అబలా సచ్చరిత్ర రత్నమాల, ద్వితీయ సంపుటము/మహారాణీ ఝాశీలక్ష్మీబాయి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

మహారాణీ ఝాశీలక్ష్మీబాయి.

భరతఖండమునందు శౌర్యమహిమవలనఁ బ్రఖ్యాతలయిన యువతీరత్నములలో ఝాశీలక్ష్మీబాయి యగ్రగణ్యురాలు. ఈమె శౌర్యాగ్ని 1857 వ సంవత్సరమువఱకును డాఁగియుండి యాకస్మికముగాఁ బ్రజ్వలించెను. ఈమెరాజ్య ముత్తరహిందూస్థానము నందలి బుందేలఖండ మనుప్రదేశము నందలి యొకభాగము. ఈరాజ్యము లక్ష్మీబాయిగారి మామగారి యన్నయగు రఘునాధరావుగారి ప్రతాపమునకు మెచ్చి పూర్వము ఈపూనా పేష్వగా రిచ్చిరి. ఆయనకుఁ బుత్రులు లేనందున ఆయనతమ్ముఁడగు శివరాంభావుగారి నభిషిక్తునిఁ జేసిరి. ఈశివరాంభావుగారి కాలమున పూనాపేష్వాల ప్రతాప మడుగంట నారంభించినందునను, రెండవ బాజీరావుగారి రాజకార్యనిపుణత్వశూన్యత వలనను ఈయనవారి నతిక్రమించి స్వతంత్రుఁ డాయెను. కాని యింతలో నాంగ్లేయ ప్రభుత్వ మెల్లెడలను వ్యాపించినందున శివరాంభావుగా రాంగ్లేయులతో సఖ్యము చేసి యనేక సమయములయం దింగ్లీషువారి కనేక విధముల తోడువడెను. శివరాంభావుగారికి కృష్ణారావు, గంగాధర రావులను ముగ్గురుపుత్రు లుండిరి. వారిలోఁ బెద్దవాఁ డగు కృష్ణరావు తండ్రి బ్రతికియున్న కాలముననే మృతిజెందినందున శివరాంభావుగారి యనంతర మాయనకొమారుఁ డగురామచంద్రరావుగారికి రాజ్యాధికారము దొరకెను. ఈయన పరిపాలన కాలములో పేష్వాలరాజ్యాధికార మెల్ల నింగ్లీషువారి యధీన మయినందున ఝాశీ సంస్థానాధీశునితో నాంగ్లేయ ప్రభుత్వము వారికి విశేష స్నేహభావము గలిగెను. ఈయన పుత్రహీనుఁ డగుటవలన నాయనంతర మాయన పినతండ్రియగు రఘునాధరావు, ఆయన యనంతర మాయనతమ్ముఁ డగుగంగాధరరావును రాజ్యమును పాలించిరి. ఈగంగాధరరావు చరిత్రనాయిక యొక్క భర్త.

మోరోవంతు తాంబే యనుక రాడే బ్రాహ్మణుఁడు పూనానగరమున వసియింపుచుండెను. ఆయనయందు రెండవ బాజీరావు సహోదరుఁ డగు చిమాజీయప్పాగారికి మిగుల విశ్వాసమును స్నేహమును గలిగియుండెను. 1818 వ సంవత్సరమున 8 లక్షల పించెను పుచ్చుకొని స్వరాజ్యమును ఇంగ్లీషువారి కిచ్చినట్టు పత్రము వ్రాసియిచ్చి రెండవ బాజీరావు బ్రహ్మావర్తమున వాసము చేయఁ జనెను. ఆసమయమునం దాయన తమ్ముఁడగు అప్పాగారును తమకుఁ దొరకు పింఛనును సేవకులను తీసికొని కాశీక్షేత్రమున వసియింపఁ దలఁచి దొరతనమువారి యనుజ్ఞవడసి కాశికిఁ బోయిరి. ఆయన పరివారములోనివాఁడు, కాన మోరాపంతుతాంబే సహిత మచటికే చనెను. ఈతనిని శ్రీమంతులగు నప్పాగారికి దివానుగా నుంచి, తత్ప్రీత్యర్థము నెలకు ఏఁబదిరూపాయల వేతన మొసంగుచుండిరి.

మోరోపంతుగారి భార్యయగు భాగిరధీబాయి సద్గుణమునందును సౌశీల్యమునందునుమిగుల ప్రఖ్యాతివడసెను. భార్య యిట్టి దగుటవలననే మోరోపంతుగారికి సంసారయాత్ర బహు సుఖకరముగాఁ గడచెను. ఆభార్యాభర్త లిరువురును పరస్పరానురాగము గలవారై కాశీక్షేత్రమున వసింపఁ గొన్ని దినములకు భాగీరధీబాయి గర్బముధరించి 1835 వ సంవత్సరము నవంబరునెల 19 వ తేదిని సుఖప్రసవమై స్త్రీశిశువును గనెను. తాంబేగారి శూరవంశమునఁ గాశీక్షేత్రమున జన్మించిన కన్యారత్నమే లక్ష్మీబాయి. జాతకర్మ నామకరణమహోత్సవములు బహు సంతోషముతో నడపి మోరో పంతుగా రాచిన్నదాని పేరు "మనూబాయి" యని పెట్టిరి. ఈ బాలిక దినదినప్రవర్థమాన యగుచుఁ దనముద్దుమాటల వలనను, మనోహర మగుస్వరూపమువలనను జననిజనకులను, వారిపరివారమును మిగుల నానంద పఱుపుచుండెను. ఇట్లీ బాలికారత్నంబు సకల జనాహ్లాదకరంబుగాఁ బెరుగుచుండ నామె మూడునాలుగు సంవత్సరములది యగువఱకు తన్మాతయగు భాగీరధీబాయి పరలోకగతురా లాయెను. ఈసమయముననే యప్పాగారును కైలాసవాసు లగుటవలన మోరోపంతుగా రచటినుండి బ్రహ్మవర్తమునకుఁ బోవ తటస్థించెను. అచట బాజీరా నీయనను మిగుల ప్రేమించి కుటుంబసంరక్షణ చేయుచుండెను.

మనూబాయికి బాల్యముననే జననీవియోగము తటస్థించినందున నామెతండ్రిగారి పోషణలోనే యుండుచు, నెల్లప్పుడు ఆయనను విడువక పురుషులలోనే సదా తిరుగుచుండెను. తల్లిలేని పిల్లయగుటవలనను, సుస్వరూప మధురభాషిణి యగుటవలనను శ్రీమంతులవద్ద నుండువా రందఱును మనూబాయిని మిగుల గారాబము చేయుచుండిరి. పేష్వాగారిదత్త పుత్రులగు నానాసాహేబు, రావుసాహెబు లాకాలమునందు బాలురేగాన వారితో నీ చిన్నది సదా కలిసి మెలసి యుండుచు వచ్చెను. నానాసాహేబేమి నేర్చిన నది మనూబాయి నేర్చుకొనుచు, వా రిద్ద ఱన్న చెల్లెలివరుసలతోఁ బిలుచుకొనుచుండిరి. చదువు, అశ్వారోహణము, ఖడ్గముత్రిప్పుట మొదలయిన వన్నియు మనూబాయి నానాసాహేబుగారితోడనే నేర్చుకొనెను. ఈమె స్వభావము బాల్యమునుండియే శౌర్యగుణప్రధానముగా నుండెను. దీని కంతకు క్షత్రియాగ్రగణ్య గుణములు గలశూరుల సంసర్గమే కారణము. ఇందువలన స్త్రీలు స్వభావముచేతనే పిఱికివారనియు, వారికి శౌర్యధైర్యము లెన్నివిధములను పట్టువడనేర వనియు వాదించు విద్వాంసులకు సంశయనివృత్తి కాఁగలదు. స్త్రీలకును పురుషులవలెనే బాల్యమునుండి యెట్టిసంస్కరణ జరుగునో యట్టిగుణములే యబ్బునని సిద్ధమగును.

