అబలా సచ్చరిత్ర రత్నమాల, ద్వితీయ సంపుటము/ధనలక్ష్మి

వికీసోర్స్ నుండి

ధనలక్ష్మి

ఈ సాధ్వీస్త్రీ బడోదారాజ్యములోని బీల్నాగ్రామవాసుఁడగు జగన్నాధలక్ష్మీ రాముని కోడలు; జీవరాముని కూఁతురు. ధనలక్ష్మి యత్తపేరు మహాకువరు. ఈమె ధార్మికయు, వినయవతియు, వివేకశీలయు విద్యావతియునై తనకోడలగు ధనలక్ష్మికిని నాగుణములనే గఱపుచుండెను. కొమారుఁడగు గిరిజాశంకరునకుఁగూడ బాల్యమునుండి విద్యాబుద్ధులు నేర్పి యతనిని సద్గుణవంతునిఁ జేసెను. ధనలక్ష్మి వివాహానంతరము జగన్నాధలక్ష్మి రామునికి గౌరవము హెచ్చుచుండెను. మహాకువ రెల్లప్పుడును స్త్రీసతిపుస్తకములను జదువుచు స్త్రీలకు సద్భోధ చేయుచు నీతి, భక్తి, ధర్మములపైఁ గీర్తనలను రచియించి బాలురకును, బాలికలకును నేర్పుట యం దధిక శ్రద్ధగలదియయి యుండెను. ఇట్టి సద్గుణవతియగు నత్తచేతిక్రింద నుండిన కోడలు మిగుల నుత్తమురాలగుట యొకయాశ్చర్యము గాదు. ధనలక్ష్మి యత్తగారి యం దధిక ప్రేమ గలదియయి యెన్నఁడును పుట్టినింటికిఁ బోవనిచ్ఛయింపదయ్యె. ఒకానొకప్పుడు పుట్టినింటివా రామెను బలవంతముగాఁ దీసికొనిపోయినను మూఁడు నాలుగుదినము లచటనుండి మరల నత్త యొద్దికి వచ్చినంగాని యామె మనసు సంతసింపదయ్యె. ఇట్లాయత్తకోడండ్రు తల్లిబిడ్డల కంటె నధికప్రీతి కలవారలయి యుండిరి. ఇదిగదా యత్తకోడండ్రుండ వలసిన విధము. ఇప్పుడు కోడండ్ర బాధించెడి యత్తలకును, అత్తల నవమానించు కోడండ్రకును వీరిచరిత మనుకరణీయము. ఏగృహమున నత్తకోడం డ్రిద్దఱును దమతమధర్మములను దప్పక నడుచుచుందురో యాగృహమునందు సుఖమున కేమికొఱఁత? ధనలక్ష్మి యత్తమామలకును, భర్తకును నుపచారములు చేసి వారిచే దీవనల నంది పతివ్రతా ధర్మములను దప్పక పాలింపుచుండెను. అత్తవలెనే ధనలక్ష్మికిని గృహోపయోగకరములగు పుస్తకములను, ఇతర గ్రంధములును చదువుటయం దిచ్ఛ యధికముగా నుండెను. ఇంతియగాక యామె తాఁ జదివిన గ్రంధములయందలి సారాంశము నంతను మఱవక తన హృదయమునఁ బదిలపఱచుచుండె. ఇట్లా యత్తకోడండ్రగు నాయిరువురు పతివ్రత లుండుటవలన నాగృహం బధిక శోభావంతంబయి యానందసాగరమున నోలలాడుచుండెను. కాని పతివ్రతల పరీక్ష సంకటసమయంబునంగాని కాదని కాఁబోలును పరమేశ్వరుఁడు వారిపైఁ గష్టము తెచ్చిపెట్టెను. ఆప్రకార మెట్లనిన వి. శ. 1945 వ సంవత్సరము చైత్ర శుద్ధమునందుజంబూసరవాసుఁడగు