అమ్మనుడి/సంపుటి 7/మార్చి 2021/అడుగుజాడలూ ఆనవాళ్లు-7

వికీసోర్స్ నుండి

"ధారావాహిక"

ఈమని శివనాగిరెడ్డి 98485 98446


అడుగుజాడలూ ఆనవాళ్లు-7

నా కనిగిరి - దొనకొండ యాత్ర

నేను వారసత్వ స్థలాలు, చారిత్రక కట్టడాలను చూడటానికి పల్నాడు వెళ్తున్నప్పుడల్లాా మా ప్రకాశం జిల్లా క్కూడా రావచ్చు గదా అని ప్రముఖ చరిత్రకారుడు విద్వాన్‌ డా॥జ్యోతి చంద్రమౌళిగారన్నమాట గుర్తుకొచ్చింది. గుర్తుకురావటమే కాదు. పల్నాడుకు పయనం కట్టినపుడల్లా ఆయన నా కళ్లముందు వాలిఫోతుండేవాడు. అయినా అటువైపు వెళ్లటం కుదిరేది కాదు. ఎప్పటిలాగే ఒక శనివారంనాడు పల్నాడులోని మాచర్ల, జమ్మలమడక తుమ్రుకోట, మల్లవరం, చూచిరావడానికి ఏర్పాట్లు చేసుకొని తెల్లవారుఝాము 3 గం॥ లకు బయలుదేరి మాచర్ల వైపు వెళ్తామని డ్రైవర్‌ శివకు చెప్పి, సంచి సర్జుకుంటున్నానోలేదో, జ్యోతిచంద్రమౌళిగారు ఫోనుచేసి, అద్దంకి రమ్మని నాచేత ఒప్పించి, దారి మళ్లించారు. రాత్రి 9గం॥ లకు అన్నంతిని మళ్లీ ఆఫీసుకెళ్లి ప్రకాశం, గుంటూరు జిల్లాల మ్యాపులు తీసుకొని ప్రయాణం గురించి డైవర్‌కు, నా సహోద్యోగి దుర్గాసాగర్‌కు తెలియజేసి, ఇంటికొచ్చి పడుకొన్నాను. నిద్దరపడితేగా. ప్రకాశం జిల్లా అనగానే అద్దంకి పండరంగని శాసనం, ధర్మవరం జైన బసది, దర్శిదేవాలయం, పొదిలి కట్టడాలు, కనిగిరికోట కళ్లముందు ముసురుకున్నాయి. మానసిక తర్జనభర్జనల మధ్య మణికేశ్వరం, సురఖేశ్వరకోన పోదామనుకున్నాను. కాదు, కొణిదెన, చదలవాడ, చందలూరు అయితే బాగుంటుందనిపించింది. కాదు, కాదు, మాలకొండ, సింగరకొండ, సింగరాయకొండ, మిట్టపాలెం, చెన్నపల్లి చూద్దామనుకొన్నాను. ఇన్ని గందరగోళాల మద్య తన్నుకొని, తన్నుకొన, చివరికి కాటమరాజు తిరగాడిన కనిగిరి, పాలేటిగంగ, పంచలింగాల కొండ, పునుగోడు, గంగదొనకొండ, వల్లూరు, కురిచేడు వెళ్ళొస్తే బాగుండునని, మనసును స్టిమితపరచుకొన్నాను. వీరగాధలపై విస్తృత పరిశోధనలు గావించిన డా.తంగిరాల

