అబలా సచ్చరిత్ర రత్నమాల, ద్వితీయ సంపుటము/చాందబీబీ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

చాందబీబీ

ఈశూరవనితకు నిజామ్‌శాహిలో మూఁడవపురుషుఁడగు హుసేన్ నిజామ్‌శహతండ్రి. ఆదిల్ శాహిలో నాల్గవ పురుషుఁడగు అల్లీ ఆదిల్ శహభర్త. వీరిరువురికిని పరస్పర కలహములుకలిగి యుండెను. కాని అహమ్మదనగరు విజాపూరు గోలకొండలకుఁ ప్రభువులయిన తురకషహాలు కూడి విజయనగరముపై దండు వెడలుటకు నిశ్చయించుకొనిన కాలములో, అహమ్మదనగరమునకు నధిపతియయిన హుసేనషహ, నిజామున కధిపుఁడయిన అల్లీషహాతో సఖ్యము చేయఁదలఁచి తన కూఁతురగు చాందబీబీని నతనికిచ్చి వివాహము చేసెను. తదనంతరము తలికోటలో క్రీ. శ. 1565 వ సంవత్సరమునం దీమహమ్మదియులకును విజయనగరాధీశ్వరుఁడగు రామరాజునకును యుద్ధము జరిగి విజయనగర సంస్థాన మడుగంటె ననుసంగతి హిందూదేశచరిత్రము చదివినవారి కందఱకును విదితమేగాని స్త్రీచదువరులకునీశాహీల సంగతి దిన్నఁగాఁదెలిసినంగాని ప్రస్తుత చరితము బోధపడదుగాన వాని వివరము నిందు గొంత సంగ్రహముగాఁ దెల్పెద. క్రీ. శ. 1526 వ సంవత్సరమున[1] బ్రాహ్మణీరాజ్యమను తురక రాజ్య మంత్యదశకు వచ్చెను. అప్పుడు దక్షిణమున నైదుగురు తురుష్కులు స్వతంత్రులయిరి. వారిలో విజాపురమునందు రాజ్యము చేయువారిని 'ఆదిల్ షహాల'నియు, గోలకొండయందలి రాజుల వంశమును 'కుదుబ్‌షహాల'నియు వర్హాడ (బీరారు) రాజులను 'ఇమాద్ షహాల'నియు, అహమ్మదనగర ప్రభుత్వమువారిని 'నిజామ్ షహాల'నియు, 'అహమదాబాదు నందలివారిని 'బరీద్‌షహాలని'యు వాడుచుండిరి. కాని కొన్ని రోజులయిన పిదప 'ఇమాద్ శాహి' 'బరీద్ శాహీలు' రెండునునాశమునొంది 'ఆదిల్ శాహి' 'నిజామ్‌శాహి' ;కుతుబ్ శాహీలు' మూఁడునుమాత్రము నిలిచెను. శాహియనఁగా రాజ్యమనియు షహా యనఁగా రాజనియు నర్థము.

