అబద్ధాల వేట - నిజాల బాట/గాంధిభాయి సెక్యులరిజంలో పునర్వికాసం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
పునర్వికాస పరిణామం
గాంధిభాయి సెక్యులరిజంలో పునర్వికాసం

చైనా, కంబోడియా, వియత్నాంలలో గాంధివంటి అహింసావాది బ్రతికేవాడా? బ్రిటిష్ వారి ఇండియా పాలనలో గాంధివంటివారు తమ ఆచారాలను, అలవాట్లను ప్రచారం చేసుకుంటూ, రాజకీయాలను మతంతో రంగరించి, మహాత్ములనిపించుకున్నారు.

దక్షిణాఫ్రికాలో పరిశోధనలుచేసి విఫలమైన గాంధి, ఇండియాలొ కొంతవరకు సఫలమయ్యారు. 1920 నుండే, తిలక్ మరణానంతరం, గాంధీజీ కాంగ్రెసు నాయకత్వంలోకి వచ్చారు. అప్పటికే ఆయనకు తగినంత ప్రచారం లభించింది. ఆశ్రమాలతో దేశంలో రాజకీయాలు ఆరంభించిన గాంధీజీ, స్త్రీలను యీ రంగంలోకి ఆకర్షించగలిగారు. శాకాహారం, ఆయుర్వేదం, ప్రకృతివైద్యం, ఉపవాసాలు, కఠోరనియమాలు, ఖద్దరు వడకటం, ధరించడం, లైంగిక కట్టుబాట్లు, రామరాజ్యం యిలాంటివన్నీ ఆశ్రమ స్త్రీలకు ఆకర్షణలే. అందుకే గాంధీజీ ఆశ్రమాలకు అంకితమైపోయిన స్త్రీలు కొందరుకాగా, దేశవ్యాప్తంగా గాంధేయ పద్ధతులలో ఆయన శిష్యరికం చేసిన మధ్యతరగతి స్త్రీలు కొల్లలుగా వున్నారు.

గాంధీజీ ఆశ్రమాల పోషణ చాలా ఖరీదైన విషయం. సమాజానికి ముఖ్యంగా కొందరు గాంధేయ వ్యాపారస్తులకు యిందుమూలంగా ఖర్చు చాలా అయింది. గాంధీని పేదరికంలో అట్టిపెట్టడానికి, మూడవతరగతి రైలు ప్రయాణాలకు విపరీతంగా ఖర్చయ్యేది. ఆశ్రమాలను సమాజం పోషించి, గౌరవించి,ఆరాధించడం చిరకాలంగా దేశంలో వస్తున్న సంప్రదాయమే. దీని ఆధారంగా గాంధీజీ తన రాజకీయల్ని బాగా ప్రచారంలోకి తెచ్చాడు. ఆశ్రమ జీవనానికి ప్రచారం లభించింది,లాభించింది. సబర్మతి-వార్దా ఆశ్రమాలు దేశంలో రాజకీయాన్ని నడిపిన కేంద్రాలుగా మారాయి.

గాంధీజీ రాజకీయాల్లో ప్రవేశించి స్తబ్ధతలోవున్న కాంగ్రెసును ప్రజా ఉద్యమంగా మార్చడానికి మతపరమైన విధానాలు ఉపకరించాయి. సత్యాగ్రహం,సహాయనిరాకరణ, నిరసనపత్రం, నిరాహారదీక్షలు, అహింసాయుత ఆందోళనల్ని గాంధీజీ తన ఆయుధాలుగా ప్రయోగించారు. ఇవన్నీ చిరకాలంగా మతాలు వాడుతున్నవే. కాని స్వాతంత్ర్యోద్యమంలోకి వాటిని తెచ్చి ప్రయోగించడం గాంధీ వివేచనకు తార్కాణం.

