అబలా సచ్చరిత్ర రత్నమాల/డాక్టర్ ఆనందీబాయి జోశి

వికీసోర్స్ నుండి

డాక్టర్ ఆనందీబాయి జోశి

 
        స్త్రీవిద్యా విజయదుందుభి!!!
గీ. తనసిరే వేల్పు లుదధిరత్నములచేత
   వెరచిరే ఘోర కాకోలవిషముచేత
   విడిచిరే యత్న మమృతంబు వొడము దనుక
   నిశ్చితార్థంబు వదలరు నిపుణమతులు

ఇయ్యుత్తమకాంత క్రీ.శ. 1865 వ సంవత్సరము మార్చినెల 31 వ తేదీన పూనాపట్టణమునందు జన్మించెను. ఈమె తండ్రిపేరు గణపతిరావ్ అమృతేశ్వర్ జోశి. ఈయన పూర్వు లార్జించిన యగ్రహారములోని ధనమువలన జీవింపుచుండెను. వీరి నివాసస్థలము కల్యాణపట్టణము. ఆయన భార్య పూనాకు బుట్టినింటికి నీళ్ళాడబోయెను. కాన ఆనందీబాయి యచటనే జన్మించెను. మన దేశమునందలి యాచారమువలన నాడుబిడ్డ పుట్టుటవలన దలిదండ్రుల కేమి, బంధువుల కేమి మిగుల వ్యసనము కలుగును. అదే ప్రకార మీమె జననీజనకులును విచారపడిరి. అప్పుడీ బిడ్డవలన దామును బ్రసిద్ధుల మగుదమని వారి కేమి తెలియును? దేశాచారప్రకారము పదునొకండు దినములు గడచిన వెనుక పండ్రెండవదినమున బారసాల చేసి పిల్లకు యమున యని నామకరణము చేసిరి. శిశువునకు మూడునెలలు వెళ్లగానే, తల్లి కల్యాణమునకు వెళ్లెను. యమున క్రమక్రమముగా, బాలలీలలను జేయుచు దల్లిదండ్రుల నానందసాగరమున ముంచుచుండెను. ఈమె నాలుగైదు సంవత్సరముల వయసునందుననే మిగుల తెలివిగలదిగానుండెను. అటుపిమ్మట నా చిన్నది యింటిలో నుండిన జెరుపుపనులు చేయునని తల్లి సమీపము నందున్న బాలికాపాఠశాల కామెను బంప దొడగెను. కాని చిన్నతనమువలన నాచిన్నది విద్యాభ్యాసమునందు జిత్తము లేనిదై యుండెను. ఆమెతల్లి బిడ్డలను గొడ్డువలె బాదు మూర్ఖస్త్రీలలోనిది యగుటవలన నామె చిన్నతనమున తల్లి చనువులేక యెప్పుడును శిక్షకు బాత్రురాలగుచుండెను. ఆమె తల్లితల్లియు గణపతిరావుగారి యింటనే ఉండెను. కాన యమున నెవ్వరేమనినను నా ముసలమ్మ వారితో దగవులాడుచుండెను. యమున చిన్నతనమునుండియు నేదోయొక పనిలేక కూర్చుండు స్వభావముగలది గాక, సదా యేదో యొక పనిని చేయుచునే యుండెను. యమున యేడు సంవత్సరములది కాగానే తల్లిదండ్రుల కామె వివాహమును గురించి చింత కలిగెను. వా రనేక స్థలముల వెదకి యనుకూలుడగు వరుని చింతించు నెడ, నొక గృహస్థుడు ఠాణా యను గ్రామమునుండి కల్యాణమునకు వచ్చెను. ఆయనతో గణపతిరావు కొమార్తె వివాహచర్చ తేగా నాయన "ఠాణాలోని పోస్టుమాస్టరుగారి భార్యనివర్తించెను. మీరాయనకడకు వెళ్ళి విచారింపుడ"ని చెప్పెను.

ఆయన చెప్పిననాడు గోపాలవినాయకజోశి సంగమ నేర్‌ఖర్‌గారు. ఈయన తన చిన్నతనములో దన యక్కయు దానును జదువుకొను కాలములో స్త్ర్రీలబుద్ధి పురుషులబుద్ధితో సమానముగా నుండునని తెలిసికొనెను. గోపాలరావుగారికి జిన్నతనముననే ప్రథమ వివాహమాయెను. ఆయన తన భార్యకు విశేషవిద్య గరపి స్త్రీవిద్యవలని లాభములను ప్రపంచమున కగుపరచవలెనని దృడముగా నిశ్చయించుకొనినవాడు. అందువలన నాతడనేక ప్రయత్నములచే దనసతికి విద్య నేర్పదొడగెను. కాని యా చిన్నది యత్త యాడుబిడ్డల కోడంట్రికముచే నలుగుచుండినందున విశేష విద్యాభ్యాసము చేయలేకుండెను. ఇట్లుండగా నా చిన్నదానికి బదుమూడవయేట నొక కొమారుడు కలిగి తల్లిని స్వర్గమునకంపెను. ఆ చిన్నవానిపేరు కృష్ణా. ఆతడిప్పటివరకును సుఖముగానే యున్నాడు. ప్రథమభార్య చనిపోయినపిదప గోపాలరావు మిగుల నుదాసీనుడయి రెండవ వివాహము చేసికొనను అని నిశ్చయించుకొనెను. ప్రథమపత్ని యున్నకాలములోనే యతనికి మొదట పూనాలో పోస్టాఫీసులో నొకచిన్న జీతము గలపని దొరకి పిదప స్వతంత్రముగా ఠాణాలోని పోస్టుమాష్టరుపని దొరకెను. ఆయన తన ప్రథమపత్నికి గలిగిన కోడంట్రికముం గని చిన్నతనముననే వివాహములుచేసి పిల్లల నత్తవారియింటికి బంపు తల్లిదండ్రులను, పరులపిల్లల నతిక్రూరముగా జూచెడి యత్తలను మిగుల దూషింపుచుండెను. ఇవన్నియు విచారించి యాయన ద్వితీయవివాహము జేసికొనుటకు నిష్టము లేనివాడయి యుండెను. కాని గణపతిరావు అయనవద్దకి వచ్చి తన కొమార్తెను చేసికొనవలసినదని యడుగగా నాతడు తానొక స్త్రీని పూర్ణవిద్యావతిని జేసి ప్రపంచమునకు నుదాహరణము చూపదలచినవాడగుటచే, 'నాభార్యకు నే నెట్టి విద్య గరపినను మీ రడ్డుపడకుండెడి యెడల నే వివాహమునకొప్పుకొనెద"ననెను. గణపతిరావు గారందున కొడంబడగా గొన్ని దినములకు వివాహము జరిగెను. దేశాచారప్రకారము వివాహానంతరము యమునాబాయికి 'ఆనందీబాయి' యని యత్తవారు పేరుపెట్టిరి. పెండ్లియైనపిదప గణపతిరావురావుగారి యనుమతిప్రకారము, గోపాలరావు నిత్యము సాయంతనము కళ్యాణపట్టణమునకు వచ్చుచుండెను. ఆనందీబాయి కొంచెము చదువుకున్నదని తెలిసి గోపాలరావు మరాఠిపుస్తకములు కొనితెచ్చి ముత్తవచేత నామె కిప్పించి చదువునట్టు చేయించుచుండెను. రెండవ పెండ్లివాడగుటచే పిల్లదానిని త్వరలో భర్తగారితో మాటలాడ బురికొల్పసాగిరి. కాని ఆనందీబాయి కా కాలములో భర్తయనిన నొక వ్యాఘ్రమువలె దోచుటచే నామె మిగుల భయపడుచుండెను. గోపాలరావామె నెంతమాత్రమును భయపెట్టక బుజ్జగించియే చదువు మొదలయినవి చెప్పుచుండెను.

