అబలా సచ్చరిత్ర రత్నమాల, ద్వితీయ సంపుటము/పృథివీరాజు భార్య
పృథివీరాజు భార్య.
గుణో భూషయతేరూపం శీలం భూషయతే కులం. [1]
ఈమె సిసోదియావంశమునందుఁ బుట్టి సుక్తావతవంశస్థాపకుఁ డైనసుక్తరాజు పుత్రియు, రాఠొరువంశమునందుఁ బ్రసిద్ధుఁడగు పృధివీరాజు పత్నియునని పూర్వచరిత్రములు చెప్పుచున్నవి. ఈమె అక్బరుబాదుషాతో సమకాలీనురాలు; గాన పదియాఱవశతాబ్దారంభమునందుండెనని తేలుచున్నది.
అక్బరుబాదుషా యితరతురుష్క ప్రభువులవలెఁ దనప్రజలను బాధింపక వారివారిధర్మములను రక్షించుటచే సర్వధర్మ సముఁడని ప్రసిద్ధుఁ డయ్యెను. ఆయన సకలజనులకును, దనకును మనోరంజనము గలుగుటకై ప్రతిసంవత్సరము తననగరమునందుఁ గొన్నిదినములు గొప్పయుత్సవము జరుపుచుండెను. ఆయుత్సవపు తుదిదినమునందచట సర్వము స్త్రీమయముగానే చేయఁబడుచుండెను. ఆస్త్రీప్రపంచములో ఆడువారును, పాడువారును, అమ్మువారును, కొనువారును, ఇతరమైన యుత్సవములఁ జేయువారును చూచువారును అందఱు స్త్రీలే! ఆరోజు పురుషులకు నీయుత్సవము జరుగుచున్న స్థలమునకు వెళ్ళుటకు ననుజ్ఞ లేక యుండెను. కాన నాఁటిదినము బాదుషా యంత:పురము నందలి స్త్రీలును, ఇతర రాజపత్నులును ఆయుత్సవము నందునిరాతంకముగాఁదిరుగుచుండిరి. అచటికిఁబురుషు లెవ్వరును రాకుండ కట్టుదిట్టములు చేయఁబడినను అక్బరుమాత్రము స్త్రీవేషమున నచట నితరుల కెఱుఁగ రాకుండునటుల సంచరింపు చుండెను.
ఆయుత్సవమునకు నొకసంవత్సరము పృథివీరాజు భార్యవచ్చెను. కాని యా యుత్సవమువలన నామె కెంతమాత్రము సంతోషము కలుగ లేదు. ప్రచ్ఛన్న వేషముతో నుండిన బాదుషా యత్యంతరూపవతియగు నామగువనుగని మిగుల మోహితుఁడయి యామె మఱలి వెళ్లుమార్గమున నామెరాక నిరీక్షింపుచుండెను. ఇంతలో నాసాధ్వీమణి మఱలి తననగరునకుఁ జనుటకై బాదుషా కాచుకొనియుండినమార్గమునఁ బోవఁదొడఁగెను. అట్లు వచ్చుసుందరిని నకస్మాత్తుగా నాడిల్లీశ్వరుఁ డరికట్టెను. తన నరికట్టినవాఁడు అక్బరనియు, దురుద్దేశముతో నాతఁ డిట్లు చేసెననియు నాకాంత తెలిసికొనెను. అంత నామెతనవలెనే యితర స్త్రీల నెందఱినో కపటస్త్రీ వేషధారియగుబాదుషా చెఱుప యత్నించియుండునని తలఁచి క్రోధావేశపరవశురాలయి మిగుల రోషముతోఁ గన్నుల నిప్పులురాలతనగుప్తభల్లమును చేత ధరించి మిగుల ధైర్యముతో "పవిత్రమగు క్షత్రియవంశమును కలంకమయము చేయఁదలంచిన దుష్టు బారినుండి నాపాతివ్రత్యమును సంరక్షించుకొని యీద్రోహిని నాచేతిఖడ్గమునకుఁ బలియియ్యగలను" అని బలికెను. ఇట్లు గంభీరస్వరముతోఁ బలికిన ధైర్యవతి పలుకులు విని బాదుషా కొరతవడి చిత్రప్రతిమవలె చేష్టలు దక్కి నిలువఁబడి తదనంతర మాతఁడు విజ్ఞానవంతుఁడగు ప్రభువగుటచేఁ దనయజ్ఞానమునకు సిగ్గుపడి యాకాంతకు నమస్కరించెను. నాఁటినుండియు బాదుషా పశ్చాత్తాపపరుఁడయి యామెను తనసహోదరినిగా నెంచుచుండెను.
- ↑ రూపము సద్గుణముచేఁ, గులము సచ్ఛీలముచే నలంకరింపబడును.