అమ్మనుడి/సంపుటి 7/మార్చి 2021/తెలుగుభాష ఆశయప్రకటన

వికీసోర్స్ నుండి

తెలుగు భాషోద్యమ సమాఖ్య

ఎల్లనాడుల అమ్మనుడుల పండుగ

21-02-2021 సందర్భంగా

తెలుగుభాష ఆశయప్రకటన

తెలుగువారందరూ తమ రోజువారీ వ్యవహారాలను తెలుగులో జరుపుకోగలగాలి.

ఈ అందమైన కలను నిజం చేసుకోవడానికి 5 సూత్రాలు!

ఆధునిక స్థాయిని సాధించేందుకు దారిదీపాలు!!



ఈ నేల మీద ప్రతి జీవి తన సొంతభాషలో జీవనం సాగిస్తుంది. మానవులు కూడా ఎవరి భాషలో వారు తాము కోరుకున్నంత ఆనందకరమైన, సౌకర్యవంతమైన జీవనాన్ని సాగించగలగాలి. అందుకు మొదటి మెట్టు అమ్మనుడిలో చదువులు. ఆపై అమ్మనుడిలో సమాచార అందుబాటు, రోజువారీ వ్యవహారాల జరుగుబాటు అనేవి మలిమెట్లు.

తెలుగువారందరూ తమ రోజువారీ వ్యవహారాలను తెలుగులో జరుపుకోగలగాలి.

మనకు తెలిసిన మాటలతో ఉన్న ఈ స్వప్నం తేలికగా కనబడవచ్చు కానీ దీనీకి లోతూ వెడల్పూ ఎక్కువ! ఈ స్వప్నం లోని మాటలను వివరంగా చూస్తే:

తెలుగువారు : నివసిస్తున్న ప్రాంతం ఏదైనా, తెలుగు ఇంట్లో పుట్టినవారు తెలుగువారు. (భార్యాభర్తల్లో ఒక్కరైనా తెలుగువారైతే అది తెలుగు ఇల్లే.) పుట్టుకతో సంబంధం లేకపోయినా, నేను తెలుగబ్బాయిని/తెలుగమ్మాయిని అనుకునేవారు కూడా తెలుగువారే!

అందరూ : ఏ కొద్దిమందో, ఏ కొన్నిచోట్లో తెలుగులో వ్యవహారాలు జరుపుకునే వెసులుబాటు ఉంటే సరిపోదు. ఈ సౌలభ్యం తెలుగువారందరికీ ఉండాలి. (కృత్రిమ మేధ-ఎ.ఐ. మెరుగైతే, నివసిస్తున్న ప్రాంతంతో సంబంధం లేకుండా తెలుగువారందరూ కూడా ఈ వెసులుబాటు పొందగలుగుతారు.)

రోజువారీ వ్యవహారాలు : బడికెళ్ళే పిల్లవాడికీ, వాడికి చదువుచెప్పే గురువుకీ చదువు రోజువారీ వ్యవహారం. ఉద్యోగం చేసేవారికి ఆఫీసు పని రోజువారీ వ్యవహారం. వ్యాపారస్తులకు వ్యాపార లావాదేవీలు రోజువారీ వ్యవహారం. అందరికీ వినోదం తదితర సమాచార అవసరాలు రోజువారీ వ్యవహారం.

తెలుగులో : అంటే, ఆయా ప్రాంతాల్లో ఆయా కాలాల్లో వాడుకలో ఉన్న మాటలతో తెలుగు లిపిలో ఉండాలి. వారి సొంత యాసలో బాసలో వారికీ, వారి చుట్టుపక్కలవారికీ అలవాటైన, సౌకర్యవంతమైన రీతిలో అని.

జరుపుకోగలగాలి : 'కలగాలి ' అంటే రెండు అర్థాలు: ఒకటి, తెలుగులో జరుపుకోవాలి అని ఎవరూ శాసించకుండానే, స్వచ్చందంగా ప్రజలు అనుకొని జరుపుకోవడం. రెండు, అందుకు తగ్గ పరిస్థితులు, సదుపాయాలు మనకు మనం కల్పించుకోవడం.