గాంధీజీ ఏ ఉద్యమాన్ని ఆరంభించినా, అది ఎంత అహింసాయుతంగా వుండాలన్నా, చివరకు హింసకే దారితీస్తుంది. ఉద్యమాలను మొదలుపెట్టిన గాంధీజీ వాటిని హింసాయుతం కాకుండా ఆపలేకపోయారు. మతం సహనం పేరిట ఎంత ప్రబోధం చేసినా, అవసరమైనప్పుడు చాలా అసహనాన్ని హింసను చూపగలదు. గాంధీజీ ఉద్యమాలలో మతం పేరిట ప్రవహించిన రక్తం మత అసహనానికి తార్కాణమే. హిందూ-ముస్లిం భాయిభాయి అని గాంధీజీ నినదించి, జీవితమంతా కృషిచేశాడుగదా! ఆయన కళ్ళెదుట హిందూ-ముస్లింలు వూచకోత కోసుకున్నారు. దేశవిభజన వలన 60 లక్షల హిందూ-ముస్లింలు బలిఅయ్యారు. చివరకు మత ఛాందసుడి చేతిలో గాంధి హతమయ్యారు. రాముడు-రహీం ఒక్కడేనని, ఈశ్వర అల్లా తెరేనాం అనీ, ఒకచేతిలో భగవద్గీత మరో చేతిలో ఖురాన్ పెట్టుకున్న గాంధీ ఎందుకు విఫలమయ్యారు? రెండు మతాలవారూ గాంధీజీ మతపరంగా చెప్పింది అంగీకరించలేదు. రాజకీయ ప్రయోజనంకోసం గాంధీజీ బోధిస్తున్నాడని వారికి తెలుసు. కనుక ఎవరి మతాన్ని వారి అంటిపెట్టుకున్నారు. సమయంచూచి చంపుకున్నారు. భాయి-భాయి అనేది వేదికలపై నినాదంగా మిగిలింది.

మతాన్ని రాజకీయాల్ని వేరుగా వుంచాలని గాంధి భావించలేదు. ప్రజలపై మతప్రభావం ఏమిటో ఆయనకు బాగా తెలుసు. అతితక్కువగా వస్త్రాలు ధరించడం, ఆశ్రమ జీవనం గడపడం, పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టిన తరువాత బ్రహ్మచర్యం పాటించడం, శాకాహారానికే అంకితం గావడం, సొంతలాభం మానుకోవడం ఇలాంటివన్నీ ప్రజల దృష్టిలో పవిత్రమైనవి. గాంధీజీ యీ లక్షణాలు పాటిస్తూ ప్రజల్ని ఆకర్షించి, రాజకీయాల్లోకి మతాన్ని తెచ్చారు. రామరాజ్యం కోరిన గాంధీజీ హిందూమతవాది. మత ఐక్యత కోరిన గాంధి, హిందూమతంలో ఇస్లాం, బౌద్ధం, క్రైస్తవం యిముడుతాయనుకున్నాడు. ముస్లింలను హిందువులను మతపరంగా కలపాలని గాంధీజి నినదించారు. అక్కడే ఆయన విఫలమయ్యారు. ఆయన పిలుపును అందుకొని రాజకీయోద్యమాల్లో ప్రవేశించిన హిందువులు, ముస్లింలు తమ మతాల్ని గట్టిగా పట్టుకొనే వచ్చారు తప్ప వదులుకొనిరాలేదు. హిందువులు, ముస్లింలు ఒకటేననిగాని, ఖురాన్-బైబిల్-గీత చెప్పేదంతా ఒకే సత్యమనిగాని ఏ మతస్తుడూ ఒప్పుకోలేదు, పైగా గాంధీజీ చెప్పేదంతా హిందూమత ప్రచారంగానే ఇతర మతస్తులు భావించారు. దేశ ఐక్యతకు, స్వాతంత్ర్యానికి మతపరమైన ఆయుధాలతో గాంధీజీ పోరాడుతున్నప్పుడే, పాకిస్తాన్ కోసం ముస్లింలీగ్ ఏర్పడి, పోరాడి, సాధించిందికూడా.

గాంధి భావాల ప్రభావం విపులంగా పరిశీలించేముందు, సంక్షిప్తంగా ఆయన జీవితాన్ని, తన భావాలు సంతరించుకోడానికి తోడ్పడిన తీరును చూద్దాం.