భర్తజీవిత కాలమునందు చాందబీబీయొక్క చాతుర్యమంతగాఁ దెలియకుండెను. ఈమె భర్తయగు అల్లీ మిగుల భోగముల ననుభవింపుచు రాజ్యమునం దెంతమాత్రము దృష్టి లేక యుండెను. ఇట్లుండఁగా క్రీ. శ. 1580 వ సంవత్సరమునం దొక దినమునం దాయన యజాగ్రతగా నున్న సమయమునం దొకఁ డకస్మాత్తుగా నతనిఁ బంపెను. తదనంతరమునం దాతని తమ్మునికొడుకగు రెండవయిబ్రాహీం ఆదిల్‌షహా సింహాసనారూఢుఁ డయ్యెను. ఆయన 9 సంవత్సరముల బాలుఁ డగుటవలన నాతని పెత్తండ్రి భార్యయగు చాందబీబీయే కమీల్‌ఖానను మంత్రి సహాయమువలన రాజ్యము నేలుచుండెను. కొన్నిదినములయిన వెనుక కమీల్‌ఖానునకు రాజ్య కాంక్ష మిక్కుటమయ్యెను. దానింగని చాందబీబీ కీశ్వరఖానను సరదారుని సహాయముచే వానిఁ జంపి కీశ్వరఖానునకు దివాన్ గిరి నిచ్చెను. కాని కొంతకాలమునకు వాఁడును కృతఘ్నుఁడయి రాణిమీఁదఁ గొన్ని దోషముల నారోపించి యామెను సాతార కిల్లాలో కైదుచేసియుంచెను. చాందబీబీని కైదుచేసిన పిదప కీశ్వర్‌ఖాను రాజ్యమునం దంతటను విశేషసంక్షోభము చేయ సాగెను. దాని నెవరును మాన్పలేక యుండఁగా యెకసాల్‌ఖానను సిద్దీసరదారుఁ డొకఁడు వాని నచటినుండి వెడలఁగోట్టి చాందబీబీని విడిపించి తెచ్చెను. తదనంతర మామె యెకసాల్‌ఖానును వజీరుగా నేర్పఱచి రాజ్యము నేలుచుండెను. అప్పుడాతఁడు పాతనౌకరుల నందఱిని తీసి క్రొత్తవారిని నియమించెను. అక్కాలమునందు విజాపురమునందలి జనులు మంత్రిత్వము ఉన్‌ఉల్ ముల్కసిద్దీ కియ్యవలెనని కొందఱును, అబ్దుల్ హసనను దక్షణీతురక కియ్యవలెనని మరి కొందఱును ఇట్లు రెండు పక్షములుగా నుండిరి.

ఇట్లు రాజ్యంబులోనంత:కలహంబులుజరుగుచుండఁగా మూర్తిజా, నిజామ్‌షహా కులీకుతుబ్‌షహా వీరిద్దఱును అహమ్మదనగరముపైకి దండువెడలి దానిని సమీపించిరి. అప్పుడ చటఁ బ్రజలలో బొత్తుగా నైకమత్యము లేక యుండినందున వైరులకు మిగుల ననుకూలముగా నుండెను. ఇట్టి సమయమునందు చాందబీబీ మిగుల యుక్తిగాలోకులను సమాధానపఱచి అబ్దుల్ హసనునకుఁ బ్రధానిత్వమిచ్చి రెండుపక్షములవారిని నొకటిగాఁజేసి శత్రువులను మరలిపోవునట్లు చేసెను! షహాలు తమతమనగరముల కరిగినపిదప దిలార్‌ఖానను సిద్దీ మిక్కిలి గర్వించి అబ్దుల్ హసనును జంపించి తానేప్రధాని యయ్యెను.

ఇట్లీరాజ్యమున నొకసంవత్సరముపై నాఱుమాసములలో ముగ్గురు మంత్రులైనను నొకరును నెగ్గకుండిరి. దిలార్‌ఖాన్ సిద్దీ మిగుల చాతుర్యవంతుఁడైనందున నతఁడు తనకు రాజ్యకాంక్ష కలిగియు దానిని వెలిపుచ్చక మిగుల జాగరూకుఁ డయి యుండెను. ఇతఁడు రాజ్య వ్యవస్థను బహు చక్కఁగాఁ జూచెనుగాని చాందబీబీ యచటనుండిన తనయాటలేమియు సాగవని తెలిసికొని ఇబ్రాహిమ్‌ఆదిల్‌షహా చెల్లెలగు ఖుదీజా సుల్తానాయను రాజపుత్రిని మూర్తిజా నిజామ్‌షహాకొడుకగు మిరాన్ హుసేనున కిప్పించి క్రీ. శ. 1584 వ సంవత్సరమున ఖుదీజా సుల్తానాకుఁ దోడు చాందబీబీనిని జామ్‌షహీమిఁ బంపి బాలరాజును నాశ్రయహీనునిఁ జేసెను.

