైన వాయుధారణాభ్యాసంబున ధ్యానింప పవనజయంబు గలుగు. కంఠాదిబ్రహ్మరంధ్రపర్యంతం బాకాశతత్త్వం బగు. తదధి దైవతంబైన బిందుమయగగనశరీరుండైన సదాశివుని హకారయుక్తంబైన ప్రాణపవనధారణాభ్యాసంబున ధ్యానింపఁ దన్మయత్వంబును గగనజయంబును గలుగు. ఇట్లు ధారుణియు, వారుణియు, నాగ్నియు, మారుతియు, వ్యోమియు నన పంచధారణాధ్యానాభ్యాసంబునఁ బంచభూతజయంబు గలుగు. ఇవ్విధంబున.

గీ. ధ్యాన మభ్యాస మొనరింప తలఁగ కపుడు
    మానసము నిల్చు మది నూని మతియు నిల్చు
    బుద్ధి నిలిచిన నానందపూర్తిగలుగు
    నదియె ధారణ యండ్రు యోగాఢ్యు లవని.
    ఇది ధారణాయోగంబగు నింక సమాధి యెట్లనిన.

సమాధి

ఆసనజయంబునను గుంభకసిద్ధిచేతనున్ను నిర్మలంబైన జ్ఞానభానుప్రకాశంబుచేత మాయాంధకారంబు నడంచి ప్రకాశించు మానసంబు నాత్మాకాశంబునందుఁ గూర్చి తన్మయత్వంబు నొంది శాంతవర్తనుండై సంయోగవియోగ సుఖదుఃఖంబుల మఱచి బ్రహ్మపదప్రాప్తభావన నిశ్చలానందభరితంబైన స్వానుభవబోధంబె సమాధియగు. ఇయ్యష్టాంగయోగాభ్యాసంబుఁ జేయువారి కీసమాధియే ఫలితార్థంబగు, నట్టివారు బ్రహ్మపదంబు నొందుదురు. ఇవి స్థూలాష్టాంగయోగంబులగు. ఇంక మంత్రలయహఠయోగంబులు గల వనిన వరాహస్వామికి మ్రొక్కి భూదేవి యిట్లనియె.

గీ. దేవ యష్టాంగయోగముల్ తెలియ వింటి
    రమ్యతరమంత్రలయహఠరాజయోగ
    ములను నామీద దయయుంచి తెలుపు మనిన
    శ్వేతకిటి భూమిదేవి నీక్షించి పలికె.

ఇక మంత్రయోగ విధానంబు జెప్పెద నెట్లనిన.

మంత్రయోగవిధానము

సీ. పూని విసర్జనస్థానంబునందుండు
        నాధారకమలంబునందు వ శ ష
    సలు నాలుగైన రేకులయందు దీపించు
        విఘ్నేశుఁ డచ్చట వెలుఁగుచుండు
    దానికి నంగుళద్వయము పై నుత్పత్తి
        కైన స్వాధిష్ఠానమందు బ భ మ
    య ర ల కారము లుండు నది యాఱుదళములం
        దజుఁ డుండు నుత్పత్తి కాఢ్యుఁ డగుచు
గీ. మెరసి యష్టాంగుళములకు మీఁద డాది
    ఫాంతవర్ణావళిని గూడి పదిదళముల
    నొప్పు మణిపూరకము నాభి నుండు విష్ణు
    డచటఁ దా స్థితికర్తయై యమరుచుండు.
సీ. పదియంగుళములకుఁ బైహృదయస్థాన
        మం దనాహతపద్మ మమరు, కాది

    ఠాంతవర్ణంబు లుండగ పదిరెండైన
        దళములచే నొప్పు దానియందు
    నధికుఁడై లయకర్తయైన రుద్రుం డుండు
        నావల పదియు రెండంగుళముల
    పై విశుద్ధం బుండు, భావింప కంఠంబు
        నందు అఆలుపదాఱుదళము
గీ. లందు వెల్గు సదాశివుం డచట నుండు
    దాని మీఁదట నాజ్ఞాభిధానచక్ర
    మున హకారక్షకారంబు లొనరు నచట
    నున్నతంబుగఁ బరమాత్మ యొప్పుచుండు.
సీ. అట దానిపైన సహస్రారకమలంబు
        శీర్షంబునందు భాసిల్లుచుండు
    నది యమృతస్థాన మగు, దేహవృక్షంబు
        నకు మూలమై గురునకు నివాస
    మగు నిడాపింగళలం దేకవింశతి
        సాహస్రములు మఱి షట్చతంబు
    లైన శ్వాసములు ప్రాణాపానకలితంబు
        లై హంసలై యజపాఖ్య నొందు
గీ. నట్టిశ్వాసలు గణపతి కాఱునూరు
    జలజసంభవ విష్ణు రుద్రులకు సంఖ్య
    దప్ప కాఱేసివేలు సదాశివునకు
    నొగిఁ బరాత్మకు గురున కొక్కక్కవేయి.

వ. ఈప్రకారంబుగా సప్తకమలంబులందు హంసలు ద్రొక్కుచున్నప్పటి కాలఘటికాశ్రమం బెట్లనన్నను.

హంసలకాలప్రమాణము

సీ. ఆధారమున హంసలాఱు నూ రర్పితం
        బగువేళ కొకటియరైనగడియ
    పది వినాడులు నగు పరగ స్వాధిష్ఠాన
        మం దాఱువేలైన హంస లొనర
    నర్పితంబగువేళ కగును పోడశఘటి
        కలు నర్ధఘటిక విగడియలు పది
    క్రమముగా మణిపూరకమున కార్వేలైన
        హంస లర్పితమగు నపుడు పదియు
గీ. నాఱు నరగడియ విగడియలును బదియు
    నగు వనాహతమున హంస లాఱువేలు
    నర్సితంబగుతఱిఁ బదియాఱు నరయు
    గడియ లొకపరియైన విగడియ లగును.
సీ. ప్రకట విశుద్ధంబునకు వేయి హంసలు
        నర్పితం బగువేళ కగును రెండు
    గడియలు సగమైన గడియ పదాఱు వి
        గడియలు హంస లక్కడికి నాల్గు
    నాజ్ఞయందు సహస్రహంస లర్పితమగు
        నపుడు రెండ్నరగడియలు విగడియ
    లును బదాఱును హంసలును నాలు గగు సహ
        స్రారంబునందు సహస్రహంస

గీ. లర్పణముగాగ రెండు నొకర్ధఘటిక
    లల విగడియలు పదియాఱు హంస లొక్క
    నాలు గగుచుండు నీరీతి ననుదినంబు
    జరుగు నరువది గడియలై జనుల కెల్ల.

