అబద్ధాల వేట - నిజాల బాట/భారత ముస్లింలలో పునర్వికాసం ఎందుకు రాలేదు ?

వికీసోర్స్ నుండి
పునర్వికాస పరిణామం
భారత ముస్లింలలో పునర్వికాసం
ఎందుకు రాలేదు?

ముస్లింలు భారతదేశంలో వందలాది సంవత్సరాలు పరిపాలించారు. దండెత్తి వచ్చిన వివిధ ముస్లింపాలకులకు దేశంలో ఎందరో సహాయపడ్డారు. ఇస్లాంలో కొందరు చేరిపోయారు. హిందూమతంలో లేని సమానత్వం ఇస్లాంలో లభిస్తుందని ఆశించారు. యూరోప్ లో చారిత్రక పాత్ర నిర్వహించి, గ్రీక్ , రోమన్ నాగరికతల్ని క్రైస్తవులకు అందించిన ముస్లింలు క్రమేణా తమ ఔన్నత్యాన్ని కోల్పోయారు. ఆ స్థితిలో వారు ఇండియాకు వచ్చారు. అసలే మత మౌఢ్యంలో కొట్టుకుంటున్న ఇండియాలో మరో మతాన్ని తెచ్చిపెట్టారు. బ్రిటిష్ వారు దేశపాలనను చేబట్టిన తరువాత కూడా ముస్లింలు తమ గతాన్ని మరచిపోలేక బాధపడుతూ వచ్చారు. మతాన్ని, సమాజాన్ని వేరుచేసి చూడలేని ముస్లింలు, అసహనాన్ని పెంచుకున్నారు. తమ కష్టాలన్నిటికీ హిందువులే కారణమని మతనాయకులు బోధిస్తుంటే, సామాన్య ముస్లింలు అసలు వాస్తవాల్ని పరిశీలించకుండా, గుడ్డిగా మతనాయకుల మాటల్ని నమ్ముకున్నారు. దేశంలో రానురాను ముస్లింలలో మత మౌఢ్యం విపరీతంగా పెరిగిపోయింది. భారత ముస్లింలలో షావాలి యుల్లాను అనుసరించేవారు అత్యధిక సంఖ్యలో వుండగా, కొందరు సర్ సయ్యద్ అహమ్మద్ ఖాన్ ధోరణి సబబు అనుకుంటున్నారు. సరిహద్దు గాంధి అని పేరొందిన ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ పంధాను పాటించగలవారి సంఖ్య వేళ్ళపై లెక్కించవచ్చు. సర్ సయ్యద్ అహమ్మద్ ఖాన్ పునర్వికాసానికి కొద్దిగా నాంది పలికాడు. ముస్లింలు పాశ్చాత్య విద్యను చదవాలన్నాడు. ఆ మాత్రానికే ఆయన్ను "కాఫిర్" అని ముస్లిం మతగురువులు (ఉలేమాలు) పేరెట్టి తిట్టిపోస్తూ 'ఫత్వా' జారీ చేశారు.

ముస్లింలలో స్వల్పంగానైనా పునర్వికాసానికి బీజాంకురాలు నాటింది సర్ సయ్యద్ అహమ్మద్ ఖాన్ అని చెప్పవచ్చు. ఆయనలో మతమౌఢ్యం తక్కువ అయితే ముస్లింలు ఒకప్పుడు పరిపాలించారనే విషయం విస్మరించలేని స్థితిలో ఖాన్ కూడా వుండేవాడు. అలీఘడ్ లో ముస్లింల ఆధునిక విద్యకు ప్రాతిపదికలు వేసిన సర్ సయ్యద్,పక్కనే ముస్లింల వేర్పాటువాదానికి కూడా బీజాంకురాలు నాటాడు.

సర్ సయ్యద్ అహమ్మద్ ఖాన్ (1817-1898) మతాన్ని, సైన్సు ను సమన్వయీకరించే ప్రయత్నం చేశాడు. ఇవి రెండూ పరస్పర విరుద్ధాలు కావన్నాడు.

సిపాయి తిరుగుబాటు కాలంలో బ్రిటిష్ వారి ఉద్యోగిగావున్న సర్ సయ్యద్, తిరుగుబాటును ఖండించి, ముస్లింలు బ్రిటిష్ వారికి విధేయులుగా వుండాలన్నాడు. ఒకవైపున ముస్లింల ఆధిపత్యం క్షీణించిపోగా, ఇస్లాంను జాగ్రత్తగా నిర్వచిస్తూ ఆధునికతతో సర్దుబాటు చేయాలని సర్ సయ్యద్ ప్రయత్నించాడు. సైన్సు, ఇస్లాంలు విరుద్ధాలు కావంటూ వ్యాఖ్యానాలు చేసి, అలీఘడ్ లో 1862లో సైంటిఫిక్ స్థాపించాడు. 1875లో ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను స్థాపించిన సర్ సయ్యద్ ఆధునిక విద్యను ముస్లింలలో వ్యాపింపజేయాలని సంకల్పించాడు. శాస్త్రీయ చారిత్రక ప్రాధాన్యత గల పుస్తకాలను ఉర్దూలోకి అనువదించాలని ప్రోత్సహించాడు. ఈ మాత్రానికే ముస్లిం మత గురువులు మండిపడ్డారు. వారి ఆగ్రహానికి గురికాదలచుకోక,మత విద్యవరకూ వారిదే పెత్తనం అన్నాడు. అది సాకుగా తీసుకొని మతగురువులు తమ ఆధిపత్యాన్ని అట్టిపెట్టుకొని సైన్సు విద్య ప్రబలకుండా చూచారు. ముస్లింలలో రినైజాన్స్ రాకపోడానికి ఆదిలోనే ఆటంకం ఏర్పడిందన్నమాట.