వెంకటసుబ్బారావుగారు గుర్తొచ్చి ఈ పర్యటనా స్థలాల వరుసను ఎంపిక చేసుకోవడంలో పరోక్షంగా సహకరించారు. మారిన బాటగురించి డ్రైవర్‌కు, జ్యోతిచంద్రమౌళిగారికి తెలిపాను. చంద్రమౌళిగారేమో, అద్దంకి, ధర్మవరం, అనమలూరు, మణికేశ్వరం చూద్దామన్నారు. కాదని, నాచూపు ఇప్పుడు కనిగిరి వైపు అని కరాఖండిగా చెప్పాను. సరేనన్నా ఆయన కనిగిరి కరుణానిధికి ఒకసారి ఫోన్‌ చేయమన్నారు. అప్పటికే రాత్రి 11.00 గంటలైంది. కరుణానిధితో, తరువాతి రోజు కనిగిరి వస్తున్నాము. మొదటగా నేలటూరి గొల్లపల్లిలోని ఇనుప యుగపు సమాధులు చూద్దాం. ఉదయం ఆరింటికి సిద్ధంగా ఉండమన్నాను. అనుకున్నట్లుగానే 3.00 గం॥లకు బయలుదేరి 4.00 గం॥లకు చిలకలూరిపేటలో ఆగి, టీతాగి, గణపవరం మీదుగా అద్దంకి చేరుకుని, చంద్రమౌళిగారిని కారులో ఎక్కించుకొని, కనిగిరి చేరుకున్నాం. ఇంకా తెల్లవారలేదు. అలికిడి మొదలైంది. కరుణానిధి ఫోను ఎత్తటం లేదు. కంగారు మొదలైంది. ప్రత్యామ్నాయంగా చంద్రమౌళి మాష్టారు శిష్యుడైన ఇంకో ఉపాధ్యాయుని ఇంటికెళ్ళాం. ఆయన్ను లేపి అడిగితే రావటం కుదరదని చెప్పి, టీ తాగి పొమ్మని బలవంతం చేశాడు. ఇంతలో కనిగిరి కరుణానిధి ఫోను! తాను కనిగిరి సెంటర్‌లో ఉన్నానని! ఆనందానికి అవధుల్లేవు. సగం కప్పుటీని అలానే వదిలేసి కరుణానిధిని కలిశాం. ముందుగా సి.యస్‌.పురం రోడ్డులోని నేలటూరు- గొల్లపల్లికి బయలుదేరాం. అప్పుడే రాత్రి తెరతొలగించుకొని వెళ్ళిపోయింది. సూర్యుడు రాలేదు గానీ, వెలుగు రేఖలు పుంజుకుంటున్నాయి. పది నిముషాల ప్రయాణం తరువాత కారు ఒక కల్వర్టు దగ్గర ఆగింది. దిగి ఎడమవైపు చూస్తే, ఎప్పుడో కొట్టేసిన మోడువారిన చెట్ల మాదిరిగా, నిలువురాళ్ళు కనిపించాయి. చంద్రమౌళిగారు, ఇవే ఇనుపయుగపు ఆనవాళ్ళు అని చూపించారు. బాగా వెలుతురొచ్చింది. సూర్యుడు చెప్పాపెట్టకుండా ఎగబాకుతున్నాడు. గొల్లపల్లి రైతు ఒకాయన అటువెళుతుంటే వీటిని ఏమంటారని అడిగాను. ఇవి నిలువు రాళ్ళు, ఏనెలని కూడా అంటామని, ఈ నేలను నిలువురాళ్ల చెల్క అంటామన్నాడు. తమ పూర్వీకులు వీటిని పాండవుల గుళ్లు అనీ, రాక్షసబందలని పిలిచేవారని కూడ చెప్పాడు. నేను, చంద్రమౌళిగారు కలిసి దాదాపు 100 ఎకరాల్లో ఉన్న 30 నిలువురాళ్ళను ఒక్కోదాన్ని పలకరించాం. గతంలో ఇక్కడ 500 వరకూ ఉండేవని ఇళ్లకాలనీకి రోడ్డు, ప్లాట్లు వేసినపుడు తొలగించారని ఆరైతు చెప్పినపుడు నాకు చేతులు నరికేసినంత బాధేసింది. తెలుగు వారి తొలికాలపు సంతకాలు చెరిగిపోయాయనిపించింది. చారిత్రక ఆనవాళ్లను కూకటి వేళ్లతో పెకలించినట్లనిపించింది.