వ. ఇవ్విధంబున నుదయాద్యుదయ పర్యంతము నడుచుచున్న యిరువదియొక్క వేయియు నాఱునూఱు హంసలు నజపం బనందగు నిట్టి యజపాగాయత్రీమహామంత్రంబు గురుముఖంబుగా నెఱిఁగి యరుణోదయంబున శుచియై పద్మాసనాసీనుండై కూర్చుండి నాసాగ్రావలోకనుండై సప్తకమలాధిదేవతలకు శ్వాస, ధ్యానపూర్వకంబుగా నజపాగాయత్రీమహామంత్రంబు నర్పణంబు జేయుచుండుట మంత్రయోగం బగు ఇంక లయయోగం బెట్లనిన.

లయయోగవిధానము

విజనస్థలంబునఁ బద్మాసనాసీనుండై కూర్చుండి దిగువ నాసికాగ్రముఁ జూచుచు పై నున్నది సాధింపుచు పై నాసికాగ్రంబుఁ జూచుచు దిగువ నున్నది సాధింపుచు రెండుతర్జనులచేత రెండుకర్లద్వారములున్ను రెండనామికలతో రెండునాసికాద్వారములున్ను బంధించి శిరంబు వంచి యేకాగ్రమనస్కుండై, తెలివితో నూర్ధ్వంబుగాఁ జూడ నది రాధాయంత్రంబను ముద్రయగు. తన్ముద్రాభ్యాసంబుఁ జేయుచున్న బ్రహ్మరంధ్రంబునందుఁ బ్రణవనాదంబు దశవిధధ్వనులుగా మ్రోయుచుండు నది యెట్లన్నను మొదట శింజినీగతియు, రెండవది తరగఘోషంబును, మూడవది ఘంటారావంబుసు, నాలుగవది వేణువాదంబు, నైదవది వీణాస్వనంబు, నాఱవది భేరీధ్వని, ఏడవది తాళధ్వని, ఎనిమిదవది శంఖారావంబు, తొమ్మిదవది మృదంగశబ్దంబు, పదవది మేఘనాదంబు కరణి వినంబడు నిట్లు క్రమక్రమంబుగా నాదానుసంధానంబుఁ జేయ నందు నీ నాదంబులు లయించు. దశమంబైన మేఘనాదంబున శ్రవణసహితంబుగా మనంబు నునిచి నిర్వ్యాపారంబుగా నిలిపి బాహ్యంబు మఱిచెనేని యమ్మానసంబుతోడఁ బవనం బందు లీనంబగు. ఇది నాదలీనానందకరంబైన లయయోగంబగు ఇంక హఠయోగం బెట్టిదనిన.

హఠయోగవిధానము

రాజపరిపాలితంబై న సుభిక్షరాజ్యమందు హఠయోగమంటపంబు నిర్మించి, యందుండి యభ్యాసంబు జేయవలయు నదెట్లన్నను సుగంధపుష్పఫలభరితంబైన వనమధ్యంబున గాలి చొరకుండ సూక్ష్మద్వారకంబైన మంటపంబు నిర్మించి దినదినంబును గోమయంబున శుద్ధి జేయింపుచు నందు వసియించి యతిశయించిన యుప్పు, పులుసు, కారములున్ను చేదు, వగరువస్తువులును, పిదప తిలతైలంబును, నజాది మాంసమద్యమీనంబులును, రేగుపండ్లున్ను, మిక్కిలి పసురాకుకూరలున్ను దధితక్రకుళుత్థములును, ఇంగువ లశునంబు మొదలైన తామసమందాహారముల విడిచి, యవ గోధుమ శాల్యన్నంబులున్ను, ముద్గసూపమున్ను, గోఘృతమున్ను, పొళ్ళకాయలు, పొన్నగంటి, చక్రవర్తి కూరలున్ను, శర్కర, ఖండశర్కర మొదలైన సాత్త్వికాహారముల గ్రహింపవలయు. తా భుజింపఁదగిన యన్నంబు నాల్గుపాళ్ళు జేసి యొకపాలు విడచి మూడుపా ళ్ళీశ్వరప్రీతిగా భుజింపుచు త్రిఫలంబు లౌషధంబుగా గ్రహింపుచు ప్రాతఃస్నానోపవాసవ్రత స్త్రీసాంగత్యాది దేహప్రయాసంబులు విడచి యనలార్కోదితంబులైన కాకలం బడక, శీతవాతంబులం దుండక యోగషట్కర్మంబు లాచరింపవలయు నవి యెవ్వియనిన.

యోగషట్కర్మములు

ధౌతికర్మ, వస్తికర్మ, నేతికర్మ, త్రాటకకర్మ, నౌళికర్మ, కపాలభాతికర్మంబులన నాఱు గలవు. అందు ధౌతికర్మం బెట్లనిన

ధౌతికర్మ

గీ. వినుము మృదువస్త్ర మొకనాల్గువ్రేళ్ళవెలుపు
    పొసగఁ బదునైదు హస్తాలపొడవు గలిగి
    నట్టి వస్త్రంబు తేటనీళ్ళందుఁ దడిపి
    మెల్లమెల్లగ లోనికి మ్రింగవలయు.
సీ. అటు మింగ్రి యీవల నతివేగమునఁ దీసి
        యటమీఁద వింశతిహస్తసంఖ్య
    గల వస్త్రమును మెల్లగా దిగమ్రింగుచుఁ
        దీయుచు నుండగా దీపనంబు
    గలుగు నపానము గంఠనాళముగుండ
        వెడలింపఁ బైత్యంబు వెడలిపోవు
    నది యభ్యసింపగా నక్షిరోగములు కా
        నశ్వాసముఖరోగచయము లణఁగు
గీ. గురుముఖంబున నీ మర్మ మరసి ధౌతి
    గజకరణి యన నొప్పు నీకర్మ మొనర
    నభ్యసింపఁగ వాయువు లన్ని తనకు
    వశములై నిల్చుచుండు నో వారిజాక్షి.
వ. ఇక వస్తికర్మం బెట్లన్నను.

వస్తికర్మము

నాభిపర్యంతంబు నీళ్ళయందుఁ జొచ్చి యధోద్వారమందు క్రోవి నుంచి కుక్కుటాసనస్థుండై కూర్చుండి యపానవాయువుచేతను జలమును మీదికి నెగయఁబీల్చి తిరిగి యధోద్వారముగుండా ఆజలమును విడుచుచున్న నిది వస్తికర్మ మనఁబడును. దీనివలన శూలలు, గడ్డలు, వాతపిత్తశ్లేష్మములవలనఁ బుట్టిన సమస్తవ్యాధులును బోవును. సప్తధాతుచక్షురాదీంద్రియాంతఃకరణప్రసన్నతయు, శాంతియు, క్షుత్తును గలిగి సర్వదోషభయములను బోగొట్టును. ఇంక నేతికర్మం బెట్లన్నను.

