అబలా సచ్చరిత్ర రత్నమాల/తోరూదత్తు

వికీసోర్స్ నుండి

నిచ్చెను. అందు నందరకంటెను చిన్నకూతురగు తరులత కలకత్తాలో 1856 వ సంవత్సరమునందు జన్మించెను. ఈమె బాల్యమంతయు నా నగరములో గడిచెనని చెప్పవచ్చును. తరులత యందరకన్న కడసారి కూతురగుటచే నామెను అందరును "తోరు" అను ముద్దుపేరు పెట్టి పిలుచుచుండిరి.

తోరూదత్తు తండ్రి స్త్రీవిద్యాభిమాని యయినందున నితరబంగాలీస్త్రీలకు విద్యార్జనమునందు గలుగు నిబ్బందు లేమియు లేక విద్య నభ్యసించుటకు నితర బాలికలకు నలభ్యము లైన సాధనములెన్నియో ఈమెకు బాల్యమునుండి లభించెను. ఈమెతండ్రి యత్యుత్సాహముతో నీమెకును, పెద్దకూతురగు ఆరూబాయికిని విద్యగరిపెను. పిదపి కుమారుడగు ఆబాజితో నీ యాడుబిడ్డలకును ఇంగ్లీషు నేర్పుటకు బాబు శివచంద్రబనర్జీ గారిని గురువుగా నియమించిరి. గురువగు బనర్జీ తోరుయొక్క బుద్ధికుశలత గనిపెట్టి విశేషశ్రద్ధతో నేర్ప నామె ఇంగ్లీషువిద్య యందు నధిక ప్రీతి గలిగినదై బహు శీఘ్రముగా విద్యార్జనము చేయుచుండెను. ఇట్లు విద్యార్జనముజేయ గొలదికాలములోనే యామెకును ఆమె యక్కకును ఇంగ్లీషుభాషలోని మహా కావ్యములయొక్క యర్థము స్వయముగా గ్రహించునంతశక్తి గలిగెను. "ఘనతవహించిన మిల్టను కవివరుని గ్రంథముల నీ అక్కచెల్లెండ్రు పఠనగ్రంథముగా గైకొని, తమతో సమమైన సంయీడుగల యాంగ్లేయ బాలికలకంటె నెక్కుడుగా నర్థమును గ్రహింపగలిగి, కవితాప్రవాహాదులను జూచి యత్యద్భుతము బొందుచు వచ్చిరి." అనియొక చరిత్రకారుడు వీరినిగురించి వ్రాసియున్నాడు. ఈ జాన్ మిల్టనుకవి యింగ్లీషుకవులలో బహుగొప్పవాడట. ఆయనగ్రంథములు ప్రధమ శాస్త్రపరీక్షకును, బట్ట పరీక్షకును, మరియితరమైన గొప్పగొప్పపరీక్షలకును, బఠనీయ గ్రంథములుగా నుంచెదరట. గొప్పగొప్పవిద్యార్థులకును ఈయన గ్రంథములలోని యర్థము తెలియుట కష్టమట. వానిలోని యంతరార్థము తెలియుట యంతకంటె దుర్లభ మట. సంస్కృతములోని మాఘ, నైషధ కావ్యములయొక్కయు, ఆంధ్రములోని వసుచరిత్రముయొక్కయు బాకముమీదనే ఈ కవి యొక్క కావ్యములును దిగినవట. ఇట్లయ్యును ఈకవియొక్క కావ్యములలోని రహస్యములు చిన్నతనమునందే కనిపెట్టిన తరులతా దత్తుయొక్క బుద్ధివైభవమును దైవికమనియే చెప్పవలసియున్నది.

