అబలా సచ్చరిత్ర రత్నమాల/శికందరు బేగము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

శికందరు బేగము

   * "సుచింత్యచోక్తం సువిచార్య యత్కృతం
     సుదీర్ఘ కాలేపి నయాతి విక్రియాం"

నర్మదానదికి నుత్తరమున మధ్య హిందూస్థానములో భూపాళమను సంస్థానమొకటి కలదు. శిందేసర్కారువారి గ్వాలేరు సంస్థానమీ సంస్థానమునకునుత్తర భాగముగానుండుననీ, ఈ సంస్థానముయొక్క వైశాల్యము రమారమి యేడువేల చదరపు మైళ్లుండును. సంవత్సరమునకీ సంస్థానము యొక్క యాదాయము 40 లక్షల రూపాయలు. కథానాయిక యగు శికందరు బేగ మీరాజ్యమునకు రాణిగా నుండెను.

పదియేడవ (17) శతాబ్దముయొక్క యంత్యమునందు డిల్లీలో రాజ్యము జేసిన యౌరంగ జేబు బాదషహావద్ద సర్దారుగా నున్న దోస్తమహమ్మదను తురుష్కునిచే నీరాజ్యముసంపాదింప బడెను. ఈ యఫగాను సర్దారుడు శూరుడనియు, సాహసియనియు, బుద్ధిమంతుడనియు విని యతనికి నౌరంగ జేబు బాదషహ మొట్టమొదట సైన్యములో నొక చిన్నయధికారమిచ్చెను. తదనంతర మొక పర్యాయము దోస్తమహమ్మదు సైన్యముతో గూడ రాజకార్యమునకయి మాళవప్రాంతమునకు బోయెను. ఇతని ధైర్యాదిగుణములజూచి, యచ్చటి సుబేదారితనియం


  • చక్కగా యోజించి చెప్పిన మాటయు, జక్కగా విచారించి చేసినపనియు దీర్ఘ కాలమునకును విఫలములు కానేరవు. దనుగ్రహముగలవాడై, బాదుషాగారితో జెప్పి, ఇతనిని భైరసియా ప్రాంతమునకు సుబేదారుగా నేర్పరచెను. అచ్చటనుండు కాలములో దన చాతుర్యమువలన దాను సుబేదారుగా నున్న ప్రాంతమంతయు దనచేతికి దెచ్చుకొని, ఔరంగజేబు మరణానంతర మాతడు స్వతంత్రరాజై, భూపాళు అను పట్టణమును తన రాజధానిగా నేర్పరచుకొనెను. కనుక బేగముగారి వంశమున కీతడు మూలపురుషుడని చెప్పవచ్చును.

దోస్తమహమ్మదుఖాన్ 1723 వ సంవత్సరమున మృతుడయ్యెను. ఇతని మరణానంతరము భూపాళరాజ్యమును గురించి యనేక కలహములు జరిగెను. కానితుదకు సుల్తానుమహమ్మదు యారమహమ్మదు, యాషీనమహమ్మదు, హయాతుమహమ్మదులు క్రమముగా రాజ్యారూడులైరి. వీరిలో నాఖరువాడగు నవాబు హయాతుమహమ్మదు 29 సంవత్సరములు రాజ్యము చేసెను. ఇతని రాజ్యములోనే మరాఠావారితో ననేక ఘోర యుద్ధములు జరిగినవి. ఇతడు కాలముచేసిన తదనంతర మతని కుమారుడగు గోసమహమ్మదు రాజ్యస్థుడాయెను. ఈ గోసు మహమ్మదు పేరుకు రాజుగా నుండినను నితని పినతండ్రి కుమారుడగు వజీరుమహమ్మదు రాజ్యమును జరుపుచుండెను. ఈవజీరు మహమ్మదు ధైర్యస్థైర్యములుగల పురుషుడుగావున, నాభూపాళ దేశముపై వచ్చిన సంకటముల నన్నిటిని నివారించి, దండెత్తి వచ్చిన పరరాజుల నోడించి రాజ్యమును రక్షించెను. ఈవజీరు మహమ్మదు 1816 వ సంవత్సరమున గతించెను. అనంతర మాయన కుమారుడగు నజరు మహమ్మదు రాజాయెను. ఇతడు తండ్రివలెనే బహుగుణసంపన్నుడయి ప్రజలను సుఖపెట్టెను. ఈ నవాబు కుమార్తెయే శికందరబేగము. హిందూదేశచరిత్రములో భూపాలబేగమని ప్రసిద్ధిగాంచిన నారీరత్న మీమెయే. నజరు మహమ్మదొక దినము తన కుమార్తెను ముద్దాడి యాడించుచుండగా, అతని బావమరదియగు, ఎనిమిది సంవత్సరముల వయస్సుగల ఫౌజదారుఖాన్ అచ్చటనే యొక చిన్న తుపాకి దీసికొని యాడుకొనుచుండ నందులోనిగుండు అకస్మాత్తుగా నెగిరి, నవాబుకు దగిలి యతనిని గతప్రాణుని జేసెను!