గోపాలరావు ఆనందీబాయికి విద్య నేర్పుట ఆయన మామగారి కెంతమాత్రమును సమాధానము లేదు. ఆయన తానందు కొడంబడినవాడగుటవలన నల్లునితో వేమియు ననజాలక యితరులచే స్త్రీవిద్యవలనంగలుగు నష్టములు చెప్పించి మాన్పజూచెను. కాని గోపాలరావు వారికి దన ప్రత్యుత్తరము చెప్పి పంపెను. మామగారి యూరికి సమీపమునందుండిన యెడల భార్యవిద్య సాగదని గోపాలరావు అల్లీ బాగను గ్రామమునకు మార్చుకొనెను. అచటికి ఆనందీబాయితోడ నామె ముత్తువ పోయియుండెను. కాన పిల్ల కేవిధమయిన భయము లేక యుండెను.

అటుపిమ్మట గోపాలరావామెకు విద్యవలన లాభముల నెరింగింపగా నామె మిగుల శ్రద్ధతో ప్రతిదినము తప్పక పాఠములు చదువుచుండెను. ఆమె చురుకుదనమును జూచిన కొలదిని గోపాలరావునకు మరింత యుత్సాహము కలిగి యాతడామెతో ననేకసంగతులను ముచ్చటింపుచుండెను. అందు వలననే ఆనందీబాయికి త్వరగా విద్యాసక్తి గలిగెను. పెండ్లియైన పిదప రెండు సంవత్సరములలో ఆనందీబాయికి మహారాష్ట్రభాష చక్కగా జదువుటకును, వ్రాయుటకును వచ్చెను. అంతలో నామె కా భాషయందలి వ్యాకరణము, భూగోళము, ప్రకృతిశాస్త్రము, గణితశాస్త్రము మొదలయినవి గోపాలరావుగారు చక్కగా నేర్పిరి. అల్లీ బాగునందుండు కాలముననే ఆనందీబాయి ఋతుమతియైనందున భార్యాభర్తల నొకటి చేసిరి. వెంటనే యానందీబాయి గర్భవతియైనందున నామె కళ్యాణమునకు బోయెను. అచట నామెకు కొమారుడుగలిగి పదియవదినంబుననే చనిపోయెను. కాన ఆనందీబాయికి జిన్నతనముననే పుత్రదు:ఖము గలిగెను. అందువలన గొన్ని దినముల వరకును ఆమె విద్యాభ్యాసమునకు భంగము గలిగెను. కాని యటుపిమ్మట మరల నామెచదువు చక్కగా సాగుచుండెను. కొన్ని దినములలో నామెకు దన మనోగతమును బాగుగావ్రాసి తెలుపునంతటి ప్రజ్ఞ గలిగెను. అల్లీ బాగులోని లోకు లానందీబాయికి వచ్చిన విద్యనుగని యోర్వలేక గోపాలరావు ననేక కష్టముల పెట్టుచుండిరి. కాన నచటనుండుట కిష్టములేక, కోలాపురమునందు స్త్రీవిద్య కనుకూలు రగువా రున్నందున బహుప్రత్నముతో గోపాలరావుగారచటికి మార్చుకొనిరి. కోలాపురములో బాలికాపాఠశాల వీరింటికి దూరమగుటచే ఆనందీబాయిని నొక్కర్తనంతదూరము కాలినడకతో బంప వీలులేక యుండెను. పాఠశాలలో నుపాధ్యాయినిగా నుండిన మిస్ మాయసీగారి యిల్లు వీరియింటికి సమీపమునందుండెను. ఆమె బహుమంచిదని విని గోపాలరావుగా రామెతోడ మాటాడ నరిగెను. ఆయన ప్రసంగవశమున "నా భార్యను మీబండిలో గూర్చుండబెట్టుకొని వెళ్లెదరా" యని యడుగగా నామె కొంత యోచించి మంచి దనియెను. అందుపై ఆనందీబాయి కొన్నిదినము లచటి పాఠశాల కరుగుచుండెను. కాని యటుపిమ్మట మాయసీ తన బండిలో స్థలమియ్యనందున నామె పాఠశాల కరుగుట మానుకొనవలసిన దాయెను.

కోలాపురమున నీదంపతులు పాద్రీల (క్రైస్తవధర్మ గురువుల) యిండ్లకగుచుండిరి. పాద్రీ యాడువారు ఆనందీబాయికి నింగ్లీషు రెండు మూడుపుస్తకములవరకును నేర్పిరి. ఆనందీబాయి యల్పవయస్కురాలయినను వారు చేయు మతబోధను గ్రహింపక కేవల నీతివాక్యములనే గ్రహింపుచుండెను. వీరివలననే యీదంపతుల కమేరికాలోని సంగతు లనేకములు తెలిసెను. కాన నమేరికాలోని కరిగి విద్యనభ్యసింపవలయునని ఆనందీబాయి కప్పటినుండి యిచ్చగలిగెను. 1879 వ సంవత్సర ప్ర్రారంభమున గోపాలరావుగారిని బొంబాయికి మార్చిరి. అచట నుండుకాలములో ఆనందీబాయి కొంతవర కింగ్లీషును, సంస్కృతమును నేర్చుకొనెను. కాని యచటను లోకులామె విద్యాభ్యాసమున కనేక విఘ్నములు తెచ్చుచుండిరి. ఇట్లుండగా 1880 వ సంవత్సరము నచటనుండి భూజయనుగ్రామమునకు మార్చినందున, నాదంపతు లచటి కరిగిరి. బొంబాయినుండి భూజకు బోవునపుడు ఆనందీబాయి ముత్తవ యామెతోడ రానందున నింటిపని యంతయు నామెయే చేయవలసి యుండెను. ఇంటిపనినంతను చేసి యానందీబాయి భర్తకడ నింగ్లీషు మాటాడుట చక్కగా నేర్చుకొనెను.

గోపాలరావుగారికి భార్యను విశేష విద్యావతిని జేయవలెనని యుండుట నొక వార్తాపత్రికలోన జదివి ఆమేరికాలోని న్యూయార్కు పట్టణవాసినియగు మిసెస్ బీ.ఎఫ్.కార్పెంటర్ అను నామె ఆనందీబాయికి సహాయము చేయదలచి యామె కొకఉత్తరమువ్రాసెను. ఈమెయే ఆనందీబాయి కనేక విధముల సహాయముచేసి యామెను కూతిరివలె జూచుచుండెను. కాన ఆనందీబాయియు నీమెయం దధికప్రేమ గలది యయి ఈమెను పిన్ని యని పిలుచుచుండెను. ఈమెకు ఆనందీబాయి వ్రాసిన యుత్తరముల వలన మనదేశమునందలి స్త్రీలకు గల పరతంత్రతయు, దానిని వదలించుటకై ఆనందీబాయికి గల యభిప్రాయములు దెలియుచున్నవి. స్త్రీలకు విశేష విద్యగరపినంగాని స్వహితము తెలియదని యామె మతము. ఇదియంతయు నామె స్వానుభవము వలననే తెలిసికొనెను. ఇట్లుత్తర ప్రత్యుత్తరముల వలన నా యిరువురకును సఖ్యమధిక మయ్యెను.