విశ్వనాధుఁడనువారి బంధువునియింట జోడుపెండ్లిండ్లుండెను. ఆవివాహమునకు ధనలక్ష్మియు గౌరీశంకరుండును బోయిరి. ఖంబాత్‌లో వివాహమయిన వెనుక పెండ్లివారందఱును జంబూసరమునకు వచ్చుట కయి పడవలో నెక్కిరి. రెండువివాములవారును గలిసినందువలన నాపడవలో జనులు బహుమందియుండిరి. ఈపడవలోనివారు జంబూసరమునకుఁ జేరుటకు ఖంబాత్ నుండి కావీ రేవువఱకును సముద్రములో రావలసియుండిరి. పడవ రేవు విడిచి కొంతదూర మరిగినపిదపఁ దుపాను (గాలివాన) ప్రారంభమయి సముద్రమునం దలలు మిన్నంట సాగెను. అంత నాపడవలోని జనులందఱు మిక్కిలి భయంబు నొంది యాప్తులం గలిసి యేడ్చువారును పరమేశ్వరునిఁ బ్రార్థించువారును పడవమునిగినఁ జత్తుమను భయముచే మూర్ఛిల్లువారును నై యుండిరి. పడవవాం డ్రాజనుల కెంత ధైర్యము చెప్పినను నా తుపానును గనివారుధైర్య మవలంబింపఁజాలరయిరి. కాని ధనలక్ష్మీమాత్రము ధైర్యమువిడువకుండెను. ఆమెచిన్న నాఁడుపడవలోఁ గూర్చుండునపుడు జాగ్రతగాఁ గూర్చుండవలయుననియు, పడవలో మునగకట్టె లుంచుదురనియు ఒక సేరు మునగకట్టె యొకమనుష్యుని నీళ్ళలో తేల్చఁ గలదనియు, మునగకట్టెను బట్టుకొని యొకపడవవాఁడు సముద్రములో మూడుదినము లుండినను నాకట్టె వానిని ముంచలేదనియు అరేబియన్ నైట్సను గ్రంధములోఁ జదివియుండెను. ఈమాట యా సమయమునందు ధనలక్ష్మికి జ్ఞాపకము వచ్చి యాకట్టెను శోధించి తీసికొనెను. తదనంతర మామె తనచీరను బాగుగా పుట్టగోచిఁ బెట్టిబిగియించెను. అప్పుడు పడవ మునుఁగుటకు సిద్ధముకాగా నామె తనభర్తతోడ నాకట్టెను బట్టుకొని సముద్రములోనికిఁ దిగెను. గిరిజాశంకరుఁ డొకచేత నాకట్టెను రెండవచేత నగల పెట్టెను బట్టుకొని యున్నందున నతని ధ్యాన మాకట్టెను గట్టిగాఁ బట్టుకొనుటకంటెను నగలపెట్టెను భద్రముగాఁ బట్టుకొనుటయందు విశేషముగానుండెను. అదిచూచియామెభర్తచేతి నుండి యాపెట్టెను దీసి యోడలో నొకచిలుక కొయ్యకు తగిలించెను. తరువాత నాపతిపత్ను లిద్దఱు నాకట్టెనుబట్టు కొని సముద్రములోఁ బోవుచుండిరి. పడవలో మిగిలిన వారందఱును మునిఁగిపోయిరి. ఈదంపతులు సముద్రములోఁ బడిపోవునపుడు వారినోళ్ళలోనికి నీరు పోవుచుండెను. అప్పుడు నదిలో సహితము దిగక యొడ్డుననుండి స్నానము చేయు నాగిరిజాశంకరుని భయమునకు మితము లేదయ్యెను. కాని యట్టిసంకటసమయమునను ధైర్యమును విడువక ధనలక్ష్మి తనభర్తకు ధైర్యము