నిట్లూర్చటంకంటే ఏమీ చేయలేని మేం ఒకరినొకరు చూచుకొని సముదాయించుకొన్నాం. కరుణానిధి, నేను కలిసి ఒక పది నిలువురాళ్ల కొలతలు తీసుకొన్నాం . ఒక్కొక్కటి భూమిమీద 9.0 అడుగుల ఎత్తు, రెండు నుంచి ఆరు అడుగుల వెడల్పు, ఆరంగుళాల నుంచి అడుగున్నర వరకూ మందం కలిగి ఉన్నాయి. ఒకే ఒక చోట పంటకాలువ తీయటాన ఒకటి రెండు నిలువురాళ్ల పునాదులు కూడా కనిపిస్తున్నాయి. భూమట్టం నుంచి 5.0 అడుగుల లోతులో వాటిని పాతి ఉంచారు. ఒకచోట వీటిముందుగల ఐదారడుగుల గుంటలో నలుపు, నలుపు ఎరుపు కుండ పెంకులు కనిపించాయి. ఇనుపయుగంలో జనం ఒకచోట కుదురుగా ఉండటానికి గుడిసెలు వేసుకొని మరణించిన వారిని గుంట సమాధుల్లో పాతి, గుర్తుగా వాటి పక్కనే ఇలా నిలువు రాళ్లను పాతి పెట్టే ఆనవాయితీని ఇవి తెలియజేస్తున్నాయి. చిత్రమేమిటంటే, పాతిన నిలువురాళ్లలో, చాలావరకు శిలాజాలను పోలి ఉండటం, కొన్నైతే పెద్ద పెద్ద చెట్లు ఘనీభవించి కొయ్యరాళ్లలా మారిపోయాయా అన్నట్లున్నాయి. గతంలో ఇలాంటి నిలువురాళ్లవద్ద జరిపిన తవ్వకాల్లో బయల్పడిన పురావస్తువుల విశ్లేషణ ద్వారా క్రీపూ. 1500 - 1000 సం॥ల మథ్యకాలాల నాటి మానవులు ఇలాంటి సమాధులు, నిలువు రాళ్లను ఏర్పాటు చేసుకొన్నారని చెప్పవచ్చు. వెల్లటూరు - గొల్లపల్లి నిలువురాళ్లు కూడా క్రీ.పూ. 1000నాటి ఇనుపయుగపు ఆనవాళ్లేనని రుజువైంది. చుట్టుపక్మల ఉన్న ఆవూరి వాళ్లదగ్గరకెళ్ళి వీటి ప్రాచీనతను తెలిపి, పోయినవిపోగా ఉన్న వాటినైనా కాపాడుకోండి అనిచెప్పాం. “కంకర కావలసిన వాళ్లు ఈ నిలువురాళ్లను, పడేసి కొట్టుకుపోతున్నారు. ఆపేవాళ్లే లేరని వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. యుద్దభూమిలో హోరాహోరీ పోరాడి నేలకొరిగిన వారు ఒరిగిపోగా, మిగిలి నిశ్చేప్టులై చూస్తున్న యోధుల్ని తలపిస్తున్నాయి- ఆ నిలువురాళ్లు.

సమయం ఉదయం 7.00 గంటలైంది. బయలుదేరి కనిగిరికి తిరిగొచ్చాం. కనిగిరిలోని చారిత్రక ఆనవాళ్లను వరుసగా చూపిస్తున్నాడు కరుణానిధి. కొండకింద గల ఆలయాలు, కోటగోడ, ద్వారాలను చూపించాడు. కాటమరాజు నిర్మించాడని చెప్పాడు. చారిత్రకాధారాల్ని పరిశీలిస్తే అద్దంకి రాజధానిగ పాలించిన ప్రోలయవేమారెడ్డి నిర్మించిన 84 దుర్దాల్లో కనిగిరి ఒకటని తరువాతి కాలంలో గజపతులు దీన్ని బలపరచి గిరిదుర్గంగా తీర్చిదిద్దారని, శ్రీకృష్ణదేవరాయలు ఈ కోటను స్వాధీనం చేసుకాన్నాడని చంద్రమౌళిగారు చెప్పింది సబజేననిపించింది.

కొండమీద కోటలో రెండు చెరువులు చెన్నమ్మక్మబావి అనే కోనేరు, అనేక శిధిలదేవాలయాలున్నాయి. కొండమీద కోటగోడను తిన్నగా లాగితే 25 కి.మీల పొడవున సాగుతుంది. ఈ కోటగోడలు, దర్వాజాలు, బురుజులు, గుళ్ళు, కట్టడాలను చూచి, మళ్లీ కాటమరాజే వచ్చి వీటిని బాగుచేయించుకుంటాడేమోనని సరిబుచ్చుకొన్నాం.

