అమ్మనుడి/సంపుటి 4/జూలై 2018/రాజకీయాధికారంతోనే 'మహిళా సాధికారికత'

వికీసోర్స్ నుండి

రాజకీయాధికారంతోనే 'మహిళా సాధికారికత'

పార్లమెంట్‌, అసెంబ్లీలలో మహిళలకు మూడోవంతు సీట్లు రిజర్వు చేయాలని ఉద్దేశించిన బిల్లు తయారయి దశాబ్దాలు గడచినా ఆమోదంకు నోచుకోవడం లేదు. పురుష ఆధిపత్యం గల రాజకీయ పార్టీలు ఈ బిల్‌ ఆమోదానికి అడ్డంకిగా ఉన్నాయని అనుకొన్నా తన కను సంకేతాలతో పదేళ్ళపాటు యుపియే ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలిగా శాసించిన, నడిపించిన సోనియా గాంధీ హయాంలో సహితం ఈ బిల్లు వెలుగు చూడలేక పోయింది.

“అన్ని రకాల సామాజిక ప్రగతికి రాజాకీయాధికారం కీలకం” అని రాజ్యాంగ నిర్మాత డా॥బి.ఆర్‌. అంబేద్కర్‌ ఎప్పుడో చెప్పారు. దేశ జనాభాలో సగం మంది వరకు ఉన్న మహిళలు అన్ని రంగాలలో క్రియాశీలకంగా పాల్గొన గలిగితేనే దేశాభివృద్ది సహితం విశేషంగా ఉంటుంది అనడంలో సందేశం లేదు. అందుకనే అభివృద్ధి పథకాలలో 'మహిళా సాధికారికత'కు విశేష ప్రాధాన్యత కల్పిస్తున్నాము. మహిళలకు కేవలం నామ మాత్రపు ప్రాధాన్యత కల్పించడమేకాదు వారికి నిర్ణయాలు తీసుకోగల సౌలభ్యం కూడా ఏర్పడటం అత్యవసరం.

తమకు అవకాశం కల్పిస్తే ఏ రంగంలో అయినా మగవారికి దీటుగా ప్రావీణ్యత చూపగలమని మగువలు అనేకమంది అనేక రంగాలలో నిరూపించుకొంటున్నారు. అయినా నేడు మహిళలు దాదాపు అన్ని రంగాలలో వివక్షతకు గురవుతున్నారు. మహిళలే కాదు ముక్కుపచ్చలారని బాలికలు సహితం లైంగిక వేధింపులకు, అత్యాచారాలకు గురవుతున్నారు. కుటుంబ నభ్యులు, బాగా తెలిసిన వారు, తమతో కలసి చదువు కొంటున్నవారు - పనిచేస్తున్నవారినుండే వారికి రక్షణ లేకుండా పోతున్నది.

ఇటువంటి ఆగడాలను అరికట్టడంకోసం నిర్భయ వంటి చట్టాలు తీసుకొచ్చిన ప్రయోజనం ఉండటం లేదు. కొందరు ఆవేశంగా ఇటువంటి నేరాలకు ఉరిశిక్ష విధించే అదుపు చేయవచ్చని అంటున్నారు. అయితే కేవలం చట్టాల ద్వారా మహిళలకు పూర్తి రక్షణ కల్పించలేము.

అంబేద్కర్‌ మాటల ఆంతర్యం గ్రహిస్తే రాజకీయాధికారంలో మహిళలకు తగు స్థానం కల్పిస్తేనే వారికి రక్షణ లభించడంగాని, వారి అభివృద్దికి అవసరమైన వాతావరణం ఏర్పడటంగాని సాధ్యం కాగలదని గమనించాలి. ఈ మధ్యనే స్పెయిన్‌ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పెడ్రో సంచేజ్‌ తన మంత్రివర్గంలో మొత్తం 17 మంది సభ్యులు ఉంటె, వారిలో 11 మంది మహిళలను నియమించడం ద్వారా ఆ దేశంలోనే చరిత్ర సృష్టించారు. నేడు ఐరోపాలోని అనేక దేశాలలో మంత్రివర్గాలలో మహిళలు గణనీయ సంఖ్యలో ఉంటున్నారు.