ఇట్లుండ నొకనాఁ డాకస్మికముగా ఝాఁశీ సంస్థానమునందలి జ్యోతిష్కుఁడగు తాత్యాదీక్షితులు బాజీరావును సందర్శింపవచ్చెను. ఆదీక్షితులతో సందర్భానుసారముగా మోరోపంతుగారు ఝాఁశీవైపున మాచిన్నదానికి వరుఁడు కుదురునాయని విచారించెను. అందు కాయన "ఝాఁశీ సంస్థానాధీశ్వరుఁ డగు గంగాధరరావు బాబాసాహేబుగారికిఁ బ్రధమ పత్ని యగురమాబాయి కాలధర్మము నొందెను. కాన నీ కొమర్తె కాసంబంధము విచారింపు" మని చెప్పెను. తదనంతర మీవివాహమునుగుఱించి బాజీరావు గంగాధర రావుకుఁ దెలుపఁగా నాతఁడు సమ్మతించెను. లగ్న నిశ్చయమైన పిదపఁ గొందఱాప్తులతో మోరోపంతుగారు ఝాఁశీకి వెళ్ళిరి. అచటనే 1842 వ సంవత్సరమున మనూబాయి వివాహము మిగుల వైభవముతో జరిగెను. వివాహానంతరమునందు దేశాచారప్రకారము అత్తవా రాచిన్నదానికి 'లక్ష్మీబాయి' యను పేరుపెట్టిరి. మామగా రగు మోరోపంతు తాంబేగారికి 300 రూపాయల వేతన మిచ్చి గంగాధరరావుగారు తమయాస్థానమునందొక సరదారుగా నుంచినందున లక్ష్మీబాయి మరల బ్రహ్మావర్తమున కరుగుట తటస్థించినది కాదు.

గంగాధరరావుగారి యన్న గారగు రఘునాథరావుగారి పరిపాలనలో రాజ్యము విశేష దుస్థ్సితికి వచ్చినందున నారాజ్యాధికారమును పూర్ణముగా దొరతనమువారే స్వాధీనపఱచుకొని రాజ్యమునకుఁ గల ఋణములను దీర్చుచుండిరి. లక్ష్మీబాయి వివాహానంతరము గంగాధరరావుగారి యోగ్యతను గని బుందేలుఖండుయొక్క పొలిటికల్ యేజంటగు కర్నల్ ప్లీమన్ దొరగారు సర్వ రాజ్యపాలనమును గంగాధరరావు గారి స్వాధీనము చేయించిరి.

గంగాధరరావు తనప్రజలను సుఖులనుగాఁ జేయనెంచి రాజ్యమును బహునిపుణముగాఁ బాలింపుచుండెను. ఈయన కాలమునందు ఋణము లన్నియుఁ దీఱి భాండాగారమున ధనము దినదినాభివృద్ధిఁ బొందుచుండెను. ప్రజలును మిగుల సుఖులై యుండి సదా రాజును, రాణిని దీవింపుచుండిరి.

ఇట్లు కొన్ని రోజులు సౌఖ్యములోఁ గడచిన పిదప లక్ష్మీబాయిగారి దు:ఖమునకుఁ బ్రారంభ మయ్యెను. ఆమె కొకపుత్రుఁడు గలిగి మూడుమాసములు జీవించి మృతిఁ జెం దెను. గంగాధరరావు మహారాజుగారి మనస్సునందు పుత్రశోక మధికమయినందున ఆయన నానాటికి క్షీణించి, వైద్యోపచారములవల్ల నడుమనడుమ కొంచెము స్వస్థపడుచుండెను. ఇట్లు కొన్నిదినములు గడచినపిదప 1853 వ సంవత్సరము అక్టోబరునెల నుండియు నాతనిశరీరము మఱింత క్షీణింపసాగెను. అనేక రాజవైద్యులు సదా సమీపమునందుండి యౌషధోపచారములు చేయుచుండిరి. కాని యెంతమాత్రమును సుగుణమగుపడు జాడ గానరాకపోయెను. నవంబరు 15 వ తేది నుండి గంగాధరరావు ప్రకృతియందు వికార చేష్ట లనేకములు కానిపించుచువచ్చెను. అందువలన సంస్థానపుమంత్రి యగు నరసింహారావును మోరోపంతు తాంబేగారును గలిసి ముందు సంస్థానవ్యవస్థనుగూర్చి మహారాజులంగారితో ముచ్చటించిరి. వారి ప్రసంగమును వినినపిదపఁ దన కిప్పుడే రోగ మసాధ్యముగా లేదనియు, ముం దసాధ్యమగు నేని తమవంశమునందలి ఆనందరావును తనకుఁ దత్తపుత్రునిగాఁ జేసి యనంతర మా చిన్నవాఁడు స్వరాజ్యభారశకుఁ డగువఱకును వానిపేరిట లక్ష్మీబాయియే రాజ్యముఁ బాలింపవలయుననియుఁ జెప్పెను. అందుపై వారంద ఱాక్షణముననే ముహూర్తనిశ్చయము చేసి త్వరలోనే శాస్త్రోక్తముగా దత్తవిధి నడిపిరి. ఆమహోత్సవమునకు ఝాశీయందలి యనేకప్రముఖులను బిలిచిరి. వారితోడనే బుందేలఖండె పొలిటికల్ అసిస్టెంటు యేజంటగు మేజర్ యేలీసు దొరగారినిని, సేనాధిపతియగు క్యాప్టన్ మార్టిన్ దొరగారిని బిలిచిరి. వీరందఱి సముఖముననే దత్తవిధానము జరిగి ఆనందరావు పేరు దామోదరరావని పెట్టిరి. ఇట్లు దత్తవిధానమయినపిదప గంగాధరరావుగారు దివానుగారిచే నొకవిజ్ఞాపన పత్రము హిందూస్థానపు దొరతనమువారికి వ్రాయించి దానిపై తమవ్రాలు చేసి దానిని తమ హస్తములతో పొలిటికల్ అసిస్టెంటుగారి కిచ్చిరి. అందులోఁ బూర్వ మింగ్లీషు వారు తన తండ్రిగారితో జేసిన కరారు ప్రకారము తమ వంశపారంపర్యముగా రాజ్యము దొరకవలయుననియు, తనకు నౌరససంతతిలేనందున నొక దత్తపుత్రుని స్వీకరించితిననియు, దొరతనమువా రాదత్తు విధానమునకు సమ్మతించి వానికి రాజ్యమొసంగి వాఁడు పెద్దవాడగువఱకు వానిపేర తన పత్నియగు లక్ష్మీబాయి పాలించునట్లు చేయుఁడనియు వ్రాసిరి. విజ్ఞాపనపత్రిక వ్రాసిన దినముననే గంగాధరరావు పరలోకఁ గతుడయ్యెను. కులాచార ప్రకారము రాజుగారికి ప్రేతవిధులన్నియు జరుఁపఁబడెను. తదనంతరమునఁ గొన్ని దివసంబులకు లక్ష్మీబాయి సర్వానుమతంబునం దనపుత్రునకు రాజ్యమిమ్మని దొరతనమువారికొక విజ్ఞాపనపత్రికను వ్రాసెనుకాని యామె యుద్దేశ్యము సిద్ధించినదికాదు.