దేశంలో కాంగ్రెసు పార్టీ ఏర్పడినప్పుడు, అలీఘడ్ లో సర్ అహమ్మద్ ముస్లింల ఆధునీకరణ ఆరభించాడు. జాతీయ కాంగ్రెస్ లో అడ్డుపడ్డాడు. ఇది బ్రిటిష్ వారికి నచ్చింది. అలీఘడ్ ముస్లిం విద్యాసంస్థలకు మద్దతు ప్రకటించిన బ్రిటిష్ వారు, చీలించి పాలించడానికి సర్ సయ్యద్ తోడ్పడ్డాడు. రాష్ట్ర కేంద్ర శాసనసభలలో ప్రాతినిధ్యం విస్తృత ప్రాతిపదికపై వుండాలని కాంగ్రెసు కోరితే,సర్ సయ్యద్ వ్యతిరేకించాడు. అలగా జనం అలాంటి ఉన్నత సంస్థలలో ప్రాతినిధ్యం వహించరాదని సర్ సయ్యద్ ఉపన్యాసాలిచ్చాడు. ఇది బ్రిటిష్ వారి ధోరణికి సరిపోయింది. ముస్లింల పాలనలో రాజభాషగా ఉర్దూ వుండేది. దీనిస్థానే ప్రజలు మాట్లాడుకునే హిందీ ప్రవేశపెట్టాలని ఉత్తరోత్తరా కాంగ్రెసు కోరింది. ముస్లిం ఔన్నత్యానికి ఉర్దూ మారురూపం అని భావించిన సర్ సయ్యద్ యీ మార్పును కూడా వ్యతిరేకించాడు. హిందువులు-ముస్లింలు కలసి పనిచేయడం కష్టమని సర్ సయ్యద్ జోస్యం చెప్పాడు.

సర్ సయ్యద్ గాని ఆయన అనుచరులుగాని ముస్లింలను రాజకీయాలలో ప్రోత్సహించలేదు. సాంఘిక సంస్కరణ సైతం ఆశించలేదు. కేవలం విద్యపై వారు దృష్టిపెట్టారు. తరువాత ధోరణి మార్చుకొని భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించిన కొద్దికాలానికే మహమ్మదీయ విద్యాసభను ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ హిందువులదని,దీనినుండి దూరంగా వుండాలని సర్ సయ్యద్ ముస్లింలకు చెప్పాడు. దేశంలో బ్రిటిష్ పాలన కొనసాగాలని ఆయన కోరుకున్నాడు.

సిపాయీల తిరుగుబాటులో ముస్లింలు పాల్గొనలేదనీ,అది హిందువుల చర్య అనీ సర్ సయ్యద్ స్పష్టం చేశాడు. ఆయన అప్పట్లో యీస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగిగా పనిచేస్తుండేవాడు. క్రైస్తవులైన బ్రిటిష్ వారి పాలనకు ముస్లింలు వ్యతిరేకులు కాదంటూ, తిరుగుబాటులో ఎవరైనా పాల్గొంటే అలాంటి ముస్లింలు ద్రోహం చేసినట్లే అన్నాడు.

బ్రిటిష్ పాలకులు భారతీయులు తెలుసుకొని చట్టాలు చేయాలని, ఇందుకుగాను శాసనసభలలో భారత ప్రతినిధులుండాలన్నారు సర్ సయ్యద్. అయితే ఉన్నత వంశస్తులే అందులో ప్రవేశించాలన్నాడు!

ముస్లిముల్లో కొద్దోగొప్పో పునర్వికాసభావాలు ఏర్పడ్డాయంటే, సర్ సయ్యద్ వెలిబుచ్చిన, స్థాపించిన విద్యాసంస్థలే కారణం. పాత సంప్రదాయాల విద్యకు బదులు ఇంగ్లీషు చదువులు అవసరమని ఆయన ముస్లింలకు నచ్చజెప్ప ప్రయత్నించాడు. కాని ఛాందసులు వినిపించుకోలేదు. సంప్రదాయ విద్య ముస్లింలను వెనుకబడినవారిగా అట్టిపెడుతున్నదని సత్యాన్వేషణకు దోహదం చేయడం లేదనీ సెలక్ట్ కమిటీ ముందు చెప్పాడు. పాత చదువులలో కట్టుకథలు జాస్తిగా వున్నాయనీ, ఆధారాలు తక్కువనీ అంటూ, అతిశయోక్తులతో నమ్మించే ప్రయత్నాలు జరిగాయని పాత ముస్లిం విద్యను ఆయన ఖండించారు. దీనివలన కాలయాపన విపరీతంగా జరిగిందన్నారు. తాను చెప్పేది ఛాందస ముస్లింలకు నచ్చదని తనకు తెలుసునని కూడా ఆయన చెప్పారు. అలాంటి భావాలు వెల్లడించినందుకు ముస్లిం సనాతనులు సర్ సయ్యద్ పై దుమ్మెత్తి పోశారు. అయితే బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన విద్యను ముస్లింలు చదవపోతే,వారు శాశ్వతంగా వెనుకబడే వుంటారని కూడా సర్ సయ్యద్ హెచ్చరించారు. పాశ్చాత్య విద్యను, సైన్సును ఆహ్వానించి, 1877లొ మహమ్మదీయ ఆంగ్లో ఓరియంటల్ కాలేజి స్థాపించిన సర్ సయ్యద్ ఆ విధంగా ముస్లిముల్లో కొందరిని సరైన బాటలో నడిపించే ప్రయత్నం చేశాడు.

ఎన్నికల పద్ధతిలో ప్రతినిధులు శాసనసభలకు వచ్చే పద్ధతి వలన అధిక సంఖ్యాకులైన హిందువులకు బలం లభిస్తుంది. మతద్వేషాలు విపరీతంగా వుంటూ,కుల చీలుకలు రగులుకొంటున్న చోట యిలాంటి ప్రాతినిధ్యం మంచిది కాదని సర్ సయ్యద్ అభిప్రాయం వెల్లడించాడు. అల్పసంఖ్యాకులు దెబ్బతింటారని, అధికసంఖ్యాకులు పెత్తనం చేస్తారని ఆయన ముస్లింలను భయపెట్టాడు.