తదనంతరము గోపాలరావుగారిని కలకత్తాకు మార్చిరి. అచ్చట నుండుకాలములో పోస్టుఆఫీసులో 30 రూపాయల వేతనముగల యుద్యోగము ఆనందీబాయికొరకు సిద్ధమయ్యెను. కాని యుద్యోగములో బ్రవేశించి స్వతంత్రతను పోగొట్టుకొనుట కిష్టములేక, యామె దానిని స్వీకరించకుండెను. తదనంతర యామెకు నమెరికాలో వైద్యవిద్య నభ్యసించుకోరిక యధిగమయ్యెను.

కలకత్తానుండి శ్రీరామపురమను స్థలమునకు మార్చినందున నాదంపతు లచటి కరిగిరి. అచటి కరిగినపిదప గొన్ని దినములు సెలవు తీసికొని వారు సమీపమునందుగల జయపూర్, ఆగ్రా, గ్వాలేర్, లఖనౌ, కాన్‌పూర్, డిల్లీ, ప్రయాగ, కాశీ మొదలగు ప్రసిద్ధి పట్టణములను జూడ నరిగిరి. అందువలన ఆనందీబాయికి గొంతవరకు ప్రవాసస్థితి తెలిసెను. వారు మరలి శ్రీరామపురమునకు వచ్చిన కొద్దిదినములలోనే రెండు సంవత్సరముల సెలవుతీసుకొని అమెరికాదేశమున కరుగ నిశ్చయించిరి. కాని యింతలో నీకు సెలవియ్యజాలమని పైనుండి యుత్తరవు వచ్చెను. అందువలన ఆనందీబాయి నొకర్తనే యమెరికాకు బంపదలచి గోపాలరావుగారామెతో నొకదిన మిట్లు ప్రసంగించిరి:-

గోపాలరావు:- (చింతతో) నీవు ఒంటరిగానే అమెరికాకు వెళ్ళరాదా? నా కిప్పుడు సెలవు దొరకదు. నీకిచటనుండిన విద్యాభ్యాసము కానేరదు. కాన నొంటరిగానైన నరుగుట యావశ్యకము. మన మిరువురము కలసి వెళ్ళవలెననినచో నింకను రెండుసంవత్సరముల వ్యవధి గలదు. ఇంతలో నీచదువచట జాలవరకగును.

ఆనందీబాయి:-(ఏమియు ననక భర్తవంకజూచి మీరేమనెదరని యడిగినటుల నగుపడెను; దానింగని,)

గోపాలరావు:- నేటివరకును బ్రాహ్మణ స్త్రీ పరదేశమునకరిగి విద్యనభ్యసించిన యుదహరణ మెందును గానరాదు. కాన నీవు వెళ్ళి విద్యనభ్యసించి యుదాహరణీయవగుము. స్త్రీలు సామర్ధ్యహీన లన్నవాక్యమును నీవబద్ధము చేయుము. మన నడవడిని విడువక అమెరికావారికి మన నడవడిని నేర్పుము. ప్రస్తుతము సంస్కరణము కావలయు ననువారు పెక్కండ్రు పురుషులు కలరు. కాని వారిచేత గొంచమైనను సంస్కరణమగుట లేదు. నీవు స్త్రీవై కొంచెము సంస్కరణము చేసి చూపి నను మిగుల నుపయోగ కరముగా నుండును.

అందు కానందీబాయి సమ్మతించి యెంతదూరదేశ ప్రయాణమునగు సాహసించెను! ఆమె తన కెట్టి కష్టములు వచ్చినను వెనుకదీయక స్వదేశ సోదరీమణుల కొక యుదహరణముచూపి వారికి మేలుచేయ దలచెను!!

ఇట్లూ వారు కృతనిశ్చయులయి ఆనందీబాయికొర కమేరికాలో ననుకూలమగు బట్టలను కుట్టించి, సిద్ధపరుచుచుండిరి. ఆనందీబాయి పరదేశపువస్త్రములు ధరియింపనని నిశ్చయించుకొని మనదేశమునందలి ముతక బనాతుగుడ్డలతోనే దుస్తులను కుట్టించుకొనెను. ఇట్టిదిగదా స్వదేశాభిమానము!ఈమె ఆమేరికా కరుగునని విని యనేకు లనేకాక్షేపణలు చేసిరి. కాన వారి కందరకును సమాధానకరముగా ఆనందీబాయి యొక పాఠశాలా మందిరమున సభచేసి గంటసేపు హూణభాషయందు నస్ఖలితముగా నుపన్యసించెను. అందువలననే యామెకు నింగ్లీషునందు గల ప్రజ్ఞయు, నామెయొక్కయప్రతిమ వక్తృత్వశక్తియువెల్లడియగుచున్నవి. ఆయుపన్యాస మత్యంత శ్రవణీయము. కాన జనానాపత్రికోక్తముగా నిచ్చట నుదాహరించుచున్నాను.

"నా యమేరికాదేశయాత్రను గురించి వందలకొలది ప్రశ్నలు నన్ననేకు లడుగుచున్నారు. కావున నే నిప్పుడు అవకాశము గలుగజేసికొని వానిలో గొన్నిటికి బ్రత్యుత్తరములం జెప్ప దలంచితిని అవి యెవ్వనగా:-

1. నేనమేరికాదేశ మేల వెళ్ళవలెను ?

2. హిందూదేశమునందు గృషిచేయుటకు నాకు సాధనములు లేవా ?

3. నేనొంటిరిగా నేల వెళ్ళవలెను ?

4. నేనీ దేశమునకు తిరిగివచ్చినప్పుడు జాతిలోని వారినుండి బహిష్కారము గలుగదా ?

5. ఏదేని యాపద సంభవించిన యెడల నేనేమి చేయ వలెను ?