నేతికర్మము

జేనెడు పొడువుసూత్రము మలినములేని నేతిలోఁ దడిపి ముక్కుగోళములచేఁ బీల్చి నోట వెడలదీయగా నిది నేతికర్మం బగు. దీనివలన కఫశోధనమై దివ్యదృష్టి గలుగును. ఇంక త్రాటక కర్మం బెట్టిదనిన.

త్రాటకకర్మము

కదలనిచూపుచేత సూక్ష్మమైన గురిని నేకాగ్రచిత్తముగలవాడై కన్నీరు పొడముడనుక చూడగా నది త్రాటకకర్మంబగును. దీనివలన నేత్రరోగములు పోవును. ఇది బంగారుపెట్టెవలె గోప్యముచేయఁదగినది. ఇంక నౌళికర్మం బెట్టిదనిన.

నౌళికర్మము

తీవ్రమైన వేగముతో కడుపును కుడియెడమలుగా త్రిప్పగా నది నాళికర్మంబగు. దీని వలన కడుపులో నగ్నిమాంద్యము పోయి దీపనము గలిగి పాచనాదులు చక్కగా నేర్పడి యానందము కలుగును. సమస్తదోషరోగములను బోగొట్టును. ఇది హఠయోగమున కెల్ల శ్రేష్టమై యుండు. ఇంక కపాలభాతికర్మం బెట్టిదనిన.

కపాలభాతికర్మము

లోహకారకుఁడు కొలిమితిత్తు లూదినట్లు రేచకపూరకంబులు చేయగా నది కపాలభాతికర్మం బగు. దీనివలన కఫదోషము లన్నియుఁ బోవును.

ఈ క్రమంబుగా ధౌతి, వస్తి, నేతి, త్రాటక, కాళి, కపాలభాతి యను నీ షట్కర్మంబులు క్రమముగా నభ్యసింప రోగరహితంబులై నాడులు వశవర్తు లగుచుండునపుడు సిద్ధాసనాసీనుండై కూర్చుండి రేచక పూరక కుంభక యుక్తంబైన ప్రాణాయామపూర్వకంబుగా షణ్ముఖీముద్రాభ్యాసంబు చేయుచుండవలయు, నావల

ఆనందసిద్ధి

సుషుమ్నానాడికిఁ గారణమైన మూలాధారబ్రహ్మరంధ్రమునంగల రంధ్రమే భూతత్త్వమనియు, యిడా పింగళనాడుల ముఖమనియు చెప్ప నొప్పు. తత్కారణంబుచే నమృతంబు స్రవించు, నయ్యమృతంబు స్రవించి పోవుటచే మనుష్యశరీరమునకు మృత్యువు కలుగును. తదమృతము నిలుపుటకై మెడిమచేత యోనిస్థానంబును లెస్సగా నొత్తిపట్టి గుదము నూర్ధ్వముగా నెగయనొత్తి యపానవాయువును మీఁదిఁ కాకర్షించి బలాత్కారంబున నూర్ధ్వంబుగా నాకుంచంబుజేయ నది మూలబంధం బగు. దీనిచేఁ బ్రాణాపానవాయువులు నాదబిందువులును నైక్యమై యోగసిద్ధిప్రదంబగు. అపానవాయువు మీది కెగసి యగ్నియందు పొందుచుండగా నప్పు డగ్నిజ్వూల వాయువుతోఁ గూడి పొడవుగా వృద్ధినొందునప్పు డగ్నిపూరుషాపానవాయువులు ప్రాణవాయువును బొందు, నివ్విధంబున దేహముందుఁ బుట్టిన యగ్ని మిక్కిలి ప్రజ్వరిల్ల నందు నిద్రించిన కుండలీశక్తి తపింపబడి మేల్కొని కట్టెచేతఁ గొట్టబడిన భుజగశ్రీవలె నిశ్వాసంబు నిట్టూర్పుబుచ్చి చక్కగా సుషుమ్నాద్వారము. బ్రవేశించి శాంతమై బ్రహ్మనాడినడుమ పొందు గనుక; తదభ్యాసంబు జేయుచుండిన మూలశక్తి యాకుంచనం బగు. మధ్యశక్తి మేల్కొను, నుర్ధ్వశక్తిపాతంబు నొదవు. పవనుండు మధ్యమార్గంబునం జననోపు. నదియునుంగాక మూలం బాకుంచనంబై నాభి నొత్తిన నది యొుడ్యాణబంధంబగు కంఠంబు సంకుచితంబై చుబుకంబు రొమ్ము నొత్తిన నది జాలంధరబంధమగు, మూలం బాకుంచనంబై నప్పు డపానవాయు వెగయునంతలో హృదయమందున్న ప్రాణంబు దిగి నాభియం దపానుని గలియు నప్పుడు కుంచితంబైన నాభిని వెనుక కొత్తిన, ప్రాణాపానంబులు కలసి వెన్నంటి పోవునంతలో కంఠనికుంచనం బణఁచిన యమ్మారుతమం దడ్డంబైన కుండలిం బడనూకి మధ్యబిలంబులో జొరంబడి చిన్మయత్వంబు నొందు, నప్పు డంతరాకాశంబు నిశ్శబ్దంబగు. కంఠముద్ర పవనంబు నాని నిల్వగా సర్వపరిపూర్ణభావన సిద్ధించు, నీ ప్రకారంబుగా నాకుంచితకంఠనిరోధం బొదవినప్పు డమృతం బగ్నిలోఁ బడక స్వానుభూతికి లోకువై ప్రాణిని నిశ్చలానందంబు నొందించు, నదియునుం గాక.

సూర్యభేదనకుంభకము

సీ. వరయోగి యగువాఁడు వజ్రాసనమునుండి
        నయమొప్పగా వామనాడిచేత
    నాలోనఁ గుంభించినట్టి మారుతమును
        మెల్లనె విడచి యామీఁద మఱల
    దక్షిణనాడిచేతను వెలుపలివాయు
        వును మెల్లనే లోని కొనరఁదీసి
    యప్పుడు కేశనఖాగ్రపర్యంతంబు
        నరికట్టి కుంభకం బచటఁ జేసి
గీ. వామనాడిన విడువ నవ్వలఁ గపాల
    శోధనంబగుఁ గ్రిమివాతబాధ లణఁగుఁ
    గొమ్మ! యిది సూర్యభేదనకుంభకంబు
    గోరి విను మింక నుజ్ఝాయి కుంభకంబు.

