అబలా సచ్చరిత్ర రత్నమాల/రాణి ఝాశీ లక్ష్మీబాయి
రాణి ఝాశీ లక్ష్మీబాయి
భరత ఖండమునందు శౌర్య మహిమవలన బ్రఖ్యాతలయిన యువతీ రత్నములలో ఝాశీలక్ష్మీబాయి యగ్రగణ్యురాలు. ఈమె శౌర్యాగ్ని 1857 వ సంవత్సరము వరకును దాగియుండి యాకస్మికముగా బ్రజ్వలించెను. ఈమె రాజ్యముత్తర హిందూస్థానమునందలి బుందేల ఖండమను ప్రదేశమునందలి యొకభాగము. ఈ రాజ్యము లక్ష్మీబాయిగారి మామగారి యన్నయగు రఘునాథరావుగారి ప్రతాపమునకు మెచ్చి పూర్వము ఈపూనా పేష్వాగారిచ్చిరి. ఆయనకు బుత్రులు లేనందున ఆయన తమ్ముడగు శివరాంభావుగారి నభిషిక్తుని జేసిరి. ఈ శివరాంభావుగారి కాలమున పూనా పేష్వాల ప్రతాప మడుగంట నారంభించినందునను, రెండవ బాజీరావుగారి రాజకార్య నిపుణత్వ శూన్యతవలనను ఈయన వారి నతిక్రమించి స్వతంత్రుడాయెను. కాని యింతలో నాంగ్లేయప్రభుత్వ మెల్లడలను వ్యాపించినందున శివరాంభావు గారాంగ్లేయులతో సఖ్యముచేసి యనేక సమయముల యందింగ్లీషువారి కనేకవిధముల తోడుపడెను. శివరాంభావుగారికి కృష్ణారావు, రఘునాధరావు, గంగాధరరావులను ముగ్గురు పుత్రులుండిరి. వారిలో బెద్దవాడగు కృష్ణారావు తండ్రి బ్రతికి యున్న కాలములోనే మృతిజెందినందున శివరాంభావుగారి యనంతర మాయనకొమారుడగు రామచంద్రరావుగారికి రాజ్యాధికారము దొరకెను. ఈయన పరిపాలన కాలములో పేష్వాల రాజ్యాధికారమెల్ల నింగ్లీషువారి యధీనమయినందున ఝాశీ సంస్థానాధీశునితో నాంగ్లేయప్రభుత్వమువారికి విశేష స్నేహ భావముగలిగెను. ఈయన పుత్రహీనుడగుటవలన నాయనంతర మాయనపినతండ్రియగు రఘునాథరావు, ఆయన యనంతర మాయనతమ్ముడగు గంగాధరరావును రాజ్యమును పాలించిరి. ఈగంగాధరరావు చరిత్ర నాయిక యొక్క భర్త.
మోరోపంతు తాంబే యనుకరాడే బ్రాహ్మణుడు పూనానగరమున వసియింపుచుండెను. ఆయనయందు రెండవ బాజీరావు సహోదరుడగు చిమాజీ యప్పాగారికి మిగుల విశ్వాసమును స్నేహమును కలిగియుండెను. 1818 వ సంవత్సరమున 8 లక్షలపించెను పుచ్చుకొని స్వరాజ్యమును ఇంగ్లీషువారికిచ్చినట్టు పత్రము వ్రాసియిచ్చి రెండవబాజీరావు బ్రహ్మావర్తమున వాసముచేయ జనెను. ఆసమయమునందాయన తమ్ముడగు అప్పాగారును తమకు దొరకు పింఛనును సేవకులనుతీసికొని కాశీక్షేత్రమున వసియింప దలచి దొరతనము వారి యనుజ్ఞవడసి కాశీకి బోయిరి. ఆయన పరివారములోనివాడు కాన మోరోపంతుతాంబే సహిత మచటికే చనెను. ఈతనిని శ్రీమంతులగు నప్పాగారికి దివానుగానుంచి, తత్ప్రీత్యర్థము నెలకు ఏబది రూపాయల వేతన మొసంగుచుండిరి.
మోరోపంతుగారి భార్యయగు భాగీరథీబాయి సద్గుణమునందును సౌశీల్యమునందును మిగుల ప్రఖ్యాతి వడసెను. భార్య యిట్టి దగుటవలననే మోరోపంతుగారికి సంసార యాత్ర బహు సుఖకరముగా గడచెను. ఆభార్యాభర్తలిరువురును పరస్పరాను రాగముగలవారై కాసీక్షేత్రమున వసింప గొన్ని దినములకు భాగీరథీబాయి గర్భముధరించి 1835 వ సంవత్సరము నవంబరునెల 19 వ తేదిని సుఖప్రసవమై స్త్రీశిశువును గనెను. తాంబేగారి శూరవంశమున గాశీ క్షేత్రమున జన్మించిన కన్యారత్నమే లక్ష్మీబాయి. జాతకర్మ నామకరణమహోత్సవములు బహుసంతోషముతో నడిపి మోరోపంతుగా రాచిన్నదానిపేరు "మనూబాయి" యని పెట్టిరి. ఈబాలిక దినదినప్రవర్థమానయగుచు దనముద్దు మాటలవలనను, మనోహర మగుస్వరూపమువలనను జననీ జనకులను, వారి పరివారమును మిగుల నానందపరుపుచుండెను. ఇట్లీబాలికా రత్నంబు సకల జనాహ్లాదకరంబుగా బెరుగుచుండ నామె మూడు నాలుగు సంవత్సరములదియగువరకు తన్మాత యగు భాగీరథీబాయి పరలోకగతురాలాయెను. ఈసమయముననే యప్పాగారును కైలాసవాసులగుటవలన మోరోపంతుగా రచటనుండి బ్రహ్మావర్తమునకు బోవ తటస్థించెను. అచట బాజీరావీయనను మిగుల ప్రేమించి కుటుంబసంరక్షణ చేయుచుండెను.
మనూ బాయికి బాల్యముననే జననీ వియోగము తటస్థించినందున నామె తండ్రిగారి పోషణలోనే యుండుచు, నెల్లప్పుడు ఆయననువిడువక పురుషులలోనె సదా తిరుగుచుండెను. తల్లిలేని పిల్లయగుటవలనను, సుస్వరూప మధురభాషిణి యగుటవలనను శ్రీమంతులవద్ద నుండువా రందరును మనూబాయిని మిగుల గారాబము చేయుచుండిరి. పేష్వాగారి దత్త పుత్రులగు నానాసాహేబు, రావుసాహేబు లాకాలమునందు బాలురేగాన వారితో నీ చిన్నది సదా కలసిమెలసి యుండుచు వచ్చెను. నానాసాహేబేమి నేర్చిన నది మనూబాయి నేర్చుకొనుచు, వారిద్దరన్న చెల్లెలి వరుసలతో బిలుచుకొనుచుండిరి. చదువు, అశ్వారోహణము, ఖడ్గము త్రిప్పుట మొదలయిన వన్నియు మనూబాయి నానాసాహేబుగారితోడనే నేర్చు కొనును! ఈమె స్వభావము బాల్యమునుండియే శౌర్యగుణ ప్రధానముగా నుండెను. దీని కంతకు క్షత్రియాగ్రగణ్యగుణములు గల శూరుల సంసర్గమే కారణము. ఇందువలన స్త్రీలు స్వభావము చేతనే పిరికివారనియు, వారికి శౌర్యధైర్యము లెన్నివిధములను పట్టువడనేరవనియు వాదిందు విద్వాంసులకు సంశయనివృత్తి కాగలదు. స్త్రీలకును పురుషులవలెనే బాల్యమునుండి యెట్టి సంస్కరణ జరుగునో యట్టి గుణములే యబ్బునని సిద్ధమగును.