6. స్త్రీలలో నెవరునుజేయని పనిని నేనెందులకు జేయవలెను ? అనునవి. 1. మొదటిప్రశ్నకుత్తరము:- నేను వైద్యమునేర్చుకొన దలచి యమేరికాదేశమునకు వెళ్ల నిశ్చయించితిని. ఈ హిందూదేశమునందు స్త్రీలకు జికిత్స జేయదగిన సాధనకలాపము లేని కారణమువలన గలిగెడి బాధలను ఇప్పు డిక్కడకు దయచేసిన నారీమణులు బాగుగా దెలిసికొని యున్నారు. ప్రకృతిశాస్త్రములను, స్త్రీవిద్యను, నెలయింపజేయ నీ దేశమున వెలయుచున్న సమాజము లెవ్వియు మనదేశపు యువతుల నేరినిగాని, నాగరికతచే బ్రతిష్ఠం గాంచిన ఖండాంతరముల కంపించి వైద్యశాస్త్రప్రవీణలను గావించి, వారిచే నిచ్చటం బ్రమదల కా వైద్యశాస్త్రమును గరపు కళాశాలలను స్థాపింప దలంపమికి నే నత్యద్భుతము నొందుచున్నదానను. తనకుగల లోపముల నెల్ల వెల్లడి సేయక తన్నివారణార్థమై యర్థింపక యుపేక్షించుచు నిందాస్పదమైనదేశము, ఈ హిందూదేశమున కంటె మరియొక్కటి యేదియు లేదు. ఈ హిందూదేశమంతట స్త్రీవైద్యులు లేని లోపము కష్టముగనున్నది. యూరపుదేశపు నారులును, హిందూసుందరులును, అవసరము తటస్థించినప్పుడు పరపురుషులకు తమదేహస్థితిని వివరించి వారిచే జికిత్స జేయించుకొనుటకు సహజముగా నిష్టపడక యున్నారు. యూరపు, అమెరికాదేశములనుండి యిక్కడకు కొందరు స్త్రీవైద్యులు వచ్చుచున్నారు. గాని, వారిభాషయు, నాచారమర్యాదలును, గ్రొత్తలగుటచే, వారు మనస్త్రీలకంతగా, నుపయోగపడక యున్నారు. తమ దేశమందును దమవారయెడలను నైసర్గిక మయిన ప్రేమగల హిందూసుందరులు పరదేశ యువతులతో గలసి మెలగలేరు. కావున వారివలన నే సహాయలాభమును బడయజాలకయున్నారు. ఈ హిందూదేశమున, స్వదేశ స్త్రీవైద్యుల అక్కర మిక్కిలిగా నున్నట్టు నాకు దోచుచున్నది.

2. ఇక నీ హిందూదేశమునం దందులకు తగిన సాధనములు లేవా యను రెండవ ప్రశ్నమున కుత్తరము:- లేవని నిష్కర్షగా మనవిచేయుచున్నాను. కానివున్న సాధనములు సులభసాద్యములు గావని నా యభిప్రాయము. చెన్నపురి యందు నొక సర్వకళాశాలయు నన్ని రాజధానులలోను మంత్రసానితనము నేర్పు తరగతులును నుండుట సత్యమే. అయిన నందలి బోధకులు ప్రాచీనాచారప్రవిస్టు లగుటచేతను, కొంతవర కసహిస్ణులగుటవలనను అచ్చట నొసంగబడుచున్న విద్య యసంపూర్ణ మయినదిగాను లోపములతో గూడినదిగాను నున్నది. ఇట్లనుటనే నా బోధకుల తప్పుల నెంచుటకు గాదు సుడీ. అది పురుషుల స్వభావమని మనవిచేసితిని. వీరికి మారుగా నాస్థానములను స్త్రీలలంకరించువరకిట్టి యిబ్బందులకు మన మోర్చుకోవలసి యున్నది.

నేను క్రైస్తవురాలనుగాను: బ్రాహ్మమతావలంబినిని గాను కాబట్టి హిందూ మతాభిమానము గలిగి తద్ధర్మముల ననుష్టింపుచు నీదేశమున నెందయినను పాఠశాలకు బోయి విద్యగరచుట నాబోటి బోటికి దుష్కరము. ఇంగ్లీషువారి యుడుపుల దొడిగికొని నడయాడు మతాంతరులయినను ఇచటి ప్రజలు నన్ను జూచినట్టూరక యెగదిగ జూడరు. నగరులలోను, వెలుపలను, నావంటి హిందూయువతులకు గలుగుచున్న దురా క్షేపణలు, దుర్వదంతులు స్వదేశీయులైన క్రైస్తవ స్త్రీలకు లేశమును గలుగుట లేదు. పొగబండిలోగాని, వీధుల వెంటగాని నే నొంటరిగా బోవునపుడెల్ల ప్రజలు కొందరు నన్ను జేరి నా మొగమువంక నట్టే చూచుచు కొంటెప్రశ్నలచే నన్నలయింపు చుందురు. ఈ పొడిమాటలకంటె కొన్ని యుదాహరణముల వలన నిజము మీ మనసులకు నాటజెప్పెదను చిత్తగింపుడు.

కొన్ని సంవత్సరముల క్రిందట నేను బొంబాయి నగరమున నుండగా పాఠశాలకు బోవుచుంటిని. చేత పుస్తకములం బట్టుకొని నేను బడికి బోవుచుండునపుడు కొందరు కిటికీలగుండ నన్ను చూచువారును, మరికొందరు బండ్లెక్కి పోవుచు నన్ను జూచువారును, వీధులలో ద్రిమ్మరుచుండు నిక కొందరు పెద్దపెట్టున నవ్వుచు "ఇదేమి వింత! కాళ్ళకు మేశోళ్ళను బూట్సులను దొడిగికొని పాఠశాల కేగు నీ గరిత యెవ్వతె! ఇందు మూలమున కలి యప్పుడే ప్రజలమనసుల నావహించినజాడలు బొడగట్టుచున్నవిగదా!" యని నాకు వినబడునట్టుగా కోలాహలముగా బలుకువారుగ నుండిరి.

ఓమానినీమణులారా! అట్టిప్రశ్నలను మిమ్మడిగినప్పుడు మీ మనసెట్టి సంతాపమును బొందెడినో మీరే సులభముగా నూహించి తెలిసికొనగలరు.

ఒకప్పుడు నేను కొంతకాలము పాఠశాలలో నుండవలసివచ్చి భోజనము నిమిత్తము దినమునకు రెండు సారులు బంధువుల యింటికి బోవలసి వచ్చెను. నేనపు డట్లు పోవుచు వచ్చుచున్నప్పుడెల్ల వీధి వెంట నేగువారు నా చుట్టును జేరి కొంద రెగతాళిజేయ నారంభించిరి. కొందరు కడుపుబ్బ నవ్వజొచ్చిరి. తక్కిన గృహస్థులు డాంబికముగా తమతమ పంచలలో గూర్చుండి నన్ను గని వికృతాలాపము లాడుచు నాపైని రాళ్ళు రువ్వుట కెంతయు లజ్జింపరైరి. ఇక నంగడివాండ్రు బేర గాండ్రన్ననో నన్ను వెక్కిరింపుచు నసహ్యకరమైన సైగలంజేయసాగిరి. అట్టి సమయములో నాస్థితి యెట్లుండెనో శీఘ్రమే యిల్లు చేరుకొనుటకు నా మనసెట్లు త్వరపెట్టెనో దాని నూహించి మీరే తెలిసికొనుడు.

బొంబాయినగర వాస్తవ్యులతీరిట్లుండగా, బంగాళావారి రీతి యిక జెప్పుటకే శక్యముగాకున్నది. ఇది యెల్ల కడు శోచనీయము. గాలిపట్టుల కెప్పుడయిన నేను వ్యాయామము కొరకు పోయినప్పుడు ఇంగ్ల్లీషువారయిన నన్నెప్పుడు కన్నెత్తి యంత నిబ్బరముగా జూడరయిరి. కాని బంగాళావారు తమ దంభమునంతను వెల్లడిచేసి హాస్యాస్పదము గావించుకొన నన్ను గని, "నీ వెవతెవు? నీ పేరేమి? నీస్థల మేమి? నీ వెందుల కేగెదవు?" అని యపరిచితు లడుగ గూడని ప్రశ్నల నడిగి యాగడ మొనర్చిరి. శ్రీరామపురములో విద్యావంతులని యెన్నిక గన్న కొందరు స్వదేశ క్రైస్తవులు నేను వివాహితనో, వితంతువునో దుర్వర్తన గలదాననో, కులభ్రష్టనో యని శంకింపుచుండిరి. ప్రియులయిన యో సభాజనులారా! యిట్టి యవినయప్రచారములు స్వదేశ క్రైస్తవులు చేయగూడునా? ఎంతమాత్రము చేయగూడదు. వీనిని మీకిట్లు విన్నవించుట మీరిట్టి లోపములను సవరణ చేయ దివియెదరనియు, మీలోని కష్టముల నెన్న డెరుగనివారు వీనినెల్ల వినినపిమ్మట నమెరికాదేశమునకు నేనుపోవ యత్నించుట కేవలము వేడుకకై గాదని యెంచెదరనియే కాని మరియొక తలపున గాదు.

