అబద్ధాల వేట - నిజాల బాట/మూఢనమ్మకాలకు దివ్యజ్ఞానసమాజ సిమెంట్

వికీసోర్స్ నుండి
పునర్వికాస పరిణామం
మూఢనమ్మకాలకు దివ్యజ్ఞానసమాజ సిమెంట్

భారతదేశంలో పునర్వికాసం రాకపోగా,మనల్ని అతివేగంగా వెనక్కు తీసుకెళ్ళే సమాజాలు విజృంభించి పనిచేశాయి. అందులో దివ్యజ్ఞాన సమాజం ఆరితేరింది.

విదేశాలలో పుట్టిన దివ్యజ్ఞాన సమాజం, మనదేశంలో ప్రవేశించి పాతుకపోయింది. దీని స్థాపకులు బ్లావట్ స్కీ అనే రష్యన్ స్త్రీ, అల్కాట్ అనే అమెరికన్ 1875 నవంబరు 17న అమెరికాలో దివ్యజ్ఞాన సమాజానికి అంకురార్పణ చేశారు. ప్రకృతిలోనూ, మానవునిలోనూ బయలుపడని శక్తులు కనుగొనాలని వీరు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సమాజం వారికి బ్లావట్ స్కీ రాసిన ది సీక్రెట్ డాక్ట్రిన్ అనే గ్రంథం మూలాధారం. అనంతమూల స్వరూపమనేది భావానికీ, ఆలోచనకూ అందనిదని పేర్కొన్నారు. విశ్వంలో మార్పులన్నీ దైవలీలలుగా చెప్పారు.

ఆత్మలు,పునర్జన్మలు,కర్మలలో వీరికి నమ్మకం వున్నది. రుజువుకు నిలబడని దివ్యజ్ఞాన సమాజంవారి రచనలు కొందరిని ఆకర్షించాయి. ఈ రహస్యాలనేవి మీకెలా తెలుసు అని అడిగితే, దివ్యజ్ఞానం వారు తెల్లముఖం వేస్తారు. రష్యన్ యువతి బ్లావట్ స్కీ 17 సంవత్సరాల ప్రాయంలోనే తనకంటె ఎంతో ఎక్కువ వయస్సుగల వ్యక్తిని పెళ్ళాడింది. కాని, కొన్ని మాసాలకే అతడిని వదిలేసింది. ఆ చేదు అనుభవం తరువాత, ప్రపంచ పర్యటన జరిపింది.

1831లో బ్లావట్ స్కీ రష్యాలో పుట్తి 1875లో అమెరికా చేరి దివ్యజ్ఞాన సమాజాన్ని స్థాపించింది. ఆ సమాజ కార్యదర్శినిగా ఇండియాలో ఆర్యసమాజ్ స్థాపకుడు దయానంద్ కు ఉత్తరాలు రాసింది. తమ సమాజాన్ని ఆర్యసమాజ్ లో విలీనం చేస్తామన్నారు. 1879లో భారతదేశం చేరుకుని, చెప్పిన ప్రకారం ఆర్యసమాజ్ లోకలసిపోయారు కాని, ఆ కలయిక అట్టేకాలం సాగలేదు. అభిప్రాయభేదాలు రాగా, అతిత్వరలో విడిపోయారు. కల్నల్ ఆల్కాట్, మాడం బ్లావట్ స్కీలు తమను క్రైస్తవ విరోధులుగా చిత్రించుకున్నారు. తరువాత బౌద్ధంలోకి మారారు. ఆర్యసమాజ్ తో విడిపోయిన అనంతరం దేశంలో పర్యటించి, చివరకు మద్రాసులో అడయార్ కేంద్రంగా దివ్యజ్ఞాన సమాజస్థాపన చేశారు. సంస్కృతాన్ని పునరుద్ధరించాలని, ప్రాచీన మతం, తత్వం, కళలు తిరగదోడాలని ఉద్బోధించారు. హిందూ మత ధర్మాలు ఉన్నతమైనవన్నారు.

