అబలా సచ్చరిత్ర రత్నమాల, ద్వితీయ సంపుటము/అర్గళ సంస్థానాధీశ్వరి

వికీసోర్స్ నుండి

అర్గళ సంస్థానాధీశ్వరి.

"సారాసంబెజయము సంకటమున."

ఈమె విహారదేశమునందు బక్సరుపట్టణసమీపమునం దున్న అర్గళసంస్థానాధీశ్వరునిభార్య. ఈమె నామ మెచటను తెలియుమార్గము లేనందున కెంతయుఁ జింతిల్ల వలసి యున్నది. ఈ కాంతారత్నమును భార్యనుగాఁ పడసిన సంస్థానపతి పేరు గౌతముఁడు. ఆయన ఢిల్లీశ్వరునకుఁ గప్పము కట్టనందువలన ఢిల్లీపతి కాయనపై నధిక కోపమువచ్చి ఆయన నోడించి యతని రాజ్యమును వశపఱుచుకొనుమని అయోధ్య నవాబునకు ఢిల్లీశ్వరుఁ డుత్తరువు చేసెను. అంత నానవాబు సైన్యసహితముగా గౌతమరాజుపై యుద్ధసన్నద్ధుఁడై రాఁగా గౌతముఁడు సామాన్యుఁడు కానందువలన తా నొక చిన్న సంస్థానాధీశ్వరుఁ డైనప్పటికి, శత్రువులకు జంకక వారితోఁ బోరి వారిని పరాజితులఁ గావించెను. ఇట్లు విజయముఁ బొంది విజయోత్సవములతో రా జింటికి వచ్చినందున నాఁ డాపట్టణమునం దంతట నుత్సవము లనేకములు జరుగుచుండెను.

ఇట్టిసంతోషకాలమునందు రాణీగారికి గంగాస్నానము చేయవలయునని యిచ్చపొడమెను. గంగాప్రవాహ మర్గళపట్టణ సమీపముననే యున్నను, పరాజితు లయిన శత్రువు లచ్చట దాఁగియున్నందున నచటికి స్నానమునకుఁ బోవుట యతికష్టతరమైయుండెను. అయినను ఎటులనైన గంగాస్నానము చేయవలయునని రాణిగారు నిశ్చయించుకొనినందున తనవేషమును మార్చికొందఱు దాసీలను వెంటఁగోని, యొరు లెవ్వరెఱుఁగ కుండ గంగాస్నానమునకు బయలుదేఱెను. ఆమె చేరువు రేవునకుఁ బోయి తానిట్టిదని యితరు లెఱుఁగకుండునటుల మిక్కిలి జాగరూకతఁ గలిగి స్నానము చేయుచుండెను. కాని యసమానసౌందర్యవతియగురాజయువతి యెట్టివేషము వేసినను దాఁగుట దుర్లభముగాన, నెవరో యొకరాజస్త్రీ సమీపమునఁ గల రేవున జలకమాడ వచ్చిన దనినవార్త క్షణములో నా గంగాతీరమున వ్యాపించెను. అంత నచటికి సమీపముననున్న యయోధ్యానవాబున కీసంగతి తెలిసెను. పరాజితుఁడై మరలి పోవుచున్న సమయమున శత్రుస్త్రీ తనచేత ననాయాసముగా దొరకు నన్నమాట విని, తురుష్కనవాబునకుఁ బట్ట లేని సంతోషము గలిగెను. వెంటనే తన సమీపమునందున్న కొందఱు భటులను గని యాస్త్రీని తెండని నవాబు వారి కుత్తరువు చేసెను. అచట రాణి దాసీసమూహముతోఁ దనపురికిఁ బోవుచుండఁగా మధ్య నవాబు పంపిన భటులు వారిని నడ్డగించిరి. తురకసైన్యము తమ్మాకట్టుటఁ గని రాణి యెంత మాత్రమును ధైర్యమును విడువక యుండెను. ఆసమయమున వర్ణింపుచు నొకానొకకవి క్రిందియర్థము గల హిందీపద్యములను వ్రాసియున్నాఁడు.

              గీ|| యవనవీరులు ఘోరులై యాక్రమించ
                   భీతియింతయు లేక యావీరవనిత
                   క్రోధసందీప్తయై నిల్చెఁ గోమలాంగి
                   యరులతోఁబోర నుద్యుక్తయై రయమున.

               క. సఖులును దానును విమల
                   ప్రఖరమహాక్షాత్రతేజబలయుతలై సత్
                   శిఖులను బోలి వెలింగిరి
                   యఖిలజనంబులును జూడ నాసమయమునన్.