కాంగ్రెస్ పార్టీ తమపెట్టిన జాతీయోద్యమంలో పాల్గొనవద్దని సర్ సయ్యద్ స్పష్టంగా ముస్లింలను కోరాడు. కాంగ్రెస్ పార్టీ వలన ముస్లింలకు ప్రయోజనం చేకూరదన్నాడు. ముస్లింలు అధిక సంఖ్యాకుల ఉద్యమానికి దూరంగా వుండాలంటూనే, పాశ్చాత్యవిద్యను అభ్యసించాలని చెప్పిన సర్ సయ్యద్ పరస్పర విరుద్ధంగా ప్రవర్తించాడు. వేర్పాటు ధోరణులకు ఆయన బీజాలు నాటాడు. కనుక పాశ్చాత్య విద్యను అభ్యసించిన ముస్లింలు సైతం మత ప్రభావం వలన జాతీయోద్యమానికి దూరంగా వున్నారు. ఆ మేరకు ముస్లిం మతగురువులు ముస్లింలపై తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నారు.

భారతీయ ముస్లింలలో అత్యంత ప్రాధాన్యత చూపెట్టిన మహమ్మద్ ఇక్బాల్ (1873-1938)సైతం, ఆధునీకరణస్థానే, ఇస్లాం పునరుద్ధరణే కోరుకున్నాడు. ఆధునిక ప్రపంచ రీతుల్ని ఇస్లాం పద్ధతులలోకి మలచుకోవాలన్నాడు. గతాన్ని పూర్తిగా తుడిచిపెట్టడం సాధ్యంకాదని ఆయన రాశాడు. సెక్యులర్ భావాలను వ్యతిరేకించాడు. మతాన్ని, రాజ్యాన్ని,రాజకీయాలను మిళితం చేయాలన్నాడు. అఖిలభారత ముస్లింలీగ్ ను ప్రోత్సహించాడు. నాస్తికత్వాన్ని, పదార్ధవాదాన్ని వ్యతిరేకించాడు. జాతీయవాదం, సోషలిజం స్థానే ఇస్లాం కావాలని ఇక్బాల్ కోరుకున్నాడు. పెట్టుబడిదారీ విధానం కూడా పనికిరాదన్నాడు. రాజకీయవ్యవస్థ అంతా ఇస్లాం పరంగా సాగాలన్నాడు. అయితే మార్క్సిజాన్ని,లెనిన్ ను మెచ్చుకుంటూ పద్యాలు రాశాడు. హిందూ-ముస్లిం ఐక్యతను కోరిన ఇక్బాల్,క్రమేణా పాకిస్తాన్ భావానికి పితామహుడయ్యాడు. ఇప్పటికీ ఆయన ఆలాపించిన 'హిందుస్తాన్ హమారా' గేయాన్ని చాలామంది ఆప్యాయంగా పాడుకుంటూనే వున్నారు. కాని, భారతజాతీయవాదంలో ముస్లింలు అల్పసంఖ్యాకులుగా బాధితులౌతారనే దృష్టిలో ఆయన జాతీయోద్యమానికి అనుకూలించలేదు.

భారతదేశంలో ముస్లింలు పెద్ద అల్పసంఖ్యాకవర్గంగా ఇక్బాల్ పేర్కొని,క్రమేణా పాకిస్తాన్ భావాన్ని ప్రచారం చేశాడు.

ముస్లిం నాయకుల వేర్పాటుధోరణి బ్రిటిష్ పాలకులకు నచ్చింది. కాంగ్రెస్ ను బలహీనపరచడానికి ముస్లింలను ప్రోత్సహించారు. సర్ సయ్యద్ అనంతరం, బెంగాల్ విభజన ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని, లార్డ్ మింటో ఈ ప్రయత్నాలు చేశాడు. ముస్లింలు కొందరు ఆగాఖాన్ నాయకత్వాన 1906 అక్టోబరు 1న సిమ్లాలో వైశ్రాయిని కలసి, తమకు ప్రత్యేక సౌకర్యాలు, ఏర్పాట్లు, ప్రాధాన్యత కావాలని అడిగాడు. 1906 డిసెంబరు 30న ముస్లింలిగ్ ఏర్పడింది. అదే వేర్పాటుకు నాంది అయింది. అన్ని సంస్థలలోనూ ముస్లింలకు కేటాయింపులు, వేరే ప్రాధాన్యతలు కోరడం ప్రారంభమైంది. కాంగ్రెస్ ను వ్యతిరేకించడం కూడా మొదలైంది. ముస్లింలు జాతీయ జీవనస్రవంతిలో పాల్గొనకుండా వేరుచేయడంలో వారిని అన్ని విధాల బ్రిటిష్ వారు ప్రోత్సహించారు. చీలించి పాలించే విధానం చక్కగా ప్రయోగించారు. అదే నేటికీ అంటుజాఢ్యం వలె పట్టుక వెన్నాడుతున్నది.

జాతీయోద్యమంలో వున్న కాంగ్రెస్ నాయకులు ఎలాగైనా ముస్లింలను కలుపుకపోవాలని చూచారు. పండిత మదన్ మోహన్ మాలవీయా వంటి వారు ముస్లింలకు ప్రత్యేక సౌకర్యాలు, మినహాయింపులు (Weightages) వ్యతిరేకించారు. హిందువుల ఐక్యత పేరిట గణపతి ఉత్సవాలు తిరగదోడిన తిలక్ మాత్రం, బ్రిటిష్ వారిని వ్యతిరేకించే నిమిత్తం, అవసరమైతే ముస్లింలకు కేటాయింపులు సైతం యివ్వాలని వాదించారు. లక్నో కాంగ్రెసు సభలలో తిలక్ యిలాంటి ధోరణి అనుసరించి, జాతీయ జీవన స్రవంతిలో ముస్లింలను కలుపుక పోవాలనే ఆశించాడు.