1869 వ సంవత్సరమునందు బుత్రమరణదు:ఖితుడగు గోవిందచంద్రదత్తుగారు, కన్యలే తమకు బుత్రులని యెంచి వారివిద్యాభివృద్థికయి, వారిని నైరోపాఖండమునకు గొనిపోయెను. వారికి ఉన్నతవిద్య నేర్పదలచి, ప్రథమమునందాయన ఫ్రాన్సుదేశమునకు బోయి 'నీసు' నగరమునందు వసించెను. అచట నాసోదరీమణులిరువురును తమబుద్ధిబలిమిచే విద్యార్థివేతనముల సంపాదించుకొనుచు, ఫ్రెంచువిద్వాంసుల ఆశ్రయించి ఫ్రెంచుభాష నేర్చుకొనిరి. కొన్నిరోజులు వీరు ఫ్రాన్సుదేశమునకు రాజధానియయిన పారీసునగరములో నుండిరి. అచ్చట ఫ్రెంచువిద్య చక్కగా నేర్చుకొని యా మువ్వురును ఇటాలిదేశము జూచి లలితకళా విద్యలకు బుట్టినిల్లయిన ఇంగ్లాండునకు వెళ్ళిరి. 1873 వ సంవత్సరమువరకు వారచట నుండిరి. వారాకాలమునందును వ్యర్థముగా గాలము గడపక యింగ్లీషు, ఫ్రెంచుభాషలయందసాధారణ ప్రవీణత సంపాదించిరి. వారు కేంబ్రిడ్‌జ్ పట్టణము (మనకాశీ పట్టణము వలెనీగ్రామ మింగ్లండునందు నొకగొప్పవిద్యాపీఠము) నందుండి బ్రేగ్నిల్‌దొరసానిగారు ఫ్రెంచుభాషయందు నిచ్చిన యుపన్యాసములకు దప్పకపోవుచుండిరి. తదనంతరమందు వారిరువురును సెంటులియో నార్డ్సు పట్టణమునందు తమఫ్రెంచు విద్యనువృద్ధిపరచిరి. యూరపుఖండమునందున్న కాలమున తోరుదత్తు తననిత్యప్రవర్తన నిత్యము వ్రాయదొడగెను. ఆపుస్తకమునందు ననేక సంగతు లామె మిగులశ్రద్ధతో వ్రాయుచుండెను. నిత్యము జరిగినసంగతు లాపుస్తకమునందు నత్యంతశ్రద్ధతో నతివివరముగా వ్రాయబడినవి. అందు నామె యనేక సంగతులను గురించి తనసొంత యభిప్రాయము వ్రాసియున్నది. ఆ యభిప్రాయము లెంతయో రమ్యముగా నున్నవట.

ఈ చిన్నకుటుంబము ఫ్రాన్సుదేశముకంటె నింగ్లీషుదేశముననే విశేషదినములుండుట తటస్థించినను, తోరుదత్తుకు ఫ్రాన్సుదేశమునందే విశేష గౌరవముకలిగియుండెను. జన్మభూమియయిన హిందూదేశముపై నామె కెంతప్రీతి యుండెనో, యంతప్రీతి ఫ్రాన్సుదేశముమీద నుండేను. 1869 వ సంవత్సరమున ఫ్రాన్సుదేశమునకును, జర్మనీదేశమునకును జరిగిన ఘోర రణమునందు ఫ్రాన్సునకు బరాభవము కలిగినప్పుడు చూడనొపక తోరుదత్తు తననిత్యప్రవర్తన గ్రంథమునందు నిట్లు వ్రాసెను. "నేను వెనుక దినచర్యవ్రాసి యెన్నియోదినములు గడిచెను. అయ్యో! ఈ యవకాశమునందు ఫ్రాన్సుదేశమున నెన్నియో మార్పులుగలిగినవి. పారీసు నగరమునందు మేమున్న స్వల్పకాల మా పట్టణమెంతయో రమణీయముగా నుండెను. అచటి రాజమార్గము లత్యంత రమ్యములుగానుండెను. ఆదేశంలోని సైన్యములన్నియు నత్యంత సువ్యవస్థతో నుంచబడెను. అట్తి వైభవసంపన్నమగు పట్టణము నే డిట్లు దీనదశకు వచ్చుట గన, నా కత్యంత దు:ఖకరముగా నున్నది. పృథ్విలోని సర్వపట్టణములలో నధికమయినదని ప్రసిద్ధిజెందిన పట్టణమునకిట్టి దీనావస్థ గలుగుట గని, యేరికి హృదయము కరగకుండును? ఫ్రాన్సు దేశీయులకును, జర్మనీ దేశీయులకును యుద్ధమారంభమైన నాటనుండియు నా మనసంతయు ఫ్రాన్సుదేశ జయమునే కోరుచుండెను. తుద కట్లుగాక ఫ్రాన్సుదేశమునకే పరాభవము కలుగుట మిగుల వ్యసనకరము." ఈ వాక్యములవలననే యామెకు ఫ్రాన్సుదేశమునందుగల గౌరవాతిశయము వెల్లడియగుచున్నది. ఆ దేశమునందు దనకు గల గౌరవమును తోరూదత్తు ఇంగ్లీషునందు స్వయముగా నొక పద్యకావ్యము రచించి వెల్లడించెను.

