Jump to content

అబలా సచ్చరిత్ర రత్నమాల, ద్వితీయ సంపుటము/కొమఱ్ఱాజు జోగమాంబ

వికీసోర్స్ నుండి

కొమఱ్ఱాజు జోగమాంబ.

              క. పతిగొట్టినఁ బతితిట్టినఁ
                  బతినిర్దయుఁడగుచు నెట్టిబాధపఱచినన్
                  మతి నన్యధాత్వ మొందరు
                  పతిదేవత లతివ నీకుఁ బ్రతియగువారల్.
                                           [పాండురంగవిజయము]

ఈపతివ్రతాతిలకము రమారమి యేఁబదిసంవత్సరములకుఁ బూర్వముండెను. కృష్ణామండలమునందలి నందిగామతాలూకాలో కంచలయనుగ్రామ మొకటికలదు. అపల్లెయందు భండారు వీరయ్యయను ఆఱువేల నియోగిబ్రాహ్మణుఁ డొకఁడు వాసముచేయుచుండెను. ఆయన దైవభక్తుఁడును, సత్ప్రవర్తకుఁడునునై యుండెను. ఆయనకు జోగమాంబయని యొకకూఁతురు జనియించెను. ఈకన్యక చిన్నతనమునుందుననే బహుగుణవతిగా నుండెను. జోగమాంబ వివాహయోగ్యకాఁగా నాతాలూకాలోనిదగు పెనుగంచిప్రోలను గ్రామనివాసియగు కొమఱ్ఱాజు నాగయ్యకొమారుఁడగు రామయ్యయను నాతనికిచ్చి వివాహము చేసిరి.

ఈ పెనుగంచిప్రోలు పూర్వము గొప్పపట్టణముగా నుండినందున దీనిని పెదకంచియను చుండిరనియు, పెనకంచియను దానికె పెనుగంచి యని యపభ్రంశమయ్యె ననియుఁ జెప్పు దురు. ఆగ్రామ మిప్పుడొక పెద్దపల్లెవలె నుండును. కానియచటి భూమిత్రవ్విన బయలఁబడు గుళ్ళరాళ్లును, మేడలస్థంభములును, దూలములును, శిలాశాసనములును ఆపట్టణ మొకప్పుడు గొప్పపట్టణముగా నుండెనని స్థాపించుచున్నవి.

కొమఱ్ఱాజువారును పూర్వమునుండి యాపట్టణమే వాసస్థలముగాఁ గలిగియుండిరి. వీరు పూర్వము రెడ్లకాలములోను, రాజులకాలములోను, తురుష్కులకాలములోను దేశపాండ్యాగిరిచేసి మిగుల కీర్తిఁగాంచిరి. ఆంగ్లేయరాజ్య మారంభమైనది మొదలు దేశపాండ్యాగిరి పోయినందున వారాగ్రామమును విడిచి యుద్యోగముల నిమిత్తము అనేకదేశముల కరుగవలసిన వార లయిరి. అయినను వారు స్వగ్రామప్రీతిని విడువఁ జాలని వారయి యచ్చట నిండ్లను కట్టుకొని కొందఱప్పుడప్పుడచటికి వచ్చి కొన్నిదినము లుండి పోవుచుందురు.

