Jump to content

అబలా సచ్చరిత్ర రత్నమాల, ద్వితీయ సంపుటము/లీలావతి

వికీసోర్స్ నుండి

లీలావతి.

ఉ. వింతగ వాదమేల యవి వేకుల పోలిక? స్త్రీలవిద్య సిద్ధాంతమె చేసినారు మనతజ్ఞులు పూర్వులు. - వీరేశలింగకవి.

గణితశాస్త్రపండితుఁడని ప్రసిద్ధిఁగాంచిన భాస్క రాచార్యుల కొక కూఁతురుండెను. ఆమెపేరు లీలావతి. సిద్ధాంత శిరోమణియందు భాస్క రాచార్యులవారు తా నాగ్రంథము 1072 వ శాలివాహన శకసంవత్సరమునందు రచియించితినని వ్రాసినందున లీలావతి 12 వ శతాబ్దముననుండినట్టు తేలుచున్నది. లీలావతి బాలవితంతువైనందున నామె భర్తృవంశమేదియో తెలియదు. మనదేశమునందుఁ జరిత్రములు వ్రాసి యుంచుపద్ధతి పూర్వమునుండి లేనందున గణితశాస్త్రమునం దసమానపండితయైన లీలావతినిగుఱించి కొన్ని సంభవాసంభవములగు కధలుదప్ప మఱియేమియుఁ దెలియదు. ఐననుదంతకధలుదప్ప చరిత్రమున కితరసాధనంబు లేవియు లేనందున నాదంతకథలే యిచ్చట వ్రాసెదను. భాస్క రాచార్యులవారు జ్యోతిషమునందు మిగుల ప్రవీణులు. కాన లీలావతికి వైధవ్యము ప్రాప్తించునని జాతకమువలనఁ దెలిసికొనెనఁట. అందువలన భాస్క రాచార్యులు పూర్ణాయువు గలవరును వెదకి తెచ్చియొక మంచిముహూర్తమునందు లీలావతికి వివాహము చేయ నిశ్చయించిరి. వివాహమునకుఁ బూర్వము చేయవలసిన విధుల జరిపి కన్యావరులను మండపమునందుఁ గూర్చుండఁబెట్టెను. ముహూర్తము తెలియుటకయి నీటిలో ఘటికాయంత్రము (సన్నచిల్లి గలగిన్నె) నొకదాని నునిచి, పురోహితసమేతుఁ డయి ముహూర్తము నెదురు చూచుచుండెను. అంతఁ గొంత సేపటికి లీలావతి యాగిన్నెలోనికి నీరు వచ్చువిధము చూడగోరి కొంచెము జరిగి చూచుచుండెను. అట్లు చూచునపు డామె శిరోభూషణమునం దుండిన యొక సన్ననిముత్య మాగిన్నెలోఁబడి నీరు వచ్చుమార్గము నరిగట్టెను. ముత్యము పడిన సంగతి యెవరును చూచినవారుకారు. ఎంతసేపు చూచినను గిన్నె మునుఁగకుండుటఁ గని దానికారణము నెఱిగి ఆచార్యులవారు హతాశులయి యేదో యొక ముహూర్తమునందు లీలావతి వివాహము గావించిరి.

వివాహానంతరము స్వల్పకాలములోనే లీలావతికి వైధవ్యము ప్రాప్తించెను కూఁతున కిట్టిదురవస్థ సంభవించినందునఁ దండ్రి మిగుల పరితపించెను. కాని యాయన యంతటితోఁ దనకొమార్తె జన్మమునిరర్థకమని తలఁపడయ్యెను. లీలావతికి సంసార సౌఖ్యము లేక ఫొయినను ఆచార్యులవా రామెకు విద్యానంద మొసంగఁ దలఁచిరి. లీలావతి యదివఱకే విద్యావతి యగుట వలన నామెకుఁ దండ్రి గణితశాస్త్రమును నేర్పసాగెను. లీలావతియు విద్యాభిరుచి గలదై తనదు:ఖమును మఱచి సదా గణితాభ్యాసమే చేయుచుండెను. కొన్నిరోజుల కామెకు గణితశాస్త్రమునం దపారపాండిత్యము గలిగెను. ఈమె తనగణిత ప్రావీణ్యముచేత గణించి యరగంటలో వృక్షమునకుఁ గల యాకులసంఖ్య చెప్పుచుండెనని యొకలోక వార్త గలదు. ఈలోకవార్తయెంతమాత్రమును నమ్మఁదగినది గాక పోయినను, లీలావతికి గణితశాస్త్రమునందుఁ గలయసామాన్య ప్రజ్ఞను చూచి లోకు లీవార్త పుట్టించి రనుటకు సందేహము లేదు. ఆమెకు గణితము చెప్పునెడ వేసిన ప్రశ్నలును, వానియుత్తరములును నొకటిగాఁ జేసి భాస్కరాచార్యులు లీలావతి గణితమనుపేరఁ బ్రసిద్ధిఁ జేసెనని యందురు. ఈసంగతి లీలావతి గణితములోన "బాలే బాలకురంగలోలనయనే లీలావతీ ప్రోపాచ్యతాం" "అయేబాలే లీలావతిమతిమతిబ్రూహి" (లీలావతి యనుబాల యీలెక్క చెప్పుము అనియర్థము) అనిన వాక్యములవలన నీసంగతి నిజమేయయియుండవచ్చునని తోఁచు చున్నది. లీలావతి గణితమువలననే బాలవితంతువయిన లీలావతియొక్కకీర్తి సకలదేశములయందును నిండియున్నది. లీలావతి గణితము, ఫారషీ, యింగ్లీషు మొదలయిన పరభాషలయందుఁగూడ భాషాంతరీకరింపఁబడినది. లీలావతి గణితములోని లెక్క లన్నియుఁ జేయిటకుఁ బురుషులకె మహాప్రయాసముగా నుండును. కాన నిట్టికఠినపు లెక్కలను నేర్చినస్త్రీ యొక్క బుద్ధికుశలత యెంత యుండవలయునో చదువరులే యూహింపఁ గలరు.

ఈలీలావతి చరిత్రమువలనఁ బూర్వకాలమున ఈదేశమునందు స్త్రీవిద్య సర్వసాధారణమయి యుండెనని తెలియుచున్నది.