1873 వ సంవత్సరమున కొమార్తెలను దీసికొని గోవిందచంద్రదత్తుగారు తిరిగి కలకత్తా ప్రవేశించిరి. ఇంటికి వచ్చిన పిదప తోరూదత్తు ఇంగ్లీషు ఫ్రెంచుభాషలయందు నధిక పరిశ్రమ జేయుచు, తండ్రిగారియొద్ద సంస్కృతమునేర్చుకొన నారంభించెను. ఈ సమయమునందే ఆమెకు పద్య గద్య కావ్యములు వ్రాయుటకు విశేషస్ఫూర్తి కలిగెను. అందుపై నామె తండ్రి కవిత్వముచేయుటకై, కవిత్వస్ఫూర్తిని వృద్ధిపరచుటకై, కొమార్తెను సదా ప్రోత్సాహ పరచుచుండెను. అందువలన దనకు గవిత్వశక్తి లభించి దృడపడినదని తోరూదత్తెల్లప్పుడును తండ్రిగారి యెడ మిగుల కృతజ్ఞురాలయియుండెను. ఇటులగదా తండ్రి తన పుత్రీపుత్రులను జ్ఞానవంతుల జేయవలసిన విధి. ఇటులగదా పుత్రీపుత్రులు తమ మాతాపితలయెడ గడుగృతజ్ఞులయి యుండవలసిన విధి.

ఇట్లు గోవిందచంద్రదత్తు తన కుమార్తెలకు విద్యాబుద్ధులు చెప్పించి, పుత్రులవలెనే పెంచుట చూచి కొందరాశ్చర్యపడుదురేమో. కాని, యట్లు ఆశ్చర్యపడుటకు గారణము లేదు. పుత్రికలను పుత్రులవలె జూచుటయే శాస్త్రధర్మము. కన్యావివాహ సమయమునందు దండ్రి 'పుత్రవత్పాలి తామయా' 'పుత్రునివలె నాచే బెంచబడిన కన్య' యని చెప్పుట సర్వప్రసిద్ధ మేకదా. ఇదియుగాక మునిశ్రేష్టుడైన మనువు పుత్రీపుత్రులు సమానమని స్పష్టముగా వ్రాసియున్నాడు.

   యధావాత్మా తధాపుత్ర: పుత్రేణ దుహితాసమా.

   "తనతో సమానుడు పుత్రుడు. పుత్రునితో సమానము కూతురు."