3. నేనొంటరిగా నేల విదేశమునకు బోవలెనను మూడవ ప్రశ్నకుత్తరమేమనగా:- తొలుత నేను, నా పెనిమిటియును గలసి వెళ్ళుటకే యుద్దేశించితిమి. కాని స్థితిగతులనుబట్టి యాతలంపు మానుకొనవలసివచ్చెను. మాయొద్ద ధనమా చాలినంత లేదు. ఋణమా చేయుటకు మా కిష్టము లేదు. ఈ హేతు వొక్కటియెకాక, యింతకంటె ముఖ్యములయినవి యందరి నొప్పింప దగినవి మరికొన్ని గలవు. అవి యేమనగా నాభర్తగారికి వయోవృద్ధయగు జననియు, పసివాండ్రుగా నున్న తోబుట్టులును, తమ్ములును గలరు. వారందరికి సంరక్షకుడు నాభర్తగారే యగుటచేత నాయన నాతో గూడ వచ్చిరేని వారు దిక్కుమాలిన వారలయి, వారి బ్రతుకు భగ్నమయి, వారు తీరని దారిద్ర్యబాధలకు లోనగుదురు. నా యొక్కతకొరకు పెక్కండ్రను మలమలమాడునట్లుజేయుట ఎంత యమానుషకృత్యము! కాబట్టి నే నొంటరిగా నేగ నిశ్చయించితిని.

4. నే నిండియాకు (హిందూదేశమునకు) మరల వచ్చినప్పుడు నాకు బహిష్కారము గలుగక యుండునా యనుదానికి సమాధానము:- అట్టి భయమువలన నేను చలించెదనని తలంతురా? నేనందుకు నావంతయినను వెరవను. ఇక్కడ నే విధముగా నుంటినో, యక్కడగూడ నాతీరుననే యుండ నిశ్చయించుకొని యుండగా నాకు బహిష్కార మేల కలుగును? నా యాచార వ్యవహారముల యందుగాని, ఆహార విహారములలోగాని, వేష భాషలయందుగాని మార్పుగావింప నేనెంతయు దలంపలేదు. హిందూయువతిగనే పోయి, మరల హిందూ మానవతిగనే వచ్చి, యిక్కడ హిందూ సుందరులతోనే గలసి యుండ నిశ్చయించితిని. ఇప్పు డున్నదానికంటె భిన్నముగా నుండక నా పూర్వులెట్లు సామాన్యముగ జీవించిరో నేనునట్లే యుండగలదానను. ఇప్పగిది నేను బ్రవర్తించునప్పుడు అస్మద్దేశీయులు నన్ను బహిష్కరింప జూతురేని, యప్పుడేల? ఆపని యిప్పుడేచేయరాదా? అందుకు వారికి సర్వస్వాతంత్ర్యము గలిగియే యూన్నది. మా మహారాష్ట్రకుటుంబ మొక్కటియై నను లేని యీ బంగాళాదేశమందలి యీ స్థలమున నేనిప్పుడు వాసము చేయుచుంటిని గదా! నేనియ్యెడ నా దేశాచారధర్మముల ననుష్ఠించి ప్రవర్తింపుచుంటినో లేదో యెవ్వరెరుగుదురు? కాబట్టి యెన్నడును సంబవింపగూడనట్టియు, సంభవించినప్పుడు మానుషప్రయత్నములకు లోబడనట్టియు వానిని గురించి చింతింపక యుండుటయే యుత్తమము.

5. నా కేది యయిన నిక్కట్టు తటస్థించిన నే నేమి చేయుదుననెడి ప్రశ్నకు సదుత్తర మేమన్న:- కొందరు మనుష్యులు ప్రపంచములో గనబడుదానికంటె నతి భయంకరముగా గ్రంథములలో గనబడు దురవస్థలను, దుర్దశలను నుదాహరణముగా జూపి భయము నతిశయింపజేయ బ్రయత్నింతురు. కాని యా యాపదలెంత భయంకరములో యంత యరుదుగా సంభవించునట్టుగ విధింపబడియున్నవి. పురుషులుగాని, స్త్రీలు గాని యెద్దియేని యొక కార్యము చేయబూనినప్పుడు తొలుత మేలెంచెదరుగాని కీడెప్పుడు నెంచరు. ఒకానొకప్పుడు తప్పక కీడులు మూడి మగవారినిగాని, యాడువారినిగాని భూమిలోని కడగ ద్రొక్కినయెడల నింకప్పుడు వృధా చర్చలతో బనియేమి? అవి వచ్చినప్పు డనుభవించి తీరవలసినదే కాని యా యాపదులు రాబోవు నన్నప్పుడుండెడి బాధకంటె వాని ననుభవించునపుడుండెడిబాధ యల్పమనుట జగద్విదితమే. ఏవిధమున నయినను ఈ లోకమున శాశ్వతమయిన సుఖమును బడయగలమా యనుశంకను నివృత్తి చేసుకొనుట కీ ప్రపంచము మన కవకాశ మెన్నడును గలుగజేయనేరదు. కాని పయికగుపడుచున్న సాధనముల యంతరములను దగిన సౌఖ్యమును మనుజు లెల్లప్పుడును బొందుచుండుట లేదని మాత్రము మనము చెప్పవచ్చును. ఆ సౌఖ్యమనునది కొందరు చేరి తమలోతాము విభాగించుకొన దగిన పదార్థముగాను, అది మన మనసునుబట్టి యుండును. దురవస్థలలో కెల్ల మరణమే గొప్పదని యెంచెదమంటిమా కొందరు దాని రాక కేల సంతోషింతురు? మరికొంద రేల దు:ఖింతురు? వేయేల? మృత్యువును దుర్దశయును, మంచివారికిని, చెడ్డవారికిని, పుణ్యాత్ములకును, పాపాత్ములకును, భాగ్యవంతులకును దరిద్రులకును, దేశదిమ్మరులకును గృహస్తులకును సమానముగనే వచ్చుచుండును. ఆపత్ క్షామమున నందరు వివశులగుటయు, కక్ష్యావేశముచే నెవ్వరు ప్రతిభావంతులు గాకుండుటయును సుప్రసిద్ధమే. రానున్న విపత్తు నెంతటి మనుజుడైన నడ్డగింపలేడు. ఆపదయును, నెల్ల ప్పుడు మనల ననుసరించియే యున్నది. కాబట్టి వాని రాకకు ప్రతి మనుష్యుడును నిరీక్షించియే యున్నాడు. ఏదియయిన నొక యుత్కృష్టమైన పనియొక్క ఫలిత మనుకూలముగా నుండెనా, దానిని పూనికతో నెరవేర్చినవారి పరిశ్రమమును ఘనముగా ప్రశంసింతుము. లేక యది ప్రతికూలముగా పరిసమాప్తి నొందెనా తత్కార్యవాహుల యవజ్ఞతను నిందింతుము. ఈ తీరుననే యదృష్టము మారి, ఫలము విఫలమైనచో లోకమది యవివేకమని చాటుటకు సిద్ధమయి యుండును.

