అబలా సచ్చరిత్ర రత్నమాల/రాణీ దుర్గావతి

వికీసోర్స్ నుండి

రాణీ దుర్గావతి

గీ. చిదుకుల గదల్చుటను నగ్ని చెలగి మండు;
   చెడుగు చేయుటచే బాము పడగద్రిప్పు
   మఱియు క్షోభంబువలననే మానవుడును
   దనదు మహిమంబు చూపును తధ్యముగను. - వీరేశలింగ కవి.

పదునారవ శతాబ్దమున బుందేల్‌ఖండు సంస్థానములో బ్రసిద్ధికెక్కిన రాజులలో బ్రథముడగు చందవేల్ రాజునకు రూపగుణసంపన్నురాలగు ఒక కన్య గలిగెను. ఆమె పేరు దుర్గావతి. ఆమె రూపగుణముల కీర్తి దిగంతములనిండి, యనేక రాజపుత్రు లామె కొరకు చందేల్ రాజును ఆశ్రయించుచుండిరి. కాని, యా రాజపుత్రులు తన కూతునకు దగినవారు కారని యెంచి, చందేల్ రాజు వారికేదో యొక కారణముచెప్పి పంపుచుండెను. ఒకసారి గడామండలా సంస్థానాధిపతియగు గోండు రాజు దుర్గావతిని దన కిమ్మని యామె తండ్రిని వేడెను. ఈ గోండు రాజుయొక్క శౌర్య సాహసములను గురించి చారులచే వినినది గావున, దుర్గావతియు నాయన యందు బద్ధానురాగయై యుండెను. గోండులు జాతియందును, విద్యయందును, నాగరికత యందును రాజపుత్రులకంటె దక్కువవారు. గోండువారార్యులుగారు; అనార్యులు. కనుక నిట్టి నీచకులజునికి దమ శ్రేష్ఠవంశపు కన్యను ఇచ్చుటకు చందేల్ రాజునకు నిష్టము లేక పోయెను. కాని, అప్పుడు గోండురాజు మిక్కిలి బలవంతుడుగా నుండెను. ఈరాజు పాలించెడి గడామండల రాజ్యమంతగా గొప్పది కాకపోయినను, అతడు మిక్కిలి బలవంతుడై, అతనికి అనేక రాజులు సహాయముగా నుండిరి. ఇట్టి రాజుతో బోరి గెలుచుట దుర్లభమనియు, దుర్గావతి మనము అతనియందు జిక్కినదనియు నెఱిగి, చందేల్ రాజు గడామండలేశ్వరునకు దన కన్యకనిచ్చి మహావైభవముతో వివాహము చేసెను.

వివాహము జరిగినతరువాత నత్తవారింటికి వచ్చునప్పుడు దుర్గావతి, తండ్రి రాజ్యమునందున్న బీదసాదల కనేకులకు శాశ్వత జీవనము లేర్పరచెను. అందువలన వారందరామెను తమపాలిటి దైవమని భావించి యామె కనేకములైన దీవన లొసంగిరి. ఈమె గడామండలమునకు వచ్చినతరువాత నీమె భర్త, రాజ్యవిచారణమేమియు చేయక, యీమెయందే యధికాను రాగము కలవాడై, సదా నర్మదానదీతీరమునను, అచ్చటనున్న యుద్యానవనములయందును విహరించుచు కాలము వ్యర్ధపుచ్చుచుండెను. అనేక పర్యాయములు దుర్గావతి రాజ్యమును బాగుగా నేలుడని రాజునకు సూచించెను గాని, విషయాసక్తుడయిన రాజు ఆ మాటలను లక్ష్యపెట్టినవాడు కాడు. అంత గొంత కాలమునకు దుర్గావతీరాణి గర్భవతియయి యొక పుత్రుని గనెను. ఆ పుత్రునికి బదిసంవత్సరముల ప్రాయము వచ్చినప్పుడు, రాజుగారేదో రోగముచేత మృతినొందెను. అప్పుడు రాజ్యపాలనమంతయు దుర్గావతిమీద బడినందున నామె తన కుమారుని సింహాసనాధీశు జేసి, యతనిపేరిట తానేరాజ్యము జేయజొచ్చెను. ఆమె తన పెనిమిటివలెగాక, మిగుల దక్షతతో, న్యాయముతో, రాజ్యపరిపాలనము జేయుచు బ్రజలను సంతోష పెట్టుచుండెను!