శాస్త్రము లిటుల నుద్ఘోషించుచుండాగా మన దేశమునందు బాలికలను బాలురకంటె నతినీచముగా జూచుటజూడ మిక్కిలి ఖేదకరముగా నుండక మానదు. ఆడుపిల్ల పుట్టిన నాటినుండియు దలిదండ్రులకు మిక్కిలి ఖేదకరముగా నుండక మానదు. ఆడుపిల్ల పుట్టిననాటినుండియు దలిదండ్రులు మిక్కిలి ఖేదముతో నుండెదరు. పెద్ద పెరిగినకొలది పుత్రికలను పుత్రులవలె జూడక యెటులనైన బెంచవలయునని పెంచుదురు. ఇట్లనుట వలన నాడుపిల్లలను దయతో బెంచువారే యీ దేశమునందు లేరని నాతాత్పర్యము కాదు. అట్తి సజ్జనులుగూడ నున్నారు. కాని, ఈదేశములోని యాడుపిల్లలలో నూటికి తొంబదితొమ్మండ్రు బాలికలు నేను చెప్పినప్రకారమత్యంతాలక్ష్యముతో బెంచ బడుచున్నారనుటకు సందేహము లేదు. ఆంధ్ర మహారాష్ట్ర దేశముల బాలికలస్థితి యంతశోచనీయముగా లేదు. కాని బంగాళా పశ్చిమోత్తర పరగణాలు మొదలయిన దేశములలో నాడుపిల్లలు కలుగుట కుటుంబమునకు నొక గొప్ప సంకటము ప్రాప్తించుటయే యని యెంచెదరు. ఇట్లు మనదేశమునందు బాలికలకు నత్యంత దురవస్థ ప్రాప్తించుటకు గారణము, స్త్రీ లన్నిసంగతులయందును పురుషులకంటె దక్కువ వారని మన దేశమునందుగల వాడుకయే. ఈ వాడుకకు గారణము, స్త్రీల యజ్ఞానదశ. కాన, స్త్రీ విద్యాభివృద్ధియైన గాని, బాలికలకు నిట్టి యవస్ఠ తప్పదు. గనుక దేశాభిమాను లగు సహోదర సహోదరీ మణులారా! మీరు దత్తుగారివలె మీ బాలకులను, బాలికలను సమాన ప్రీతితో జూచుచు బాలికలకు బాలురకువలె నింగ్లీషు ఫ్రెంచులు చెప్పించక పోయినను, మీ మాతృభాషయైన జెప్పించి దేశక్షేమమునకు దోడగుదురని నమ్ముచున్నాను.

బంగాళాస్త్రీ పరికీయబాషయందు నుత్తమకవిత్వము జెప్పి ప్రసిద్ధిగాంచునని యాసమయమునం దెవ్వరును స్వప్న మందైనను అనుకొనినవారు కారు. అట్లగుట సాధ్యమని చెప్పిన నెవ్వరును నమ్మకుండిరి. మనదేశపుస్త్రీ లనేకశతాబ్దముల నుండి యజ్ఞానాంధ కారమునకు బుట్టి నిల్లు చేయబడినందున హిందూదేశమునందలి యొక యబల ఈ పద్యముల వ్రాసెనని యెవ్వరును తలపరైరి. తోరుదత్తు ప్రథమమున నొక ఫ్రెంచు కవిని గూర్చియొక వ్యాసమువ్రాసి యొకమాసపత్రికలో బ్రసిద్ధపరిచెను. ఆపత్రిక యందు నామె ఫ్రెంచుభాషయందలి యనేక పద్యముల నింగ్లీషునందు భాషాంతరీకరించి యచ్చు వేయించు చుండెను. ఆకాలమునం దాపత్రికను జదివిన వారి కామె వ్రాసిన వ్యాసములును పద్యములును బహు ఆనందము గలిగించు చుండెను.

