అబద్ధాల వేట - నిజాల బాట/హిస్టీరియా - చార్‌కాట్ పాత్ర

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

గౌరవం పొందిన దొంగజబ్బు

హిస్టీరియా - చార్‌కాట్ పాత్ర

హిస్టీరియాకు వైద్యస్థాయిని సమకూర్చిన చార్‌కాట్ (1825-1893)ను గురించి తెలుసుకొని తరువాత దాని పరిణామాన్ని చూద్దాం. వందేళ్ళ చరిత్ర వున్న హిస్టీరియా నేడు ఆధునిక మానసిక చికిత్సలోకి ప్రవేశించిన తీరు శాస్త్రీయమా అనేది ప్రశ్న. జబ్బుకూ-నటించే రోగానికి తేడా గమనించాలని హిస్టీరియా చరిత్ర సూచిస్తున్నది. హిస్టీరియా లక్షణాలలో మాటలు చెప్పకుండా సూచించే రీతులు ప్రధానం కాగా, జబ్బున్న మనుషుల లక్షణాలను అనుకరించడం, నిస్సహాయతను నటించడం మరో లక్షణం. ఇందులో కొంత మోసపూరిత ధోరణి, ఇతరులపై ఆధిపత్యాకాంక్ష, అదుపులో పెట్టడం కూడా హిస్టీరియా విశిష్టతలు హిస్టీరియాను జబ్బుల్లో చేర్చి,శారీరిక రుగ్మతల స్థాయికి సమానంగా చూడడం మరో ఆధునిక రీతిగా పెంపొందింది. ఇది 'కనిపెట్టిన' కల్పితరోగం. దీనికి ఆద్యుడు జీవ్ మార్టిన్ చార్ కాట్. ఇతడు నరాలజబ్బుల శాస్త్రజ్ఞుడు. ఆనాడు నరాల రోగాలకు చికిత్స లేదు. చార్ కాట్ కేవలం వైద్యుడే గాక,సార్ బోన్ యూనివర్శిటీలో ప్రొఫెసర్, సాల్ పెట్రిలో వైద్యుడు కూడా. ఇతడి చికిత్సలో వున్న రోగులు ఆస్పత్రిలో చేరడానికి-జబ్బు వున్నా లేకున్నా-పేదరికంలో మగ్గేవారు, సమాజానికి పనికిరానివారు, ఇతరులకు యిబ్బంది కలిగించేవారు వున్నారు. కుటుంబంలో తగిన శ్రద్ధ పొందలేనివారు, ఆస్పత్రిలో చేరితే సులభంగా వుంటుందనుకునేవారు వున్నారు. తక్కువ తరగతుల నుండి వీరు వచ్చారన్నమాట.

చార్ కాట్ గురించి ఫ్రాయిడ్ వ్యాఖ్యానిస్తూ అతడు ద్రష్ట అనీ, హఠాత్తుగా అతడికి విషయం గ్రహణంలోకి వస్తుండేదనీ అన్నారు. లక్షణాలుచూచి యిలాంటి నిర్ణయాలకు వచ్చేవాడు. ఇలా చూచి చూచి, ఒక నిర్ణయానికి వచ్చే ప్రత్యేక దృష్టి తనకున్నదని చార్ కాట్ గర్వించేవాడు. దీనిని నోసోగ్రఫీ అన్నారు. అంటే వ్యాధుల క్రమబద్ధ వివరణ అన్నమాట.

క్రైస్తవుల దేవుడు తొలుత తోటలో ఆదాంను వదిలేస్తే అతడు అన్నింటినీ వర్గీకరించి పేర్లు పెట్టాడని కథ. అలాగే తన వద్ద చేరిన రోగుల్ని రోజూ తిలకించి చార్ కాట్ పేరు పెట్టేవాడట. అమానుషమైన యీ వర్గీకరణ వైద్యంలో ప్రవేశపెట్టింది చార్ కాట్ కాగా, ఆధునిక మానసిక వైద్యం పేరిట దీనికి ఆమోదముద్ర వేశారు!

చార్ కాట్ తన రోగుల్ని యిలా నరాలజబ్బులవారిగా చెప్పడానికి లోగడ చనిపోయినవారి మెదడులు ఆయన పరిశీలించాడు. చార్ కాట్ కు నాటి ఫ్రెంచి సమాజంలో పలుకుబడి వుంది. ప్రధాని రాంబెట్టాకు సన్నిహితుడు, రష్యా డ్యూక్ నికొలస్ కు స్నేహితుడు. ఫ్రెంచి-రష్యా సంధిలో ఆయన పాత్ర వుంది. ఉన్నతవర్గాలలో మెలిగిన చార్ కాట్, పేదరోగుల్ని (జబ్బులేని మానసిక నరాల ఫిర్యాదులవారిని) ఎలా చూచేవాడో గమనించవచ్చు.