ఇట్లుండ నొకానా డాకస్మికముగా ఝాశీ సంస్థానమునందలి జ్యోతిష్కుడగు తాత్యాదీక్షితులు బాజీరావును సందర్శింపవచ్చెను. ఆదీక్షితులతో సందర్భానుసారముగా మోరోపంతుగారు ఝాశీవైపున మాచిన్నదానికి వరుడు కుదురునాయని విచారించెను. అందుకాయన "ఝాశీ సంస్థానాధీశ్వరుడగు గంగాధరరావు బాబాసాహేబుగారికి బ్రథమపత్ని యగు రమాబాయి కాలధర్మమునొందెను కాన నీకొమార్తెకా సంబంధము విచారింపు"మని చెప్పెను. తదనంతర మీ వివాహమును గురించి బాజీరావు గంగాధరరావుకు దెలుపగా నాతడు సమ్మతించెను. లగ్ననిశ్చయమైన పిదప గొందఱాప్తులతో మోరోపంతుగారు ఝాశీకివెళ్ళిరి. అచటనే 1842 వ సంవత్సరమున మనూబాయి వివాహము మిగుల వైభవముతో జరిగెను. వివాహానంతరమునందు దేశాచారప్రకారము అత్తవారాచిన్నదానికి 'లక్ష్మీబాయి' యను పేరు పెట్టిరి. మామగారగు మోరోపంతు తాంబేగారికి 300 రూపాయల వేతనమిచ్చి గంగాధరరావుగారు తమ యాస్థానమునందొక సరదారుగా నుంచినందున లక్ష్మీబాయి మరల బ్రహ్మావర్తమున కరుగుట తటస్థించినదికాదు.
గంగాధరరావుగారి యన్నగారగు రఘునాథరావుగారి పరిపాలనలో రాజ్యము విశేష దుస్థితికి వచ్చినందున నారాజ్యాధికారమును పూర్ణముగా దొరతనమువారే స్వాధీనపరచుకొని రాజ్యమునకు గల ఋణములను దీర్చుచుండిరి. లక్ష్మీబాయి వివాహానంతరము గంగాధరరావుగారి యోగ్యతనుగని బుందేలుఖండుయొక్క పొలిటికల్ యేజంటగు కర్నల్ స్లీమన్ దొరగారు సర్వరాజ్య పాలనమును గంగాధరరావు గారి స్వాధీనము చేయించిరి.
గంగాధరరావు తనప్రజలను సుఖులనుగా జేయనెంచి రాజ్యముమ బహునిపుణముగా బాలింపుచుండెను. ఈయన కాలమునందు ఋణము లన్నియు దీరి భాండాగారమున ధనము దినదినాభివృద్ధి బొందుచుండెను. ప్రజలును మిగుల సుఖులై యుండి సదా రాజును, రాణిని దీవింపుచుండిరి. ఇట్లు కొన్నిరోజులు సౌఖ్యములో గడచిన పిదప లక్ష్మీబాయిగారి దు:ఖమునకు బ్రారంభమయ్యెను. ఆమె కొక పుత్రుడు గలిగి మూడుమాసములు జీవించి మృతిజెందెను. గంగాధరరావు మహారాజుగారి మనస్సునందు పుత్రశోక మధికమయినందున ఆయన నానాటికి క్షీణించి, వైద్యోపచారముల వల్ల నడుమనడుమ కొంచెము స్వస్థపడుచుండెను. ఇట్లు కొన్నిదినములు గడచినపిదప 1853 వ సంవత్సరము అక్టోబరు నెలనుండియు నాతని శరీరము మరింత క్షీణింపసాగెను. అనేక రాజవైద్యులు సదా సమీపమునందుండి యౌషధోపచారములు చేయుచుండిరి. కాని యెంతమాత్రమును సుగుణ మగుపడు జాడ గానరాకపోయెను. నవంబరు 15 వ తేదినుండి గంగాధరరావు ప్రకృతియందు వికారచేష్ట లనేకములు కానిపించుచు వచ్చెను. అందువలన సంస్థానపుమంత్రియగు నరసింహరావును మోరోపంతు తాంబేగారును గలిసి ముందు సంస్థాన వ్యవస్థనుగూర్చి మహారాజులంగారితో ముచ్చటించిరి. వారి ప్రసంగమును వినిన పిదప దన కిప్పుడే రోగ మసాధ్యముగా లేదనియు, ముందసాధ్యమగునేని తమ వంశమునందలి ఆనందరావును తనకు దత్తపుత్రునిగా జేసి యనంతర మాచిన్నవాడు స్వరాజ్యభారశక్తుడగు వరకును వానిపేరిట లక్ష్మీబాయియే రాజ్యము బాలింపవలయుననియు జెప్పెను. అందుపై వారంద రాక్షణముననే ముహూర్తనిశ్చయము చేసి త్వరలోనే శాస్త్రోక్తముగా దత్తవిధి నడిపిరి. ఆ మహోత్సవమునకు ఝాశీ యందలి యనేకప్రముఖులను బిలిచిరి. వారితోడనే బుందేల ఖండ పొలిటికల్ అసిస్టెంటు యేజంటగు మేజర్ యేలీసుదొరగారినిని, సేనాధిపతియగు క్యాప్టన్ మార్టిన్ దొరగారినిని బిలిచిరి. వీరందరి సముఖముననే దత్తవిధానము జరిగి ఆనందరావు పేరు దామోదరరావని పెట్టిరి.
ఇట్లుదత్తవిధానమయిన పిదప గంగాధరరావుగారు దివానుగారిచే వినతి పత్రము హిందూస్థానపు దొరతనమువారికి వ్రాయించి దానిపై తమవ్రాలు చేసిదానిని తమ హస్తములతో పొలిటికల్ అసిస్టెంట్‌గారి కిచ్చిరి. అందులో బూర్వ మింగ్లీషు వారు తన తండ్రిగారితో జేసిన కరారు ప్రకారము తమ వంశ పారంపర్యముగా రాజ్యము దొరకవలయుననియు, తనకు నౌరససంతతి లేనందున నొక దత్తపుత్రుని స్వీకరించితిననియు, దొరతనమువా రాదత్తవిధానమునకు సమ్మతించి వానికి రాజ్య మొసంగి వాడు పెద్దవాడగువరకు వాని పేర తనపత్నియగు లక్ష్మీబాయి పాలించునట్లు చేయుడనియు వ్రాసిరి. విజ్ఞాపన పత్రిక వ్రాసిన దినముననే గంగాధరరావు పరలోకగతుడయ్యెను. కులాచారప్రకారము రాజుగారికి ప్రేతవిధులన్నియు జరుపబడెను. తదనంతరము గొన్ని దివసంబులకు లక్ష్మీబాయి సర్వానుమతంబునం దనపుత్రునకు రాజ్యమిమ్మని దొరతనము వారికొక విజ్ఞాపన పత్రికను వ్రాసెను. కాని యామె యుద్దేశ్యము సిద్ధించినది కాదు.