దివ్యజ్ఞాన సమాజం విదేశాలలో కొద్దిమంది చదువుకున్నవారిని ఆకట్టుకున్నది. అయితే దివ్యజ్ఞాన సమాజానికి బహుళ ప్రచారం రావడానికీ,అనేకమంది ఆకర్షితులు కావడానికీ అనిబిసెంట్ కీలకపాత్ర వహించింది. ఈమె 1889లో బ్లావట్ స్కీ గ్రంథం చదివి, సమ్మోహితురాలైంది. వారి సమాజంలో అదొక మలుపు. 1891లో బ్లావట్ స్కీ మరణించింది. ఆ తరువాత అనిబిసెంట్ తిరుగులేని సమాజ నాయకురాలైంది. కనుక అనిబిసెంట్ గురించి కొంత విపులంగా తెలుసుకోవడం అవసరం.

అనిబిసెంట్ 1847 అక్టోబరు 15న పుట్టింది. ఐర్లండ్ దేశీయురాలు, ప్రైవేట్ విద్యాభ్యాసం చేసింది. ఒక క్రైస్తవ మతాచార్యుడిని పెళ్ళి చేసుకున్నది. అతడితో సంతానం పొందింది. తొలి ఆకర్షణలకు గురిఅయ్యే ఉద్వేగిగా అనిబిసెంట్ జీవితమంతా ప్రవర్తించింది. 1873 నాటికి తన భర్తకు విడాకులిచ్చివేసింది.

1874లో ఫ్రీథాట్ సొసైటీలో చేరి, ఛార్లస్ బ్రాడ్లా ఉపన్యాసాలు విని, ఆకర్షితురాలైంది. అప్పటినుండి బ్రాడ్లాపట్ల విపరీత ఆకర్షణ పెంచుకొని, తానూ నాస్తికురాలుగా ప్రచారం చెసింది. హేతువాదిగా ఉపన్యాసాలు చేసింది. కుటుంబ నియంత్రణ ప్రచారం మొదలుపెట్టింది.

బెర్నాడ్ షా ప్రబావంతో ఫేబియన్ సోషలిస్ట్ అయింది. ఎవరి ప్రభావంలో వుంటే ఆ బావాలు భుజాన వేసుకొని ప్రచారం చేయడం ఆమెకు ఆనవాయితీ అయింది. భావాలు బాగా అవగాహన చేసుకొని, నచ్చి, ప్రచారం చేయడం వేరు.తాత్కాలిక ఆకర్షణలకు, వ్యక్తుల సమ్మోహనాలకు లోబడి ప్రచారం సాగించడం వేరు. ఎత్తువారి చేతిబిడ్డవలె అనిబిసెంట్ ప్రవర్తించింది. బ్రాడ్లా తొలి ఉపన్యాసం విని, తానూ నాస్తికురాలినే అంటూ సభలలో పాల్గొన్నది. ఇంగ్లండ్ లో పర్యటించి నాస్తికత్వం ప్రచారం చేసింది. దేవుని రుజువుకై చెబుతున్న సాక్ష్యాధారాలు బలంగానూ, నమ్మదగినవిగానూ లేవని ఆమె తన స్వీయచరిత్రలో పేర్కొన్నది. 1875 నుండీ యీ ప్రచారంలో పాల్గొన్న అనిబిసెంట్ నేషనల్ సెక్యులర్ సొసైటీకి ఉపాధ్యక్షురాలైంది.

డా॥ ఛార్లస్ నోల్టన్ రాసిన పుస్తకంలో కుటుంబనియంత్రణ బోధనలు వున్నాయి. అవి క్రైస్తవులకు నచ్చలేదు. అతడి పుస్తకంలో ప్రచురణకర్త కొన్ని అశ్లీల చిత్రాలు వేసి అమ్మాడు. రచయితను ఇంగ్లండ్ లో శిక్షించారు! ఆ దశలో అనిబిసెంట్ ముందుకొచ్చి రచయిత తన భావాలు స్వేచ్ఛగా వెల్లడించే హక్కువుండాలంటూ, అతడి పుస్తకాన్ని తిరిగి ప్రచురించింది. రచయిత అభిప్రాయాలన్నింటితో పూర్తిగా ఏకీభవించకపోయినాసరే, భావస్వేచ్ఛ ముఖ్యమని హేతుబద్ధంగా వాదించింది. ఈ పుస్తకం ప్రచురించిన నేరానికి అనిబిసెంట్, బ్రాడ్లాలు ఆరు నెలలు జైలుశిక్ష అనుభవించారు కూడా.