ఇంతలో 1874 వ సంవత్సరమునం దీమె యక్కగారగు ఆరూబాయి క్షయరోగమువలన బరలోకవాసినియయ్యెను. ఆరూబాయి కవిత్వకల్పనలయందు జెల్లెలికంటె దక్కువ నేర్పరి యైనను, బంగాళీ, యింగ్లీషు, ఫ్రెంచుభాషలయందలి పాండిత్యమునందు తోరుతో సమానముగా నుండెను. ఈమె వృత్తియు బహు సాధువృత్తియైయుండును. ఆమెకు నేకాంతవాసమునందుండుటయే యధిక సౌఖ్యకరమై యుండెను. ఆరూబాయికి దనపేరు ప్రసిద్ధియగుట యెంతమాత్రమును ఇష్టము లేకుండెను. కాని, యామె తనచెల్లెలి కవిత్వస్ఫూర్తిని గని సంతోషించు చుండెను. ఈమె పటములను వ్రాయుటయందు మిగుల ప్రవీణురాలుగా నుండెను. ఈయక్కచెలియండ్రిద్దరలో తోరుదత్తు గ్రంథములను రచించునటులను, ఆరూబాయి యాగ్రంథములకు ననుకూలము లయినపటములను వ్రాయునటులను, నియమించుకొనిరి. కాని, యదియంతయు నారూబాయి మరణముతో నడగెను. ఈ యక్క చెల యండ్రిద్దరును గాయనముందసమాన ప్రజ్ఞగలవారై, యనేక వాద్యములను బహు కుశలతతో వాయించుచుండిరి. వీరు తమ విద్యాభ్యాసమును చేయుచు సాధారణకుటుంబపు స్త్రీలవలెనే తమ గృహకృత్యములను చక్క బెట్టుచుండిరి. 'ఆడుది చదివి చెడె' నన్న మూర్ఖపులోకోక్తి యబదమనియు, 'చదువక మగవాడు చెడె' నన్న లోకోక్తి వలెనే 'చదువక యాడుది చెడె' నన్న లోకోక్తియే నిజమని యీ యక్కచెల్లెండ్రు ఉదాహరణ పూర్వకముగా స్థాపించిరనుటకు సందేహము లేదు.

తోరుదత్తు అన్ని పనులయందును చురుకుతనము జూపుచుండెను. ఆమెకు బ్రతిపనియందును గల బుద్థికుశలత జూచి యామె తండ్రి మిక్కిలి యద్భుతము నొందుచుండెను. ఆమె జ్ఞాపకశక్తి బహు యద్భుతము. ఆమె రచించిన పద్యము లన్నియు, నామెకు బాఠముగా నుండెనట. సంస్కృత, బంగాళ, ఇంగ్లీషు, ఫ్రెంచు భాషలలోని మహాకవీశ్వరుల పద్యము లనేకము లామెకు గరతలామలకములై యుండెనట. ఆమె తాను చదివిన గ్రంథముల నన్నిటిని తిరిగి యొకసారి మననము చేయుచుండెను. ఒకానొక చోట దనకర్థము తెలియకుండిన మరలమరల జదివి, యందలి యర్థమును గనుగొనినగాని ముందు చదువునదికాదు. ఇటుల నామె యాత్మోన్నతియందు మిగుల తత్పరురాలై యుండెను. తోరుదత్తు తనయక్క గతించినపిదపను ధైర్యము విడువక తన ప్రయత్నమును మానకుండెను. ఈమె రచించిన 'పద్యసముదాయమ' ను ప్రథమ గ్రంథము 1876 లో వెలువడెను. దానియందు ఫ్రెంచు కవీశ్వరుల కావ్యములనుండి, ఇంగ్లీషుభాషకు భాషాంతరీకరింప బడిన పద్యరూపముననున్న చిన్న చిన్న కధలుండెను.

