అబలా సచ్చరిత్ర రత్నమాల, ద్వితీయ సంపుటము/పన్నా

వికీసోర్స్ నుండి

పన్నా.

                క. ఇప్పుడు నయ్యుత్తమసతి నప్పురమున
                    నొప్పువార లతిముద మొదవం
                    జొప్పడఁ గీర్తనసేయుదు రిప్పరసున
                    నుండవలదె యింతులు పుడమిన్.
                                                        [చింతామణి.

మేవాఁడదేశపు రాజగు సంగ్రామసింహుఁడు మృతుఁడయినవెనుక నాతని పుత్రులు ముగ్గురిలో నిరువురు స్వల్పకాలమే రాజ్యము పాలించి పరలోకమున కేగిరి. మూడవవాఁడగు ఉదయసింహుఁ డైదేండ్లప్రాయము కలవాఁడయి దాది పోషణలోనే యుండెను. ఈతని దాదిపేరు పన్నా. ఈపన్నాకురాజధాత్రిత్వము వంశపరంపరగా వచ్చుచుండెను. ఈమె సుగుణములు మిగుల విలువగలవని తెలుపునటులఁ గాఁబోలును నవరత్నములలోని దగు[1] (పన్నా పచ్చ) యని తలిదండ్రు లామెకుఁ బేరిడిరి. పన్నా వారిడిన నామమునకుఁ దగు గుణవతి యయ్యెను.

సంగ్రామసింహుని పుత్రు లిరువురును స్వర్గస్థులైన పిదప నుదయసింహుపేర పృథివీరాజునకు దాసీపుత్రుఁడగు బన బీరుఁడు రాజ్యము నడుపున ట్లేర్పాటుచేయఁబడెను. బనబీరుని జన్మమువలనే గుణమును నీచమైనదియేగాన వాఁడు తా ననర్హుఁడయినను అదృష్టవశమునఁ దనకు రాజ్యమును రాజపాలకత్వమును దొరుకుటకు సంతసించి యుండక రాజ్యముతనకే శాశ్వతముగానుండు నుపాయము విచారింపసాగెను. ఇట్లు విచారింపఁగా రాజపుత్రుని నెటులయినఁ జంపక తనకుదొరకదని వాఁడు తెలిసికొని యెవ్వఱికి నెఱుక పడకుండ తానేయాపనిని జేయ నిశ్చయించుకొనెను. ఆనీచుఁడు తనకృత్య మించుక బైలపడినయెడల రజపూతు సరదార్లు తనను దెగఁజూతురని యెఱిఁగినవాఁడుకాన పైకిమిగుల సత్ప్రవర్తనగలవానివలె నగుపడుచుండెను. రాజపుత్రుని నెటులయినఁ దానుచంపి యాద్రోహ మితరులపై నిడి సరదార్ల సమ్మతిచేఁ దానేరాజగు నుపాయము నాతఁడు యోచింపుచుండెను.