చాందబీబీ నిజామ్ శాహీకివచ్చినపిదప నచట నైదాఱు సంవత్సరములలోమూర్తిజాను జంపి యాతని కొడుకగు మిరాన్‌హుసేను అతనినిఁజంపి యాతని పినతండ్రి యగు బురాణ సహాయును, అతని వెనుక నాతని పుత్రుఁడగు ఇస్మాయెల్ షహాయును తదనంతరమాతని తమ్ముఁడగు ఇబ్రాహిమ్‌నిజాం షాహాయును రాజ్యముచేసిరి. ఇబ్రాహి మ్మరణానం తరమునం దతని పుత్రుఁడగు బహుదూర్‌ను కారాగృహమునం దుంచిఆన్ అను దక్షణీతురకమంత్రి, నిజామ్‌షాహిలోనివాఁడని చెప్పఁబడు అహమ్మదనువానిని సింహాసనముపై నుంచితానే రాజ్యముచేయ మొదలుపెట్టెను. ఈ అహమ్మదునకు రాజ్యము నిచ్చుట సిద్దీ సరదారుల కిష్టములేక బహుదురునకు ననువయస్కుఁడగు నొకబాలునిఁ దెచ్చి వానినే రాజ్యార్హుఁడని చెప్పఁదొడఁగిరి. ఇట్లు వారు రెండుపక్షములవారయి సైన్యసహితులగుటఁ గని మి ఆన్ మంజూ మిగుల చింతించి అక్బర్ బాదుషా కొడుకగు మురాదనునాతనికి మీరు నాకుసహాయముచేసినచో అహమ్మదనగరము మీస్వాధీనము చేయుదునని వర్తమానము నంపెను. కాని మురాద్‌సైన్యసహితుఁడయి వచ్చులోపల అహమ్మదనగరమునం గల రెండుపక్షములవారికిని యుద్ధము జరిగి సిద్దీలను మి ఆన్ మంజూ ఓడించెను. కాన దా ననినప్రకారము అహమ్మదనగరముమురాదున కిచ్చుటకు సమ్మతింపఁడయ్యె. అంత నారాజపుత్రుఁడు యుద్ధసన్నద్ధుఁడయ్యెను. ఆ సమయమున నీ ప్రధాని సైన్యమునంతను ఆదిల్ షహ, కుతుబ్ షహాలను సహాయమునకుఁ బిలువఁబోయెను. ఆతఁ డరిగినపిదప బహుదూర్ రాజ్యమనిసాటించి చాంద బీబీ రాజ్యమును తానే నడుపుచుండెను.

ఆసమయమునం దిద్దఱు ముగ్గురు రాజ్యము తమకే కావలయునని యనుటవలన నచటి లోకులు రెండు మూడు పక్షములుగానుండిరి. ఇట్టి సమయమున చాందబీబీ తనదృఢనిశ్చయమును విడువక, నేహంగఖానునకు శహా అల్లీ సిద్దీకిని వర్తమానముల నంపి వారిని రాజధానికిఁ బిలువనంపెను. చాందబీబీ యాజ్ఞప్రకారము వారిరువురును వచ్చుచుండఁగా త్రోవలో శత్రువులు వారిని రానియ్యక నిలిపిరి. నేహంగఖాన్ మాత్రము శత్రుసైన్యము నుపాయముగాఁ జీల్చి రాజధానిం బ్రవేశించెను.

