అష్టాంగయోగసారము/ఉపోద్ఘాతము
ఉపోద్ఘాతము
యోగభ్యాసము భారతీయుల దగు పరమగోప్యమగు సర్వస్వము. యోగీశ్వరు లాంతరదృష్టిచే నపూర్వములగు విశేషముల నెన్నింటినో కనుగొని యట్టిజ్ఞానమునకు కారణమగు యోగమును గుఱించి బహుముఖముల కొనియాడుటయే గాక వివరముగ తెలిపియున్నారు. అట్టియోగవిషయము విపులముగ నితరగ్రంథములందు (హఠయోగాదులందు) కలదు. ఆ విషయములనే సంగ్రహముగ నీచిన్నపొత్తమున కూర్పబడి యుండుటచే నీగ్రంథమునకు అష్టాంగయోగసారమను పేరెంతయుఁ దగియున్నది.
భారతదేశము తూరుపువెలుగై దేశదేశముల కీర్తిచంద్రికలఁ బర్వఁజేసెనను ప్రశస్తి నందుటకు మనదేశమందలి యోగీశ్వరుల యద్వితీయయోగసాధనమే ప్రబలకారణము. ఆధ్యాత్మికవిద్యయందు ముందంజ వేసి యాత్మానుభూతినే పరమలక్ష్యముగ గ్రహించిన మనభారతీయయోగీశ్వరులు యోగసిద్ధులగు నష్టైశ్వర్యముల నంతగా గణింపక తత్త్వదృష్టినే కాలము గడుపుచు యోగభ్యాసమువలన సమస్తభోగముల ననుభవించుచుండిరి. తత్త్వాన్వేషణమునకు యోగాభ్యాస మత్యావశ్యకము. అంతియ కాదు. మన యార్యవిజ్ఞానసౌధమున కంతయు యోగసాధనము ప్రథమసోపానము. భారతీయుల యోగసాధనము అంతరదృష్టిని వృద్ధి జెందినది.
నేటికాలమున నవనాగరకదేశము లని ప్రసిద్ధి చెందిన అమెరికా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, జర్మనీ మొదలగు పాశ్చాత్యదేశములు దూరదర్శనము, దూరశ్రవణము, జలాంతర్గమనము, వ్యోమయానము మున్నగువానిని సాధించితిమని గర్వించుచున్నారు. వీని నెల్ల సాధించుటకు బాహ్యములగు యంత్రము లత్యావశ్యకములుగ నున్నవి. బాహ్యమగు ప్రకృతి లోని వివిధపదార్థములపై నాధారపడవలసియున్నది. మోటారు, దూరశ్రవణము, విమానము మున్నగునవి యనుభవింపవలయుననిన సన్ననిరాగితీఁగెలు, విద్యుద్ఘటములు, చమురు, మున్నగు వస్తుసముదాయము కావలసియున్నది. అది చెడిపోయినచో కార్యము సిద్ధింపదు. మన ఆర్యవాఙ్మయమునందును తత్తత్ప్రాంతభాషలందును గలవాఙ్మయమున మనవారును దూరశ్రవణ వ్యోమయానాదులు సాధించికొనినట్లు తెలియుచున్నది. వారికి పాశ్చాత్యులకు కావలసినన్ని బాహ్యపరికరములసాయము లేకయే యోగమే సాధనోపాయమని తెలియుచున్నది.
జలాంతర్గమనము భారతమున దుర్యోధనుఁడు భీమునితో గదాయుద్ధమునకు వచ్చుటకు మున్ను కొలనిలో జలస్థంభనవిద్యచే డాఁగియుండెననియు నాతఁడు దురభిమాని గావున భీముఁడు ఈసడింపుమాటలు పలుకగా సైఁపలేక కొలనినుండి వెలుపలికి వచ్చినట్లును తెలియుచున్నది. మహాభారతము శల్యపర్వమున "అని చెప్పి యట నున్న ద్వైపాయనహ్రదంబునం బ్రవేశించి తనమాయావిద్యాప్రభావంబున జలంబులు తన్నంటకుండ స్థంభనంబు గావించికొని.” (శ్రీకృష్ణభారతము - శల్యపర్వం - ద్వితీయాశ్వాసము 176.)
దూరశ్రవణ దూరదృష్టులను గురించిన విషయము కళాపూర్ణోదయమున మణికంధరుఁడు తటాకమున జలస్థంభనాదివిద్యల నెఱింగిన సిద్దునివిషయము కలభాషిణితో నుడువునపుడు.