ఆవిజ్ఞాపనప్రకారము దొరతనమువారు దమదత్తతను స్వీకరించి రాజ్యమిత్తురని ఝాఁశీసంస్థానమున నందఱునుకొండంత యాసతోడ నుండఁగా 1855 వ సంవత్సరము మార్చినెల 25 వ తేదిని దత్తవిధానము దొరతనము వారంగీకరింపక రాజ్యమును తామే స్వాధీనపరచుకొని రనినసంగతి తెలిసెను. కాన లక్ష్మీబాయికిఁ బతి వియోగ దు:ఖమునకు దోడు రాజ్యవియోగ వ్యసనము సంప్రాప్తమాయెను. దొరతనము వారు రాజ్యమును తాముస్వాధీన పఱుచుకొని పశ్చిమోత్తర పరగణా గవర్నరుగారికచటి రాజ్యము నడుప ననుజ్ఞ ఇచ్చిరి. వారు రాజ్యము స్వాధీనపరచుకొని రాజ్యమునకును రాజకుటుంబమునకు నిట్లు కట్టుబాట్లు చేసిరి.

గ్రామమునం దున్న రాజభవనము రాణిగారి కుండుటకుఁగా నిచ్చి కిల్లాతాముతీసికొనిరి. మిగిలినసంస్థానమునందలి నగలు మొదలగు ధనమంతయు దత్తుపుత్రునకు మైనారిటీ తీరిన వెనుక నిచ్చుటకుగాను తమయొద్దనే దాఁచిరి. రాణిగారు జీవించియుండునంతవఱకు (5000 అయిదువేలరూపాయ)లామెకు నెలవేతనముగా నేర్పరచి యంతవఱకును ఆమెపైఁ గానిఁ యామె యితర భృత్యవర్గము పైనిఁగాని తమచట్టములు నడువఁగూడ దనియు వ్రాసియిచ్చిరి.

అందుకు ముందున్న రాణిగారి సైనికులకు విశ్రాంతిఁ గలుగఁజేసి వారికి బదులుగాదమసేన నుంచిరి.

రాణిగారికి అయిదువేలరూపాయల వేతనమిత్తుమని దొరతనమువారు వ్రాయుటయేగాని తనరాజ్యముతనకు దొరకవలయు నన్నయుత్కటిచ్ఛఁగల రాణిగా రాయల్ప త్రమును మరణపర్యంతమును స్వీకరించినవారు కారు. అంత నూరకుండక లక్ష్మీబాయి సీమలో నపీలు చేయఁ దలఁచి ఉమేశచంద్రబానర్జీయను వంగదేశీయునిని మఱియొక ఆంగ్లేయప్లీడరును ఆఱులక్షలరూపాయ లిచ్చి యింగ్లండునకుఁ బంపెను. కాని, వారచటికరిగి యేమి చేసినదియు నెచట నున్నదియు నేఁటివఱకును దెలియదు. వారచట ననేకోపాయముల జేసెదరనియు వారి ప్రయత్నములవలనఁ దనకు రాజ్యము మరల ప్రాప్తించుననియు రాణిగారికి మిగుల నమ్మక ముండెను.

1855 వ సంవత్సరమున దామోదరరావుగారికి నుపనయనము చేయఁదలఁచి ఆపిల్లనిపేర దొరతనమువారు దాఁచియుంచిన 6 లక్షల రూపాయలలోనుండి యొకలక్ష రూపాయలిండని రాణిగారు దొరతనమువారిని నడిగిరి. అందుకువారు నీవు దీనికొఱ కెవరినైన జామీనుంచినంగాని యియ్యమనఁగా నదేప్రకారము వారుకోరినవారి జామీనిచ్చి లక్షరూపాయలు తీసికొని, యాసంవత్సర మాఘమాసమునందు మహావైభవముతోఁ గుమారుని యుపనయనము చేసెను. తన భర్త సొత్తు పుత్రుని యుపనయనమునకుఁ దీసికొనుటకుఁగాను పరుల జామీను కావలసినందుకు రాణిగారి మనస్సెంత ఖేదపడి యుండెనో చదువరులే యోచింపఁగలరు.

ఇట్లు రాణిగా రత్యంతదు:ఖముతోఁగాలము గడుపు చుండఁగా 1857 వ సంవత్సరమున హిందూపటాలము లింగ్లీషువారిపైఁ దిరుగఁబడిన భయంకరకాలము ప్రాప్తించెను. ఈ యుద్ధ మితిహాససిద్ధమేగానతిహాజ్ఞుల కందఱకు విదితమే.

పటాలములు తిరగఁబడిన యీవర్తమానము ఝాశీలోని హిందూపటాలములకుఁ దెలిసి యదివఱకడఁగియున్న ద్వేషాగ్ని ప్రజ్వలింప జూన్ నెల 1 వ తేదిని వారును బందిపోటునకు బ్రారంభించిరి. వారి సేనానాయకుఁడు వారిని సన్మార్గమునకుఁ ద్రిప్ప నెంతయత్నించినను వారుతిరుగకుండిరి. అదిగని యతఁడు గ్రామమునందలి యాంగ్లేయుల నందఱును మిగుల భద్రమగు కిల్లాలోని కరుగుఁడని గుప్తరీతినిఁ దెలుపఁగా వారా ప్రకార మచటి కరిగి కోటద్వారముల మూసికొనిరి. కాని మరుసటిదినముననే యా తిరుఁగబడిన పటాలములవారు సేనలో మొనగానిఁ జంపి యుప్పొంగి కిల్లాను చుట్టుముట్టి బహుప్రయత్నముల నచటివారి నీవలకుఁదీసి యతిక్రూరులై వారనందఱి నేకక్షణముననే యమసదనమున కనిచిరి. వారట్లాయూర నొక యాంగ్లేయ ఆఇశువు సహితము లేకుండఁ జేసి ఝాఁశీరాజ్యము మహారాణి లక్ష్మీబాయిగారిదని ధ్వజమెత్తిరి. అప్పటినుండి రాణిగారు పటాలములతోఁగలిసి స్వతంత్రించిఝాఁశీసంస్థానమున తనరాజ్యమును స్థాపించ యత్నించఁ దొడఁగెను. ఆనాలుగురోజుల నయినరాణిగారు రాజ్యవ్యవస్థ మిగుల నిపుణతఁ జేసిరి. ఆమె తన నేర్పువలననే యేపనుల కెవ్వ రెవ్వరు యోగ్యులో యాయాపనులకు వారివారిని నియమించెను. కాని పూర్వపు ఉద్యోగస్థులను దొరతనమువారిదివఱకే తీసివేసిమందున రాణిగారికి దగినయుద్యోగస్థు లాసమయమున దొరకకుండిరి. అయినను ఆమె తనవలన నగునంతవఱకును సిద్ధపఱచి దుర్గసంరక్షణనిమిత్తము క్రొత్తసైన్యమును సిద్ధపఱచెను.