ఆ విజ్ఞాపన ప్రకారము దొరతనమువారు తమదత్తతను స్వీకరించి రాజ్యమిత్తురని ఝాశీ సంస్థానమున నందరును కొండంత యాసతోడ నుండగా 1855 వ సంవత్సరము మార్చి నెల 25 తేదిని దత్తవిధానము దొరతనమువా రంగీకరింపక రాజ్యమును తామే స్వాధీనపరచుకొని రనిన సంగతి తెలిసెను. కాన లక్ష్మీబాయికి బతి వియోగ దు:ఖమునకు దోడు రాజ్యవియోగవ్యసనము సంప్రాప్తమాయెను. దొరతనము వారా రాజ్యమును తాము స్వాధీనపరుచుకొని పశ్చిమోత్తర పరగణా గవర్నరుగారి కచటి రాజ్యము నడుప ననుజ్ఞ యిచ్చిరి. వారు రాజ్యము స్వాధినపరుచుకొని రాజ్యమునకును రాజకుటుంబమునకు నిట్లు కట్టుబాట్లు చేసిరి.
గ్రామమునందున్న రాజభవనము రాణిగారి కుండుటకుగా నిచ్చి, కిల్లా తాము తీసికొనిరి. రాణిగారికి నిలువ ధనములోన గొంత యిచ్చి, మిగిలిన సంస్థానమునందలి నగలు మొదలగు ధనమంతయు దత్తపుత్రునకు మైనారిటీ తీరినవెనుక నిచ్చుటకుగాను తమయొద్దనే దాచిరి. రాణిగారు జీవించి యుండునంతవరకు (5000) అయిదువేల రూపాయలామెకు నెల వేతనముగా నేర్పరచి యంతవరకును ఆమెపైగాని, యామె యితర భృత్యవర్గముపైని గాని తమ చట్టములు నడువగూడదనియు వ్రాసియిచ్చిరి.
అందుకు ముందున్న రాణిగారి సైనికులకు విశ్రాంతి గలుగ జేసి వారికి బదులుగా దమసేన నుంచిరి.
రాణిగారికి అయిదువేలరూపాయల వేతన మిత్తుమని దొరతనమువారు వ్రాయుటయేగాని తన రాజ్యము తనకు దొరకవలయునన్న యుత్కటేచ్ఛగల రాణిగారా యల్పజీతమును మరణపర్యంతమును స్వీకరించినవారు కారు. అంత నూర కుండక లక్ష్మీబాయి సీమలో నపీలు చేయదలచి ఉమేశ చంద్ర బానర్జీ యను వంగదేశీయునిని, మరియొక ఆంగ్లేయ ప్లీడరును ఆరులక్షలరూపాయలిచ్చి యింగ్లండునకు బంపెను. కాని వారచటి కరిగి యేమి చేసినదియు నెచట నున్నదియు నేటివరకును దెలియదు, వారచట ననేకోపాయముల జేసెదరనియు వారి ప్రయత్నమువలన దనకు రాజ్యము మరల ప్రాప్తించుననియు రాణిగారికి మిగుల నమ్మక ముండెను.
1855 వ సంవత్సరమున దామోదరరావుగారికి నుపనయనము చేయదలచి ఆ పిల్లనిపేర దొరతనమువారు దాచియుంచిన 6 లక్షల రూపాయలలోనుండి యొక లక్షరూపాయ లిండని రాణిగారు దొరతనమువారిని నడిగిరి. అందుకు వారు నీవు దీనికొర కెవరికైన జామీనుంచినంగాని యియ్యమనగా నదేప్రకారము వారు కోరినవారి జామీనిచ్చి లక్షరూపాయలు తీసుకొని, యా సంవత్సర మాఘమాసమునందు మహావైభవముతో గుమారుని యుపనయనము చేసెను. తన భర్తసొత్తు పుత్రుని యుపనయనమునకు దీసికొనుటకుగాను పరుల జామీను కావలసినందుకు రాణిగారి మనస్సెంత ఖేదపడి యుండెనో చదువరులే యోచింపగలరు.
ఇట్లు రాణిగా రత్యంతదు:ఖముతో గాలము గడుపుచుండగా 1857 వ సంవత్సరమున హిందూపటాలము ఇంగ్లీషువారిపై దిరుగబడిన విప్లవకాలము ప్రాప్తించెను. ఈ యుద్ధ మితిహాససిద్ధమేగాన నితిహాసజ్ఞుల కందరకు విదితమే. పటాలములు తిరుగబడిన యీ వర్తమానము ఝాశీలోని హిందూపటాలములకు దెలిసి యదివర కడగియున్న ద్వేషాగ్ని ప్రజ్వలింప జూన్ నెల 1 వ తేదిని వారును స్వాతంత్ర్యసమరమునకు బ్రారంభించిరి. వారి సేనానాయకుడు వారిని నివారింప నెంత యత్నించినను వారు తిరుగకుండిరి. అదిగని యతడు గ్రామమునందలి యాంగ్లేయుల నందరను మిగుల భద్రమగు కిల్లాలోని కరుగుడని గుప్తరీతిని దెలుపగా వారా ప్రకార మచటి కరిగి కోటద్వారముల మూసికొనిరి. కాని మరుసటిదినముననే యా తిరుగబడిన పటాలములవారు సేనలో మొనగాని జంపి యుప్పొంగి కిల్లాను చుట్టుముట్టి బహు ప్రయత్నముల నచటివారి నీవలకుదీసి వారినందరి నేకక్షణముననే యమసదనమున కనిచిరి. వారట్లాయూర నొక యాంగ్లేయ శిశువు సహితము లేకుండజేసి ఝాశీరాజ్యము మహారాణీలక్ష్మీబాయిగారిదని ధ్వజమెత్తిరి. అప్పటినుండి రాణిగారు పటాలములతో గలిసి స్వతంత్రించి ఝాశీ సంస్థానమున తన రాజ్యమును స్థాపించ యత్నించ దొడగెను. ఆ నాలుగురోజులనైన రాణిగారు రాజ్యవ్యవస్థ మిగుల నిపుణతతో జేసిరి. ఆమె తన నేర్పువలన నేయే పనుల కెవ్వరెవ్వరు యోగ్యులో యాయా పనులకు వారివారిని నియమించెను. కాని పూర్వపు ఉద్యోగస్థులను దొరతనమువా రిదివఱకే తీసివేసినందున రాణిగారికి దగిన యుద్యోగస్థు లా సమయమున దొరకకుండిరి. అయినను ఆమె తనవలన నగునంతవరకును సిద్థపఱచి దుర్గసంరక్షణనిమిత్తము క్రొత్తసైన్యమును సిద్ధపరచెను. ఝాశీరాజ్యము మహారాణి లక్ష్మీబాయిగారు పాలింపుచున్నసంగతి విని వారి వంశీకుడగు సదాశివనారాయణ యనునాతడు ఝాశీ సమీపమునందున్న కరేరాయను దుర్గమును వశపరచుకొని యచట దాను ఝాశీరాజ్యాభిషేకము గావించుకొనెను. అబలయగు రాణిగారు రాణివాసము నందుండినదిగాన నామె తనకు లొంగునని తలచెను. కాని రాణిగారు సబలయై సైన్యమునంపి యాతనిబట్టి తెప్పించి ఝాశీ కిల్లాలో బంధించి యుంచెను.