కోనేరు దగ్గర ఒక బండకు చెక్కిన ఒక 17వ శతాబ్ది ఆరుపంక్తుల శాసనంలో దాడింరెడ్డి కుమారుడు, దారియినేని రెడ్డి రాబోయే ఒక ఆపద నుంచి తమను హనుమంతుడే రక్షించి కాపాడుతాడని ప్రార్ధిస్తున్న వివరాలున్నాయి. ఉదయం గం౹౹ 9.30 ని. అవుతుంది. ఆకలి దంచుకుంది. కనిగిరిలో మంచి హోటల్‌కుపోయి టిఫిను చేద్దామనుకునేలోపు నా ఫోన్‌ మోగింది. ప్రముఖ కవి, కథకుడు, చిత్రకారుడు కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి గారిది. ఇక్కడే ఉన్నామని, టిఫిను చేసి కలుస్తామన్నా వినకుండా బలవంతపెట్టి వాళ్లింటి పక్కన ఒక కుటుంబం నడుపుతున్న వరంగల్‌ మట్టెవాడలాంటి పూటకూళ్లమ్మ గుర్తొచ్చేట్లున్న ఒక చావడి హోటల్‌కు తీసుకెళ్లారు. గరగరలాడే దోసె, దానిమీద సన్నగా చిన్నగా తరిగిన ఉల్లితొనలు, కారెట్టుముక్కలు, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, మరేదో ఫొడిని కొంచెం కారాన్ని చల్లి తిరగేసి పెణంమీంచి తీసిన అట్టుని తింటుంటే, రోజూ ఇక్కడే తింటే బాగుందనిపించింది. నంజుకాన్న కొద్దీ బలంపుంజుకునేట్టున్న వేరుశనగ చట్నీ అల్లం పచ్చడి మానసోల్లాసాన్ని కలిగించాయి ఆతిథ్యంలో భాగంగా టిఫిన్‌ను అందించిన వెంకటేశ్వరరెడ్డి గారికి నమస్మరించాం. ఇంటికి తీసుకెళ్ళి ఆయన కవితాసంపుటి “దుక్కిచూపు” నిచ్చి, తానువేసిన వర్ణచిత్రాలను చూపించాడు. వీడుకోలు తీసుకొని ఎక్కడికెళదామని కరుణానిధిని అడిగాం. పాలేటి గంగమ్మవాగు, వెంగళాపురం వెళదామనగా కారును అటు మళ్లించాం.

కనిగిరి నుంచి ఒక పావుగంట ప్రయాణించిన తరువాత ఒక నదిని దాటాం. చంద్రమౌళిగారు కలుగజేసుకొని, పక్కన కనిపిస్తున్న గ్రామం వెంగళాపురమని, ఇది పాలేటిగంగ(నది) అని చెప్పారు. పాలేటిగంగమ్మ దాటుతుండగా కాటమరాజుకథ మదిలో మెదిలింది. కాటమరాజు తన ఆలమందను 12 ఏళ్లపాటు శ్రీశైలంలో మేపింతర్వాత, శివుని ఆజ్ఞపై కాటమరాజు దక్షిణం వైపు వెళ్లగా-కరువువల్ల నీరు, గడ్డి దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటాడు. కాటమరాజు ఆలమంద చాలా పెద్దది. అతని పశుసంపదను గురించి కాటమరాజు కథలో “కుదురు ఆరామడ కదులు పన్నెండామడనే” సామెతకు కారణమైందని చెప్పబడింది. బలిజ వారి సలహా మేరకు నల్లసిద్ధిరాజ్యానికి మందను మళ్లిద్దామనుకొని పినతల్లి సిరిదేవికి చెప్పగా, వద్దని వారిస్తుంది. వినకుండా కాటమరాజు, తన వారితో కలిసి ఆలమందను పాలేటివాగు దగ్గరకు తోలుకొస్తాడు. గంగను దాటాలనుకుంటున్న కాటమరాజుతో గంగ తనను చేతులెత్తి మొక్కితేనే దాటనిస్తానంటుంది. ఇష్టపడని కాటమరాజు వాదోపవాదాల తరువాత, నమస్మరించగా, అంగీకరించిన గంగ, ఎండిపోయిన వాగులో నీటిని రప్పించింది. కాటమరాజు తన ఆలమందతో పాలేటిని దాటి నెల్లూరు సీమకు బయలుదేరి వెళ్ళిన సంఘటన గుర్తుకొచ్చింది. అలా నెమరు వేసుకుంటుండగా, వెంగళాపురంలోనున్న కాటమరాజు కథకు సంబంధమున్న అయితమరాజు విగ్రహం, పాలేటి గంగమ్మ అని పిలుస్తున్న మహిషాసురమర్దిని విగ్రహం దాని తరువాత అలవలపాడులోని వాగు ఒడ్డునున్న ఒక బండపై గల క్రీ.శ 1526 వ సం॥నాటి రాపురి రాఘవరెడ్డి, తన తండ్రి బస్పరెడ్డి, తల్లి అమలాంబికకు పుణ్యంగా లింగాలకొండ సోమేశ్వరునికి, బంగాది గంగ (పాలేటిగంగ) కు కొండమరుసయ్యగారు ఇచ్చిన నాయంకరంలోని కనిగిరి పోలచెర్ల, ముసుండూరి సీమలోని గంగపట్నాన్ని షోడశోపచారాలకు ఇచ్చినట్లు పేర్కొంటున్న శాసనాక్షరాల్ని తడిమి చూచాం.

