Jump to content

అబద్ధాల వేట - నిజాల బాట/మెస్మరిజం - అసలు వాస్తవాలు

వికీసోర్స్ నుండి

కనుకట్టు - సమ్మోహనం గుట్టు

మెస్మరిజం - అసలు వాస్తవాలు

మెస్మరిజం అనే మాట బహుళ ప్రచారం పొందింది. మన సినిమాలలో, వైద్యంలో, వూళ్ళల్లో, ఎన్నో నోళ్ళల్లో మెస్మరిజం అనేమాట వింటుంటాం. అయినా మెస్మరిజం లోతుపాతులు చాలామంది తెలుచుకోకుండానే యీ మాట ప్రభావానికి లోనుగావడం మన అలవాట్ల బానిసత్వాన్ని సూచిస్తుంది. కనుక నిజానిజాలు విడమరచి చూద్దాం.

ఫ్రాంజ్ ఏంటన్ మెస్మర్(1733-1815) ఆస్ట్రియా దేశవాసి. కాన్ స్టన్స్ సరస్సు ఒడ్డున చిన్న ఆస్ట్రియా నగరం - 1733 మే 23న ఇజ్నార్ లో పుట్టాడు. వైద్యం అభ్యసించక ముందు దైవశాస్త్రం చదివాడు. 1766 నాటికి వైద్యంలో కూడా డాక్టరేట్ పుచ్చుకున్నాడు. గ్రహాలు మానవుడిపై ఎలా ప్రభావం చూపుతాయనే విషయమై సిద్ధాంతం వ్రాసి డిగ్రీ స్వీకరించాడు. 1768లో మెస్మర్ ఒక భాగ్యశాలి అయిన విధవను వివాహమాడాడు. సాంస్కృతిక జీవనంలో కళలు ఆస్వాదించి, అనుభవిస్తూ జీవితం గడిపాడు. అయినా విలాసాలతో వృధా చేయక, జ్ఞానార్జనకు కృషిచేశాడు.

ఆనాడు యూరప్ లో కొత్తగా బహుళ ప్రచారం పొందుతున్న అయస్కాంతంలో చికిత్సపట్ల మెస్మర్ ఆకర్షితుడయ్యాడు. మరియా తెరిసా కొలువులో జ్యోతిష్యుడుగా మాక్సి మిలియన్ హెల్ అనే జెసూట్ ఫాదరీ అయస్కాంతంలో వైద్యం చేస్తుండేవాడు. ఇది 1774 నాటిమాట. మొదట్లో నీటితో వైద్యం చేస్తుండే ఫాదరీ, క్రమేణా అయస్కాంత రాళ్ళు వాడాడు. ఒక సాంకేతిక నిపుణుడి సాయంతో భిన్న ఆకారాలు గల అయస్కాంత రాళ్ళు వాడాడు. ఒక సాంకేతిక నిపుణుడి సాయంతో భిన్న ఆకారాలు గల ఆయస్కాంత రాళ్ళు అతడు తయారుచేస్తుండేవాడు. రోగి శరీరంలో రుగ్మత వున్నచోట యీ అయస్కాంతరాళ్ళు పెట్టేవాడు. వియన్నా వైద్యసంఘం యీ విషయమై అతడిని పట్టించుకోలేదు. 1774 వేసవిలో వియన్నాకు వచ్చిన విదేశస్తుడు తన భార్యకు అయస్కాంత వైద్యచికిత్స చేయమని కోరాడు. హెల్ నుండి ఇదంతా మెస్మర్ నేర్చాడు. మానసిక చికిత్స కూడా హెల్ ముందుగా మెస్మర్ కు చెప్పాడు. సంసపన్న స్త్రీకి తాను ఎలా చికిత్స చేస్తున్నదీ హెల్ ఎప్పటికప్పుడు మెస్మర్ కు తెలియజేసేవాడు. కొన్నాళ్ళకు ఆ స్త్రీకి నయమైనట్లు మెస్మర్ స్వయంగా తెలుసుకొని అయస్కాంతచికిత్స పట్ల ఆకర్షితుడయ్యాడు.