ఇంట్లో పని తప్పించుకోడానికి ముంతే అనే ఒక రైతు యువతి చార్ కాట్ ఆస్పత్రిలో చికిత్స పేరిట చేరింది. సాల్ పెట్రి ఆస్పత్రిలో ఆమెకు నిర్బంధచికిత్స జరుగుతున్నా ఇంటికన్నా అదే ఆమెకు నచ్చింది, ఇంటికి తిరిగి వెళ్ళమన్నా ఆమె అంగీకరించలేదు. హిస్టీరియా రోగిగా ఆస్పత్రిలో వుండడమే సుఖంగా వున్నదామెకు. నేటి పిచ్చాసుపత్రివలె నాడు చార్ కాట్ ఆస్పత్రి వున్నదన్నమాట. మతసంస్థలలో చేరిన అమ్మగార్లవలె ఎంత నిర్బధంవున్నా కనీసావసరాలు తీరేవి. డాక్టరుకు భయపడి, లొంగివుండటం వల్ల అన్నీ సక్రమంగా జరిగేవి. మతచార్యులు చెప్పినట్లు నడుచుకుంటే మఠాలలో, ఆశ్రమాలలో అలాగే వుంటుంది. స్వేచ్ఛ, వ్యక్తిత్వం, సొంత ఆలోచన చంపుకుంటే సరి.

హిస్టీరియా రోగులుగా వర్గీకరించినవారిని చార్ కాట్ పరిశీలిస్తుండేవాడు. వీరు నాటకం ఆడటంలేదని, అబద్ధం చెప్పడంలేదనీ చార్ కాట్ ఉద్దేశం. నరాలజబ్బు పేరిట హిస్టీరియా చికిత్సకు ఆనాడు ఏమాత్రం గౌరవం లేదు. హిస్టీరియా పేరిట ఏదైనా చేయొచ్చు. చార్ కాట్ తన పలుకుబడి ఉపయోగించి హిస్టీరియాకు గౌరవాన్ని ఆపాదించాడు. శారీరికంగా ఎలాంటి జబ్బులేని నరాల జబ్బుకు హిస్టీరియా అని నామకరణం చేశారన్నాం గదా.

ఫ్రాన్స్ లో గిలిటన్ బయలుదేరి ఉరి తీయడానికి సౌకర్యాలు పెంపొందించే పద్ధతులు చూపాడు. ఇది ఉరి తీసేవాడి నిమిత్తం చేసిన సంస్కరణ. అలాగే జబ్బు పేరిట నటించి, ఆస్పత్రిలో వుండడానికి చార్ కాట్ మార్గం సులువుచేశాడు. బాగుపరచి బయటకు పంపే ఉద్దేశం లేదు. హిస్టీరియా నేడు మానసిక చికిత్స గౌరవం పొందడానికి ఫ్రాయిడ్ మొదలు ఎందరో తోడ్పడ్డారు.

హిస్టీరియా రోగి వర్ణించే లక్షణాలకు, నిజంగా జబ్బుచేసిన శారీరకరుగ్మతులు కొన్నిసందర్భాలలో పోలిక చూపవచ్చు. ఇది హిస్టీరియా రోగి వర్ణించే తీరులోనే వుంది. వైద్యుడు యీ తేడా గమనిస్తే హిస్టీరియా గుట్టు రట్టవుతుంది. కాని వైద్యుడికి అది గిట్టుబాటు కాదు. కనుక వైద్యపరిశోధకుడే యీ పనిచేయాలి. చార్ కాట్ తన రోగులకు తానొక సేవకుడుగా భావించలేదు. వారి లక్షణాలను వర్గీకరించడమే ప్రధాన కర్తవ్యంగా పెట్టుకున్నాడు. పెత్తందారీతనంతో దబాయింపు విధానాన్ని అవలంబించిన చార్ కాట్, శాస్త్రీయ పరిశోధనకు పూనుకోలేదు. హిస్టీరియా, హిప్నాసిస్ అనేవి పరిశోధనాంశాలైతే, చార్ కాట్ చెప్పాడు గనుక అవే ప్రమాణాలు అని అనరు. నిత్య పరిశోధనలో రుజువుకు నిలబడ్డాయా లేదా అని చూస్తారు. హానిమన్ చెప్పాడు గనుక, హోమియో సరైనది అన్నట్లే, వేదాల్లోవుంది గనుక తిరుగులేదన్నట్లే, చార్ కాట్ విషయంలోనూ ప్రవర్తించారు.

