అబలా సచ్చరిత్ర రత్నమాల/విమలదేవి

వికీసోర్స్ నుండి

విమలదేవి

(అచ్చతెనుగు)

ఈమె మార్వాడలోని రూపనగరమునకు రేడుగానుండిన అమరసింగుని కూతురు. అప్పుడు డీల్లీలోనుండిన రారాజుపేరు ఔరంగజేబు. రజపూతదొరలు కొందరు ఔరంగజేబునకు జడిసి తమబిడ్డల నతనికిచ్చి యతని కనికరమునకు దగినవారయిరి. విమలదేవి తండ్రియు దన బెద్దకూతు నౌరంగజేబున కిచ్చి పెండ్లిచేసెను. రాచకన్నియల నిట్లు తురకల కిచ్చుటకు విమలదేవి యిచ్చ మెచ్చక, తన యుసురులు వోయినను తురకను పెండ్లాడననియు దల్లిదండ్రులు తనకు మంచి రాచకొమరుని వెదకి కూర్చనియెడల దనపాయమంతయు గన్నియగనే గడిపెదననియు దలచెను. ఇట్లుండ నౌరంగజేబున కిల్లాలగు కేసరిబాయను విమలయొక్క యక్క పుట్టి నింటికి వచ్చెను. అప్పుడు విమలదేవి తల్లియగు కౌమారదేవి మొదలయిన వారందరామె రారాజునకునింతి యగుట వలన నామెను మిగుల గారవించిరి. కాని విమలదేవి మాత్ర మామె మొగమును జూడక యేకతమున నుండి ముక్కంటిని గొలుచుచుండెను. అప్పుడచటికి కేసరిబాయి చెలియలిని జూడ వచ్చి యామె గొలుచు బూచుల దొరను దూరసాగెను. అప్పుడు విమలదేవి మిగుల కోపగించి తోబుట్టువునుజూచి "యచ్చపు రాచకులంబున బుట్టి మిగుల పనికిమాలిన కులము వాని జేపట్టిన నిన్నుజూచిన దోసమువచ్చును. నేను నా యుసురులు బొంది విడిచిపోయినను తురకల చెట్టబట్టక మేటి మగండగు రజపూత పుడమిఱేని బెండ్లియాడెదననియు బ్రతిన బట్టెను. అందుకామె యక్క నిన్ను దురకల కిప్పించికుండిన నేను ఔరంగజేబున కింతినేకాను" అని డిల్లీకరిగి తన మగని కా కత యంతయు జెప్పి యతనిచే విమల నిమ్మని తన తల్లిదండ్రులకు జాబు వ్రాయించెను.

విమలదేవియు దాజేసిన ప్రతిన తల్లిదండ్రులకు జెప్పగా వారు మెచ్చి యామెను గొనియాడిరి. కాని ఔరంగజేబు వద్దనుండి వచ్చిన జాబును చూచుకొనినపిదప వారు మిగుల వెరచి విమల నతని కియ్యదలచిరి. దీనింగని విమల మిక్కిలి నొగిలి సిసోదియా రాచకులంబున బుట్టిన రాజసింహుడు నాబరగు రాచకొమరుని బీరమ్ము నదివరకు వినియున్నది గాన నతనికొక జాబువ్రాసి తమ యొజ్జలచేత నతనికి బంపెనా ఆ జాబులో నామె 'ఆడయంచ కాకికి నాతియగుట దగును.? దోసమెరుగని దొరకులంబున బుట్టిన కన్నియ కోతిమూతి వాడును బోడితలవాడును నైన తురక గూడుట యింపగునా? వెన్నుడు రుక్మిణిం దీసికొనిపోయినటుల నన్ను గొనిపొండు. మీ రొక వేళ నన్ను గాపాడకుండిన నేను నా మేనుం జాలించెదను. ఇది నిజము' అని వ్రాసెను. ఈజాబుంగొని చనిన పుడమివేల్పు విమలయొక్క మంచి గొనముల నా రాచ సింగంబునకు జెప్పగా నతడు తురకలపై కరంబలిగి గొప్ప దండుతో రూపనగరమునకు బయలుదేరెను. ఈలోపల బెండ్లిమూర్తము దగ్గర వచ్చినందున నౌరంగజేబు పెండ్లికొమారు డగుటకై రారాజుకుందగినడంబముతోగూడి రూపనగరమునకు బయలుదేరెను. ఔరంగజేబు రాకడ విని విమలదేవి డెందమున మిగులగుంది చచ్చుటకు నుంకించునంతలో రాజసింహుడు వచ్చి యామెను చేపట్టి మరల తన సీమకు దీసికొనిపోవ దొడగె. ఇట్లు పోవుచు నొకప్పుడు గొన్ని కొండల నడుమకు వచ్చిరి. అప్పు డచట వారు కొంతసేపు డప్పి దీర్చుకొనుటకై కూర్చుండిరి. అచ్చటికి గొంచెము దవ్వుననే ఔరంగజేబు తన మూకలతో విడిసియుండెను. అప్పు డౌరంగజేబు నాతియు విమలదేవి యక్కయు నగు కేసరిబాను ఒక చెంచువా డెట్టులనో పట్టుకొని తెచ్చి వీరు దిగిన కొండత్రావునందొక పొదచాటున నుంచెను. అప్పుడామె "నన్నెవరయిన గాపాడు"డని యా కారడవిలో మొరపెట్టగా విని విమల తన మగని నంపగా నా రాచపట్టి యా చెంచువాని చేతినుండి కేసరిబాను విడిపించి తన యింటియొద్దికి దీసికొని వచ్చెను. కేసరిబా చెల్లెలి మొగముచూడ సిగ్గుపడి యామె తనకు జేసిన సాయమునకు గరంబు సంతసించి తాను విమలకు జేసిన యెగ్గునకు దన్ను మన్నింపుమని చెలియలిని వేడుకొనియెను. అప్పుడు విమలదేవి తన యక్కను వెరవవలదని చెప్పి కొందరు బంటుల వెంటనిచ్చి యామెను ఔరంగజేబువద్ద కంపెను. కేసరిబా చెప్పగా ఔరంగజేబు జరిగినకత యంతయు విని రజసింహునిపై గల పగమాని డిల్లీకిబోయెను. రాజసింహుడును నెలతతో ఉదోపురమున కరిగి సుకంబుండె.


_______