అబలా సచ్చరిత్ర రత్నమాల/రుద్రమదేవి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

రుద్రమదేవి

ఈ సతీరత్న మాంథ్రదేశమునందలి యోరుగంటిరాజ్యమును మిక్కిలి చక్కగా నేలిన శూరవనిత. ఈమె కాకతీయ గణపతిరాజుభార్య. దేవగిరిరాజు కూతురు. రుద్రమదేవి తన భర్త మరణాంతరము క్రీ.శ. 1257 వ సంవత్సరమునుండి 1295 వ సంవత్సరము వరకును ముప్పదియెనిమిది సంవత్సరములు రాజ్యపాలనము చేసినట్లు దానశాసనములవలనను, చరిత్రకారులు వ్రాసినదానివలనను స్పష్టముగా దెలియుచున్నది. సోమదేవరాజీయమునందును రుద్రమదేవి ముప్పది యెనిమిది సంవత్సరములు రాజ్యపాలనము చేసినట్లీ క్రింద పద్యమున జెప్పబడినది.

గీ. ఆయనకు నప్పగించి యయ్యమ్మ యట్లు
   బుధజనంబులు బ్రజలును బొగడ నవని
   ముప్పదియు నెన్మిదేడులు మోద మొదవ
   నేలి కైలాసశిఖరి నేగుటయును.

కాకతీయగణపతి మరణానంతర మాతనిభార్య యగు రుద్రమదేవి దు:ఖసముద్రమున మునిగి యుండెను. అప్పుడు మంత్రియయిన శివదేవయ్యగారి హితవచనమువలన నామె దు:ఖమును మరచి రాజ్యమునకు వారసు లెవ్వరును లేక యుండినను కూతురగు ఉమ్మక్కకు గలుగు సంతానమే సింహాసనము నెక్క నర్హులని కొంత మనస్సమాధానము చేసి కొని రాజుయొక్క ఖడ్గమును ముద్రికను సింహాసనమునందుంచి శివదేవయ్య సాహాయ్యమున రుద్రమదేవి రాజ్యము చేయసాగెను. ఆమె రాజ్యము బహుయోగ్యముగా జేసెనని చెప్పుదురు. అప్పుడామె యోరుగంటి చుట్టును మూడు నాలుగు ప్రాకారములుగల కోటను శత్రువుల కభేధ్య మగునటుల గట్టి దానికి దగిన చోటుల సైన్యముల నుంచెను. అందువలన నా రాజ్యమును గెలుచుట బహుదుస్తరమని పెరరాజులు వెరచు చుండిరి. ఇదిగాక రుద్రమదేవి చేయు న్యాయపరిపాలనమువలన జను లామె రాజ్యమే శాశ్వతముగా నుండ గోరుచుండిరి.

ఈమె తనరాజధానిలో ననేకములైన చెరువులు త్రవ్వించియు, సత్రములు కట్టించియు జనోపయోగ్యములయిన యనేక కార్యములను చేసెను. బీదవిప్రులకు బంగారపు కొమ్ములుగల గోవు లనేకములు దానమిచ్చెను. అనేక దేవస్థానములు కట్టించి వాని కన్నిటికిని వృత్తుల నేర్పరచెను.

ఒకసారి రుద్రమదేవి యుమ్మక్క సహితమయి మొగలిచెర్లకు బోయి యచట వీరాశక్తిని బూజించుచు నైదుదివసంబు లచట వసియించెను. అప్పు డామెపైకి హరిహరదేవుడును, మురారియు దిరగబడగా వారి నపుడు సామంబునం దనలోనం జేర్చుకొనియె. తదనంతరము రుద్రమదేవి యోరుగంటి కోటలోనికి వచ్చి, హరిహరుడును మురారియును జేయు కపటము నెరిగి యామె సైన్యము నంపి వారిని గెలిచి వారి నందరిని హతము గావించెను.

తదనంతర మామె కొన్నిదినములు సుఖముగా రాజ్యము చేసిన పిదప, దేవగిరిరాజు దళములతోడవచ్చి యోరుగంటిని ముట్టడివేసెను. దాని గని రుద్రమదేవి యెంతమాత్రము జంకక, పరమేశ్వరుని దలచి మహారౌద్రముతో పగవారిని ప్రతిఘటించి పోరాడి వారి బలంబుల హీనంబులు గావించె. అంత వారును ముట్టడిని విడిచి, నలుగడలం బలాయితులు కాగా, రుద్రమదేవి వారిని పోనియ్యక దేవగిరి వరకును దరమెను. వారును రుద్రమదేవి శౌర్యమున కత్యంతాశ్చర్యము బొంది, కోటిద్రవ్య మామెకిచ్చి శరణాగతులయి తమదేశమున కరిగిరి. అంత రుద్రమదేవి జయవాద్యములు మ్రోయ తన నగరునకు జనుదెంచి సైనికులకు దగిన బహుమతుల నిచ్చెను.

పిమ్మట నామె కూతురు ఉమ్మక్కకు గర్భచిహ్నములగుపడెను. వానిం గని రుద్రమదేవి యపరిమితానందభరితయై పుంసవనము మొదలగు సంస్కారముల నొనరించి వినోదములతో గాలము గడుపుచుండెను. ఇట్లుండగా ఉమ్మక్కకు పది నెలలు నిండిన పిదప శా.శ. 1166 వ సంవత్సరమగు నందన సంవత్సర చైత్రశుద్ధ గురువారమునా డుదయమున నొకపుత్రు డుదయించెను. రుద్రమదేవి యా బాలకునికి స్నానముచేయించి సింహాసనమునందు బరుండబెట్టి పౌరులను, సామంతులను రాబిలిచి వారందరికిని మీ ప్రభు వితడని తెలిపెను. వారునుమిగుల సంతసించిరి. తదనంతర మామె పుత్రో త్సవమునం దనేక దానధర్మములు చేసెను. బాలకునకు నామకరణ దివసంబున శివదేవయ్య పూజ్యురాలగురుద్రమదేవి పేరు బాలకున కిడదలచి ప్రతాపరుద్రుడని నామకరణము చేసెను. తదనంతర మా బాలకుడు దినదిన ప్రవర్ధమానుడై శివదేవయ్య వలన సకల విద్యల నభ్యసింపుచుండేను. ఈయన వెనుక ఉమ్మక్కకు మరియొక పుత్రుడు కలిగెను. అతనికి అన్నమదేవుడని పేరిడిరి.

రుద్రమదేవునికి గర్భాష్టకంబున నుపనయనంబు చేసివిద్యలన్నియు నేర్పి రాజ్య మాతనికిమ్మని శివదేవయ్య కొప్పగించి క్రీ.శ.1295 వ సంవత్సరంబున రుద్రమదేవి దివి కరిగెను. ఈమె మన యాంధ్రదేశంబునకు శిరోరత్నమని చెప్పుట కెంత మాత్రమును సందియము లేదు. స్త్రీలలో నిట్టివా రుందురని ప్రత్యక్షప్రమాణమువలన నెరిగియు మనవారు స్త్రీలను హీనముగా జూచుట మిగుల శోచనీయము.


______