Jump to content

అబలా సచ్చరిత్ర రత్నమాల, ద్వితీయ సంపుటము/మహారాణి స్వర్ణమయి

వికీసోర్స్ నుండి

మహారాణి స్వర్ణమయి

బరద్వాన్ ప్రాంతమునందున భట్టకోలను గ్రామమునందు నీచరిత్రనాయిక యగు మహారాణిస్వర్ణమయిగారు 1827 వ సంవత్సరమున జన్మించిరి. 1838 వ సంవత్సరమున నీమెకు పదునొకండు సంవత్సరములప్రాయము వచ్చినందున నీమెను కాసిం బాజారు రాజకుటంబములో విఖ్యాతిగాంచిన రాజాకిసన్నాధ రాయబహద్దరుగారికి నిచ్చి యీమె జననీజనకులు వివాహముచేసిరి. స్వర్ణమయి భర్తయగు రాజా కిసన్నాధరాయ బహద్దరుగారు రాజవంశస్థు లగుటచేత మహారాణిగారికి మిగుల మంచి సంబంధము దొరకెనని చెప్పుటకు సందియము లేదు. కాని పాప మామె యీభాగ్యము చిరకాలమనుభవించుటకు నోచుకొనఁదయ్యెను. వివాహానంతరము కొద్దిదినములకే రాజాగారికి మనోభ్రమణము గలిగినందున వారు 1884 వ సంవత్సరమున నాత్మహత్మచేసికొనిరి. లేతవయస్సునందే మహారాణికిదియెట్టి ఘోరదు:ఖముప్రాప్తించెనో చదువరులే యుహించుకొనఁగలరు. పతిమరణమేకాక యింకొక గొప్పయాపదకూడ నీమెకు సంప్రాప్తమయ్యెను. ఆమె పెనిమిటి మతిభ్రమణము గలిగి మృతినొందినందున నాయనదనయాస్తిని నంతను నప్పుడు రాజ్యము చేయుచుండిన "ఈస్టు ఇండియాకంపెనీ" వారికిఁ జెందునట్టుగా తనమరణశాసనమునందు వ్రాసిపోయెను. కాని తనభార్య విషయమై యాశాసనమునం దేమియు వ్రాసియుండ లేదు. ఈమరణశాసనము ప్రకారము రాజాగారి సొత్తంతయు కంపెనీవారు స్వాధీనపరచుకొనిరి. ఇట్లు యౌవనకాలమునందే పతివియోగము, ధననాశమును సంభవించినప్పటికినిరాణిగా రత్యంతధైర్యము నవలంబించి యాయాపదలతోఁ బోరాడుటకు నిశ్చయించిరి. తనసొమ్మున పహరించిరని మహారాణి గారు "ఈస్టు ఇండియాకంపెనీ" వారిమీఁద "సుప్రీంకోర్టు"లో నభియోగము తెచ్చిరి. భర్త చిత్తచాంచల్యము కలిగినప్పుడు వ్రాసినదికావున నామరణ శాసనము చెల్లఁగూడదని యచ్చట తీర్పు చేయఁబడినందున స్వర్ణమయి గారికిఁ దిరిగి తమ సొత్తంతయు లభించినది.