ఈలోగా ప్రపంచవ్యాప్తంగా అనేక పరిణామాలు సంభవించాయి. మొదటి ప్రపంచ యుద్ధానంతరం, ముస్లింల ఆటోమన్ సామ్రాజ్యం కూలిపోతుండగా, ముస్లింలు కలవరపడ్డారు. ఖిలాఫత్ ఉద్యమం ఆరంభమైంది. అప్పుడే జాతీయోద్యమంలో ప్రవేశించిన గాంధి ఖిలాఫత్ ఉద్యమాన్ని వెనకేసుకొచ్చారు. టర్కీలో ముస్తాఫా కెమాన్ పాషా అనేక సంస్కరణలు తలపెట్టి, ఖలీఫా వ్యవస్థను అంతమొందించేశారు. మనదేశంలో ఖిలాఫత్ ఉద్యమంలో పాల్గొన్న ముస్లింలు కాంగ్రెసుకు దూరమయ్యారు. జాతీయోద్యమానికి వ్యతిరేకులయ్యారు. మిగిలిన కొద్దిమంది కాంగ్రెస్ లో కొనసాగుతూ ముస్లింలను తమవెంట తీసుకరాలేకపోయారు. అబ్ధుల్ కలాం ఆజాద్ వంటి వారిని జాతీయ ముస్లింలని నిందించారుకూడా. ఆ విధంగా హిందూ-ముస్లిం ఐక్యత కోసం గాంధీ చేసిన కృషి విఫలమైంది. మత ప్రాతిపదికలతో జాతీయోద్యమం నడపడంలో వున్న ప్రమాదం అదే. పునర్వికాసానికి కూడా యీ ధోరణులే అడ్డొచాయి. లక్నో ఒడంబడిక ప్రకారం ముస్లింలు తమ మతాన్ని యిష్టం వచ్చినట్లు ప్రచారం చేసుకోవచ్చు, ఆచరించవచ్చు. అయినా వారు తృప్తిపడలేదు. తమ ఉర్ధూభాషకు వేరే గుర్తింపు ఉండాలన్నారు. ఎన్నికలలో కేటాయింపులు కోరారు.

మతపరంగా ఎవరినీ విచక్షణతో చూడరాదని నెహ్రూ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయాన్ని ప్రకటించింది. మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన ప్రకటించిన ముసాయిదా తీర్మానాలలో యీ విషయం స్పష్టం చేశారు. ఇదికూడా ముస్లింలకు తృప్తినివ్వలేదు.

భారత రాజ్యాంగ చట్టానికి 1935లో వచ్చిన సవరణల దృష్ట్యా రాష్ట్రాలకు స్వయంపాలనా ప్రతిపత్తి లభించింది. 1937లో జరిగిన ఎన్నికలలో వివిధ పార్టీలు పోటీచేశాయి. కాంగ్రెసు ఆరు రాష్ట్రాలలో ఆధిక్యత పొంది,అధికారాన్ని చేబట్టింది. ముస్లింలీగ్ తన వేర్పాటు ధోరణి మరోసారి ప్రదర్శించి, కాంగ్రెస్ తో సహకరించలేదు. జమీందార్లకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సంస్కరణలు కోరగా, ముస్లిం జమిందార్లు వ్యతిరేకించారు. మహమ్మదాలీ జిన్నా నాయకత్వాన వేర్పాటు ధోరణులు బాగా ప్రబలాయి. బ్రిటిష్ వారు యధాశక్తి వారిని ప్రోత్సహించారు. 1939లో కాంగ్రెస్ మంత్రివర్గాలు ఆయా రాష్ట్రాలలో రాజినామా యిచ్చాయి. బ్రిటిష్ వారు చెప్పా పెట్టకుండా రెండవ ప్రపంచ యుద్ధంలో భారతీయుల్ని దించారని కాంగ్రెస్ అన్నది. ముస్లింలీగ్ మరోవైపున కాంగ్రెస్ ను దుయ్యబట్టింది.

1940 మార్చిలో జరిగిన లాహోర్ సమావేశంలో ముస్లింలు పాకిస్తాన్ కావాలన్నారు. అంతటితో ముస్లింలను జాతీయ జీవనంలో కలపడమనేది అసంభవమని తేలిపోయింది.

ఆ తరువాత పాకిస్తాన్ సృష్టిని జాతీయనాయకులు వ్యతిరేకించినా,స్పర్థలు పెరిగాయెగాని,తగ్గలేదు. గాంధి ఆశలన్నీ అడియాశలయ్యాయి. మత ప్రాతిపదికలతో సమస్యలు పరిష్కారం కావని ఉద్యమ నాయకులు గ్రహించలేదు.

