అబలా సచ్చరిత్ర రత్నమాల, ద్వితీయ సంపుటము/విద్వత్కుటుంబము

వికీసోర్స్ నుండి

విద్వత్కుటుంబము

ఈకుటుంబమున నందఱును విద్వాంసులేగాన దీనికిపేరు పెట్టితిని. ఈకుటుంబమును గుఱించి నమ్మఁదగిన చరిత్ర మెక్కడను దొరకలేదు. కానిలోకులు వీరి కధ నిట్లు చెప్పుదురు. పూర్వము ద్రావిడదేశమున వేదమౌళి యను భవిష్యవాదియొక్కడుండెను. ఆయన యొకదినమురాత్రి తనవాకిట నిలిచియుండఁగా నొకనక్షత్రము మాలవాడ వైపున రాలుటఁ జూచెను. మఱుసటిదినమున నిద్రలేచి వేదమౌళి మాలవాడలో నెవరయిన నీళ్ళాడిరాయని తెలిసికొనఁగా నాఁటిరాత్రి యా చుక్క రాలిన సమయముననే యొకమాలదాని కొకయాఁడు బిడ్డ పుట్టెనని తెలియవచ్చెను. అది విని యావిప్రుఁ డాకన్యక తనకోడలగునని తెలిసికొని మిగుల చింతించెను. అంత నాతఁడు కులమువారి సమ్మతిని ఆపిల్ల తండ్రిని రప్పించి నీబిడ్డను విడిచెదవా లేక బ్రాహ్మణకులమును నాశము చేసెదవాయని యడుగఁగా వాఁడు బ్రాహ్మణకులమును జెఱుప నిష్టములేక తనకూఁతుఁ దెచ్చి యాబ్రాహ్మణునకు నొప్పగించెను. అప్పుడాయన నాశిశువును జంపనొల్లక నొకపెట్టెలో భద్రపఱచి యాపెట్టెను కావేరిలో విడిచెను. ఆపెట్టె కావేరిలో బహుదూర మరిగి యొకఘట్టమునం జేరెను. ఆఘట్టమునం దపుడొక విద్వాంసుఁడు స్నానమునకు వచ్చి యాపెట్టెలో నున్న యా బిడ్డను గని సంతతి లేనివాఁ డగుటవలన నాబాలను గొనిపోయి పెంచి విద్యాబుద్ధులు చెప్పుచుండెను.

ఇచటఁ గొన్నిదినములకు విధివశమున వేదమౌళి గతించెను. అందువలన నాతని పుత్రుఁడగు పిరలీ విద్యాభ్యాసమునకై విదేశమునకుఁ బోవలసినవాఁ డాయెను. అట్లాతఁడు తిరుగుచు నీ పిల్లయున్న బ్రాహ్మణునియింటికివచ్చెను. ఆబ్రాహ్మణుఁ డా చిన్న వానికిఁ దన పెంపుడుకూఁతు నియ్యఁదలఁచి యాతనిం దనయింట నుంచుకొని సమస్తవిద్యలు గఱపెను. అటుపిమ్మట నాబ్రాహ్మణుని పెంపుడు కూఁతునకును, పిరలీకిని వివాహమయి వారు అన్యోన్యానురాగము గలిగియుండిరి. ఇట్లు కొన్ని దినములు గడచినపిదప నొకదిన మా చిన్నది దొరికిన సంగతి పిరలీకిఁ దెలిసెను. అంత నాతఁడీ చిన్నది తనతండ్రి కావేరిలో విడచిన మాలపిల్లయని తెలిసికొని మిగుల చింతించి భార్యకును, మామగారికిని దెలియకుండ నొక నాఁటిరాత్రి లేచి పలాయితుఁడయ్యెను. మఱుసటిదినమున నాకన్యక తనభర్తను గానక చింతనొంది మిగుల వృద్ధగు తనతండ్రి యాజ్ఞనుబొంది పెనిమిటిని వెదకఁబోయెను.

ఇట్లామె వెదకుచుంబోయి యొకచోట నాతనిఁగనెను. అప్పు డామె యింటికిరండని యెంత వేఁడుకొనినను పిరలీ విననందున నాచిన్నది విసిగి యాతనితో నరుగసాగెను. ఇట్లాదంపతులు కొన్నిదినము లరిగినపిదప నొకచోట భార్య నిదురించియుండఁగా నామెను వదలి పిరలీ మరల నరిగెను. తదనంతర మామె లేచి తనప్రాణేశ్వరుని వెదకుచుండెను. ఇంతలో నొకధనవంతుఁ డామె కగుపడి యామె వృత్తాంతమునంతను దెలిసికొని యామెను తనపుత్రికనుగా భావించి తనగ్రామమునకుఁ దోడ్కొని పోయెను. ఈమె పోయిన స్వల్పకాలమునకే యా ధనవంతుఁడు కాలముచేసెను. ఆయన తన మరణకాలమునందు తనకుఁగల ధనము తనకొడుకులతో సమానముగా నీమెకుఁ బంచియిచ్చెను. ఆధనముతో నీమెయొక యన్న సత్రముకట్టి పాంధులకు నన్నదానము చేయుచుండెను. ఈప్రకారము కొన్నిదినములు గడచిన వెనుక నాసత్రమునకు పిరలీవచ్చుట తటస్థించెను. అంతనామె తనయలవాటు ప్రకార మతిధిని సత్కరించి యాతని కన్న పానాదుల నిచ్చెను. భోజనానంతర మాతఁడు ఆమెవృత్తాంతము నడిగి తెలిసికొని యామె తనపత్నియని గుర్తించెను. అపుడామెయొక్క సత్ప్రవర్తనముఁగని యాతనికి మిగుల జాలిపుట్టెనుగాని మరలఁ దనను వెంబడించునను భీతిచేత తనసంగతి యామె కెఱుక పఱుప కుండెను.