గుజరాత్ లోని పోరుబందరులో గాంధి ఒక వైశ్య కుటుంబంలో పుట్టాడు. గాంధి తండ్రి పోరుబందరు సంస్థాన ప్రధాని. వీరు ఐదుగురు అన్నదమ్ములు. అందరి కుటుంబాలు ఒకే యింట్లో వుండేవి. గాంధి తండ్రి నాలుగు పెళ్ళిళ్ళు చెసుకున్నాడు. గాంధి తల్లి పుత్లిబాయి నాలుగో భార్య. గాంధి తండ్రి 47వ ఏట 24 సంవత్సరాల పుత్లిబాయిని పెళ్ళాడాడు. గాంధికి రెండు సంబంధాలు నిశ్చయిస్తే, వారిరువురూ చనిపోయారు. మూడో సంబంధం కస్తూరిబాతో కుదిరింది. గాంధికి 13వ ఏట పెళ్ళి అయింది. కస్తూరిబా పొరుగునే వుండేది. ఇద్దరూ ఆడుకునేవారు. తల్లికి ఎప్పుడూ తీరనిపని. పూజలు, ఉపవాసాలు, వైష్ణవ సంప్రదాయం, శాకాహారం, తండ్రిపట్ల గాంధీకి ప్రేమ, ఆదరణ, తండ్రి వృద్ధుడై, జబ్బు పడగా సేవలు చేస్తుండే గాంధీకి జుగుప్స కలిగించే సంఘటన జరిగింది. ఒకసారి తండ్రికి సేవలుచేస్తూ మధ్యలో భార్యవద్దకు వచ్చాడు. మామ తన స్థానంలో తండ్రివద్ద వున్నాడు. భార్య చెంతవుండగా తలుపులుకొట్టి తండ్రి పోయినట్లు ఎవరో చెప్పారు. వచ్చిచూచిన గాంధీకి చివరి సమయంలో తాను తండ్రివద్ద లేకపోవడం, భార్యతో సంభోగంలో వుండడం వలన, ఏదోనేరం చెసినట్లు, సెక్స్ చర్య పాపం అన్నట్లు భావించాడు.

గాంధీకి పాఠశాల మిత్రుడు షేక్ మెహతాబ్ వుండేవాదు. అతడు ఒక పోలీస్ అధికారి కుమారుడు. గాంధీకి సంరక్షకుడిగా వుండాలని నిర్ణయించుకొని, అన్నీ నేర్పాలనుకున్నాడు. మాంసాహారం తినిపించాడు. ధైర్యంగా వుండాలంటూ మగతనం నిరూపించుకోమని గాంధిని వ్యభిచారగృహాలకు తీసుకెళ్ళాడు. వైఫల్యాలు, సఫలతలు చవిచూచిన గాంధీకి, కామవాంఛ ఎక్కువగానే వుండేది. ఆ దృష్టితోనే లండన్ లో కూడా యీ పరిశోధన సాగించాడు. భార్య కస్తూరి అన్ని విధాలా గాంధి చెప్పినట్లు వినేది. కాని చదువుకోమంటే ససేమిరా అని మొండికెత్తింది. ఆ విషయంలో గాంధీ ఓడిపోయాడు. షేక్ మెహతాబ్ మాత్రమే లండన్ నుండి గాంధి రాసిన ఉత్తరాలు చదివి కుటుంబ సభ్యులకు వినిపిస్తుండేవాడు. తరువాత గాంధి అతడిని దక్షిణాఫ్రికా పిలిపించుకున్నాడు. అక్కడ మెహతాబ్ ధోరణి, వ్యభిచారం భరించలేక, బలవంతంగా వదిలించుకున్నాడు. చిన్నప్పటినుండే ముస్లిం స్నేహితుడి ప్రభావంలోవున్న గాంధీ, హిందూ-ముస్లిం భాయి భాయి అని నినదించాడు. కుటుంబమంతా యీసడించుకుంటున్నా గాంధీ తన స్నేహితుడు మెహతాబ్ ను ఒక పట్టాన వదలుకోలేకపోయాడు. గాంధీ పెద్ద కుమారుడు హరిలాల్ ముస్లింగా మారడానికి షేక్ మెహతాబ్ ప్రభావం పరోక్షంగా వున్నది.