ఝాఁశీరాజ్యము మహారాణి లక్ష్మీబాయిగారు పాలింపుచున్న సంగతి విని వారి వంశీకుఁడగు సదాశివనాధాయణ యనునాతఁడు ఝాఁశీ సమీపమునందున్న కరేరాయను దుర్గమును వశపఱచుకొని యచటఁ దాను ఝాఁశీరాజ్యాభిషేకముఁ గావించుకొనెను. అబలయగు రాణిగారు రాణివాసమునందుండునదిగాన నామె తనకు లొంగునని తలఁచెను. కాని రాణిగారు సబలయై సైన్యమునంపి యాతనిఁబట్టి తెప్పించి ఝాఁశీ కిల్లాలో బంధించి యుంచెను. ఇ ట్లొకశత్రునిఁ బరిమార్చునంతలో రెండవశత్రుఁ డుత్పన్నమాయెను. ఝాఁశీకి సమీపమునందున్న ఓరచాసంస్థానపు దివాను, నధేఖా యనువాఁడు విశేషసైన్యముతోడ దాడివెడలి రాణిగారి కిట్లు వర్తమాన మంపెను. "మీకిదివఱకాంగ్లేయ ప్రభువు లిచ్చుజీతము మే మిచ్చెదముగాన రాజ్యమును మా స్వాధీనము చేయుఁడు" ఈవార్త విని రాణిగారి ప్రధాన సామంతు లందఱును భయభీతులయి మనకు ఫించెను నిచ్చిన యెడల సంగ్రామముతోఁ బనిలేదనియు వారితో యుద్ధము చేసి గెలుచుట సాధ్యము కాదనియుఁ జెప్పిరి. కాని యసామాన్యశౌర్యముగల రాణిగారు వారిమాటలను వినక యాశత్రువున కిట్లు వర్తమానమంపెను. "ఆంగ్లేయులు సార్వభౌములు. వారు నిగ్రహానుగ్రహములకు సమర్థులు. వారితో సమానులు కానెంచి యాజీత మిచ్చెదననెదవు. కాన నీవంటి వారింక పదుగురు వచ్చినను స్త్రీనగు నేను వారినందఱిని పౌరుషహీనులఁ జేయఁజాలుదు ననఁగా నిన్ను లెక్కింపనేల" ఇట్టివార్త నధేఖాకుఁ దెలిసినవెంటనే పట్టరానిరోష ముప్పతిల్ల నతివేగముగా వాఁడు ఝాఁశీని సమీపించెను. లక్ష్మీబాయిగారును నట్లు వర్తమానమంపి సంగ్రామమునకు సిద్ధముగానుండెను. అపు డామె తాను పురుషవేషముతో సేనాపతిత్వము వహించి ఘోరయుద్ధముచేసి నధేఖాను నోడించి వానియొద్దనుండి లక్షలకొలఁది ధనఁముగొని వానితో సంధి చేసెను.

మహారాణి లక్ష్మీబాయిగారి పరిపాలన మల్పకాలమె యైనను ప్రజలకు మిగుల సుఖకరముగా నుండెనఁట. కాన వారును రాణిగారి శుభమునే కాంక్షింపుచుండిరి. లక్ష్మీబాయిగారికి పురుషవేషముతో దరబారుచేయుట, అశ్వారోహణము చేయుట మిగుల ప్రియము. కాన నామె యనేకసమయముల యందుఁ బురుష వేషముతోడనే యుండుచుండెను. సాధారణముగా నామె స్త్రీవేషముతో నుండినను అలంకారము లేమియు ధరియింపక స్వేతవస్త్రము నే కట్టుకొనుచుండెను.

రాణిగారికి బీదలపై నధికప్రేమ యుండెను. ఒకనాఁడామె మహాలక్ష్మీదర్శనమునకుఁ బోయి వచ్చునపుడు కొందఱు బీదలు మూఁకలుగా నామె నడ్డగించిరి. దానికారణ మడుగఁగా వారు మిక్కిలి చలివలన బాధపడుచుండినందున వస్త్రదానము నపేక్షించి వచ్చిరని రాణిగారికి దెలిసెను. అందుపై నామె వా రందఱిని టోపీలు, అంగీలు, గొంగళ్లు మొదలగునవి యిప్పించెను.

మధ్య హిందూస్థానమంతయు నించుమించుగా బందిపోటు సైన్యముల స్వాధీనమయినందున నప్పటి హిందూస్థానపు గవర్నర్ జనరల్ లార్డు క్యానింగు దొరగారు ఇంగ్లండు దొరతనమువారి యనుమతిఁగొని యింగ్లండునందలియు, హిందూస్థానమునందలియు ప్రవీణులగు సేనానాయకులను రప్పించి రాజభక్తిగల యితర సైన్యములను, సహాయార్థ మరుదెంచిన యితర భూపతుల సైన్యములను వారిపరముచేసి యాప్రచండ సేనను నడుపుటకు యుద్ధకళావిశారదుఁడగు సర్ హ్యూరోజ్ దొరగారిని నియమించి ఆయనకు సర్వసేనాధిపత్య మిచ్చెను.

1857 డిసంబరు 17 వ తేదిని సర్ హ్యూరోజ్ దొరగారు సేనానాయకత్వము స్వీకరించిరి. యుద్ధమునకుఁ బోవుమార్గమును విచారించి వేరువేరుమార్గముల సైన్యములు నడువవలిసిన క్రమమును దెలిపెను. క్రమక్రమముగా సర్ హ్యూరోజ్ దొరగారు తమసంగ్రామ కౌశలమందఱునుం గొనియాడ బందిపోటుసైన్యముల పాలయిన భూము లనేకములు గెలిచి, ఝాఁశీని గెలుచుతలంపున నచటికి 14 మైళ్ళ సమీపమున తనసైన్యములను విడియించిరి. వారచటనుండి ఝాఁశీ వర్తమానముల నరయుచు, 1858 వ మార్చి 20 వ తేదిని ఝాఁశీ పొలిమేరల బ్రవేశించి పురరచన నరసి తదను సారముగా సైన్యములను యుద్ధమున కాయత్తము చేసిరి.

అప్పుడు శౌర్యరాశియగు రాణిగా రాగ్రహించి యిఁక నింగ్లీషువారితో పొసగదని తెలిసికొని యుద్ధసన్నాహము చేయసాగెను. నధేఖాతోడ రణ మొనర్చునపుడుంచిన విశేష సైన్యమున కనేకస్థలములనుండి పరతెంచివచ్చిన బందిపోటు సైన్యములు తోడుపడెను. రాణిగారి సైనికులలో శూరులగు ఠాకురులోకులును, విశ్వాసార్హులగు పఠాణులును విశేష ముండిరి. ఆసేనాధిపత్యమునంతను రాణిగారు తామే స్వీకరించి తగినబందోబస్తు చేయసాగిరి. ఝాఁశీకోట మిగుల విశాలమైనదియు, నభేద్య మగునదియునై యుండెను. అచట గొప్ప గొప్పబురుజు లుండెను. ఆకిల్లాలో విశేషదినములనుండి నిరుపయోగములై యున్న యనేకఫిరంగులను రాణిగారు బాగుపఱచి బురుజులపై కెక్కించిరి. ఒక్కొక్కఫిరంగి కొక్కొక్క యుద్ధకలానిపుణుని నియమించిరి. ఇట్లామె తననేర్పుమెయి సేనలను నడుపుచు యుద్ధసన్నద్ధురా లాయెను. ఈప్రకార ముభయసైన్యములును యుద్ధసన్నద్ధములై 23 వ తేదిని సంగ్రామమున కారంభించిరి. ఆదినము శత్రువులు ఝాఁశీకిల్లాను సమీపింప యత్నించిరి. కాని కోటలోని వారి యాగ్నేయ బాణప్రవృష్టి వారి కసహ్యమయినందున సమీపింపఁజాలక పోయిరి. ఆరాత్రి యింగ్లీషు సైనికులు కొందఱు గ్రామము సమీపించి యచట నాలుగుస్థలముల బురుజు లేర్పఱచి వానిపై పిరంగుల నునిచిరి. ఝాఁశీలోనివారును ఆరాత్రి యంతయు యుద్ధప్రయత్నమే చేయుచుండిరి. 24 వ తేదినాఁడు సహిత మింగ్లీషుసైన్యంబులే దైన్యంబు నొందెను. 25 వ తేది ప్రాత:కాలముననే యింగ్లీషు సైన్యంబులనుండి కిల్లాపైనిని, పురముపైనిని శతముఖ బాణవృష్టి కాసాఁగెను. ఆగోళమొకటి వచ్చి శత్రుసైన్యములోఁబడి పగిలి నలుగు రైదుగురినిఁజంపి పదిమందిని గాయపఱచుచుండెను. కాన నాదిన మాపట్టణము నందెచటఁజూచినను హాహాకారములే వినఁబడుచుండెను. ప్రజలన్నాహారములకై తిరుగఁ జాలకుండిరి. వారి దైన్యమును గని రాణిగారు వారికొఱ కొకయన్నసత్రము నేర్పఱిచిరి. ఆంగ్లేయ సైన్యంబులనుండి నారాయణాస్త్ర తుల్యములగు గోరమువలన తనసైన్యంబులు దీనముఖంబు లగ్టఁగని లక్ష్మీబాయి యింతటితో ధైర్యమువదలక సైనికుల కుత్సాహమును గలుగఁజేసి యాంగ్లేయసైన్యములను ధిక్కరించెను. ఇట్లీయుభయ సైన్యములును బీరువోవక మార్చి 30 వ దేదివఱకును సంగ్రామం బొనర్చుచుండెను. ప్రతిపక్షులగు ఆంగ్లేయసైన్యమున కనేక సేనానాయకులుండి నడుపుటవలనను, సైనికు లదివఱకే యుద్ధమున కనుకూలమగు శిక్షను గఱచియుండుటచేతను వారి సైన్యములు చెదరక యుద్ధముచే గెలుపొందుట యొక వింత కాదు. ఇక రాణిగారిసైన్యము లన్ననో యుద్ధశిక్ష నెఱుఁగనట్టి బందిపోటు వారితోఁ గలిసి జనసంఖ్య కెక్కువగాఁ గానుపించినను, వారలంద ఱొకప్రకారము యుద్ధము చేయఁజాల నందున విశేషముగాఁ జెదరుచుండిరి. ఇంతటి విశేషసైన్యమున కంతకును రాణిగారే సేనా నాయకత్వము వహించి నడుపుట బహుదుర్ఘటమని యందఱకును దెలిసినదే. అయినను ఆవీర వనిత తనబుద్ధిచాతుర్యమువనను, శౌర్యసంపదవలనను ప్రఖ్యాతులగు ఆంగ్లేయ సేనా నాయకులతోఁ బ్రతిఘంటించి యుద్ధభూమిని నిలిచి యనేక దినములు సంగ్రామము సల్పి వారిచే 'నీమెను గెలుచుట దుర్ఘట' మనిపించుట మిగుల వింతగదా?