ఇంకకొందరు కూపస్థమండూకములవలెనింటి నంటిపెట్టు కొనువారే సుఖభోగు లందురు. కాని, వారికి సుఖభోగమేలాగున గలుగునో తెలియదు. అది కోరినప్పు డనుభవింప దగినట్టు సిద్ధముగా నమర్చబడియున్న పదార్థము కాదుగదా? కొందరికి నూతనప్రియత్వ మెంత యధికముగా నుండుననగా సౌఖ్యమయినను నెడతెగనిదిగా నుండిన దానియందు రుచిలేదని వారప్పుడప్పుడు కష్టములను గోరుచుందురు. విదేశమున కేగుట చెడుపనిగాదు. కొన్ని యంశములనుబట్టి యొక్కచో నివసించియున్న దానికంటె మేలయిన పనియని చెప్పవచ్చును. దేశాటనమున నాయాదేశములయొక్కయు, ప్రజలయొక్కయు స్థితిగ్తులు బాగుగ మనసున బట్టగలవు. అట్టివాని దెలిసికొనుటయందు విముఖులమయి యుండగూడదు. అవజ్ఞతను మనము బుద్ధిపూర్వకముగా నవలంబించుట యనునది గొప్పదోషములలో నొకటి. విదేశయాత్రలం గావించుటచే మనకు బుద్ధివికాసము, జ్ఞానాభివృద్ధియు నగుటయేకాక యంతరించిన కళాకౌశలములు జీవించుటయు గలుగును. ఎల్లవారును యుక్తమయిన దానిని జేయవలసినదే. ప్రతి మనుష్యుడును తన సహజీవులకు జేతనయినంత యుపకారముజేయ బద్దుడయి యున్నాడు. నరులయి పుట్టినవారెల్ల నితరులవలన దమకు గలిగిన యుపకారమునకు బ్రత్యుపకారముచేసి ఋణవిముక్తతను బొందవలసినది. పరసీమలో మనకు దిక్కెవ్వరని యడిగెదరా? ఏతద్విషయమయి గోల్డుస్మిత్తను ఇంగ్లీషుకవి చేసిన మహోపదేశమును మనము గమనింతము. అది యెద్దియనగా "అంధుల బుద్ధువిశేషము ననుసరింప నేర్చుకొనుము. ఏల యనగా వారెన్నడు తమచేతి యూతకోలతో భూమిని దడవి తెలిసికొనకుండ నడుగుపెట్టరు." ఆ తీరుననే నేను సర్వశక్తి సంపన్నుడయిన నా పరమపితను నాకూతకోలగా జేసికొని యెదను. ఆయనయే నా మార్గమును బరిశీలించి నన్ను ముందునకు నడిపించుకొనిపోవును. దానికంటెను మహోత్తరమయిన చేతియూత నాకన్య మేమియు గనబడదు.

కొట్టకొనకు నాజాతివా రెవ్వరును జేయనిపని నేనేల చేయవలెను? అనుదానికి నే విన్నవించున దేమనగా మన మొక్కరొక్కరము సంఘమునకు జెల్లింపవలసిన ఋణములు పెక్కులుగలవు. వీరీపని చేసిన ఋణవిముక్తత కలుగునని వేర్వేరుగ వక్కాణించుట దుస్తరము. ఒక్క కార్యముచే నొక్కరి కెప్పుడు మేలుగలుగగలదో యందువలన నందరికి మేలు కలుగుననియే యెంచవలసినది. సర్వత్రజనులందరికి శ్రేయస్కరమని చెప్పదగిన పనిని జేయుటకు మనలో నెల్ల వారును ప్రయత్నపడవలసినది. మనుస్మృతియందు "చేయదగిన ధర్మమును జేయక యుపేక్షించువారు క్షమియింపబడ గూడని మహాపాతకులు" అని చెప్పబడియున్నది. కావున నాతోడి స్త్రీలెవ్వరును నిదివరకు చేయనిపని నేనును జేయ గూడదనుట యాశ్చర్య జనకముగానున్నది. మృతజీవులని ప్రసిద్ధిగాంచిన మన పూర్వులకిట్టి యూహ లెన్నడును బుట్టి యుండలేదు. ఏదీ నా క్రైస్తవమిత్రులు నేనడుగబోవు నీక్రింది ప్రశ్నమున కేమి యుత్తరమునిత్తురో చూచెదము. ఓ నెచ్చలు లారా! మా మతధర్మములనుబట్టి యేసుక్రీస్తు మీ యందరి కొరకు తమప్రాణమును బలి యొసంగక యుండిన మీకు పాపవిమోచనము గలుగునని తలంతురా! ఆయన యట్లు లోకోపకారమును జేయుచుండగా వారికి గలిగిన ఘోరమయిన దండనమున కేమయిన నామహానుభావుడు జంకెనా? లేదు. ఆయన జంకినట్టు మీరెప్పుడొప్పు కొనునట్టివారుకారని నిశ్చయముగా నేను జెప్పగలను. మాపూర్వపు రాజులలోనుగూడ శిబిమయూరధ్వజుడు మొదలగువారు పరోపకారార్థమయి ప్రాణత్యాగము చేయ వెరవరయిరి. మనకు విఘ్నమే కలుగునో, యాపదలే సంభవించునో యని చేయవలసిన ధర్మమును జేయకపోవుట న్యాయముకాదు. మనము చేయవలసినంత ప్రయత్నము చేసి తీరవలయును. మన కటుపిమ్మట జయమయినను సరే, యపజయ మయిననుసరే. మనుజులను మూడు తరగతుల వారినిగా విభజించెను. అందు అధములు విఘ్నములు గలుగుననెడి భయమువలన నేపనినిగాని పూనుకొననివారు. మధ్యములు తా మారంభించిన పనికి నడుమ నంతరాయము సంభవించిన తోడనే యా పనిని విసర్జించువారు, ఉత్తములు ప్రారంభించిన దాని కెన్ని యడ్డములు వచ్చినను, వానినెల్ల బూనికతో నిదానించి విజయము గాంచువారు.

కష్టము లెంత యుత్కృష్టములుగా నుండునో మనకు ధైర్య, స్థైర్యము లంత యధికముగా నుండును. కాబట్టి మన మారంభించినదాని నెన్నడును మానజనదు. ఇక నా విన్నపము ముగిసినది. ఇంతసేపు ప్రసంగించుటవలన మిమ్ము విసిగించితి నేమోయని భయపడుచున్నదానను. అందులకు నన్ను మీరు క్షమింతురుగావుత."

