అబలా సచ్చరిత్ర రత్నమాల/తారాబాయి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

తారాబాయి

క. విదలింప నురుకు సింగపు
   గొదమయు మదమలినగండ కుంజరములపై;
   నిది బలశాలికి నైజము
   గద, తేజోనిధికి వయసు కారణమగునే?

ఈమె క్షత్రియ వంశమునం దుద్భవించి, తన యందలి యనేక సద్గుణములకు దోడు శౌర్యమును సహితము ధరియించి మిక్కిలి వన్నె కెక్కెను. ఈమెకాలము గనుగొనుటకు బ్రస్తుత మేమియు సాధనము లగుపడనందున విధిలేక యా ప్రయత్నమును మాని, యామె పవిత్రచరిత్ర మిందుదాహరించెదను.

పూర్వము మ్లేచ్ఛరాజుల కాలమునందు మన దేశము నందలి సంస్థానికులును, రాజులును మిగుల కష్టదశ యందుండిరి. తురకలు చేయు నన్యాయమున కోర్వజాలక ప్రజలును మిగుల హీనస్థితియందు బాధ పడుచుండిరి. అట్టి సమయము నందు రాజపుతానాలో వేదనగరమను చిన్న సంస్థానమొకటి యుండెను. సూరనాథాన్‌రావను నాయన అచటి ప్రభువుగా నుండెను. ఈయన పూర్వము మహాబల శౌర్యములు కలిగి శత్రువుల నోడించినవాడయినను పిదప మిగుల వృద్ధుడగుటవలన వైరివీరుల నెదుర్చుటకు శక్తుడుగాకుండెను. ఇట్లుండ దిల్లాయను తురుష్కు డొక డాయనపై దండెత్తివచ్చెను. ఆ మ్లేచ్ఛునితోడ బోరుటకు శక్తిలేక యా రాజు రాజ్యమును వానికి విడిచి తన ముద్దుల కూతురగు తారాబాయిని దోడ్కొని తక్షశిలా లేక తకపూరను స్థలమున కరిగి యచట వాసము చేయుచుండెను. ఆయనకీ కొమార్తె తప్ప మరి సంతానముకాని, దగ్గర ఆప్తులు కాని లేకుండిరి. ఈ కన్యకు భాల్యదశయందే మాతృవియోగము సంభవించెను. కాన తండ్రి యామెను ప్రాణపదముగా బెంచుచుండెను. అచట సూరథాన్‌రాయులు కన్యా సహితముగానుండుట విని, యాతని పగతుడగు నా మ్లేచ్ఛు డాతని నటనుండియు బారదోలెను. కాన నతి ప్రియమయిన ఆథోదా పట్టణమును విడిచి యతడు అబూయను పర్వతాగ్రమున వసియింపవలసినవాడాయెను. ఆ సమయమునందు ప్రతి రాజునకు దన రాజ్యము రక్షించుకొనుట యత్యావశ్యకమై యున్నందున సూరథాన్‌రాయు లడిగినను రాజు లెవ్వరును అతనికి దోడు పడరయిరి.

సూరథాన్‌రాయుల కీ కన్య దప్ప పుత్రులు లేనందున నా కన్యచేతనే తన పగతీర్పింప నెంచి యాతడా చిన్నదానికి బుత్రునికిం బోలె యుద్ధవిద్య నేర్పుచుండెను. ఆ కన్యయు నా పర్వత ప్రాంతమునందు దండ్రితోడ నుండి యాతనికి సేవ చేయుచు నాతడు నేర్పిన రణవిద్య శ్రద్ధతో నేర్చుకొనుచుండెను. తారాబాయికి గొంచెముజ్ఞానము తెలిసినప్పటి నుండియు దండ్రి తనకు శస్త్రవిద్యను నేర్పుటకు గారణ మామె తెలిసి కొని యామె యధికోత్సాహముతో శస్త్రాస్త్రవిద్య నభ్యసించి యందు బ్రవీణయయ్యెను. బాల్యదశనుండియు యుద్ధవిద్య నేర్చుకొనుటవలన నామె శరీరము మిగుల దృడమైనదియు, జపలతగలదియు నయ్యెను. అరణ్యవాసమును, తండ్రి యుపదేశమును విన, దేహమువలెనే యామె మనసుగూడ మిగుల కఠినమై వజ్రసమమై యుండెను. ఆ బాల శుక్లపక్ష చంద్రుని పగిది నభివృద్ధినొందిన కొలదిని తండ్రికి గలిగిన యవమానమున కెంతయు గుందుచు, నతని కట్టి యవమానము గలుగజేసినవాని జంపి పగ తీర్చుకొనుటకు సమయమునెదురు చూచుచుండెను. ఆమె విద్యయందును, శౌర్యమునందును నేప్రకార మసమానురాలో, రూపమునందును అటులే యనుపమేయమై యుండెను. తారాబాయి వివాహయోగ్య కాగా నామె సౌందర్యఖ్యాతి విని యామెను వరించుటకు రాజపుత్రులనేకులు వర్తమానము లంపసాగిరి. ప్రథమమునందు మేవాడ రాజపుత్రుడగు జయమల్లుడు తన కామె నిమ్మని కోరెను. కాని తండ్రి పగవాని నడపక వివాహ మాడనని తారాబాయి నిశ్చయించుకొనినందున నా రాజపుత్రునకు "ఎవడు నా జనకుని పగతుని జంపునో, వాడే నాభర్తయగుట కర్హుడు" అని యామె వర్తమాన మంపెను.

