అమ్మనుడి/సంపుటి 6/ఫిబ్రవరి 2021/పడమటి గాలితోనివురు తొలగిన తెలుగు భాషా సాహిత్య సంపద

వికీసోర్స్ నుండి

ధారావాహిక

ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి 98481 23655


పడమటి గాలితోనివురు తొలగిన

తెలుగు భాషా సాహిత్య సంపద

మన పల్లెలు ఒకనాటి రోజులలో నీటికి, కూటికి కటకటలాడేవి. సరైన బాటలేదు. విద్యవైద్యం సున్నా. ఊరిలో ఎక్కడ బావి తవ్వినాఉప్పునీరే. అందుకే చెరువు మీద ఆధారపడేవారు. మహా అయితే ఊరికి దూరంగా ఎక్కడో మంచినీరు పడే బావి ఉండేది. బావుల్లో దిగుడు బావి, గిలకల బావి, చేద బావులు ఉండేవి. మంచినీటి బావుల తవ్వకానికి, నిర్మాణానికి ఎవరో దాత ముందుకు వస్తే ఒక చిన్న శిలాఫలకం బావికే అమర్చేవారు. ఏ గ్రామానికి సరయిన దారి డొంక లేకపోయినా దేవాలయం మాత్రం ఉండేది. అదీ చాలా ఎత్తుగా, దానికి ఆనుకునే ఒక చెరువు. ఆచెరువునీరే తాగునీటికి ఇతర అవసరాలకు ఉపయోగం. దేవాలయ నిర్మాణం. చెరువు తవ్వకం ఆవూరి జమిందారో, ఆప్రాంతపు రాజో, మోతుబరి రైతులో నిర్మిస్తే వారి పేర ఓ శిలాఫలకం ఉండేది. ఐతే ప్రతిగ్రామానికీ ఓ చరిత్ర దాని వెనుక ఓ గాధ. అన్నీ పరంపరీణంగా చెప్పుకోవడమే తప్ప ఎక్కడా గ్రంథస్థమైన దాఖలాలు లేవు. గ్రామ చరిత్ర, ప్రాంతీయ చరిత్ర లిఖించి భద్రపరచిన నాధుడే లేడు. ఆ పరిస్థితిలో ఓక ప్రాంతానికే పరిమితం కాకుండా దక్షిణ భారతదేశచరిత్ర, ప్రజల ఆచారాలు, పండుగలు, పంటలు, అలవాట్లు, జాతరలు, తిరునాళ్ళు మొదలయినవన్నీ గ్రంథస్థం చేసి భవితకు భద్రం చేసిన ఘనత కల్నల్‌ కాలిన్‌ మెకంజీ (Colonel Colin Mackenzie 1754-1821} కే దక్కుతుంది.

మెకంజీ జీవిత చారిత్రక కథనం: స్కాట్లాండ్‌కి పడమరగా లూయి ద్వీపంలో స్టోర్నవే గ్రామంలో బార్బరా, మర్షోన్‌ మెకంజీల రెండొ సంతానం కల్నల్‌ కాలిన్‌ మెకంజీ. మే 8వ తేదీ 1754లో జన్మించాడు. తండ్రి స్టోర్నవే గ్రామంలో తొలి పోస్ట్‌ మాస్టర్‌ గా పనిచేసేవాడు. అదే గ్రామంలో ఉన్న పాఠశాలలోనే మెకంజీ విద్యాభ్యాసం చేశాడు. అక్షరాభ్యాసం చేయించిన తొలిగురువు అలెగ్జాండర్‌ అండర్సన్‌ ఆవూరికే తొలి ఉపాధ్యాయుడు. బాల్యం నుంచి చదువుల్లో చురుకుగా ఉండేవాడు మెకంజీ. దానికితోడు పరిసరాల విజ్ఞానం, పరిసర ప్రాంతాల విషయ సేకరణ బాల్యంలోనే ప్రారంభించాడు. కేవలం కుతూహలం కొద్ది తన స్వంత లూయీస్‌