ఇంతలో, కరుణానిధి, మమ్మల్ని పంచలింగాల కొండవైపు మళ్లించాడు. పంచలింగాలకొండ కూడా కాటమరాజుకు


సంబంధమున్న ప్రదేశమే. అందుకు సాక్ష్యంగా అక్కడున్న మహిషాసురమర్ధిని విగ్రహం, శివలింగం, భూమిలోకి సగం పూడుకుపోయిన నందిని చూశాం. తరువాత, పునుగోడు వెళ్లి అల్లాడపల్లి పెద్దిరెడ్డి రాజశేఖరరెడ్డిగారి పొలంలో పడిఉన్న 10 అడుగుల పొడవుగల ఒక అప్రకటిత నల్ల శాసనపురాతి 17వ శతాబ్ధి శాసనాన్ని చూచి, కేంద్ర పురావస్తు శాఖాధికారులకు సమాచారాన్నిచ్చాం. అదే గ్రామంలోని సిద్దేశ్వరస్వామి దేవాలయంలో నున్న 17వ శతాబ్ధినాటి మలిపూడి ఓబుళయ్య వేయిలింగాలను ప్రతిష్టించి, గుడిగట్టించి, తంగమళ్ల మాదశివులకు కొంత భూమిని కొనిపెట్టిన వివరాలున్న శాసనాన్ని చదివాను. ఇది నెల్లూరు జిల్లా శాసన సంపుటి 2లొ కనిగిరి (36) శాసనంగా ప్రకటించబడింది. తరువాత మా ప్రయాణం గంగదోనకొండ. దాన్ని దొనకొండ అనేవాళ్లని, గ్రామంలోని ప్రాచీన గంగమ్మ గుడివల్ల ఆవూరికి గంగదొనకొండ అని పేరొచ్చిందంటారు. రోడ్డుకు ఎడమవైపుగల గంగమ్మ దేవాలయంలో ఏదో ఎత్తాటి నిలువురాయి కనిపించింది. కారాపి దిగి లోనికెళ్ళి చూశాను. అది 12 అడుగుల ఎత్తు, 2 అడుగుల వెడల్పు, 9 అంగుళాల మందంతో ఉన్న ఇనుపయుగపు ఆనవాలు. దీన్నిబట్టి అక్కడొక సమాధి ఉండేదని, ఈ ఆలయం నిర్మాణంలో భాగంగా గుండ్రంగా అమర్చిన బండరాళ్లను తొలగించి ఉంటారనిపించింది. బయటికొచ్చిన తరువాత ఎదురుగా ఉన్న శివాలయంలో కెళ్లాం. ఎన్నో శిల్పాలు, ఎన్నో శాసనాలు! మహిషాసురమర్ధిని, నాగదేవతలు, గణపతి, భైరవుడు, సూర్యుడు వరుసగా పాతి ఉన్నాయి. ఇంతలో నా దృష్టి ఒక పల్నాడు రాతి స్థంభంపై పడింది. చేత్తో తడిమి చూస్తే అర్ధపద్మం కనిపించింది. రెండు వైపులా పలకలుగా చెక్కి ఉంది. ఖచ్చితంగా బౌద్దస్థంభం అని గంగదొనకొండ, శాతవాహన కాలంలో ఒక బౌద్ద స్థావరమనీ తేలింది. అక్కడే ఉన్న క్రీ.శ 1406 నాటి దేవరాయలు, క్రీ.శ. 1430 నాటి రెండో దేవరాయలు, క్రీ.శ 1477నాటి శాసనం, క్రీ.శ. 1525 నాటి శ్రీకృష్ణదేవరాయ శాసనాలను చూచి వాటిని భద్రంగా కాపాడమని ఆలయ అధికారులను బతిమిలాడాను. తరువాత బ్రిటీషువాళ్లు 1942 లో ఇక్కడ 1365 ఎకరాల్లో నిర్మించిన విశాలమైన విమానాశ్రయం ఆనాటి రన్‌వే 20 గదుల విశ్రాంతి మందిరం పక్మనే ఉన్న మిషనరీ పాఠశాల ఆనాటి వాస్తు శైలికి, కట్టడ నైపుణ్యానికి అద్ధంపడుతున్నాయి.