ఇట్లు పోయిన సంస్థానమంతయు స్వప్రయత్నముచేతఁ దిరిగి సంపాదించిన పిమ్మట మహారాణిగారు తనధనమును సద్వ్యయము చేయ నారంభించిరి. సంతతౌ దార్యముచే నీమె యుభయవంశములకును, దనసంస్థానమునకును భూషణతుల్యురాలాయెను. సత్కార్యముల కీమె చేయు నధిక ధనవ్యయమును జూడఁగా నీధన మీమెదికాక యీమెయొద్ద నెవ్వరైనను దాఁచిన ధనము నీమె యిట్లు పంచిపెట్టుచున్నదియేమో యని సందేహము కలుగుచుండెను. ఈమె ఫలాపేక్షలేక చేయుదాన ధర్మములందఱికి నీమెయందు మహాగౌరవమును గలుగఁజేయుచుండెను. ఒకటియని చెప్పనేల? ఈమె కేవలము ఔదార్యముయొక్క భౌతికావతారమనియే చెప్పవచ్చును. స్వర్ణమయి గొప్ప విద్వాంసురాలుగాదు; గొప్ప శాస్త్రములను చూడలేదు. ఐనను దేశక్షేమమునకును, బ్రజల సౌఖ్యమున కును నత్యంతావశ్యకమైన పరోపకారమను విద్యయం దీమె యసమానమైన పాండిత్యమును సంపాదించి యుండెనని మాత్రము చెప్పవచ్చును. ఆపన్నులను విపత్తునుండి తొలఁగించుట, అనాధవితంతువుల నేత్రంబులనుండి ప్రవహించు కన్నీటినాపుట, క్షుధార్తులగువారికి నన్నముపెట్టుట, వస్త్రహీనులకు వస్త్రము లొసంగుట, ఇండ్లిలేనివారికి గృహదానము చేయుట, విద్య నెఱుఁగని వారికి విద్యాదానము చేయుట, గ్రంధకర్తలను సన్మానించి వారిచే సద్గ్రంధములఁ జేయించుట, వ్యాధిగ్రస్తుల కౌషధంబు లిప్పించుట మొదలగు పరోపకార కృత్యంబులు చేయుట కెట్టివిద్యానైపుణ్యము కావలయునో యట్టివానియందు సువర్ణమయి పారంగతమయి యుండెను. ఈరాణికి సంతానము లేకపోయినను నీమే విశ్వమే తన కుటుంబ మని యెంచునదిగాన నాపదయందుఁ జిక్కుకొనువారందఱు నీమె సంతానమనియే చెప్పవచ్చును. అయితేయీమె స్త్రీయైనందున యుక్తాయుక్తవివేచనములేక దానము చేయుచుండెనని యెంచఁగూడదు. స్వర్ణమయి పాత్రాపాత్రములఁ గనుఁగొనియే మఱి దానము చేయుచుండెను. ఈమె మంత్రియగు రాయరాజీలోచన్ రాయబహద్దరుగారు గొప్ప విద్వాంసులు, ప్రజ్ఞావంతులును, పరోపకారదక్షులునునై యుండినందున దానము చేయునెడ రాణిగారి కెప్పుడును సహాయులయి యుండుచుండిరి. రాణిగారి ధార్మికబుద్ధి యిట్టిదని చెప్ప నిలవిగాదు స్వర్ణమయిగారు స్వహస్తముతో దానము చేయని దిన మొకటి యయినను గానరాకుండెను. ఈమె చేయుధర్మకార్యముల సంగతి విని దొరతనము వారీమె కనేక పర్యాయము లనేక బిరుదముల నొసఁగిరి. ఈమె యౌదార్యము విక్టోరియాచక్రవర్తిని గారికిఁగూడ బాగుగాఁ దెలియును. మహారాణిగారి పరోపకారమునకు శ్రీచక్రవర్తినిగా గారుమిగుల సంతోషించి యీదేశమునం దిదివఱ కెవ్వరికి నియ్యని "క్రౌన్ ఆఫ్ యిండియా" యను పదవిని స్వర్ణమయి గారికినిచ్చిరి. ధనసంపన్న లయినస్త్రీలు సాధారణముగాఁ దమ యన్న దమ్ములు మొదలయిన బంధువులకు సహాయము చేయుదురు. కాని తదితరులకుఁ జేయరు. కాని స్వర్ణమయిగారియందుమాత్రము బాంధవపక్షపాతము, స్వజాతిపక్షపాత మన్న మాట లేశమయినను లేకుండెను. ఆమె సర్వజనులను సమదృష్టితో నరయుచుండెను.

1847 వ సంవత్సరమున రాణిగారికిఁ దమయాస్తి యంతయు స్వాధీనమయ్యెను. అదివఱకు సంస్థానముమీఁద విశేషఋణము పెరిగియుండెను. స్వర్ణమయి తెలివిగల మంత్రిని నియమించికొని కొద్దిదినముల కే సంస్థానమునకుఁ గల ఋణమంతయుఁ దీర్చివేసెను. ఇంతియకాక ప్రతిసంవత్సరమును వచ్చు నాదాయమునుగూడఁ బెంచెను. కాని యిట్లధికముగ వచ్చుధనమును రాణిగారు నగలకుఁగాని మఱియేవ్యర్థకార్యములకుఁగాని వెచ్చింపక రాజ్యమునందలి ప్రజల నాగరికత వృద్ధిచేయుటకును, పన్నులభారముచే నణఁగిపోవుచున్న వ్యవసాయదారులకును సహాయము చేయుటకును, నింక నెన్ని యో మంచికార్యములకును వినియోగించిరి. మహారాణిగారు చేయు మహాకార్యములం జూచి 1871 సంవత్సరమున దొర తనమువారు ఒక గొప్పసభ జరిగించి యందు సువర్ణమయి గారికి "మహారాణి" యనినబిరుదు నొసంగిరి. 1874 వ సంవత్సరమున హిందూదేశమునందంతట గొప్పక్షామము కలిగి యన్నములేక ప్రజలునాశము నొందుచుండినప్పుడు మహారాణిగారు వేలకొలఁది కుటుంబములకు నన్నదానము చేసి యనేకులను మృత్యుముఖమునుండి విడిపించిరి. అన్నివిధముల నుత్తమ రాలగు నీమెకుఁ బ్రభుత్వము వారు "మీసంస్థానమునకు మీరు ముం దేర్పఱుపఁ బోవువారసుదారునికిఁగూడ మేము 'మహారాజా' యను బిరుదు నొసంగితి"మని తెలియఁ జేసిరి.