ఉజ్ఝాయి కుంభకము

సీ. తగ నోరు బంధించి తసముక్కుక్రోవుల
        నుంచి వాయువును బూరించి కంఠ
    మున ధ్వనిఁ బుట్టించి మొనసి హృదబ్జంబు
        దాఁక లోనికిఁ దీసి తనువునందుఁ
    బ్రాణుని గుంభించి పరగ నిడానాడి
        చేతను విడువగా శ్లేష్మహరము
    నగు జఠరాగ్ని మహావృద్ధి యగు ధాతు
        గతరోగములు సెడు క్రమముగాను
గీ. నడుచుచుండినఁ గూర్చుండినను దినంబు
    గోప్యముగ నిట్టి యుజ్ఝాయి కుంభకంబు
    క్రమముగాఁ జేయఁదగును సీత్కార మనెడి
    కుంభకం బేను జెప్పెద కొమ్మ వినుమి.
గీ. వనిత నాసాపుటములచే వ్యావరింప (?)
    బడిన సీత్కారమనెడు కుంభకము ముఖము
    నందుఁ జేయగ నిద్రయు నాకలియును
    దెలియకుండును స్వచ్ఛందదేహుఁ డగును.

సీత్కారకుంభకము

వ. అది యెట్లనిన నాలుకచేతను జెక్కిళ్ళచేతను వాయువును సదా పానముచేయగా నతఁడు ఆఱునెలలు సకలరోగరహితుఁడై యోగినీచక్రసమానశక్తిగలవాడై రెండవ వామదేవుండనఁ దగియుండు నిది సీత్కారకుంభకంబగు నింక సీతళి యనెడి కుంభకంబు సెప్పెద నెట్లనిన.

సీతళీకుంభకము

గీ యోగి రసనంబుచేత వాయువును మెల్ల
    గాను బూరించి పూర్వప్రకారముగను
    కుంభకము జేసి నాసికాగోళములను
    విడువ బహురోగబాధలు వీడిపోవు.

వ. ఇది సీతళీకుంభకంబగు నింక భస్త్రికాకుంభకంబుఁ జెప్పెద నెట్లనిన.

భస్త్రికాకుంభకము

వ. పద్మాసనాసీనుండై యుదరగ్రీవంబులఁ జక్కగా నిలిపి నోరు లెస్సగా మూసి ప్రాణవాయువును ముక్కుచేత వ్యాపింపఁజేసి వేగ విడిచి బ్రహ్మరంధ్రపర్యంతంబు వ్యాపించిన మేఘధ్వనితోడ గూడి వాయువును హృదయపద్మపర్యంత మించు కించుక నిండించి విడిచి తిరుగ నాప్రకారంబుగానే పూరించి విడిచి మఱియు నారీతినే పూరించి రేచింపుచు కమ్మరి కొలిమితిత్తు లూఁదునట్లు రేచించి పూరింపుచు దేహముందున్న వాయువును బుద్ధిచేతఁ జలింపఁ జేయుచుండగా నెప్పుడై న బడలిక పుట్టినపుడున్ను, గాలిచేత కడుపు నిండినప్పుడును సూర్యనాడిచేత వాయువును విడువగా బడలిక తీరును. కడుపు చులక నగు. అప్పుడు అంగుష్ఠానామికలచే ముక్కు బిగఁబట్టి వాయువును గుంభించి యిడానాడిని విడిచిన వాత పిత్త శ్లేష్మములు నశింపగా జఠరాగ్ని ప్రకాశించును. సకలనాడీమలవిమోచనంబగును. బ్రహ్మ, విష్ణు, రుద్రగ్రంథులు భేదింపఁబడు, నిది సుఖప్రదంబైన భస్త్రికాకుంభకంబు. ఇంక భ్రమరికాకుంభకంబుఁ జెప్పెద నెట్లనిన.

భ్రమరికాకుంభకము

క. పురుష మిళిందధ్వనివలె
    నరిమురి వూరించి భృంగి యానందముతో

నరుదుగఁ జేసిన నాదము
    కరణిని రేచింపవలయుఁ గ్రమముగ నెపుడున్.
క. ఈరీతి నభ్యసించిన
    వారల కానందమూర్ఛ వరచిత్తమునన్
    దారూఢిగ జనియించును
    గౌరవమగు నిదియె భ్రమరికాకుంభకమౌ.
    వ. ఇంక మూర్ఛాకుంభకంబుఁ జెప్పెద నెట్లనిన.

మూర్ఛాకుంభకము

గీ. రహిని పూరించి జాలంధరంబు నొనరఁ
    బెట్టి యుండగ సద్బోధ పుట్టి లోన
    నిలిచి జీవుని జొక్కించి నిండుచుండు
    నది మనోమూర్ఛ యను కుంభకాఖ్య నొందు.
    వ. ఇంక కేవలకుంభకంబుఁ జెప్పెద నెట్లలిన

కేవలకుంభకము

వ. రేచకపూరకకుంభకంబులు విడిచి స్వభావంబుగా మారుతధారణంబుఁ జేసి నిజబోధానందమగ్నుఁడై చొక్కియున్న నది కేవలకుంభకంబగు, నిట్టి కుంభకం బభ్యసించి సిద్ధుఁడైనవానికిఁ ద్రిలోకంబులందు దుర్లభంబై న కార్యంబు లేదు. సర్వస్వతంత్రుఁడై యుండు నిట్టి హఠయోగంబు యమనియమాసన ప్రాణాయామాద్యష్టాంగయోగ త్రిబంధాష్టకుంభక ముద్రాదిసాధనంబులచేత నియ్యోగంబు ద్వాదశాబ్దంబు లభ్యసింప సిద్ధియగు నది యెట్లనిన.

ప్రథమాబ్దంబునందు రోగరహితుం డగు. ద్వితీయాబ్దంబునందు గవిత్వంబుఁ జెప్పు. తృతీయాబ్దంబున విషజయుం డగును. చతుర్ధాబ్దంబున క్షుత్తృష్ణానిద్రాలస్యంబుల జయించు. పంచమాబ్దంబున వాక్సిద్ధినొందు. షష్ఠాబ్దంబున ఖడ్గాభేద్యుం డగు. సప్తమాబ్దంబున భూమి నంటకుండు. అష్టమాబ్దంబున అణిమాద్యష్టైశ్వర్య సంపన్నుం డగు. నవమాబ్దంబున నధోగమనుం డగు. దశమాబ్దంబున మనోవేగుం డగు. ఏకాదశాబ్దంబున విశ్వవశత్వంబు గలవాఁ డగు. ద్వాదశాబ్దంబున సాక్షాదీశత్వంబు నొందు, నిది హఠయోగంబగు, నింక రాజయోగంబుఁ జెప్పెద నది సూక్ష్మాష్టాంగయోగపూర్వకంబుగా నభ్యసింపవలయు నెల్లనిన.