ద్వీపం నుంచి పరిసర ద్వీపాలకు వెళ్ళి ఆయా చరిత్రలు, ప్రాంతీయ గాధలు సేకరించేవాడు. లూయిస్‌ ద్వీపానికి ఆరోజుల్లో లార్డ్‌ ఫ్రాన్సిస్‌ రాజు. ఆ వంశీకులను నేపియర్‌ ప్రభువులని పిలిచేవాళ్లు. వీళ్ళకి మూల పురుషుడు జాన్‌ నేపియర్‌ (John Napaier-1550) ఈయన భౌతిక శాస్త్రం (Physics), గణిత శాస్త్రం, ఖగోళ శ్యాస్తాలలో పండితుడు. నేపియర్‌ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన లాగర్ధమ్స్‌ కనుగొన్న మేధావి. వీరి ఐదవ తరంలోని ఫ్రాన్సిస్‌ ప్రభువు తమ పూర్వీకుల చరిత్రను గ్రంథస్థం చేయాలని సంకల్పించాడు. దీనికి మెకంకీ సమర్ధుడని భావించాడు. అప్పటికే మెకంజీ స్టోర్నవే ప్రాంతానికి కంట్రోలర్‌ గా నిమితుడయ్యాడు. తన ఉద్యోగంతోపాటు నేపియర్‌ చరిత్రను వెలికి తీసేపని కూడా చేపట్టాడు మెకంజీ. బాల్యంలో పడిన పునాది భవితను భద్రం చేస్తుందన్నట్లు మెకంజీ జీవిత చక్రం చారిత్రక సత్యాన్వేషణకు దారి దీసింది.

ఫ్రాన్సిన్‌ ప్రేరణతో, మెకంజీ గణిత శాస్త్రంపై మక్కువ పెంచుకున్నాడు. ఇదే సమయంలో భారతీయ గణిత శాస్త్రం, హిందువుల సంఖ్యావాచకాల సంబంధం, దశాంకం మొదలయిన గణిత శాస్త్ర విషయాలు పరిశోధించే అవకాశం ఏర్పడింది.

లార్డ్‌ ఫ్రాన్సిస్‌ ప్రోత్సాహంతో మెకంజీ భారతదేశం పర్యటించే అవకాశం కలిగింది. దానికో కారణం కూడా ఉంది. ఫ్రాన్సీస్‌ ప్రభువు కూతురు హెస్తర్‌ (Hesther) భర్త శామ్యూల్‌ జాన్‌స్టన్‌ (Samuel Johnston) తమిళనాడులోని మధురలో ప్రభుత్వోద్యోగిగా పనిచేస్తున్నాడు. అందువల్ల మెకంజీ భారతదేశానికి వచ్చే అవకాశం సుగమం అయింది. దీనికి తోడు భారతదేశంలోని సైనిక శాఖలో సైనికోద్యోగి(cadet) గా ఒక ఖాళీ రావడం అది మెకంజీకి ఇవ్వడం చకచకా జరిగాయి. 1783 సెప్టెంబర్‌ 2న మెకంజీ భారత ఉద్యోగిగా అడుగు పెట్టాడు. అంతే మరణించేవరకూ తిరిగి తన మాతృదేశం చూడనేలేదు.