హిస్టీరియా నరాలజబ్బుగా చిత్రించి ప్రచారం చేయడంలో చార్ కాట్ తనను తాను వంచించుకుంటున్నట్లు, అబద్ధాన్ని ఒక కళగా ప్రచారం చెస్తున్నట్లు గ్రహించకపోలేదు. సమాజంలో తన స్థానాన్ని నిలబెట్టుకోడానికి చార్ కాట్ తన ప్రచారాన్ని కొనసాగించవలసి వచ్చింది. శారీరిక రసాయనిక లక్షణాలు వైద్యరంగానికి చెందినవి. కాని వాటిలో నిర్ధారణ కావాలి. మానసిక, సామాజిక లక్షణాలకు చక్కని మాటలు పనిచేస్తాయి. కనుక మరో చికిత్స పేరిట రుజువుకు నిలబడని రీతుల్ని చార్ కాట్ మొదలు నేటివరకూ అవలంబిస్తున్నారు.

హిస్టీరియా రోగులు, ముఖ్యంగా స్త్రీలు, ఎలా అబద్దాలు చెప్పి మోసం చేసి నటిస్తారో చార్ కాట్ పేర్కొన్నాడు. వైద్యులకు నచ్చచెప్పడంలో వారు తమ చాకచక్యమంతా ప్రయోగిస్తారన్నారు. హిస్టీరియా దొంగజబ్బు అని చార్ కాట్ కు బాగా తెలుసునన్నమాట. చార్ కాట్ తన కాలంలో రోగుల వంచన తెలిసే ఒప్పుకున్నాడు. అది అతడికి ప్రతిష్ఠను, కీర్తిని, పలుకుబడిని తెచ్చిపెట్టింది. అదే విధానం మరో రూపంలో మానసికవైద్యులు కొనసాగిస్తున్నారు. చార్ కాట్ తన పరిశీలనలు ఏనాడూ తిరిగి చూచుకోలేదు. ఏ రోగినీ హిప్నటైజ్ చేసి పరిశీలించలేదు. కనుక తాను రోగుల్ని గురించి చెప్పేవాటి మంచిచెడులు పరిశోధనకు గురిచేసిన తీరేలేదు. ఇంకా విశేషం ఏమంటే, చార్ కాట్ శిష్యులు రోగుల్ని హిస్టీరియా లక్షణాలతో నటించమని శిక్షణ యిచ్చిన ఉదాహరణలున్నాయి! చార్ కాట్ మరణానంతరం యీ విషయాలు కొన్ని బయటపడ్డాయి. చార్ కాట్ శిష్యులు ఎవరూ, గురువుకు భయపడి కాబోలు, రోగుల్ని గురించి నిజం చెప్పలేదు. చార్ కాట్ నియంతృత్వ మనస్తత్వం కూడా యిందుకు కారణం కావచ్చు.

హిస్టీరియా గురించి చార్ కాట్ దృష్టి ఏమంటే, రోగి తన లక్షణాలను మానవ సంబంధాలుగా చూపుతున్నాడనే, అయితే ఆ మాట బయటకు ఎందుకు చెప్పలేదంటే, ప్రజలలో హిస్టీరియా పట్ల వున్న భావన అట్టిపెట్టడానికే. సమాజంలో తన ప్రయోజనాల కోసం,నిజం కప్పిపుచ్చి, వైద్యం అనే గౌరవాన్ని హిస్టీరియాకు తెచ్చిపెట్టిన అపఖ్యాతి చార్ కాట్ కు దక్కాలి. చార్ కాట్ కారణంగా ఫ్రెంచి సైన్స్ అకాడమీ హిస్టీరియాను స్వీకరించింది. 1882 ఫిబ్రవరి 13న అకాడమీకి చార్ కాట్ తన భావాలు తెలియపరచాడు. అప్పటికీ పశు అయస్కాంతం గురించి అకాడమీ ఖండించింది. అందువలన హిస్టీరియాకు అయస్కాంతశక్తితో ఎలాంటి సంబంధం లేదని చార్ కాట్ ప్రకటించాడు. కాని, చార్ కాట్ చెప్పే హిస్టీరియా, హిప్నాటిజాన్ని అకాడమీ పరీక్షకు గురిచేయాలి కదా. మెస్మర్ అయస్కాంతాన్ని అలాచేసి ఖండించారు గదా. అలా చేయలేకపోవడం చార్ కాట్ పలుకుబడికి నిదర్శనం కావచ్చుగాని, అకాడమీ శాస్త్రీయ ప్రతిష్ఠకు కాదు. హోమియోపతిలో పలుకుబడి పనిచేసి, శాస్త్రీయ పరిశీలన పక్కకు నెట్టినట్లే, హిస్టీరియాలోనూ జరిగింది!

