Jump to content

అబలా సచ్చరిత్ర రత్నమాల, ద్వితీయ సంపుటము/జగన్మోహిని

వికీసోర్స్ నుండి

జగన్మోహిని.

(బాబు కేశవచంద్రసేనుని భార్య)

ఈమె కలకత్తాకు సమీపముననున్న అగర్ పడార యనుగ్రామమున చంద్రకుమార్ ముఝమదారు భార్యకు క్రీ. శ. 1847 వ సంవత్సరము డిసెంబరు 26 వ తేదిని జన్మించెను. పుట్టినింట చిన్నతనమునందీమెను గులాబ్ సుందరియని పిలుచుచుండిరి. గులాబ్ సుందరిని తొమ్మిదవసంవత్సరముననే బాబు కేశవచంద్రసేనుల కిచ్చి వివాహముచేసిరి. ఈ కేశవ చంద్రసేనులే పిమ్మట బ్రహ్మమతావలంబియై మిగుల ప్రఖ్యాతిఁ గాంచెను. జగన్మోహిని యత్త వారియింటికి వచ్చినపిదప నామె భర్త మిగుల వైరాగ్యశీలుండయి యుండెను. ఆయన యంగీకరించిన మతమునుగూర్చి యింటనుండువా రాతనినేకాక యతనిభార్యను సహిత మనేక బాధల పఱుచుచుండిరి. జగన్మోహిని కప్పుడు ధర్మము సంగతి యెంతమాత్రమును దెలియకున్నను తనపతియందలి భక్తిని విడువక యితరులుచేయు నింద నతని చెవినిఁ బడనియ్యక పతిని సంతోషపఱుపఁ బ్రయత్నింపు చుండెను. ఇట్లుండఁగాఁ దనబంధువులలోనుండి తనమతానుసార ప్రవర్తన నడుపుట దుస్తరమని తలఁచి 1861 వ సంవత్సరము బ్రహ్మసమాజోత్సవము జరుగుచుండఁగా కేశవచంద్రసేనులు స్వగృహత్యాగముఁ జేసి యాసమాజమునందుఁ బూజ్యుఁడుగా నెన్నఁబడుచున్న మహర్షి దేవేంద్రనాథుని యింటికి నరిగిరి. అప్పుడు జగన్మోహిని 13 సంవత్సరముల దైనను పతి తోడుత నుండుట యుక్తమని తలఁచి తానును నతనితోడ నరిగెను. ఈ దంపతులు వారియింట నుండఁగా కేశవచంద్రసేనునకు గొప్పవ్యాధి తటస్థ మయ్యెను. ఆవ్యాధిలోనే వారు కేశవచంద్రసేనునియొక్క మిత్రునియింటికి నరుగవలసిన వారైరి. ఆసమయమున జగన్మోహిని చూపినధైర్యము, పతికిఁ జేసిన సేవయు మిగుల స్తుత్యములు. తదనంతరము పరమేశ్వర కృపవలన కేశవచంద్రసేనుల వ్యాధి కుదిరి యతఁడు తనపత్ని సహాయమువలన నేనేకసంస్కరణములను జేయఁగలిగెను. జగన్మోహిని బహుదినములవఱకు బ్రహ్మమతము నవలంబింపక దానిని గూర్చి పతి ననేక ప్రశ్నలువేసి వానికి సమాధానకరములగు నుత్తరములఁ బడసి తన కామతముసంగతి పూర్ణముగాఁ దెలిసినపిదపనే దాని నవలంబించెను. పిదప నీదంపతులకు పుత్రులును, పుత్రికలును గలిగిరి. వారందఱును జననియొక్క పాలనవలన సద్వర్తనము గలవారలైరి. ప్రస్తుతపు కుచ్‌బిహారాధీశ్వరునిభార్య యీమెబిడ్డయే. కలకత్తాయందుజరుగు భారతాశ్రమనుసభ కీమెయేయధ్యక్షురాలుగా నుండెను. దానికేకాక స్త్రీలసభ లాగ్రామమునం దెప్పు డెచటజరిగినను అధ్యక్షస్థానము జగన్మోహినికే యియ్యఁబడుచుండెను.

ఈమెభర్త మరణానంతరము సహితము బ్రహ్మసమాజమునకుఁ జాలసహాయము చేసెను. బ్రహ్మసమాజమునందలి యన్ని శాఖలవారికిని జగన్మోహినీదేవియందు మిగులపూజ్యభావము గలిగియుండెను. ఈమెకు ధర్మప్రచారకులయం దధికాదరము గలిగియుండెను. నవవిధానపక్షప్రాచారకు లీదేవితో గంటలకొలఁది సంభాషింపుచుండిరి. అప్పుడామెకుఁ గల ధర్మ బుద్ధియు, ధర్మప్రచారమునందుఁ గలప్రీతియుఁ బ్రహ్మసమాజీకులందఱియందుఁ గలప్రేమయు, నీశ్వరునియందలి యనుపమేయమగు శ్రద్ధయుఁ గని వారి కామెయెడల నంతకంతకుఁ బూజ్యభావము హెచ్చుచుండెను. ధర్మప్రచారకుల కెవ్వరికేని యొక సంకటము తటస్థించినచో వారు తల్లితుల్యురాలగు జగన్మోహినీ దేవికడకువచ్చి తమదు:ఖముల నామె కెఱిఁగించి యామె వలన సంకట నివారితులై చనుచుండిరి. ఈమె 1898 వ సంవత్సరము మార్చినెలలో పరలోకమున కేగెను.