సూరథాన్‌రాయులు మేవాడ రాణాగారి మాండలికుడగుటచే నాతడు (మేవాడరాజు) తన కొమార్తె నడుగుట సన్మానప్రదముగనే సూరథానునకు తోచెను. కాని కూతురి ప్రతిజ్ఞ నెరవేర్చినయెడల నామె నతనికి నియ్యవలయునని అతనికి నుండెను. జయమల్లుడు శౌర్యహీనుడును, గర్విష్టుడు నైనందున పంత మీడేరుటకు బూర్వమే వివాహము కావలయునని కోరెను. కాని యందు కా పితాపుత్రిక లిరువురును సమ్మతింపకుండిరి. బలిష్టుడగు తురుష్కునిం బొడిచి గెలిచినంగాని తన కక్కన్యారత్నము దొరకదని తెలిసికొని యా రాజపుత్రు డాశారహితుడై యా వీరబాల నిట్లని నిందింప దొడగెను. "నీ తండ్రివలెనే నీవును దరిద్రలక్షణురాలవు. నేడు నావంటి గొప్ప రాజపుత్రుని దిరస్కరించితివి. కాన నీ యింటనుండు నొక హీనసేవకుని కంటె నన్యులు నిన్నెవరు వరింపజాలరని నమ్ముము." సూరథాన్‌రాయు లంతటి స్వాభిమాని కిట్టి నీచవాక్యములు విని యూరకుండ మనసెట్లొప్పును? తత్‌క్షణమే యాతడు చేతి ఖడ్గముతో నా రాజపుత్రుని జంపెను. ఈ వర్తమాన మాతని తండ్రియగు రాయమల్లునకు దెలియగా నాతడెంతమాత్రమును చింతింపక "మా నిర్మలమై వంశమును జెరపనున్న యా దుష్టునికి దగిన శిక్ష గలిగె"నని నుడివెను. అట్లు దుష్టుని శిక్షించినందునకై సూరథాన్‌రాయులను మిగుల బొగడెను.

రాయమల్లునకు పృథివీరాజను మరియొక కుమారుడుండెను. తండ్రి యా పుత్రుని నేలనో ద్వేషించి పూర్వము విడనాడెను. కాని పెద్దకుమారుడీ ప్రకార మడుగంటిన పిదప పృథివీరాజును రప్పించి యువరాజును గావించెను. పృథివీరాజు మిగుల సద్గుణవంతుడును న్యాయప్రియుడును నైనందువలన ప్రజలాతని రాకకు మిగుల సంతసించిరి. పృథివీరాజు రాజ్యపదవి నొందిన పిదప తారాబాయి సద్గుణములును రూపలావణ్యాదులును విని తన శౌర్యము గనపరచి యామెను వివాహమాడ నిశ్చయించి సూరథాన్ రాయుల శత్రునిపై దండెత్తిపోవ నిశ్చయించెను. ఆవార్త విని తారాబాయి మిగుల సంతోషముతో దానును నాతనితో యుద్ధయాత్రకు వెడలెను. పృథివీరాజు ఏడెనిమిదివేల క్రొత్తసైన్యమును సిద్ధపరచి అఫగణ దేశస్తులను గెలుచుటకై థోదానగరముపైకి దండు వెడలెను. ఆసమయమునందు దారాబాయి పురుషవేష ధారిణియై గుర్రమునెక్కి ప్రత్యక్ష మహిషాసురమర్దని యన నా యవనుని నంత మొందింప బ్రయాణమయ్యెను!