అనిబిసెంట్ ఆనాడు క్రైస్తవ మత ధోరణులకు ఎదురీదింది. కుటుంబ నియంత్రణ కావాలంటూ ఒక రచన చేసింది. అయితే ఆమె తన భావాలతో తన సంతానాన్ని చెడగొడుతున్నదంటూ తండ్రి కోర్టులో కేసు వేసి, ఆమెను పిల్లల్ని వేరుచేయాలన్నారు. కోర్టు అందుకు అంగీకరించింది. 1879లో అనిబిసెంట్ అప్పీలుపై కూడా కోర్టు తీర్పు చెబుతూ, తల్లి పిల్లల్ని చూడొచ్చుగాని, పూర్తి హక్కులు తండ్రివేనన్నది.


అనిబిసెంట్ యీ విధంగా సాహసోపేత జీవితం గడుపుతుండగా సందేహాలకు, అనుమానాలకు గురైంది. నాస్తికత్వం, హేతువాదం ఆమెకు పూర్తిగా అవగాహన కాలేదు.

ఛార్లస్ బ్రాడ్లా శక్తివంతమైన ఆకర్షణ, వాగ్ధోరణి వాదనాబలానికి అనిబిసెంట్ సమ్మోహితురాలైంది. అంతేగాని హేతువాదం, నాస్తికత్వం శాస్త్రీయ దృక్పధం పూర్తిగా ఆకళింపు చేసుకొని ఆమె ప్రచారానికి దిగలేదు. దీనికి తోడు వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదుడుకులు, ఎదురుదెబ్బలు ఆమెను మానసికంగా కుందదీశాయి. అలాంటి సన్నివేశంలో బ్లావట్ స్కీ రాసిన సీక్రెట్ డాక్ట్రిన్ (రహస్య సిద్ధాంతం) అనే పుస్తకం అనిబిసెంట్ చదివింది. అంతవరకూ వున్న హేతువాదాన్ని వదలేసింది. ప్రశ్నించకుండా ఆ రచనను గుడ్డిగా ఆమోదించింది. హేతువాదులు బ్లావట్ స్కీని,ఆమె రచనల గురించి వేసిన ప్రశ్నలు కూడా అనిబిసెంట్ ప్రక్కన బెట్టింది. తనకు నచ్చితే ఇక ఎలాంటి వాదమూ అక్కరలేదనే ధోరణిలో ఆమె సాగిపోయింది.

దివ్యజ్ఞాన సమాజం ఏర్పడినప్పుడు మనోతత్వశాస్త్రం బాల్యదశలో వున్నది. విజ్ఞానరంగంలో ఇంకా నిర్ధారిత వాదమే ప్రబలివున్నది. జీవశాస్త్రం కొంతమేరకు పెంపొందినా, జన్యుశాస్త్రం వరకూ రాలేదు.

అలాంటి ఘట్టంలో హెచ్.పి. బ్లావట్ స్కీ రచన రహస్య సిద్ధాంతం రెండు సంపుటాలు అనిబిసెంటు చదివింది. పునర్జన్మను సమర్ధిస్తూ గత అనుభవాల్ని గురించి కథలుగా అల్లిన యీ పుస్తకం ఆమెను ఆకట్టుకున్నది. మానవుడిలో ఏడు విధాలైన దశలుంటాయని యి పుస్తకం పేర్కొన్నది. ఆత్మపరిణామం చిత్రవిచిత్రాలుగా వర్ణించిన యీ రచన అనిబిసెంట్ ను దిగ్భ్రాంతి పరచిందట. ఈ రహస్యాలన్నింటికీ కొందరు దేవతలు కాపలావుండగా, వారితో బ్లావట్ స్కీ మానసికంగా సంబంధం పెట్టుకున్నదట. హిమాలయాలలోని రుషులతో దివ్యజ్ఞాన సమాజం వారికి సంబంధాలున్నాయన్నారు. ఇలాంటి వారిలో సి.డబ్లు.లెడ్ బీటర్, ఎ.పి.సిన్నెటు, కల్నల్ ఆల్కాటు మొదలైనవారున్నారన్నారు. దివ్యజ్ఞాన సమాజంవారు దూరశ్రవణ, దూరదృష్టి, అతీంద్రియ శక్తుల్ని నమ్మారు. ఇలాంటి అనేక ఆకర్షణలతో అనిబిసెంట్ ఎట్టకేలకు 1889లో దివ్యజ్ఞాన సమాజీకురాలైంది. 1891లొ బ్లావట్స్కీ లాడ్జి అధ్యక్షురాలైంది.

