అబద్ధాల వేట - నిజాల బాట/ఫ్రాయిడ్‌లో నిజాలు - భ్రమలు

వికీసోర్స్ నుండి

ఫ్రాయిడ్ సృష్టించిన కొత్త మతం

ఫ్రాయిడ్‌లో నిజాలు - భ్రమలు

సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా వుంది. మార్క్స్ భావాలు ఎంతగా ఆకర్షించాయో, మానసికరంగంలో ఫ్రాయిడ్ యీ శతాబ్దంలో అంతగా ఆకర్షించాడనవచ్చు. విచిత్రమేమంటే అత్యధిక సంఖ్యాకులు మతాన్ని గుడ్డిగా అనుసరిస్తున్నట్లే, ప్రశ్నించకుండా నమ్ముతున్నట్లే. ఫ్రాయిడ్ ఎవరో, ఏం చెప్పాడో, ఏం చేశాడో తెలుసుకోకుండానే అనుసరిస్తున్నారు. ఈ లక్షణాలు చదువుకున్నవారిలో కనిపిస్తున్నందున మనం యింకా జాగ్రత్తగా పరిశీలించాలి.

అమెరికాలో సుప్రసిద్ధ సైకియాట్రిస్ట్, హ్యూమనిస్ట్ థామస్ సాజ్ (Thomas Szaajz) గత ముప్పయ్ సంవత్సరాలుగా మనోవిజ్ఞానరంగంలో నిజం చెప్పి, ఎదురీదుతున్నాడు. ఫ్రాయిడ్ గురించి ఆయన పరిశోధనలు, ఆయన పేర జరుగుతున్న విషయాలు చాలా జాగ్రత్తగా పరిశీలించి చెప్పాడు. ఫ్రాయిడ్ కు అలవాటుపడిన వారికి కొన్ని వింతగానూ, కొన్ని షాకింగ్ గానూ వుంటాయి. శాస్త్రీయ పరిశీలనలో యివి సర్వసాధారణమే.

వియన్నా విశ్వవిద్యాలయం నుండి 1881లో ఫ్రాయిడ్ ఎం.డి. డిగ్రీ స్వీకరించాడు. వియన్నా జనరల్ హాస్పిటల్ లో రెండేళ్ళు పనిచేశాడు. మనం హవుస్ సర్జన్ అంటామే అదన్నమాట. మొదట్లో నిపుణుడుగా అవుదామనే ఆలోచన లేకున్నా 1883లో అభిప్రాయం మార్చుకున్నాడు.

పారిస్ వెళ్ళి 1885 అక్టోబరు నుండి 1886 ఫిబ్రవరి వరకూ అంటే నాలుగున్నర మాసాలు సుప్రసిద్ధుడైన జాన్ మార్టిన్ చార్కాట్ వద్ద వున్నాడు. 1887 నుండి 1888 వరకూ మెదడు పై పుస్తకం రాయడానికి గాను అధ్యయనం చేశాడు. అదెందుకో గాని పూర్తి కానేలేదు. 1891లో నరాల విషయమై(APhosia) ఫ్రాయిడ్ సుప్రసిద్ధ గ్రంధం ప్రచురితమైంది. 1883 నుండీ 1897 వరకూ నరాల విషయం బాగా పట్టించుకొని, ఫ్రాయిడ్ అందలి లోతుపాతులు అధ్యయనం చేశాడు.

వియన్నాలో వైద్యవృత్తి చేస్తున్న సుప్రసిద్ధుడు జోసెఫ్ బ్రాయర్(Joseph Breuer)26వ ఏట నుండి ఆ రంగంలో వున్నడు. ఆయన వద్దకు వచ్చే రోగులలో 21 సంవత్సరాల అనా ఓ అనే ఆమె హిస్టీరియా లక్షణాలతో వుండేది. తన జీవితంలో ఎదుర్కొన్న అనేక విషయాలను డాక్టర్ తో మాట్లాడితేనే ఆమెకు ఉపశమనం. వూరట లభించాయని "మాట్లాడే చికిత్స"గా ఆమె ఆ చికిత్సా విధానానికి పేరు పెట్టింది. ఫ్రాయిడ్, బ్రాయర్ లు యీ పద్ధతికి ఉత్తరోత్తరా కథార్సిస్ అని పేరు పెట్టారు. మనో విశ్లేషణలో యీ పద్ధతి,అభివృద్ధి చెందని ప్రాథమిక దశగా ఫ్రాయిడ్ చెప్పాడు. ఇది గ్రీక్ మాట.

అనా ఓ ఏం చేసింది? తన జబ్బు లక్షణాలను తానే అనుకరించి డాక్టర్ బ్రాయర్ తో మాట్లాడింది. అంటే జబ్బు లక్షణాలు ఆమెకు తెలుసన్నమాట. కనుక ఆ లక్షణాలను తెచ్చిపెట్టుకొని రోగిగానూ, డాక్టర్ తో ఆ లక్షణాల గురించి మాట్లాడి మామూలు వ్యక్తిగానూ మారిందన్న మాట. మానసిక రోగులు కావాలని జబ్బు తెచ్చుకోవడం చాలా సందర్భాలలో బయటపడింది.

గ్రీకుల నాటకాలలో, ముఖ్యంగా అరిస్టోటల్ కెధార్సిస్ పద్ధతిని స్టేజిపై చూపారు. గ్రీకు సాహిత్యాన్ని ఫ్రాయిడ్ చదివాడు. గ్రీకులలో ఉపవాసం, మాట్లాడడం ద్వారా ఉపశమనం పొందటం అలవాటే.విషాదాంత నాటకాలలో ప్రేక్షకులపై ప్రభావాన్ని చూపెట్టే ఉద్వేగరీతుల్ని కెధార్సిస్ అన్నారు. ఫ్రాయిడ్ వీటినే తన చికిత్సా విధానంలో ప్రవేశపెట్టాడు. ఫ్రాయిడ్ కనుగొన్నట్లు ప్రచారంలోకి వచ్చిన పద్ధతి ఇదే. ఫ్రాయిడ్ తన సొంత వైద్యవృత్తికి 1886లో నాంది పలికాడు. అప్పటికి ఆయన వయస్సు 30 సంవత్సరాలు. వియన్నాలో నరాల జబ్బు నిపుణుడుగా ప్రారంభించాడు. వారానికి మూడు పర్యాయాలు కాసోవిట్జ్ సంస్థలో చిన్న పిల్లల నరాల జబ్బుకు వైద్యుడుగా వెళ్ళేవాడు. అప్పుడే తీరిక వుండేది గనుక అనువాదాలు చేయడం, పుస్తక రచనలో నిమగ్నుడయ్యాడు. నరాల జబ్బు నయం చేసుకోడానికి వచ్చిన రోగులనుండి ఫీజు వసూలుచేసేవాడు. అప్పట్లో ఎలక్ట్రోథెరపీ విరివిగా వినియోగించేవాడు. దీనితో పాటు మర్దన, స్నానాలు చేయించడం కూడా చికిత్సలో భాగంగా వుండేది. ఆరేళ్ళపాటు యీ విధానం సాగించిన తరువాత ఫ్రాయిడ్ దారి మళ్ళించాడు. నరాల్లో ఉత్తేజం కలిగించడానికి విద్యుత్ ప్రసరింపజేసే పద్ధతి ఆనాడు బహుళ ప్రచారంలో వుండేది.