మఱునాఁ డాతఁడు ప్రయాణమయి పోవుచుండఁగా నామె యాతని నంపుటకయి బైటికి వచ్చి మిగుల నుపచార వచనములతో నతనిని సాగనంపఁ జొచ్చెను. అప్పుడామె వినయభాషణమువలన పిరలీ మిగుల దయగలవాఁడై తనభార్యకుఁ దను నెఱిఁగించెను. అప్పు డాయన నామాట నీవు వినవలయుననియు, నిన్ను నే నెప్పుడును విడువననియు భార్యతోఁ బ్రమాణముజేసెను. అంత నామెయు పిరలీయుఁ గలిసి మెలసి యుండిరి. కొన్నిదినము లాదంపతు లచటనుండి మరల దేశాటనము చేయసాగిరి. అట్లు తిరుగుకాలములో వారికిఁ గ్రమముగా అవ్వయర్, ఆపగ్గా, వాలీజ్, మురగ్గాలను నలుగురు కూఁతులును, తిరువళ్ళేర్, అధికమాన్, కపిలర్, అను ముగ్గురు పుత్రులును గలిగిరి. వీరి నందఱిని పిరలీ యాజ్ఞవలన నాతని భార్య పుట్టిన చోటులనే విడిచిపోవు చుండెను. ఈపిల్లలందఱు వేరువేరు జాతులవారలకు దొరకి వారిచేఁ బెంచఁబడి మిగుల విద్వాంసులైరి. వా రందఱిలోనఁ బెద్దది అవ్వయర్. ఈమెను తలిదండ్రు లరణ్యమున విడిచిపోఁగా నొకవిద్వాంసుఁడు కొని పోయెను. ఆవిద్వాంసునిపే రెచటను గానరాదు. ఆయన యీమెకు విద్యాబుద్ధులు చెప్పి గొప్ప పండితను జేసెను. ద్రావిడమునం దీమె గొప్పకవయిత్రి. ఈమెకు నీతిశాస్త్రము, జ్యోతిశాస్త్రము, వైద్యశాస్త్రము, భూగోళశాస్త్రము, రసాయనవిద్య మొదలయిన విద్యలలో మిగుల ప్రవీణురా లయ్యెను. ఈమె ఆయావిషయములలో నొక్కొక్క గ్రంథము రచియించెను. ఆగ్రంధము లిప్పుడును ద్రావిడదేశమునందు పాఠశాలలో బాలురకు నేర్పుదురఁట. ఇందువలననే యాభాష యందలి యామె పాండిత్యము వెల్లడియగుచున్నది. ఈమె కల్పవిద్యాప్రభావమువలన 240 సంవత్సరములు జీవించెనని యొకవదంతి గలదు. ఈమె తనజన్మమంతయు కన్యాత్వమున నే గడపెను. ద్రవిడదేశమునం దీమెను మిగుల పూజ్యురాలినగా లోకులు మన్నింతురు.

రెండవదియగు ఆపగ్గా; - ఈమె అవ్వయర్ చెల్లెలు. ఈమెయు ద్రావిడజాతి కవయత్రి. ఈమె ఆర్కాట్ మండలములోని ఊటకాఁడు అనుగ్రామమునందు జన్మించెను. జననీ జనకు లామె నచటనే విడిచిపోయిరి. తదనంతర మీమె నొక రజక స్త్రీ పెంచెను. తదనంతర మీమెకు విద్యాబుద్ధు లెట్లు వచ్చెనో తెలియదుగాని యీమెద్రావిడమున నీతిశాస్త్రము నొకదానిని రచియించెను. ఈమెయు యావజ్జన్మము వివాహము చేసికొనలేదు.

మూఁడవదియగు వాలీజ్ : _ ఈమె అవ్వయర్ రెండవ చెలియలు. తల్లిదండ్రు లీమెను విడిచి చన కార్ వార్‌కులమువా రీమెను బెంచిరి. ఈమె యనేక ద్రావిడకావ్యములను రచియించెను.

నాల్గవదియగు ముదగ్గా : _ ఈమె అవ్వయర్ గారి మూఁడవ చెలియలు. ఈమె యొకవర్తకుల యింటఁ బెరిగెను. ఈమెయు ద్రావిడమున ననేక కావ్యములను రచియించెను. వీరందఱు తమ నిజమయినకులము నెఱుఁగకున్నను దమవిద్యా ప్రభావము వలననే జగత్ప్రసిద్ధలైరి. కాన విద్యవలననే మనుష్యులు పూజ్యతను గాంతురుగాని కులము వలనఁగాదని తెలియుచున్నది.