నజరు మహమ్మదుకు బుత్రు లెవరును లేకపోయిరి; శికందరు బేగమను కుమార్తెమాత్ర ముండెను. కాని యీమె చిన్నదైనందువలన నీమెకు రాజ్యము కట్టుటకు వీలులేక పోయెను. అప్పు డచ్చటి యధికారు లందరును కంపెనీవారి యనుమతి బుచ్చుకొని, నజరుమహమ్మదుకు నన్నకుమారుడైన మునీరమహమ్మదు ఖానునకు శికందరబేగమును పెండ్లిచేసి యతనిని నబాబుగా జేయవలయుననియు, వివాహ మగువరకు నజరుమహమ్మదు భార్య యగు కుదుషిబేగము రాజ్యము చేయవలయు ననియు నిర్ణయించిరి. అటులనే శికందరుబేగము తల్లియగు కుదుషియా బేగము రాజ్యాధికారిణి యాయెను. చేతికి సంపూర్ణాధికారము వచ్చినతోడనే యామె చక్కగా రాజ్యము చేయసాగెను. రాజ్యసుఖము బహుదినములవరకు ననుభవింపవలయు నన్న యిచ్ఛగలదై, కుదషియాబేగము తన కొమార్తెకు ద్వరగా వివాహము చేయకపోయెను. త్వరగా వివాహ మైనయెడల దనకు రాజ్యము రాగలదని, మునీరమహమ్మదుఖాను వివాహోత్సకుడై, తనకు వివాహము త్వరగా జేయుమని యతడు కుదషియాబేగమును పోరసాగెను. ఇందుచే వీరిద్దరికి వైరము సంప్రాప్తమాయెను. కాని రాజ్యములోని సామంతులు, ఉద్యోగస్థులు మొదలయిన వారందరును కుదషియాబేగము పక్షమువారయినందువలన, పూర్వము చేసిన నిబంధనను కొట్టివేసి, మునీరుఖానుకు 40,000 రూపాయలిచ్చి, వారి తగవుతీర్చి, కుదషియాబేగమే రాజ్యము చేయవచ్చునని నిర్ణయించిరి. మునీరుఖానుకును శికందరు బేగముకును వివాహము చేయవలయునన్న యేర్పాటు మీరిన తరువాత, జహంగీరనువానితో శికందరుబేగముగారి వివాహము జేయవలయునని నిర్ణయించిరి. ఈ జహంగీరుకూడ శికందరుబేగముయొక్క పెదతండ్రి కుమారుడే, ఇచ్చట హిందూ చదువరులు మహమ్మదీయులలో గల యొక రూడిని జ్ఞాపక ముంచుకొనవలయును. మనలో మేనమామకూతురును వివాహమాడుట సశాస్త్రీయ మైనట్లు; తురకలలో బినతండ్రి పెదతండ్రుల కొమర్తెలతో బెండ్లియాడుట సశాస్త్రీయము. ఇదిమనకు వింతగా గానుపించునుగాని, తురకలలో సామాన్యమైన రూడియే.