తరువాత హిప్నాసిస్ విధానం చేబట్టిన ఫ్రాయిడ్,1889 వరకూ ఆ పద్ధతి అనుసరించాడు. నరాల జబ్బుకు అది ఉత్తమ చికిత్స అని అప్పట్లో నమ్మకం ప్రబలివుంది. ఇందులో కూడా వైద్యుడు రోగి మధ్య సంభాషణ ప్రధానం అని గుర్తించుకోవాలి. ఫ్రాయిడ్ తన రోగుల్ని పండుకోబెట్టి ఎదురుగా తానొక కుర్చీపై కూర్చొని మాట్లాడడం అలవాటు చేసుకున్నాడు. జీవితాంతం యీపద్ధతి ప్రయోగించాడు. కేంద్రికరించి మాట్లాడే పద్ధతిని రోగులపై ప్రయోగించి, రోగిని కూర్చోబెట్టి కళ్ళు మూసుకోమని, ఒక రోగలక్షణంపై కేంద్రీకరించమని చెప్పి, జ్ఞాపకం వచ్చినంత వరకు రోగం ఎలా ఆరంభమైందో గుర్తు తెచ్చుకోమనేవాడు. రోగికి యిలాంటి చికిత్సా విధానాన్ని 1892లో ఆరంభించిన ఫ్రాయిడ్, ఎంతసేపూ ఏమీ గుర్తుకు రాని ఒకామెకు, నొసలు నొక్కి జ్ఞాపకం వస్తాయని చెబుతూ పోయాడు. రోగి తనతో మాట్లాడడానికి అయిష్టంగావున్నపుడు యిలాంటి పద్ధతిని ఫ్రాయిడ్ వాడేవాడు. 1895 వరకూ తన చికిత్సను కెథార్సిన్ విధానం అని స్టడీస్ ఇన్ హిస్టీరియాలో రాసుకున్నాడు.

సైకో ఎనాలసిస్:

మొట్టమొదటగా 1896లో సైకో ఎనాలసిస్ అనే మాటను ఫ్రాయిడ్ వాడాడు. జోసెఫ్ బ్రాయర్ విధానం వలన సైకో ఎనాలసిస్ పద్ధతికి తాను దారితీసినట్లు ఫ్రాయిడ్ పేర్కొన్నాడు. జీవితమంతా ఆ మాటనే వాడాడు.

ఫ్రాయిడ్ నరాల జబ్బులకు చికిత్స చేసేవానిగా ఆరంభించి, కేవలం వైద్యం చేయడం గాక, జబ్బుకు మూలం ఏమిటో తెలుసుకోవాలనుకునేవాడు. విల్ హెల్ం ప్లయిస్ తో ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా యీ విషయం వెల్లడైంది. శాస్త్రీయ మనోవిజ్ఞాన పధకం కూడా చేయాలని తలపెట్టాడు. వైజానిక స్థాయికి మానసిక రీతుల్ని తీసుకరావాలని ఆయన ఉద్దేశించాడు. వ్యక్తి మనస్సులో(మెదడులో?) రెండురకాల నరాలున్నాయని, ఒక విధమైనవి ఎలాంటి అవరోధాలు లేకుండా ప్రత్యక్ష జ్ఞానాన్ని అట్టిపెట్టగా, రెండో రకమైనవి జ్ఞాపకాలను వుంచుతాయన్నాడు. మెదడులో జరిగే వాటికి ఉపమానాలతో వివరణ యివ్వడం 1895 నుండీ ఫ్రాయిడ్ చెసిన విధానమే. శాస్త్రీయ రుజువుల జోలికి పోకుండా పద ప్రయోగంతో మెదడులోని రీతుల్ని వర్ణించడమే ఫ్రాయిడ్ శాస్త్రీయ పద్ధతి. ప్లయిస్ కు రాసిన ఉత్తరాలలో ఫ్రాయిడ్ తన వైద్యరంగపు అసంతృప్తిని కప్పిపుచ్చి,పెద్ద మాటలతో నరాల జబ్బుల్ని చిత్రించడాన్ని గమనించవచ్చు. ప్రాక్టీస్ అంతగా లేని తనకు, చార్కాట్ పేరు బాగా అక్కరకొచ్చినట్లు ఫ్రాయిడ్ 1888 ఫిబ్రవరి 4న ప్లయిస్ కు రాసిన ఉత్తరంలో పేర్కొన్నాడు. రోగుల దగ్గరకు వెళ్ళడం, మాట్లాడడం అనేది నా వృత్తిలో ముఖ్య అంశం కాగా, నా కాలమంతా అలానే వృధా అవుతున్నదన్నాడు. వైద్యవృత్తిలో మరే రంగానికీ తాను అర్హుడిని కాదు గనుక నరాల జబ్బు చికిత్సకు పరిమితం గాక తప్పలేదన్నాడు. జనరల్ ప్రాక్టీసు చేయడానికి వయస్సు మించిపోయిందని అదంతా నేర్చుకునే వ్యవధి లేదన్నాడు. ఈ దృష్ట్యా నరాల జబ్బులపై ఫ్రాయిడ్ ద్రు ష్టి కేంద్రీకరించి, తన విధానాన్ని వ్యాప్తిలోకి తెచ్చాడు.

నరాల జబ్బుకు మూలం సెక్స్(లైంగిక)అని ఫ్రాయిడ్ అభిప్రాయపడడానికి చార్కాట్, బ్రాయర్, ప్లయిస్ లు తొలుత కారణం. ఒక్కసారి అలాంటి నిర్ధారణకు వచ్చిన తరువాత ఫ్రాయిడ్ యీ రంగంలో యింకా సాగదీశాడు. అతిగా సెక్స్ జీవనం గడపడం వల్ల న్యూరస్తేనియా అనే జబ్బు వస్తుందన్నాడు. ఫ్రాయిడ్ ఎప్పుడూ పోలికలు ఉపమానాలతో తప్ప, శాస్త్రీయ పరిశోధనతో నిర్ధారణకు రాలేదు. అతడి ఉపమానాలే జనాన్ని ఆకర్షించాయి. పురుషులలో న్యూరస్తేనియా అనే నరాల జబ్బు రావడానికి హస్తప్రయోగం ప్రధాన కారణం. కాగా, ఇది యవ్వనంలో బయటపడుతుందని ఫ్రాయిడ్ చెప్పాడు. హస్తప్రయోగం వలన పిచ్చి వస్తుందని ఆనాటి సైకియాట్రీ చెప్పింది. ఫ్రాయిడ్ ఇది పట్టించుకోలేదు. యవ్వనంలో స్త్రీతో సంబంధం వున్న పురుషులకు నరాలజబ్బు రాదన్నాడు. స్త్రీలలో యవ్వనంలో లైంగిక సంబంధాలు నరాల జబ్బుకు దారితీస్తుందన్నాడు. అంటే స్త్రీలకు ఒక రకంగానూ పురుషులకు మరో విధంగానూ అతడు రోగనిర్ధారణ చేశాడన్న మాట. లైంగిక సంబంధమైన విషయాలలో ఫ్రాయిడ్ తన అనుభవాల రీత్యా సిద్ధాంతీకరించినట్లు కూడా రాసుకున్నడు. నరాల జబ్బుకు మరో కారణం కూడా ఫ్రాయిడ్ పేర్కొన్నాడు. సంభోగం సంతృప్తిగా జరిగినప్పుడు నరాల జబ్బుకు దారితీస్తుందని, ఇది పూర్తిగా నయం చేయలేకపోయినా, కొంతవరకు ఆపవచ్చునన్నాడు. సుఖరోగాలైన సిఫిలిస్, గనేరియాను దృష్టిలో పెట్టుకొని యిలా చెప్పాడు. లైంగిక కారణాలుగా నరాల జబ్బు వస్తుందని ఫ్రాయిడ్ చెప్పడంలో ఉపమానాల ప్రాధాన్యతే తప్ప, శాస్త్రీయా పరిశోధన, నిర్ధారణ ఏదీ లేదు.