సూక్ష్మాష్టాంగయోగము

సీ. ఆహార నిద్రా దురాసేంద్రియ వ్యాప్తు
        లణఁచి శాంతము నొందినది యమంబు
    నిశ్చల గురుభక్తి నిస్సంశయము సుయో
        గాసక్తి తృప్తి యేకాంతవాస
    పరతయు వైరాగ్యభావంబుకరణి ని
        గ్రహమును నియమంబు సహజసుఖము
    నొసఁగు నాసనమునం దుండుట నిస్పృహ
        త్వంబు నొందుటయు నాత్మను మనంబు
గీ. నదిమి కుదిరించి నిల్పుటే యాసనంబు
    ప్రకట రేచక పూరకుంభక సమేత
    మైన శ్వాసలలో నప్రయత్నముగను
    గుదురజేసిన యనిరుద్ధకుంభకమున.

వ. ప్రాణుని స్థిరముగా నిలిపి ప్రపంచం బనిత్యం బని తలంచుటే ప్రాణాయామంబగు, నంతర్ముఖంబైన నిర్మలచిత్తంబున చైతన్యజాలంబుల నణఁచుటయును బహుప్రకారంబులై జనించు మనోవికారంబుల నేర్పరించి తద్వికారగ్రసనంబు చేసి మనంబును నిర్వ్యాపారంబుగా నిలుపుటే ప్రత్యాహారం బగు. స్వస్వరూపానుసంధానభావంబుచే ద్వితీయరహితాత్మానుభవంబున సర్వప్రపంచంబు నాత్మగా నెఱిఁగి సకలభూతదయాసమత్వంబు నిత్యతృప్తిం జెందియుండుట ధ్యానం బగు. అంతర్బాహ్యప్రకాశం బేకంబుగా స్వతేజోమయంబుఁగాఁ బరతత్త్వంబు నుద్దేశించి తదీయధారణంబుఁ జేయుచుఁ జిత్తంబును జరిగిపోనీక నిలుపుటే ధారణం బగు. తద్ధారణాభ్యాసంబునఁ జిత్తం బేకాగ్రం బగు, నప్పుడు జీవాత్మ పరమాత్మయందు జలశర్కరన్యాయంబుగా గలసి యఖండబోధనొందుటే సమాధియగు, నిట్టి సూక్షాష్టాంగంబులఁ బ్రకాశించు నా రాజయోగంబునకు లక్షణంబు సంక్షేపంబుగాఁ దెల్పెద నెట్లనిన, హంసాక్షర, సిద్ధాసన కేవలకుంభక నాదంబులను నీ నాల్గింటి వలన రాజయోగం బొప్పు, నందు సాంఖ్యతారకామనస్కంబులనం ద్రివిధంబై యుండు, నందు సాంఖ్యం బెట్టి దనిన,

సాంఖ్యయోగము

సీ. పంచతన్మాత్రలు పంచభూతంబులు
        పంచీకృతంబులై ప్రబలుచున్న
    సకలేంద్రియంబులు సర్వవిషయజాల
        ములు గుణత్రయ కామముఖ వికార
    ములుగాను తనువులు మూఁడునుగా నవ
        స్థలు గాను తన నన్ని తలఁచి యెఱుఁగు
    నటువంటి యెఱుక నే నని నిశ్చయించి వి
        క్షేపావరణములఁ జిదిమి వైచి
గీ. తాను దనలోనె తను దాను తఱచి తఱచి
    యన్నిటికి మీఁద శేషించి యచలవృత్తి
    నుండు టది సాంఖ్యయోగమై యొప్పుచుండు
    గురుముఖంబున నియ్యోగ మెఱుఁగవలయు.

వ. ఇవ్విధంబున సాంఖ్యం బెఱింగి తారకం బభ్యసింపవలయు, నదెట్లనిన,

తారకయోగము

క. అరగన్నులతో నైనను
    మురు వలరగ రెండుకనులు మూసియు నైనన్
    పరమాత్మను లోఁజూపున
    గురిగా నీక్షింపవచ్చు గురుభక్తుండై.
గీ. చంద్ర సూర్యాంతరములందు సహజముగను
    వెలుఁగు తారకముల యందు విమల బిందు
    నమరఁ గూర్పగ నది తారకాఖ్యయోగ
    మై ప్రకాశించు లక్ష్యత్రయంబు నగుచు.

లక్ష్యత్రయము - బాహ్యలక్ష్యము

వ. ఆ తారకయోగంబు బాహ్యమధ్యాంతర్లక్ష్యంబులన నొప్పు నందు బాహ్యలక్ష్యం బెట్లనిన, బహిర్నాసిగ్రావలోకనంబు మనోమారుతంబులం గూడి స్థిరంబుగా నిల్ప నందు చతురంగుళప్రమాణంబున నైల్యంబును, షడంగుళప్రమాణంబున ధూమ్రంబును, అష్టాంగుళప్రమాణంబున రక్తిమంబును, దశాంగుళప్రమాణంబున తరంగప్రభయును, ద్వాదశాంగుళప్రమాణంబున పీతప్రకాశంబు నగు, నీ యైదు పంచభూతవర్ణంబులై యెదుటం దోఁచునప్పు డపాంగదృష్టుల వెనుకఁ గూర్చి, శీర్షంబు మీదికిఁ జొనుపుచు నిశ్చలచిత్తుండై చూడ నందు చంద్రప్రభ గానవచ్చు నదియునుంగాక,

గీ. కర్ణనాసాపుటాక్షిమార్గముల వ్రేళ్ళ
    నమరఁ బీడించి చిత్తంబు నచట నిల్ప
    ప్రణవనాదంబు వినవచ్చు బ్రకటదీప
    కళలు నవరత్నకాంతులు గానవచ్చు.

వ. ఇది యాత్మప్రత్యయప్రకాశంబైన బహిర్లక్ష్యం బగు, నింక మధ్యలక్ష్యవిధం బెట్లనిన,

మధ్యలక్ష్యము

గీ. కంటిపాపల రెంటిని గదలనీక
    మానసముతోడ భ్రూయుగమధ్యమందుఁ
    జొనిపి తన్మధ్యమున నుండు సూక్ష్మబిలము
    లోఁ బ్రవేశించి చూడ నాలోన నపుడు.
క. మెరుపులు నక్షత్రంబులు
    తరణి శశి ప్రభలు భూతతతి వర్ణములున్
    కరువలి నెనయుచు లోపల
    పరిపరి విధములుగ మెరయు భావములోనన్.

వ. మఱియు నిరవధికశూన్యంబగు నాకాశంబును గాఢాంధకారంబైన మహాకాశంబును, కాలాగ్నినిభంబైన పరాకాశంబును, నధికప్రకాశంబైన తత్త్వాకాశంబును, కోటిభానుసంకాశంబైన సూర్యాకాశంబు నగు నియ్యాకాశపంచకం బనిశం బవలోకించు నతండు తన్మయుండై నిరవకాశాకాశసదృశుం డగు, నిది మధ్యలక్ష్యంబగు, నింక నంతర్లక్ష్యం బెట్లనిన,

అంతర్లక్ష్యము

క. ఆపావకచంద్రార్క
    వ్యాపకమై పంచభూతవర్ణకలితమై
    యాపోజ్యోతిరసం బిట
    రూపాశ్రయ మగుచు నుండు రూఢప్రజ్ఞన్.
క. చక్షుర్మధ్యంబుల పర
    మాక్షరహైరణ్యసచ్చిదమృతాంకురముల్
    సాక్షిగ బాహ్యాంతరముల
    నీక్షింపుచు నిత్యసుఖము నెనయుచు నుండున్.

