అబలా సచ్చరిత్ర రత్నమాల, ద్వితీయ సంపుటము/ఉమాబాయి దాభాడే
ఉమాబాయి దాభాడే.
ఈయుమాబాయి మహారాష్ట్ర రాజ్యసంస్థాపకుండగు ఛత్రపతి శివాజీగారి మనుమఁడగు శాహురాజు కాలమునం దుండినట్టు తెలియవచ్చుచున్నది. ఉమాబాయి మామగారగు ఏసుపాటిల్ దాభేడేయను నాతడు శివాజీగారివద్ద నొక భృత్యుఁడుగా నుండెను. కాని శివాజీ రెండవకుమారుఁడయిన రాజారాముగారి పరిపాలనదినములలో నాతఁడును అతనిపుత్రు లిరువురును స్వహితము నెంచక స్వామికార్యము నిర్వహించినందు వలన నాటినుండియు రాజు మెచ్చి వారికి సేనానిత్వ మొసంగెను. ఈయేసుపాటిలు పెద్దకుమారుని పేరు ఖండోజీ. ఖండోజీగారి భార్య పేరు ఉమాబాయి.
శాహుమహారాజుగారు ఢిల్లీనుండి స్వరాజ్యమునకు వచ్చిన వెనుక మరల మహారాష్ట్రులరాజ్య మించుక యున్న తావస్థఁ బొంద నారంబించెను. ఇట్టిసమయమునందు ఖండేరావు దాభాడే తన శౌర్యమువలన ననేక సంగ్రామములలో జయము సంపాదించి మిగుల నుతికెక్కెను. బాలాజీ విశ్వనాధపేష్వాగారును, ఖండేరావును ప్రాణస్నేహితులుగానుండిరి. కాని వారిరువురి యనంతరమునందు వారియుద్యోగముల కర్హులై వారిపుత్రులైన ప్రథమబాజీరావు పేష్వాగారికిని త్రియంబకరావు సేనాపతికిని తండ్రుల నాటిస్నేహభావము లేక వైరముప్రాప్తించెను! బాజీరావు ఉత్తరహిందూస్థానమును దాభాడే ఘూర్జరదేశము నపహరింపఁ దలఁచిరి. అప్పు డాయిరువు రొకరిపై నొక రనేక కారణముల నారోపించి యుద్ధసన్నద్ధులైరి. ఆయుద్ధమునందు దాభాడే తన యసమానశౌర్యముఁ గనుపఱుప నాతని గెలుచుట దుస్తరమని తలఁచి బాజీరావు మిగుల నన్యాయముగా నాశౌర్యనిధిని సంగ్రామంబునం గూలనేసెను. ఈసంగతి త్రియంబక రావు తమ్ముఁడగు యశవంతరావు దాభాడేకుఁ దెలియఁగా నాతఁ డధికరోషా యత్తచిత్తుఁడయి బాజీరావు నంత మొందింపక యన్నగారిక్రియలు జరుపనని ప్రతినపట్టెను. అందుకు ఉమాబాయియు సమ్మతించి తానును యుద్ధమునకు వచ్చెదనని చెప్పెను. ఆవార్తవిని బాజీరావు మిగుల దైన్యము బొంది శాహును మధ్యస్థునిగరమ్మని వేఁడుకొనెను. అప్పుడుశాహు మహారాజాతనిం దనవెంటఁగొని తళేగామను గ్రామమునందు ఉమాబాయినిం గని బాజీరావు నాయమపాదములపైఁ బడవేసి "ఖండేరావు దాభాడేగారును, బాలాజీ విశ్వనాధరావును అన్నదమ్ములవలె నుండిరి. కాన నీకీబాజీరావును పుత్రసమానుఁడు. కాన నీతని యపరాధము మన్నించి రక్షింపుము." అని రాజ డుగఁగా నుమాబాయి తనమనముననుండిన వైరముఁ బాఱదోలి శరణాగతునకభయ మొసఁగెను.