చెప్పుచు నతని పిఱికితనముఁ బోఁగొట్టుచు నీత నేర్చినదిగాన కొంతదూర మీఁదుచు నాకట్టె యాధారమువలనఁ బోవుచుండెను. అంతలో వారిసమీపమున 'హరిశంకరుఁ' డను నొకచిన్న వాఁడు మునిఁగి నీళ్ళపైకిఁ దేలి వారినిఁ బట్టుకొనియెను. అప్పు డాకట్టె ముగ్గురిని తేల్చఁజాలక ముంచున ట్లుగుపడఁగా దానిని గనిపెట్టి ధనలక్ష్మి యుపకార బుద్ధి గలదయి తనభర్తకును నాహరిశంకరునకును నాకట్టెను పట్టుకొనిపోవు విధము చెప్పి తా నొకత చచ్చి యిరువురు బ్రాహ్మణులు బ్రతుకుట శ్రేష్ఠమని తలఁచి యాకట్టె వారికి నిచ్చి తా నీదుకొని పోవఁదొడఁగెను. ఆహా! ఈమె పరోపకార బుద్ధిని వేనోళ్ళఁ బొగడినను నత్యుక్తి యగునా? ఈమె కట్టె విడిచి కొంచెముదూరము వచ్చిన వెంటనే యొకగొప్ప యల వచ్చి యామెను ముంచెను. ఆమె నీళ్ళలో మునుఁగుట నెఱిఁగినదిగాన నప్పుడు మునిఁగియుండు పరమేశ్వరుని దయవలన మరలఁ బైకి రాఁగలిగెను. ధనలక్ష్మి నీటిలోనుండి బైటికి వచ్చునప్పటి కామెపతి యామెకు దృగ్గోచరుఁడు గాఁడయ్యె. అంత నామె తనపతిని రక్షించుమని పరమేశ్వరుని ననేకవిధములఁ బ్రార్థించి కనులు విప్పునప్పటి కామెకు సమీపముననే మునిఁగిన యోడ తేలుచున్నట్లగుపడెను. అపు డామె తన కాలికిఁ బడవ త్రాడొకటి తాకఁగా దాని యాధారము వలన నాపడవసమీపమునకుఁ బోయి తననగల పెట్టెను కాలితోఁ దీసికొని కాలికే తగిలించుకొని యచట నొకకట్టె యగుపడఁగా దానినిఁ బట్టుకొని యొంటికాలితో నీఁదుచుఁ బోవసాగెను. అప్పుడు సముద్ర ముప్పొంగి మిగుల భయంకరముగా నుండెను. కాని ధనలక్ష్మీ తనధైర్యమును విడువక యొక కాలితో నీళ్ళను త్రోయుచు చేతులతో నీదుచుఁ గొంతదూర మరిగెను. అప్పు డామె కాలుసేతులు మిగుల తీపులు పుట్టినందున నిఁక బ్రతుకుట దుస్తరమని తోఁచి నగల పెట్టెను సముద్రములో విడిచి రెండుకాళ్ళతో నీదఁ దొడఁగెను. ఇట్లీఁదుచు నామె కారేవునకుఁ గ్రోసెడుదూరము వఱకును వచ్చెను ! కాని యచట సముద్ర మామెను ముందుకు నీఁదనీయక వెనుకకు లాగఁ జొచ్చెను. ధనలక్ష్మి తన యావచ్ఛక్తిని వినియోగించి ముందున కీదఁ బ్రయత్నింపు చుండెను. ఇంతలో నొక గొప్పయల వచ్చి యామె నాకాశమున కెగర వేసెను. ఆమె యెగిరినపుడు దూరమున నెవరో మునిఁగిపోవుచున్నటుల నామె కగుపడెను. పిదప నామె సముద్రములోనం బడి తన కగుపడినవాఁడు తనభర్త యయియుండునని చింతించి యతని ప్రాణమును గాపాడ తనకు