సైకో ఎనాలసిస్ పేరిట ఫ్రాయిడ్ రాయదలచిందంతా 1906 లోపు రాశాడు. హిస్టీరియా, కలలు, అణచిపెట్టే భావాలు, చిన్నప్పటి లైంగికం, అచేతన అవస్త గురించి ఫ్రాయిడ్ అభిప్రాయాలు లోకానికి తెలిశాయి. ప్రపంచం వీటిని చర్చించింది. ఫ్రాయిడ్ కు వ్యతిరేకత,అనుకూలత వెల్లడైంది. ఫ్రాయిడ్ పేర్కొన్న రంగంలో శాస్త్రీయ పరిశోధన జరగనందున క్రమపద్ధతిలో భిన్న భావాలు వ్యక్తమయ్యే అవకాశం అప్పట్లో లేదు కనుక ఫ్రాయిడ్ చెప్పింది జనాకర్షణ పొందింది. ఈ విషయాన్ని గ్రహించిన ఫ్రాయిడ్ తన సైకో ఎనాలసిస్ భావాల్ని వ్యాపింపజేయడానికి తీవ్ర స్థాయిలో ఉద్యమించాడు.

అంతర్జాతీయ సైకో ఎనాలసిస్ సమితి:

వ్యాపార రంగంలో కొత్తగా వచ్చిన సరకు అమ్మడానికి వినియోగించే పద్ధతులన్నీ ఫ్రాయిడ్ ప్రయోగించి సఫలుడయ్యాడు. సైకో ఎనాలసిస్ ఉద్యమంలో ఎక్కువగా యూదులు ఉన్నారు. యూదుల పట్ల వ్యతిరేకత,జుగుప్స వున్నదన్న సత్యం అతడికి తెలుసు. యాడ్లర్, కార్ల్ అబ్రహం, ఎల్.హెచ్. స్టెకల్, ఫెరెంజి వంటి సైకో ఎనాలసిస్ ప్రముఖులంతా ఫ్రాయిడ్ అనుచరులేగాక,యూదులు కూడా. పైగా సెక్స్ గురించి మాట్టాడటం కూడా సమాజంలో కొంత వ్యతిరేకతను కలిగిస్తుంది.కనుక జనాకర్షణ పద్దతులు అవలంబించడానికి గాను, యూదు కాని ప్రసిద్ధుడిని సైకో ఎనాలసిస్ సమితి అధ్యక్షుడుగా ప్రతిపాదించాడు. యూదులు ఇందుకు వ్యతిరేకత చూపగా, వారికి నచ్చజెప్పి, యూంగ్ కు జాతి విద్వేషం వున్నా తన కోసం వదులుకోడానికి సిద్ధపడ్డాడని యూదు వ్యతిరేకత మానేసి తనతో స్నేహంగా వుండడానికి ఒప్పుకున్నాడని ఫ్రాయిడ్ తన తోటి యూదులకు చెప్పాడు. వియన్నా స్టెకల్ హోటల్ లో యూదులకు యిలా నచ్చచెప్పిన అనంతరం, కార్ల్ యూంగ్ అధ్యక్షుడయ్యాడు. ఆ విధంగా అంతర్జాతీయ సైకో ఎనాలసిస్ సంఘం పుట్టగా దీనికి అనేక శాఖలు ఏర్పడ్డాయి.

యూంగ్, యాడ్లర్ లు రానురాను ఫ్రాయిడ్ కు భిన్నంగా సైకో ఎనాలసిస్ సూత్రాలు తమ పద్ధతిలో పెంపొందించారు. ఫ్రాయిడ్ కు యిది సుతరామూ నచ్చలేదు. తాను సూచించిన మూలసూత్రాలను అనుసరిస్తేనె సైకో ఎనాలసిస్ అని ఫ్రాయిడ్ పట్టుబట్టాడు. ఇంచుమించు పేటెంట్ హక్కుగా సైకో ఎనాలసిస్ పై ఫ్రాయిడ్ తన అజమాయిషీ కావాలనుకున్నాడు. కారున్ హర్నె, హారీస్టాక్ సల్లివన్, ఎరిక్ ఫ్రాం ల మధ్య ఫ్రాయిడ్ అనంతరం ఇంచుమించు యిలాంటి పేటెంట్ హక్కు తగాదా, సైకోఎనాలసిస్ గురించి సాగింది. శాస్త్రీయ పరిధిలో యిది విడ్డూరమే!

ఫ్రాయిడ్ కూ యాడ్లర్ కూ సైకో ఎనాలసిస్ తగాదా కేవలం మూలసూత్రాలకే పరిమితమైతే అర్థం చేసుకోవచ్చు. కీర్తి దాహం, ధనసంపాదనలో యీ తగాదా రావడం విచారకరం. తన సూత్రాలను మాత్రమే సైకో ఎనాలసిస్ అనాలని, ఏ మాత్రం తేడా వచ్చినా ఒప్పుకోననీ ఫ్రాయిడ్ పట్టుబట్టాడు.

యాడ్లర్ మానవ ప్రవర్తన గురించి సిద్ధాంతీకరించాడనీ, నరాల జబ్బుకు పరిమితం కాలేదని ఫ్రాయిడ్ 1914లో విమర్శించాడు. అప్పటికి వియన్నా సైకో ఎనాలసిస్ సొసైటి అధ్యక్షుడుగా యాడ్లర్ ను రాజీనామా పెట్టేటట్లు తెరవెనుక వత్తిడి చేశాడు. కాంగ్రెసు పార్టీపై గాంధీజీ పెత్తనం ఎలా వుండేదో, సైకో ఎనాలసిస్ సంఘాలపై ఫ్రాయిడ్ మాట అలా చెల్లింది. తాను యాడ్లర్ కు నాయకత్వం అప్పగిస్తే తన సూత్రాలకు భిన్నంగా పోతాడా అని ఫ్రాయిడ్ ఆగ్రహించాడు.వియన్నా సంఘసభ్యులు చెప్పగా అతడిని తొలగించినట్లు పేర్కొన్నాడు. అలాగే యూంగ్ కు ప్రధాన పదవి కట్టబెట్టినట్లు రాశాడు.