ఇట్లొకశత్రుని బరిమార్చునంతలో రెండవ శత్రుడుత్పన్నమాయెను. ఝాశీకి సమీపమునందున్న ఓరచాసంస్థానపు దివాను, నధేఖా యనువాడు విశేషసైన్యముతోడ దాడి వెడలి రాణిగారి కిట్లు వర్తమానమంపెను. "మీకిదివర కాంగ్లేయ ప్రభులిచ్చుజీతము మే మిచ్చెదముగాన రాజ్యమును మాస్వాధీనము చేయుడు". ఈ వార్తవిని రాణిగారి ప్రధానసామంతులందరును భయభీతులయి మనకు పించెను నిచ్చినయెడల సంగ్రామముతో బనిలేదనియు వారితో యుద్ధముచేసి గెలుచుట సాధ్యము కాదనియు జెప్పిరి. కాని యసామాన్య శౌర్యముగల రాణిగారు వారి మాటలను వినక యాశత్రువున కిట్లు వర్తమానమంపెను. "ఆంగ్లేయులు సార్వభౌములు. వారు నిగ్రహానుగ్రహములకు సమర్థులు. వారితో సమానులు కానెంచి యాజీత మిచ్చెదననెదవు. కానినీవంటివా రింక పదుగురు వచ్చినను స్త్రీనగు నేను వారినందరిని పౌరుషహీనుల జేయజాలుదుననగా నిన్ను లెక్కింప నేల?" ఇట్టివార్త నదేఖాకు తెలిసిన వెంటనే పట్టరానిరోష ముప్పతిల్లనతివేగముగా వాడు ఝాశీని సమీపించెను. లక్ష్మీబాయిగారును నట్లు వర్తమాన మంపి సంగ్రామమునకు సిద్ధముగానుండెను. అపు డామె తాను పురుషవేషముతో సేనాపతిత్వము వహించి ఘోరయుద్ధము చేసి నధేఖాను నోడించి వానియొద్దనుండి లక్షలకొలది ధనము గొని వానితో సంధిచేసెను.
మహారాణి లక్ష్మీబాయిగారి పరిపాలన మల్పకాలమె యైనను ప్రజలకు మిగుల సుఖకరముగా నుండెనట. కాన వారును రాణిగారి శుభమునే కాంక్షింపుచుండిరి. లక్ష్మీబాయి గారికి పురుషవేషముతో దరబారుచేయుట, అశ్వారోహణము చేయుట మిగులప్రియము. కాన నామె అనేకసమయముల యందు బురుషవేషముతోడనే యుండుచుండెను. సాధారణముగా నామె స్త్రీ వేషముతో నుండినను అలంకారము లేమియు ధరియింపక శ్వేతవస్త్రమునే కట్టుకొనుచుండెను.
రాణిగారికి బీదలపై నధిక ప్రేమయుండెను. ఒక నాడామె మహాలక్ష్మీదర్శనమునకుబోయి వచ్చునప్పుడు కొందరు బీదలు మూకలుగా నామె నడ్డగించిరి. దాని కారణ మడుగగా వారు మిక్కిలి చలివలన బాధపడుచుండినందున వస్త్రదానము నపేక్షించి వచ్చిరని రాణిగారికి దెలిసెను. అందుపైనామె వారందరికిని టోపీలు, అంగీలు, గొంగళ్లు మొదలగునవి యిప్పించెను.
మధ్య హిందూస్థానమంతయు నించిమించుగా భారత విప్లవకారుల స్వాతంత్ర్య సైన్యముల స్వాధీన మయినందున నప్పటి హిందూస్థానపు గవర్నర్ జనరల్ లార్డు క్యానింగు దొరగారు ఇంగ్లండు దొరతనమువారి యనుమతిగొని ఇంగ్లండు నందలియు, హిందూ స్థానమునందలియు ప్రవీణులగు సేనా నాయకులను రప్పించి రాజభక్తిగల యితర సైన్యములను, సహాయార్థ మరుదెంచిన యితర భూపతుల సైన్యములను వారిపరముచేసి యాప్రచండ సేనను నడుపుటకు యుద్ధకళా విశారదుడగు సర్ హ్యూరోజ్ దొరగారిని నియమించి ఆయనకు సర్వసేనాధిపత్య మిచ్చెను.
1857 వ డిశంబరు 17 వ తేదీన సర్‌హ్యూరోజ్ దొరగారు సేనానాయకత్వము స్వీకరించిరి. యుద్ధమునకుబోవు మార్గమును విచారించి వేరువేరు మార్గముల సైన్యములు నడుపవలసిన క్రమమును దెలిపెను. క్రమక్రమముగా సర్‌హూరోజ్ దొరగారు తమసంగ్రామ కౌశలమందరునుం గొనియాడ విప్లవవీర సైన్యములపాలయిన భూము లనేకములు గెలిచి, ఝాశీని గెలుచుతలంపున నచటికి 14 మైళ్ళ సమీపమున తనసైన్యములను విడియించిరి. వారచటనుండి ఝాశీ వర్తమానముల నరయుచు, 1858 వ మార్చి 21 వ తేదీని ఝాశీపొలిమేరం బ్రవేశించి పురరచన నరసి తదనుసారముగా సైన్యములను యుద్ధమున కాయత్తము చేసిరి.
అప్పుడు శౌర్యరాశియగు రాణిగా రాగ్రహించి యిక నింగ్లీషువారితో పొసగదని తెలిసికొని యుద్ధసన్నాహము చేయసాగెను. నధేఖాతోడ రణ మొనర్చునపుడుంచిన విశేష సైన్యమున కనేక స్థలములనుండి పర తెంచివచ్చిన స్వాతంత్ర్య వీరుల సైన్యములు తోడుపడెను. రాణీగారి సైనికులలో శూరులగు ఠాకూరులోకులును, విశ్వాసార్హులగు పఠాణులును విశేష ముండిరి. ఆసేనాధిపత్యమునంతను రాణిగారు తామేస్వీకరించి తగినబందోబస్తు చేయసాగిరి. ఝాశీకోట మిగుల విశాలమైనదియు, నభేధ్య మగునదియునై యుండెను. అచట గొప్పగొప్పబురుజు లండెను. ఆకిల్లాలో విశేషదినములనుండి నిరుపయోగములైయున్న యనేకఫిరంగులను రాణిగారు బాగుపరచి బురుజులపై కెక్కించిరి. ఒక్కొక్కఫిరంగి కొక్కొక్క యుద్ధకలానిపుణుని నియమించిరి. ఇట్లామె తననేర్పుమెయి సేనలను నడుపుచు యుద్ధసన్నద్ధురా లాయెచు.