అందు పీఠిక స్థానమున నొక పద్యము వ్రాసి ఈ గ్రంథము తనతల్లికి గృతియిచ్చినటుల జెప్పెను. ఇందుచే నీమె మాతృ భక్తి వెల్లడియగుచున్నది. ఈ గ్రంథము మొట్టమొదట బంగాళాదేశమునందలి భవానీపురమునందు నచ్చువేయబడెను. కాగితములు బహు సన్ననివిగాను, అచ్చు అంటి యంటనటులు గాను, ఈ పుస్తకము గుజనీ పుస్తకముగా నచ్చువేయబడెను. లోకములో బైసౌందర్యము జూచి భ్రమించు వాడుక గలదు. కాన, నది మంచి గ్రంథమేయైనను దాని బహిరంగము చూచుట కింపుగా లేనందున నందలి పద్యరత్నములను చదువుట కాకాలమునం దెవరికిని బుద్ధిపుట్టదయ్యెను. అందువలననే ఈ కవయిత్రి పుస్తకము మనదేశమునందాకాలమున మెప్పువడయ కుండెను. ఇట్లు బయిటిదంభమునకే భ్రమపడు వారనేకులుండినను, ఈ జగత్తునందు సత్యశోధకులును, సద్గుణపరీక్షకులును నూటికి కోటికినైన నొక్కరు గానపడక పోరు. ఇట్టి రసికులుండుట వలననే కవిత్వాదివిద్యలువృద్ధిబొందుచున్నవి. తోరూ భాగ్యమువలన నిట్టి రసికిడొకడు, ఇంగ్లీషుదేశమునందుండెను. దైవ వశాత్తుగ నీ పుస్తక మాయన చేతబడుట సంభవించెను. ఈ గుణగ్రహణ పారీణుని పేరు ప్రొఫెసర్ ఎడ్మండ్‌గ్యాస్. ఆపుస్తకము జదివి యతడు ఇంగ్లీషుదేశమునందలి "ఎక్జామినర్" అను వార్తాపత్రికయందు దాని నిట్లు ప్రశంసించెను. "ప్రొ. మింటో దొరగారు 'ఎక్జామినర్‌' అను వర్తాపత్రికాధిపతిగా నున్న సమయమునం దొకదినము నేను వారి కార్యస్థానమునకు బోవుట సంభవించెను. అపుడాయన తనయెద్దకు నభిప్రాయమునకై వచ్చిన పైని హిందూస్థానముద్రగల, యొకపుస్తకము నా చేతికిచ్చెను. ఆ పుస్తకము చూచుట కసహ్యముగా నగుపడుచుండెను. అది భవానిపురమునందలి సప్తాహిక సంవాదమను ముద్రాక్షరశాలయందు ముద్రింపబడినది. ఇది రెండు వందల పుటములుగల పుస్తకము. దీనియందు నుపోద్ఘాతము మొదలైనవెంతమాత్రమును లేవు. దాని జూచినతోడనే చిత్తుకాగితముల బుట్టలో బారవేయవలయునని తోచును. అందలి సగము అంటీయంటని యక్షరముల గనిన, దానిలో నుత్తమకవిత్వము కలదని తోచకుండుట యొకవింతకాదు. కాని, పుస్తకము విచ్చి దానియందలి పద్యమొకటి చదివిన తోడనే నాకు గలిగిన యానందాశ్చర్యములు వర్ణింపశక్యముకాదు." తోరూదత్తు రచించినగ్రంథము లన్నిటిలో నిది ప్రథమ ప్రయత్నమేయైనందున ఈ కావ్యము తదనంతర మామెచే రచియింపబడిన కావ్యములంత రసవంతమైనవి గాక యుండుట సహజము. అయిన నట్టిగ్రంథమే పాశ్చాత్యపండితులచే గినియాడబడినప్పుడు ఆమెచే రచియింపబడిన యితర కావ్యము లెంతరసవంతములై యుండునో చదువరులేయూహించుకొనగలరు. తోరూదత్తుకుగల ఇంగ్లీషు ఫ్రెంచు భాషాజ్ఞానము ఈమెకంటె నధిక వయస్కు రాండ్రగు ఇంగ్లీషుఫ్రెంచు స్త్రీలలోనే కానవచ్చుటయే దుర్లభము. ఈ రెండుభాషలును తోరూదత్తుకు బరభాషలేయైనను వానియందామె స్వభాషవలెనే కవిత్వము చేయుట గని లోకు లాశ్చర్యపడుచుండిరి. ఈమె కవిత్వములో విశేషభాగము భాషాంతరీభూతమైనను, అందు కవిత్వమునకు గావలసినలక్షణములన్నియు ననగా శబ్దశౌష్ఠవము, అర్థగాంభీర్యము, రసపుష్టి మొదలైన గుణము లున్నందున జదువరుల కామె కావ్యములు భాషాంతరీకృతములుగా దోచక స్వతంత్రరచనగానే తోచుచుండెను. తోరూదత్తు 'ప్రాచీన హిందూస్థానములోని పాటలు' అను కావ్యమొకటి రచించెను. ఆకావ్యమునకు ప్రొ. గ్యాస్‌దొరగారొక పీఠికవ్రాసిరి. అందు నాతడు "పందొమ్మిదవ శతాబ్దములోని కవులచరిత్రమును వ్రాయునప్పుడు తోరూదత్తుచరిత్రమును వ్రాయవలసి యుండును" అని వ్రాసియున్నాడు ఆంగ్లేయునిచే నిట్టిస్తుతివడసిన నా నారీరత్నమును స్తుతించుటకు నేనెంతదానను.