క. ఆ యమృతాంకురయుగళము
    నాయకమై స్ఫటికరుచుల నైల్యంబగు సు
    చ్ఛాయల నెనయుచు పవన
    స్థాయికి నెల వగుచు జీవతారక మయ్యెన్.

వ. ఈ రహస్యంబు సద్గురూపదేశక్రమంబుగా నెఱింగి బాహ్యాంతరంబులకు నడిమి శృంగాటకంబునం దోంకారదీపతదగ్రనీవారశూకాణువులవలె నుండు సగుణపంచకంబు నీక్షించుట తారకాంతరలక్ష్యం బగు, నదియునుం గాక సరస్వతీనాడి చంద్రప్రభానిభంబై మూలకందంబునం దుండి దీర్ఘాస్థిమధ్యంబున బిసతంతుకైవడి విద్యుత్కోటిసంకాశంబై బ్రహ్మరంధ్రపర్యంతంబు వ్యాపించి యుర్ధ్వగామినియై సర్వసిద్ధిప్రదమగు తత్స్వరూపంబు నాత్మయందు భావింపుచు ఫాలోర్ధ్వకోల్లలాటమండలంబున స్వస్వరూపంబందు లక్ష్యం బుంచి చూచుటే పరమాంతర్లక్ష్యం బగు నివ్విధంబున,

మ. అనిశంబున్ భవతారకాఖ్య వరయోగాభ్యాసమున్ జేయగా
    మనమున్ మారుత మంతరంగమున నిర్మగ్నత్వముం బొందు, నం
    దనుకూలంబగు నంతరాత్మ పరమాత్మానందముం బొందు, నిం
    కొనరంగా సమనస్కయోగవిధ మే నుత్సాహినై చెప్పెదన్.

అమనస్కయోగము—శాంభవీముద్ర

సీ. ఆత్మాశ్రయము లగు నలహంసమార్గంబు
        లకు కుడియెడమల లలితనీల
    కాంతుల దగు నుదకజ్యోతులందు భా
        స్వరతరదర్పణచ్ఛాయ లమర
    వెలుఁగగాఁ దన్మధ్యములయందు సూక్ష్మాతి
        సూక్ష్మంబు లైనట్టి సుషిరములను
    మానసంబును నిల్ప నూని యంతర్లక్ష్య
        మును బాహ్యదృష్టు లిమ్ముగ ఘటించు

గీ. నదియె ఘనశాంభవీముద్ర యగుచు నుండు
    రెండుజాముల దనుక గూర్చుండి దీని
    నభ్యసింపంగ మానసం బనిలగతులు
    నిలుచు నేకాగ్రభావమున్ నిలుచు నపుడు.

రాజయోగము

సీ. వినుకులన్ బలుకులన్ వివిధచిత్రములైన
        తలఁపులఁ దనయందె నిలిపికొనుచు
    నల పరమాత్మయం దంతరాత్మను గూర్చి
        తా నందే లీనమై తగ నివాత
    దీపంబు కైవడి తేజరిల్లుచు నిస్త
        రంగాబ్ధివలె నంతరంగమందు
    కనఁ డొకరూపంబు వినఁ డొకశబ్దంబు
        మొనసిన ఖేచరీముద్ర నంటి
గీ. యచలితానందరసమగ్నుఁ డగుచుఁ జొక్కి
    వరమనోన్మనీయున్మ్యవస్థ లొంది
    చలనరహితామనస్కంబజాడ్యనిద్ర
    యోగనిద్రయు నా రాజయోగి పొందు.

వ. అట్టి రాజయోగికి జాగ్ర త్స్వప్న సుషిప్తి తుర్య తుర్యాతీతంబు లను పంచావస్థలు గల వవి యెయ్యవి యనినఁ జతుర్వింశతితత్త్వాత్మకంబెన దేహంబు తాఁగానని పంచవింశకుండైన దేహి తానని తెలిసినది జాగ్రత్త యగు. మనంబు నింద్రియబృందంబుతోడ నాత్మయందు బొందించి ధ్యానింపగా నమ్మనంబు సర్వవిషయవాసనాసంగరహితమై బాహ్యాంతరంబుల మెలంగుచు కేవల బహిర్ముఖంబుగాక తన్ను దాను తరచుచుండుట స్వప్నం బగు, నిది యభ్యసింపుచున్న మనంబు బాహ్యమందు విస్తరిల్లక సుస్థిరంబై మాయాజాలం బనిత్యం బని సత్యవస్తు వందు బొందుచున్నప్పుడు బహిర్జ్ఞప్తి వచ్చిన తెప్పున నంతర్ముఖంబై జగం బనిత్యంబుగా నాత్మ సత్యంబుగా నెఱింగి నిత్యబోధ నొంది యుండుటే సుషుప్తి యగు. జీవేశ్వరభావంబుల నొందు నాత్మయందు నిలిచిన మనంబు బాహ్యభావరహితంబై పరంబును భావించు నిట్లు పురుష పురుషోత్తమ భావంబుల నుభయాత్మకంబైన చైతన్యంబునం బొంది యమ్మనంబు విషయవాసనావిముఖంబై సర్వేంద్రియవ్యాప్తులతోడ దేహాభిమానంబు మఱచి విరక్తిమార్గంబున సంసారబంధవిముక్తమై ఆత్మానుభవామృతపానంబునం జొక్కి తన్మయంబై స్వతంత్రతఁ బాసి ఆత్మ పరతంత్రం బగుచుండు, నంత జీవుండు నస్వతంత్రుఁడై యీశ్వరాధీనుం డగుచుండగా నీశ్వరభావంబు సత్యంబగు నప్పుడు సర్వమయుండైన పరమేశ్వరునియందు మనం బుపరతం బగుచుండు నప్పు డాత్మయం దొకమనోదృశ్యంబగు నందాక మనోన్మని యగు, నెప్పుడు ద్రష్పదృగ్దృశ్యంబులు లేక తాను తానై ధ్యానవిరహితంబై చిన్మాత్రంబైన యెఱుకఁ దానె సత్తామాత్రం బగుచుండు నప్పుడు మనంబు కలదు లేదనరాకుండు నది యున్మవ్యవస్థయైన తుర్యంబగు, నది స్వరాట్టును పరమపదంబు నగుచుండు, నందు సహజంబుగా మానసంబు సకలేంద్రియప్రాణానిలంబులతోడ లీనంబగుట నది యమనస్కంబైన తుర్యాతీతం బగుచుండు. కలదు లే దనరానిదై ఘటాకాశంబు మహాకాశంబునం బొందిన ట్లేకంబై దేశ కాల కార కర్తృ కారణ గురుత్వ లఘుత్వాద్యవస్థలు తోచకున్న నది సహజమనస్కంబగు. పట్టువిడుపు లేనిదై చెప్పఁ జూపరాక సహజభావంబై యున్న నది యజాడ్యనిద్రయగు. కడగన రాని నిస్తరంగసముద్రంబు తెఱంగున నాద్యంతరహితంబైన నభంబు కరణి నింతింతనరాక తనంతనె నిండి మలయజమందు గంధంబును, వృక్షంబునం దనలంబును నిక్షుదండంబునందు మధురంబును క్షీరంబునందు ఘృతంబును తిల లందు తైలంబును నెట్లుండు నట్లు చరాచరప్రపంచంబునందు పరమాత్మ పరిపూర్ణంబై యిదమిత్థ మనరాకుండు టది యోగనిద్ర యగు. ఇది యింతంతసాధకున కనుభవంబుగా దది యనుభవించిన యోగికి అనుభవైకవేద్యం బగు. గాని వాక్కునఁ జెప్పఁగూడ దది యెట్లనిన,