ముస్లింలకు ప్రత్యేక సౌకర్యాలు,కేటాయింపులు కావాలని పట్టుబట్టిన జిన్నా రానురాను వేర్పాటును సమర్థించాడు. జాతీయజీవనంలో తమది వేరే ప్రవాహం అని జిన్నా అంటుంటే,కాదని నెహ్రూ వాదించాడు. జనాభా ప్రాతిపదిక కంటె అదనంగా తమకు స్థానాలు కేటాయించాలని కూడా జిన్నా కోరాడు. ముస్లింలు కోరే జాతీయవాదంతో కాంగ్రెస్ రాజీపడాలని జిన్నా ఉద్దేశ్యం. నెహ్రూ వ్యతిరేకించాడు. ఈ సంఘర్షణే క్రమేణా పాకిస్తాన్ కు దారితీసింది. ముస్లింలు వెళ్ళిపోయి, వేరే పొయ్యి పెట్టుకోడానికి హిందూ నాయకులకు యిష్టమే. ఎప్పటికైనా ముస్లింలతో తలనొప్పి అని వారి భావన. ముస్లింలు కోరింది యిచ్చి వారిని అట్టిపెట్టాలని కాంగ్రెస్ నాయకులు కొందరు భావించినా అది సాధ్యపడలేదు. ముస్లింలు జాతీయ రాజకీయ ప్రాతిపదికగా కోర్కెలు వెల్లడించలేదు. మత ప్రాతిపదికగా వారడిగేవన్నీ వున్నాయి. అంటే కాంగ్రెస్ ఆశించిన సెక్యులర్ ధోరణికి ముస్లిం కోర్కెలు విరుద్ధం. వారు ఇస్లాం మతాన్ని వ్యాపింపచేయాలని, రాజకీయాలు కూడా ఇస్లాం పరంగా వుండాలని అడిగారు. జమాతే ఉలేమా హింద్ అధ్యక్షుడు మౌలానా హుస్సేన్ అహమ్మద్ యీ విషయాలను సమావేశాలలోనే స్పష్టంచేశాడు. జాతీయ ముస్లింల ప్రకారం ఇండియాను క్రమేణా ఇస్లాం చెయ్యాలి. ఇది సాధ్యం కాదని గ్రహించి జిన్నా పాకిస్తాన్ కోరాడు. పాకిస్తాన్ కోరిన జిన్నా హిందువులను మత జాతీయవాదులని, గాంధి , నెహ్రూలు హిందూ ఛాందసులనీ చిత్రీకరించాడు. ఇస్లాం రాజ్యంలో కేవలం మతం వుండదు. రాజకీయాలు, ఆర్ధిక, సాంఘిక, సాంస్కృతిక రంగాలన్నీ ఇస్లాం నిర్దేశిస్తుంది. ఇస్లాంను మార్చేదేమీ లేదని వారి మతవాదుల ఉద్దేశం. కనుక ఇస్లాంతో రాజీ కుదరడం జాతీయవాదులకు సాధ్యపడలేదు. హిందువులు పాలించే ఇండియాలో ముస్లింలు స్వేచ్ఛగా వుండలేరని ఇస్లాం నమ్మకస్తుల ధోరణి.

దేశవిభజన జరగడం, లక్షలాది ముస్లింలు పాకిస్తాన్ పోవడం, అలాగే హిందువులు ఇండియా రావడం చరిత్రలో భాగంగా మారింది. అప్పుడు జరిగిన హింసాకాండ, హత్యలు, మతద్వేషం గాఢంగా ఉభయులలోనూ నాటుకపోయాయి. దేశవిభజన కారణంగా ఇండియాలో ముస్లింల శాతం 23 నుండి 10 శాతానికి తగ్గిపోయింది. కుటుంబ నియంత్రణ ముస్లింలు మతరీత్యా పాటించరు. జనాభా పెంచుకొని, క్రమేణా, ఎన్నాళ్ళకైనా సరే, ఇండియాను ఇస్లాం రాజ్యం చేసుకోవాలని ముస్లిం మతవాదుల లక్ష్యం. ఇది అప్పట్లో సాధ్యమయ్యే విషయం కాదని జిన్నా గ్రహించి, పాకిస్తాన్ కావాలన్నాడు. దేశంలో వున్న ముస్లింలకే సమస్య పట్టుకున్నది.

మిగిలిన కొద్దిమంది జాతీయ ముస్లిం నాయకులు పదవులలో, పార్టీలలో, రాజకీయాలలో పాల్గొన్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ తొలి నెహ్రూ మంత్రిమండలి నుండీ అధికారంలో వున్నారు. మతవాదం విడనాడమని ఆయన చేసిన విజ్ఞప్తిని ముస్లింలు పెడచెవినబెట్టారు. ముస్లిం మతనాయకులదే ఆధిపత్యం అయింది.

దేశవిభజన జరిగిన కొద్దిరోజులకే ఒక ఛాందస హిందువు గాంధీని హత్య చేశాడు. కొంతకాలం ముస్లింల సమస్య ప్రకోపించకుండా ఆగిపోయింది.

రాం, రహీం ఒకటేనని, ఈశ్వరుడు-అల్లా అంతా ఒకే దైవం అని గాంధీ నినదించాడు. ఒక చేత్తో గీత,మరో చేత ఖురాన్ పట్టుకొని ప్రార్థనలు చేశాడు.మత సామరస్యతకు యీ ధోరణి ఉపకరిస్తుందనుకున్నాడు. మతధోరణులు మార్చుకోకుండానే హిందువులు, ముస్లింలు కలసి పనిచేయవచ్చని గాంధి ఆశించాడు. ముస్లింలను మ్లేచ్ఛులని సనాతన హిందువులంటుంటే, హిందువులు కాఫిర్లని ముస్లింలు భావించారు. వేదికలపై మర్యాదలు యిచ్చిపుచ్చుకున్నా, హిందూ ముస్లిం భాయి భాయి అనేది హృదయపూర్వకంగా ఎవరూ నమ్మలేదు. ఖురాన్,గీత ఒకటే అంటే అసలే ఒప్పుకోలేదు. సర్ సయ్యద్ అహమ్మద్ ప్రారంభించిన వేర్పాటువాదం పెరిగిపోయి, పాకిస్తాన్ కు దారితీసినా గాంధి నమ్మకంలో మార్పులేకపోవడం ఆశ్చర్యకరం. మతపరంగా రాజకీయాల్ని చూస్తే వచ్చే చిక్కు ఏమిటో గాంధి గ్రహించలేదు.

ముస్లింలు ప్రతి సమస్యను మత ప్రాతిపదికగా చూస్తున్నారు. జాతీయ, మానవతా దృక్పధాలతో చూడాలని గాంధి ఆశించాడు. అది జరగలేదు. బ్రిటిష్ వారు వెళ్ళిపోతే,హిందు-ముస్లింల సమస్య సామరస్యంగా పరిష్కారమౌతుందనుకోవడం కూడా భ్రమే. సాంస్కృతిక,సామాజిక ధోరణులన్నీ మత ప్రాతిపదికతో చూచినంత కాలం,తీవ్ర అభిప్రాయ భేదాలు తప్పవు. మా మతమే అత్యున్నతమైందని,ప్రపంచ వ్యాప్తంగా మతాన్ని అందరిచేత అంగీకరింపజేయాలనే ధోరణి వున్నంత కాలం, మతసామరస్యం పగటి కలే.