ఈ ఉపన్యాస మిచ్చినపిదప ఆనందీబాయి యొక క్రైస్తవగురువుల కుటుంబముతో అమెరికా కరుగ నిశ్చయించెను. ఒకానొక హిందూ బ్రాహ్మణస్త్రీ అమెరికా కరుగునని విని రావ్‌సాహెబుదాంగేకర్ అను నాతనికి మిగుల విచారము కలిగెను. అంత నాతడనేక ప్రయత్నములచే నామె యమెరికాప్రయాణ మాపవలెనని యత్నించి చూచెను. కాని యాతని ప్రయత్నమువలన నేమియు ఫలము కానరాకుండెను. అంత నా పూర్వాచారపరాయణుడు ఆనందీబాయి యాప్తులకు వ్రాసి వారిచే నమెరికాకు బోవలదని యానందీబాయికి ననేకములయిన యుత్తరములను వ్రాయించెను. కాని వానివలనను ఆమె ప్రయాణమాగదయ్యెను! రేపు ప్రయాణమనగా ఆనందీబాయి యక్కవద్దనుండి తమ్మునికి ప్రాణాంతముగా నున్నదనియు, నీవు తక్షణము బయలుదేరి రావలసిన దనియు నుత్తరమువచ్చెను. దానింగని ఆనందీబాయి కొంచెమాలోచింపగా నాయుత్తరము నీ ప్రయాణము నాపుటకే వ్రాసిరనియు నీ తమ్మునికి నిజముగ ప్రాణాంతముగ నుండిన నీవుపోయి చూచునంతకు నుండడనియు, ఇందువలన నీవు చేయబోవు మహాకార్యమును మానుట మంచిదికాదనియు నామె మనోదేవత యామెకు జెప్పి యామె నిశ్చయము దొలగకుండ జేసెను. ఆహా! దృడనిశ్చయమన నిట్టిదిగదా? చిన్నచిన్న సంకటములు ప్రాప్తించినను భయపడి మనవార లంగీకృతకార్యమును పరిత్యజింతురు. కాని యట్టివారు ఆనందీబాయి చరిత్ర జదివి దృడనిశ్చయమను సద్గుణమును నేర్చు కొనియెదరుగాక.

అంత 1883 వ సంవత్సరము ఏప్రియల్ 7 వ తేదీని ఆనందీబాయి కలకత్తా నగరమునుండి పాతాళలోకమున కరుగ బొగయోడ నెక్కెను. అప్పుడు ఆ దంపతుల కిరువురకును గలిగిన వియోగదు:ఖ మిట్టిదని చెప్ప నెవ్వరితరము? అయినను వారు తమ సుఖములను విడిచి స్వదేశ హితమునకై కష్టముల ననుభవించిరి. వారి స్వదేశభక్తి నెంత పొగడినను తీరదు. త్రోవలో సహవాసముగా నుండిన క్రైస్తవస్త్రీ లామెను తమ మతమునకు ద్రిప్పవలయునని విశేషముగా బోధించిరి. కాని దృడనిశ్చయురాలయిన యాయబల వారికి దగినయుత్తరముల నిచ్చి యా మతమును ఖండించెను. అందు వలన నా యువతులామెను మిగుల తిరస్కారముగా జూచియు ఆమెకు శరీరమస్వస్థముగా నుండినను విచారింపక ఉపోషము చేసినను, భోజనము చేయుమనక ఆమె తినదని యెరిగియు, మాంసాహారములు తినెదవాయని యామెను కేరడములాడి విశేష బాధపెట్టిరి. ఆనందీబాయి వారింత చేసినను వారిపై కోపపడక స్వదేశవియోగము, స్వజన వియోగమువలన గలిగిన దు:ఖమును తానే యాపుచు, దొరకినచో ధాన్యాహారము చేసియు, దొరకనిచో నుపోషముండియు గాలము గడుపుచు స్టీమరుపై వెళ్లుచుండెను. ఆహా! ఇట్టి స్వదేశాభిమానమును స్వధర్మాభిమానమును గల స్త్రీ సర్వజనవంద్య యనుటకు సందేహము గలదా! కొందరు క్రైస్తవమతబోధకులు మొదట తాము మిగుల ప్రేమకలవారుగా నగుపడి, తమ మతము నితరులకు బోధింతురు. వారు తమ బోధవలన దమ మతము నవలంబింపరని వారికి దెలియగా ననేకరీతుల వారి నవమానింతురు. ధర్మగురువులగు వారికిది యెంతమాత్రమును తగినపనికాదు. తోడివారలు తన నట్లుచూచి సహాయమేమియు జేయకుండినను ఆనందీబాయి తనకు బరమేశ్వరుడే సహాయుడని నమ్మియుండెను. పదునెనిమిది సంవత్సరముల వయసునందే యింతటి దృడనిశ్చయమును ధైర్యమును, ఈశ్వరునియందు నమ్మికయు గలిగి వర్తించుట మిగుల స్తుత్యముగదా?

ఇట్లు ధూమనౌకపై బ్రయాణము చేయుచు ననేక ద్వీపములనుగడచి జూన్ 18 వ తేదిని ఆనందీబాయి అమెరికా చేరెను. అచటికి ఆనందీబాయి వచ్చుచున్న వార్తవిని యదివరకే కార్పెంటరు దొరసాని యోడవద్దకివచ్చి ఆనందీబాయి నెదుర్కొనెను. అప్పుడా యిరువురికిని గలిగిన యానంద మింతంతయని చెప్పుటకు వీలులేదు. కార్పెంటరు దొరసాని ఆనందీబాయి సద్గుణములను నేటికిని మరువలేదు. ఇట్టి స్త్రీలు బహుసంఖ్యలో నొకరుందురని యామె యనుచుండెను.

ఆనందీబాయి అమెరికాలోని న్యూజరసీపట్టణమున కేగగా నచట కార్పెంటరు దొరసానిగారి కుటుంబీకు లందరును ఆమెను బహు మర్యాదచేసిరి. వీరింటనుండియే ఆనందీబాయి తన చదువున కనుకూలమగు తావు వెదకుకొనెను. అచట నున్న నాలుగు నెలలు వృధపుచ్చుక ఆనందీబాయి కుట్టుపని, అల్లికపని, జలతారుపని నేర్చుకొనెను. తదనంతర మామె ఫిలడల్ఫియా యను మహాపట్టణమున వైద్యవిద్య నభ్యసించునటుల స్థిరమయ్యెను.

కొందరు పురుషులుగాని, స్త్రీలుగాని తమదేశమును వదలి పరదేశమున కరిగిన పిదప దమదేశాచారములను విడిచి యాదేశచారములనే స్వీకరింతురు. కాని మా చరిత్రనాయిక యట్లుగాక పాతాళలోకమున కరిగియు దన దేశాచారమును మరువక యా దేశపువారికిని వాటిని నేర్పెను. ఆమె తన స్నేహితురాండ్రకును కార్పెంటరు నింటి వారికిని మహారాష్ట్ర స్త్రీలవలె జడలువేసి చీరలు కట్టింపుచుండెను. తాను న్యూజరసీ పట్టణమున కేగుటకు ముందు తన స్నేహితురాండ్ర కందరకును మహారాష్ట్రపద్ధతి ననుసరించి విందుచేసెను. ఆ దిన మామె తానే తమదేశపు పక్వాన్నములు వండి భోజనములకు కూర్చుండుటకు పీటలువేసి, తినుటకు విస్తరులును దొప్పలును కుట్టి మహారాష్ట్ర దేశాచార ప్రకారము సకల పదార్థములును వడ్డించి విందారగింపవచ్చిన యువతులకు మహారాష్ట్ర స్త్రీవలె జీరలు, గాజులు, కుంకుము మొదలయిన వలంకరించి చేతితో భోజనము చేయువిధ మంతయు వారికి దెలిపి తానును వారితో గూర్చుండి భోజనము చేసెను.