శక్తి లేనందువలన నతనిని గాపాడుటకయి పరమేశ్వరుని వేఁడుకొనియెను. ఆహా ! అట్టి సంకట సమయమునందు సహిత మా పతివ్రతాతిలకము పతి క్షేమమును చింతింప మఱచినది కాదు ! ఇట్లు పరమేశ్వరుని వేఁడుకొని యతఁడే తనపతినిఁ గాపాడు నని నమ్మి యామె ధైర్య మవలంబించి యా కట్టెను త్రోసికొనుచు రేవునకు నర క్రోసు దూరమువఱకు వచ్చెను. అప్పుడు సూర్యుఁడు పశ్చిమాద్రిపయి నస్తమింపు చుండెను. ఆసమయమున విశ్వనాధుఁడు వియ్యాలవారిని నోడలోనుండి దింపి తనగ్రామమునకుఁ గొనిపోవుటకై బండ్లనుదీసికొని యా రేవునకు వచ్చియుండెను. అప్పుడచటఁ దమతమబండ్లను గడుగు బండ్లవాండ్లును, సముద్రమునందలి యోడలలో సరకుల నెక్కించువారును, వచ్చిన సరకులను దించువారునునుండి రేవు మిగుల కోలాహలముగా నుండెను. ధనలక్ష్మికి రేవు కాన వచ్చినందున నచటిజనుల వైపునకుఁజూచి కేక వేసి చెయ్యివిసిరి సైఁగచేసెను. కాని యచటికి రేవరక్రోసెడు దూరముండినందున నచటిజనుల కీమె సైఁగ కానుపింపదయ్యె. తదనంతర మామె తనరెండు చేతుల నెత్తి సైఁగచేయఁగా నచటనున్న బండివాఁ డొకఁడు చూచి యొకమనుష్యుఁడు సముద్రములోఁ గొట్టుకొనివచ్చుచున్నాఁడని యతఁడచటి బెస్తలతోఁ జెప్పెను. కాని యపుడు తుపాను సమయమై సముద్ర మల్లలల్లోలముగా నున్నందున సాహసించి సముద్రములోనికిఁ బోవుట కెవ్వరు నొప్పకుండిరి. ఇంతలోఁ బాటుసమయమైనందున ధనలక్ష్మిని సముద్రము మరల వెనుకకుద్రోయఁ జొచ్చెను. అప్పు డామె యీదుటకు శక్తిచాలక ప్రాణములపై నాశను విడిచి పరమేశ్వరుని స్మరణ చేయుచుండెను. అది చూచి యొక బెస్త మిగుల దయ గలవాఁడయి పుట్టగోచిని బిగించి సముద్రములోనం దుమికి యీదుచు నామెను సమీపించి 'యమ్మా నిన్ను నేను రక్షింప వచ్చితిని; నీవు ధైర్యము విడువకుమ'ని యామెతో ననెను. అందుకు ధనలక్ష్మి 'నాయనా నేనెప్పుడు నధైర్యపడను. నా కీదుట బాగుగాఁ దెలియునుగాని చాలదూరమునుండి యీదుచు వచ్చుటవలన మిక్కిలి బలహీననైతిని. నీవు నాకీదుటలో సహాయము చేయుము' అని యడిగెను. అప్పు డాబెస్త యామె చేతనున్న కట్టెను ముందుకుఁ ద్రోసికొని పోవుటలో నామెకు సహాయుఁడై యామెను రేవుకుఁ జేర్చెను. ధనలక్ష్మివలన జరిగిన సంగతిని విని విశ్వనాధుఁడు మిగుల శోకాకులమానసుఁడయి యామె నొక విప్రుని గృహమున కనిచి తాను దివిటీలను వేయించుకొని సముద్రము నొడ్డున నంతను వెదకఁ బోయెను.