దివ్యజ్ఞాన సమాజం ప్రపంచ వ్యాప్తంగా సోదరభావాన్ని పెంపొందించాలని, ఆర్య సాహిత్యాన్ని అధ్యయనం చేయాలని, మానవుడిలో దాగివున్న ప్రతిభలను బయటకు తీయాలని ఉద్దేశించింది.

దివ్యజ్ఞాన సమాజ స్థాపకురాలు మాడం బ్లావట్ స్కీ 1891లో మరణించింది. అప్పటికే ఇండియాలో బెట్రాం కెట్లే ప్రధాన కార్యదర్శిగానూ, ఆల్కాటు అధ్యక్షుడుగానూ దివ్యజ్ఞాన సమాజ వ్యవహారాలు చూస్తున్నారు. వీరికి తోడుగా ఎడ్ అనే వ్యక్తి వున్నాడు.

1893లో అనిబిసెంటు ఇండియా చేరుకున్నది. అప్పటినుండీ దేశంలో అనేక నగరాలలో పర్యటించి తన వాగ్ధోరణితో చదువుకున్న కొద్ది మందిని ముగ్ధుల్ని చేసింది. అప్పటికే దివ్యజ్ఞాన సమాజకేంద్రం కూడా ఇంగ్లండ్ నుండి ఇండియాకు మారింది.(1879)

దివ్యజ్ఞాన సమాజానికి అనిబిసెంటు నాయకత్వం వహించిన తరువాత ఇండియాలోని నగరాలలో బాగా ప్రచారం లభించింది. చదువుకున్న వారిలో అగ్రకులాలవారు దివ్యజ్ఞాన సమాజంలో చేరారు. బ్రహ్మసమాజంలో కొందరు చీలిపోయి, అనిబిసెంటుతో చేరారు. అల్కాట్ అనిబిసెంటులు పర్యటనలు చేశారు. అంతవరకూ దేశంలో సాంఘిక సంస్కరణలకు వున్న అనుకూలత కాస్తా వెనుకంజ వేసింది హిందూమతాన్ని,పవిత్రగ్రంథాల్ని ఆకాశానికెత్తి శ్లాఘించిన అనిబిసెంటు, సాంఘిక సంస్కరణల్ని వ్యతిరేకించింది. సనాతనులు యీ ధోరణి ఆసరాగా తీసుకొని దివ్యజ్ఞాన సమాజాన్ని పొగిడారు. హిందూ నాగరికతకు పొందికగా వుండేట్లు హిందూమత,సంఘాభివృద్ధికి తోడ్పడతామని అనిబిసెంటు నాయకత్వాన 1904 లో మద్రాసు హిందూ సంఘం ప్రతిజ్ఞ చేసింది. అంతవరకూ సంస్కరణలు కావాలన్న వారంతా పాశ్చాత్య నాగరికతాప్రేరణలో, వ్యామోహంలో పడినట్లు ప్రచారం జరిగింది. డిరోజియో-రామమోహన్ రాయ్ ప్రభృతుల సంస్కరణలు, అభ్యుదయ ఆలోచనలు వెనుకంజ వేశాయి. అనిబిసెంటు భారత సమాజానికి తీరని ద్రోహం చేసింది.

