అమ్మనుడి/సంపుటి 7/మార్చి 2021/తెలుగుభాష ఆశయప్రకటన - 5 సూత్రాలు

వికీసోర్స్ నుండి

సంపాదక హృదయం సంపుటి: 7 సంచిక : 1 అమ్మనుడి మార్చి 2021

తెలుగుభాష ఆశయ ప్రకటన - 5 సూత్రాలు

తెలుగు భాషోద్యమ సమాఖ్య ఆవిర్భవించి 2021 ఫిబ్రవరి 21 నాటికి 18 ఏళ్లు పూర్తయింది. తెలుగును కాపాడుకోవాలన్న ఆందోళన అప్పటికే తెలుగు వారిలో ఉంది. దానికి ఒక తీరుతెన్నూ కలిగించాలనే ఆలోచనతో కొందరు పెద్దలు తమకు తోచిన రీతిలో పని మొదలుపెట్టారు. ఈ అనుభవాల కొనసాగింపుగా కొందరు పెద్దలు పూనుకొని కృష్ణాజిల్లా శ్రీకాకుళంలో 2002 నవంబరు 1,2 తేదీలలో నిర్వహించిన తెలుగు భాషోద్యమ సమాలోచన శిబిరం, తెలుగు భాషోద్యమ సమాఖ్యను ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించింది. 2000 సం. లో యునెస్కో వారు ప్రపంచంలోని భాషా జాతులవారందరికీ ఇచ్చిన పిలుపుననుసరించి ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవాన్ని జరుపుకోవలసి ఉంది. ఆరోజునే సమాఖ్యను ప్రారంభించాలని పెద్దలు నిర్ణయించారు. 2003 ఫిబ్రవరి 21న హైదరాబాదులో 'తెలుగు భాషోద్యమ సమాఖ్య' ఆవిర్భవించింది. శ్రీకాకుళం శిబిరంలో చర్చించి కొన్ని తీర్మానాలను విడుదల చేసింది. వాటి ప్రాతిపదికగా సమాఖ్య అప్పటి నుండీ పనిచేస్తూ, కాలక్రమంలో ఎదురైన అంశాలను కూడా చేపడుతూ ముందుకు సాగుతున్నది.

ఉద్యమాల దారిలో అవగాహన నుండి ఆచరణ వరకూ ఎన్నో సవాళ్లు ఎదురవుతూంటాయి. అందునా, తెలుగు ప్రజలు తమ సుదీర్ఘమైన చరిత్రలో ఎదుర్కొన్న సమస్యలు, సవాళ్లూ అడుగడుగునా ప్రభావం కలిగిస్తూనే ఉంటాయి. సామాజిక, రాజకీయ సమస్యల ప్రభావం ఎక్కువ. రాజుల కాలంనాడు, వలసపాలకుల పరిపాలన కాలంలోనూ ప్రజలకు భాషతో ఉన్న అవసరాలు ఎన్నో పరిమితుల మధ్య ఉండిపోయాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత - విద్య యొక్క అవసరం ఎన్నోరీతుల్లో విస్తరిస్తుండడం వల్ల భాష యొక్క అవసరం కూడా ఎంతో విస్తరించింది. ప్రజలు తమ భాషలో తమను తాము పరిపాలించుకోవడం, తమ భాషలోనే అనంత విజ్ఞానాన్ని ఆకళింపు చేసుకోవడం, అన్ని జీవనరంగాల్లో అందరూ వికసించడం - ఇవీ ప్రజాస్వామ్యానికి కొలమానాలు. స్వాతంత్య్రానికి సారాంశమూ ఇదే! ఇందుకోసమే బహుభాషలు గల భారతదేశంలో భాషారాష్ట్రాలు ఏర్పడ్డాయి. భౌగోళిక, రాజకీయ, పాలనా కారణాలవల్ల ఒకే భాషీయులైనా పలు రాష్ట్రాలు ఉండవచ్చుననేది ప్రజాస్వామికతలో భాగంగా గుర్తించవలసిన అంశం. అన్ని అంశాలు అవగాహనతో తెలుగుభాషోద్యమ సమాఖ్య ముందుకు సాగుతున్నది.

అయితే రెండు తెలుగు భాషా రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత కూడా సొంత పాలకులే ప్రజలను మోసం చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. భాషారాష్ట్రాల మౌలికతనే దెబ్బతీస్తూ పాలన సాగించారు, సాగిస్తున్నారు. ఇందువల్లే, సమైక్యంగా ఉండాలనే బలమైన కోరిక 60ఏళ్లకే విచ్ఛిన్నమైంది. అయినా రెండు రాష్ట్రాల్లోనూ భాషకు సంబంధించిన మౌలిక అవసరాలను విస్మరించడం కొనసాగుతూనే ఉంది. భాషను కొల్పోతే జాతి నశిస్తుంది. ఆ భావనను కోల్పోయిన ప్రజలలో సమైక్య చైత్యన్యం అణగారుతుంది. ఇదే ఇప్పుడు మనకు అన్ని రంగాల్లోనూ అనుభవంలోకి వస్తున్నది.