గాంధి తన జీవితచరిత్రను సత్య పరిశోధనగా పేర్కొన్నారు. తన తండ్రి, ముగ్గురు భార్యలు చనిపోగా, 4వ ఆమెకు, అనగా తన తల్లి పుత్లిబాయిని చేసుకున్నాడని రాశాడు. కాని మూడోభార్య బ్రతికుండగానే (ఆమె బాగా అనారోగ్యంగా వుండగా) పుత్లిబాయ్ ని చేసుకున్నారు. అలాగే షేక్ మెహతాబ్ ను సంస్కరించడానికే అతడితో స్నేహం చేశానన్నారు. కాని వాస్తవానికి గాంధీని అతడే చిన్నతనంలో ఎక్కడబడితే అక్కదతిప్పి, అన్నీ తినిపించి, త్రాగించి, సిగరెట్లు పీల్చేటట్లు చేశాడు. మెహతాబ్ గురించి చాలా వాస్తవాలు వదిలేదసి స్వీయచరిత్ర రాసినట్లు గాంధి ఒప్పేసుకున్నారు. వీరిద్దరికీ లైంగిక సంబంధాలుండేవని అనడానికి ఆధారాలు లేవు. వున్నవన్నీ వదంతులే. సూచనప్రాయమైన సంఘటనలు మాత్రం వున్నాయి. అలాంటి షేక్ మెహతాబ్ ప్రభావం గాంధీపై కనిపిస్తుంది. వ్యభిచార గృహాలకు వెళ్ళినప్పుడు విఫలమైన సంఘటన ఒక్కటే గాంధి పేర్కొన్నాడుగాని, సఫలమైన వాటి జోలికి పోలేదు. తన పరిశోధనకు అవి అనవసరమనుకోవచ్చు. వాస్తవాలు చెప్పకపోవడం సత్యాన్వేషణలో భాగమేమో తెలియదు. తొలిసారి ఆఫ్రికాకు వెడుతున్నప్పుడు కూడా గాంధి నిజాలు దాచినట్లు ప్రమాణపూర్వకంగా ఆధారాలున్నాయి. (చూడు.మహదేవన్ రాసిన ది లేయర్ ఆఫ్ ది ఫీనిక్స్)

ఇంగ్లండులో చదువుకోడానికి సముద్రం దాటిన గాంధి, 1888 సెప్టెంబరులో 50 రోజులు ప్రయాణంచేసి, ఇంట్లో వాళ్ళకు అనేక ఒట్లు వేసి, గమ్యం చేరుకున్నాడు. ఇంగ్లండ్ లో చదువుకుంటూనే కొన్ని అసత్య సత్య పరిశోధనలు చేసిచూచాడు. శాకాహారం, సంగీతం, వ్యభిచారగృహాల సందర్శన ఇందులో భాగమే. తనకు పెళ్ళి అయిందని చెప్పకుండా సాగిపోయిన గాంధి, ఒక పెళ్ళి ప్రతిపాదన వచ్చేసరికి నగ్నసత్యాన్ని బయటపెట్టక తప్పిందికాదు! ఇంకా ఆశ్చర్యమేమంటే భగవద్గీత, బైబిలు, ఖురాన్ వంటి గ్రంథాలు గాంధి ఇంగ్లండ్ లో చదివి ప్రభావితుడైనాడు.

ఇంగ్లండ్ లో చదువు పూర్తి చేసుకొని గాంధి ఇంటికొచ్చేసరికి తల్లి పుత్లిబాయి చనిపోయింది. ఆ తరువాత బ్రతుకుతెరువు నిమిత్తం దక్షిణాఫ్రికా ప్రయాణం కట్టాడు. అప్పటికే గాంధీపై టాల్ స్టాయ్, రస్కిన్, థోరో ప్రభావం పడింది. ఇంగ్లండ్ పోడానికి మ్లేచ్ఛుడుగా సముద్రం దాటినందున గాంధీని, ఆయన్ను సాగనంపిన కుటుంబాన్ని వైశ్యకులం వెలివేసింది. అది లెక్కచేయకుండా గాంధి అడ్వొకేట్ వృత్తిని (కులవృత్తిని వదిలి) చేపట్టదలచాడు. ఇండియాకు వచ్చిన గాంధిపై రేచాంద్ భాయి మతపరంగా చాలా ప్రభావం చూపాడని చాలామందికి తెలియదు.

