అబలా సచ్చరిత్ర రత్నమాల, ద్వితీయ సంపుటము/విమలదేవి
విమలదేవి.
(అచ్చ తెనుఁగు)
ఈమె మార్వాడలోని రూపనగరమునకు ఱేఁడుగా నుండిన అమరసింగుని కూఁతురు. అప్పుడు డిల్లీలో నుండిన రారాజుపేరు ఔరంగజేబు. రజపూతదొరలు కొందఱు ఔరంగజేబునకు జడిసి తమబిడ్డల నతనికిచ్చి యతని కనికరమునకుఁ దగినవారయిరి. విమలదేవి తండ్రియుఁ దనబెద్దకూఁతు నౌరంగజేబునకిచ్చి పెండ్లిచేసెను. రాచకన్నియల నిట్లు తురకల కిచ్చుటకు విమలదేవి యిచ్చ మెచ్చక, తనయుసురులువోయినను తురకను పెండ్లాడననియుఁ దల్లిదండ్రులు తనకు మంచి రాచకొమరునివెదకి కూర్చనియెడలఁ దనపాయమంతయుఁ గన్నియగనే గడపెద ననియుఁ దలఁచెను. ఇట్లుండ నౌరంగజేబున కిల్లాలగు కేసరిబాయను విమలయొక్క యక్క పుట్టునింటికి వచ్చెను. అప్పుడు విమలదేవి తల్లియగు కౌమారదేవి మొదలయినవా రంద ఱామె రారాజునకునింతి యగుటవలన నామెను మిగుల గారవించిరి. కాని విమలదేవిమాత్ర మామె మొగమునుజూడక యేకతమున నుండి ముక్కంటిని గొలుచుచుండెను. అప్పుడచటికి కేసరిబాయి చెలియలినిఁ జూడవచ్చి యామె గొలుచు బూచుల దొరను దూఱసాగెను. అప్పుడు విమలదేవి మిగుల కోపగించి తోఁబుట్టువునుజూచి "యచ్చపు రాచకులంబునఁ బుట్టి మిగుల పనికిమాలిన కులమువానిఁ జేప ట్టిన నిన్నుఁజూచినదోసమువచ్చును. నేను నాయుసురులుబొందిని విడిచిపోయినను తురకల చెట్టఁబట్టక మేటిమగండగు రజపూత పుడమిఱేనిఁ బెండ్లియాదెద" ననియుఁ బ్రతినవట్టెను. అందుకామెయక్క "నిన్నుఁ దురకల కిప్పించకుండిన నేను ఔరంగజేబున కింతినేకాను" అని డిల్లీకరిగి తనమగని కాకతయంతయుఁ జెప్పి యతనిచేవిమల నిమ్మని తన తల్లిదండ్రులకు జాబు వ్రాయించెను.
విమలదేవియుఁ దాఁ జేసిని ప్రతినఁ దల్లిదండ్రులకుఁ జెప్పఁగా వారు మెచ్చియామెను గొనియాడిరి. కాని యౌరంగజేబు వద్దినుండి వచ్చినజాబునుచూచుకొనిన పిదప వారు మిగుల వెఱచి విమల నతని కియ్యఁదలఁచిరి. దీనింగని విమల మిక్కిలి నొగిలి సిసోదియా రాచకొలంబునఁ బుట్టిన రాజసింహుఁడు నాఁబరఁగు రాచకొమరుని బీరమ్ము నదివఱకువిని యున్నదిగాన నతని కొకజాబువ్రాసి తమయొజ్జలచేత నతనికిఁ బంపెను. ఆజాబులో నామె 'ఆఁడయంచ కాకికి నాతియగుట దగునా? దోసమెఱుఁగని దొరకొలంబునఁ బుట్టిన కన్నియకోఁతిమూతివాఁడును బోడితలవాఁడునునైన తురకఁ గూడుట యింపగునా? వెన్నుఁడు రుక్మిణిం దీసికొనిపోయినటుల నన్నుఁ గొనిపొండు. మీ ఱొకవేళ నన్నుఁ గాపాడరాకుండిన నేను నామేనుం జాలించెదను. ఇది నిజము' అనివ్రాసెను. ఈజాబుంగొని చనిన పుడమివేల్పు విమలయొక్క మంచి గొనముల నారాచసింగంబునకుం జెప్పఁగా నతఁడు తురకలపై కరం బలిగి గొప్ప దండుతో రూపనగరమునకు బయలుదేరెను. ఈలోపలఁ బెండ్లిమూర్తము దగ్గర వచ్చి నందున నౌరంగజేబు పెండ్లికొ మారుఁ డగుటకై రారాజుకుం దగినడంబముతోఁ గూడితూపనగరమునకుఁ బయలుదేరెను. ఔరంగజేబు రాకడ విని విమలదేవి డెందమునన్మిగులఁ గుంది చచ్చుటకు నుంకించునంతలో రాజసింహుఁడు వచ్చి యామెను చేపట్టిమరలఁ తనసీమకుఁదీసికొని పోవఁ దొడఁగె. ఇట్లు పోవుచు నొకప్పుడు గొన్ని కొండల నడుమకు వచ్చిరి. అప్పు డచట వారు కొంతసేపు డప్పి దీర్చికొనుటకై కూర్చుండిరి. అచ్చటికిఁ గొంచెముదవ్వుననేయౌరంగజేబు తనమూఁకలతో విడిసియుండెను. అప్పు డౌరంగజేబు నాతియు విమలదేవియక్కయు నగు కేసరిబాను ఒక చెంచువాఁ డెట్టులనో పట్టుకొనితెచ్చి వీరు దిగిన కొండత్రావునందొక పొదచాటుననుంచెను. అప్పు డామె "నన్నెవరయినఁ గాపాడుఁడ"ని యాకారడివిలో మొఱ్ఱపెట్టఁగా విని విమల తనమగని నంపఁ గానారాచపట్టి యా చెంచువానిచేతినుండి కేసరిబాను విడిపించి తనయింటియొద్దికిఁ దీసికొనివచ్చెను. కేసరిబా చెల్లెలి మొగముచూడ సిగ్గుపడి యామె తనకుఁ జేసినసాయమునకుఁ గరంబు సంతసించి తాను విమలకుఁ జేసిన యెగ్గునకుఁ దన్ను మన్నింపుమని చెలియలిని వేఁడుకొనెను. అప్పుడు విమలదేవి తనయక్కను వెఱవవలదని చెప్పి కొందఱుబంటుల వెంట నిచ్చి యామెను నౌరంగ జేబువద్ది కంపెను. కేసరిబా సెప్పఁగా నౌరంగజేబు జరిగినకత యంతయు విని రాజసింహునిపైఁ గల పగమాని డిల్లీకిఁబోయెను. రాజసింహుఁడును నెలఁతతో ఉదేపురమున కరిగి సుఖంబుండె.