సీ. | ..................... | |
గీ. | ననిన దూరదృష్టిని గనునదియుఁగూడ | |
కళాపూర్ణోదయం IV-155
క. | అని మణికంధరు గనుకొని | |
IV-166
| భూతభవద్భావిభువనవస్తువులెల్ల | |
IV-170
మనుచరిత్రయందు యోగీశ్వరుఁడు కాలి కేదో యొకయోషధిపసరు పూసికొని వియత్పథమున హిమవద్గిరి కేఁగ గల్గెననియుఁ బ్రవరుఁ డట్లు చేయుటయు మనము విన్నసంగతియే. తొమ్మిదవశతాబ్దమువా డగు 'మురారి' మహాకవి తన 'అనర్ఘరాఘవ' మను సంస్కృతనాటకమున శ్రీరాముడు విమానయానమున వియన్మార్గమున సంచరించుచుఁ జంద్రలోకమున నుండ, నయోధ్యలో నభిషేకసంభారములు సిద్ధపరుపబడియున్నవని త్వరితముగ వేంచేయుఁడని హనుమంతుఁ డయోధ్యనుండి నుడివినవాక్యముల నాలకించి తోడ్తో దిగివచ్చెనని వ్రాసెను. ఇవి యన్నియు నెట్లు సాధ్యము లనవచ్చును. స్థూలముగా జూడ మనకందఱకు పైవిషయములు అనుభవమున లేకపోవుటచే నిట్టివిషయము లసత్యము లనియు నసంభావ్యములనియు నవిశ్వసనీయములనియు ననిపించును. కాని మనకందని విషయములలో నిట్టియభిప్రాయములఁ గలిగియుండుట దోషమే యగును. మనకు తెలియనంత మాత్రమున నవి సత్యదూరములు కానేరవు. అనంతమగు శాస్త్రజాలము లపారముగా విజ్ఞానమును నానాముఖములఁ జాటుచుండ నల్పజ్ఞులమగు మనకు దెలియని యంశము లెన్నియో ప్రపంచమునఁ గలవు. 'న హి సందేహాద లక్షణ'మ్మని పరిభాషేందుశేఖరమున నుడివినట్లు మనకు సందేహము గలిగినంతమాత్రమున నవి యబద్ధము లనరాదు.
మన యోగీశ్వరులు తమ భౌతికశరీరములను యోగాభ్యాససాధనములచే స్వాధీనములుగఁ గావించికొని పై నుడివిన శక్తులే గాక యద్భుతములగు ననేకశక్తులు ననంతముగ సాధించిరి. ప్రకృతము సర్వశక్తిసంచాలనమునకు విద్యుచ్ఛక్తియే గదా కారణము. అట్టి విద్యుచ్ఛక్తి కావశ్యకములు సన్నని రాగితీఁగెలు మున్నగునవి. బాహ్యశక్తులపై నాధారపడువారి కీసన్ననిరాగితీఁగెలు చాల ముఖ్యములు. అటులే యాంతరశక్తుల సాధించు భారతీయ యోగిపుంగవులకు తమ శరీరములందలి సూక్ష్మాతిసూక్ష్మము లగునాడు లత్యంతోపకారకములు. ఈనాడీసముదాయమునకే నాడీమండల మందురు. ఈనాడీమండలమును శుద్ధము గావించికొని కొన్నిప్రక్రియలమూలమున నాయాయోగసిద్ధుల సాధించి పైకార్యములఁ గావించుచుండిరి. ఈయోగసాధనము అంతరసాధనమే. బాహ్యపదార్థములు వీరి కంతగా నవసరములు గావు. ఈయోగమునకు ఎనిమిది యంగములు గలవు. కావుననే దీనికి అష్టాంగయోగమని పేరు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధులను నవియే యెనిమిది యంగములు. ఈ యష్టాంగముల ననుభవమున గురుముఖమున సాధించి కాయశుద్ధి, నాడీశుద్ధి గావించికొనినపిదప ఖేచరత్వాదిసిద్ధు లవలీలగ గలుగునని యందురు. మన యార్యవిజ్ఞానము అంతర్ముఖత్వమునే బోధించి పారమార్థికజీవనమునకు దారిఁ జూపును, ఈ కలికాలమున మానవులలో పాటవము తప్పిపోవుటచే నెద్దియు సాధింపలేరు. ఈ విషయమే,
చ. | అలసులు మందబుద్ధిబలు లల్పతరాయువు లుగ్రరోగసం | |
అని శ్రీమదాంధ్రభాగవతమున నుడువఁబడి యున్నది. పైపద్యమందలి భావమునకుఁ దగినట్లే యీ కాలమునందలి మానవు లట్టివా రగుటచే వారి కాయోగసాధనములం దాదరాభిమానములు క్షీణించుటచే నవి యెల్ల మూలఁబడినవి. కాని మందునకైన మన దేశమున నీశక్తు లచ్చటచ్చట కొందఱు యోగీశ్వరులందు గోచరించుచున్నవి. అణిమాద్యష్టసిద్ధుల బడసినవారల ననేకుల గురించి మనము వినుచున్నాము. గోరక్ , కబీరు, మున్నగువా రనేకు లీసిద్ధులఁ బడసినవారు. ఇట్టి సిద్ధుల నొసఁగునదియే యష్టాంగయోగము.