ఆ యుద్ధసమయమునందు రాణిగారు సైన్యమం దంతటనుతనదృష్టి నిగిడింపుచు నచటఁ గలకొదవలనుదొలఁగింపుచు సైనికుల కనేక బహుమానము లిచ్చుచు, యుద్ధధర్మములను దెలుపుచు వారిని యుద్ధమునకుఁ బురికొల్పి వారి మనంబుల వీరరస ముద్భవిల్లఁ జేయుచుండెను. అప్పు డామె మిగుల జాలిపడి వచ్చినవారికి కామె సమక్షముననే చికిత్స జరిగింపు చుండెను. అప్పు డామె మిగుల జాలిపడి వారిపైనుండి తన హస్తమును త్రిప్పఁగా నాసైనికు లధికా వేశపరవశులయియుద్ధముచేయ నుంకింపుచుండిరి. ఇట్టిస్త్రీరత్నములు జన్మించుట వలననే కదా స్త్రీలకును, పురుషులను బోలిన ధైర్యశౌర్యములు గలవని యందఱకును దెల్లంబయ్యె. ఇట్లు 31 వ తేదివఱకును యుద్ధము జరిగినను ఆంగ్లేయ బలంబులు రాణిగారికోటను భేధింపఁ జాలవయ్యె. ఈరణరంగమునందు వారియుద్ధసామగ్రి యంతకంతకుఁ దక్కు వగుట వలన వారు జయమునం దంతగా నమ్మకములేక యుండిరి. ఇంతలో నానాసాహేబు[1]పేష్వాయొక్క సేనానాయకుఁడగు తాతాటోపేయను వీరుఁడు లెక్క కెక్కువయగు సైన్యముతో రాణిగారికిఁ దోడుపడుటకై కాల్టీనుండి వచ్చుచుండెను. ఆసైన్యము బహుదూరమున నుండఁగానే యాంగ్లేయ సేనా నాయకులు దూరదర్శకయంత్రమువలనఁ గనిరి. అంత నగ్ని దేవునకు వాయుదేవుడు సహాయ మగునటుల నీరాణిగారికి నాసైన్యమువచ్చి తోడుపడిన మనజయ మసత్య మనుకొనిరి. సర్ హ్యూరోజ్ దొర యంతమాత్రమున జంకక యచట రాణిగారితోఁ బెనఁగఁ గొంతసైన్యమును నియమించి కోటలోనివా రెఱుఁగకుండఁ గొంతసైన్యమును కాల్టీమార్గమున కంపెను. వారు చని యాత్రోవ వచ్చుచున్న విపులసైన్యములతోఁ బెనఁగి తమయుద్ధ సామర్థ్యమువలన వానినిఁబాఱఁదోలిరి. తాతాటోపేసైన్యముల బారికోర్వఁజాలక తమ యుద్ధసాహిత్యము నచటనే విడిచి పలాయితము లయ్యెను. కాన నాసాహిత్య మనాయాసముగా దొరకినందున సర్ హ్యూరోజ్ గారి బలంబులు మిగుల నుత్సాహము గలవయ్యె. వారికి నిదివఱకుఁ గలయధైర్య మంతయు నడుగంట శత్రువుల పై నధికోత్సాహముతో తప్తగోలవర్షముఁ గురిపింపసాగిరి.

ఏప్రియల్ 2 వ తేది వఱకును యుద్ధము చేసియుఁ దాము పురప్రవేశము చేయ లేకుండుటకు మిగుల చింతిల్లి సర్ హ్యూరోజ్ దొరగారు తమబుద్ధి ప్రవీణతవలన నాదినమున నాకిల్లాను చేకొనఁదలఁచిరి. ఆయన తదనుసారముగా బలంబుల నంప వారును మిగుల నుత్సాహముతో శత్రుపక్షమునుండి వచ్చుబాణములను సైచిగ్రామద్వారములనుండియుఁ గోటగోడనుండియుఁ బురముఁ జొరసాగిరి. తాతాటోపేగారి పరాభవమును విని రాణిగారి సైనికులు మిగులనిరుత్సాహులైరి. అయినను యుద్ధమునందుఁ దెగఁగా మిగిలినవారికి రాణి గారుతమవాక్యమువలన శౌర్యముపుట్టించి సంగ్రామము నడుపుచుండిరి. 3 వ తేదిని తమ్ము నెదిరించువారు లేక హూణబలంబులు పురమంతటను వ్యాపించెను. 4 వ తేదిని పట్టణమంతయు వారి స్వాధీనమాయెను.

తానిన్నిదినంబులు చేసినశ్రమ వృధయైపోవ శత్రువులు తననగరము నాక్రమించుటఁగని రాణిగారు మిగుల విచారపడిరి. కాని యామె యంతటితోనైన ధైర్యము విడువక కర్తవ్యము నాలోచించి జయోత్సాహులగు శత్రువు లిఁక తనకిల్లా నాక్రమించి తనను బంధింతురని కని యామె యెట్లయిన రణరంగమున ప్రాణములు విడువ నిశ్చయించెను. అంత నామె పురుష వేషముతో బయలుదేర నిశ్చయించి తనదత్తపుత్రుని యం దధికప్రీతి గలదిగాన నాచిన్న వానిని తనమూపునఁ గట్టుకొని అశ్వారోహణముచేసి నాల్గవతేదిరాత్రి స్వల్పసైన్యము తో నాంగ్లేయసైన్యంబులతోఁ బెనఁగుచు దానిఁ బాయఁగాఁ జీచికొని కాల్పీమార్గమున నరిగెను.