ఇట్లు తనప్రజలను సుఖపెట్టుచు, పర రాజులతో వైరము లేక ఐదారుసంవత్సరములు రాణీగారు రాజ్యము చేసినతరువాత, మొగలాయి రాజైన యక్బరు బాదుషా ఆమె కీర్తివిని, యిట్టి రాజ్యము పరిపాలించెడి రాణి మనకు సంకితురాలుగా నుండవలయునని నిశ్చయించెను. ఇట్లుతలచి యక్బరు ఆసఫ్‌ఖాన్ అను ప్రసిద్ధవీరుని 1564 వ సంవత్సరమున దుర్గావతి రాజ్యముపైకి బంపెను! అక్బరు సకల సద్గుణసంపన్నుడని చరిత్రకారులు చెప్పెదరు. అతనియందు ననేక సద్గుణములుండెడివి. ఇతర యవనప్రభువులతో బోల్చిచూచినయెడల నతడు దేవసమానుడే యని చెప్పుటకు సందేహములేదు. కాని, యిట్టి మహాత్మునిగూడ రాజ్యకాంక్ష వదలినదికాదు. రాణి దుర్గావతి యక్బరునేమి, ఆయన రాజ్యములోని ప్రజలనేమి యెంతమాత్రము బాధపెట్టినది కాదు. వారి జోలికైన నెన్నడు పోయినదికాదు. ఇట్టులుండగా నా యబలమీదికి సైన్యమంపుట మహత్వా కాంక్షగాక మరియేమి? ఇట్లు ఆసఫ్‌ఖాను శూరుడు (అవును, అబలతో యుద్ధమునకు దలపెట్టినవాడు శూరుడే.) తనపై దండెత్తి వచ్చు చున్నాడన్నమాట విని, దుర్గావతి భయపడక, మహా థైర్యముతో యుద్ధమునకు సిద్ధము చేయసాగెను. మహా ప్రయత్నముచేసి కొద్దికాలములోనే 500 కరులను 5000 తురంగములను, గొప్ప కాల్బలములను సిద్ధపరచెను. తాను పురుషవేషము ధరించి, ఆయుధములను బుచ్చుకొని, ఏనుగుపై నెక్కి ప్రత్యక్షదుర్గవలె యుద్ధభూమికి వెడలెను! ఆమెనుజూచి సైనికుల కందరికిని ఉత్సాహము గలిగి వారిశౌర్యము మినుమడియై వారు శత్రుసైన్యముపై నడరి యతిధూర్తు లగు యవన సైనికుల ననేకుల రూపుమాపి, మరునాడా సేనాధిపతిని యమ సదనమున కనుప నిశ్చయించిరి. కాని, డిల్లీశ్వరునిచే మహావీరుడని ప్రఖ్యాతిని గాంచిన ఆసఫ్‌ఖాన్ కొద్దిసైన్యముతో నీమెను జయించుట దుస్తర మని తెలిసికొని, మరునా డింకను సైన్యమును గూర్చుకొని, తమవద్దనున్న ఫిరంగిలన్నియు నగ్రభాగమునందుంచి, గోండుసైనికులపై నకస్మాత్తుగా వచ్చి, తన సామర్థ్యమంతయుజూప, వారు చీకాకుపడి శత్రువుల మార్కొన శక్తులు కాకయుండిరి. ఇట్టి దురవస్థజూచి, దుర్గావతీ కుమారుడల్పవయస్కు డయ్యును, అభిమన్యు కల్పుడుగానతాను ముందై వెరవవలదని సైనికులకు ధైర్యమిచ్చి, శత్రువులను మార్కొనెను. ఇట్లు కొంతసేపు మహాధైర్యముతో బోరాడి యాబాలశూరుడు బాణఘాతముచే మూర్ఛిల్లెను. అప్పుడు సైనికు లందరు చింతాక్రాంతులై యాదు:ఖవార్త యింకొకవైపున తురకలను మర్దించుచున్న దుర్గావతికి దెలియజేసిరి. ఆమాటవిని, దు:ఖించుట కది సమయము కాదనియెంచి రాణీగారిసుమంతైనను జలింపక పుత్రవాత్సల్యమును ఆపి, తనసేనాధిపతికి నిట్లు వర్తమానము చేసెను. "ఈసమయము ధైర్యమును వదలి దు:ఖించుచు కూర్చుండ తగినదికాదు. శత్రుహననము మన ముఖ్యకర్తవ్యము. ఈశ్వరేచ్ఛ వలననైన కార్యమునకు వగవ పనిలేదు. కాన పిల్లవానిని శిబిర మునకు గొనిపోయి తగిన యుపచారములు చేయుడు. నేనిప్పుడు యుద్ధమును విడిచి వచ్చుటకు వీలులేదు. రణయజ్ఞము సమాప్తముచేసి, ప్రాప్తియున్న మరల జూచెదను." ఈయనుజ్ఞ ప్రకారము సైనికులు కార్యమును జరిపిరి.