అయితే భారతదేశంలో అటువంటి పరిస్థితి ఏర్పడటం లేదు. మొదటి లోక్‌సభ లో 4.5 గా ఉన్న మహిళల ప్రాతినిధ్యం ఇప్పుడు 16వ లోక్‌సభలో 12 శాతంకు మాత్రమే చేరుకొంది. కేంద్రమంత్రివర్గంలో 22 శాతం వరకు వారి ప్రాతినిధ్యం ఉన్నా కొందరు కీలక శాఖలు నిర్వహిస్తున్నా వారేమాత్రం స్వతంత్ర్యంగా వ్యవహరిస్తున్నారో చెప్పడం కష్టం. విదేశాంగ మంత్రిగా సుష్మా స్వరాజ్‌ వీలు చిక్కినప్పుడల్లా తన ప్రతిభను ప్రదర్శించుకో గలిగారు. అయినా ఆమెను ఉత్సవ విగ్రహంగా మార్చి, ప్రధాన మంత్రి కార్యాలయంలోని వారే అంతా పెత్తనం చేయడాన్ని చూస్తున్నాము.

రాజీవ్‌ గాంధీ పంచాయతీ రాజ్‌ సంస్థలలో మహిళలకు మూడోవంతు రిజర్వేషన్‌ కల్పించడం ద్వారా స్థానిక సంస్థలలో ఒకవిధంగా పెను విప్లవం తీసుకు వచ్చారని చెప్పవచ్చు. వలు రాష్ట్రాలలో ఇప్పుడు స్థానిక సంస్థలలో సగం మేరకు సీట్లు మహిళలకు రిజర్వు చేసారు. ఎక్కడైతే మహిళలు రాజకీయంగా సాధికారికత సాధించగలరో అక్కడ పరిసరాలలోనే గణనీయ మార్పు సాధిస్తున్నట్లు పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.

పార్లమెంట్‌, అసెంబ్లీలలో మహిళలకు మూడోవంతు సీట్లు రిజర్వు చేయాలని ఉద్దేశించిన బిల్లు తయారయి దశాబ్దాలు గడచినా ఆమోదంకు నోచుకోవడం లేదు. పురుష ఆధిపత్యం గల రాజకీయ పార్టీలు ఈ బిల్‌ ఆమోదానికి అడ్డంకిగా ఉన్నాయని అనుకొన్నా తన కను సంకేతాలతో పదేళ్ళపాటు యుపియే ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలిగా శాసించిన, నడిపించిన సోనియా గాంధీ హయాంలో సహితం ఈ బిల్లు వెలుగు చూడలేక పోయింది.

మమత బెనెర్జీ, మాయావతి, వసుంధర రాజే వంటి రాజకీయంగా బలమైన పునాదిగల నాయకులు ఉన్నప్పటికీ మొత్తం మీద రాజకీయంగా మహిళలకు తగు ప్రాతినిధ్యం లభించడం లేదు. కీలక పదవులలో ఉన్న మహిళా నాయకులు సహితం తమ పరిధిలో మహిళలను ప్రోత్సహించే ప్రయత్నం చేయడం లేదు. ఇప్పుడు మహిళలకు లభిస్తున్న ప్రాతినిధ్యం సహితం ఎక్కువగా వారివారి కుటుంబ నేపథ్యం కారణంగా లభిస్తుండడంతో వారు ఏమేరకు స్వయం నిర్ణయాధికారం చెలాయించ గలుగుతున్నారు అన్నది ప్రశ్నార్ధకరమే. స్థానిక సంస్థలలో విశేషంగా. ప్రాతినిధ్యం లభిస్తున్నా ప్రతి ఐదేళ్ళకు ఒకసారి వారికోసం రిజర్వ్‌ చేసిన నియోజక వర్గాలను మారుస్తూ ఉండడంతో ఒకసారి ఎన్నికైన వారు తిరిగి తమ ప్రాతినిధ్యాన్ని నిలబెట్టుకోలేక బలమైన నాయకులు కాలేక పోతున్నారు.

బిజెపి వంటి పార్టీలు అంతర్గతంగా పార్టీ కార్యవర్గాలలో మూడొంతుల పదవులను మహిళలకు కేటాయిస్తున్నా చాలావరకు అలంకార ప్రాయంగానే ఉంటున్నాయి. వారికి పార్టీ అంతర్గత వ్యవహారాలలో నిర్ణయాధికారం మాత్రం చెప్పుకోదగిన స్థితిలో ఉండటం లేదు. కీలకమైన పార్టీ పార్లమెంటరీ బోర్డు, రాష్ట్ర శాఖల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, శాసనసభ నాయకత్వం... వంటి వాటిల్లో వారికి తగిన ప్రాతినిధ్యం లభించడం లేదు. కాంగ్రెస్‌కు సుదీర్ఘకాలం సోనియాగాంధీ అధ్యక్షురాలిగా వ్యవహరించగా, తృణమూల్‌ కాంగ్రెస్‌కు మమత బెనర్జీ, బిఎస్పికి మాయావతి అధ్యక్షులుగా ఉంటున్నారు. మరే ఇతర పార్టీకి మహిళలు అధ్యక్ష పదవికి చేరుకొనే అవకాశాలు ఇప్పట్లో కనిపించడం లేదు.