స్వాతంత్ర్యానంతరం ముస్లింలు:

దేశవిభజన జరిగిన అనంతరం, పునర్వికాసానికి చక్కని అవకాశం లభించింది. సెక్యులర్ రాజ్యాంగాన్ని రూపొందించారు. కాని అటు హిందూ సనాతనులు, ఇటు ముస్లిం చాదస్తులు కూడా సెక్యులర్ ధోరణులకు ఒప్పుకోలేదు. మొట్టమొదట యూనీఫాం సివిల్ కోడ్ వద్దన్నారు. తమ మతపరమైన చట్టాలే తమను పాలించాలని ముస్లింలు పెట్టుబట్టారు.

ముస్లింలలో ఎన్నో చీలికలు ఏర్పడ్డాయి. రాజకీయంగా వివిధ పార్టీలలోకి ప్రవేశించిన ముస్లింలు, అత్యధికంగా కాంగ్రెసులో మిగిలిపోయారు. కొద్దిమంది కమ్యూనిష్టు పార్టీలో వున్నారు. జమాతే ఇస్లామి ముస్లింల మతపరమైన విషయాలలో ఆధిపత్యం వహించింది. 1964 నాటికి ముస్లిం మజ్లీస్ ముషావరత్ ఏర్పడింది. వివిధ పార్టీలలో, ముఠాలలో వున్న చదువుకొన్న ముస్లింలు సైతం మతపరంగా ఒకే ధోరణి అవలంభించడం ప్రారంభమైంది. ఇస్లాంను నిశితపరిశీలనకు గురిచేయడానికి వీరు ససేమిరా, ఒప్పుకోలేదు. సెక్యులర్, ఆధునిక ధోరణిలో రాజ్యం కొనసాగించాలన్నప్పటికీ, ముస్లింలు తమకు ఇస్లాం ప్రాతిపదికే వుండాలన్నారు. ప్రజాస్వామిక విధానంలో ముస్లింలు యిమడలేకపోతున్నారు, ఒకప్పుడు పరిపాలన సాగించిన ముస్లింలు ఆ చరిత్రను మరువలేకపోతున్నారు. అల్పసంఖ్యాకవర్గాలుగా ప్రత్యేక అవకాశాల కొరకే వారు నిరంతరం తాపత్రయపడుతున్నారు. పోని ముస్లింలు తమ సంస్థల్ని, సమాజాలను ఆధునీకరణకు గురిచేస్తున్నారా,అంటే అదీ లేదు. రాజకీయ అధికారంకోసం కొన్ని పార్టీలు ముస్లిం ఓట్లకై వారేదడిగినా ఒప్పుకుంటున్నారు. ఇది ఆసరాగా తీసుకొని ముస్లింలు తమ మతపర హక్కులే కట్టుదిట్టం చేసుకుంటున్నారు.

ముస్లింలలో ఆధునిక దృక్పధం రావాలని, సెక్యులర్, మానవ విలువలు ఆచరించాలని, మతాన్ని సంస్కరించాలని, అవసరమైన మేరకు మతాన్ని విమర్శించాలని కొందరు యువ ముస్లింలు బయలుదేరారు. వారిపట్ల సనాతన ముస్లింల వ్యతిరేకత చాలా ఎక్కువగా వుంది.

హమీద్ దల్వాయ్ ఆధ్వర్యాన ముస్లిం సత్యశోధక సమాజం మహారాష్ట్రలో ఎన్నో కష్టాల్ని సనాతనులనుండి ఎదుర్కొనవలసి వచ్చింది. అస్ఖర్ అలీ ఇంజనీర్ ప్రాణాలకి ముప్పు ఏర్పడింది. 1971లో వీరు ముస్లిం స్త్రీ సమావేశాలు కూడా ఏర్పరచారు. స్త్రీ పురుషులు సమానం అనే ప్రాతిపదికగా ఒకే సివిల్ కోడ్ వుండాలని యీ స్త్రీ సమావేశం కోరింది. దేశంలో అక్కడక్కడా ఉత్తేజం పొందిన ముస్లిం యువతీ యువకులు మానవ హక్కులకు, ఒకే సివిల్ కోడ్ కు వత్తిడి చేసినా, అది పేలవంగానే మిగిలిపోయింది. ఛాందసుల వత్తిడి, ప్రభావం చాలా ఎక్కువగా వుంది. భారత ప్రభుత్వం గాని, వివిధ రాజకీయ పక్షాలుగాని ముస్లిం యువకులలో సెక్యులర్ ధోరణులకు అండగా నిలవలేకపోయాయి.

ముస్లింల ధోరణి మారాలని, వారి సంస్థలు ఆధునికరణం కావాలని పట్టుబట్టిన కొద్దిమంది మాట ఇంకా దేశవ్యాప్తంగా మారుమోగలేదు. ఎ.ఎ.ఎ. ఫైజి, ఆలంఖుంద్ మిరి, ఎం.ఆర్.ఎ.బేగ్,ఎం.హబీబ్, హమీద్ దల్వాయ్, అస్గర్ ఆలీ ఇంజనీర్, ఎం.ముజీబ్, అబిద్ హుసేన్ వంటి వారిని ముస్లింలలో వేళ్ళపై లెక్కించవచ్చు. ముస్లిమేతరులు కొందరు ఆధునీకరణ విషయమై ముస్లింలకు తోడ్పడడానికి సిద్ధంగావున్నా, స్వీకరించడానికి ముస్లింలు సహనం చూపడంలేదు. విదేశాలలో ఇస్లాం విమర్శలు ఖురాన్ పరిశీలనలు, మహమ్మద్ జీవితాన్ని నిశితంగా గమనించిన సందర్భాలు వున్నాయి. అలాంటప్పుడు సనాతన ముస్లింలు అభ్యంతరపెడుతూనే వున్నారు. ఇటీవల సాల్మన్ రష్డీ రాసిన శాటనిక్ వెర్సస్ పుస్తకాన్ని అందరికంటె ముందు ఇండియా నిషేధించింది. రచయితను చంపేయమని ఇరాన్ నేత అయొతుల్లా ఖొమినీ శాసించాడు, మతవిమర్శలపట్ల అసహనం ఆ స్థాయికి చేరుకునంది.