యుద్ధమునందు గొంతసేపు వారికి జయమును, కొంతసేపు వీరికి జయమును గలుగుచు; తుద కెవరు గెలుతురో నిశ్చయించుటకు వీలులేకయుండెను. ఇట్లు కొంతసేపు వుభయపక్షముల సమానముగా యుద్ధముజరిగి, అది హిందువుల స్వాతంత్ర్య నాశన కాలముగాన, తురుష్కులకే యాధిక్యము వచ్చెను. గోండుసైనికులు పోరాడిపోరాడి, ఉత్సాహహీనులైరి. గోండులెట్లెట్లె ఉత్సాహహీనులైరో, అట్లట్లు మ్లేచ్ఛుల బలము హెచ్చుచుబోయెను. తమరాజ్యమును గోండుదేశమునందు స్థాపించవలె నన్న దృడేచ్ఛ గలవారు గనుక 'దీన్‌దీన్‌' అను రణశబ్దముచ్చరించుచు ఘోరముగా గోండు సైన్యములను దెగటార్చిరి.ఇట్లుభయకంరయిన హననయజ్ఞము జరుగగ, మూడువందల సైనికులతోడ దుర్గావతిరాణిమాత్రము బ్రతికి భయంకరముగా బోరాడుచుండెను. ఆమెను మార్కొనుటకు ఆసఫ్‌ఖాన్ దుర్గావతివద్దకి స్వయముగా వచ్చెను. కాని యామె రౌద్రమునుజూచి భయమంది, దూరముపోయి, అటనుండియామెపై బాణవర్షమును గురిపించదొడగెను. ఆమెయాబాణముల నన్నిటిని దునిమెను. కానియందొక బాణము శిరస్సునందు గ్రుచ్చుకొనగా నామె మరింత క్రోధాయమానమానసయై, ఆ బాణమును తానె పెరికివైచి, మరింత రౌద్రముతోయుద్ధము చేయ సాగెను! అప్పు డామె శరీరమంతయు రక్తమయమైన సంగతి చూచి, ఆమె డస్సినదని తెలిసికొని, స్వామిభక్తిగల యొక సేవకుడు డామెను సమీపించి యిట్లనియె. "అమ్మా! మీరిక యుద్ధమును జేసినందువలన లాభమేమియు లేదు. కొద్దికాలములోనే శత్రువులు మిమ్ము చెరబెట్టగలరు. వారిచేతులలో బడక శీఘ్రముగా నిచ్చటనుండి పలాయనము చేయుట మేలు; తమకొక యిబ్బందిలేక నేను ఆవలకు దీసికొనిపోయెదను." ప్రియ సేవకుడు పలికిన యీ వచనములు విని, ఆమె చింతించి, శత్రువులు నిజముగా సమీపించుచున్నారని చూచి, పవిత్రమైన దేహము మ్లేచ్ఛులచే నపవిత్రమగునన్న మాటమాత్రము తలపునకు రాగా సహింపలేక, విషణ్ణవదనయై, తన సేవకుని జూచి యిట్లనియె. "ఓరీ! నీ వన్నమాట నిక్కము. ఇదిగో నా చేతనున్న ఖడ్గముం గొని, యిచ్చటనే నా శిరచ్ఛేదము చేయుము; నేను క్షత్రియకన్యను; కాన పగరకు వెన్నిచి చనుట నా కనుచితము. ఈ శరీరము శత్రులంటగూడదు, కాన నీ వన్యధా విచారము చేయక నా తల దునుముము. అందుచే నేను వీరస్వర్గమును బొందుదును. నా యాజ్ఞ విని నన్ను సంకటము నుండి కాపాడినందున నీకును బుణ్యమే గలుగును; పాపము గలుగ నేరదు." ఈ మాటను విన్నతోడనే ఆ స్వామిసేవాపరాయణుడయిన సేవకుడు నిశ్చేష్టితుడై, యేమియుదోచక నిలువబడెను. కొంతసేపట్లు నిలువబడి వాడిట్లనియె. "తల్లీ! నా విన్నపమాలకించి, ఈ యేనుగు నెక్కుడి. అది శీఘ్రముగా మిమ్మును శత్రువుల బారినుండి తప్పించి, యవతలకు గొనిపోవును, నేను స్త్రీ వధ చేయజాలను." అప్పు డా రాణీగారు మిక్కిలి విచారించి, మ్లేచ్ఛులామెను సమీపించుట గని, తన ఖడ్గమునకు మ్రొక్కి దానితో దనంతట దానే పొడుచుకొని రణభూమియందే ప్రాణములు విడిచెను!!! రాణీగారి శవము మ్లేచ్ఛులచే బడకుండ నామె సేవకుడు భద్రపరచి, తానును యుద్ధముచేసి యచటనే మృతుడయ్యెను! రాణీగారి కుమారుడును పరలోకగతుడయ్యెను. ఇట్లొక తురకబాదుషాయొక్క రాజ్యలోభముచేత గోండు సంస్థానములోని నిరపరాధులగు లోకులందరు హతులైరి. ఆహా! రాజ్యలోభ మెట్టి ఘోరకృత్యములను జేయునో చూడుడి.