దాదాపు 2000సం॥ల నిరాటంక చరిత్ర గల, వేల ఎకరాల ప్రభుత్వ భూములున్న దొనకొండను రాష్ట్ర రాజధానిగా ప్రతిపాదించిన సంగతిని కూడ గుర్తుచేసుకున్నాను. ఇంకా చూడాల్సిన కల్లూరు, కురిచేడు, పొదిలి, కళ్లముందు ముసురుకున్నా సమయం సాయంత్రం 6.00 గం.లు కావటాన, ఎక్కడో అలవైకుంఠపురానికి ఆమడ దూరంలో ఉన్న విజయవాడ చేరుకోవాలి గాబట్టి దొనకొండ రైల్వే స్టేషను దగ్గర చూరునీళ్లలాంటి ఊదారంగు టీని ముచ్చటైన చిట్టిగాజుగ్గాసులో కావాలని పోయించుకొని, తాగిన తరువాత, తిరుగు ప్రయాణమైనాము. కరుణానిధి వంక జాలిగా చూచి, అంతదూరం రాలేమని ఒంగోలు-కంభం అడ్డరోడ్టులో దింపి వెళ్లేముందు వెనక్కి తిరిగి చూస్తే కరుణానిధి కళ్లలో సుళ్లు తిరుగుతున్న నీళ్లు అతని ఆప్యాయత, ఆదరణకు నికార్సయిన నిదర్శనాలనుకుంటూనే, బాధను భరిస్తూ ముందుకు సాగాం. ఈ ప్రాంత చరిత్ర శాసనాలపై చర్చోపచర్చలనడుమ మాకు తెలియకుండానే అద్దంకి రానే వచ్చింది. చంద్రమౌళి మాస్టారును దించి వెళదామంటే ఆయన మాకు 'సెంటల్లో పొట్టి శ్రీరాములుగారి విగ్రహం ఎదురుగా తన శిష్యుడు నడిపిస్తున్న ఆర్యవైశ్య భొజనశాలలో అన్నం తినిపించి మమ్మల్ని సాగనంపిన తీరు ఇంకా కళ్లముందు కదలాడుతూనే ఉంది. ఇలా కనిగిరి నుంచి దొనకొండ వరకూ ఇనుపయుగం నుంచి మధ్యయుగాల్లోని కాటమరాజు, విజయనగర రాజుల విక్రమ పరాక్రమాల్ని శిల్పాలు, శాసనాల్ని తలచుకుంటూ ఆ శిధిలాలను పదిలం చేయలేమా అన్న నాప్రశ్నకు సమాధానం వెతుక్కునేలోపు- ఇంటికి చేరుకొన్నాను. నిరాదరణకు గురై, నిర్లక్ష్యపు నీడలో చేరుతున్న శిల్పాలు, శాసనాల సంఖ్య పెరగడం పట్ల ఆందోళన పడుతున్న నాకు, తెలియకుండానే నిద్ర కమ్ముకొచ్చింది.