మొదటి ప్రపంచ యుద్ధంలో తన సైకో ఎనాలసిస్ ప్రకారం నరాల జబ్బుకు చికిత్స సఫలమైందని, వైద్య సైనిక రంగాలలో యిది నిజమని ఫ్రాయిడ్ ప్రచారం చేసి నమ్మించాడు.మొదటి ప్రపంచ యుద్ధంలో సైకో ఎనాలసిస్ సఫలమౌతుండగా, ఇంతలో యుద్ధం ముగిసిందని ఫ్రాయిడ్ బాధపడ్డాడు. 1918 సెప్టెంబరు 28,29లో బుడాపెస్ట్ లో జరిగిన సైకో ఎనాలసిస్ 5వ అంతర్జాతీయ సమావేశాలకు యుద్ధంలో పాల్గొన్న సైనికాధిపతులు సైతం అనేక మంది వచ్చారు. 2 లక్షల 50 వేల డాలర్లు ఒకతను చందా యిచ్చాడు. ఫ్రాయిడ్ కు అక్కడ వీరారాధన లభించింది. తన జీవిత కృషి సఫలమైందని ఫ్రాయిడ్ సంతోషించాడు.

థామస్ సాజ్ ప్రకారం ఫ్రాయిడ్ పద ప్రయోగంతో ఆకర్షించే గొప్ప వ్యక్తి. సైకో థెరపి అనేది చికిత్స కాదు. మాట్లాడడం అందులో ముఖ్యవిధానం. అచేతన రీతుల వలన మనిషి ప్రవర్తన వుంటుందని,ఇది వక్రరీతులలో సాగుతుంటుందని ఫ్రాయిడ్ ఉద్దేశం.

మానవుడు స్వేచ్చాపరుడు కాదనీ అతడికి స్వేచ్ఛగా ఆలోచించే ఇచ్ఛ లేదనీ ఫ్రాయిడ్ మూలసూత్రం. ఇందుకు అనేక ఆధారాలు చూపే ప్రయత్నం అతడు చేశాడు. ది సైకో పాధాలజీ ఆఫ్ ఎవ్విరిడే లైఫ్ అనే పుస్తకం రాశాడు. తాను గొప్ప శాస్త్రజ్ఞుడనని చాటడానికి ఫ్రాయిడ్ ప్రయత్నించాడే గాని, మానవుడి మనస్సు ఎలా పనిచేస్తుందో చూపలేదు. చేతన అచేతన ఉద్దేశాలను గమనిస్తే, మనం యాంత్రికంగా తీసుకునే నిర్ణయాలన్నీ కావాలని చేస్తున్నట్లనిపించదన్నాడు. అచేతనం నుండి యీ ఉద్దేశాలు వస్తుండగా, నిర్ధారణ అనేది స్పష్టపడుతున్నదన్నమాట. నియతి విధానం మానసిక రీతిలోనే గాక, నేర న్యాయంలో కూడా వున్నదని ఫ్రాయిడ్ రాశాడు.

లియొనార్డో డ వించిని ఉదాహరణగా స్వీకరించిన ఫ్రాయిడ్ తన నియతివాదాన్ని అన్వయించి చెప్పాడు. లియొనార్డో నెమ్మదిగా పనిచేయడం ఒక లక్షణంగా కనిపిస్తున్నదన్నాడు. ఫ్రెస్కో చిత్రాలు వెయ్యాలంటే త్వరగా పనిచేయాలి. తడి ఆరకముందే చిత్రం పుర్తిగావాలి. అందుకే నెమ్మదిగా చిత్రం వేసే రీతిలో లియొనార్డో ఆయిల్ చిత్రాలు వేశాడని ఫ్రాయిడ్ అన్నాడు. లియొనార్డోపై విరుచుకుపడ్డ ఫ్రాయిడ్ ఒక ఉదాహరణ యిస్తు, చిన్నతనంలో ఒక డేగ వచ్చి తోకతో లియొనార్డొ మూతిపై కొట్టిందట. ఆ విషయం ప్రస్తావిస్తూ లియొనార్డొను స్వలింగ సంపర్కం కోరిన, ఆచరించిన వాడుగా చిత్రించాడు.(Homo Sexual) అసలు చిక్కు ఏమంటే ఇటలీ భాషలో గాలిపటం అనే మాటను జర్మనీలో డేగ అని అనువదించడం వలన యీ గందరగోళం ఏర్పడింది. ఇది గమనించకుండా ఫ్రాయిడ్ రాసింది వేదాక్షరంగా సైకో ఎనాలసిస్ స్కూలువారు సిరసావహించారు. లియొనార్డో హోమో సెక్సు గలవాడని ఫ్రాయిడ్ ఉద్దేశం. ఈ నేరం రుజువు కానందుకు ఆనాడు ఇటలీ కోర్టు లియొనార్డోను వదిలేసింది గాని, ఫ్రాయిడ్ ను మాత్రం వదల్లేదు.

ఒడిపస్ కాంప్లెక్స్:

మొదటిసారిగా 1910 ఒడిపస్ కాంప్లెక్స్ ప్రయోగం చేసిన ఫ్రాయిడ్ సైకో ఎనాలసిస్ లో దీనికి అత్యంత ప్రాధాన్యత యిచ్చాడు. పిల్లవాడు తల్లిని కోరడం,కూతురు తండ్రిని కోరడం యిందలి మూలసూత్రం ఒడిపస్ కాంప్లెక్స్ ను అవగాహన చేసుకోని వారికి నరముల జబ్బు వస్తుందని ఆయన చెప్పాడు. ఒడిపస్ కాంప్లెక్స్ లో కేవలం సూచనల సంజ్ఞ, చిహ్నం మాత్రమే వున్నదని, ఇందులో తల్లి అనేది అందుకోలేనిదిగా భావించాలని, తండ్రి అనేది మనలోని అంతరభావనగా స్వీకరించాలని, దీనినుండి బయటపడి స్వతంత్రుడిగా మారాలని యూంగ్ రాశాడు. ఈ వ్యాఖ్యానాన్ని ఫ్రాయిడ్ తీవ్రంగా నిరసించి ఖండించాడు. యూంగ్ కొత్త మత నైతికపధ్ధతి సృష్టించాడన్నాడు. సైకో ఎనాలసిస్ ను ఉపమానంగా భావించడం క్షమించరాని నేరంగా ఫ్రాయిడ్ చెప్పాడు. నరాలజబ్బు అంటే ఏమిటో ఫ్రాయిడ్ నిర్ధారణగా చెప్పలేడుగాని, కారణాలు అన్వేషించడంలో ఒడిపస్ కాంప్లెక్స్ ను పేర్కొన్నాడు. కనుక అదేమిటో తెలుసుకోవడం అవసరం.