1774-1776 అయస్కాంత చికిత్సలు చేసిన మెస్మర్, విశ్వవ్యాప్తంగా ద్రవపదార్ధం వుంటుందని నమ్మాడు. అదే అయస్కాంత ప్రభావానికి మూలం అనుకున్నాడు. అయస్కాంతం కేవలం కొన్ని అంగుళాల మేరకే ప్రభావం చూపుతుందని మెస్మర్ కు తెలుసు. కనుక అయస్కాంతంలో దాగివున్న శక్తులు వున్నాయని,అవే రోగాన్ని నయం చేస్తున్నాయని విశ్వసించాడు. రోగం వున్నదని భ్రమించి వచ్చే రోగులపై మెస్మర్ చికిత్స బాగా పనిచేసింది. అయస్కాంత రాళ్ళు సర్వాంతర్యామి శక్తిలో భాగం అని మెస్మర్ నమ్మిన తరువాత, నీటిని ఆ రాళ్ళతో అయాస్కాంతీకరణ గావించి రోగులచేత తాగించేవాడు. పింగాణి కప్పులు, పళ్ళాలు, బట్టలు, పరుపులు, అద్దాలు అయస్కాంతీకరణ చేసేవాడు. విద్యుత్ వలె అయస్కాంత ద్రవం కూడా అట్టిపెట్టి, ఇతర వస్తువులకు అందించవచ్చని మెస్మర్ భావన. పెద్ద తొట్లు తయారుచేసి అందులో రెండు వరసల సీసాలు అమర్చి, వాటి మూతలకు బెజ్జాలు పెట్టి, వాటి నుండి ఇనుపచువ్వలు పైకి వచ్చేటట్లు చేసి, రోగులను ఆ ఇనుపచువ్వలను తాకమనేవాడు. సామూహికంగా రోగులు తొట్టిలో కూర్చొని యీ చికిత్స పొందేవారు. ఒకరి చేతులు మరొకరు పట్టుకొని కూర్చుంటే అయస్కాంతం ఒకరి నుండి మరొకరికి ప్రాకుతుందని మెస్మర్ నమ్మించాడు.

మెస్మర్ పలుకుబడి, కీర్తి ఆనోటా ఆనోటా పడి బాగా వ్యాపించగా రానురాను అయస్కాంత రాళ్ళతో పనిలేదని, తన వ్యక్తిత్వ ప్రభావంతో చికిత్స చేయవచ్చని మెస్మర్ గ్రహించాడు. లోగడ ఎవరికైనా నయమైందంటే అది తన వ్యక్తి ఆకర్షణ ప్రభావం వల్లనేనని కూడా అతను గ్రహించాడు. తానే ఒక అయస్కాంతం అని మెస్మర్ ఊహించాడు. 1776 నుండి అయస్కాంత రాళ్ళకు తిలోదకాలిచ్చాడు. ఆ తరువాత తమ మాటల మూటలతోనే చికిత్సకు ఉపక్రమించి కొనసాగించాడు.

ఆనాటి శాస్త్రజ్ఞుడు మెస్మర్ చికిత్సను శాస్త్రీయం కాదని ఖండించారు. అయస్కాంత ప్రభావ పరిమితులు శాస్త్రజ్ఞులకు తెలుసు. కాని నయమైనదని చెప్పే రోగుల సాక్ష్యాలను మెస్మర్ వాడుకొని, తన చికిత్సను అలాగే చనిపోయేవరకూ చేశాడు. కనుకట్టు విద్యగా అది ప్రచారంలోకి వచ్చింది.