కులం, భోగం వృత్తి, బాల్యవివాహాలు, విధవా పునర్వివాహాలు మొదలైనవన్నీ చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సిన విషయాలని అనిబిసెంటు వాదించింది. 20వ శతాబ్దం ఆరంభంలో సంస్కరణ ఉద్యమం వెనక్కు మళ్ళింది. హేతువాదిగా, నాస్తికురాలుగా ఇంగ్లండ్ లో సంసర్కణలకు, స్త్రీల హక్కులకు పోరాడిన అనిబిసెంటు, ఇండియాలో మత ప్రభావంతో వెనక్కు నడవడం ఆశ్చర్యపడాల్సిన విషయం కాదు.

భారతీయులలో అత్యధిక సంఖ్యాకులకు తెల్లవారంటే చాలా అధికులనే భావం ప్రబలింది. వారు పరిపాలించడం ఒక కారణంకాగా, తెల్లచర్మం, ఇంగ్లీషు భాష, వేషం, భావాలు ఇతర కారణాలుగా పేర్కొనవచ్చు. 19వ శతాబ్దం చివరలో ఇండియాకు వచ్చిన అనిబిసెంటు తెల్లదొరసానిగా కొందరిని ఆశ్చర్యపరిస్తే, ఆమె ఉపన్యాసాలు, హిందూమతాన్ని పునరుద్ధరించాలనే ఆమె పిలుపు మరికొందరిని ఆకర్షించాయి. ఇది ఆసరాగా తీసుకొని అనిబిసెంటు ఇష్టమొచ్చినట్లు మాట్లాడింది. తాను పూర్వజన్మలో హిందువునే అన్నది. తమకు హిందూయిజాన్ని ప్రబోధిస్తున్న తెల్ల స్త్రీ పట్ల సనాతనులు కన్నెర్ర జేశారు. హిందూ సమాజాన్ని యధాతధంగా ఆమోదించిన అనిబిసెంటు, తరువాత హిందూ సమాజాన్ని సంస్కరించాలన్నది. ఇదిచూచి సంతోషించిన కొందరికి నిరాశే ఎదురైంది. ఆమె కావాలన్నది డిరోజియో-రామమోహన్ రాయ్ హిందూ సంస్కరణలుకాదు, ప్రాచీన హైందవాన్ని తిరగదోడాలని అనిబిసెంటు పిలుపు యిచ్చింది. ప్రాచీన హైందవం వికాసంతోనూ శక్తివంతంగా వున్నట్లు ఆమె అభిప్రాయపడింది.

1913 నాటికి అనిబిసెంటులో మానసిక వృద్ధాప్య లక్షణాలు స్ఫుటంగా కనిపించాయి. అగస్త్యుడితో తాను ప్రత్యక్ష సంబంధం పెట్టుకోగలుగుతున్నానని, అతడి కోరికపై కొన్ని సంస్కరణలు ప్రతిపాదిస్తున్నానన్నది. బాల్య వివాహాలను ఎదిరించమని అగస్త్యుడు చెప్పాడనీ, అందుకు ఒక దళాన్ని ఏర్పాటు చేయమన్నాడనీ రాసింది. ఇలాంటి భ్రమలు నిజమని ఆమె నమ్మిందో, లేక అమాయకులను నమ్మించదలచిందోగాని. యీ విషయాలు గ్రంధస్తం చేసింది.

దివ్యజ్ఞాన సమాజంవారు ఉపనిషత్తులు, గీత మొదలైన గ్రంథాలను దేశ, విదేశాలలో ప్రచారం చేశారు. క్రైస్తవులను, బైబిల్ ను వ్యతిరేకిస్తూ, హిందూ మతప్రాచీనతను పొగుడుతూ ప్రచారం సాగించారు.