ఒడిపస్ గాధ:

థీబిస్ రాజు లూయిస్ కు పిల్లలులేరు. ప్రవక్త డెల్ఫిక్ ను సంప్రదిస్తే, తనకూ తన భార్య జూకాస్తాకు పుట్టే కొడుకు తనను చంపుతాడని చెప్పింది. కనుక భార్యను దూరంగా వుంచాడు. ఆమె ఆగ్రహించి లూయీకి తప్పత్రాగించి తనతో సంభోగం జరిపిస్తుంది. తొమ్మిది మాసాలకు కొడుకు పుడతాడు. కొడుకును దాయానుండి లాక్కెళ్ళి కాళ్ళకు మేకులుకొట్టి, కట్టేసి, కొండల్లో పారేయిస్తాడు లూయీ. ఒక గొర్రెలకాపరి ఆ బాలుడ్ని కాపాడి ఒడిపస్ అని పేరు పెడతారు. మేకులు దిగిన కాళ్ళు ఒంకరపోయినందుకు యీ పేరు వచ్చింది. ఆ బాలుడిని తీసుకొచ్చి పిల్లలులేని కొరింత్ రాజు పోలిబస్, రాణి పెరిబోసియాలకు యిస్తాడు. పెరిగిన తరువాత ఒడిపస్ తన తల్లిదండ్రులను పోలివుండనందుకు స్నేహితుడు వెక్కిరిస్తాడు. ఒడిపస్ వెళ్ళి డెల్ఫిక్ ఆరకిల్ ను తన భవిష్యత్తు గురించి అడుగుతాడు. నీ తండ్రిని చంపి తల్లిని పెళ్ళిచేసుకుంటావని ప్రవక్త చెబుతుంది. తన తల్లిదండ్రులను అతిగా యిష్టపడిన ఒడిపస్ యిది విని, కొరింత్ తిరిగి వెళ్ళకుండా, డాలిస్ వైపు పోతుండగా రధంపై పయనిస్తున్న లూయీ తారసిల్లాడు. తప్పుకోమని లూయిస్ అరుస్తాడు. పెద్దవాళ్ళకు గౌరవం చూపమంటాడు. ఒడిపస్ వినకుండా, తన తల్లిదండ్రులు, దేవుళ్ళే తనకు గౌరవ పాత్రులంటాడు. లూయిస్ రధం పోనివ్వమంటాడు. ఒడిపస్ కాళ్ళమీదుగా రధం కదలగా, ఆగ్రహంతో రధసారధిని, రాజు లూయిస్ ను ఒడిపస్ చంపేస్తాడు. తరువాత థీబస్ కు వెళ్ళిన ఒడిపస్, అక్కడున్న స్పినిక్స్ వేసిన చిక్కుప్రశ్నలకు సమాధానంచెప్పి,దాని నుండి నగరాన్ని కాపాడతాడు. ప్రజలు కృతజ్ఞతతో అతడిని రాజుగా ప్రకటిస్తారు. జూకాస్తాను తన తల్లి అని తెలియకుండానే పెళ్ళిచేసుకుంటాడు. థీబస్ లో ప్లేగువ్యాధిరాగా మళ్ళి డెల్ఫిక్ ఆరేకిల్ ను సంప్రదిస్తారు. లూయీ హంతకుడిని బహిష్కరించమంటుంది. తాను రోడ్డుపై చంపింది లూయీనేనని ఒడిపస్ కు తెలియదు. ఎవరైనాసరే, లూయీ హంతకుడు దేశం వదలిపోవాలని ఒడిపస్ ప్రకటిస్తాడు.

గ్రీసు రుషిగా పేరొందిన అంధుడు టెరిఫాన్ వచ్చి ఒడిపస్ తో మాట్లాడి ప్లేగు వ్యాధి పోవాలంటే భూమిలో పాముదంతాలు నాటినవ్యక్తి త్యాగం చేయాలంటాడు. జూకాస్తా తండ్రి మోనోసిన్ అప్పుడు పైకిలేచిరాగా, నగర ప్రజలు అతడి త్యాగాన్ని శ్లాఘిస్తారు. టెరిఫాన్ అప్పుడే రహస్యం వెల్లడిస్తూ, ఒడిపస్ నీ భర్తను చంపాడని జూకాస్తాకు చెబుతాడు. పెరిబోయా రాసిన లేఖ ద్వారా ఒడిపస్ దత్తత విషయం కూడా తెలుస్తుంది. వెంటనే జూకాస్తా వురిపోసుకొని చనిపోగా, ఒడిపస్ ఆమెనుండి ఒక పిన్నులాగి కళ్ళల్లో పొడుచుకొని గుడ్డి వాడౌతాడు.

ఇదీ ఒడిపస్ కధ. ఫ్రాయిడ్ యీ కధలో తనకిష్టమొచ్చిన భాగాలు స్వీకరించి, కొన్ని వదిలేసి, తల్లికీ, కొడుకుకూ లైంగికసంబంధంతో నరాల జబ్బుకు ముడిపెట్టాడు. లైంగిక సంఘర్షణలో రీతులను ఆకర్షణీయ పదజాలం అన్వేషించి పెట్టాడు. అందుకు ఒడిపస్ గాధను వాడుకున్నాడు.

ఒడిపస్ తన తండ్రిని చంపి తల్లిని పెళ్ళిచేసుకోవాలని తలపెట్టలేదు. పైగా అలాంటిదేమీ జరగకుండా చూడదలచాడు. తాను చంపింది తన తండ్రిని అని ఒడిపస్ కు తెలియదు. ఇది అచేతనంగా వున్నదని, తాను చంపుతున్నది ఎవరినో అనే విషయం ఆచేతనంగా(unconscious) ఒడిపస్ కు తెలుసని ఫ్రాయిడ్ భాష్యం చెప్పాడు.

ఒడిపస్ గాధలో లూయిస్ పాత్ర ఏమిటి? ఒడిపస్ కాంప్లెక్స్ వుంటే, కొడుకును చంపాలనుకున్న లూయిస్ కాంప్లెక్స్ మాటేమిటి అని థామస్ సాజ్ ప్రశ్నించాడు. ఈ గాధలో కుమారుడి హత్య అనే ధోరణి ప్రధానం గదా! తండ్రులందరికీ కుమారులను హతమార్చి, భార్యలను తమకే సొంతం చేసుకోవాలనే కోరిక వుంటుందని, ఇది ప్రపంచవ్యాప్తంగా వున్నదని ఫ్రాయిడ్ సూచించలేదేమి? ఒడిపస్ చర్యను బట్టి ఆత్మరక్షణలో నిమగ్నమయ్యాడు.

ఒడిపస్ ను పసిబిడ్డగా వుండగానే చంపాలని లూయిస్ తల పెట్టడమేగాక డాలస్ రోడ్డుపై ఎదురైనప్పుడు మరోసారి చంపాలని భావించాడు. ఫ్రాయిడ్ యీ వాస్తవాలను తన సిద్ధాంతానికి యిమడనందున వదిలేశాడు.