రేచాంద్ భాయి వలన గాంధీపై జైన సిద్ధాంతాల ప్రభావం బాగా నాటుకపోయింది. ఇతన్ని రాజ్ చంద్ర అని కూడా అంటారు. ఇతడిని గాంధీ గురువుగా భావించాడు. కాని 31 సంవత్సరాలకే ఆ గురువు చనిపోయాడు. వైష్ణవమతం, జైనమతం గాంధీజీలో కలిసిపోగా, యువకుడుగా కోర్టులో సత్యాన్ని పరిశోధించాలంటే వీలుకాలేదు. మరోవైపు అన్న వత్తిడిపై తనకు ఇంగ్లండ్ లో పరిచయమైన బ్రిటిష్ అధికారివద్దకు వెళ్ళి విఫలమయ్యాడు. కథియవార్ వదలాలనుకుంటుండగా, దక్షిణాఫ్రికా వెళ్ళే అవకాసం లభించింది. మరో 20 సంవత్సరాల పాటు దక్షిణాఫ్రికాలో తన "సత్యాన్వేషణ"కై గాంధి 1893లో బయలుదేరాడు. దాదా అబ్దుల్లా కంపెనీ పక్షాన ట్రాన్స్ వాల్ వెళ్ళాడు. కోర్టులో కూలి బారిస్టర్ గా జడ్జిచే అగౌరవం పొందాడు. దక్షిణాఫ్రికాలో జాతి విచక్షణ రుచిచూచాడు. సంస్కరణ రంగంలోకి దిగాడు. భారతీయుల నందరినీ ప్రిటోరియాలో కలిశాడు. జాతి విచక్షణా బిల్లును వ్యతిరేకించడంలో ఇంగ్లండ్ రాణి బిల్లుకు ఆమోదముద్ర యివ్వకపోవడంలో గాంధిపాత్ర ప్రముఖంగా వుంది. దక్షిణాఫ్రికాలో తనకు చేదోడువాదోడుగా వుండడానికి షేక్ మెహతాబ్ ను అట్టిపెట్టుకున్నాడు. వ్యభిచారిణుల్ని ఇంటికే తెచ్చి అనుభవిస్తున్న మెహతాబ్ ను వదిలించుకొని, తన కుటుంబాన్ని తెచ్చుకోడానికొ ఇండియా వెళ్ళాడు.

కులం నుండి వెలివేసిన గాంధీకి, ఆయన భార్య కస్తూరిబాకు మంచినీళ్ళు కూడా యివ్వని వైశ్యులు, గాంధీకి కీర్తి ప్రతిష్టలు వచ్చిన తరువాత మా కులంవాడన్నారు. దక్షిణాఫ్రికానుండి పూర్తిగా ఇండియాకు వచ్చేసినప్పుడు ఘనంగా సన్మానాలు చేశారు. గాంధి మాత్రం వైశ్యుడుగా పూసుక తిరగలేదు. కులపట్టింపులు, విధులు పాటించలేదు. 1896లో దక్షిణాఫ్రికా నుండి గాంధి ఇండియా వచ్చారు. ఆయన పేరు కాంగ్రెసు పార్టీ ద్వారా ఇండియాలో కొంత వ్యాపించింది. ఆయనకు 27ఏళ్ళు. ఇండియాలో గోపాలకృష్ణ గోఖలేను తన గురువుగా గాంధి పేర్కొన్నారు. దక్షిణాఫ్రికాలో భారతీయుల దారుణస్థితి, జాతి విచక్షణ గురించి గాంధీ ప్రచారం చేశాడు. తద్వారా ఆయన పేరు బాగా తెలియడమేగాక, జాతి విచక్షణ సమస్యకు యీసడింపు వచ్చింది. కుటుంబంతో తిరిగి వెళ్ళిన గాంధి దక్షిణాఫ్రికాలో తీవ్ర వ్యతిరేకతను చవిచూచారు. కాని బోయర్ యుద్ధంలో దక్షిణాఫ్రికాలో బ్రిటిష్ సామ్రాజ్యం పక్షాన పోరాడారు. మొదటి ప్రపంచ యుద్ధంలోనూ ఇండియాలో బ్రిటిష్ సామ్రాజ్యం పక్షాన గాంధి వున్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో మాత్రం జపాన్ వారి సహాయంతోనైనాసరే బ్రిటిష్ వారిని తరిమేయాలని, క్విట్ ఇండియా పిలుపు యిచ్చారు.