ఈ ప్రకార ముభయసైన్యములును యుద్ధసన్నద్ధములై 23 వ తేదీని సంగ్రామమున కారంభించిరి. ఆ దినము శత్రువులు ఝాశీకిల్లాను సమీపింప యత్నించిరి. కాని కోటలోని వారి యాగ్నేయ బాణప్రవృష్టి వారి కసహ్యమయినందున సమీపింపజాలకపోయిరి. ఆ రాత్రి యింగ్లీషుసైనికులు కొందరు గ్రామము సమీపించి యచట నాలుగు స్థలముల బురుజు లేర్పరచి వానిపై ఫిరంగుల నునిచిరి. ఝాశీలోనివారును ఆ రాత్రి యంతయు యుద్ధఒరయత్నమే చేయుచుండిరి. 24 వ తేదినాడు సహిత మింగ్లీషుసైన్యంబులే దైన్యంబు నొందెను. 25 వ తేది ప్రాత:కాలముననే యింగ్లీషు సైన్యంబుల నుండి కిల్లా పైనిని, పురము పైనిని శతముఖ బాణవృష్టి కాసాగెను. ఆగోళ మొకటి వచ్చి శత్రుసైన్యములోపడి పగిలి నలుగురైదుగురిని జంపి, పది మందిని గాయపరచుచుండెను. కాన నా దిన మా పట్టణమునం దెచటజూచినను హాహాకారములే వినబడుచుండెను. ప్రజలన్నాహారములకై తిరుగజాలకుండిరి. వారి దైన్యమును గని రాణిగారు వారికొక యన్నసత్రము నేర్పరచిరి. ఆంగ్లేయసైన్యంబుల నుండి నారాయణాస్త్రతుల్యములగు గోళములవలన తనసైన్యంబులు దీనముఖంబు లగుట గని లక్ష్మీబాయి యంతటితో ధైర్యము వదలక సైనికుల కుత్సాహమును గలుగజేసి యాంగ్లేయసైన్యములను ధిక్కరించెను. ఇట్లీ యుభయసైన్యములును బీరువోవక మార్చి 30 వ తేది వరకును సంగ్రామం బొనర్చు చుండెను. ప్రతిపక్షులగు ఆంగ్లేయసైన్యమున కనేక సేనానాయకులుండి నడుపుటవలనను, సైనికు లదివరకే యుద్ధమున కనుకూలమగు శిక్షను గరచియుండుటచేతను, వారి సైన్యములు చెదరక యుద్ధము చేసి గెలుపొందుట యొక వింతకాదు. ఇక రాణిగారి సైన్యములన్ననో యుద్ధశిక్ష నెరుగనట్టి స్వాతంత్ర్య వీరులతో గలిసి జనసంఖ్య కెక్కువగా గానుపించినను, వార లందరొక ప్రకారము యుద్ధము చేయజాలనందున విశేషముగా బెదరుచుండిరి. ఇంతటి విశేషసైన్యమున కంతకును రాణిగారే సేనానాయకత్వము వహించి నడుపుట బహు దుర్ఘటమని యందరకును దెలిసినదే. అయినను ఆ వీరవనిత తన బుద్ధిచాతుర్యమువలనను, శౌర్యసంపదవలనను ప్రఖ్యాతులగు ఆంగ్లేయ సేనానయకులతో బ్రతిఘటించి యుద్ధభూమిని నిలిచి యనేక దినములు సంగ్రామము సల్పి, వారిచే 'నీమెను గెలుచుట దుర్ఘట' మనిపించుట మిగుల వింత గదా? ఆ యుద్ధసమయమునందు రాణిగారు సైన్యమం దంతటను తన దృష్టి నిగిడింపుచు, నచటగల కొదవలను దొలగింపుచు, సైనికుల కనేక బహుమానము లిచ్చుచు, యుద్ధధర్మములను దెలుపుచు, వారిని యుద్ధమునకు బురికొల్పి వారి మనంబుల వీరరస ముద్భవిల్ల జేయుచుండెను. అప్పు డామె మిగుల జాలిపడి వచ్చినవారి కామె సమక్షముననే చికిత్స జరిగింపుచుండెను. అప్పుడామె మిగుల జాలిపడి వారిపైనుండి తన హస్తమును త్రిప్పగా నా సైనికు లధికావేశపరులయి యుద్ధముచేయ నుంకింపుచుండిరి. ఇట్టి స్త్రీరత్నములు జన్మించుటవలననేగదా స్త్రీలకును పురుషులను బోలిన ధైర్యశౌర్యములు గలవని యందరకును దెల్లంబయ్యె.
ఇట్లు 30 వ తేదివరకును యుద్ధము జరిగెను. ఆంగ్లేయ బలంబులి రాణిగారి కోటను భేదింపజాలవయ్యె. ఈ రణరంగమునందు వారి యుద్ధసామగ్రి యంతకంతకు దక్కువగుట వలన వారు జయమునం దంతగా నమ్మకము లేకయుండిరి. ఇంతలో నానాసాహేబు* పేష్వాయొక్క సేనానాయకుడగు తాతాటోపే యను వీరుడు లెక్క కెక్కువయగు సైన్యముతో రాణిగారికి దోడుపడుటకై కాల్టీనుండి వచ్చుచుండెను. ఆ సైన్యము బహుదూరమున నుండగానే యాంగ్లేయ సేనానాయ
- నానాసాహేబు (రెండవ) బాజీరావు దత్తపుత్రుడు. 1853 వ సంవత్సరపు సిపాయిల స్వామిద్రోహమునకు నితడే పురస్కర్త. ఇంగ్లీషువారి యొద్దనుండి తన పూనారాజ్యము మరల సంపాదించవలయునని యితని యత్నముండెను. కులు దూరదర్శక యంత్రమువలన గనిరి. అంత నగ్నిదేవునకు వాయుదేవుడు సహాయమగునటుల నీ రాణిగారికి నాసైన్యము వచ్చి తోడుపడిన మన జయ మసత్యమనుకొనిరి. సర్‌హ్యూరోజ్ దొర యంత మాత్రమున జంకక యిచట రాణిగారితో బెనగ గొంత సైన్యమును నియమించి కోటలోనివా రెరుగ కుండ గొంతసైన్యమును కాల్టీమార్గమున కంపెను. వారు చనియా త్రోవలో వచ్చుచున్న విపులసైన్యములతో బెనగి తమ యుద్ధసామర్థ్యమువలన వానిని బారదోలిరి. తాత్యాటోపే సైన్యముల బారి కోపజాలక తమ యుద్ధసాహిత్యము నచటనే విడిచి పలాయితములయ్యెను. కాన నా సాహిత్య మనాయాసముగ దొరకినందున సర్ హ్యూరోజ్ గారి బలంబులు మిగుల నుత్సాహముగలవయ్యె. వారికి నిదివరకుగల నధైర్యమంతయు నడుగంట శత్రువులపై నధికోత్సాహముతో తప్తగోలవర్షము గురిపింపసాగిరి.