తదనంతరమునందు మఱికొన్ని దినముల కీమె పుత్రుల నిద్దఱిని శాహుమహారాజుగారు అహమదాబాదు ఠాణాగెలుచుటకు వెళ్ళుఁడని యాజ్ఞాపించెను. పుత్రులు బాలురనియు వారిరివు రీకార్యమును నిర్వహింపఁ జాలరనియు నెఱిఁగినదై ఉమాబాయి వారితోఁ దానును ప్రయాణమయ్యెను. ఆమె వీరపత్నియు, వీరమాతయు నగుటవలన నామెకు యుద్ధమనిన నింటి పనివలె సాధారణమై యుండెను. ఇంతలో ఉమాబాయి యిరు వురుపుత్రులతోడఁదనను గెలువవచ్చుచున్న దనినవార్త అహమదాబాదఠాణేదారుఁడగు జోరావరఖాన్ బాబీయను నాతఁడు విని ఉమాబాయి కిట్లు వర్తమాన మంపెను. "నీవు అనాధవు; స్త్రీవి; నీపిల్ల లిరువురును అల్పవయస్కులు; గాన నీవు సైన్యసహితముగాఁ దిరిగి వెళ్లుటమంచిది. లేకున్న మేము మాతురకలప్రతాపముఁ జూపకమానము." ఈవార్తగల యుత్తరమును గని యుమాబాయియొక్క శౌర్యాగ్నిమరింత ప్రజ్వరిల్లెను. అంత నామె యీమ్లేచ్ఛుని గర్వమడఁచిననేగాని నేను భోజనము సేయను; అని ప్రతినపట్టి తనయొద్ది సరదార్ల నందఱిని బిలిపించి యొకసభచేసెను. సభ కందఱును వచ్చుటకుఁ బూర్వమే యామె పసపు, కుంకుము, గాజులును తెప్పించి సభామధ్యంబున నుంచెను. సభికు లందఱు వచ్చినపిదప నామెజోరావరఖాన్ బాబీ వ్రాసినయుత్తరము వారికి వినిపించి యిట్లు వక్కాణించెను. "ఇందుపైని అహమదాబాదు కిల్లాను జయించి యచటనే భోజనము చేయుదునని నిశ్చయించితిని. మీరందఱును నేటివఱకు నా యన్నము దినుచుండినవారలు; గాన నాప్ర్తినయందు నాదరమును అభిమానమును గలవారేని మరణమునకు భీతిల్లవలదు. తత్క్షణమే మీతల నఱచేత నుంచుకొని నాతో యుద్ధభూమికిఁ జనుదెంచి మ్లేచ్ఛులతోఁ బోరాడుటకు సన్నద్ధులగుఁడు. లేక ప్రాణ భయముచే భీతిల్లెదరేని ఇచటనున్న పసపు, కుంకుమ పెట్టుకొని చేతికి గాజులు తొడుగుకొని మీమీగృహముల కరిగి బ్రతుకుఁడు." ఇట్టివాక్యములు వినినపిదప యుద్ధమునకు జంకువాడాసభ యం దొకఁడును కానరాఁడయ్యెను. కాన వారంద ఱాక్షణముననే యుద్ధసన్నద్ధులై పగఱపై దండువెడలిరి. అప్పుడు ఉమాబాయియుఁ దనయంబారీచుట్టును చిక్కు తెరలు కట్టించుకొని యాయుధహస్తయై గజారోహణముఁ జేసెను. ఆమెపుత్రు లిరువురును తల్లిపార్శ్వములఁ గూర్చుండిరి. ఈప్రకారము ఉమాబాయి సైన్యసహితముగా సంగ్రామరంగము నలంకరించెను. చూచితిరా యీమెధైర్యము! ఇదేకదా నిజమైనసాహసము.
ఇట్లు పరాక్రమవంతురాలగు ఉమాబాయి ఢిల్లీపతి సేవకుఁడగు జోరవరఖాన్ అను యోధుని నోడించుటకు సిద్ధముగా నున్న సమయమునందు వాఁడును పదివేలసైనికులతో నామె నెదిరించను. అంత నాయుభయసేన లొండొంటిందాకి పోరఁ దొడంగెను. ఇట్లు కొంతవడి సంగ్రామంబు జరిగినపిదప ఉమాబాయి సంగ్రామచాతుర్యము వలన తురకలకు నపజయము కలిగెను. అంత వాఁడు నగరునకుఁ బాఱి నగరద్వారములను మూసికొనెను. యుద్ధము అహమదాబాదుపొలిమేర నే జరుగుచుండినందున, నుమాబాయి సైనికులు వెంటనే పీనుఁగుమీఁద పీనుగును పేర్చి ప్రహరి నెక్కి అహమదాబాదులోనికిఁబ్రవేశించిరి. సత్య ప్రతిజ్ఞయగు నుమాబాయియు అహమదాబాదు కిల్లాలోనాఁడు భోజనము చేసెను.