అప్పటికే ఫ్రాన్సిస్‌ కుమార్తె అయిన హెస్తర్‌ మధురలో తన ఇంటిని పండిత కేంద్రంగా రూపొందించింది. గణితశాస్త్రంలో ఉద్దండ పండితులయిన వారికి ఉద్యోగం యిచ్చి గణితశాస్త్రం పై భారతదేశ భాషల్లో ఉన్న గ్రంథాలన్నీ సేకరించింది. అందువల్ల మెకంజీ భారతదేశానికి ఉద్యోగిగా రావడం జాన్‌స్టోన్‌ దంపతుల ఇంట్లోనే అతిథిగా ఉండే అవకాశం ఏర్పడింది. పైగా భారతీయ పండితులలో చర్చలవల్ల దేశ చరిత్రను, ఆయా ప్రాంతాల చారిత్రక గాధలను తెలుసుకునే అవకాశం కలిగింది. మెకంజీకి పటాలంలో ఉద్యోగం. ప్రవృత్తిరీత్యా జాస్టన్‌ ఇంట్లో పండితులతో పరిచయం. ఆ పై లిఖిత ప్రతులపై చర్చ. ఈ నేపథ్యంలో లిఖిత ప్రతులు, ఆయా దేశీయ చరిత్రలపై ఒక సాధికారిక ప్రాజెక్ట్‌ నిర్వహించాలనే కోరిక కలిగింది. ఇది యిలా ఉండగా ఉద్యోగ రీత్యా మెకంజీ పటాలంతో కలిసి వేర్వేరు ప్రాంతాలకు వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడేది. దీనికి తోడు కుంఫిణీ వారు కొత్తగా స్వాధీనం చేసుకున్న ప్రాంతాలు సర్వే చేసి దానిపై ఒక నివేదిక తయారుచేసే బాధ్యతకూడా మెకంజీ పై పడింది. ఇది మంచి అవకాశంగా భావించి తన సత్తా నిరూపించుకున్నాడు. నెల్లూరు నుంచి ఒంగోలు, పదమటి కనుమలకు మార్గాలు సర్వే చేస్తున్న సమయంలో స్థానికులను కలిసి విషయ సేకరణ ప్రారంభించాడు. అక్కద చినబళ్ళ ఫకీరు చెప్పిన కంభం కైఫీయతు రాసుకున్నాడు. నెల్లూరు పే మాస్టర్‌ కచేరిలో ఉండే కాగితాలన్నీ చదివి హైదరు చరిత్రను సమకూర్చుకున్నాడు. గుంటూరు సర్మారును స్వాధీనం చేసుకున్నప్పుడు ఆ ప్రాంతాలన్నీ సర్వే చేసి సమగ్రంగా ఆ చరిత్రలను సేకరించాడు. ఇవన్నీ ఆ తన స్వంత ఖర్భ్బులతోనే కొనసాగించాడు. 1783లో దిండిగల్లు కోయంబత్తూరులలో సైన్య విభాగంలో ఇంజీనీరుగా పనిచేశాడు. ఆ తరువాత నుంచి 1790 వరకూ కంపెనీ వారి స్థానిక సుల్తానుతో జరిగిన యుద్దాలలోనే నెల్లూరు నుంచి తూర్పు కనుమల ద్వారా రాయలసీమ ప్రాంతాలకు, ఒంగోలుకూ రహదారి మార్దాలద్వారా నమూనాలతో దేశ పటాలాలను తయారు చేశాడు. మెకంజీ శక్తి సామర్థ్యాలను గుర్తించిన అధికారులు 1790లో గుంటూరు సీమను సర్వే చేయడానికి అనుమతి యిచ్చారు. మెకంజీకి ఈ సర్వే ఎంతో ఆనందాన్నిచ్చింది. ఐతే అది ఎంతోకాలం నిలవలేదు. 