ధనలక్ష్మియు నావిప్ర గృహమునకరిగి తనపతి బ్రతికి వచ్చిన జాడఁ గానక నతఁడాసముద్రమున మునిఁగి ప్రాణములను విడిచెనని తలఁచి తాను బ్రతికివచ్చినందునకై మిగుల దు:ఖింపసాగెను. అప్పుడచటి వారందఱును ఆమెను గని 'తల్లీ! నీవు నడిసముద్రమునం బడియైనను ధైర్యమును విడువక యిరువురి ప్రాణముల సంరంక్షించు నీవు ప్రాణములతో నిచటికి వచ్చితివి. నీయద్వితీయధైర్యము నేమనవచ్చును? ఇట్లయ్యును నీవిపుడు ధైర్యమును విడుచుట యుక్తముగాదు. నీ కిప్పుడన్నియు శుభసూచకములే కానుపించుచున్నవి. నీ వింత సేపు సముద్రములో నీదివచ్చినను నీ నుదుటి[1] కుంకుము చెరగ లేదు. కాన నీసౌభాగ్యము శాశ్వతముగా నుండును అని ధైర్యము చెప్పిరి. కాని యాపతివ్రత భర్తపై మనసునుంచి శోకింపుచు నేమియుఁ దినక, త్రాగక తదేకధ్యానముతో నుండెను. ఇంతలో నాగ్రామములోని పోలీసుబంట్రోతు జరిగిన వర్తమానమును వ్రాసికొనుటకై ధనలక్ష్మియున్న గృహమునకు వచ్చితానే ధనలక్ష్మిని సముద్రములోనుండి తీసినట్టు కైఫియత్తువ్రాసి యిమ్మనెను. కాని నీతివిశారదయైన ధనలక్ష్మి యసత్యమాడక బెస్తవాఁడు తనను రక్షించెనని నిజమయిన సమాచారమును వ్రాసియిచ్చెను. ఇంతలో నామెకు భర్త బ్రతికివచ్చు చున్నాఁడని పోలీసువారివలన వర్తమానము తెలిసి యపరిమితానంద భరితయై యామెభర్త నెదుర్కొనఁ బోవునంతలో నతఁడే గృహమునకు వచ్చెను. అప్పుడా యిరువురును పరస్పర సందర్శనములవలన మితిలేని యానందము గలవారలైరి. ధనలక్ష్మి పతికి నమస్కరింపఁగా నతఁ డామెనెత్తి యాలింగనము చేసికొని యామె సముద్రమునం దగుపఱచిన దైర్యమునకును, ఆమె తనప్రాణములకుఁ దెగించియైనను దమ యిరువురి ప్రాణములను గాపాడినందునకును నామెను బహువిధముల సుతియించెను. అంత వారందఱును భోజనములను జేసిరి. ఈవార్త యాగ్రామమంతటను దెలియఁగా బ్రజలు మూఁకలుగట్టి వచ్చి ధనలక్ష్మినింగని నమస్కరించి కేవలము లక్ష్మిదేవినిగా భావించి స్తుతియించిరి. అప్పు డామె వారితో మీరు నన్నేల స్తుతియించెదరు? సర్వరక్షకుఁడగు జగదీశ్వరుని స్తుతియించినఁ గృతార్థులయ్యెదరు; అని వారిలో స్త్రీలకుఁ బతివ్రతా ధర్మములను గూర్చికొంతయుపన్యసించెను. ఆమఱునాఁడు వారు స్వగ్రామమునకుఁ బోయిరి. వీరచటికరిగి జరిగిన వర్తమానమునంతను చెప్పఁగా విని ధనలక్ష్మి యత్త మామ లధిక హర్హితులై కోడలినిం గని నీవు మాపాలిటి భాగ్యదేవతవని కొనియాడిరి. అప్పుడు బడోదాసంస్థానములో నాయబ్ సుబాగానుండిన హర్శీవల్‌దొరగా రీవర్తమానమంతయు విని స్వయముగావెళ్ళి ధనలక్ష్మిని దర్శించి కొనియాడెనఁట. ఈమె వర్తమానమంతయు నప్పటి గుజరాతి వార్తాపత్రికలయందుఁ బ్రకటింపంబడియె.


  1. కొందఱు స్త్రీలు నుదుటికి మైనము రాచి దానిపై కుంకుము పెట్టుకొనెదరు. అది నీటితోనైనను చెరగదు.