రాణీగారు తమసైన్యములలో నుండి కాల్పీమార్గమున వెళ్లిన సంగతి విని సర్ హ్యూరోజ్ దొరగారు నఖేదాశ్చర్య మగ్నులయిరి. ఆయన యంతటితో నూరకుండక యొక సేనానాయకునిఁ గొంత సైన్యసహితముగా నామెను వెంబడింప నంపెను. కాని రాణిగారు వారికి దృగ్గోచరముగాక తనగుఱ్ఱము నతిత్వరగా నడుపుచుండెను. జన్మాదిగా యుద్ధమన్న మాట యెఱుఁగక సదా రాణివాసమునందు వసియించు బ్రాహ్మణ వితంతువు వీరుల కభేద్యమగుహూణసైన్యమును భేదించుకొని క్షణములో నదృశ్యయగుట కెవ్వ రాశ్చర్యపడకుందురు ?

మహారాణీ లక్ష్మీబాయిగా రారాత్రి బయలుదేరి తనను బట్టవచ్చువారికిదృగ్గోచరయుఁగాక సూర్యోదయమునకుఁఝాశీ సంస్థానమునకు సరిహద్దయిన భాండేరయను గ్రామమునఁ బ్రవేశించెను. అచట నామె గుఱ్ఱమును దిగి కొమారునకు ఫలాహారముఁ బెట్టి మరల నశ్వారోహణము చేసెను. ఇంతలో నాంగ్లేయసైన్యాధిపతి కొంతసైన్యముతోఁ దనను బట్టవచ్చెననియామె వినెను. ఆసమయమునం దామెయొద్దఁ బదునైదుగురుశూరులు దప్ప వేరుసైన్యము లేదు. అట్లయ్యును ఆశూరశిరోమణి జంకక తనఖడ్గము నొరనుండి తీసి యుద్ధసన్నుద్ధయైచను చుండెను. ఇంతలో నాసైనికు లామెనుముట్టడించిరి. కాని యామె తనయుద్ధనైపుణ్యమువలన నాసైనికులను చీకాకు పఱచి కొందఱిని యమసదమున కనిచి క్షణములో నదృశ్య యయ్యెను. బహుసైన్య సమేతముగా నున్న యాంగ్లేయ సేనాధ్యక్షుని స్వల్పసైనికులతో నొకయబల యోడించి పంపుట యెంతయు వింతగదా! అచటినుండి బయలుదేరి యారాత్రియామె కాల్పీనగరమున నానాసాహేబునొద్దఁ బ్రవేశించెను. ఇట్లు నిద్రాహారములు లేక యామె యశ్వారోహణము చేసి 108 మైళ్ళుప్రయాణముచేసెను. దీనినిబట్టిచూడఁగా నామెధైర్యమును అశ్వారోహణశక్తియు నందఱికి నత్యద్భుతమని తోఁచక మానదు.

రాణీలక్ష్మీబాయిగారు కాల్పీకి వచ్చినసంగతి విని బందేవాలానవాబు సహితము తనసైన్యములతో రావుసాహెబు పేష్వాగారికి సహాయుఁ డయ్యెను. వీఱందఱును తమసైన్యముల యుద్ధసన్నద్ధములుగాఁ జేయుచుండిరి. రాణిగారిశౌర్యము నెరిగియు రావుసాహెబు పేష్వా గారు తనకుఁ కలస్వాభిమానము వలనఁ దనసర్వసేనాధిపత్యమును నొకస్త్రీ కిచ్చుటకు సమాధానపడఁడయ్యె. కాన రాణిగారు కొంతవఱకు యుద్ధమునందు నిరుత్సాహు రాలయియుండిరి.

సర్ హ్యూరోజ్ దొరగారు ఝాఁశీనుండి బయలుదేరి కాల్పీని గెలుచుటకయి సైన్యసమేతముగా రాత్రిం దినప్రయాణములు చేయుచు కాల్పీ సమీపమునందలి కూచయనుగ్రామమున పేష్వాగారి సైన్యముల నెదిరించిక్షణములో నోడించిరి. కాన పేష్వా, బందేసంస్థానపు నవాబు మొదలగువారితో రాణిగారు కాల్పీకి వెళ్ళవలసివచ్చెను. ఆసమయమునం దామె సొంత సైన్యము లేనందున పేష్వాగా రామెను మన్నింప నందునను ఈయుద్ధమునం దామె ప్రతాప మేమియుఁ దెలిసినదికాదు. కాని కాల్పీకి వెళ్లినపిదప నామెసైన్యము బందోబస్తునుగుఱించి తనయభిప్రాయము పేష్వాగారికిఁ దెలిపెను. అప్పుడాతఁడు లక్ష్మీబాయిగారి తెలివిని గని తాతాటోపిని లక్ష్మీబాయిని సర్వసైన్యాధిపత్యమునకు నియమించెను. అందుపై వారిరువురు మిగుల దక్షతతో సైనికులకు యుద్ధము గఱపుచుండిరి. ఇంతలో నాంగ్లేయసైన్యంబులు కాల్పీనగరము నలుప్రక్కల ముట్టడించెను. అప్పుడు రెండువందలగుఱ్ఱపుబలము నిచ్చి యమునానదివైపున యుద్ధముచేయ రాణిగారి నంపిరి. ఆమెయుఁ గడమసైన్యము మిగులజాగ్రతగా నుండుటఁ గని తనస్థలమునకుఁ బోయెను. కాని యుద్ధమునం దసమానప్రజ్ఞగల హూణసైన్యంబు లల్పకాలములోనే పేష్వాగారి సైన్యంబుల దైన్యంబు నొందించెను. అది గని రావు సాహేబు పేష్వా మొదలగు వా రధికవిచారమున మునుంగ రాణిగారు వారికి ధైర్యపు మాటలు చెప్పి తనస్వల్పసైన్యముతో శత్రువులను చీకాకు పఱచెను. కాని వెనుకనుండి వచ్చుశత్రు సైన్యములవలనను, తమసైన్యమునందలి యితరసేనాధిపతులు పలాయితు లగుట వలనను రాణిగారు యుద్ధమునుండి తొలఁగవలసినవా రయిరి.

ఇట్లు కాల్పీయం దపజయమును బొందిన యీప్రముఖులందఱును గ్వాలేరువైపునఁ గలగోపాలపురమునందుఁ జేరి ముందు చేయవలసినదానినిగూర్చి విచారింపుచుండిరి. వారెంత విచారించినను సైన్య మత్యల్ప మగుటచే యుద్ధము చేయుటకుఁ దోఁచకుండెను. రాణిగారును వారితోడనే యుండెఁగాన నామె యాయల్పసైన్యముతో గ్వాలేరున కరిగి సిందేగారిని తమకుఁ దోడుపడ వేఁడుకొనవలయు ననియును, అందు కాయన సమ్మతించినయెడల యుద్ధము చేయవలయుననియు నాలోచన చెప్పెను. ఆమె గఱపిన యాలోచన పేష్వాగా రంగీకరించి దిన ప్రయాణములు చేసి 1858 వ సంవత్సరము మేనెల 30 వ తేదిని గ్వాలేరునకు సమీపమునం దున్న మురారిపుర సమీపమునఁ బ్రవేశించిరి. అంత వారందఱును విచారించి సిందేగారిని తమకు సహాయు లగుటకుగాను వర్తమాన మంపిరి.