ఏప్రియల్ 2 వ తేదివరకును యుద్ధము జేసియు దాము పురప్రవేశము చేయలేకుండుటకు మిగుల చింతిల్లి సర్ హ్యూరోజ్ దొరగారు తమ బుద్ధిప్రవీణత వలన నా దినమున నా కిల్లాను చేకొనదలచిరి. ఆయన తదనుసారంబుగా బలంబుల నంప వారును మిగుల నుత్సాహముతో శత్రుపక్షమునుండి వచ్చు బాణములను సైచి గ్రామద్వారముల నుండియు, గోట గోడనుండియు బురము జొరసాగిరి. తాత్యాటోపేగారి పరాభవమును విని రాణిగారి సైనికులు మిగుల నిరుత్సాహులైరి. అయినను యుద్ధమునందు దెగగా మిగిలినవారికి రాణిగారు తమ వాక్యములవలన శౌర్యము పుట్టించి సంగ్రామము నడుపు చుండిరి. 3 వ తేదిని తమ్ము నెదిరించువారు లేక హూణబలంబులు పురమంతటను వ్యాపించెను. 4 వ తేదిని పట్టణమంతయు వారి స్వాధీనమాయెను.
తానిన్ని దివసంబులు చేసినశ్రమ వృధయపోవ శత్రువులు తన నగరము నాక్రమించుట గని రాణిగారు మిగుల విచారపడిరి. కాని యామె యంతటితో నైనా ధైర్యము విడువక కర్తవ్యము నాలోచించి జయోత్సాహులగు శత్రువులింక తనకిల్లా నాక్రమించి తనను బంధింతురని కని యామె యెట్లయిన రణరంగమున ప్రాణములువిడువ నిశ్చయించెను. అంత నామె పురుషవేషముతో బయలుదేర నిశ్చయించి తన దత్తపుత్రునియందధిక ప్రీతిగలదిగాన నా చిన్నవానిని తన మూపున గట్టుకొని అశ్వారోహణము చేసి నాల్గవతేది రాత్రి స్వల్ప సైన్యముతో నాంగ్లేయ సైన్యంబులతో బెనగుచు దాని బాయగా జీల్చికొని కాల్పీమార్గమున నరిగెను.
రాణిగారు తమ సైన్యములలో నుండి కాల్పీమార్గమున వెళ్ళిన సంగతి విని సర్ హ్యూరోజ్ దొరగారు సఖేదాశ్చర్యమగ్నులయిరి. ఆయన యంతటితో నూరకుండక యొక సేనా నాయకుని గొంత సైన్యసహితముగా నామెను వెంబడింప నంపెను. కాని రాణిగారు వారికి దృగ్గోచరముగాక తన గుర్రము నతిత్వరగా నడుపుచుండెను. జన్మాదిగా యుద్ధమన్నమాట యెరుంగక సదా రాణివాసమునందు వసియించు బ్రాహ్మణ వితంతువు వీరుల కభేద్యమగు హూణసైన్యమును భేదించుకొని క్షణములో నదృశ్యయగుట కెవ్వ రాశ్చర్య పడకుందురు?
మహారాణి లక్ష్మీబాయి రారాత్రి బయలుదేరి తనను బట్టవచ్చువారికి దృగ్గోచరయుగాక సూర్యోదయమునకు ఝాశీ సంస్థానమునకు సరిహద్దుయిన భాండేరయను గ్రామమున బ్రవేశించెను. అచట నామె గుర్రమును దిగి కొమారునకు ఫలహారముబెట్టి మరల నశ్వారోహణము చేసెను. ఇంతలో నాంగ్లేయ సైన్యాధిపతి కొంత సైన్యముతో దనను బట్టవచ్చెనని యామె వినెను. ఆ సమయమునం దామెయొద్ద బదునైదుగురు శూరులుదప్ప వేరుసైన్యము లేదు. అట్లయ్యును ఆ శూరశిరోమణి జంకక తన ఖడ్గము నొరనుండి తీసి యుద్ధసన్నద్ధయై చనుచుండెను. ఇంతలో నా సైనికులామెను ముట్టడించిరి. కాని యామె తన యుద్ధనైపుణ్యమువలన నా సైనికులను చీకాకుపరచి కొందరిని యమసదమున కనిచి క్షణములో నదృశ్యయయ్యెను. బహు సైన్యసమేతముగానున్న యాంగ్లేయ సేనాధ్యక్షుని స్వల్పసైనికులతో నొక యబల యోడించి పంపుట యెంతయు వింతగదా! అచటినుండి బయలుదేరి యారాత్రి యామె కాల్పీనగరమున నానాసాహేబునొద్ద బ్రవేశించెను. ఇట్లు నిద్రాహారములు లేక యామె యశ్వారోహనము, చేసి 108 మైళ్ళు ప్రయాణముచేసెను. దీనినిబట్టి చూడగా నామె ధైర్యమును అశ్వారోహణ శక్తియు నందరికి నత్యద్భుతమని తోచక మానదు. రాణీ లక్ష్మీబాయిగారు కల్పీకి వచ్చిన సంగతి విని బందేవాలానవాబు సహితము తన సైన్యములతో రావునాహెబు పేష్వాగారికి సహాయుడయ్యెను. వీరందరును తమ సైన్యములను యుద్ధసన్నద్ధముగా జేయుచుండిరి. రాణిగారి శౌర్యము నెరిగియు రావుసాహెబు పేష్వాగారు తనకుగల స్వాభిమానమువలన దన సర్వసేనాధిపత్యమును నొకస్త్రీ కిచ్చుటకు సమాధానపడడయ్యెను. కాన రాణిగారు కొంత వరకు యుద్ధమునందు నిరుత్సాహురాలయి యుండిరి.
సర్ హ్యూరోజ్ దొరగారు ఝాశీనుండి బయలుదేరి కాల్పీని గెలుచుటకయి సైన్యసమేతముగా రాత్రిం దినప్రయాణములు చేయుచు కాల్పీ సమీపమునందలి కూచయను గ్రామమున పేష్వాగారి సైన్యముల నెదిరించి క్షణములో నోడించిరి. కాన పేష్వా, బందేసంస్థానపు నవాబు మొదలగువారితో రాణిగారు కాల్పీకి వెళ్ళవలసివచ్చెను. ఆ సమయమునందామె సొంతసైన్యము లేనందున పేష్వాగారామెను మన్నింపనందునను ఈ యుద్ధమునందామె ప్రతాపమేమియు దెలిసినదికాదు. కాని కాల్పీకి వెళ్ళినపిదప నామె సైన్యము బందోబస్తును గురించి తన యభిప్రాయము పేష్వాగారికి దెలిపెను. అప్పుడాతడు లక్ష్మీబాయిగారి తెలివిని గని తాత్యాటోపేని లక్ష్మీబాయిని సర్వసైన్యాధిపత్యమునకు నియమించెను. అందుపై వా రిరువురు మిగుల దక్షతతో సైనికులకు యుద్ధము గరపు చుండిరి. ఇంతలో నాంగ్లేయసైన్యంబులు కాల్పీనగరము నలుప్రక్కల ముట్టడించెను. అప్పుడు రెండువందల గుర్రపుబలము నిచ్చి యమునానదివైపున యుద్దముచేయ రాణిగారి నంపిరి. ఆమెయు గడమసైన్యము మిగుల జాగ్రతగా నుండుట గని తన స్థలమునకు బోయెను. కాని యుద్ధమునందసమాన ప్రజ్ఞగల హూణసైన్యంబు అల్పకాలములోనే పేష్వాగారి సైన్యంబుల దైన్యంబునొందించెను. అది గని రావుసాహెబు పేష్వా మొదలగువారధిక విచారమున మునుంగ రాణిగారు వారికి ధైర్యపు మాటలుచెప్పి తన స్వల్పసైన్యముతో శత్రువులను చీకాకుపరచెను. కాని వెనుకనుండి వచ్చు శత్రుసైన్యముల వలనను, తమ సైన్యమునందలి ఇతర సేనాధిపతులు పలాయితులగుట వలనను రాణిగారు యుద్ధమునుండి తొలగవలసినవారయిరి.