ఈ కల నిజమవడానికి 5 సూత్రాలు:

అమ్మనుడిలో చదువులు : పసి చదువుల నుండి పట్టా చదువుల వరకు. ప్రభుత్వ ప్రయివేటు బడులలోనూ.
తెలుగులో పరిపాలన, న్యాయం : ప్రజలే 'ప్రభువులైన ప్రజాస్వామ్యంలో ప్రజల భాషలో పరిపాలన, :న్యాయపాలన జరగాలి.
తెలుగులో వస్తు సేవలు వ్యాపార వ్యవహారాలు : మనం డబ్బు పోసి, కొంటున్న వస్తూత్పత్తులు, పొందుతున్న :సేవలు మన భాషలో ఆశించడం తప్పు కాదు. అది మన హక్కు
తెలుగులో వినోద, విజ్ఞాన, వికాస సమాచారం : ఆటపాటలే కాదు, మానవులుగా మనం ఎదగడానికి :కావలసినదంతా తెలుగులోనూ ఉండాలి. లేకపోతే, తెచ్చుకోవాలి.
తెలుగులో సంపాదన అవకాశాలు : రెండు తెలుగు రాష్ట్రాల్లో పదికోట్లు పైనున్న తెలుగువారికి కావలసినవన్నీ :(ఫైవన్నీ) తెలుగులో అందించడంలో తెలుగువారు మాత్రమే అందుకోగలిగే అంతులేని అవకాశాలు ఉన్నాయి.

బాధ్యులు-బాధ్యతలు

ప్రజలు

“దేశమంటే మట్టి కాదోయ్‌, దేశమంటే మనుషులోయ్‌” అనే నినాదంతోపాటు మనం “భాషంటే దాన్ని మాట్లాడే ప్రజలోయ్‌ ” అని కూడా చెప్పుకోవాలి. ఇదంతా మన కోసమే. మన భాష మన బాధ్యత. ఏదైనా మనం సంపాదించుకున్నది, తయారుచేసినది అయితే వదిలేసుకునే, పాడుచేసుకునే స్వేచ్చ మనకు ఉంటుంది. కానీ మన భాష అలా కాదు. ఇది మనకు తరతరాలుగా వారసత్వంగా వచ్చింది. మనకు అందించబడింది. దాన్ని పెంచి, పోషించి ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. లేదా కనీసం మనం అందుకున్న స్థితి లోనే ముందు తరాలకు అందించాలి.

  • తోటి తెలుగు వారితో తెలుగులోనే మాట్లాడుదాం. అసలు ఎవరితోనైనా సంభాషణ తెలుగులో మొదలుపెడదాం.

ఎదుటివారికి తెలుగు రాదు అని ముందే ఊహించేసుకుని రాని భాషలో ఇబ్బంది పడొద్దు. తెలుగు నేలలో తెలుగులో వ్యవహరించడం సహజం. మనం మరీ వంగిపోనవసరం లేదు.

  • సామాజిక మాధ్యమాలలోనూ విరివిగా తెలుగులో రాద్దాం. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ లాంటి వాటిల్లోనూ తెలుగులో రాద్దాం. కాలక్షేపం కబుర్లూ సినిమా రాజకీయ తదితర సమకాలీన అంశాలు మాత్రమే కాక మరికొంచెం గంభీరమైన విషయాలపై కూడా తెలుగులో రాద్దాం. వచనం, పాటలు, పద్యాలు, కవితలు, వ్యాసాలు ఏవైనా!
  • వ్యాపార సంస్థలను వారి ఉత్పత్తులను, సేవలను తెలుగులో అందించమని అడుగుదాం. ఇప్పటికే తెలుగులో ఉన్న ఉత్పత్తులను ప్రోత్సహిద్దాం . సేవలను తెలుగులో వాడుకుందాం. ఆయా సంస్థల వినియోగదారుల సహాయ కేంద్రాల ద్వారా తెలుగు కావాలని మన ప్రతిస్పందనలలో తెలియజేద్దాం.
  • నేటికీ కంప్యూటర్లలోనూ, చరవాణుల్లోనూ తెలుగు ఎలా రాయాలో తెలియనివారు చాలా మంది ఉన్నారు. మన చుట్టుపక్కల వారికి మనం సాంకేతిక సహాయం అందిద్దాం. మనం నిపుణులం అయివుండాల్సిన పనిలేదు. మనం తెలుగు ఎలా టైపుచేస్తున్నామో, చిన్నచిన్న సమస్యలను ఎలా అధిగమిస్తున్నామో చెప్తే సరిపోతుంది.
  • పిల్లలకు, యువతరానికి తెలుగును చేరువచేసేందుకు వారికి ఉపయోగపడే బాల సాహిత్యం, కథలతో పాటు వారు

ఎదుర్కొనే సమస్యలపై, సవాళ్ళపై చర్చలు, వ్యాసాలు, తదితరాలు రాద్దాం. వాటిని యువతరం మాధ్యమాలలో (వలగూళ్ళు, యూట్యూబు, ఇన్‌స్టాగ్రామ్‌, మున్నగువాటిలో) ప్రసారం, ప్రచారం చెద్దాం.