ఆధునిక వైద్యంలో హిస్టీరియా

భయంతో కూడిన హిస్టీరియాలో ఎందుకు ఆందోళన చెందుతున్నదీ వ్యక్తికి తెలియదని ఫెనికెల్ (Fenichel) సిద్ధాంతీకరించాడు. ఒంటరిగా వదలి వెడుతుంటే చిన్నపిల్లలు భయపడతారే, అలాంటిదే ఆందోళనాపూరిత హిస్టీరియా అంటే. పిల్లలలో యీ లక్షణాన్ని హిస్టీరియా అనం గదా.

మానసిక రుగ్మతలన్నీ మెదడుకు చెందినవేనని కార్ల్వెర్నిక్ అన్నాడు. కాని, మానసికం అంటే ఏమిటో నిర్ధారణ యింతవరకూ జరగలేదు. హిస్టీరియాలో కొన్ని సంజ్ఞలు దేహం ద్వారా వెల్లడౌతాయి. ఇందులో సంఘపరమైనవి కొన్ని వున్నాయి. కాని, జబ్బువలె సూచనలు వెల్లడించడం ఎందుకంటే, జనానికి మరో విధంగా వాటిని తెలిపే రీతులు అలవాటు కాలేదు గనుక!

ఫ్రాయిడ్ వియన్నా నుండి పారిస్ వెళ్ళి చార్ కాట్ వద్ద హిప్నాటిజం నేర్చి, హిస్టీరియా జబ్బేనని ప్రకటించేశాడు. అయితే రోగుల చరిత్ర తెలిసినప్పుడు, వారు రోగులు కాదని, రోగ సంబంధమైన బాధలుగాక, కుటుంబ సామాజిక బాధలే వున్నాయని ఫ్రాయిడ్ గ్రహించాడు. బంధువులను, భాగ్యాలను పోగొట్టుకున్న ఒక అమ్మాయి 18 మాసాలపాటు ఒంటరితనం అనుభవించడం ఫ్రాయిడ్ కు బాగా తెలుసు. అలాగే తరచు కాళ్ళనొప్పులని ఫిర్యాదుచేసిన మరొక ఆమెను కూడా హిస్టీరియారోగిగా ఫ్రాయిడ్ పేర్కొన్నాడు. ఆ రోగులకు శారీరిక జబ్బుల లక్షణాలు లేవు. తమ లక్షణాలను మరొక తీరుగా మార్చి చెప్పుకుంటారని ఫ్రాయిడ్ నమ్మాడు. లైంగిక సంబంధమైన అసంతృప్తిని శారీరిక బాధలుగా చూపడం ఒక తీరన్నమాట. మానసిక ప్రవర్తనను శారీరిక ప్రవర్తనగా మార్చి ఫ్రాయిడ్ చూపాడు. ఇందులో పరిశోధన ఏ మాత్రం చేయలేదు. 1895లో హిస్టీరియా గురించి ఫ్రాయిడ్ రాసిన నాటికి, ఇంకా సిఫిలిస్ కనుగొనడానికి వాసర్ మన్ పరీక్ష రాలేదు. అందుకని మనస్సు అనేమాట అడ్డం పెట్టుకొని ఫ్రాయిడ్ ప్రచారం చేశాడు. ఇలా సిద్ధాంతీకరించేవారికి ఆనాడు పేరుప్రతిష్ఠలు జనబాహుళ్యంలో త్వరగా వ్యాపించేవి. తెలిసీ తెలియని డాక్టర్లు వీటిని అనుకరించేవారు. ఫ్రాయిడ్ పై కోఎనాలసిన్ కు శాస్త్రీయాధారాలు లేవు. మానసికచికిత్స పేరిట వీరు ప్రచారంలోకి వచ్చారు. మనస్సు శరీరాన్ని ప్రభావితం చేస్తుందనే వీరి సిద్ధాంతంలో ప్రధాన లోపం ఏమంటే,మెదడును మనస్సుగా చిత్రించడం వీరు పేర్కొనే మానసిక లక్షణాలు పరిశోధన పరిధిలోకి రావు. మెదడు శరీరంలో భాగం. అది పరిశోధనలోకి వస్తుంది.

- హేతువాది, అక్టోబరు 1991