ప్రథమగ్రంథ మచ్చుపడిన కొద్దిదినములకే తోరూబాయికి వ్యాధి సంభవించెను. అందువలన నామె, తండ్రిబలముచే సంస్కృతాధ్యయనమును మహాకష్టముతో వదలివేసెను. రోగము నడుమనడుమతగ్గినట్లు కనబడుచుండినను దినదిన మామెసత్తువ తగ్గుచుండెను. ఆమెకుబలముక్షయించిన కొలదిన కవిత్వథోరణి యధికమయ్యెను. తానీ ప్రపంచమునందుండుట కొద్దిదినములవరకే యనితోచిన కొలదిని కావ్యములు వ్రాసియజరామ రణ కీర్తిని సంపాదించవలయునను ఇచ్ఛయామె కెక్కువగా గలుగుచుండెను. ఆసమయమునందు క్లారీసాబదేవరును ఫ్రెంచు స్త్రీచే రచింపబడిన గ్రంథమొకటి ఈమె చదువుట తటస్థించెను. దాని నింగ్లీషున భాషాంతరీకరింప వలయునని యామెకు దృడతరమైన యిచ్ఛకలిగెను. అంత నామె భాషాంతరీకరణమునకు ననుజ్ఞ యిమ్మని పుస్తకకర్త్రికి నుత్తరము వ్రాసెను. అందుకు నా గ్రంథకర్త్రి యనుజ్ఞనిచ్చెను. అప్పటి నుండి వారికి నత్యంతస్నేహము కలిగినందున, తోరూ ఆగ్రంథకర్త్రికి గృతజ్ఞతాపూర్వకముగా దనపటమును, సంస్కృతము నుండి తాను ఫ్రెంచులోనికి భాషాంతరీకరించిన సరసపద్యములను బంపెను. ఆ పద్యముల నా దొరసాని యెంతయో మెచ్చెనట! గాని, యీ దేశముయొక్కయు, విశేషముగా నీ దేశములోని స్త్రీలయొక్కయు దౌర్భాగ్యవశమున విద్యావతియగు తోరుదత్తు ఫ్రెంచు గ్రంథకర్త్రియొక్క గ్రంథమును భాషాంతరీకరింపకయే 1877 వ సంవత్సరమున నశ్వరమగు ప్రపంచమును వదలి శాశ్వతమగు పరలోకమున కరిగెను. ఈమె యంత్యసమయమునందు జెప్పిన వాక్యముల వలన నామె శుద్ధాంత:కరణము వ్యక్తమగుచున్నది. ఆ సమయస్థితి నా యమ తండ్రిగారిట్లు వ్రాసిరి. ఆమె తన యంత్యదినములు సమీపింపగా తనకు మందిచ్చు డాక్టరుతో నిట్లనియె. 'శారీరక బాధను నేను సహింపజాలకున్నాను, కాని నాయాత్మకు నాయాస మెంతమాత్రమును లేదు. పరమేశ్వరుని యందు నాకు దృడమైన నమ్మకముగలదు.' ఈవాక్యముల వలన నీమెకుగల యనుపమేయ దైవభక్తి తెలియుచున్నది. కొడుకు కొమార్తెల మరణముచే నదివరకే దు:ఖపీడుతుడయిన గోవిందచంద్రుడు తరులతామరణముచే నత్యంత విహ్వలుడయ్యెను. దు:ఖము కొంత శమించినవెనుక గోవిందచంద్రదత్తుగారు తనప్రియపుత్రిక విద్యాభ్యాసముచేయు గదిలోనికి నరిగి చూడగా నాతనికి తోరుబాయి వ్రాసియుంచిన కాగితములు కొన్ని దొరకెను. అందుపై నాతడు తోరు కృతగ్రంథములన్నియు