తెలుగు భాషోద్యమ సమాఖ్యను మొదలు పెట్టిన నాటికీ నేటికీ సమస్యల విస్తృతి పెరిగింది. సమాఖ్య ఎన్నో పోరాటాలు చేసినా పాలకుల్లో మార్పులేదు. ప్రజల్లో మాత్రం సమస్యల అవగాహన పెరిగింది. కాని, చైతన్యంతో ముందుకు సాగి సమస్యల పరిష్కారానికి పూనుకోవలసి ఉంది. ఇందుకోసం చైతన్యవంతులైన వారు చొరవ తీసుకోవాలి. ఇప్పటికే ఆందోళనతో ముందుకు వచ్చి పనిచేస్తున్న వ్యక్తులతోపాటు కొన్ని సంఘాలు ఉన్నాయి. దురదృష్టవశాత్తూ వీరిలో కలిసి కట్టుతనం లేదు. ఈ విషయంలో సమాఖ్య కూడా వీరిని కలుపుకురాలేకపోయింది. ఇందుకు అనేక కారణాలున్నాయి. సమస్యల మౌలిక అవగాహనలో స్పష్టత రావలసి ఉంది.

కొందరి దృష్టిలో భాష అవసరం సాహిత్యం వరకే. చాలామంది రచయితలు ఇంతవరకే అలోచిస్తున్నారు. పాలకవర్గాలు అంటే రాజకీయ నాయకులు తమ ప్రసంగాల్లొ ఈ విషయంపై మాట్లాడరు. ఇంతకాలంగా ప్రభుత్వాల, మేధావుల పట్టనితనం వల్లా, స్వార్ధపూరిత విధానాల వల్ల, ఇప్పుడు విద్యా పాలనారంగాలు బాగా కలుషితమైపోయాయి. మాతృభాష ఎంతవరకు తమ అవసరాలకు పనికొస్తుందో అంతవరకు వాడుకొని వదిలేయడం ఒక అలవాటైపోయింది. ప్రభుత్వ నేతల్లో ఎవ్వరికీ తెలుగును పోటా పోటీగా అభివృద్ధి చేద్దామనే సంకల్పమే లేదు. పొరుగు రాష్ట్రాలను చూచి గాని, ఇతర దేశాలను చూఛిగాని నేర్చుకోవడానికి సిద్ధంగా లేరు. 'నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అనుకొంటున్నారు!

ఇలాంటి పరిస్థితుల్లో ఆ భాషోద్యమకారులే కాదు, చైతన్యం కలిగిన ప్రజలు ముందుకు రావాలి. ప్రజాస్వామ్యం గురించీ రాజ్యాంగం గురించీ ప్రాథమిక హక్కుల గురించీ మాట్లాడే సంస్థలు, సామాజిక కార్యకర్తలు, ఈ పరిస్థితినెందుకు పట్టించుకోరో అర్థం కాదు! ప్రజల ప్రాణం వంటి భాషయొక్క ప్రజాస్వామిక అవసరాలను గుర్తించరా? విద్య, పాలనారంగాళ్లో మాతృభాషను కాపాడుకోవడంతో ప్రజల భవిష్యత్తు ముడిపడి ఉందనీ, ఇదెంత మాత్రం కేవలం సాహిత్యాంశం కాదనీ అందరూ గుర్తించాలి.

తెలుగు వారందరూ తమ రోజువారీ వ్యవహారాలను తెలుగులో జరుపుకోగలగడంతో పాటు, తామొక భాషాజాతిగా అన్ని రంగాల్లో వికసిస్తూ దేశంలోనూ ప్రపంచంలోనూ పోటీకి నిలబడగల అభివృద్ధి చెందిన జాతిగా బలపడాలి. ఇందుకోసం తెలుగు భాషోద్యమ సమాఖ్య “అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం” సందర్భంగా ఒక ఆశయ ప్రకటనను ముందుకు తెస్తున్నది. దీనిని ఈ సంచికలో ఇస్తున్నాము. పరిశీలించండి. ఇది కేవలం సమాఖ్య సంస్థకు సంబంధించిన కార్యక్రమం కాదు; అందరికీ సంబంధించిన పిలుపు- ప్రజలందరికీ పిలుపు.

ఇందులో వివరించిన 5 సూత్రాల్లో ఎవరికి వీలైన రంగాల్లో వారు వ్యక్తులు గానూ, సమూహాలుగానూ, సంఘాలుగానూ ముందుకు సాగి చైతన్యంతో కృషిచేయాలని కోరుతున్నాం.

భాషను రక్షించుకోవడమంటే ప్రజలను రక్షించుకోవడం... వారి ఆత్మగౌరవాన్ని వారి వారసత్వ సంపదను, బ్రతుకుల్ని అవసరాలను, భవిష్యత్తునూ పదిలపరుచుకోవడం... వారి మానవ హక్కుల్నీ శక్తినీ గౌరవించడం... వారి స్వాతంత్య్రాన్ని కాపాడడం. ఈ అవగాహనతో ముందుకు సాగాలి తప్ప ఇదేదో సాహిత్యానికి, సంగీతానికి, పాండిత్యానికీ సంబంధించిన అంశంగా చూడకూడదు. సొంత భాషతో సాధించేదే అభివృద్ధి అవుతుంది... పరాయిభాషలకు దాసులమై, మనను మనమే మోసగించుకోవడంతో కాదు.

తెలుగు భాషోద్యమ సమాఖ్య మన ముందుకు తెచ్చిన ఈ ఆశయప్రకటననూ 5 సూత్రాలనూ అందరూ సొంతం చేసుకోండి. దీన్ని అందరి కార్యక్రమంగా తీసుకోండి.

తేదీ : 28-02-2021 "సామల రమేష్ బాబు.