ఆదిల్‌షహ, కుతుబ్ షహాలు మురాదునిరాక విని ప్రధమమునందు నిజామ్‌శాహీని గెలిచి పిదప మన పైకివచ్చునని భయపడి విపులసైన్యములతో నిజామ్‌శాహీకిఁ దోడుగా వచ్చుచుండిరి. ఈ సంగతి విని మురాద్ వారు వచ్చినచో గెలుపొందుట కష్టమని తలఁచి గ్రామమును చుట్టుముట్టి బురుజులను పడఁగొట్ట యత్నింపుచుండెను. మరాద్ సైనికులు బురుజులను బైటినుండి త్రవ్విగూడుచేసి యాగూఁటిలో తుపాకిమందునుంచి దానికి నగ్నిని రవులుకొల్ప యత్నింపుచుండిరి. కాని చాతుర్యవతియగు చాందబీబీ లోపలినుండి బైటివఱకు రంధ్రములు పొడిపించి వారాగూటిలోనుంచు మందు నీవలికిఁ దీయింపుచుండెను. ఇంతలో వారొక బురుజునకు నిప్పంటించి నందున నా బురుజుతోఁ గూడ ననేక సైనికులు నాశమునొందిరి. అంత నాత్రోవను మొగలులు పట్టణములోనికిఁ జొర నుంకించఁగా నదివఱ కధిక శౌర్యముతో యుద్ధము చేయుచున్న నిజాము సైన్యములు ధైర్యమును విడిచి పాఱఁదొడఁగెను. అప్పుడు చాందబీబీ ధైర్య మవలంబించి, కవచమును ధరియించి మోముపై ముసుకువేసికొని చేత ఖడ్గమును ధరియించి "నాబొందిలో ప్రాణము లుండఁగా పట్టణము పగవారిచేఁ జిక్కనియ్యన"ని కూలిన బురుజు వైపునకుఁ బరుగెత్తెను. దానింగని సైనికు లధికశౌర్యసాహసములుగల వారలై మరలి శత్రువులతోఁ బోరసాగిరి. ఆదినమంతయు యుద్ధము జరిగెనుగాని చాందబీబీ శత్రువులను పట్టణములోనికిఁ జొరనియ్యకుండెను. అప్పు డామె యెక్కడఁజూచినను దానెయై బహుశౌర్యముతోఁ బోరాడెను. ఆసమయమునందలి యామె శౌర్యమునుగని శత్రుసైనికులు సహిత మాశ్చర్యపడిరని ప్రత్యక్షముగాఁ జూచి యతఁడే వర్ణించెను. అప్పుడు మురాద్ తనకు గెలుపుదొరకుట దుస్తరమని తెలిసికొని "మాకు వర్హాడప్రాంతము నిచ్చినయెడల మేము మాదేశమునకుఁ బోయెదమ"ని చాందబీబీకి వర్తమాన మంపెను. త్వరగా రాజ్యమునందలి యితరసై నికులువచ్చి తనకుఁ దోడుపడు లక్షణము లేమియు నగుపడనందున వర్హాడప్రాంతము చాందబీబీ వారికి నిచ్చి సంధిచేసికొనెను.

తదనంతరమునం దామె బహాదుర్‌ను కారాగృహము నుండి విడిపించి తెచ్చియతనికిఁ బట్టాభిషేకము గావించెను. అంతనామె అహమ్మదఖానను నాతని ప్రధానిగా నేర్పఱచి యాపిల్లవానిపేర తాను రాజ్యము నేలుచుండెను. కాని అహమ్మద్ ఖానునకు రాజ్యకాంక్ష మిక్కుటమైనందున అతఁడు చాందబీబీమాటను సాగనియ్యకుండెను. ఈసంగతి సైనికులకు దెలియఁగా వారాతనిఁబట్టి బంధించి చాందబీబీ స్వాధీనము చేసిరి. తదనంతర మాతనిపని నేహంగఖానను నాతని కిచ్చినందునచాందబీబీరాజ్యము సురక్షితముగా నేలఁదొడఁగెను కాని త్వరలోనే నేహంగఖాను రాణికి వైరియయ్యెను. ఈ సమయముననే మురాద్ శహాపురమునందు కాలము చేసెను. అంత నగ్బరుపాదుషా తనచిన్నకొమారుఁడగు డానియల్ అను నా తనిని మురాద్ పనిమీఁదికిఁ బంపి యతనికి వజీరునిగాఖాన్ ఖానను వానిని బంపెను. అప్పు డగ్బరు బర్హాణ పురమునకు వచ్చి డానియల్‌ను క్రీ. శ. 1599 వ సంవత్సరమున అహమ్మదు నగరముపైకి యుద్ధమున కంపెను.

