Jump to content

అబలా సచ్చరిత్ర రత్నమాల, ద్వితీయ సంపుటము/ఖడ్గతిక్కన భార్య

వికీసోర్స్ నుండి

ఖడ్గతిక్కన భార్య.

అమృతం సద్గుణాభార్యా. [1]

ఈయువతీరత్నముయొక్క నామధేయ మయినను తెలియనందువలన నీమెభర్తం పేరిటనే యీమెను జనులు గుర్తించెదరు. 13 వ శతాబ్దమున సూర్యవంశపు రాజగు మనుమసిద్ధి నెల్లూరిమండలము పాలింపుచుండెను. ఆయన యాస్థానమునందున్న కవి తిక్కన. కార్యతిక్కన, ఖడ్గతిక్కన యను సహోదరులలోఁ బరాక్రమవంతుఁడగు ఖడ్గతిక్కన నియోగి బ్రాహ్మణుఁడు. ఈయన తన పరాక్రమమువలన రాజుచే మిగులమన్నింపఁబడుచుండెను.

ఖడ్గతిక్కనభార్య విద్యావతియు, గుణవతియునై సదా పతి శ్రేయము నే కోరుచుండెను. ఆమెభర్త చేసినదంతయు మంచిపని యని యూఱకుండక యాతఁ డేదేని కానికార్యము చేయఁ దలఁచినయెడల తనచాతుర్యమువలన నాతనిచే నట్టికార్యము జరుగకుండఁ జేయుచుండెను. ఇందునకు నిదర్శనముగా నొకప్పుడామె చేసిన చాతుర్యమిం దుదాహరించెదను.

ఒకానొకసమయమున రాజగు మనుమసిద్ధిపై శత్రురాజులు దండెత్తి వచ్చిరి. అపుడు కొంతసైన్యమునుతోడిచ్చిరాజు ఖడ్గతిక్కనను శత్రువులతో యుద్ధమున కంపెను. ఖడ్గతిక్కన యెంతటి శౌర్యవంతుఁ డయినను వైరులధిక సైన్య సహితులగుటచే నీతనిశౌర్య మేమియు వినియోగింప కుండెను. ఇట్లుకొంతవడి పోరాడితనకు జయము కలుగు నన్నయాస సున్నయగుటచే ఖడ్గతిక్కన యుద్ధభూమినుండి పాఱి తన గృహమునకు వచ్చెను.

పరులకోడి తనభర్త పాఱివచ్చుట విని మానవతి యగు నాతనికాంత మిగుల చింతించి సమయోచితబుద్ధి గలది యగుటచే పెనిమిటి వచ్చులోపల మఱుఁగు స్థలమునందు స్నానజలముంచి నీళ్ల బిందెకు పసపుముద్ద యంటించెను. ఇట్లు స్త్రీలు స్నానముచేయుటకు నావశ్యకమగు వస్తువు లచ్చటనుంచి యామెభర్తరాఁగానే యాదరింపక తిరస్కారముగా స్నానము చేయుఁడని చెప్పెను.

తిక్కన తనభార్య ముఖమునందలితిరస్కార భావమును గని యపుడేమియుననక స్నానమునకరిగెను. అచట నాఁడువారి కుంచునట్లొకమంచ మడ్డముగానుంచి నీళ్ళబిందెకు పసుపుముద్ద యద్దుటఁగని తిక్కన యది తాను యుద్ధమునుండి పాఱి వచ్చినందుకు భార్య తనను దిరస్కరించుటకై చేసినపనియని తెలిసికొనెను. అయినను ఆయన యంతటితో నూరకుండక తన భార్యను బిలిచి యిది యేమియని యడిగెను. అంత నా వీరపత్ని యాతనికి పౌరుషము కలుగుటకయి యీ పద్యముఁ జదివెను.

               క. పగరకు వెన్ని చ్చినచో!
                   నగరే నిను మగతనంపు నాయకులందున్?

                 ముగురాఁడువార మైతిమి |
                 వగ పేటికి జలకమాడ వచ్చినచోటన్ ?

ఇదివఱకు అత్తకోడండ్ర మిద్దఱమె యింట స్త్రీలముంటిమి. ఇప్పుడు మీరు యుద్ధము వదలి పాఱివచ్చినందున స్త్రీ సమానుల రయితిరిగాన నిందు ముగ్గురు స్త్రీలమయినా మన్న యర్థముగల యీవాక్యములు చెవిసోఁకిన వెంటనే ఖడ్గ తిక్కన మిగుల లజ్జించి యపుడే మరల యుద్ధమున కరిగి మిగుల కీర్తి గాంచెను. కొంద ఱిదియంతయుఁ దిక్కన తల్లియొక్కపని యనియెదరు. ఇట్లు పూర్వమాంధ్ర దేశమునందు పూజనీయలగు వీరపత్నులు, వీరమాతలు వీరభగినులు అనేకులుండుట వలననే యాంధ్ర దేశములోని బ్రాహ్మణులలోఁగూడ క్షాత్ర తేజ మత్యంత ప్రబలమయి యుండెనని చెప్పుటకు సందేహము లేదు.


  1. సద్గుణవతి యగుభార్య అమృతమువలె హితకరురాలు