కుదషియాబేగము సంపూర్ణముగా రాజ్యలోభగ్రస్తయైనందువలన దనబిడ్డను జహంగీరునకు కిచ్చి వివాహము చేసెదనని కాలము గడుపుచుండెనేగాని, త్వరగా వివాహము చేసినదికాదు. ఐనను శికందరుబేగముపవర యైనందువలన 1835 వ సంవత్సరమున నామెవివాహము జరిగెను. ఈ వివాహ సమారంభము బహు గొప్పగా జరిగెనట. వివాహము జరిగినతోడనే జహంగీరు తాను 'నవాబు' అను బిరుదును వహించి, రాజ్యముచేయ యత్నించెను. తనచేతిలోని రాజ్యము వదలగూడదని కుదషియాబేగము నిశ్చయించెను. ఇట్లు రాజ్యలోభముచే, అత్తగారును, అల్లుడును పరస్పర వైరులయిరి. ఇట్లు కొంతకాలము జరిగినపిమ్మట, నొకరితో నొకరు యుద్ధము జేయుటకయి వారిద్దరును సైన్యములను పోగుచేసిరి. కుదషియాబేగమును బట్టి కారాగృహమునం దుంచుటకయి జహంగీరుఖాన్ యత్నించెను. కాని యతనికి జాలునంత ధైర్యము లేనందువలన నతడీ యత్నమునందు విఫలుడయ్యెను. ఇట్టి యత్నము జరిగినతరువాత బేగము అత్యంత క్రోధాన్వితురాలయి యుద్ధమునకు సన్నద్థురాలాయెను. ఇద్దరికిని ఘోరయుద్థము జరిగి యందు జహంగీరు పరాజితుడయ్యెను. అందువలన నతనికి మూడు మాసముల వరకు గారాగృహవాసము చేయవలసివచ్చెను. కాని ఇంతలో ఇంగ్లీషువారును, మరికొందరును, మధ్యస్థులై, ఆయనను విడిపించి 1837 వ సంవత్సరమున రాజ్యాభిషిక్తుని జేసిరి. కుదషియాబేగముగారికి 60,000 రూపాయీల స్వతంత్రజమీన్‌ దారి యిచ్చిరి. అప్పటినుండి యామె భూపాళ రాజ్యవిషయమైన సంగతులలోనికి రాగూడదని కట్టుదిట్టములు చేసికొనిరి.

జహంగీరు రాజ్యము జేయుటయందు దక్షుడు కానందువలన లోకప్రియుడు గాకపోయెను. స్వభావముచేత దుష్టుడై నందువలన భార్యను దిన్నగా జూడకుండెను. సదా వ్యసనాసక్తుడై యున్నందువలన భార్యాభర్తల కనుకూలత లేక కలహములే జరుగుచుండెను. కాని శికందరుబేగము సద్గుణవతి గనుక, ఆ దాంపత్యకలహము చాలరోజులవరకు జరిగినదికాదు. పెనిమిటికి వీలయినంతవరకు బుద్ధిచెప్పి చూచి లాభములేదని తెలిసికొని, కలహము లాపుటకొరకై తల్లి వద్దకు వెళ్ళియుండుచు వచ్చెను. జహంగీరుఖాన్ దుర్మార్గుడై, యత్యంత వ్యసనాసక్తుడై నందువలన దొమ్మిది సంవత్సరములే రాజ్యముచేసి 1847 వ సంవత్సరమున మృతుడయ్యెను. ఇతనికి దస్తగీరను దాసీపుత్రుడొకడుండెను. జహంగీరు మృతుడయినప్పుడీ దాసీపుత్రునకు రాజ్య మియ్యవలసినదని మృత్యుపత్రమునందు వ్రాసెను. కాని ఈమృత్యుపత్రము నెవరును ఒప్పుకొనిన వారు కారు. శికందరుబేగమునకు శహజహానను స్వల్పవయస్కురాలగు కూతురొకతె యుండెను. ఈమె రాజ్యమున కధికారిణి గనుక, నీమె పెద్దదియగువరకు నీమె పేరిట శికందరుబేగముగారు రాజ్యపరిపాలనము చేయవలయునని ఇంగ్లీషువారు నిర్ణయించిరి.