అయస్కాంత ప్రభావం శరీరంలోని అన్ని భాగాలలో వ్యాపింవి ఉంటుందనీ, నరాలపై దీని ప్రభావం పడుతుందనీ 1775లో మెస్మర్ ఒక వైద్యుడికి రాశాడు. పశువుల అయస్కాంతం కూడా వున్నదని మెస్మర్ నమ్మాడు. మూర్చలు, ఉదాశీనత, మంకు మొదలైన లక్షణాలు నయంచేసే అయస్కాంత పరిశోధనలు చేస్తున్నట్లు మెస్మర్ పేర్కొన్నాడు. సూచన (Suggestion) అనేది వైద్యంలో భాగంగా మారిందన్నమాట. నిజమైన శారీరిక రుగ్మతలు వుంటే మెస్మర్ చికిత్సకు స్వీకరించేవాడు కాదు. తనకేవో జబ్బు లక్షణాలున్నాయని భ్రమించేవారినే మెస్మర్ తీసుకునేవాడు. నరాల జబ్బున్న వారినే తాను చికిత్సను చేర్చుకుంటానని మెస్మర్ స్పష్టం చేశాడు. అక్కడే అతడి కిటుకు పనిచేసింది. ఇదే మెస్మరిజంలో ఆకర్షణ. శరీరాన్ని బాధిస్తూ పైకి కనిపించే రోగలక్షణాలు అయస్కాంత చికిత్సకు పనికి రావన్నాడు. మాటలు, ఉపమానాలు సూచనలుగా పనిచేస్తాయని, అవి నరాల జబ్బున్న మానసిక రోగులకే పరిమితం అని మెస్మర్ వాదన!

హస్తలాఘవం, కనికట్టు, మాటల ఉపమానాలు అనేవి మెస్మర్ ప్రయోగించిన ఆయుధాలన్నమాట. రోగంతో బాధ వున్నట్లు చెప్పే శారీరిక బాగాల్ని మెస్మర్ తాకి నిమిరేవాడు. ఆ విధం నయమైతే అది వైద్యమే ననేవాడు. అదే చేతి చలవ (అయస్కాంత ప్రభావం) అనేవాడు. తన అబద్ధాలను తానే నమ్మడం, ప్రచారం చేయడం, రోగుల్ని నమ్మించడం మెస్మర్ పనిగా కొనసాగించాడు. ఖనిజ సంబంధమైన అయస్కాంతం రోగిని నయం చేస్తుందనకుండా, అయస్కాంత ప్రభావం వేరే వుందని మెస్మర్ అనేవాడు. మనుషుల్లో మార్మికంగా అయస్కాంతశక్తి గర్భితమై వుందన్నాడు.

ఆనాటి శాస్త్రజ్ఞులు మెస్మర్ ను తీవ్రంగా ఖండించారు. పశు అయస్కాంతం అనే పేరిట మెస్మర్ ప్రచారంలో పెట్టిన భావనకు ఆధారాలేవీ లేవన్నారు. అయస్కాంత రాళ్ళకు బదులు, అయస్కాంత ప్రభావం గల చేతిస్పర్శ మెస్మర్ ఆకర్షణగా ప్రచారంలోకి వచ్చింది.

నమ్మకంతో నయం అవుతుందనే వారికి మాటల ఆకర్షణ ప్రధాన లక్షణం. మెస్మర్ ఆనాడు ప్రయోగించింది అదే, మతపరంగా చేస్తున్నవారి ఆయుధమూ అదే. హోమియోవారు నేడుచేస్తున్నదీ ఇదే. కొంతవరకు ఆ నమ్మకం చికిత్సకారుల విచిత్ర వేషధారణ కూడా పనిచేస్తుంది. వారు వాడే కొన్ని వింత పరికరాలు కూడా దోహదం చేస్తాయి. నమ్మకం, భయం రోగిలో వుండగా అవే వైద్యుడికి అక్కరకు వస్తాయి. ప్రాలిన్ పేరడిస్ అనే బాలిక 1763 డిసెంబరు 9 ఉదయం హఠాత్తుగా తన చూపు పోయిందని తెలుసుకున్నది. ఆ బాలిక వయస్సు 4 ఏళ్ళు. కంటి నరం పక్షవాతంతో వున్నందున యిది నయం కాదని వైద్యులు చెప్పారు. తల్లిదండ్రుల సంప్రదాయంగా ఆ బాలికకు పియానో వాయించడం అలవాటైంది. రాణి కొలువులో ఆమె తల్లిదండ్రులు పనిచేసేవారు. ఆ బాలిక ప్రతిభ రాణిని ఆకర్షించింది. 10 ఏళ్ళపాటు వియన్నాలో అత్యుత్తమ కంటివైద్యుడు చికిత్స చేసినా చూపు రాలేదు. ఈలోగా పియానోపై తన ప్రతిభను చూపుతున్న పేరడిస్ (మరియాతెరిసా అని కూడా పిలిచేవారు)లండన్, ప్యారిస్ మొదలైన చోట్ల కచేరీలు చేసి, గుడ్డి అమ్మాయి అద్భుతంగా పియానో వాయించడం పట్ల అందర్నీ ఆకట్టుకున్నది. కంటివైద్యుడు ఏంటన్ వాన్ స్టార్క్ 14 ఏళ్ళ ప్రాయంగల ఆ అమ్మాయి కంటి నరం చెడలేదని నిర్ణయించాడు. కాని అతడి చికిత్స పనిచేయలేదు. గుడ్డితనాన్ని నటనగా ఆమె వాడుకుంటుందన్నమాట. అది గిట్టుబాటు గుడ్డితనం.