1901లో దక్షిణాఫ్రికా నుండి కుటుంబ సమేతంగా ఇండియావచ్చిన గాంధి,వకీలుగా ప్ర్రాక్టీసు చేద్దామనుకున్నారు. ఆయేడు కలకత్తా కాంగ్రెసు సభలలో పాల్గొన్నారు. దక్షిణాఫ్రికా నుండి పిలుపురాగా మళ్ళీ వెళ్ళారు. అప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నారు. 31వ సంవత్సరం నుండి తాను-తన భార్య కస్తూరిబా స్నేహితులుగా మెలగాలనీ, సంభోగం వద్దనీ పెళ్ళి అయిన తరువాత, సంతానం కలిగిన అనంతరం బ్రహ్మచారిగా వుండడం సాధ్యమేననీ గాంధీ ఒట్టుపెట్టుకున్నారు. అయితే లైంగిక కామన చాలా బలవంతమైన మానసిక-శారీరక ప్రకృతి. పట్టుబట్టి ఆపేస్తే ఆ ప్రవృత్తి అనేక రూపాలలో బయటపడుతుంది. బ్రహ్మచర్యం అనేది భారతీయ తత్వంలో ఉన్నతమైనదిగా చిత్రీకరించారు. సంభోగంలో కూడా రేతస్సుస్కలనం కాకుండా ఆపేస్తే మెదడుకు ఆ శక్తిని పంపించగలిగితే, ఆ వ్యక్తి సాధకుడౌతాడని నమ్మారు. తాంత్రికంలో కుండలినీ విద్యపేరిట ఇలాంటివి చిత్రించారు. ఆధారాలు లేని యిా ఆచారాలు పాటించిన వారి బాధలు వర్ణనాతీతం. గాంధిగారు జీవితమంతా తన బాధను కప్పిపుచ్చుకోడానికి సెక్స్ పరిశోధనలు చేశారు. కలల్లో రేతస్సుస్కలనం అయింది. తన బ్రహ్మచర్య శక్తిని జీవితంలో చివరి దశవరకూ ఆయన పరీక్షించుకుంటూపోయారు. కస్తూరిబా అంగీకరించడంతో గాంధీ తన బ్రహ్మచర్యాన్ని దీక్షగా దక్షిణాఫ్రికాలోని రోజులనుండే పాటించారు. టాల్ స్టాయ్ ఫారమ్,ఫేనిక్స్ ఫారమ్ ల పేరిట దక్షిణాఫ్రికాలోన రెండు శిబిరాలు స్థాపించారు. తన నమ్మకాలను ఆచరించడానికి కొందరు యువతీ యువకులను చేర్చుకొని, సత్యాగ్రహం మొదలు సెక్స్ వరకూ పరిశోధనలు చేశారు. టాల్ స్టాయ్ ఫారం లో ఒక చెరువు లో యువతీయువకులను బట్టలు తీసేసి, స్నానాలు చేయమన్నారు. ఇదద్రు యువతులు ఒక యువకుడు స్నానం చేస్తూ సరససల్లాపాలు సాగించినట్లు గాంధీకి తెలిసింది. ఆ యిద్దరు అమ్మాయిలకూ జుట్టు కత్తిరించేశాడు. అబ్బాయి జోలికిపోలేదు.

భారతీయులు దక్షిణాఫ్రికాలో సత్యాగ్రహం ద్వారా సాధించవలసిన అంశాలు గాంధీజీ నేర్పాడు. ఇంగ్లండ్ వెళ్ళి విజ్ఞప్తులు సమర్పించాడు. తిరిగివస్తూ 1909 ఓడలో వారం రోజులలో "హింద్ స్వరాజ్" రాశాడు. అందులో గాంధీ నమ్మకాలు వెల్లడయ్యాయి. చివరివరకూ వాటిని మార్చుకోలేదు. అప్పటికీ టాల్ స్టాయ్, రస్కిన్ ల ప్రభావం ఆయనపై బాగా కనిపించింది. హింద్ స్వరాజ్ లోనే బ్రిటిష్ పార్లమెంటును వ్యభిచార సంస్థగా గాంధి చిత్రించారు.