ప్రాచీన గ్రీకులు తండ్రి హత్య, తల్లి కుమారుల లైంగిక సంబంధం గురించి మాట్లాడడానికి యిష్టపడేవారు కాదు. ఒడిపస్ తన ఉద్దేశాలను కప్పిపుచ్చి పరోక్షంగా వెల్లడించాడనే ఫ్రాయిడ్ వ్యాఖ్యానం కూడా యిమడదు. తననుతాను శిక్షించుకున్న ఒడిపస్ చర్యను మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులు వ్యాఖ్యానిస్తూ లైంగిక విషయాలను అణచివేయడంగా పేర్కొన్నారు. ఇది కూడా సరికాదు. ప్లూటార్క్ తన గాధలలో హిప్పోపోటమస్ తన తండ్రిని చంపి తల్లిని బలవంతం చేసినట్లు రాశాడు. దీనినిబట్టి ప్రతివాడికీ హిప్పోపోటమస్ ధోరణి వున్నదంటామా? ఒడిపస్ ధోరణి అనేది ఫ్రాయిడ్ భాష్యం చెప్పినట్లుగా గ్రీక్ కధలో ఎక్కడా లేదని ఎన్ సైక్లోపీడియా బ్రిటానికా పేర్కొన్నది. ఒడిపస్ ఉద్వేగాలు అతడిని పురికొల్పి యీ పనులు చేయించలేదనేది స్పష్టం. ఒడిపస్ ధోరణి అనేది సైకో ఎనాలసిస్ కు బాగా అక్కరకొచ్చింది. కనుక గాధల్ని,మతాన్ని, చరిత్రను,వ్యక్తి ప్రవర్తనను తమ యిష్టం వచ్చినట్లు చిత్రించి, శాస్త్రీయం అనే ముసుగువేసి చికిత్సపేరిట భాష్యం చెప్పిన సైకో ఎనలిస్టులు ద్రోహం చేశారు.

రాజు ధోరణి మార్చేసి ఒడిపస్ కు అంటగట్టిన ఘనత ఫ్రాయిడ్ దే. ఈ రంగంలో ఫ్రాయిడ్ జోలికి ఎవరూ పోలేదు గనుక యిష్టమొచ్చినట్లు పదజాలాన్ని ప్రయోగించి, నాటకం ఆడాడు. మానవ ప్రవర్తనను తనకు అనుకూలంగా మార్చి, తన సిద్ధాంతాలలో యిమిడ్చాడు. ఫ్రాయిడ్ కు చాలామంది అనుచరులుండడం, సైకో ఎనాలసిస్ ను ఆమోదించడంతో ఫ్రాయిడ్ కు ఆమోదముద్ర పడింది. ఒడిపస్ పాత్రకు ఫ్రాయిడ్ చేసిన భాష్యంవంటిదే లియొనార్డో హేమ్లట్, వుడ్రోవిల్సన్ పట్ల కూడా అన్వయించి,ఉన్నత లక్షణాలను దుష్టమైనవిగా, శ్లాఘనీయమైన విషయాలను గర్హనీయంగా చూపాడని థామస్ సాజ్ పేర్కొన్నారు. (ది మిత్ ఆఫ్ సైకోతెరపి)

ఒడిపస్ కాంప్లెక్స్ అనేది ఫ్రాయిడ్ కు యిష్టప్రీతి అయిన వ్యాఖ్యానం. అది శాస్త్రీయం అని చెప్పాడుగాని, తన సొంత ఆస్తిహక్కుగా చూచుకొని, ఎవరు దాని జోలికి వచ్చినా విరుచుకపడ్డాడు. ఒడిపస్ కాంప్లెక్స్ ను కనిపెట్టి వెల్లడించినందుకు ప్రపంచంలో చూపవలసినంత కృతజ్ఞత రాలేదన్నాడు.(సైకో ఎనాలసిస్ పై పరిచయ ఉపన్యాసాలు) ఒడిపస్ గాధ ఫ్రాయిడ్ కనిపెట్టింది కాదు. ఇందులో ఫ్రాయిడ్ కు ప్రపంచం ధన్యవాదాలు చెప్పాల్సిందేమీ లేదు. ఒడిపస్ కాంప్లెక్స్ విషయమై తాను భాష్యం చెప్పినట్లే సైకో ఎనాలసిస్ లో వుండాలని అటూఇటూ తప్పగూడదని ఫ్రాయిడ్ ఉద్దేశం. కాని ఆయన మాత్రం తన యిష్టం వచ్చినట్లు సమయానుకూలంగా ఒడిపస్ కాంప్లెక్స్ గురించి మాటలు మార్చేస్తుండేవాడు.ఒడిపస్ కాంప్లెక్స్ ప్రపంచవ్యాప్తంగా వున్నట్లు చివరిదాకా ఆయన పేర్కొన్నాడు. (అవుట్ లైన్ ఆఫ్ సైకో ఎనాలసిస్) ఇందుకు సాక్ష్యాధారాలు ఏమి చూపలేదు.కేవలం గ్రీకు కధకు అతడి వ్యాఖ్యానమే చూపాడు. కుమారులందరూ ఒడిపస్ కాంప్లెక్స్ లో పయనించక తప్పదన్నాడు. తండ్రి బలాన్ని చూచి ఈర్ష్యపడేగుణం కుమారుడికి వుంటే, వికలాంగుడు బలహీనుడైన తండ్రి వున్నచోట ఏమౌతుంది? తండ్రి చనిపోగా, తల్లి పెంచినచోట ఎలా వుంటుంది? షేక్స్ పియర్ పాత్ర హామ్లెట్ లో కూడా ఫ్రాయిడ్ ఒడిపస్ ధోరణి చూచాడు!

మామూలుగా వాడుకలో వున్న పదాలకు కొత్త ముసుగు వేయడం ఫ్రాయిడ్ కు కొట్టిన పిండిగా థామస్ సాజ్ చూపాడు. మనస్సు(Mind) ను మనోపరికరం(Physic apparatus) అనీ, రాగద్వేషాలను ఇడ్(ID) అనీ, స్వీయంను అహం (ego)అనీ, చైతన్యతను సూపర్ ఇగో అనీ ఫ్రాయిడ్ పేర్లుపెట్టి పిలిచి, ప్రచారం చేశాడు. సంఘర్షణలు, పరస్పర విరుద్ధ కోరికల బదులు ఫ్రాయిడ్, ధోరణులు (Complexes) అస్పష్టబావాలు (ambivalenses) అనీ చెప్పాడు. అన్నిరకాల లైంగికాలను లిబిడొ అని నామకరణం చేశాడు. ఇది ఈరోస్(eros)గా, జీవనప్రేరణ (Life Instinct)గా వెల్లడౌతుందన్నాడు. సైకోఎనాలసిస్ అంటే మాట్లాడటమే. ఏం మాట్లాడాలి? ఫ్రాయిడ్ చెప్పినట్లు మాట్లాడాలి. కాకుంటే తిట్లు!