అలాంటి దశలో మెస్మర్ తటస్తపడ్డాడు. శారీరకంగా కంటిజబ్బు వుంటే నయం కాదని, లేకుంటే చికిత్స చేయవచ్చనీ చెప్పాడు. 1776లో మెస్మర్ ఆమెకు చికిత్స ప్రారంభించాడు. 1777 నుండీ ఆమె మెస్మర్ చికిత్సాలయంలో వుండగా, కొద్దివారాలలోనే చూపు కొంతమేరకు వచ్చింది. తల్లిదండ్రులు సంతోషించారు. మొదటిసారి చూపు వచ్చినప్పుడు ఎదుట వున్న మెస్మర్ ను చూచి, ఎంత భయంకర దృశ్యం అని ఆమె వ్యాఖ్యానించింది. చూపు వచ్చిన తరువాత ఆమె మానసికంగా కృంగిపోయింది. బంధుమిత్రులను చూచినప్పుడు మూర్ఛ పోతుండేది. ఆమె హిస్టీరియా జబ్బుతో వుందని బయటపడింది. కావాలని గుడ్డితనం నటించిన ఫలితమిది.

వియన్నాలో జోసెఫ్ బార్త్ ఆధ్వర్యాన వైద్యబృందం పరిశీలించి మెస్మర్ ను తీవ్రంగా విమర్శించింది. ముందున్న వస్తువుల్ని మరియాతెరిసా పేరడీస్ యింకా గుర్తించలేకపోతున్నదని వారు వెల్లడించారు. అంతటితో మెస్మర్ ఉక్కిరిబిక్కిరి అయ్యాదు. ఆ అమ్మాయికి చూపు వచ్చివుంటే (మెస్మర్ చెబుతున్నట్లు) రాణి యిచ్చే డబ్బు ఆమె తల్లిదండ్రులకు యిక యివ్వనవసరం లేదన్నారు వైద్యులు. పియానో వాయించే కచేరీలలో ఆమె పట్ల ఆకర్షణ సగం పోవడం ఖాయమన్నారు. దీంతో ఆమె తల్లిదండ్రులు తమ కుమార్తెను తమకు అప్పగించమని మెస్మర్ ను కోరారు. మెస్మర్ కుంగిపోయాడు తన ప్రతిష్ఠ దెబ్బ తిన్నందుకు!

మెస్మర్ - రోగిగా వున్న మరియాతెరీసా ప్రేమికులుగా వున్నట్లు సమాజంలో ప్రాకిపోయింది. వియన్నాలో యీ విషయం దుమారం వలె అల్లుకపోయింది. ఈ ఫార్సుకు అంతం పలుకమని రాణి మెస్మర్ ను ఆదేశించింది. 1777 మే 2న మెస్మర్ ఆ ప్రేమికురాలిని తల్లిదండ్రులకు అప్పగించాడు. ఆమె వయస్సు 18 ఏళ్ళు.