ఈ రణ శూరయైన దుర్గావతి యొక్క సమాధి జబ్బలపురమువద్ద నున్నది. ఆ సమాధియొద్దనే ఈమె గుణవర్ణనాత్మకమైన శిలాశాసనము కలదు. అచ్చటికి వెళ్లిన బాటసారు లందరును ఆ సమాధిని మహాభక్తితో జూచి, ఈ శూరనారినిగురించి పూజ్యభావమును వహించెదరు. బరమ ధార్మికుడయిన యొక బాటసారి యిందును గురించి యిట్లు వ్రాసియున్నాడు. "దుర్గావతి యొక్క సమాధి యా పర్వతదేశమునందు నిర్మించబడినది. అచ్చట రెండు పాషాణస్తంభంబులున్నవి; వానిని జూడగానే వెనుక జరిగిన యుద్ధము మూర్తివంతముగా గనుల యెదుట గానబడును. ఆ గిరిశిఖరముమీద నిప్పటికిని భయంకరమైన రణ ఘోషము రాత్రిపూట వినవచ్చునని అచ్చటిలోకులు నమ్మెదరు. నిర్జనమయ్యును, రమణీయమగు నీ స్థలమునకు వచ్చెడి బాటసారులు ప్రేమపూర్వకముగా రాణీగారి సమాధిని దర్శిం తురు. ఆమె పరాక్రమశ్రవణముచే విస్మయచిత్తులయి నానందములో నామె సమాధిని బూజించెదరు. ఆ స్థలమునందు బ్రకాశమానము లయిన గాజుతునకలనేకములున్నవి. ఆగాజుతునకలే రాణీగారికి బాటసారులర్పించెదరు. ఈపూర్వాచారము ననుసరించి, నేనును దుర్గావతియొక్క దివ్యగుణములను అభినందించుటకయి యొకగాజుతునక సమాధికి నర్పించితిని." అవును, ఇట్టి యలౌకికశౌర్య మేరికినభినందనీయము గాకుండును? క్షత్రియులకు నత్యంత శ్రేయస్కర మయిన ధర్మమును నాచరించి స్వర్గద్వారమునందు జొచ్చినవారు పురుషులయినను, స్త్రీలయినను సర్వజనవంద్యులే. కృష్ణ మూర్తియు నర్జునున కదియే బోధించినాడు:-

    యదృచ్ఛయాచోపపన్నం స్వర్గద్వార మసావృతం
    సుఖిన: క్షత్రియా: పార్ధ! లభంతే యుద్ధ మిదృశం.*


_______


  • ఓ అర్జునుడా! కోరకుండ సంభవించినట్టియు, తెరవబడిన స్వర్గద్వారరూపమయినదియు నగు నిట్టి యుద్ధమును ఏరాజులు పొందుచున్నారో వారలు సుఖులగుచున్నారు - భగవద్గీత. అ. 2.శ్లో 32.