శికందరుబేగము మొదలే బుద్థికుశలత గలదని విఖ్యాతి జెందియుండెను. అందులో నింత గొప్పరాజ్యమునకు స్వామినియైనందువలన నామెకు బుద్థివికాసముజూపుటకు మరింత యవకాశము గలిగెను. వర్షోదయమువలన చాతకములకును, క్షీర పానమువలన హంసపక్షులకును, చంద్రోదయమువలన చకోరములకును, అత్యంతానందము గలిగినటుల, శికందరుబేగము రాజ్యాధికారమును వహింపగానే ప్రజల కమిత ప్రమోదము గలిగెను. ఈమె సింహాసనారూడకాగానే సంస్థానమునందంతటను గొప్ప యానందఘోషమునకు బ్రారంభమాయెను. రాజ్యమునందనేకోత్సవములు జరిగెను.

ఈమె రాజ్యకార్య ధురంధరత్వమును సవిస్తరముగా వర్ణింపబూనిన నొక గొప్ప స్వతంత్రగ్రంథమగును. కనుక నటులచేయక యీమె విషయమై యొక గ్రంథకారుడు సంక్షేపముగా వ్రాసియున్న సంగతినే యిచ్చట భాషాంతరీకరించి వ్రాసెద. "శికందరుబేగమునకు రాజ్యాధికారము సంప్రాప్తమైనందువలన, ఆమె బుద్ధిప్రకాశము ప్రసరించుట కత్యంతవిశాలమైన యవకాశము దొరకెను. ఆమెకర్తృత్వసామర్థ్యములనుగురించి లోకులకు గల నమ్మకము నిజమని యామె కార్యముల వలన స్థిరపరచెను. రాజ్యమునకుగల ఋణమంతయు నామె యారు సంవత్సరములలో దీర్చివేసెను. గ్రామములు, తహశ్శీళ్లు వగైరాలు మక్తాకిచ్చెడి పూర్వపురీతి దీసివేసి, సొంతముగా గ్రామాధిపతుల వద్దనుండి తానే పన్నులు పుచ్చుకొనసాగెను. కొన్ని పదార్థముల గొందరు వ్యాపారులే అమ్మవలయునని గల నిర్బంధముల దీసి వేసి, ఆ పదార్థములందరు అమ్మవచ్చునని ఏర్పాటుచేసెను. ఇట్లు వ్యాపారవృద్ధికి దాను ముఖ్యకారణమాయెను. టంకశాలయొక్క బందోబస్తు సొంతముగా నామె చూచుకొనెను. సంరక్షకభటుల ననేకుల గ్రొత్తగా నేర్పరచి వారు దేశమునకు నష్టముచేయకుండ క్షేమమే చేయునటుల నేర్పాటు చేసెను. ఇట్లు రాజ్యములో ననేక సంస్కరణలాచరించెను. ఆమె ధైర్యముతో, సతతప్రయత్నముతో, బుద్ధికుశలతతో బ్రజల హితముకొరకు రాజ్యమునందు జేసిన సంస్కరణములు, అనుభవము గలిగినట్టియు, రాజ్యకార్యదురంధరు డగునట్టియు బురుషునకు గూడ భూషణాస్పదంబులు" ఈ గ్రంథకారుని వాక్యముల వలన శికందరుబేగ మెంత రాజధర్మ నిపుణమయినది తేట పడుచున్నది. ఈమెయందు గల ముఖ్యగుణము వత్సలత; అనగా ప్రజలను వాత్సల్యముతో జూచుకొని ప్రేమించుట. ఇందు విషయమైభర్తృహరి తన నీతిశతకమునందిట్లు వ్రాసియున్నాడు.