బనబీరుని మనమునం దిట్టిద్రోహముకలదని యేరికిని సంశయమయినను రాకుండెను; గాని యిట్టిపాపవిచారము బైలపడకుండుట దుస్తరము గాన నాతని దుష్టవిచారమంతయు సమీపమునందుండుమంగలివాఁ డొకఁడు తెలిసికొనెను. వాఁడును పన్నావలెనే ప్రభుభక్తుఁడు. వానికిఁ బనబీరుని పరిపాలనమే యసమ్మతము. బనబీరుఁడు తనదుష్టత్వ మెంతగుప్తముగా నుంచినను, పరమేశ్వరుఁడు ఆపాపమున కంతకును నీ మంగలివాని నొకనిని సాక్షిగా నియమించెను. బనబీరుఁ డేసమయమునం దేమియాలోచన చేసినను బహుయుక్తులచే నీమంగలి యప్పుడే దానిని గని పెట్టుచుండెను. ఇట్లుండఁగా నొకనాఁటిరేయి రాజనగరమునం దంతటను నిశ్చలముగా నున్న సమయమున పన్నా రాజపుత్రునివానితో సమవయస్కుఁడగు తనపుత్రుని నిదుర పుచ్చితానుసమీపమున నేదోకుట్టుకొనుచు కూర్చుండెను. ఇంతలో ద్వారమావల నేమో కాలుచప్పుడు వినవచ్చినందున నాదాది లేచి చూచెను. అప్పుడు పైనిఁ జెప్పఁ బడిన మంగలివాఁడు మిగులనాతురతతో వచ్చుటఁగని పన్నా "నీవింత తొందరగా వచ్చి పిచ్చివానివలె నాతురుఁడవయ్యెదవేల? ఏదియేని యప్రియమా?" యని యడిగెను. అందు కానాపితుఁడు "అవును మిగుల ఘాత కాఁబోవుచున్నది. ఇంక నొక గడియ కా బనబీరుఁడు రాజపుత్రునిజంప నిట కేతెంచును." ఈవాక్యములు చెవిని సోఁకగానే పన్నా దేహము ఝల్లు మన నొక యూర్ధ్వశ్వాసను విడిచి యిట్లనియె. 'నే నిన్ని దినములు వచ్చునని భీతిల్లు చుండినదే నేఁడు ప్రాప్తమయ్యెను. ఆదుష్టునిపై నాకిదివఱకే యనుమానముండెను కాని నే నాఁడుదాన నగుటచే నేమి చేయుటకును జాలకుంటిని. ఏది యెటులైనను నిప్పుడు రాజపుత్రుని రక్షించుట మనకర్తవ్యము" అందుకామంగలి "యది బహుదుర్ఘటము. అయినను నీకేదేని యాలోచన దోఁచినచో త్వరగాఁ జెప్పుము. నీ వెట్టికార్యము చెప్పినను నేను నిర్వహింపఁగలను" అనెను. తదనంతరము పన్నా యొకించుక విచారించి "రాజపుత్రుని నొకానొకసుస్థలమునకుఁ గొని పోవుదమ"ని చెప్పెను. "అట్లు చేయుటకు వీలులేదు. నేఁ డేబాలకులను రాజనగరు వెలుపలికిఁ గొనిపోవకుండ పాపాత్ముఁడు కట్టడిచేసెను. పన్నా "అటులైననీరాజపుత్రుని నొకతట్టలోఁబెట్టి పైనపెంట బోసి నీ కిచ్చెదను. నీవు దానినిఁ గొనిచని సురక్షిత మగుచోటనుంచు నంతలోనే నచటికివత్తును," మంగలి "బనబీరుఁ డింతలో నిచటికి రాఁగలఁడు. వచ్చువఱ కిచట రాజపుత్రుఁడు లేకుండె నేని తత్క్షణము చారులచే వెతకించి పిల్లనిఁ దెప్పించును. అటులైన రాజపుత్రుని ప్రాణములను మనము కాపాడ నేరము." పన్నా కొంచెముయోచించి మిగులఁ గాంభీర్యముగా "ఇందు కంతగా విచారింపనేల? వాఁడిచటికి వచ్చిన యెడల రాజపుత్రుఁ డిచట లేఁడనుమాటనే వానికి దెలియనియ్యను. రాజబాలుని నగలను బట్టలను నాబిడ్డనికి నలంకరించి యాప్రక్కమీఁదనే పరుండఁ బెట్టెదను ! నాపుత్రుని మరణమువలన మేవాడదేశపురాజును మాప్రభుఁవునునగు నీబాలుడు రక్షింపఁబడును కాన నాకదియే పరమసమ్మతము." పన్నా దృఢనిశ్చయముగాఁ బల్కినవాక్యములను విని యానాపితుఁడు మిగుల నాశ్చర్యముతో నేమియు ననక నిలువఁబడి యుండెను. ఇంతలో పన్నా రాజపుత్రుని నొకతట్టలో నునిచి పైన పుల్లాకులు, పెంట మొదలయినవిపోసి యాతట్టత్వరగాఁ గొని చనుమని యాసేవకుని తొందర పఱుపసాగెను. దీని నంతనుగని పన్నా ధైర్యమునకును రాజభక్తికిని వింతపడిదాని యందధిక దయగలవాఁడై యాభృత్యుఁడు "పన్నా ! నీవింత సాహసకార్య మేలచేసెదవు? ఇంకను నీమనంబునం దించుక విచారింపుము." పన్నా "విచారింపవలసిన దే మున్నది? నాకర్తవ్యము నేను చేయుటకుఁ దగినవిచారము చేసినాను. నీవిట్టియాటంకములనే చెప్పుచు నిచట నాలస్యము సేయకు." ఎంతచెప్పినను పన్నావినదని తెలిసికొని తా నాలస్యముచేసిన రాజపుత్రుని ప్రాణము దక్కదని యెఱిఁగినవాడగుటచే వాఁడాతట్టను నెత్తిని నిడికొని రాజనగరు వెలుపలి కరిగె. పన్నాదాదియు రాజపుత్రుని అలంకారములను తనపుత్రునకు నలంకరించి వానిని రాజబాలుని పానుపు, పైనిదురబుచ్చెను. ఇటు లారాజభక్తి గల యువతి తనపుత్రుఁడు నిదురింపుచుండ తా నాపక్కసమీపమునందుండిబనబీరునిరాక నిరీక్షింపుచుండెను. ఇంతలో నాకాలస్వరూపుఁ డచటికివచ్చి మిగుల దయగల వానివలె రాజపుత్రుని దేహము స్వస్థముగా నున్నదాయని పన్నానడిగి వానిని జూచెద నని పక్క యొద్దికరిగెను. ఆప్రకార మచటి కరిగి వాఁడు నిదురింపచున్నవా రెవ్వరని విచారింపక నాయర్భకుని పొట్టలో కత్తిపొడిచి పాఱిపోయెను. ! వాఁ డటుపొడువఁగా నాబాలుఁ డొక కేక వేసిప్రాణములు విడిచెను. అ కేక రాజభవనమునం దంతటను వినఁబడి జనులనందఱిని లేపెను.