1878 వ సంవత్సరమునందు "మెంబరు ఆఫ్ ఇంపీరియల్ ఆర్డర్ ఆఫ్ దిక్రౌన్ ఆఫ్ ఇండియా" యను బిరుదు రాణిగారి కొసంగఁబడియె. ఆసమయమున దొరతనమువారు కాసింబాజారులోని రాజగృహమందు రమ్యమయిన గొప్ప సభచేసి రాజప్రతినిధి గారికి బదులుగా పీకాకుదొరగారు స్వర్ణమయిగారి నప్పుడు సంబోధించి యీప్రకారము వక్కాణించిరి : _

పరోపకారార్థమై తమరనేక పర్యాయములు గొప్ప ధనరాసులు వెచ్చించిన సంగతి దొరతనమువారు విని తమను గౌరవించుటకై తమకీబిరుదు నిచ్చుచున్నారు. 1871 వ సంవత్సరమునుండి 1875 వ సంవత్సరమువఱకు తమరు 52500 రూపాయలు జనహితకార్యములకయి వ్యయపఱచితిరి. ఈ ధనము తమయాదాయముయొక్క షష్ఠాంశమునకంటె నధికమయినది. ఇంతియకాక దానము చేయునప్పుడు తమరు చూపెడు వివేచనాశక్తి, దూరదర్శిత్వము మొదలయినవాని విషయమయి తమరి నెంత కొనియాడినను దక్కువయే. ఈ దేశమునందు దానపరులలో నిష్కామబుద్ధిచే దానము చేయువారు బహుస్వల్పముగా నున్నారు. కడమ వారందఱును సహాయము చేయవలసిన కార్యముయొక్క యోగ్యతను జూచి ధన మీయక తమకత్యంత కీర్తి కలుగవలెనను నభిలాషచేత ధర్మముఁ జేయుదురు. తమరుమాత్ర మట్లుగాదు. తమరు కుడిచేతఁ జేయు దానము నెడమచేతి కయినను దెలియకుండఁ జేసెదరు..........ఒక్కదాన ధర్మములయందేకాక మీరు సంస్థాన నిర్వాహకత్వమునందును దక్షత చూపించుచునే యున్నారు. అందువలననే మీజందారీ కడమవానివలె యప్పులలో మునిఁగి తేలుచుండక దినదినాభివృద్ధిఁ గాంచుచున్నది."

ఇట్లు పీకాకుదొరవారు చెప్పినవానిలో నేదియు నతిశయోక్తికాదు. ఈమె చచ్చుటకు బూర్వము కొన్ని సంవత్సరములనుండియుఁ దనయాదాయమునుండి ప్రతి సంవత్సరము ఒకలక్షరూపాయలు లోకహితకార్యములకయి వ్యయపఱుప నిశ్చయించియుండిరి. దేశమునం దెచ్చట నేయాపద సంభవించినను లేక మఱి యేపుణ్యకార్యము చేయవలసి వచ్చినను స్వర్ణమయిగారు తా ముందడుగిడి వెనుకఁదీయక ధనమును వ్యయపఱుచు చుండిరి. ఇట్టి వనితలే కదా తమ సుగుణముల చేత నొక తమదేశపు గరితల కేకాక ప్రపంచమం దంతటనున్న స్త్రీ వర్గమునకు గౌరవమును గీర్తియును దెచ్చెదరు. ఈసద్గుణరాశి 1897 వ సంవత్సరమున పరలోకమున కేఁగెను. ఈమె యనంతరము రాజ్య మీమె యత్తగారి వశమయ్యెను.