మహిళలు రాజకీయ అధికారంకు చేరుకోగలిగితే దాని ప్రభావం సామాజిక అభివృద్ధిపై, ఆర్ధిక సాధికారికత చేరుకోవడంపై విశేషంగా ఉంటుందని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు. మహిళలు రాజకీయ ప్రాతినిధ్యం పొందేచోట నేరాలు సహితం తగ్గుముఖం పడుతున్నట్లు 2012లో భారత్‌లో జరిపిన ఒక అధ్యయనం వెల్లడించింది. బలహీన వర్గాలకు భరోసా ఏర్పడి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో నేరాలు జరిగితే ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి దోహద పడుతుంది. దానితో పోలీసులు సహితం తగు చర్యలు తీసుకొనక తప్పదు.

2002లో రాజస్తాన్‌, పశ్చిమ బెంగాల్‌లలో జరిపిన ఒక అధ్యయనంలో ఏ గ్రామాలలో అయితే మహిళలు సర్బంచ్‌గా ఎనికవుతారో అక్కడ సామాజిక అవసరాలపై పెడుతున్న ఖర్చు గణనీయంగా పెరిగినట్లు కనుగొన్నారు. త్రాగునీరు, రహదారులు, పాఠశాలలు వంటివాటికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. పెరుగుతున్న మహిళల రాజకీయ ప్రాతినిధ్యానికి వారిలో పరిశ్రమల అభివృద్ధిపట్ల పెరుగుతున్న ఆసక్తికి ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు 2014లో మరో అధ్యయనం స్పష్టం చేసింది. 1994 - 2005ల మధ్య కాలానికి జరిపిన ఈ అధ్యయనంలో మహిళలు ప్రారంభించే వ్యాపారాలు, కంపెనీలు, మహిళలు ఉద్యోగాలు చేయడం విశేషంగా పెరిగినట్లు కనుగొన్నారు.

రాజకీయ ప్రాతినిధ్యం విషయంలో మహిళలు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య ఏమిటంటే వారికి తగువిధంగా నాయకత్వ శిక్షణ లభించడం లేదు. తమిళనాడులోని 144 గ్రామాలో జరిపిన ఒక అధ్యయనంలో పంచాయతీలకు ఎన్నికైన మహిళల కన్నా మగవారికి తమ విధులుపట్ల ఎక్కువ అవగాహన ఉంటున్నది. గ్రామీణ ఉపాధి పథకం వంటి ప్రాముఖ్యత కలిగిన పథకాల అమలుపట్ల మహిళలు సర్బంచ్‌లుగా ఉన్నచోట్ల తగు ఉత్సాహం చూపడం లేదని ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని శివారు గ్రామాలలో జరిపిన పరిశీలన వెల్లడి చేసింది.

స్థానిక సంస్థలకు ఎన్నికయ్యే మహిళా ప్రజా ప్రతినిధులకు ప్రత్యేకంగా పరిపాలన వ్యవహారాలలో, రాజకీయ వ్యవహారాలలో శిక్షణ సదుపాయాలు కల్పించడం నేడు అత్యవసరం. అందుకోసం శాశ్వత ప్రాతిపదికపై ఒక శిక్షణ సంస్థను కూడా ఏర్పరచాలి.

పలుచోట్ల మహిళలు ఎన్నికైనా వారిని ఉత్సవ విగ్రహాలుగా మార్చి, అసలు అధికారాన్ని వారి భర్తలో, కుమారులో చెలాయిస్తూ ఉండటం జరుగుతున్నది. మహిళల అధ్యక్షతన జరిగే పంచాయత్‌, మండల సమావేశాలలో సహితం వారు పాల్లొనే వారి తరపున అన్ని నిర్ణయాలను వారే తీసుకోవడం పలుచోట్ల జరుగుతున్నది. అంతమాత్రంచేత రాజకీయ నాయకత్వానికి మహిళలు సమర్ధులు కారని వారిని కొట్టిపారవేయలేము. మొదట్లో కొంతకాలంవారు భర్తల చాటున, కొడుకుల చాటున వ్యవహరించినా క్రమంగా రాజకీయ మెలకువలకు గ్రహించి రాజకీయంగా రాణించే అవకాశం లేకపోలేదు.