శ్రీమద్భాగవతమున ప్రాణాయామాభ్యాసము శాస్త్రోక్తమార్గమున విశేషముగ సాధించినచో కొన్ని సిద్ధుల బడయగల్గుఫలము దృష్ట మగుచున్నట్లున్నది.
| అనూర్మిమత్వం దేహేస్మిన్ దూరశ్రవణ దర్శనమ్। | |
శ్రీమద్భాగవతే
యోగప్రశంస
యోగమను పదము పతంజలి మహర్షి ప్రకారము 'యోగశ్చిత్తవృత్తి నిరోధః' అని సర్వవిషయములనుండి యంతఃకరణవృత్తుల నిరోధించుటయే యోగమను నర్థమును బోధించుచున్నది.
| సంయోగం యోగ మిత్యాహు ర్జీవాత్మ పరమాత్మయోః | |
అని యోగమన జీవాత్మపరమాత్మ యోగమనియుఁ గలదు. ఇంకను నీ యోగశబ్దమునకు సంయోగము, మేళనము, ఉపాయము, కర్మాదిధారణము, ధ్యానము, యుక్తి, అభ్యర్థలాభచింత, దేహస్థైర్యము, శబ్దాదిప్రయోగము, భేషజము, ద్రవ్యము, జ్యోతిషశాస్త్రోక్తవిష్కంభాదియోగములు, మున్నగు నర్థము లనేకములున్నను నిట చిత్తవృత్తినిరోధరూపయోగ మనియే యర్థము. చిత్తవృత్తినిరోధరూప మగుయోగము రెండువిధములు. అవి రాజయోగము హఠయోగము. అందు రాజయోగము పతంజలిచే నుడువబడినది. హఠయోగము తంత్రశాస్త్రమందు నుడువబడినది. ఇదియే ప్రకారాంతరమున మూడువిధములనియు నుడువబడియున్నది. ఈ విషయమే భాగవతమున
శ్రీభగవానువాచ :-
| యోగాస్త్రయా మయా ప్రోక్తా నృణాం శ్రేయోవిధిత్సయా। | |
| |
తావ త్కర్మాణి కుర్వీత న నిర్విద్యేత యావతా। మత్కథాశ్రవణాదౌ వాశ్రద్ధా యావన్న జాయతే॥ స్వధర్మజ్ఞో యజన్ యజ్ఞైరనాశీః కామ ఉద్ధవ। న యాతి స్వర్గ నరకౌయద్యన్యన్న సమాచరేత్॥ అస్మిన్ లోకే వర్తమానః స్వధర్మస్థో౽నఘః శుచిః। జ్ఞానం విరుద్ధ మాప్నోతి మద్భక్తిశ్చ యదృచ్ఛయా॥
స్కంధము. 11 అధ్యాయం. 2
ఈ యోగము జ్ఞానయోగము, కర్మయోగము, భక్తియోగ మని మూడువిధము లనియు, నందు విరక్తు లగువారికి జ్ఞానయోగ మనియు, ఐహికవాంఛలు గలవారికి కర్మయోగ మనియు, భక్తు లగువారికి భక్తియోగ మనియు, వైరాగ్యము కలుగుదనుక కర్మల నాచరించవలయుననియు, నిహలోకమున నద్దాన స్వధర్మాచరణము సలుపుచు నిర్మలుడై జ్ఞానియై భక్తు డగు ననియు నుడివెను. ఈ యష్టాంగయోగసారమున పై రెండువిధములగు రాజయోగ హఠయోగ విషయము మాత్రమే సంగ్రహముగఁ బ్రతిపాదింపఁబడి యున్నది.
యోగమహిమము
శ్రీమద్భగవద్గీతయందు 'భగవద్గీతా సూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే' యని ప్రత్యధ్యాయాంతమనను బేర్కొనబడి యుండుటచే బ్రహ్మవిద్యయు యోగశాస్త్రమును బరస్పరము సంబద్ధములుగా గోచరించుచున్నవి. యోగము బ్రహ్మవిద్య కంగమని తెలియుచున్నది.
| ప్రయాణకాలే మనసా౽చలేన | |
అధ్యాయం 8-10
యోగు లగువారి కనుభవముననున్న యీయోగవిషయ మీచిన్నపొత్తమునఁ జక్కగాఁ బొందుపరుపబడి పాఠకుల కాధ్యాత్మికజిజ్ఞాసను బొడమచేయుచున్నది. ఇట్టి గ్రంథముల నెన్నే నచ్చొత్తించు దేవస్థానపుటధికారులప్రయత్నములును ముదావహములు.
ఇట్లు
పం. బాలకృష్ణమూర్తి.