మార్క్సిజాన్ని ఇష్టపడిన ముస్లింలు, కమ్యూనిస్టు పార్టీలోవున్న ముస్లింలు సైతం ఇస్లాంను, అమానుష ముస్లిం మతధోరణులను విమర్శించకపోవడం ఆశ్చర్యకరం. మతం మత్తుమందు వంటిదన్న మార్క్స్ ప్రవచనాన్ని వీరు పట్టించుకోలేదు. అవకాశవాదం తప్ప యిందులో మరో కారణం కనిపించదు.

పాకిస్తాన్ ఏర్పడగానే అక్కడ కమ్యూనిష్టుల్ని తుదముట్టించారు. ఆ ఉద్యమాన్ని కాపాడదామని వెళ్ళిన భారత కమ్యూనిష్టు ముస్లింలు సజ్జాద్ జహీర్, అశ్రఫ్ లను జైళ్ళలో పెట్టారు. పదేళ్ళ తరువాత వారు ఇండియాకు తిరిగి రావలసి వచ్చింది. కమ్యూనిష్టు పార్టీలో వున్న ముస్లింలు మతేతరంగా వ్యవహరించలేకపోయారు. క్రమేణా కమ్యూనిష్టుపార్టీలో ముస్లింలు క్షీణించారుకూడా. కమ్యూనిష్టు ముస్లింలు ఎవరూ ఇస్లాంను,మహమ్మద్ ను, ముస్లిం వాదనను, షరియాను నిశిత పరిశీలనకు గురిచేయలేదు. కమ్యూనిష్టు పార్టీలోవున్న ముస్లిం నాయకులు ముస్లిం నాయకులుగానే ప్రవర్తించారు. పశ్చిమబెంగాల్ లో మహ్మద్ ఇలియాస్ ఒక ఉదాహరణ.

భారతదేశాన్ని 800 సంవత్సరాలు పరిపాలించిన ముస్లింలు, నేటికీ శాశ్వత అల్ప సంఖ్యాకులుగా వుండాలనే ధోరణి దారుణమైంది. ఆధునిక సెక్యులర్ మానవ విలువలు వారిచే పాటించజేయదం చాలా కష్టమైపోతున్నది. ఇందుకు వారి మతమే వారికి ప్రధానంగా అడ్డొస్తున్నది. ఆధునిక పాశ్చాత్య విద్యను ముస్లింలు అభ్యసించాలని సర్ సయ్యద్ అహమ్మద్ కోరాడు. ముస్లింలలో పునర్వికాసానికి అది ఆరంభదశ అయింది. కాని తొలుతనే సర్ సయ్యద్ ను ఛాందస ముస్లింలు కాఫిర్ అని బోర్డు కట్టేశారు. పునర్వికాస ప్రవాహం ఆగింది.

నేడు ముస్లింలలో పునర్వికాసం కావాలి. వీటికి అడ్డొస్తున్న విషయాలేమిటి? ఒకటి బహుభార్యాత్వం, చారిత్రకంగా జరిగిపోయిన విషయాన్ని ఆధునికంగా పాటించాలనడం, స్త్రీ-పురుష సమానతకు భంగమని వారికి నచ్చచెప్పాలి. దేశ పరిస్థితుల దృష్ట్యా, మతధోరణి ప్రక్కనబెట్టి, కుటుంబాలను పరిమితం చేసుకోవాలి.

ఒకప్పుడు, ఖురాన్ ప్రకారం కూడా, బానిసల్ని అట్టిపెట్టుకొనేవారు. బానిసలలో లైంగిక సంబంధాలుండడం యజమానులకు తప్పుకాదు. నేడు అది కొనసాగాలని ముస్లింలు అనగలరా? అది మార్చుకోడానికి వారుసంసిద్ధత వ్యక్తపరచారుగదా! అలాగే మిగిలిన రంగాలలోనూ ఆధునీకరణకు పూనుకుంటే పునర్వికాసానికి దోహదం చేసినట్లే. ఖురాన్ ప్రతిపాదించి, అమలుపరచిన శిక్షలు తు.చ. తప్పకుండా అమలు జరగాలని భారతదేశంలో ముస్లింలు అనగలరా? భారత శిక్షాస్మృతి అందుకు ఒప్పుకోలేదు గదా? ఆ విషయమై నేరస్తులనును శిక్షించడంలో ఒకే రీతి చట్టాన్ని ముస్లింలు,హిందువులు పాటిస్తున్నారు. పౌరసంబంధమైన విషయాలలో కూడా ఇలాగే వుంటే గొడవేలేదు.