మానవులలో సగం మంది స్త్రీలు. వారంతా లైంగికంగా అణగారిపోయారంటాడు. ఉపమానాలు చెప్పడంలో సిద్ధహస్తుడైన ఫ్రాయిడ్ రాస్తూ, పురుషుల లైంగికావయవం, వికలాంగం రూపంలో వుండటమే బాలికల పెరుగుదలలో ప్రధాన అంశం అంటాడు. వారికి మర్మావయవంలోవున్న కేంద్రిక కూడా (Clitoris) తక్కువ స్థాయిదనీ, లైంగిక లోపాన్ని సూచించే ధోరణి వున్నదనీ చెబుతూ, ఇతర విషయాలలో స్త్రీ కూడా ఒక వ్యక్తి అని విస్మరించరాదంటాడు. స్త్రీలకు వ్యతిరేకంగా ఫ్రాయిడ్ చేసిన భాష్యంవలన అతడికి సెక్స్ పట్ల సరైన అవగాహన లేదనేది స్పష్టం.

సెక్స్ (లైంగిక సంబంధం) వాంఛనీయమైన కామం అనీ, వ్యక్తిగత అభిరుచి అనీ, పరస్పర సన్నిహితత్వానికి పరాకాష్ట అనీ, స్త్రీ పురుషుల మధ్య పరస్పర గౌరవం సూచిస్తుందనీ ఫ్రాయిడ్ విస్మరించినట్లు థామస్ సాజ్ స్పష్టపరిచాడు.

ఫ్రాయిడ్ దృష్టిలో మానవజాతి అంతా మనోవైకల్యంతో వున్నవారే.

ఫ్రాయిడ్ లో యూదుజాతి లక్షణం:

ఫ్రాయిడ్ పూర్వీకులంతా యూదులే. అతడి ముత్తాత రాబి ఎఫిరం ఫ్రాయిడ్, తాత రాబి స్లోమొఫ్రాయిడ్. యూదుగా పుట్టిన ఫ్రాయిడ్ అసలు పేరు స్లోమో(Sclomo) యూనివర్శిటీలో 1873 చేరినప్పుడు తనను తక్కువగా చూడడంతో ఫ్రాయిడ్ ఇంకా యూదు స్వభావాన్ని గట్టి పరచుకున్నాడు. జీవితమంతా యూదుగా గడిపిన ఫ్రాయిడ్ తన లేఖల్లో యీ స్వభావాన్ని బాగా స్పష్టపరిచాడు. యవ్వనదశలో 1882లో తనకు కాబోయే భార్యకు వ్రాసిన జాబులో యూదులుగానే జీవితం ఆనందమయం చేసుకుందామని వ్రాశాడు. 1895లో యూదుల సంఘం బనాయ్ బ్రత్ సమాజంలో చేరి జీవితాంతం వున్నాడు. యూదుల సమావేశాల్లో ప్రతివారం పాల్గొని ఉపన్యాసాలిచ్చేవాడు. సైకో ఎనాలసిస్ సఫలం కావాలంటే ఆర్యుల్ని కలుపుకోవాలని వ్యూహంగా పేర్కొన్నాడు. 1908లో అబ్రహంకు వ్రాసిన లేఖలో ప్రాచీన యూదుల పట్టుదలే, చివరివరకూ కాపాడుతుందని ధైర్యం చెప్పాడు.

యూదులలో అబ్రహాం, ఫెరెంజోలను దగ్గరతీసి సైకో ఎనాలసిస్ ప్రోత్సహించిన ఫ్రాయిడ్, యెత్తుగడగా మాత్రమే యూంగ్ ను ప్రోత్సహించినట్లు పేర్కొన్నాడు లేఖల్లో. సైకో ఎనాలసిస్ ను యూదుల సిద్ధాంతంగా భావించాడు. యూదుగా వుండటమే అద్భుతమనీ, విశ్లేషణకు అందని సిద్ధాంతం యూదులే చెప్పగలరని 1936లో బార్బరాలో (Barbara Low)కు వ్రాసిన ఉత్తరంలో బయటపడ్డాడు. ఫ్రాయిడ్ చాలాకాలం యూదుల ఆచార సంప్రదాయాలు పాటించలేదు. కాని యూదులతో సమైక్యంగా భావించుకున్నాడు. బయట తాను మతంలేని నాస్తికుడుగా ప్రచారం చేసి, వారితో కలసిపోవడం, ఫ్రాయిడ్ ద్వంద జీవితనీతికి నిదర్శనం. తన సైకో ఎనాలసిస్ ను అడ్డం పెట్టుకుని వ్యతిరేకుల్ని భయపెట్టిన ఫ్రాయిడ్ యూదుమతాన్ని బాగా వాడుకున్నాడు.

1939లో 80వ సంవత్సరం పైబడగానే ఫ్రాయిడ్ మోసెన్ అండ్ మోనోథీయిజం అనే చివరి గ్రంథం వ్రాశాడు. ఇందులో యూదు వాద పుట్టుపూర్వోత్తరాలు ప్రస్తావించాడు. మోసెస్ తో తాదాత్మ్యం చెందాడు. క్రైస్తవులు, నాజీలు, యూదులపై జరిగిన అత్యాచారాలకు పగతీర్చుకునే ధోరణి ఫ్రాయిడ్ ప్రదర్శించాడు. పగ తీర్చుకోవడం ప్రతి మతం చేసే పనే. యూదులకిది ప్రత్యేక లక్షణంగా వున్నట్లు వారి పవిత్ర గ్రంథాలలోనే చెప్పారు. ఫ్రాయిడ్ ఆ సూత్రాల్ని పాటించాడు.

కార్ల్ యూంగ్ ఏమన్నాడు?:

మనోవిజ్ఞానంలో ఫ్రాయిడ్ తో పాటు పనిచేసిన యూంగ్ కూడా చాలా ప్రభావం చూపెట్టాడు. అంతర్జాతీయ సైకో ఎనాలసిస్ సంఘాధ్యక్షుడుగా కొన్నాళ్ళున్న యూంగ్ (1875-1961) వైద్యం చదివాడు. జ్యూరిచ్ సైకియాట్రి సంస్థలో పనిచేశాడు. కలలపై ఫ్రాయిడ్ వ్యాఖ్యానం 1900లో వెలువడిన నాటికే. యూంగ్ సైకియాట్రి గురించి అభిప్రాయం వెల్లడిస్తూ,అదొక మతం అన్నాడు. మానసిక రోగాల పరిధిలో మానవ, నైతిక దృక్పధాన్ని ఫ్రాయిడ్ ప్రవేశపెట్టాడని ఉద్దేశం. రోగి చెబుతున్నాడనేది గాక, రోగలక్షణాలు వాటి లెక్కలు సేకరించడంలో సైకియాట్రి వైద్యులు ఆసక్తి చూపారన్నాడు. మానసిక రోగులుగా, హిస్టీరియా లక్షణాలు చూపేవారు నటిస్తున్నారని 1906-1908 మధ్య యూంగ్ వ్రాశాడు.