    రాజన్ దుధుక్షసి యది క్షితిధేనుమేనాం
    తేనాద్య వత్సమివ లోకమముం పుషాణ
    యస్మింశ్చ సమ్యగనిసం పరితుష్యమాణే
    నానాఫలై: ఫలతి కల్పలతేవ భూమి:.*

ఇట్లు బేగమువారు లోకులయెడ వాత్సల్య ముంచుటవలన, వారు సకలజనులకు బూజ్యులయి, పృథ్విని కల్పవృక్షము గావించి, స్వేప్సితఫలములను గైకొనిరి! బేగముగారివలె బ్రజావాత్సల్యమే పరమధర్మమని సకలరాజులు తలంచి అటుల వర్తించుటకు యత్నించిన పక్షమున, లోకములోని జనులందరు సుఖింతురుగదా? జితజేతులలోని వైరముడుగునుగదా?

రాణిగారు తురష్కులయినను, తమరాజ్యములోని హిందూ జనులను దయతో జూచుచుండిరి. నిరపరాధులగు


  • "తే.గీ. ధరణిధేనువు బిదుకంగ దలచితేని

        జనుల బోషింపు మధిప వత్సములమాడ్కి
        జనులు పోషింప బడుచుండ జగతి కల్ప
        లతతెరంగున సకలఫలంబు లొసగు."

హిందువుల ననేకులను తురుష్క రాజులు పశువులవలె నరికి వేసిరని యితిహాస ప్రసిద్ధమే కనుక, బేగముగారియందు గల సమత విశేష ప్రశంసనీయము.

బేగము షహజహానునకు, అనగా బేగముగారి కొమార్తెకు బదునెనిమిది సంవత్సరముల ప్రాయము వచ్చువరకు బేగముగారు రాజ్యము చేయవలయునని యింగ్లీషువారు సిద్ధాంతము జేసిరని వెనుక వ్రాసియుంటిని. ఇంత కొద్దికాలములోనే బేగమువారు తన సంస్థానమును ఒక యద్వితీయమైనట్టియు, ననుకరణీయ మైనట్టియు సంస్థానముగా జేసిరి. అక్బరుబాదుషా తరువాత జన్మించి రాజ్యపరిపాలనను జేసిన తురుష్కులలో నీమె యుత్తమ ప్రభ్వియని చెప్పుటకు సందేహములేదు. అక్బరునందుండిన సద్గుణములలోని యనేక సద్గుణము లీమెయందు వాసము చేయుచుండెను. కంపెనీవారి ప్రభుత్వములోని గొప్పగొప్ప యధికారు లీమె రాజ్యవ్యవస్థను జూచి సానందాశ్చర్యమును బొందుచుండిరి. రాజ్యములోని ప్రజలందరును సదా సంతోషముతో "మా పురాకృత పుణ్యమువలన మా కీ శికందరు బేగముగారు రాణిగా లభించిరి" అని కొనియాడుచుండిరి.

ఇట్లు బేగమగారు సకలవందితులయి రాజ్యము జేయుచుండ, ఆమెకూతురగు బేగముషహజహాను ఉపవరయయ్యెను. అప్పుడు బేగముగారీ చిన్నదానికి, బక్షిబాకర మహమ్మదఖానను వరుని దెచ్చి, వివాహము జేసిరి. అప్పటికి బేగముగారు బిడ్డకు రాజ్యమిచ్చుటకు మూడుసంవత్సరముల వ్యవధి యుండెను. బేగముగారి మనమున నంత్యకాలమువరకు దాము రాజ్యము చయవలయు నన్న యిచ్ఛయుండెను. బేగముగారియిచ్ఛ త్వరలోనే సిద్ధించెను.