ఆవార్త సిందేగారి దరబారున కరగఁగా నదివఱకుఁ దాత్యాటోపేబోధవలన నాతనికి వశులైన సరదార్లందఱును పేష్వాగారికి సహాయము చేయుదమని చెప్పిరి; కానిప్రభుభక్తిగల జయాజీరావు సిందేగారును, దివాను దినకరరావుగారును వారివాక్యములను లెక్కింపక మిగుల యుక్తిగా మఱుసటిదినము పేష్వాసైన్యములను బాఱుఁదోల నిశ్చయించిరి. కాని ఆ రాత్రి దివానుగారు లేని సమయమున నెవరో మహారాజుగారిని యుద్ధమునకుఁ బురికొల్పిరి. అంత నాయన తన కధిక విశ్వాసపాత్రములగు సైన్యములంగొని సూర్యోదయమువఱకు మురారి కీవల రెండుమైళ్లదూరమునఁ గల బహాదురపురమునందుఁ దనదండను నిలిపి యుద్ధ మారంభించెను. ప్రధమము నందు పేష్వాసైన్యములపైఁ బడుగుండ్లను గని సిందే పూర్వము పేష్వాల బంటగుటవలనఁ దమ కనుకూలుఁడై తమనెదుర్కొన వచ్చుచున్నాఁడని తలఁచిరి కాని యాబాణవృష్టి యంతకంత కెక్కువగుటవలన పేష్వా మొదలగు పురుషశ్రేష్ఠులందఱు రిచ్చవడి యేమియుఁ దోఁచకుండిరికాని వారు తాను చెప్పినటుల సైన్యపు బందోబస్తు చేయకున్నను, కోపముంచక రాణీ లక్ష్మీబాయిగారు తగినయుక్తిఁగఱపి యుద్ధమారంభముచేసెను. అందువలన నారెండుసైన్యములును కొంతవఱకు సమానము గాఁ బోరి పిదప సిందే సైన్యములకే గెలుపుదొరకు నట్లయ్యెను. అది గని రాణిగారు తాను ధైర్యముతోఁ గొందఱాశ్వికులనుగొని సిందేగారి ఫిరంగీలపై నాకస్మికముగా నడరి మహాఘోరముగాఁబోర సిందే సైనికులు పాఱఁజొచ్చిరి. అదిగని తాత్యాటోపే సైనికులు మఱింత యుత్సాహముగలవారయి శత్రుసైన్యములను నదలింపసాగిరి. కాన సిందేగారి పరాక్రమ మంతయువృధవోవ నాతఁడును, దివాను దినకర్ రావును మఱికొందఱు సరదార్లతోఁ దనకుసహాయులగుఁడని యడుగుటకుగాను ఆగ్రా కిల్లాలోనున్న ఆంగ్లేయుల యొద్ది కరిగెను. విపుల సైన్యసమేతుఁడగు నొకతరుణ నృపుని నల్పసైన్యముఁగల యొకయబల తనశౌర్యముచేఁ బాఱఁదోలెను. ఇందువలననే యొకకవి యిట్లు నుడివెను : _

[2]

 'క్రియాసిద్ధి: సత్వేభవతి మహతాం నోపకరణే'

సిందేగారు పురము విడిచి చనినవెనుక నాతని రాణివాసపు స్త్రీ లందఱు ఆత్మసంరక్షణముకొఱకు నరవర యనుపురమున కరిగిరి. వీరందఱు బయలుదేరి కొంచెముదూర మరిగిన పిదప సిందేశత్రువులచేఁ బడెనని విని గజరాయను నొకస్త్రీచేత ఖడ్గముధరించి రాజభవనమునకు వచ్చి రాజు సురక్షితముగా వెళ్లినవార్త విని వెనుక మరలెను. ఆహా యీస్త్రీయొక్క ధైర్యము ఆసామాన్యముగదా?

రాజు పలాయితుఁడయిన వెనుక సకల సైన్యములు తమ కనుకూలములయినందున పేష్వాగారికి నగరు ప్రవేశిం చుట కెంతమాత్రము ప్రయాసము కాలేదు. పేష్వాగా రంతటితోఁ దాము సార్వభౌముల మయితిమని తలఁచి పట్టాభిషేక మహోత్సవము గావించుకొని బ్రాహ్మణసంతర్పణలు చేయసాగిరి. లక్ష్మీబాయి యివన్నియు రాజ్యనాశన హేతువులనియు, ఈయాడంబరమును వదలి సైన్యపు బందోబస్తు చక్కఁగాఁ జేసి యుద్ధసనద్ధులమయి యుండవలసిన దనియుఁ జెప్పెను. కాని యవి స్త్రీవాక్యములని పేష్వాగారును, ఆయన సేనా నాయకుఁ డగు తాత్యాటోపేగారును మన్నింపకమహోత్సవములలోను, బ్రాహ్మణ సంతర్పణములలోను మునిఁగి యుండిరి.

జూన్ నెల 16 వ తేదిని సర్ హ్యూరోజ్ గారు సైన్య సహితులయి బహాద్దరు పురము చేరిరి. కాని భోగపరాయణులగు పేష్వాగారి కాసంగతియే తెలియకుండెను. ఆంగ్లేయసేనానాయకు లచటినుండి మురారీకోట చేకొనిరని వినియును పేష్వాగారు చింతదక్కి పుణ్యకృత్యములు చేయుచునేయుండిరి. ఆయన యనుజ్ఞ వడిసి తాత్యాటోపే సైన్యవ్యవస్థ చేయురీతి గానక లక్ష్మీబాయి గారిని వేఁడుకొనెను. జయము కలుగు నాసలేదని తెలిసికొనియు రాణిగారు సమరమునఁ దెగి స్వర్గముఁ గాంచ నపేక్షించి యాయన మనవి చిత్తగించెను. తదనంతర మామె కొంతసైన్యమును చక్కఁబఱచి మిగత నితర సేనానాయకులును జూడని యమించెను. ఆమెతన సేన ననేక భాగములు విభజించి మిగుల భద్రముగా యుద్ధసన్నద్ధురాలై నిలిచెను. ఇతర సైన్యాధిపతులును తమతమ శక్త్యనుసారముగా వ్యూహములు వన్ని నిలిచిరి. రాణిగారు గ్వాలేరు పూర్వదిక్కు సంరక్షింతునని తనసైన్యమునచటనే మోహరించి నిలిచిరి.