  • సంస్థాగతంగా తెలుగు కోసం పనిచేయాల్సిన సంస్థలను వారిని పని చేయమని ముల్లుగర్రతో పొడవడం కూడా మన

బాధ్యతలో భాగమే. ఆయా వ్యవస్థలు కాడి వదిలేనినప్పుడు అవసరమైతే మనం భుజం కాయాలి, ఆ వ్యవస్థలను గాడిలో పెట్టుకోవాలి.


ప్రభుత్వం - శాసన, పరిపాలన, న్యాయ వ్యవస్థలు

ప్రజల తర్వాత వారిపై అత్యంత ప్రభావాన్ని చూపించే వ్యవస్థలు ఇవి. ఈ వ్యవస్థలు తెలుగు భాషలో నడుస్తూ, వాటి విధానాలు తెలుగు భాషకు అనుగుణంగా ఉన్నప్పుడే మన లక్ష్యం నెరవేరినట్టు.

  • చట్టసభల్లో చర్చలూ, చట్టాల రూపకల్పనా తెలుగులో జరగాలి.
  • ప్రభుత్వ ఉత్తర్వులు, నియమ నిబంధనలు, విధాన ప్రకటనలు, సంక్షేమ పథకాలు, తాఖీదులు, రశీదులు, ఇతరత్రా

సమాచారం అంతా ప్రధానంగా తెలుగులోనే ఉండాలి.

  • పరిపాలన, ప్రభుత్వ అంతర్గత వ్యవహారాలు, పద్దులు, రికార్డులు అన్నీ తెలుగులోనే జరగాలి.
  • న్యాయస్థానాల్లో వాదప్రతివాదనలు తెలుగులో జరగాలి. తీర్చులను తెలుగులో వెలువరించాలి.
  • ప్రభుత్వం, దాని విభాగాలు ప్రజలకు అందించే సమాచారం, ప్రజాసంబంధాల నిమిత్తం నిర్వహించే అన్ని రకాల

కార్యకలాపాలు (రేడియో టీవీ ప్రోగ్రాములు, వార్తా లేఖలు, సామాజిక మాధ్యమాలలో ప్రచారం మొదలైనవి) అన్నీ తెలుగులో ఉండాలి.

ముద్రణ, ప్రసార వలగూడు(వెబ్‌) మాధ్యమాలు

ప్రజల మధ్య, సమాజంలోని తతిమా వ్యవస్థల మద్య అంతరాల్ని పూడ్చి సంభాషణా వారధులుగా వ్యవహరించేవే మాధ్యమాలు. వీటికి ఉన్న ప్రాధాన్యత లేదా అవి పోషించే పాత్ర మూలంగా వీటిని “ఫోర్త్‌ ఎస్టేట్ "గా వ్యవహరించారు. తెలుగు భాషకు ఆధునిక స్థాయిని సాధించడంలో కూడా వీటిదే కీలక పాత్ర.