1792లో శ్రీరంగ పట్టణం కోట ముట్టడి సందర్భంలో టిప్పుసుల్తానుతో జరిగిన యుద్దంలో ఆనాటి రాజప్రతినిధి కారన్‌ వాలిస్‌ నేతృత్వంలో పనిచేయవలసి వచ్చింది. ఆ తర్వాత మెకంజీ ఏలూరుకు బదిలీ అయ్యాడు. రాయలసీమ, నెల్లూరు, గుంటూరు సీమలను సర్వే చేసి పట్టణాలు రహదార్లు నదులు చూపే నైసర్గిక పటాలను తయారు చేశాడు. దీనికి తోడు సూరు ప్రాంత పరిధిని నిర్గేశిస్తూ కొలతలు తీయించే పనికూడా చేపట్టాడు. ఈ కాలంలోనే త్రిభుజాలద్వారా సర్వే చేసే విధానం (Triangulation)తో పాటు topographical surey of Mysore నికూడా ప్రారంభించాడని Surey of India ol.IX Title Sheet లో స్పష్టంగా ఉంది. మొదటగా దక్కన్‌ ప్రాంతానికి సర్వే జరగటమే కాకుండా రాయలసీమ, నెల్లూరు, గుంటూరు నైసర్గిక పటాలు కూడా తయారు చేశాడు. పై అధికారులు మెకంజీ చేస్తున్న కృషిని గుర్తించి 1788 మే 16వ తేదిన ఇంజనీరింగ్‌ శాఖలో ద్వితీయ సహాయ అధికారిగా (Second Lieutenant) పదోన్నతి కలిగించారు. ఆపై 1789కే సేనాని(కల్నల్ )గా ఉద్యోగోన్నతి పొందాడు. ఆ తరువాత మద్రాసు, నెల్లూరు, గుంటూరులో పనిచేశాడు. ఈలోగా మైసూరు ముట్టడిలో నందిదుర్గం, సావంత దుర్గం ఆక్రమించడంలోనూ, శ్రీరంగ పట్టణం యుద్దంలో పాల్గొని తన ప్రావీణ్యం, శక్తియుక్తులన్నీ ప్రయోగించి గెలుపు గుర్రానెక్కాడు. దీనివల్ల పై అధికారుల మెప్పు, ప్రశంశ పొంది పై స్థాయికి ఎదిగే అవకాశం కలిగింది. ఇక్కడో విషయం ప్రస్తావించాలి. ఈ పర్యటనల్లో కూడా తన సేకరణ అయిన స్థానిక చరిత్రలు, ఆయా మార్దాల సర్వేలు, స్థానిక పటాలు తయారు చేయడం మాత్రం ఆపలేదు. కల్నల్‌ గా నియమితుడయాక మెకంజీ కడప, కర్నూలు జిల్లాల్లో పర్యటించాడు. కృష్ణానది పరిసర ప్రాంతాలు నల్లమల శ్రేణులు సర్వే చేశాడు. ఈకాలంలోనే అమరావతి శిల్పసంవదను గూర్చిన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ప్రస్తావించాడు. అమరావతి 17వ శతాబ్లాంతంలో మాగల్లు సీమలో రూపెత్తి జ్ఞాతుల రాజ్యాలయిన రాఘవపురం, చింతలపాడు జమీలు కలిసి విస్తరించిన వాసిరెడ్డివారి సంస్థానంలో వెయ్యిగ్రామాలుండేవి. ఆనాటి పేష్మషు (పన్ను ద్వారా వచ్చే ఆదాయం) ఏడు లక్షల పైచిలుకు. 1802లో వాసిరెడ్డి వెంకటాద్రి నాయని పేర మనోవర్తి ఉండేది. పేష్మషు బకాయికింద 1846-49లో కొనుగోలు చేయబడింది. ఆ పై వారికి భరణం కూడా యిచ్చారు.