గాంధి తన భార్య కస్తూరిబా పట్ల చాలా సందర్భాలలో అమానుషంగా ప్రవర్తించాడు. దక్షిణాఫ్రికాలో వుండగా, మలవిసర్జన తరువాత సెప్టిక్ లెట్రిన్ పద్ధతులు అవలంబించి, ఎవరి దొడ్దిని వారే కప్పిపుచ్చాలన్నాడు. కస్తూరిబాతోపాటు ఆశ్రమవాసులు అలాగే పాటించారు. అతిథులు ఇతరులు వస్తే వారి మలవిసర్జన శుభ్రం చేయమని కస్తూరిబాను ఆదేశించాడు. అది భరించలేక, ఇంట్లోనుంచి వెళ్ళిపోతానని కస్తూరిబా అంటే తలుపుతీసి ఆమెను గాంధి బయటకు గెంటాడు. అలాంటి నిరంకుశ ప్రవర్తన భార్యపట్ల, స్త్రీలపట్ల గాంధి చూపాడు. గాంధి తన సంతానం పట్ల కూడా క్రూరంగానే ప్రవర్తించాడు. పెద్ద కుమారుడు హరిలాల్ ప్రేమించి పెళ్లి చెసుకుంటానంటే, నా కొడుకువికాదు పొమ్మన్నాడు. దక్షిణాఫ్రికాలో జాతి విచక్షపై గాంధీ పోరాడుతున్నప్పుడు గోఖలే సందర్శించాడు. గాంధీ ఆయన్ను తన ఆశ్రమానికి తీసుకెళ్ళి ఆదరించాడు. ప్రభుత్వం కూడా గోఖలేను గౌరవంగా చూచింది. 1913 అక్టోబరు 28 గాంధీ, 2037 పురుషులు, 127 స్త్రీలు, 57 మంది పిల్లలతోసహా మినీ దండి మార్చివంటిది జరిపించి,అరెస్టు అయ్యాడు.

దక్షిణాఫ్రికాలో 21 సంవత్సరాలు పరిశోధనలు,పోరాటాలు చేసిన గాంధి,1914 జులైలో ఇండియాకు వచ్చేశారు. స్వాగతాలు, సన్మానాలు అందుకున్నారు. గోఖలే సలహాపై దేశం చుట్టివచ్చి, అహమ్మదాబాద్ వద్ద సబర్మతి ఆశ్రమం స్థాపించారు. నేత పరిశ్రమలో కార్మికుల పక్షాన అంబాలాల్ శారాభాయిపై పోరాడారు. ప్రచారం లభించింది.

బీహార్ లోని చంపరాన్ లోని నీలిమందు రైతుల పక్షాన బ్రిటిష్ వారిపై పోరాడిన గాంధీకి దేశవ్యాప్తంగా పేరొచ్చింది. గుజరాత్ లోని కేడాజిల్లా రైతులు దుర్భిక్షం వలన పన్నులు చెల్లించలేకపోతుండగా, అధికారులు వారిని పీడించారు. గాంధీ తన సత్యాగ్రహ ఆయుధాన్ని రైతుల పక్షాన ప్రయోగించారు.

1919 ఏప్రిల్ 19 రౌలట్ సత్యాగ్రహోద్యమాన్ని గాంధి నిలిపేశారు. సత్యాగ్రహం అహింసకు దారితీయడం,బ్రిటిష్ సైనికుల్ని హతమార్చడం ఇందుకు కారణం. తన అంచనాలు హిమాలయాలంత తప్పులుగా పరిణమించాయని గాంధి ఒప్పుకున్నారు. ఇదంతా గాంధీ గొప్పతనాన్ని చాటింది.

1919లో మోతీలాల్ నెహ్రూ గాంధీని మహాత్ముడన్నారు. ఆ మాట గాంధికి అతుక్కుపోయింది. 48 సంవత్సరాలకు గాంధీ జాతిపితగా మారాడు.

కాంగ్రెస్ లో తిలక్ మరణానంతరం, గాంధీ తిరుగులేని నాయకుడయ్యాడు. ముస్లింలను కలుపుకపోవాలనే ధోరణి బాగా చూపెట్టారు. ఖిలాఫత్ ఉద్యమాన్ని బలపరచారు. ముస్లింలలో ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్,అబుల్ కలాం ఆజాద్,అలీ సోదరులు, సుహ్రవర్దీ,అన్వారి వంటి నాయకులు జాతీయోద్యమంలో గాంధీ అనుచరులయ్యారు. కాని ముస్లిం ఓటర్లు,గాంధీని ఆమోదించలేదు. ఈశ్వర-అల్లా తేరేనాం ఒప్పుకోలేదు.

