అబలా సచ్చరిత్ర రత్నమాల/లీలావతి
లీలావతి
ఉ. వింతగ వాదమేల యవివేకుల పోలిక? స్త్రీలవిద్య సి
ద్ధాంతమె చేసివారు మన తజ్ఞులు పూర్వులు - (వీరేశలింగకవి)
గణితశాస్త్ర పండితుడని ప్రసిద్ధి గాంచిన భాస్కరాచార్యుల కొక కూతురుండెను. ఆమె పేరు లీలావతి. సిద్ధాంత శిరోమణియందు భాస్కరాచార్యులవారు తానా గ్రంథము 1072 వ శాలివాహన శకసంవత్సరమునందు రచియించితినని వ్రాసినందున లీలావతి 12 వ శతాబ్దమున నుండినట్టు తేలుచున్నది. లీలావతి బాలవితంతు వైనందున నామె భర్తృవంశ మేదియో తెలియదు. మన దేశమునందు జరిత్రములు వ్రాసియుంచు పద్ధతి పూర్వమునుండి లేనందున గణితశాస్త్రమునం దసమానపండితయైన లీలావతిని గురించి కొన్ని సంభవాసంభవములగు కథలు దప్ప చరిత్రమున కితర సాధనంబు లేవియు లేనందున నా దంతకథలే యిచ్చట వ్రాసెదను. భాస్కరాచార్యులవారు జ్యోతిషమునందు మిగుల ప్రవీణులు. కాన లీలావతికి వైధవ్యము ప్రాప్తించునని జాతకమువలన దెలిసికొనెనట. అందువలన భాస్కరాచార్యులు పూర్ణాయువుగల వరుని వెదకి తెచ్చి, యొక మంచి ముహూర్తమునందు లీలావతికి వివాహము చేయ నిశ్చయించిరి. వివాహమునకు బూర్వము చేయవలసిన విధులజరిపి, కన్యావరులను మండపమునందు గూర్చుండ బెట్టెను. ముహూర్తము తెలియుటకై నీటిలో ఘటికాయంత్రము (సన్న చిల్లిగల గిన్నె) నొక దాని నునిచి, పురోహితసమే తుడయి ముహూర్తము నెదురుచూచుచుండెను. అంత గొంత సేపటికి లీలావతి యా గిన్నెలోనికి నీరువచ్చు విధము చూడగోరి కొంచెముజరిగి చూచుచుండెను. అట్లు చూచునపు డామె శిరోభూషణము నందుండిన యొక సన్ననిముత్య మా గిన్నెలోబడి నీరువచ్చుమార్గము నరికట్టెను. ముత్యము పడిన సంగతి యెవరును చూచినవారు. కారు. ఎంతసేపు చూచినను గిన్నె మునుగకుండుట గని, దాని కారణము నెరిగి ఆచార్యులవారు హతాశులై యేదో యొక ముహూర్తమునందు లీలావతి వివాహము గావించిరి.
వివాహానంతరము స్వల్పకాలములోనే లీలావతికి వైధవ్యము ప్రాప్తించెను. కూతున కిట్టి దురవస్థ సంభవించినందున దండ్రి మిగుల బరితపించెను. కాని యాయన యంతటితో దనకొమార్తెజన్మము నిరర్థకమని తలపడయ్యెను. లీలావతికి సంసార సౌఖ్యము లేక పోయినను ఆచార్యుల వా రామెకు విద్యానంద మొసంగ దలచిరి. లీలావతి యదివరకే విద్యావతి యగుట వలన నామెకు దండ్రి గణితశాస్త్రమును నేర్పసాగెను. లీలావతియు విద్యాభిరుచిగలదై, తన దు:ఖమును మరచి సదా గణితాభ్యాసమే చేయుచుండెను. కొన్నిరోజుల కామెకు గణిత శాస్త్రమునం దపార పాండిత్యము గలిగెను. ఈమె తన గణిత ప్రావీణ్యముచేత గణించి, యరగంటలో వృక్షమునకు గల యాకులసంఖ్య చెప్పుచుండెనని యొక లోకవార్తగలదు. ఈ లోకవార్త యెంతమాత్రమును నమ్మదగినది గాకపోయినను, లీలావతికి గణితశాస్త్రమునందుగల యసామాన్యప్రజ్ఞను చూచి లోకులీ వార్త పుట్టించి రనుటకు సందేహము లేదు. ఆమెకు గణితము చెప్పు నెడ వేసిన ప్రశ్నలును, వాని యుత్తరములును నొకటిగా జేసి భాస్కరాచార్యులు లీలావతి గణిత మనుపేర బ్రసిద్ధిజేసెనని యందురు. ఈ సంగతి లీలావతి గణితములోని "బాలే బాలకురంగలోలనయనే లీలావతీ ప్రోచ్యతాం" "అయే బాలే లీలావతి మతి మతిబ్రూహి" (లీలావతి యను బాల యీ లెక్కను చెప్పుము అని అర్థము.) అనిన వాక్యమువలన నీ సంగతి నిజమేయయి యుండవచ్చునని తోచుచున్నది. లీలావతి గణితము వలననే, బాలవితంతువయిన లీలావతియొక్క కీర్తి సకల దేశములయందును నిండియున్నది. లీలావతిగణితము ఫారసీ, ఇంగ్లీషు మొదలయిన పరభాషల యందుగూడ భాషాంతరీకరింపబడినది. లీలావతి గణితములోని లెక్కలన్నియు జేయుటకు బురుషులకే మహా ప్రయాసముగా నుండును. కాన నిట్టి కఠినపు లెక్కలను నేర్చిన స్త్రీయొక్క బుద్ధికుశలత యెంత యుండవలయునో చదువరులే యూహింప గలరు.
ఈ లీలావతిచరితమువలన బూర్వకాలమున ఈ దేశము నందు స్త్రీవిద్య సర్వసాధారణమయి యుండెనని తెలియు చున్నది.
- _______