  • వినోదం : సినిమాలు, టీవీ కార్యక్రమాలు, నాటకాలు, స్వతంత్ర మాధ్యమాలలో తక్కువ నిడివి సినిమాలు, కథలు, కవితలు, కార్టూనులు వంటివి అన్నీ తెలుగులో ఉండాలి. ఇప్పుటికే ఇవన్నీ తెలుగు లోనే ఉన్నా వీటి సృష్టి ఇతర భాషలతో పొలిస్తే తెలుగులో చాలా తక్కువ. తెలుగు వారి “తలసరి సాంస్కృతిక దిగుబడి” చాలా పెరగాల్సి ఉంది.
  • విజ్ఞానం : విద్యారంగంలో చూస్తే అన్ని స్థాయిల్లోనూ చదువులు (వృత్తి విద్యలు, దూర విద్యలతో సహా) పూర్తిగా తెలుగులో చదువుకునే అవకాశం ఉండాలి. పరిశోధనలు, పత్ర సమర్పణలు, శాస్త్ర విజ్ఞాన రంగాల్లో పురోగతీ, దానిపై చర్చలూ, సదస్సులూ కూడా తెలుగులో జరగాలి. విద్యేతర రంగాల్లో వివిధ నైపుణ్యాలపై శిక్షణలు, సరికొత్త సాంకేతికతలపై సదస్సులు, చర్చలూ, అనేక అంశాలపై సెమినార్లూ మొదలైనవి తెలుగులో జరగాలి.
  • సమాచారం : స్థానిక, ప్రాంతీయ, రాష్ట్రీయ, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వార్తలూ విశేషాలూ అన్నీ తెలుగులోనూ లభించాలి. కేవలం దినవత్రికలు, వలగూటి పత్రికలే కాకుండా, స్వతంత్ర మాధ్యమాలుగా బ్లాగులు, ట్విట్టర్‌, యూట్యూబ్‌ ఛానెళ్లు, పోడ్‌కాస్టులు తెలుగులో విరాజిల్లాలి.
  • వికాసం : ఆధ్యాత్మికత, తత్వచింతన, నైతిక ధర్మ చింతనలు, భవిష్యత్తు సాంకేతికతలపై ఆలోచనలు, మానవాళి మనుగడ, ప్రస్థానం ఇలాంటి వాటిపై ఆలోచనలు, చర్చలు, ప్రచురణలు తెలుగులో జరగాలి. మార్పుకై పోరాటం, అన్ని రకాల ఉద్యమాలు వాటి సాహిత్యం అంతా తెలుగులో దొరకాలి.

వ్యాపార, సేవా సంస్థలు

నేటి మార్కెట్‌ ఆధారిత పెట్టుబడిదారీ వ్యవస్థలో వ్యాపార సంస్థల పాత్ర అంచనాలకు మించిన ప్రాధాన్యం కలది. పెట్టుబడిదారీ వ్యవస్థలోనూ సేవా సంస్థలు నాణేనికి మరోవైపున అన్నట్టుగా వాటి ప్రభావమూ చాలానే ఉంది. వీటి నుండి భాషకు తగిన తోడ్చాటు దక్కినప్పుడే ఆధునిక స్థాయిని సాధించినట్లు.

  • తెలుగు రాష్ట్రాల్లో అమ్ముడయ్యే వస్తూత్పత్తులన్నీ (పేర్లూ

వాడుకునే సూచనలు, ఇతరత్రా వివరాలతో సహా) తెలుగులో ఉండాలి. ఇక్కడ అందించబనే సేవలు కూడా తెలుగులో/తెలుగు సమాచారంతో దొరకాలి. వారి వ్యాపార ప్రకటనలూ తెలుగులో ఉండితీరాలి.

  • ఈ సంస్థలు ప్రభుత్వాలకు, ప్రభుత్వ విభాగాలకు దాఖలు చేసే నివేదికలు, వాటి పెట్టబడిదార్లకు, వాటాదార్లకు, ఇతరత్రా భాగస్వాములకు, ప్రజలకు సమాచారం నిమిత్తం ప్రచురించే నివేదికలు, పత్రాలు తెలుగులో ఉండాలి.
  • తెలుగువారి సంస్థల్లో అంతర్గత కార్యకలాపాలు, పద్దులు, ఖాతా పుస్తకాలువంటివీ తెలుగులో నిర్వహించబడుతూండాలి.

ఇది మన కల. మనం చేరుకోవాల్సిన గమ్యం.

ఇదొక గొప్ప లక్ష్యం.

వాదాలలో పడి, దిక్కుతోచక ఎటుపడితే అటు కొట్టుకుపోకుండా, మనం చేరాల్సిన తీరాన్ని సూచించే దిక్సూచి ఈ ఆశయ ప్రకటన. అలసత్వపు చీకటిలో దారిచూపే వేగుచుక్క ఈ కలను సాకారం చేసుకోడానికి మనం రూఫొందించుకునే కార్యాచరణను, దాని ఫలితాలను, ప్రభావాన్ని పోల్చి చూసుకోవాల్సిన గీటురాయి కూడా ఇదే!

డా॥ సామల రమేష్‌బాబు 9848016136

డా॥!గారపాటి ఉమామహేశ్వరరావు 9848016136

డా॥ వెన్నిసెట్టి సింగారావు 9393015584

వీరపనేని వీవెన్‌ 9963029061

రహ్మనుద్దీన్‌ షేక్ 9493035658