...41వ పుట తరువాయి

భర్త గోత్రం లోనికి. అంటే ఆ క్షణంలోనే ఆమె వరుని కుటుంబంలో చేరిపోయింది. ప నిజానికి మనం దేనిని పెళ్లి అంటున్నామో (వ్యవహారంలో) అది జరిగిపోయింది. తరువాత పందిట్లో జరుగుతోంది, అలా జరిగిపోయిన దానిని, విస్తృతమైన పరిధిలో అందరికి తెలియజేయడం, వేడుకగా నిర్వహించడం. దానికి మరింత పరివ్యాప్తత ఊరేగింపులో ఉంది. మాంగల్యధారణ, సప్తపది - ఇవన్నీ దానికి మరింత ప్రమాణీకరణాన్ని మందిలో అనుసంధించడం. నిజానికి కొన్ని సందర్భాల్లో పై కార్యక్రమానికి, అనంతరం బంధుమిత్రుల సమక్షంలో జరిగే తంతుకు మధ్య, వరుడు గతించిన సందర్భాల్లో అతనికి ఉద్దిష్టమైన వధువు వైధవ్యాన్ని పాటించిన సంఘటనలున్నాయి. ఇది అభిలషణీయమా అనేది కాదు ఇక్కడి ప్రశ్న గోత్ర చ్చేదనానికి ఎంత ప్రాముఖ్యత వుందో, మన పూర్వులు దానిని ఎలా పరిగణించారో తెలియజెప్పడం మాత్రం వరకే దీని ప్రసక్తి.

కనుక, మార్పు జరుగుతోందనే దానికి (ఇంటి పేరుకు) స్థితి లేదని, మారుతోంది గోత్రమని, తత్ఫలితంగా స్త్రీకి కుటుంబనామం స్థిరపడుతోందని తెలుస్తుంది. దంపతులు, వారి సంతతి - ఇదీ కుటుంబం. సమమైన గుర్తింపు కొరకు వివక్షింపబడడం తప్పదు. వివాహం తరువాత కూడ స్త్రీ తండ్రి ఇంటి పేరుతో కొనసాగితే - అది ఆమె ఇష్టమనిపిస్తుంది. కాని కుటుంబమనే విషయంగా, ఆ మార్పు, ఆమె సోదరులకు కూడా అయిష్టం కలిగింపవచ్చు. అందులో కొన్ని న్యాయపరమైన చిక్కులుండే అవకాశం కూడా వుంది.

అన్నింటికంటే ప్రధానమైనది, స్త్రీకి తనదైన కుటుంబం అవసరమా కాదా అనేది. ఆమె కుటుంబిని. ఆమె వల్లనే కుటుంబమనే దానికి అస్థిత్వముంది. ఆమెయే గృహనీతి విద్యకు గృహము. విమలచారిత్ర శిక్షకు ఆమెయే ఆచార్య. ఆమెయే అన్వయస్థితికి మూలము. ఇదీ గృహిణి విషయమై మహాభారత ప్రతిపాదనము. తొందరపాటు, ఏమరపాటు లేక, విజ్ఞులు ఆలోచింతురుగాక! ఫలితార్థము వివాహం తరువాత స్త్రీ ఇంటి పేరు మారడం లేదు. స్థిరీకరింపబడుతోంది.


కీ.శే. యార్లగడ్డ బాలగంగాధరరావు - ప్రఖ్యాత తెలుగు ఆచార్యులు. పరిశోధకులు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా అనేకమంది శిష్యులకు మార్గదర్శనం చేసినవారు. రచయిత. ఈ వ్యాసంలో పేర్కొన్న అంశాలపై 'నడుస్తున్న చరిత్ర' (ఈ పత్రిక 'అమ్మనుడి' కి తొలిపేరు)లో 2001లో కొంత చర్చ జరిగింది. తర్వాత 'నామ విజ్ఞానం' పేరుతో 2002లో, 2015లో వెలువడిన పుస్తకంలో - వెలువడిన ఈ వ్యాసంలో ఆ ప్రస్తావన ఉంది. సమాజానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వ్యాసాన్ని ఇక్కడ పునర్ముద్రిస్తున్నాము.

బాలగంగాధరరావుగారికి స్మృత్యంజలి ఘటిస్తూ - సంపాదకుడు