తల్లిదండ్రుల వద్దకు చేరిన మరియా తెరీసాకు మళ్ళీ చూపులేదు. గుడ్డితనాన్ని ఆమె ఆనందించింది. అలాగే పియానో కచేరీలు చేసి కీర్తి ఆర్జించింది. మొజార్ట్ కూడా ఆమె కోసం ప్రత్యేకంగా సంగీతం సమకూర్చాడు. 1784లో పారిస్ లో అంధురాలుగా ఆమెను జనం పొగుడుతుంటే, అపఖ్యాతి పాలైన మెస్మర్ అక్కడే వున్నాడు!

1778లో వియన్నా నుండి పారిస్ వెళ్ళిపోయిన మెస్మర్ ఎకాడమీ ఆఫ్ సైన్సెస్ అధ్యక్షుడి వద్దకు చేరి తన మెస్మరిజాన్ని శాస్త్రీయంగా పరిశీలించమన్నాడు. అధ్యక్షుడు ఛార్లస్ లి రాయ్ యీ విషయం పరిశీలించడానికి మెస్మర్ ను రాసి యివ్వమన్నాడు. మెస్మర్ 27 ప్రతిపాదనలు రాశాడు. చికిత్స సంపూర్ణతకు తన విధానం పరాకాష్ఠ అని మెస్మర్ గొప్పలు చెప్పుకున్నాడు. తన వైద్యవిధానం ప్రచారం చేయడానికి ప్రభుత్వం నియమించిన మతసంస్థ కావాలన్నాడు. ప్రభుత్వం, మతంతో నిమిత్తం లేకుండా సైన్సు పరిశోధన జరుగుతున్న పునర్వికాస కాలంలో మెస్మర్ అలా కోరాడు.

1778లో మెస్మర్, విశ్వసమాజం అనే రహస్య సంస్థ పారిస్ లో స్థాపించి తన వైద్య ప్రచారానికి పూనుకున్నాడు. దీని శాఖలు ఫ్రాన్స్ లో ఏర్పడ్డాయి. మెస్మర్ కు ఆదాయం పెరిగింది. తాను కనుగొన్న పశు అయస్కాంతం తనకు తప్ప ఎవరికీ తెలియదని, దీనిని ఖండించే అధికారం ఎవరికీ లేదని ప్రచారం చేసుకున్నాడు. ఛార్లస్ ది ఎప్లాన్స్ , నికొలస్ బెర్ గస్ అనే యిరువురు శిష్యులు మెస్మర్ కు బాగా ప్రచారం చేసి పెట్టారు.

1784 మార్చి 12న లూయీ 16 ఒక విచారణ కమిషన్ మెస్మర్ గురించి నియమించారు. ఇది సైన్స్ అకాడమీ కోరికపై జరిగింది. మెస్మర్ శిష్యుడు ఛార్లస్ ఆస్పత్రిలో విచారణ సాగించారు. రసాయన శాస్త్రజ్ఞుడు ఏంటొని లవోసియర్,జీన్ సిల్వన్ బెయిలీ(ఖగోళ శాస్త్రజ్ఞుడు) జోసెఫ్ ఇగ్నాస్ గిలోటన్ (వైద్యుడు-గిలోటన్ ఉరి ఇతడిపేర వచ్చింది)బెంజమిన్ ఫ్రాంక్లిన్(అప్పట్లో అమెరికా రాయబారిగా ఫ్రాన్స్ లో వున్న సైంటిస్టు) కమిషన్ లో వున్నారు.

మెస్మర్ చికిత్సలో అయస్కాంత ప్రభావం ఏదీ లేదని కమిషన్ కనుగొన్నది. ఇదంతా తప్పుడు శాస్త్రంగా తేల్చారు. మెస్మర్ వైద్యంలో చికిత్సపొంది నయం అయిందన్నవారిలో చాలామంది శారీరక రోగులు కాదని కమిషన్ కనుగొన్నది. నిజంగా జబ్బున్న ఇద్దరు వ్యక్తులపై మెస్మర్ అయస్కాంత చికిత్స ప్రభావం ఏమీ లేదని గమనించారు. ఒకామె ఉబ్బసం రోగి. సెంట్ ఆర్మన్ అనే విధవ, మరొక యువతి ఆన్స్ం. ఆరేళ్ళ క్షయరోగి బాలిక కూడా ఎలాంటి నివారణ పొందలేదు.