1857 వ సంవత్సరమున ఉత్తర హిందూస్థానము నందలి పటాలములోని సిపాయిలు తిరుగబడినందున ఇంగ్లీషు వారికి గొప్ప సంకటము సంబవించెనని, హిందూదేశ చరిత్రము చదివినవారి కందరికిని తెలిసినవిషయమే. ఆ సంకటసమయమున, దయార్గ్రహృదయ యగు బేగమువారు ఇంగ్లీషువారి కనేకరీతుల సహాయము జేసి, ఇంగ్లీషువారు సూర్యచంద్రాదులుండువరకు మరవగూడని యంత యుపకారము జేసినది. సంకట సమయమున నింగ్లీషువారికి నుత్తర హిందూస్థానము నందు శిందోహోళకరులును, మధ్యహిందూస్థానమునందు భూపాళబేగముగారును, దక్షిణమున నైజామును, సహాయము జేసి నందువలననే యీ దేశమునం దాంగ్లేయులుండ గలిగిరేమో. అనగా మనమిపుడింగ్లీషురాజ్యమువలన ననుభవించుచున్న శాంతత, నాగరికత, విద్యాభివృద్ధి మొదలగు సౌఖ్యములకు అంశత: శికందరుబేగముగారు కారణ భూతురాలని నిర్భయముగా జెప్పవచ్చును. ఈమె రాజ్యములోని యనేక జనులును, సొంతముగా నీమె తల్లియు,, నింగ్లీషువారిపై దిరుగబడిరి; కాని యీమె వారందరిని నివారించి, మృత్యు ముఖమున బడనున్న యనేకాంగ్లేయుల యుక్తి ప్రయుక్తులతో నింగ్లీషు సైన్యముండిన హుషంగాబాదు పట్టణమునకు సురక్షితముగా జేర్చుటయందు బేగముగారు చూపిన థైర్యమత్యంత ప్రశంసనీయము. ఇట్లనేకరీతుల బేగముగారు ఇంగ్లీషువారికి సహాయముచేసి అంతగ శాంతపడిన తరువాత నింగ్లీషువారి రాజ్యము స్థిరపడుటకును అనేక రీతుల సహాయము చేసెను. ఈ ప్రకారముగా నీమె ఇంగ్లీషువారిని కృతజ్ఞతా బద్ధులనుజేసినందువలన, వారీమెను చాల సన్మానించి, అదివరకు దీసికొనిన భైరసియాప్రాంత మామె కిచ్చివేసిరి. 1859 వ సంవత్సరమున నింగ్లీషువారు, శికందరుబేగము భూపాల సంస్థానమునకు స్వామినియనియు, మరణకాలమువరకీమెయే రాజ్యము చేయవలయుననియు, ఈమె మరణానంతర మామెకొమార్తెకు రాజ్యము దొరకుననియు నేర్పాటు చేసిరి. ఇట్లు బేగముగారి యిచ్ఛ సిద్ధించెను. ఇంగ్లీషువారు కృజ్ఞతాబుద్ధితో నామెకు నాలుగు తోపులు బహుమాన మొసంగిరి. వారు 1863 వ సంవత్సరమున గొప్ప దర్బారుచేసి బేగముగారికి 'స్టార్ ఆఫ్ ఇండీయా' అనగా 'హిందూదేశముయొక్క నక్షత్ర' మను బిరుదు నొసంగిరి. ఇట్లు బహువిధముల నింగ్లీషు ప్రభువు లీమెను సన్మానించిరి.