అ కేక విన్నతోడనే రాజభవనమునందలి వారందఱచటికి వచ్చిరి. వారువచ్చిచూచునప్పటికి రాజపుత్రుని దేహమంతయు రక్తమయమయి యాబాలుఁడు ప్రాణములనువిడిచియుండెను ; పన్నాదాది యాబాలుని సమీపముననే దేహము తెలియక పడియుండెను. చచ్చినవాఁడు రాజపుత్రుఁడేయని తోఁచుటచే జనులందఱు మిగులదు:ఖించిరి. పన్నా సేదదేరిన పిదప రాజపుత్రుని జంపినవా రెవ్వరని యడుగఁగా "నొకనల్లటి పురుషుఁ డెవఁడో చంపెన"ని చెప్పెను. రాజపుత్రుని జంపినవా రెవ్వరో యని యనేకులు లూహించిరి. కానిసాక్షులు లేనందున దానిని నిశ్చయింప లేకుండిరి. పన్నాదాయి యచటనుండివెడలి రాజకుమారునిదాఁచిన స్థలమున కరిగియాబాలుఁడు ప్రౌఢుఁడగువఱకు నాతనిని పోషించెను. ఈసంగతియంతయు రజపూతులకుఁ దెలియఁగావారు ఉదయసింహుఁడుపెరిగినపిదప బనబీరుని దేశము వెడలగొట్టి ఉదయసింహునినే రాజునుగాస్వీకరించిరి. ఇట్లురాజభక్తిగల యువతివలన సంగ్రామసింహునివంశము నిలిచెను. అనేకప్రజలను గాపాడు ప్రభువుబతికెను. కాననట్టి యువతికీర్తి భరతఖండమునం దంతటను నిండియుండుట వింతగాదు. ఉదయ సింహుఁడు పన్నాను తల్లినిగా భావించి పూజింపుచుండెను.

  1. ఈమెపేరు ఒకానొక తెలుఁగుగ్రంధకారుఁడు మోతి (ముత్యము) యని వ్రాసినాఁడుగానియందు కాధారమేమియుఁరాజపుత్రా నాచరిత్రమునందుఁ గానగాలేదు.