భారతదేశంలో అనిబిసెంటు కేవలం మత ప్రచారంతో గాక, రాజకీయాలలో ప్రవేశించి, హోంరూల్ కావాలన్నది. ఇదికూడా ఆమెపట్ల ఆకర్షణకు మరో కారణంగా పేర్కొనవచ్చు. వృద్ధాప్యంలోబడిన అనిబిసెంటు తనకు వారసులు కావాలని, జిడ్డు కృష్ణమూర్తిని ఎంపిక చేసింది. చిత్తూరు జిల్లాకు చెందిన జిడ్డు నారాయణయ్య కుమారులను దత్తత స్వీకరించింది. కృష్ణమూర్తి, నిత్యానంద అనే యిరువురినీ అడయార్ దివ్యజ్ఞన సమాజంలో పెంచి, చదువు చెప్పించి, వారసుల్ని చేయ సంకల్పించింది. వారిని ఇంగ్లండ్ పంపి పై చదువులు చెప్పించింది. 1909లో స్వీకరించిన జిడ్డు కృష్ణమూర్తిని అడయార్ లో లెడబీటర్ ఆధ్వర్యాన అట్టిపెట్టారు. కృష్ణమూర్తి అందమైన కుర్రవాడు లెడీబీటర్ పెళ్ళికాని బిషప్. అతడు కృష్ణమూర్తి పట్ల ఆకర్షితుడై అక్రమ లైంగిక సంబంధానికి దిగాడు. ఈ వార్త దివ్యజ్ఞాన సమాజంలోనేగాక దేశమంతటా పొక్కింది. కృష్ణమూర్తి తండ్రి కోర్టుకు వెళ్ళి తన కుమారులను తనకు అప్పగించమన్నాడు. హైకోర్టులో చాలాకాలం కేసు సాగింది. సి.పి.రామస్వామి అయ్యర్ యీ కేసులో అనిబిసెంటుకు వ్యతిరేకంగా వాదించాడు. కోర్టు అజమాయషీలో పిల్లల సంరక్షణ సాగాలని తీర్పు వచ్చింది. కాని అనిబిసెంటు ప్రీవీకౌన్సిల్ కు వెళ్ళి తన అజమాయిషీలోనే వుండాలనే వాదనలో నెగ్గింది. ఆ తరువాత కృష్ణముర్తి ఇంగ్లండ్ లో ఉన్నత చదువులు కొనసాగించాడు.

జిడ్డు కృష్ణమూర్తి యుగపురుషుడని అనిబిసెంటు ప్రకటించింది. దివ్యజ్ఞాన సమాజంలో ప్రముఖస్థానం ఆక్రమించిన జిడ్దు కృష్ణముర్తి క్రమేణా మూఢ నమ్మకాలు, అనిబిసెంటు ప్రచారాలపట్ల ఏవగింపు పెంచుకున్నాడు. తాను ప్రవక్తను కానని స్పష్టంచేశాడు. దివ్యజ్ఞాన సమాజంతో తెగతెంపులు చేసుకున్నాడు. అనిబిసెంట్ యిదంతా చూచి కుంగిపోయింది. కాని చేసేదిలేక దిగమింగింది. కృష్ణమూర్తి ఒకవైపున అనిబిసెంటును, ఆమె అనుచరులనూ తీవ్రంగా దుయ్యబట్టాడు. ఆ తరువాత జిడ్డు కృష్ణమూర్తితో బాటుగా, చాలామంది దివ్యజ్ఞాన సమాజానికి దూరమయ్యారు. అనిబిసెంటుకు కేవలం మద్రాసులో కొందరు బ్రాహ్మణులు మాత్రం అనుచరులుగా మిగిలారు. దివ్యజ్ఞాన సమాజం నానాటికీ క్షీణించింది. జిడ్డు కృష్ణమూర్తి అమెరికా వెళ్ళిపోయాడు.

1916లో హోంరూల్ లీగ్ స్థాపించిన అనిబిసెంటు 1917లో కాంగ్రెసు అధ్యక్షురాలైంది. ఇంగ్లండ్ కూ, ఇండియాకు పూర్వజన్మ సుకృత సంబంధం వున్నదన్నది! గాంధిజీ రాజకీయాలలో ప్రవేశించి భారత స్వాతంత్రోద్యమంలో ముమ్మరంగా ఉద్యమాలు చేబట్టిన తరువాత అనిబిసెంటు తగ్గిపోయింది. సత్యాగ్రహాలు, నిరాహారదీక్షలు, పన్నుల ఎగవేత వంటివి మంచిదికాదని అనిబిసెంటు చెప్పింది. జీవితం చివరి ఘట్టంలో అనిబిసెంటు ఆకర్షణ బాగా క్షీణించింది. 1933లో అనిబిసెంటు మరణించింది.