ఈసమయమునందు నిజామ్‌శాహీలో మిగుల నవ్యవస్థగా నుండెను. చాందబీబీవంటి చాతుర్యవతి రాజ్యము చేయుచున్నను ఆసమయమునం దామెకు నచట విశ్వాసార్హు లగువా రెవ్వరును లేకయుండిరి. కాన నామె యేమియుఁ జేయలేక యుండెను. నేహంగఖాను చాందబీబీతో నేమో యాలోచించి వైరులను త్రోవలో నాటంకపఱు పఁబోయెను. కాని శత్రువులాతఁ డుండుత్రోవనురాక మఱియొకత్రోవతో వచ్చి పట్టణమును ముట్టడించిరి. అప్పుడు చాందబీబీ తన యాజ్ఞను వినువా రెవ్వరునులేక అప్పటికి రాజధానిని విడిచి బాలరాజునుగొని జున్న ననుగ్రామమునకు బోవ నిశ్చయించెను. కాని యామె సమీపముననుండు హమీద్‌ఖానను వాని కాయాలోచన సరిపడక చాందబీబీ పగవారికి రాజ్య మిచ్చు చున్నదని యూరంతటను సాటమొదలు పెట్టెను. అది విని దక్షిణితురకలు నిజమని తలఁచి హమీద్‌ఖానును ముందిడుకొని కొందఱు భటులు చాందబీబీ యంతపురము జొచ్చి యామెను జంపిరి. ఇట్లు హిందూస్థానపు ఇతిహాసములోఁ బ్రసిద్ధురాలయిన స్త్రీరత్నముయొక్క చరితము ముగిసెను. ఈమె ప్రధమమునందు విజాపురమున మఱఁది కొమారుఁడగు ఇబ్రాహిమ్‌ఆదిల్ షహా చిన్నతనమున నతని కొఱకు ఆదిల్ శాహిని రక్షించెను. పిమ్మట అహమ్మద్‌ నగరమున తన తమ్ముని మనుమఁడగు బహదురు కొఱకు నిజామ్‌శాహీ సంరక్షణమును మిగుల కశలతతోఁ జేసి సార్వభౌముఁడగు అగ్బరుయొక్క కుమారుని సైన్యములను దిరగఁగొట్టెను. కాని తుదకు రాజ్యమునం దంతటను మూర్ఖులుండుటవలన నామె యోగ్యతనెఱుఁగక మిగుల నన్యాయముగా నామెను జంపిరి. నేఁటివఱకును దక్షిణమున స్త్రీల శౌర్యమునుగూర్చి ప్రసంగించునప్పుడు చాందబీబీ యొక్క శౌర్యమునే ప్రధమున శ్లాఘింతురు.

Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf
  1. డిల్లీలో గంగూయను బ్రాహ్మణుఁడు జఫీర్‌ఖానను తురకపిల్ల వానిని బాల్యమునఁ గొని పెంచి యింటిపని చేయుటకయి యుంచుకొనెను. పిదప నాచిన్నవాని బుద్ధివైభవముఁ గని యాతని యజమానుఁడు ద్రవ్యమక్కఱలేకయే యాతనిని దాస్యమునుండి విడిచెను. తదనంతర మాపిల్లవాఁడు దక్షిణమున రాజ్యము స్థాపించెను. అప్పుడతఁడు తనయజమానునియెడఁ గృతజ్ఞుఁడయి జఫీర్‌ఖాన్ గంగూ బ్రాహ్మణీయని తనపేరు పెట్టుకొనెను. ఆతని రాజ్యమే బ్రాహ్మణీరాజ్య మనం బరఁగెను.