శా. బ్రహ్మం బద్వయవస్తువౌ ననెడి శాస్త్రం బెప్పుడున్ బల్కుచున్
    బ్రహ్మాహ మ్మనునంతమాత్రముననే బ్రహ్మంబుగా నేర్చునే
    బ్రహ్మంబైన గురుస్వరూపము మదిన్ భావించి భావించి తా
    బ్రహ్మంబై నటువంటి కాలముననే బ్రహ్మంబనం గూడునే.

వ. ఇ ట్లవాక్ష్మానసగోచరం బైన బ్రహ్మానుభవంబె రాజయోగం బగు. ముందు జెప్పిన మంత్ర లయాదియోగంబుల యనుభవక్రమంబు లెట్లనిన,

మంత్రాదియోగానుభవక్రమము

సీ. మంత్రయోగంబుచే మారుతసంచార
        దేహమర్మంబులఁ దెలియవచ్చు
    లయముచేఁ దనలోని లలితప్రణవనాద
        సూత్రంబు మది నూని చొక్కవచ్చు
    హఠముచే జరను రోగాళిని మృత్యువున్
        కేడించి ధీరుఁడై గెలువవచ్చు
    సాంఖ్యయోగంబుచే సకలేంద్రియవ్యాప్తు
        లరయుచుఁ దన్ను దా నెఱుఁగవచ్చు
గీ. తారకముచేతఁ దనువులోఁ దాను వెలుఁగు
    చున్నరీతిని గనవచ్చు నుచితమైన
    రాజయోగంబుచేఁ బరబ్రహ్మమందుఁ
    బొంది యుండగ వచ్చు సంపూర్ణుఁ డగుచు.

సీ. విను మంత్రయోగి కన్నను గొప్ప లయయోగి,
        లయయోగి కధికుఁ డుల్లాసియైన
    హఠయోగి యగుచుండు హఠయోగి కన్నను
        సరసిమానసుఁడైన సాంఖ్యయోగి
    యతిశయుండగు, వానికన్న తారకయోగి
        యధికుం డగుచునుండు నతని కన్న
    సాంఖ్యతారకముల సంగ్రహించికొని వై
        రాగ్యభావన నొప్పు రాజయోగి
గీ. యుత్తమోత్తముఁ డని చెప్పనొప్పు నతని
    కన్న గొప్పైన యోగి లేఁ డవనిమీఁద
    నతఁడు సంసారమం దున్న నడవి నున్న
    సకలనిర్లేపుఁ డగుచుండు శాంతుఁ డగుచు.
వ. అది గావున నింక రాజయోగి లక్షణంబులు మఱియు నెట్లనిన,

రాజయోగి లక్షణములు

సీ. తనుకాంతియును మృదుత్వంబు వాఙ్మాధుర్య
        మును మితభాషణంబులును భూత
    దయ వివేకంబు శాంతము మితాహారంబు
        మానసస్థైర్యంబు మైత్రిగుణము
    గలవాఁడు రాజయోగ సునిష్ఠుఁ డంబర
        మధ్యస్థకలశంబుమాడ్కి లోన
    వెలి నెందు నంటక వెలుగు నంబుధిమధ్య
        గతకలశమురీతిగాను లోను
గీ. వెలికిఁ బరిపూర్ణుఁడై నిండి వెలుగుచుండు
    వాఁడు నొకవేళ సంసారివలె నటించు
    నొనర నొకవేళ వైరాగ్య మొందుచుండు
    వాని యనుభవ మెఱుగ రెవ్వారు ధరణి.

క. ధర్మాధర్మము లొల్లక
    కర్మాసక్తుండు గాక కాదౌ ననర్క
    నిర్మలభావుం డగుచును
    మర్మజ్ఞత నతఁడు మెలఁగు మనుజులలోనన్.
క. ప్రాజ్ఞుండై దేహముతో
    నజ్ఞానులయందు మెలఁగు నందున నాయో
    గజ్ఞుని మదిఁ దెలియక యే
    యజ్ఞానులు నిందఁ జేతు రాతి గనకన్.
గీ. దూషణము జేయు వారికిఁ దొల్లి యితఁడు
    జేసియుండిన పాపముల్ జెందుచుండు
    భూషణము జేయువారికిఁ బుణ్యఫలము
    లపుడు బొందగ నిర్లేపుఁ డగు నతండు.
సీ. పెద్దవన్న నహుత బెంచి హెచ్చెడు చిన్న
        వనినఁ దగ్గడు భాగ్య మతిశయముగ
    కలగిన నుప్పొంగి గర్వింపఁ డొకవేళఁ
        దనకు లేమిడి యైనఁ దగ్గిపోఁడు
    ప్రారబ్ధ మనుభవింపక తీర దని యస
        హ్యముగ దుఃఖసుఖంబు లనుభవించు
    నబ్జపత్రంబులో నంటని జలబిందు
        వట్ల సంసారమం దంట కుండు
గీ. జగతి కలబంద మూలంబు తెగినదాని
    పచ్చి కొన్నాళ్ళు నిలిచిన పగిది, దేహ
    మూలమగు కారణావిద్య మొదలు తెగిన
    నాయువను పచ్చి యున్ననా ళ్ళంగ ముండు.