ఒక మతం స్థానంలో మరో మతాన్ని మాత్రమే స్థాపించవచ్చని యూంగ్ 1910లో వ్రాస్తే, ఫ్రాయిడ్ అదిరిపడి, తనను మతస్థాపకుడుగా చూడొద్దని అన్నాడు. మతం అనే మాట ఫ్రాయిడ్ కు గిట్టదు. యూంగ్ దృష్టిలో అది మంచిదే. సైకో ఎనాలసిస్ లో జీవశాస్త్రం కంటె, ఆధ్యాత్మికత హెచ్చుగా ఉన్నదని యూంగ్ నిర్ధారణకు వచ్చాడు. ఫ్రాయిడ్ దీనిని వైద్యంగా శాస్త్రీయమైనదిగా ప్రచారం చేసి ఆచరించదలిస్తే,యూంగ్ ఇదొక మతంగా ఆధ్యాత్మికంగా భావించి ప్రచారం చేశాడు. థామస్ సాజ్ దృష్టిలో యూంగ్ సత్యానికి సన్నిహితంగా వున్నాడు. అంతటితో ఫ్రాయిడ్ ధ్వజమెత్తి యూంగ్ ను దుయ్యబట్టాడు. యూంగ్ మాత్రం రానురాను సైకోథెరపిలోని ఉపమానాలు, మతలక్షణాలు, ఆత్మ ఉపశమనం స్పష్టపరిచాడు. ఫ్రాయిడ్ దృష్టిలో నరాల జబ్బు, సైకోసిస్ అనేవి రోగాలే. యూంగ్ దృష్టిలో నరాల బలహీనత జబ్బు కాదు. సైకోసిస్ రోగం కావచ్చు. మొదటి ప్రపంచ యుద్ధంలో సైనికులకు విద్యుత్ షాక్ యిచ్చి చికిత్స చేసి చిత్రహింసకు గురిచేసిన పద్ధతులను చాలామంది తీవ్రంగా విమర్శించారు.1927లో నోబెల్ బహుమతి అందుకున్న జూలియస్ వాగ్నర్ జారెగ్(1857-1940) చిత్రహింసల చికిత్సను ఫ్రాయిడ్ వెనకేసుకొచ్చాడు. అతడి పద్దతిలో ఆస్ట్రియా సైకియాట్రిస్టులు చిత్రహింస షాక్ వైద్యం పాటించారు. ఆస్ట్రియా యుద్ధ మంత్రిత్వశాఖ ఒక విచారణ సంఘాన్ని నియమించింది. వారు ఫ్రాయిడ్ అభిప్రాయమడిగితే వాగ్నర్ జారెగ్ (Wagner-Jauregg) పద్ధతిని ఆయన సమర్ధించాడు. వాగ్నర్ తన స్వీయచరిత్రలో యుద్ధ ఖైదీలలో నరాల జబ్బు పేరిట నటించిన సైనికులకు యిచ్చిన చికిత్స క్రూరమైనదేననై ఒప్పుకునాడు. యుద్ధం వలన వచ్చే నరాల మనోరుగ్మతకు సైకో ఎనాలసిస్ చికిత్స పనిచేస్తుందని ఫ్రాయిడ్ గొప్పలు చాటుకున్నాడు. యుద్ధం నుండి తప్పించుకోడానికి జబ్బువచ్చినట్లు నటించే సైనికుల లక్షణాలను, ఫ్రాయిడ్ తన గంభీర పదజాలంతో, అందులో అచేతన వుద్దేశాలే సిద్ధాంతీకరించాడు. సైనికుడు అబద్ధం ఆడటంకాదనీ, చేతన అచేతన ఉద్దేశాలు గుర్తించకపోవడం తప్పు అనీ ఫ్రాయిడ్ అన్నాడు. కావాలని ఫ్రాయిడ్ అబద్ధాలు అల్లినట్లు సాజ్ విమర్శించాడు. అబద్ధాలు ఆడి నటించేవారికీ,నరాల మనోబలహీనతలు వున్నవారికీ పోలికలు తేడాలు వున్నాయని ఫ్రాయిడ్ తన పదజాలంతో పాఠకులను గందరగోళపరచాడు.

విద్యుత్ షాక్ వైద్యం, హిప్నాసిస్ దశ నుండి విడివడి, సైకో ఎనాలసిస్ పెరిగింది. దీనికి ఒక శాస్త్రీయస్థాయి సమకూర్చడానికి ఫ్రాయిడ్ తన ప్రభావాన్ని పదజాలాన్ని ప్రయోగించాడు. వైద్య అవసరం దృష్ట్యా యిది ఆవిర్భవించిందన్నాడు. ఫ్రాయిడ్ మొదట్లో ఎలక్ట్రోథెరపి వాడాడు. తర్వాత హిప్నాసిస్ కు మారాడు. ఉత్తరోత్తరా సైకో ఎనాలసిస్ అనే తొడుగుతో జనాన్ని ఆకర్షించాడు.

సైకో ఎనాలసిస్ లో శాస్త్రీయం ఏదీ లేదు. ఫ్రాయిడ్ సృష్టించిన కొత్త మతం అది.

ముగింపు

నేను సైన్సు మనిషిని కాదు సాహసిని మాత్రమే అని ఫ్రాయిడ్ 1890 ఫిబ్రవరి 1న విల్ హెల్ం ప్లెస్ కు వ్రాశాడు. సైకో ఎనాలసిస్ అనేది, కోకకోలా వలె ఒక ట్రేడ్ మార్కు. అదొక ఉపమానం. మాట్లాడటం ఇందులో ముఖ్యం. దీనిని ఫ్రీ అసోసియేషన్ పద్ధతి ద్వారా విశ్లేషించవచ్చని ఫ్రాయిడ్ తన విధానంగా పేర్కొన్నాడు. డాక్టరు కావాలనుకున్నదే రోగి నుండి రాబట్టడానికి యిందులో ప్రయత్నిస్తారు. మాట్లాడే పద్ధతికి వైద్యం తొడుగుతెచ్చిపెట్టిన ఫ్రాయిడ్ యూదుల మతరీతులకు ఆధునిక ముసుగువేశాడు. జీవితానికి అర్థం, జీవిత విలువ ప్రశ్నించేవారంతా రోగులే అని ఫ్రాయిడ్ అన్నాడు. సంభాషణను చికిత్సగా మార్చిన ఫ్రాయిడ్ గొప్ప సాధకుడే! సైన్స్ ముసుగులో వున్న మతమే సైకో ఎనాలసిస్. అచేతనం అనేది తనకే తొలుత తెలిసిందని ఫ్రాయిడ్ గొప్పలు చెప్పాడు. లైంగికం(సెక్స్)అంటే వక్రభాష్యం చెప్పి, హస్తప్రయోగం, సుఖవ్యాదులు తప్పుడు పద్ధతి అని ప్రచారం చేశాడు. హాస్యం ఆనందించాలి, కాని సైకో ఎనలిస్ట్ విశ్లేషించి, అందులోని మజాను పోగొడతాడు. ఫ్రాయిడ్ తన విశ్లేషణ సూత్రాల్ని తానే ఉల్లంఘించాడు అచేతనం అనేది సైకో ఎనాలసిస్ పేరిట ప్రచారంలోవున్న మాఫియా మాత్రమే. ఈతరానివాడు నీళ్ళలో పడినవాడిని కాపాడడం వంటిదే. మానసిక రోగులకు సైకో ఎనాలసిస్ చికిత్స! మతాన్ని సైన్స్ గా ఒప్పించడం ఫ్రాయిడ్ గొప్పతనం.

- హేతువాది, మార్చి,ఏప్రిల్,మే 1992