వీరందరు థోదానగరమును సమీపించిన దినమున దురకుల కధికోత్సాహకరంబగు మొహరం పండుగయొక్క తుదిదినమయినందువలన నా నగరవాసులగు దురకలందరు పీర్లను గుమ్మటములలోనుంచి యూరేగింపుచు నానంద మహోత్సవములో నిమగ్నులైయుండిరి. ఆ మహోత్సవావలోకన తత్పరుడయి యచటి ప్రభువగు దిల్లా తన మేడపై దివ్యవస్త్ర భూషణముల నలంకరించుకొనుచుండెను. అట్టి సమయమునందు దమసైన్యము నంతను నగరద్వారమున నునిచి పృథివీరాజును, తారాబాయియు మరియొక భృత్యుడును, ఉత్సవము గనవచ్చినవారివలె నా మూకలో జేరిపోవుచుండిరి. ఇట్టు లరుగునపుడు తారాబాయి తన జనకుని శత్రువు నెరింగి గురిపెట్టి యొక బాణమాతనికి దగులునట్లు వేసెను. మూకలో నుండి వచ్చిన యాశస్త్ర మా యవనును రొమ్మునం దవిలి వానిని యమసదనమున కనిచెను. తక్షణమే యవను లానగర ద్వారమున నొక మత్తగజమును కావలియుంచి తమ ప్రభువు ప్రాణముల నపహరించిన యోధుని వెతుకజొచ్చిరి. కాని వారి కెచటను నాతడు పట్టుబడినవాడు కాడు. తారాబాయి పగతుని దెగవేసినపిదప నా మువ్వురును గ్రామమావలనున్న తమ సైనికుల గలియబోవుచుండిరి. ఇట్లు పోవువారికి సింహద్వారముకడ మత్తగజమును కొంత సైన్యమును అగుపడి వారి నడ్డగించెను. దానిగని వారు ప్రధమము నందించుక జంకిరి కాని వీరులగు పృథివీరాజు తారాబాయియు మరల ధైర్య మవలంబించిరి. ఆ సమయమునం దామత్తగజము సమీపింపగా తారాబాయి తన చేతనున్న ఖడ్గముతో నా ఏనుగు తొండమును నరికెను. అంత నా నాగము ప్రచురధ్వని సేయుచు నావలి కరుగగా నామువ్వురు యోధులును నచటి స్వల్పసేనను సరకుగొనక నగరము వెల్వడిరి.

తామిటులు తమ యోధుల గలసికొనిన పిదప పృథివీరాజు థోదానగర సైన్యముల కెదురై పోరుడని తన సైనికుల కాజ్ఞాపించెను. రాజాజ్ఞయైన తక్షణమే యా వీరభటు లాపట్టణమును ముట్టడించి యచటి సేనలను నలు మొగంబుల బార దోలిరి. ఆ యుద్ధమునం దచటగల తురకలలో మూడువంతుల వరకు బగరచే జచ్చిరి. తదనంతరమునందు పృథివీరాజును తారాబాయియు మహోత్సవముతో నగరము ప్రవేశించిరి. తమకు జయము దొరికిన పిదప తమ సైనికులు మ్లేచ్ఛులను పట్టుకొని బాధించుటగని తారాబాయి అట్లు చేయవలదని స్వసైన్యముల కాజ్ఞాపించెను.

ఇట్లు సూరథాన్ రాయులకు రాజ్యము దొరకినపిదప తారాబాయి పృథివీరాజును వరించెను. సూరథాన్ రాయులు కూతురి వివాహానంతరము తనరాజ్య మల్లునకిచ్చి తాను భగవత్స్మరణ చేసికొనుచు నిశ్చితుండయ్యెను. తారాబాయియు నామె భర్తయు బరస్పరానురాగము కలవారై ప్రజలను కన్నబిడ్డలవలె బ్రోచుచుండిరి. వారిట్లు రెండు సంవత్సరములు సుఖముగా నుండగా వారికి నొక సంకటము ప్రాప్తించెను.

పృథివీరాజు బావయగు ప్రభురాయుడనువా డధిక దుష్టుడై తన భార్య నధిక బాధ పెట్టుచుండెను. పృథివీరాజు తన సహోదరికి గలుగు బాధలగని యూరకుండజాలక మంచిమాటలతో బావకు బుద్ధిచెప్పెను. ఆ దుష్టునికా వాక్యములు పామునకు బాలుపోసిననటులై యాతడు తన భార్యను విశేషముగా బాధింపదొడగెను. దానింగని పృథివీరాజు ప్రభురాయులకు గఠినోక్తులతో జాబువ్రాసెను. అప్పటినుండి యా దుష్టుడు పృథివీరాజుపై మిగుల కోపించియు కుత్సితము బయలుపడనీక పైకి మిగుల మిత్రత్వముతో నగుపడుచుండెను. ఇట్లుండి యాతడొకదినము పృథివీరాజును తన గృహమునకు విందునకు బిలిచి యాతనికి విషాన్నము పెట్టించెను. కపట మెరుగని పృథివీరాజు భోజనముచేసి మరల తన నగరునకు వచ్చుచుండెను. ఇంతలో నాతనికి విషమెక్కినందున నా త్రోవలో యాయన మూర్ఛితుడాయెను. ఈ వర్తమానము తారాబాయికి దెలియగా నామె యాసన్నమరణుడగు భర్త కడకేగి యాతనికి దగు చికిత్సలు చేయుచుండెను. కాని యందువలన నెంతమాత్రమును సుగుణము కాక తుదకాయన స్వర్గస్తుడయ్యెను. అంతటితో తారాబాయి జీవనచరిత్ర. ముగిసెను. రాజపుత్రుల కులాచారమగు అనుగమనము చేసి తారాబాయి పరమపదమున కేగెను.