ఇట్లు కాల్పీయం దపజయమును బొందిన ఈ ప్రముఖులందరును గ్వాలేరు వైపునగల గోపాలపురమునందుజేరి ముందు చేయవలసిన దానినిగూర్చి విచారింపుచుండిరి. వారెంత విచారించినను సైన్య మత్యల్పమగుటచే యుద్ధముచేయుటకు దోచకుండెను. రాణిగారును వారితోడనే యుండెగాన నామె యాయల్పసైన్యముతో గ్వాలేరున కరిగి సిందేగారిని తమకు దోడుపడ వేడుకొనవలయుననియును, అందు కాయన సమ్మతించినయెడల యుద్ధముచేయవలయుననియు నాలోచనచెప్పెను.
ఆమె గరపిన యాలోచన పేష్వాగా రంగీకరించి దిన ప్రయాణములు చేసి 1858 వ సంవత్సరము మే నెల 30 వ తేదీని గ్వాలేరునకు సమీపమునందున్న మురారిపుర సమీపమున బ్రవేశించిరి. అంత వారందరును విచారించి స్ందేగారిని తమకు సహాయులగుటకుగాను వర్తమాన మంపిరి. ఆవార్త సిందేగారి దరబారున కరుగగా నదివరకు దాత్యాటోపే బోధవలన నాతనికి వశులైన సరదార్లందరును పేష్వాగారికి సహాయము చేయుదుమని చెప్పిరి; కాని ప్రభుభక్తిగల జయాజీరావు సిందేగారును, దివాను దినకరరావుగారును వారి వాక్యములను లెక్కింపక మిగులయుక్తిగా మరుసటిదినము పేష్వాసైన్యములను బారద్రోల నిశ్చయించిరి. కాని రాత్రి దివానుగారు లేనిసమయమున నెవరో మహారాజుగారిని యుద్ధమునకు బురికొల్పిరి. అంత నాయన తనకధిక విశ్వాస పాత్రములగు సైన్యములంగొని సూర్యోదయమువరకు మురారికీవల రెండు మైళ్లదూరమునగల బహాదురపురము నందు దనదండును నిలిపి యుద్ధ మారంభించెను. ప్రథమమునందు పేష్వాసైన్యములపైబడు గుండ్లను గని సిందే పూర్వము పేష్వాల బంటగుటవలన దమ కనుకూలుడై తమ నెదుర్కొన వచ్చుచున్నాడని తలచిరి. కాని యాబాణవృష్టి యంతకంత కెక్కువగుటవలన పేష్వామొదలగు పురుష శ్రేష్టులందరు రిచ్చివడి యేమియు తోచకుండిరి. కాని వారు తాను చెప్పినటుల సైన్యపు బందోబస్తు చేయకున్నను, కోపముంచక రాణీ లక్ష్మీబాయిగారు తగిన యుక్తిగరపి యుద్ధమారంభము చేసెను. అందువలన నారెండు సైన్యములును కొంతవరకు సమముగా బోరి పిదప సిందే సైన్యములకే గెలుపు దొరకు నట్లయ్యెను. అదిగని రాణిగారు తాను ధైర్యముతో గొందరాశ్వికులనుగొని సిందేగారి ఫిరంగీలపై నాకస్మికముగానడరి మహా ఘోరముగాబోర, సిందే సైనికులు పారజొచ్చిరి. అదిగని తాత్యాటోపే సైనికులు మరింత యుత్సాహము గలవారయి శత్రుసైన్యములను నదలింపసాగిరి. కాన సిందేగారి పరాక్రమ మంతయు వృధవోవ నాతడును, దివాను దినకరరావును మరి కొందరు సరదార్లతో దనకు సహాయులగుడని యడుగుటకుగాను ఆగ్రా కిల్లాలోనున్న ఆంగ్లేయుల యొద్ది కరిగెను. విపుల సైన్యసమేతుడగు నొక తరుణ నృపుని నల్పసైన్యముగల యొక యబల తన శౌర్యముచే బారద్రోలెను. ఇందువలననే యొక కవి యిట్లు నుడివెను.
- 'క్రియాసిద్ధి: సత్వేభవతి మహతాం నోపకరణే'
సిందేగారు పురము విడిచి చనిన వెనుక నాతని రాణివాసపు స్త్రీ లందరు ఆత్మ సంరక్షణముకొరకు నరవర యనుపురమున కరిగిరి. వీరందరు బయలుదేరి కొంచెము దూర మరిగినపిదప సిందే శత్రువులచే బడెనని విని గజరాయను నొక స్త్రీచేత ఖడ్గముధరించి రాజభవనమునకు వచ్చి రాజు సురక్షితముగా వెళ్ళినవార్త విని వెనుకకు మరలెను. ఆహా యీ స్త్రీ యొక్క ధైర్యము అసామాన్యముగదా?
రాజు పలాయితుడయిన వెనుక సకల సైన్యములు తమ కనుకూలము లయినందున పేష్వాగారికి నగరు ప్రవేశించుట కెంతమాత్రము ప్రయాసము కాలేదు. పేష్వాగారంతటితో దాము సార్వభౌముల మయితిమని తలచి పట్టాభిషేక మహోత్సవము గావించుకొని బ్రాహ్మణ సంతర్పణలు చేయ
- 'గొప్పవారి కార్యసిద్ధి వారి పరాక్రమమువలననే యగును, కేవల సామగ్రి బలమువలన గాదు.' సాగిరి. లక్ష్మీబాయి యివన్నియు రాజ్యనాశన హేతువులనియు, ఈ యాడంబరమును వదలి సైన్యపు బందోబస్తు చక్కగా జేసి యుద్ధసన్నద్ధులమయి యుండవలసిన దనియు జెప్పెను. కాని యవి స్త్రీ వాక్యములని పేష్వాగారును, ఆయన సేనాయకుడగు తాత్యాటోపేగారును మన్నింపక మహోత్సవములలోను, బ్రాహ్మణ సంతర్పణములలోను మునిగియుండిరి.