చ. అటువలె కారణంబు తెగినప్పటి కైనను గార్యజాలవి
    స్ఫుటతను యుగ్మముండు పరిపూర్ణచిదాత్మవికాశి గాక త
    ద్ఘటముల నాశ్రయించి గుణకర్మములం దెపు డంటి యంటకన్
    సటల ని రోసి యన్నిటికి సాక్షిగ నుండు సుఖస్వరూపమై.

ఆత్మయజ్ఞము

సీ. అల బుద్ధియును జిత్తమా యహంకృతి మాన
        సంబును బుత్త్విగ్గణంబు గాగ
    ప్రణవవర్ణంబు యూపస్తంభమును గాగఁ
        బ్రాణదశేంద్రి పంజ్క్తి యచట
    పశుసమూహము గాగ భాసురానాహత
        నాదంబు విహితమంత్రంబు గాగఁ
    బొసగఁ దత్పశువుల బోధాగ్నిలో వేల్చి
        జ్ఞానామృతము సోమపానముగను
గీ. ద్రావి జొక్కుచు మోక్షకాంతాసమేతుఁ
    డగుచు వేదాంతసూత్రంబు లనెడి కర్ల
    కుండలంబులు వెలుఁగఁ ద్రికూటమార్గ
    మందు శాంతప్రముఖమిత్రు లలరి కొలువ.
సీ. ప్రకటితాచారముల్ బండ్లకమ్ములు గాగ
        శమదమాదులు సుచక్రములు గాగ
    ప్రాణపంచకము నేర్పడ కాడిగాగ న
        నూనహృద్వనజంబు నొగయుఁ గాగ
    వరకర్ణనేత్రముల్ వాహనంబులు గాగ
        రహి వివేకంబు సారథియుఁ గాగఁ
    దగు నిస్పృహత్వమె త్యాగధ్వజము గాగఁ
        బ్రబలు యోగరథంబు పైన నెక్కి

గీ. పోయి నడిమి సరస్వతిన్ బొంది గంగ
    యమునయును నిల్చు నాల్గుమార్గముల నడుమ
    నవబృథస్నాన మొనరించి యాత్మసోమ
    యాజి యన నొప్పుచుండు నీ యవనిమీఁద.
ఉ. ఇంతటి యోగపూరుషుఁడు హెచ్చఁడు తగ్గఁడు సంతతంబు నే
    కాంతమునన్ వసించుఁ దనయందుఁ బరాత్మను జూచుచుండు వి
    భ్రాంతులు తన్ను కొట్టినను బక్కున నవ్వును గాని తిట్టఁ డీ
    శాంతుఁడు రాజయోగి, ఘనసద్గురుఁ డంచు వచింపఁగాఁ దగున్.
సీ. అటువంటి దేశికుం డిటువంటి యోగంబు
        నింతంతశిష్యున కీయరాదు
    శిక్షించి శాంతిఁ బరీక్షించి తనశిక్ష
        కొప్పినవానికిం జెప్పవలయుఁ
    దనశిక్ష కొప్పని తామసాత్మునకుఁ ద
        త్త్వంబుఁ జెప్పిన, వాఁడు దంభుఁ డగుచు
    వేషభాషలచేత విఱ్ఱవీగుటె కాని
        వాడు తత్వజ్ఞుండు కాడు, కనుక
గీ. తొలుతనే శిష్యుఁ డగువాని దుర్గుణములఁ
    తిట్టుచుఁ గొట్టుచు సుగుణములను
    జెప్పగా వలెఁ దనశిక్ష కొప్పకున్న
    నూరకే శాంతిఁ బొంది తానుండవలయు.
గీ. అంతియే గాని దుర్గుణుం డైన వాని
    నిలఁ బరీక్షింప శిక్షింపఁ దలఁచె నేని
    వాని దుర్మార్గములు తన మానసమున
    నిలచి కోపముఁ బుట్టించు నిక్కముగను.

క. కోపం బెవ్వరి కైనను
    దాపముఁ బుట్టించుఁ గనుక తామసశిష్యుం
    జేపట్టఁ దగదు పట్టినఁ
    దాపత్రయహేతు వగును దనశాంతి చెడున్.
క. దుర్గుణముల విడువక ష
    డ్వర్గంబులఁ గూడినట్టివాఁ డతిశయదు
    ర్మార్గుం డగు వైరాగ్యము
    భర్గుడు జెప్పినను వాఁడు పట్టుగ వినునే.

సచ్చిష్యలక్షణము

వ. ఇంక సచ్ఛిష్యుం డెవ్వఁ డనిన సాధనచతుష్టయసంపన్నుండై వంచన లేక జారచోరక్రూరగుణములు విడచి పరమశాంతి గలవాఁడై మోక్షాసక్తుఁడై గురుసేవఁ జేసి తద్గుర్వనుగ్రహంబునకుఁ బాత్రుండైనవాఁడు దేహాభిమానంబు విడచి ప్రణవపూర్వకంబుగా వేంకటేశానుస్మరణంబుఁ జేయుచు నిజయోగబలంబున సుషుమ్నాద్వారంబు భేదించుకొని యర్చిరాదిమార్గంబునం జని పరమపదంబుఁ జెందు, నిట్టి యోగాభ్యాసంబుఁ జేయలేకున్నను అత్యంతగురుభ క్తి కలవాఁడై తత్కటాక్షంబున భ క్తిజ్ఞానవైరాగ్యంబు లభ్యసించి యుపశాంతి బొంది జ్ఞాని నని యహంకరింపక యుండవలయు నది యెట్లనిన,

క. జ్ఞానాహంకారంబే
    మానవులను జెఱచుఁ గాన మతిమతులు త
    ద్జ్ఞానాహంకారంబును
    మానుచు నుపశాంతు లగుట మంచిది గాదే.

క. ఉపశాంతి లేని మనుజుల
    జపతపములు యోగవిధులు సవనాదు లిలన్
    గపటములై చెడుఁ గావున
    నుపశాంతియ పరమధర్మ ముత్పలనేత్రా.
సీ. అని వరాహస్వామి యష్టాంగయోగసా
        రార్థముల్ భూదేవి కధికదయను
    జెప్పినాఁ డని సూతుఁ డప్పు డాశౌనకా
        దులకు బోధించె సంతోష మెసఁగ
    నని యిట్లు తరిగొండ హరికటాక్షమున సు
        బ్రహ్మణ్యగురుకృపన్ బన్నగాద్రి
    విభుచెంత నింజేటి వెంకమాంబ వసించి
        యీ కృతి రచియించె నిదియు వ్రాసి
గీ. చదువువారును వినువారు జన్మకర్మ
    జలధిఁ దరియింతు రీకథ సార మగుచు
    శ్రీగురు పదాబ్జయుగళి కర్పితము నగుచు
    నుర్విమీఁదఁ బ్రకాశించి యుండుగాత.

శ్రీగురుబ్రహ్మార్పణ మస్తు

  1. నవ్వారి
  2. యజ్ఞంబు