నేడు ప్రపంచవ్యాప్తంగా మానవహక్కులు కోరుకుంటున్నారు. స్వేచ్ఛ సమానత్వం అనేవి మానవ విలువలుగా గుర్తించారు. కాని,మానవహక్కుల్ని ఖురాన్ గుర్తించకపోతే ఏం చేయాలని ముస్లింలు ఆలోచించుకోవాలి. పురుషులకంటె స్త్రీలు తక్కువ అనడం,బానిసత్వాన్ని సమర్ధించడం,ముస్లిమేతరులు అందరూ కాఫిర్లు అనడం అనేవి,నేడు సమర్ధనీయాలా? ముస్లిం యువతరం వీటిని పరిశీలిస్తే గాని, పునర్వికాసానికి చోటు వుండదు. అలాగే వివాహం విషయంలోనూ, విడాకుల విషయంలోనూ స్త్రీ పురుష సమాన హక్కుల సంగతి వారు పరిశీలించాలి. ముస్లింలలో సమానత్వం అనేది ప్రార్థనల సమయంలో పాటిస్తున్నారు. తరువాత అసమానతలు బాగా ఆచరిస్తున్నారు. సంపన్నులు పేదవారిని సమానంగా చూడలేకపోతున్నారు. ఇతర మతాలవారి సంగతి ఇక చెప్పనక్కరలేదు. వారంతా ధిమ్మీలు, లేదా కాఫిర్లు!

విచిత్రమేమంటే,అనేక ముస్లిం దేశాలు ఇస్లాం పేరెత్తకుండానే చాలా సంస్కరణలు అమలు చేశాయి. ట్యునీషియా ముస్లిం దేశమే. అక్కడ బహుభార్యత్వాన్ని నిషేధించారు. అందుకు ఖురాన్ అడ్డుపడలేదు ఈజిప్టులో ముస్లిం వక్ఫ్ బోర్డులలో వ్యక్తిగత పెత్తనం తొలగిస్తే, మతగురువులు మాట్లాడలేదు!

ముస్లిం మత చట్టాలను (షరియా) చాలా ముస్లిందేశాలు పాటించకుండా ఆధునీకరణకు పూనుకున్నాయి. ముఖ్యంగా నేరాలు చేసినవారి చేతులు, కాళ్ళు నరకడం వంటి క్రూర హింసల్ని అనేక ముస్లిందేశాలు వదలివేశాయి. ఇంకా సౌదీ అరేబియా,పాకిస్తాన్,లిబియాలలో ఇలాంటి దారుణాలు అమలుపరుస్తున్నారు. అయితే ఆ దేశాలలో ముస్లింలు పరిపాలిస్తున్నారు గనుక సరిపోయింది. ముస్లింలు పరిపాలనలో లేని చోట్ల ముస్లింలు తమ చట్టం ప్రకారం అమలు జరగాలని పట్టుబట్టడం లేదు, అమెరికా, యూరోప్, కెనడాలలో ముస్లింలు తగిన సంఖ్యలోవున్నా ముస్లించట్టం కావాలని కోరలేదు.

భారతదేశానికి ఒక లిఖిత పూర్వక రాజ్యాంగం వుంది. సాంఘిక సంస్కరణలు చేయాలని,ఒకే పౌరస్మృతి కావాలని, సెక్యులర్ సైంటిఫిక్ ధోరణులు అమలుపరచాలని రాజ్యాంగం స్పష్టంచేసింది. ముస్లింలు వీటినుండి తమను మినహాయించాలంటే, పునర్వికాసం వారిలో రాజాలదు.

టర్కీలో కెమాల్ పాషా ఆధ్వర్యాన చాలా సంస్కరణలు జరిగాయి. ముస్లింలు ఆధునికీకరణ మార్గంలో పయనించారు. ఇరాన్ లో షా ముస్లింలు పాశ్చాత్యులతో దీటుగా అనేక విషయాలలో ఆధునికులయ్యారు. కాని,అక్కడ కూడా మత ఛాందసులు తిరగదోడి, పునర్వికాసాన్ని దెబ్బతీశారు.

సిరియా, అల్జీరియా, ఇరాక్, ఈజిప్టులలో ముస్లిం కుటుంబ చట్టాలలో విపరీతమైన ఆధునిక మార్పులు వచ్చాయి. అలాంటి సందర్భాలలో ఇంకా ఇండియాలో ముస్లింలు తమ చట్టాలలో ప్రభుత్వ జోక్యం కూడదనడం అర్థంలేని విషయమే.

ముస్లింలలో పునర్వికాసానికి దోహదం చేయగల అంశాలేమిటి? ఇస్లాం సంపూర్ణం అనీ, మార్చడానికి వీల్లేనిదనీ ముస్లిం సనాతనులు నమ్ముతారు. ఆధునిక శాస్త్రీయ ధోరణుల దృష్ట్యా ముస్లింలలో చదువుకున్నవారు యీ విషయాన్ని మళ్ళీ ఆలోచించాలి. ఇతర మతాలలో వచ్చిన విమర్సలు, పరిశీలనలు ఇస్లాంలోనూ రావాలి.

ఇలాంటి విమర్శలు, పరిశీలనలు బయటివారు శాస్త్రీయ దృక్పధం గలవారు పూనుకుంటేనే, త్వరగా పునర్వికాసానికి ఆస్కారం వుంటుంది. పుట్టినప్పటినుండీ చనిపోయే వరకూ హిందువు ఏంచేయాలి, ఎలావుండాలి అని మతం శాసించింది. అదంతా పునర్వికాస ధోరణుల వలన చాలావరకు సడలుతున్నది. ఇంచుమించు ఇస్లాంలోనే అలాంటి నిర్దేశాలు వున్నాయి. వాటినే పునరాలోచించాలి. క్రైస్తవులలోనూ యిలాంటి మూఢాచారాలు,నమ్మకాలు బలంగా వుండేవి. పునర్వికాసం, వివేచన, పారిశ్రామిక శాస్త్రీయ విప్లవాల వలన వారు చాలావరకూ బయటపడ్డారు. ఎటొచ్చీ ముస్లింలపైనే మతగురువుల పట్టు ఇంకా సడలలేదు.

భారతదేశానికి హమీద్ దల్వాయ్ లు ఎందరోకావాలి. అప్పుడే ముస్లింలలో తొందరగా పునర్వికాసానికి అవకాశం లభిస్తుంది.

- హేతువాది,సెప్టెంబరు,నవంబరు 1989