జోగమాంబ భర్తయునీగ్రామమునందు గృహము గలవాఁడయి నైజామురాజ్యములో నుద్యోగము గలిగి యొక యధికారమునందుండెను. జోగమాంబ మనపూర్వగ్రంధములలోఁ జెప్పఁబడిన పతివ్రతాధర్మములను దప్పక నడిపెను. ఆమె భర్తను దేనివుగా భావించి నిత్యము నాతనిని బూజింపుచు నాతనియాజ్ఞకానిది యామె భోజన మజ్జనశయనాదులు చేయుటలేదు. భర్తయుచ్ఛిష్టము లేనిది యామె యెన్నఁడును భుజియింపకుండెను. ఈవ్రతమువలన నామె కనేకసమయముల యందునుపోష్యములు చేయుట తటస్థింపచుండెను. ఇందున కొకదృష్టాంతము చెప్పెదను. ఒకసారి భర్తగ్రామాంతరమున కరిగి బహుదినములవఱకు రానందున నామె దాఁచి యుంచు కొనిన యుచ్ఛిష్టము లయిన పోక చెక్కలు సమాప్తము లయ్యెను. కానభర్తయెంగిలి లేదని యామె యెనిమిదిదివసంబు లుపవాసంబు చేసెను. కాని నేను ఉపోష్యము చేసితినని యెవరికిని నామగువ తెలుపక యింటిపనినంతను జేయుచుండెను. ఇట్లు చేయఁగా నెనిమిదవదినమున నామె యాఁకలిచేఁ బీడింపఁబడి వంటఁ జేయుచు నచటనే మూర్ఛిల్లెను. ఇంతలో నామె సహోదరి యామెను గనుఁగొన నేతెంచి యదియంతయుఁ గని దాని కారణము నెఱింగి తత్క్షణమే తానామెభర్తకడ కేఁగి యుచ్ఛిష్టము తెచ్చి పదునేనుదినముల తదనంతర మామెకు భోజనము చేయించెను! దీనివలన స్త్రీలు తమభర్తృప్రేమకొఱ కెట్టికష్టముల నైనను నధిక సంతోషముతో సహింతురని స్పష్టమగుచున్నది. వారికిఁ గలభర్తృప్రేమ మిగుల శ్లాఘ్యమయినది. స్త్రీలుస్వాభావముచేతనే పతులయెడ ప్రేమఁ గలిగి యుందురు.

జోగమాంబ యిట్టిభక్తిఁ గలిగి పతిసేవఁ జేయుచున్నను ఆమెభర్త యగురామయ్యగా రామెను మిగుల నిష్ఠురదృష్టిచేఁ జూచుచుండెననియెదరు! ఆమెను నిష్కారణముగాఁ గొట్టియుఁ దిట్టియు ననేకవిధముల బాధ పఱచెను! కానియా సాధ్వీమణి యెప్పుడును భర్తయెడలఁ గలభక్తిని కొంచెమయినను విడువక యాబాధలను మిగుల నోపికతో సహింపుచు నెవరికిఁ జెప్పక యధిక పతిభక్తితో వర్తించెను.

జోగమాంబ పతిభక్తియందేగాక యనేకసద్గుణములలో సహితము ప్రఖ్యాతయయ్యెను. ఆమె బావగార్ల బిడ్డలతన బిడ్డలవలె జూచి వారిని పోషింపుచుండెను. తోడికోడండ్రతో తగవు లాడక కలసిమెలసి యుండెను.

ఈపె కొకకూఁతురును, ఒక కుమారుఁడును కలిగిరి. అటుపిమ్మట నీమె భర్తకంటె ముందే పరలోకమున కేగెను. ఆమెకొడుకు ప్రస్తుతము తండ్రి పనిమీఁదనే సుఖముగానున్నాఁడు.

జోగమ్మ మాయత్తిల్లును పుట్టిల్లును పవిత్రము చేసిన యువతి యగుటవలన నేను మిగుల ధన్యనైతిని. నాతండ్రిగారి కీమె పినతండ్రిభార్య. ఈమె యిట్టిసద్గుణవతియయినను మనదేశమునందలి చరిత్రను గుఱించి గలయౌదాసీన్యమువలన నామె చరిత్రము సవిస్తరముగా వ్రాయుటకుఁ దగు సామగ్రి దొరకదయ్యెను. అయినను ఈసాధ్వీచరిత్రము సవిస్తరముగా వ్రాయుటకు నేను యత్నింపుచున్నాను. ఈశ్వరకరుణవలనఁ జదువరులకుఁ ద్వరలోనే సమర్పింపఁగలను.