నచ్చువేయించ నిశ్చయించెను. ప్రథమమున తొరుబాయిచే వ్రాయబడిన గ్రంథము రెండవ కూర్పునందు దళసరి కాగితములపై సుందరమయిన యక్షరములతో నచ్చువేయబడెను. దానితో నొకచిన్న యుపోద్ఘాతమును తోరుదత్తు చరిత్రము ఆతోరూరుల పటములును జేర్పబడెను. కావున పూర్వము పల్చని కాగితములపై నసహ్యముగా దోచిన గ్రంథమే యిప్పుడు పెక్కు చదువరులకు నత్యంత పూజ్యమయ్యెను. దత్తుగారికి దొరకిన కాగితములలో మన పురాణకథల ననుసరించియు, వేదాంతకథల ననుసరించియు, హూణభాషయందు రచించినకొన్ని చిన్న చిన్న కావ్యము లుండెను. నవకావ్యముల రత్నముల మాల గ్రుచ్చవలయునని తోరూదత్తు సంకల్పించియుండెను. కాని, వానియందు నేడు కావ్యములే వ్రాయబడెను. మిగిలిన రెండు కావ్యములకొరకు విష్ణుపురాణమునుండి కొన్ని కథలను భాషాంతరీకరింప నిశ్చయించెను. సంకల్పప్రకార మామె యదివరకే 'కలకత్తా రివ్యూ' 'బెంగాల్ మాగ్యజీన్‌' అను మాసపత్రిక యందు గొన్ని కావ్యములను ప్రచురపరచెను. ఈ తొమ్మిది కావ్యము లొక పుస్తకముగా నచ్చువేయబడెను. చావుముందర తోరుదత్తు "కుమారీ డార్వెరను ఫ్రెంచు స్త్రీ ఆత్మవృత్త" మను ఒక కథను వ్రాయబూనెను. పరదేశీయులనుగూర్చి ఇట్టి కధలు వ్రాయవలెనన్న వారి యాచారవిచారములును, వారిదేశచరిత్రము మొదలయినవియు బాగుగా దెలియవలయును. తోరూదత్తాదేశముననుండిన స్వల్పకాలములోనే యీ సంగతులు నన్నిటిని తెలిసికొనెను. ఈ కల్పనా కథాగ్రంథ మంత యుత్తమయినది యని చెప్పుటకు వీలులేదు. కాని తోరూదత్తు జీవించి యాగ్రంథమును మరల దిద్ది యచ్చు వేయించియుండిన పక్షమున నింతకన్న నుత్తమముగా నుండి యుండవచ్చునని చెప్పుటకు సందియము లేదు. ఈగ్రంథమును బాడెరను ఒక ఫ్రెంచుస్త్రీ దిద్ది యుపోద్ఘాతము వ్రాసి ప్రచురపరచెను.

కవయిత్రి యనియు, గ్రంథకర్త్రియనియు మిగుల ప్రఖ్యాతిబొందిన తరులత యల్పకాలములోనే వాడిపోవుట యీ దేశముయొక్క దౌర్భాగ్యమే యని చెప్పవలసియున్నది. అయినను ఒక కవి

చ.మనుజుని జీవితంపు బరిమాణము నేడులచేత గాక చే
  సిన ఘనకార్యసంచయముచేత గణింప జెల్లు నెప్పుడున్

అని చెప్పినందున ఘనకావ్యనిర్మాణమును ఘనకార్య సంచయముచే తోరూదత్తు 'జీవితంపు బరిమాణము' అత్యల్పమయ్యును, ఆమె దీర్ఘాయుష్మతియే - మృతజీవియే - యని చెప్పవచ్చును.


________