మెస్మర్ శాస్త్రీయ పంథా తప్పుడుది అని కమిషన్ క్షుణ్ణంగా పేర్కొన్నది. మెస్మర్ చెప్పే ద్రవం లేదని కూడా చెప్పింది. 1784 ఆగస్టు 11న కమిషన్ తుది నివేదికలో మెస్మర్ ను ఖండించింది. మెస్మర్ పేర్కొన్న విశ్వద్రవ్య పదార్థ చర్య ఏదీ కనిపించలేదనీ, కొందరిలో వూహల కారణంగా శరీరంలో మూర్ఛలు వస్తున్నాయనీ చెప్పారు. ఊహలు రాకుండా అయస్కాంతం చేయగలిగిందేమీ లేదన్నారు. అయస్కాంతం శూన్యం. ఊహే అతిముఖ్యం అన్నారు. అంటే మెస్మర్ చికిత్స మానసిక సంబంధమే తప్ప,శరీరానికి వస్తే అతడేమీ చేయజాలడన్న మాట. పశు అయస్కాంతం అనేది సందేహాస్పదం అని బెంజమిన్ ఫ్రాంక్లిన్ పేర్కొన్నారు. ఇలాంటి వాటి ఆధారంతో చికిత్స చేయబూనడం భ్రమే అన్నాడు. ఈ విధంగా కమిషన్ నివేదిక మెస్మర్ కు వ్యతిరేకంగా వచ్చింది. 1785లో ఆయన కుడిభుజం వంటివారు కూడా మెస్మర్ కు ఎదురు తిరిగారు. అయస్కాంత చికిత్స గురించి ఆయన అనుచరుడు బెర్గాసే ఉపన్యాసం యివ్వడాన్ని మెస్మర్ ఖండించాడు. రహస్యం బట్టబయలు చేసినట్లు భావించాడు. త్వరలోనే మెస్మర్ పారిస్ కు స్వస్తి పలకవలసి వచ్చింది.

1799లో మెస్మర్ (అది 1957లో ఇంగ్లీషులో జెరోం ఈడెన్ అనువదించారు) మానసిక రుగ్మతకు భౌతిక ఆధారం (అయస్కాంతం) కనుగొన్నవాడిగా తనకు గుర్తింపు రావాలని ఆకాంక్షించాడు. ప్రకృతి శాస్త్రంలో కొత్త సూత్రాలు కనుగొన్నట్లు మెస్మర్ భావించినా,అది రుజువు కాలేదు. మనుషులకు, జంతువులకు అయస్కాంత ద్రవ్యం వుందని మెస్మర్ వూహించాడు. ఇది ఇతరులు చూడలేదని, తనకు మాత్రమే తెలిసిన దేవతావస్త్రాలుగా మెస్మర్ పేర్కొన్నాడు! ఈ విశ్వద్రవ్యం మెస్మర్ దృష్టిలో సర్వరోగనివారిణి. మెస్మర్ సృష్టించుకున్న కల్పనాలోకం నిజమని నమ్మాడు. భక్తితో రోగాలు కుదురుతాయనే వారికీ మెస్మర్ కూ తేడా లేదు. అయితే శరీరానికి వచ్చిన రోగాలు మెస్మర్ చికిత్స వలన నయం కాలేదు. రోగాలన్నీ నయం చేయవచ్చుగాని రోగుల్ని కాదని మెస్మర్ చెప్పాడు! రోగలక్షణాలు శరీరానికి లేనప్పుడు అవి మానసిక చికిత్సలో ప్రధాన భాగాలుగా చెప్పారు. ఇలా మానసిక రోగాలు కుదుర్చుతామనే మెస్మర్ వంటివారే నేటి చికిత్సకు ఆధారమయ్యారు. నయం కావడం, కాకపోవడం ఆయా వైద్యుల మాటల ప్రతిభ, నాటకీయత, రోగుల మనోలక్షణాల బట్టి వుంటుందన్న మాట! ఇదీ మెస్మర్ కధ.

కనుకట్టు విద్యగా నేటికీ యిది ప్రచారంలో వుంది!

- హేతువాది, నవంబరు 1991