శికందరుబేగ మిట్లు రాజ్యకార్యదక్షతను గురించి కీర్తిని సంపాదించి, ఇంగ్లీషువారియెడ రాజనిష్ఠతనుజూపి, వారిచే ననేక సన్మానములను బడసి, ప్రజల ప్రీతికి పాత్రురాలయి యహికసుఖముల ననంతముగా ననుభవించుచుండెను.కాని సౌఖ్యములలో నామె పారమార్థికవిచారమును మరచినది కాదు. ఆమె బీదలయందధిక దయగలదయి వారి దు:ఖనివారణమున కనేకోపాయములను జేసెను. ఈమెస్త్రీలకు స్వాభా వికములయిన యనేక ధర్మకృత్యములను జేసియున్నది. తురుష్కుల ధర్మశాస్త్రప్రకార మామె ప్రతిదినమును మూడు పూటల దప్పక ఈశ్వర ప్రార్ధన చేయుచుండెను. 1863 వ సంవత్సరమున, ఆమె రాజ్యమంతయు బిడ్డ కప్పగించి, ఆరాజ్యమును కాపాడవలయునని ఇంగ్లీషు ప్రభుత్వమువారికి విన్నవించి, తాను మక్కాయాత్రకు వెళ్ళెను. మన హిందువులకు గాశీ యెటులనో, తురష్కులకు మక్కా అటులనని చదువరులు గ్రహింపగలరు. యాత్ర చేసికొని అచ్చట ననేక ధర్మములు చేసి, దానశూరురాలని కీర్తిని జెందెను. అచ్చటినుండి తిరిగి తన రాజ్యమునకు వచ్చి, 1868 వ సంవత్సరము వరకు బరమార్థ విచారములో సుఖముగా గాలము గడిపెను. 1868 వ సంవత్సరమున నీమెకు నొక వ్యాధికలిగి, అక్టోబరు నెల 30 వ తేదీని ఈమె కాలధర్మమును జెందెను. అప్పు డీమె ప్రజలును, ఇంగ్లీషువారును దు:ఖితులయిరి.

ఈమె కాలము చేసినతరువాత నీమె కూతురగు షహాజన్ బేగము సింహాసనమెక్కి, మిక్కిలి న్యాయముతో రాజ్యము చేయుచున్నది. తల్లివలె నీమె ప్రజావాత్సల్యము నందును, ఇంగ్లీషువారియెడ రాజభక్తి దృడముగా జూపుటయందును మిక్కిలి ఖ్యాతినిగన్నది. ఈమె సుగుణములను దర్బారునందు నింగ్లీషువారు పొగడి, యీమెకు జీ. సీ. యస్. ఐ అన్న పదవిని ఇచ్చరి.

లార్డు ల్యాండ్సు డౌన్‌గారి ప్రభుత్వ సమయమునందాయన భూపాలు సంస్థానము జూచుటకు వెళ్ళి, యచ్చటి ప్రభుత్వమునుజూచి మెచ్చి యా సంస్థానమును గురించి యిట్లు వ్రాసియున్నాడు:-

"భూపాలసంస్థానాధీశ్వరు లెప్పుడును రాజ్య కార్యధురంధరత్వమునకును, రాజభక్తికిని, ఔదార్యమునకును బ్రఖ్యాతులయి యున్నారు. ప్రస్తుతపు సింహాసనాధీశ్వరియొక్క తల్లిగారగు శికందరు బేగముగారు 1857 వ సంవత్సరమున బ్రిటిషువారికి (ఇంగ్లీషువారికి) జేసిన సహాయ మెప్పుడును మరవదగినదికాదు. ఇప్పటి బేగముగారు, తల్లిగారిరాజ్యము గ్రహించినటులనే, ఆమె సద్గుణములనుగూడ గ్రహించినది. ఈమె, సారాసార విచారము గలిగినట్తియు, బుద్ధివైభవము గలిగినట్టియు, రాజ్యకర్త్రియని పేరొందినది; ఆమె లోకోపకార ప్రదములైన యనేక కార్యముల కొర కత్యంత ధనమును వ్యయపరచినది. ఈమె రైళ్ళు కట్టుటకు సహాయము జేసినది; భూపాలులోని లోకులకొరకు నద్వితీయ మయిన జలము దెప్పించినది. తాను కొన్ని దినములక్రిందట తన సైన్యములలో నుండి యిచ్చెదనన్న సైన్యమును బ్రిటిషువారు తీసికొనవచ్చుననియు, ఆ సైన్యము హిందూదేశ సంరక్షణార్థ ముపయోగింప వలసినదనియు, నీమె నాకు నేడు తెలియజేసినది."

ఈ వంశస్థు లిటులనే కీర్తినిజెంది, శికందరుబేగము వంటి యనేక బేగములచే భూషితులగుదురుగాక యని ఈశ్వరుని ప్రార్థించి, యీ చరిత్రము సమాప్తి చేయుచున్నాను.


________