జూన్ నెల 16 వ తేదీని సర్ హ్యూరోజ్‌గారు సైన్యసహితులయి బహద్దరు పురము చేరిరి. కాని భోగపరాయణలగు పేష్వాగారి కాసంగతియే తెలియకుండెను. ఆంగ్లేయ సేనానయకు లచటినుండి మురారికోట చేకొనిరని వినియును పేష్వాగారు చింతదక్కి పుణ్యకృత్యములు చేయుచునేయుండిరి. ఆయన యనుజ్ఞవడసి తాత్యాటోపే సైన్య వ్యవస్థ చేయురీతిగానక లక్ష్మీబాయిగారిని వేడుకొనిరి. జయము కలుగు నాసలేదని తెలిసికొనియు రాణిగారు సమరమున దెగి స్వర్గము గాంచ నపేక్షించి యాయన మనవి చిత్తగించెను. తదనంతర మామె కొంతసైన్యమును చక్కబరచి మిగత నితర సేనానాయకులను జూడ నియమించెను. ఆమె తనసేన ననేక భాగములు విభజించి మిగుల భద్రముగా యుద్ధసన్నద్ధురాలై నిలిచెను. ఇతర సైన్యాధిపతులును తమతమ శక్త్యనుసారముగా వ్యూహములు వన్ని నిలచిరి. రాణిగారు గ్వాలేరు పూర్వదిక్కు సంరక్షింతునని తన సైన్యము నచటనే మోహరించి నిలిచిరి. 17 వ తేదీని బ్రిగోడియర్ స్మిథ్ అను సైన్యాధిపతి గ్వాలేరు పూర్వదిక్కుననున్న సైన్యములపై బాణవృష్టి చేయసాగెను. అది రాణిగారి బలమగుటవలన నాసైనికు లింగ్లీషు వారిబలముల నాదినమున ధైర్యముతో మార్కొని నిలిచిరి. రెండవదినమును లక్ష్మీబాయిగారి వీరోత్సాహవచనముల వలన నా సైన్యములు పరబలంబులం బొడిచి తామును మృతులగుచుండిరి. లక్ష్మీబాయిగారి శౌర్యముం గని యాంగ్లేయ సేనానాయకులు మిగుల నద్భుతపడి యామె నోడింప నిశ్చయించిరి. ఇట్లు వారు నిశ్చయించి నలుదిక్కుల నుండి యామె సైన్యముపై బాణపరంపరలు పరపుటచే నా సైన్యంబులు నిలువక పారజొచ్చెను. ఇట్లు తన ముఖ్యసేవకులు కొందరుదప్ప నందరును తనను విడిచినందునను, అంతకుముందే యితర సేనాధిపతు లపజయమునుబొంది పలాయితు లగుటవలనను, లక్ష్మీబాయి తన ఖడ్గబలముచే శత్రుసైన్యములలోనుండి యనేక శూరులం బొడుచుచు నావలకు బోవుచుండెను. ఇట్లామె బహుదూరము వెళ్ళినపిదప నామెతో పురుషవేషము ధరించి యున్న 'ముందర' యను దాసియొక్క యంతిమశబ్ద మామె చెవినిబడెను. అందువలన నామె వెనుక తిరిగి తన ప్రియదాసిని జంపినవానిని యమపురమున కనిపి ముందుకుసాగెను. ఇట్లు ముందతిత్వరగా నరుగుచుండ నొక జలప్రవాహ మడ్డపడినందున ననేక గాయములచే క్షీణించియున్న యామె గుఱ్ఱ మాప్రవాహమును దాటజాలక నిలిచెను! లక్ష్మీబాయిగా రాగుఱ్ఱము నావలకు దీసికొనిపోవ ప్రయత్నించెనుగాని యాపని సిద్ధించి నదికాదు. ఇంతలో శత్రుసైనికులు కొందరామెను చేరరాగా నాయువతి మిగుల శౌర్యముతో వారిలో ననేకుల నంతక పురంబున కనిచెను! వారు బహుజనులును ఈమె యొంటరిది కాన వారిలో నొక డామె వాలునకు జంకక పక్కగా నిలిచి యామె తల కుడివైపుగా నరికెను. బంధింపబడిన సింహముపై మత్తగజమాడున ట్లాభటుడు చేసిన ఖడ్గప్రహారమువలన నామె తల కుడివైపంతయు తరగబడి రక్తము ప్రవహింపసాగెను. ఇంతలో నాయాశ్వికుడు తనఖడ్గము రాణిగారి యురమునందు గ్రుచ్చెను. పురుషవేషముతో నుండుటవలన నీమె రాణిగారని పగవారికి గుర్తింప రాకున్నను, శత్రుపక్షమునందలి యొకానొక సైన్యాధిపతియగునని వారికి దోచెను. ఈదెబ్బతో రాణిగా రాసన్నస్థితిని బొందెను. కాని యావీరయువతి యట్టి సమయమునందను ధైర్యము విడువక తన నట్టిస్థితికి దెచ్చిన యాశ్వికుని బరలోకమున కనిచెను!
ఇట్లామె వానినిజంపి బొత్తుగా శక్తిహీనమయ్యెను. అంతవర కామెను విడువకున్న రామచంద్రరావు దేశముఖు సగము ముఖము కోయబడిన రాణిగారిని శత్రువులచేత బడకుండ సమీపమునందున్న పర్ణకుటిలోనికి గొని చనెను. ఆయన మిగుల దు:ఖించి రాణిగారికి నుపచారములు చేయుచుండెను. కాని 1858 వ సంవత్సరము జూను నెల 18 వ తేదీని అద్వితీయశౌర్యగుణమండితు రాలగు ఝాశీ మహారాణి లక్ష్మీబాయిగా రీలోకమును విడిచి శాశ్వతసుఖప్రదమగు లోకమున కరిగెను. రామచంద్రరావు దేశముఖుగారును రాణిగారి యాజ్ఞ పూజ్యభావము హెచ్చి యామెపక్షము మాకు భయంకరమయ్యెను"
"గ్వాలేరులో జరిగిన యుద్ధముయొక్క గొప్పపరిణామము ఝాశీరాణీయొక్క మృత్యువు. ఆమె యబల యయినను మాతో దిరుగబడినవారిలో నతిశూరయు నత్యుత్తమ సేనాగ్రణియునై యుండెను."
(2) "ఆయుద్ధమునందు నత్యంత దృడనిశ్చయమును, తేజమును జనానురాగమును గలిగినట్టి సైన్యాధ్యక్షురాలయిన ఝాశీరాణి చంపబడెను." డాక్టరు లో.
(3) "లక్ష్మీబాయి నడి తారుణ్యములో నుండినందున నత్యంత సుందరముగానుండెను. ఆమెమనసు ఉత్సాహపూర్ణముగాను, శరీరము మిక్కిలి సశక్తముగాను నుండెను. ఆమెయందు, ప్రాణముపోయినను చింతలేదు గాని మానహాని సహింపనన్న యభిమానముండెను." మార్టిన్‌దొర.
(4) "ఏ స్త్రీని రాజ్యతంత్రము నడుపుటకు నసమర్ధురాలనియెంచి, మేము రాజ్యభ్రష్టనుగా జేసితిమో యా స్త్రీయే ప్రచండసైన్యముయొక్క యాధిపత్యమును స్వీకరించుటకు సంపూర్ణముగా సమర్థురాలని మాకు నిప్పుడు తెలిసెను." ఎడ్విను ఆర్నోల్డు దొర.
(5) "శత్రువులలో నత్యుత్తమ మనీషి ఝాశీయొక్క మహారాణియే" జస్టిస్ మ్యాకర్తిదొర.
- _______