వీరి మూలపురుషుడు సదాశివయ్య. ఈయన అసాధ్యమైన సాహస కార్యాలు చేసినందువల్ల రెడ్డి రాజుల మొప్పుపొంది వాసిగాంచి వాసిరెడ్డి అనే పౌరుష నామం ఏర్పడిందని ఆచార్వ తూమాటి దొణప్ప ఆంధ్ర సంస్థానములు సాహిత్య ఫోషణములో వివరించారు.

వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు తన భవన నిర్మాణానికి దీపాల దిన్నెఅనే దిబ్బను తవ్వించి నాపరాళ్ళనూ, బండరాళ్ళను ఉపయోగించాడు. ఆనాటి చెక్కడపురాళ్ళను పరిసరాల ప్రజలు పెరట్లో మెట్టుగాను, సరిహద్దు రాళ్ళుగా, బట్టలుతికే బండలుగా ఉపయోగించారు. ఆనాటి శిల్చ సంపదను గుర్తించిన మెకంజీ 1796లో అమరావతి శిల్ప సంపదను గుర్తించి దుర్వినియోగం కాకుండా భద్రపరిచాడు. అవి ప్రపంచ దేశాలకు తరలి వెళ్లాయి. మనకు అతి కొద్దిగా ఉన్నవి మ్యూజియంలో లభిస్తున్నాయి. ఆపై 1792 నుంచి 1799 వరకూ హైదరాబాదు ఇంజనీర్ల విభాగానికి అధిపతిగా నియమితుడయ్యాడు. ఈ కాలంలోనే నిజాము రాజ్యాల భూగోళ పట రచన ప్రారంభించాడు. ఈ సమయం లోనే ఖనిజాల గురించి, వజ్రాల గురించి వివరాలు సేకరించాడు. విలువైన గనులు ఎక్కడున్నాయో వాటి వివరాలు సమగ్రంగా తెలుసుకున్నాడు. ఎక్కడ ఏ వివరాలు సేకరించినా తనతోపాటు భారతీయ పండితులను స్థానిక పండితుల సహాయం స్వీకరించాడు. భారతదేశ చరిత్రకు కావలసిన సామాగ్రిని, దక్కను పీఠభూమి ప్రాంతాల్లో సేకరించవచ్చనే నిర్ణయానికి వచ్చాడు. ఖమ్మం కర్నూలు ప్రాంతాలు పర్యటించినప్పుడు తాను తయారు చేసుక్ను దినచర్య ఆధారంగా పెన్న కృష్ణ మధ్య ప్రాంతం, సరిహద్దులు, కనుమల సర్వే అని రాసుకున్నాడు. 1799లో శ్రీరంగ పట్టణం ముట్టడి జరిగి, టిప్పుసుల్తాన్‌ మరణించిన తర్వాత మైసూరు రాజ్యం నుంచి లభించిన ప్రాంతాల సర్వేలకు మెకంజీ అధికారికంగా నియమితుడయ్యాడు. 1809 నాటికి మద్రాసు రాజధాని సర్వేయర్‌ జనరల్‌గా నియమితుడయినప్పుడు దత్తమండల సర్వే నిర్వహించాడు. అనంతరం 1811లో జావా సాహస యాత్రలో చేరాడు. జావా ద్వీపం దండయాత్రలో అనుకోని సంఘటన ఒకటి జరిగింది. మెకంజీ అరవయ్యో సంవత్సరం జావాలో పెట్రోనెల్లాజోకి మీనా బారెల్స్‌ అనే డచ్‌ వనితను పెళ్ళి చేసుకున్నాడు. ఈమె సింహళ ద్వీపంలోని ట్రింకోమలిలో పుట్టింది. జావా దండయాత్ర అనంతరం భార్యతో భారత దేశానికి వచ్చాడు. 1815 నాటికి భారత దేశానికి సర్వేయర్‌ జనరల్‌ గా పదోన్నతి పొందాడు. అనంతరం 1817 నాటికి కలకత్తా చేరాడు. చివరికి 1821 మే 8న కలకత్తాలోనే 68వయేట తుది శ్వాస విడిచాడు. సౌత్‌ పార్క్‌ సిమెట్రీలో ఆయన సమాధి నేటికీ ఉంది. 1783 సెష్టెంబర్‌ 23న భారతదేశంలో అడుగు పెట్టిన తర్వాత తిరిగి తన మాతృదేశం వెళ్ళలేదు. జీవితమంతా భారతదేశానికే త్యాగం చేసిన మహాఘనుడు మెకంజీ. మెకంజీ సేకరించిన సంకలనాలు మెకంజీ సేకరించిన గ్రంధాలు, స్థానిక చరిత్రలు, శాసనాలు, నాణాలు, శిల్పాలు మొదలయిన అపురూప సంపదను సేకరించి భద్రపరిచాడు. ఆయన సేకరించిన వాటిల్లో 14 భాషల్లో 16 లిపులలో ఉన్న 1568 గ్రంథాలు, 264 సంపుటాల్లో ఎక్కించిన 2070 స్థానిక చరిత్రలు, 77 సంపుటాల్లో సంకలనం చేసిన 8076 శాసనాలు, 6218 ప్రాచీన నాణాలు, 2630 శిల్పాలు, కొన్ని చిత్రాలు, 106 విగ్రహాలు, 79 పురాతన భవన రూపాలు 40 పురాతన శిధిలావశేషాలు మొదలయిన వాటిని భద్రపరిచాడు. మెకంజీ రాసిన అతికొద్ది వ్యాసాలు మాత్రమే లభిస్తున్నాయి. వీటిల్లో శ్రీశైలంలోని ఆలయ విశేషాలు, అమరావతి స్తూప వివరాలు, దక్షిణ భారతదేశంలోని జైన, బౌద్ద స్థానాలు, ఆనెగొంది రాజుల చరిత్ర చెప్పుకోదగిన వాటిల్లో ఉన్నాయి.

మెకంజీ జీవించివున్న కాలంలోనే తన స్వగ్రామమైన స్టోర్షవే గ్రామంలో తన ఇల్లు పునర్నిర్మించడం కోసం కొంత డబ్బు పంపాడు. మెకంజీ చెల్లి మేరీ అన్నయ్య మరణానంతరం ఆయన విల్లు ద్వారా వచ్చిన డబ్బుతో “ఐ” అనే ప్రదేశం దగ్గరే ఉన్న సెయింట్‌ కొలంబా చర్చ్‌ సమీపంలో ఒకస్మారక భవనం కట్టించింది. అక్కడ కొన్ని అపురూపమైన శిల్పాలు, శాసనాలు స్టానిక చరిత్రలు భద్రం చేసింది. ఈ వివరాలన్నీ ఆరుద్ర స్వయంగా 1983లో చూసి వచ్చి ఛాయచిత్రాలు సమగ్రాంధ్ర సాహిత్యంలో ప్రచురించాడు.

మెకంజీ సంకలనాలు, సేకరణ, గ్రామ చరిత్రల తయారి మొదలయిన వివరాలు సేకరించిన తెలుగు పండితులు కావలి వెంకట బొర్రయ్య, కావలి లక్ష్మయ్య వివరాలు తరువాత సంచికలో.