రాణియు నామెతోడ నున్న ప్రతిదాసియు, నొక్కక్కమడకత్తి నదివఱకే తమయొద్ద దాఁచియుంచుకొని నందునఁ బ్రతిపక్షులను గనినతోడనే వారంద ఱాకత్తులను దీసి పోరాడసాగిరి. కాని యుద్ధకళానిపుణులయిన యవనవీరులతో స్త్రీ లెట్లు దీర్ఘ కాలము పోట్లాడఁ గలరు? రాణిగా రీసంగతి తెలిసియే శత్రువులతోఁ దనవల్లనైనంత పోరాడుచు యుద్ధముఁ జూడ నచ్చట మూఁకలుగట్టి నిలుచున్న ప్రజలవంకఁ జూచి యిట్లనియె : _

              క. హిందువు లెవ్వరు లేరా
                  యిందు స్వధర్మాభిమాన మెఱిఁగినవారల్
                  హిందూభగినీజనులకుఁ
                  గుందక సాయంబుఁ జేయఁ గోరుమహాత్ముల్.

              గీ. ఇట్టివారలు గల రేని యాక్షణంబె
                  వచ్చి సాయంబు చేయుఁడు వనితలకును
                  రాకపోయిన శపథంబు మీకుఁ గలదు
                  మమ్మురక్షించు సర్వభారమ్ముమీది.

ఇట్లత్యంతమర్మ భేదకము లగువాక్యములు రాణిగారి వాక్కునుండి రాఁగా విని, అభయచందు నిర్భయచందులను బిరుదులు గల యన్నదమ్ము లిద్దఱును కొంతసేనతోడ వచ్చి తురుష్కులపై శరపరంపరల నిగుడింపసాగిరి. 'హరహరమహదేవ[1]' యనుశబ్దము చేయుచు శత్రువుల శిర:కమలములు మహా దేవున కర్పింపసాగిరి. ఇట్లు వారు శత్రుసేనలతోడఁ బోరుచు, రాణిగారిని సమీపించిరి. రాణిగారును, పరిచారికలును శత్రువులతో బెనఁగుచు నాత్మసంరక్షణము చేసికొనుచుండిరి. హిందూ సైనికులు తమకు సహాయులగుటఁ గని యాశూర స్త్రీల ధైర్యము రెట్టింపఁ దమమహాద్భుతశౌర్యముచే విద్యుల్లతలవలె మెఱవసాగిరి. రాణిగారిని మధ్యనుంచుకొని, చుట్టును సంరక్షకులను నియమించి యాస్త్రీపురుష మిశ్రమమైనస్వల్ప హిందూ సేన శత్రుసైన్యమునుండి మెల్లమెల్లఁగా త్రోవ చేసికొని ముందు నడువసాగెను. కాని ప్రతియడుగునకును హిందూ వీరుల సైనికులు శత్రువులచేహతు లగుచుండిరి. ఇట్లత్యంతశ్రమతో వారు కొంచెముదూరము నడుచునప్పటి కాసంగతి రాజునకుఁ దెలిసి రాణి సహాయార్థ మొకగొప్ప సైన్యమువచ్చెను. అందువలన రాణిగారి కేమాత్రమును భయము లేక యామె రాజమందిరము ప్రవేశించెను. నిర్భయచందు యుద్ధములో మడిసెను. అభయచందు శౌర్యధైర్యములకు రా జత్యంతానందపరవశుఁడయి తనకూఁతు నాయన కిచ్చి వివాహము చేసెను. కాని అయోధ్య నవాబుస్థితి యత్యంత శోచనీయ మయ్యెను. ఆయనపై వెంటనే గౌతమరాజు సేన నంపుటవలన భీతిచే నచటికిఁ దానుతెచ్చిన యుద్ధసామగ్రినంతయు నచటనే

======================================[మార్చు]

తురకలు దీన్ దీననుచు యుద్ధమునకు వెడలు నటులే రజపూతులును మహా రాష్ట్రులును హర హర మహా దేవ యను శబ్ధమును నుచ్చరించుచు సంగ్రామమునకు వెడలెడి వారు అని తెలియునది. వదలి యతఁడు అయోధ్యకుఁ బాఱిపోయెను. స్త్రీల నన్యాయముగాఁ జెఱఁ బెట్ట యత్నించినవాఁడని ప్రజలాతని నిందింప సాగిరి. ఆనవాబునుగుఱించి యొకకవి యిట్లువ్రాసియున్నాడు : _

                గీ. స్త్రీలఁ జెఱఁబెట్ట యత్నంబుఁ జేసినట్టి
                    శూరవరుఁ డని లోకులు దూర నతఁడు
                    వృద్ధుఁడయి చాల ప్రాణముల్ విడుచువఱకు
                    నమిత మైనట్టి దుష్కీర్తి ననుభవించె.

  1. తురకలు దీన్ దీననుచు యుద్ధమునకు వెడలు నటులనే రజపూతులును మహారాష్ట్రులును హరహరమహాదేవ యనుశబ్దమును నుచ్చరించుచు సంగ్రామమునకు వెడలెడివారు అని తెలియుచున్నది.