అనిబిసెంటు 1923లో ఇంగ్లీషులోకి గీతను అనువదించింది. అప్పటికి బ్లావట్ స్కీ ప్రభావం ఆమెపై క్షీణించినా, దివ్యజ్ఞాన సమాజంవారు భక్తి, నిష్కామకర్మలకు ప్రాధాన్యత యిచ్చారు. రామకృష్ణ, వివేకానంద ఆశ్రమాలకూ దివ్యజ్ఞాన సమాజం వారికీ ఎప్పుడూ పడేదికాదు.

1917లో అనిబిసెంటు ఆధ్వర్యాన కాంగ్రెసు సమావేశం అంటరానివారిపట్ల సానుభూతి తీర్మానం చేసింది. విచక్షణ పోవాలన్నది. కాని అంతకుముందు అనిబిసెంటు రచనలలో అగ్రకులాలవారిని, అంటరానివారిని పాఠశాలల్లో కలిపి కూర్చోబెడితే అనర్ధాలు, అంటురోగాలు వస్తున్నట్లు వ్యాఖ్యానించింది.

గాంధీజీకి అనిబిసెంటుకు పడేదికాదు. గాంధేయ పద్ధతులను రాజకీయాలలో ఆమె నిరసించి, గర్హించింది. 1917లో బెనారస్ లో గాంధీ మాట్లాడుతూ వైస్రాయిని ఖండిస్తుండగా, ఉపన్యాసం ఆపేయవలసిందిగా అధ్యక్షుడిని అనిబిసెంటు కోరింది. రానురాను రాజకీయాలలో గాంధీది పై చేయి కాగా,అనిబిసెంటు పలుకుబడి తగ్గుముఖం పట్టింది. రాజకీయాలను, మతాన్ని కలిపేసి, సెక్యులర్ ధోరణులకు తావులేకుండా అనిబిసెంటు ప్రాతిపదికలు వేసింది. అసలే అజ్ఞానంతో, నిరక్షరాస్యతతో కొట్టుమిట్టాడుతున్న భారతదేశానికి అనిబిసెంటు, దివ్యజ్ఞానం పేరిట మరింత కట్టుకధల, పురాణాల, అంధకారాన్ని విరజిమ్మింది. దేశంలో కొద్దిమంది చదువుకున్న వారిని ఇంకా వెనక్కు నడిపించింది.

ఛార్లస్ బ్రాడ్లాతో కలసి యూరోప్ ను ఉర్రూతలూగించిన అనిబిసెంటు 50 సంవత్సరాల పాటు ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఆమె కీర్తి అలా అత్యున్నత దశకుపోయి, పతనమైంది. ఎందుకని? తలాతోక లేని మూఢనమ్మకాలను ప్రజలపై రుద్ది, నమ్మించడానికిగాను అనిబిసెంటు హేతువాదాన్ని వదలేసింది. తాత్కాలికంగా ఆమెకు కొందరు నీరాజనం పట్టి, డబ్బిచ్చి, గౌరవించి, పీఠాధిపతిగా చేసి వుండొచ్చు. గాని సైన్సు వ్యాపించేకొద్దీ ఛార్లస్ బ్రాడ్లా నిలబడతాడేగాని అనిబిసెంటుకాదు. మానవ వివేచనకు పదునుపెట్టే రీతులే ప్రజల్ని ముందుకు నడిపిస్తాయి. అనిబిసెంట్ మతపరమైన రచనలు చదువుతుంటే కావాలని అజ్ఞానాన్ని ప్రసాదంగా పంచిపెట్టినట్లనిపిస్తుంది. సామాన్యులలో దివ్యజ్ఞానం వ్యాపించకపోవడం కూడా వారి మంచికే అనవచ్చు.

- హేతువాది, ఆగష్టు 1989