17న పుట తరువాయి....... ఆంగ్ల విద్య

ఏ దృష్టితో చూసినా, ఏవైపు నుంచి చూసినా మన భావాలకు, భాషకు మన జీవితానికి మధ్య పరస్పర సమానత లేదన్న విషయం వాస్తవం. యీ మూడింటిని సంఘటితం చేయటానికి మనం నోచుకోలేదు. వెనకటికి ఒక కథలో ఒక బికారి వుండేవాడు. వాడు చలి కాలంలో బిచ్చమెత్తి వస్త్రాలు కొనుక్మోగలిగే సమయానికి ఎండాకాలం వచ్చేసేదట. అలాగే ఎండాకాలంలో పలచని వస్త్రాలు కొనుక్కునే తాహతు వచ్చేనరికి చలికాలం వచ్చేసేది. ఏదో దేవత వాడి దీనావస్థకు దయతలచి వరమివ్వబొతే అతడు ఈ విధంగా అడిగాడు: “నాకు మరేమీ అక్కర్లేదు. యీ తారుమారు అంతం చెయ్యి. ఎండల్లో చలి దుస్తులు, చలికాలంలో వేసవి దుస్తులు తొడుక్కుంటున్నాను. యీ గందరగోళం నుంచి తప్పించావంటే ధన్యుడిని.”

నేను కూడా భగవంతుడినీ యిదే ప్రార్థిస్తున్నాను. భాషకు, భావానికి మధ్య యీ విభేదం తొలగిపోతే మనం ధన్యులమవుతాం. మనకు చలిలో వేడిని కలిగించే దుస్తులు, వేసవిలో చల్లని దుస్తులు లభించటం లేదు. యిదే మన దరిద్రానికంతటికీ మూలకారణం. అందువల్లనే మనం నిరాదరణ అనే గోతిలో పడి కొట్టుకుంటున్నాం. లేకపోతే మనకు ఏవస్తువుకు లోటుంది? “అకలితోపాటు అన్నం, చలితోపాటు వస్త్రం, భాషతోపాటు భావం, విద్యతో పాటు జీవితం ఒకేచోట కలగచేయమని, ఒక దానితో ఒకటి కలపమని' భగవంతుడిని వరమడుగుతున్నాను.

నీటిలో వుండీ చేపకు దాహం తీరలేదు అన్నట్టు ఉంది మన పరిస్థితి. యిది విని ఎవ్వరికీ నవ్వు రాకుండా ఉండదు. మనవద్ద నీరు వుంది కానీ మనం దాహంతో కొట్టుకుంటున్నాం, యిది చూసి లోకం నవ్వుతోంది కానీ మన కళ్ళనుండి కన్నీళ్ళు కారుతున్నాయి. నీటి దగ్గర వుండీ నీటికి నోచుకోలేదు, అవి తాగి మన దాహం తీర్చుకోలేకపోతున్నాం. ———————————————————————————————————————————————————————————————————————————————————————————————————— “మంచి పుస్తకం” సంస్ధ ప్రచురించిన 'విద్య ' అనే పుస్తకంలో గల నాలుగు వ్యాసాలలో ఇది ఒకటి. నాలుగూ రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ రచనలే. విద్యకు సంబంధించి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ వెల్లడించిన అభిప్రాయాలు ఎంతో పాతవైనా, అప్పటికంటె ఇప్పుడవి మనకు మార్గదర్శకాలుగానే ఉన్నాయి. “ఇంగ్లీషులో భాషాబోధన ఉండాలా వద్దా అనే జటిలమైన ముడి” విప్పటానికి రవీంద్రనాథ్‌ టాగూర్‌ ఆలోచనలు ఒకింత తోడ్పడగలవన్న నమ్మకంతో దీన్ని ప్రచురించినట్లు ప్రచురణకర్త పేర్ళొన్నారు. ఈ వ్యాసాన్ని 'అమ్మనుడి'లో ప్రచురణకు అనుమతించినంధుకు వారికి ధన్యవాదాలు -సం.

త్వరలో పుస్తకంగా వెలువడుతుంది

14 నెలల పాటు అమ్మనుడి పత్రికలో ధారావాహికగా మీరు చదివిన నవల త్వరలో పుస్తకంగా వెలువడనుంది. కావలసినవారు అమ్మనుడి పత్రికను సంప్రదించండి. ఫోన్లు: 98480 16136, 94929 80244