17 వ తేదిని బ్రిగేడియర్ స్మిథ్ అనుసైన్యాధిపతి గ్వాలేరు పూర్వదిక్కుననున్న సైన్యములపై బాణవృష్టి చేయసాగెను. అది రాణిగారి బలమగుటవలన నాసైనికు లింగ్లీషు వారిబలములనాదినమున ధైర్యముతో మార్కొనినిలిచిరి. రెండవదినమును లక్ష్మీబాయిగారి వీర్యోత్సాహవచనములవలన నాసైన్యములు పరబలంబులంబొడిచితామును మృతులగుచుండిరి. లక్ష్మీబాయిగారి శౌర్యముం గని యాంగ్లేయ సేనానాయకులు మిగుల నద్భుతపడి యామె నోడింప నిశ్చయించిరి. ఇట్లు వారు నిశ్చయించి నలుదిక్కులనుండి యామె సైన్యముపై బాణపరంపరలు పఱపుటచే నా సైన్యంబులు నిలువక పాఱఁ జొచ్చెను. ఇట్లు తన ముఖ్య సేవకులు కొందఱుదప్ప నందఱును తనను విడిచినందునను. అంతకుముందే యితర సేనాధిపతు లపజయమునుబొంది పలాయితులగుటవలనను, లక్ష్మీబాయి తనఖడ్గబలముచే శత్రుసైన్యములలోనుండి యనేకశూరులం బొడుచుచు నావలకుఁ బోవుచుండెను. ఇట్లామె బహుదూరము వెళ్ళిన పిదప నామెతో పురుష వేషము ధరించియున్న 'ముందర' యను దాసియొక్క యంతిమశబ్ద మామె చెవినిఁబడెను. అందువలన నామె వెనుక తిరిగి తన ప్రియదాసినిఁ జంపినవానిని యమపురమున కనిపి ముందుకుసాగెను. ఇట్లు ముందతిత్వరగా నరుగుచుండ నొక జలప్రవాహ మడ్డపడినందున ననేక గాయములచే క్షీణించియున్న యామె గుఱ్ఱ మాప్రవాహమును దాటఁజాలక నిలిచెను ! లక్ష్మీబాయిగా రాగుఱ్ఱము నావలకుఁ దీసికొని పోవ ప్రయత్నించెనుగాని యాపని సిద్ధించినదికాదు. ఇంతలో శత్రుసైనికులు కొంద ఱామెను చేర రాఁగా నాయువతి మిగుల శౌర్యముతో వారిలో ననేకుల నంతకపురంబున కనిచెను !! వారు బహు జనులును ఈమె యొంటరిది, కాన వారిలో నొకఁ డామె వాలునకు జంకక పక్కగా నిలిచి యామె తలకుడివైపుగా నఱికెను. బంధింపఁబడిన సింహముపై మత్త గజమాడు నట్లాభటుఁడు చేసిన ఖడ్గప్రహారమువలన నామె తల కుడివైపంతయు తరగఁబడి రక్తము ప్రవహింపసాగెను. ఇంతలో నాయాశ్వికుఁడు తన ఖడ్గము రాణిగారి యురమునందు గ్రుచ్చెను. పురుష వేషముతో నుండుటవలన నీమె రాణిగారని పగవారికి గుర్తింప రాకున్నను, శత్రుపక్షమునందలి యొకా నొకసైన్యాధిపతియగునని వారికిఁ దోఁచెను. ఈదెబ్బతో రాణిగా రాసన్నస్థితిని బొందెను. కాని యావీరయువతి యట్టి సమయమునందును ధైర్యము విడువక తన నట్టిస్థితికి దెచ్చిన యాశ్వికునిఁ బరలోకమున కనిచెను !

ఇట్లామె వానినిఁజంపి బొత్తుగా శక్తిహీన మయ్యెను. అంతవఱ కామెను విడువకున్న రామచంద్రరావు దేశముఖు సగము ముఖము కోయఁబడిన రాణిగారిని శత్రువులచేతఁ బడకుండ సమీపమునందున్న పర్ణకుటిలోనికిఁ గొని చనెను. ఆయన మిగుల దు:ఖించి రాణిగారికి నుపచారములు చేయు చుండెను. కాని 1858 వ సంవత్సరము జూను నెల 18 వ తేదిని అద్వితీయశౌర్యగుణ మండితురాలగు ఝాఁశీ మహారాణి లక్ష్మీబాయిగా రీలోకమును విడిచి శాశ్వతసుఖప్రదమగు లోకమున కరిగెను! రామచంద్రరావు దేశముఖగారును రాణిగారి యాజ్ఞప్రకార మామెశరీరము శత్రువులచేఁ బడకుండ గుప్తముగా నగ్ని సంస్కారము చేసెను.

అటు పిమ్మట నాయుద్ధమునందు జయ మొంది అంగ్లేయ సేనాధిపతులు సిందేగారికి మరల రాజ్యము నిచ్చిరి. తదనంతర మాసేనానాయకులు క్రమముగా బందిపోటు వారి నడఁచి క్రమముగా తాత్యాటోపేను నితర సైన్యాధీశ్వరులను నురితీయించిరి. బందేవాలా నవాబు శరణుచొచ్చి క్షమకుఁ బాత్రుఁడయ్యెను!

ఇంగ్లీషుప్రభువు లిట్లు విజయులయినందున మనకు స్త్రీవిద్యాదికములచే నత్యంత లాభప్రదమైన విక్టోరియా మహారాజ్ఞిగారి రాజ్యము ప్రాప్తించెను.

రాణిగారి దత్తపుత్రుఁడు తల్లి యనంతర మనేకకష్టము లనుభవించి ప్రస్తుతము నెల కేఁబదిరూపాయల జీవనము గలిగి సామాన్యమానవునిరీతి ఇందోరుపట్టణములోఁ గాలము గడపుచున్నాఁడు. ! ! !

లక్ష్మీబాయి యింగ్లీషువారితోఁ బోరాడినప్పటికి ననే కాంగ్లేయు లామె శౌర్యాతిశయముల ననేకరీతులఁ గొనియాడినారు. వానిలోఁ గొన్నిఁటి నిచ్చట నుదాహరించు చున్నాను : _

(1) రాణిగారికిఁ బ్రతిపక్షియై ఆమె నోడించిన సర్ హ్యూరోజ్ సైన్యాధిపతియే 'గుణీగుణం వేత్తి' యన్న న్యాయమున రాణిగారినిగుఱించి యిట్లువ్రాసెను.

"రాణీలక్ష్మీ బాయియొక్క అత్యున్నతమైన కులీనత వలనను, ఆమె యాశ్రితజనులవిషయమయి మఱియు సైనికుల, విషయమై చూపిన యపారమయిన యౌదార్యమువలను, గొప్పగొప్ప సంకటసమయములయందును చలింపని ధైర్యము గలదియై యుండినందునను, సైనికులలో నామెనుగుఱించి పూజ్యభావము హెచ్చి యామెపక్షము మాకు భయంకర మయ్యెను."

"గ్వాలేరులో జరిగిన యుద్ధముయొక్క గొప్ప పరిణామము ఝాఁశీరాణియొక్క మృత్యువు. ఆమె యబలయయినను మాతోఁ దిరుగఁబడిన వారిలో నతిశూరయు నత్యుత్తమసేనాగ్రణియునై యుండెను."

(2) "ఆయుద్ధమునందు నత్యంత దృఢనిశ్చయమును, తేజమును, జనానురాగమును గలిగినట్టి సైన్యాధ్యక్షురాలయిన ఝాఁశీరాణి చంపఁబడెను." డాక్టరు లో.

(3) "లక్ష్మీబాయి నడితారుణ్యములో నుండినందున నత్యంత సుందరముగా నుండెను. ఆమెమనసు ఉత్సాహపూర్ణముగాను, శరీరము మిక్కిలి సశక్తముగాను నుండెను, ఆమె యందు, ప్రాణముపోయినను చింతలేదుగాని మానహాని సహింపనన్న యభిమానముండెను." మార్టిన్ దొర.

(4) "ఏస్త్రీని రాజ్యతంత్రము నడుపుటకు నసమర్థు రాలనియెంచి, మేము రాజ్యభ్రష్టముగాఁ జేసితిమో యాస్త్రీయే ప్రచండసైన్యముయొక్క యాధిపత్యమును స్వీకరించుటకు సంపూర్ణముగా సమర్థురాలని మాకు నిప్పుడు తెలిసెను." ఎడ్విను ఆర్నోల్డుదొర.

(5) "శత్రువులలో నత్యుత్తమమనీషి ఝాఁశీయొక్క మహారాణియే" జస్టిన్ మ్యాకర్తిదొర.

  1. నానాసాహేబు (రెండవ) బాజీరావు దత్తపుత్రుఁడు. 1857 వ సంవత్సరపు సిపాయిల స్వామిద్రోహమునకు నితఁడే పురస్కర్త. ఇంగ్లీషు వారియొద్దనుండి తన పూనారాజ్యము మరల సంపాదించవలయునని యితని యత్న ముండెను.
  2. గొప్పవారి కార్యసిద్ధి వారిపరాక్రమమువలననే యగును; కేవల సామగ్రి బలమువలనఁ గాదు.