తదనంతరమునం దామెను దీసికొని కార్పెంటరు దొరసాని ఫిలడల్ఫియా పట్టణమున కరిగి యచట నామె కనుకూలమగునటుల నిల్లు మొదలయినవి విచారించి, మరలి తన గ్రామమునకు వచ్చెను. ఆనందీబాయియు నచట విద్య నభ్యసింపుచు స్నేహితురాండ్ర గలసియుండెను. అచట నామె నాలుగు సంవత్సరములు విద్యాభ్యాసము చేసెను. ఆవ్యవధిలో నామెకనేక శారీరకమానసికదు:ఖములు కలిగి యామెదేహము నానాటికి క్షీణింపసాగెను. ఆమె చదువుకొను కాలములో హిందూదేశమునుండి యనేక స్త్రీవిద్యాశత్రువులు మిగుల హేయములగు జాబులను వ్రాసి యామెకు మిగుల విచారము కలుగజేసిరి. కొంద రామె పరదేశమున కరిగి స్వధర్మమును విడిచెనని యామె భర్తకు జెప్పి యామెపై మనసు విరుపజూచిరి. కాని వారి ప్రయత్నము లెంతమాత్రమును కొనసాగినవికావు. ఇట్లు సత్కార్యములకు నెట్లయిన విఘ్నములు గావింపవలయునని తలపుగల ధర్మాచరణ పరాయణులు మనదేశమునం దున్నందుకు నెంతయు జింతిల్లవలసి యున్నది. అమెరికాలోనుండగా ఆనందీబాయి యనేకోపన్యాసముల నిచ్చి యచ్చటి విద్వాంసులను మెప్పించెను. భార్యవెళ్ళిన రెండు సంవత్సరములకు గోపాలరావు గారు బయలుదేరి కాలినడకతో నమెరికా కరిగెను. ఆయన తన భార్య నడవడిని గనుగొనదలచి యామెకు దెలుపకయే యకస్మాత్తుగా నచటికిబోయెను. కాని యామె సత్ప్రవర్తన గనిన పిదపగోపాలరావు తా నామెనుగూర్చి శంకించినందుకు పశ్చాత్తాపపడెను. ఇట్లు గొప్ప విద్య నేర్చుకొని అమెరికా దేశమునకు జని, మహాగౌరవమును గాంచియు విశుద్ధచరితగా నుండి, యెల్లప్పుడును సంశయముతోనే యుండెడిపతిని మెప్పించిన యీ పతివ్రతా శిరోమణి ప్రాత:స్మరణీయ యనుటకు సందేహములేదు.

నాలుగు సంవత్సరములు చదివినపిదప ఆనందీబాయి వైద్యవిద్యయందు ప్రవీణురాలని మెప్పుపొందెను. తదనంతర మా దంపతులు అచట జూడదగిన స్థలములను జూచి కార్పెంటరు దొరసానివద్ద సెలవుపుచ్చుకొని స్వదేశమునకు వచ్చిరి. ఆనందీబాయి అమెరికాలో నుండిన కాలముననే కోలాపురపు సర్కారువారామెను తమ స్త్రీ వైద్యశాల కధికారిణిగా నుండుమనియు, నెలకు మూడువందలరూపాయలు వేతనమిత్తు మనియు బిదప నైదువందలవరకు వృద్ధిపొందింపగలమనియు నామెకు దెలిపిరి. కాన నామె యందునకు నొప్పుకొనెను. కాని దేశముయొక్కయు, స్త్రీలయొక్కయు దురదృష్టమువలన జదువుకొను కాలముననే యామెకు క్షయరోగ మంకురించి క్రమముగా వృద్ధియగుచుండెను. రొగముతోడనే యామె మనదేశమునకు వచ్చెను. సముద్ర ప్రయాణమువలన నామెదేహము మరింత యస్వస్థ మయ్యెను. బొంబాయియందును, పూనా యందును, ఆమెకు ఔషధోపచారము లనేకములుచేసి చూచిరి. కాని ఫలము లేకపోయెను. తుదకు 1887 వ సంవత్సరము ఫిబ్రవరి 26 వ తేది రాత్రి పదిగంటలకు దా జన్మించిన పూనాయందే యీ యద్వితీయస్త్రీ పరలోకమున కేగెను. మరణ కాలమున "నాచేతనయినంతవరకు నేనుచేసితి"నని పలికి యామ ప్రాణముల విడిచెను.

చూచుతిరా! యీ ధైర్యవతి సాహసము! ఇట్టిరత్నము లనేకములు మనదేశమునందు గలవు. కాని యా రత్నములను సానబెట్టి ప్రకాశింపజేయుటకు గోపాలరావువంటివారు లేనందున నా రత్నములును రాళ్ళవలె కానిపించుచున్నవి. ఆనందీబాయి సద్గుణములకును, సద్విద్యకును, గోపాలరావే మూలకారణుడనుట కెంతమాత్రము సందేహము లేదు. సాధారణముగా మొగపిల్లలును, ఆడుపిల్లలును వారి చిన్నతనపు చేష్టలవలన మిగుల చెడ్డవారని యనిపించుకొందురు. పురుషులు విద్య నేర్చిన పిదప తమయజ్ఞానమును కొంతవరకు విడిచి మంచివారగుదురు. స్త్రీలో, విద్య నేర్పువారులేక యింటియందు దల్లి ముత్తవ మొదలగువారివలెనె జ్ఞానవంతులును సుగుణ దుర్గుణములు కలవారును నగుదురు. ఆనందీబాయి చిన్నతనమునందు మిగుల చెడ్డదిగా గానుపించుచుండెనుగాని విద్యాభ్యాస మధికమయిన కొలదిని ఆమె మనసు మారెను. ఆమె పరద్వీపమున కేగి యిట్టివిద్యను నేర్చివచ్చినను, గర్వ మామె నంటజాలకుండెను. ఆమె చరితము గని వినినవారలు స్త్రీవిద్యాద్వేషు లయినను తమ యభిప్రాయమును మాని స్త్రీ విద్యాభిమాను లగుదురనుటకు సందేహములేదు. ఈమె చరితము అమెరికాలోని వారును వ్రాసి మిగుల పూజ్యభావముటొ జదువుచున్నారు.

ఇట్లీయుత్తమసతి దేశదేశాంతరములయందు గీర్తిగాంచి విద్యచే స్త్రీలు బాగుపడుదురేగాని చెడిపోరనియు దుర్గుణములకు విద్యకు విరోధమేగాని విడలేని మైత్రిలేదనియు, స్వచరిత్రమువలన స్థాపించి, విద్యనేర్చిన స్త్రీ లందరు ధర్మము విడుతురనియు, పతిని మన్నింపరనియు స్వచ్ఛంద లగుదురనియు గొందరు చెప్పినమాటలు ద్వేషజన్యములయిన యసత్యవాక్యములనియు, స్థిరపరచినందునను ఆనందీబాయి చరిత్రమునకు నేను "స్త్రీ విద్యావిజయదుందుభి" యనిపేరు పెట్టితిని.


_______