1920 నుండే కాంగ్రెసుకు అనధికార నియంతగా మారిన గాంధీ పన్నుల నిరాకరణ సత్యాగ్రహం,అహింసాయుత చట్ట వ్యతిరేకత,నిరాహారదీక్షల్ని నిరసన ఆయుధాలుగా ప్రయోగించారు. సామాన్య ప్రజలలో ముఖ్యంగా మధ్యతరగతి వారిలో చైతన్యం తెచ్చారు. 1925-30 మధ్య తన స్వీయచరిత్ర రాశారు. దేశపర్యటన చేశారు. ఖద్దరు ప్రచారం గావించారు. హరిజన, నవజీవన్ పత్రికలు పెట్టారు.

1930లో అహమ్మదాబాద్ వదలేసిన గాంధీ చనిపోయేవరకూ మళ్ళీఅహమ్మదాబాద్ లో స్థిరపడలేదు. 1930లో ఉప్పు సత్యాగ్రహం పేరిట జరిపిన దండి మార్చి, గాంధీ నాయకత్వాన్ని బ్రిటిష్ వారు గుర్తించేటట్లు చేసింది. జవహర్ లాల్ నెహ్రూను తన వారసుడుగా గాంధీ పేర్కొన్నారు.

1940 నుండి 42వరకు మరోసారి గాంధి దేశాన్ని కదిలించేశారు. వ్యక్తిగత సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలు గాంధి ప్రజా సైకాలజీ వాడుతున్న దానికి ఉదంతాలే. క్విట్ ఇండియా తరువాత స్వాతంత్ర్యం వచ్చేవరకూ గాంధీ ఉద్యమాలెవీ లేవు.

మొత్తంమీద దేశ స్వాతంత్ర్యోద్యమంలో మతాన్ని కలిపి, ప్రజల్ని రంగంలోకి తెచ్చిన గాంధి, రెండు విషయాలలో సెక్యులర్ ధోరణులు అలవరచలేకపోయారు. అంటరానితనం పోవాలని గాంధి ఎంతచెప్పినా ప్రయత్నించినా హిందూమతం వినలేదు. హిందూ-ముస్లింలు ఒకటేనని గాంధి నినదించినా ఉభయమతాలూ పెడచెవిన పెట్టాయి. స్వాతంత్ర్యోద్యమంలో ఒకపిలుపు యిస్తే గాంధీ పేరిట వీధుల్లోకివచ్చి, త్యాగం చేయడానికి సిద్ధపడినవారు, మతవిషయంలో గాంధీని ఎందుకు నిరాకరించారు! ఈ విషయం వివరంగా పరిశీలిస్తే, సెక్యులర్ ధోరణులు దేశంలో ఎందుకు అలవాటు కాలేదో స్పష్టపడుతుంది.

అంటరానితనం

అంటరానితనం అమానుషమని,అది అడుగంటిపోవాలని గాంధిభాయి అన్నారు. అంటరానితనం నశించకపోతే హిందూమతమే పోతుందన్నారు. భారత రాజకీయాల్లోకి ప్రవేశించినది మొదలు అంటరానితనంపై గాంధీజీ పోరాడారు. కాని అంటరానితనానికి అమ్మ ఎవరు? కులం. ఈ రెండింటికీ మూలం ఏది? మతం. అటువంటిది హిందూమతం జోలికి పోకుండా, అంటరానితనం ఎలా పోతుంది? ఇది అంబేద్కర్ ప్రశ్న.

కులాన్ని వదలేయండి అంటే మతాన్ని వదలేయమనే అర్థమని అంబేద్కర్ ఉద్దేశం. కులానికి హిందూమత ప్రమాణ గ్రంథాలు, ముఖ్యంగా వేదాలు, శాస్త్రాలు కొమ్ముకాస్తున్నాయి. వాటినికాదంటే హిందువుగా ఎలా నిలబడతారు? సమానత్వాన్ని అంటరానివారికి తెచ్చిపెట్టాలంటే హిందూమతంలో సాధ్యంకాదు. అందుకని, ఎన్నికలలో అంటరానివారికి ప్రత్యేక నియోజకవర్గాలు వుండాలని అంబేద్కర్ పట్టుబట్టాడు. 1930-31లో లండన్ లో జరిగిన ప్రథమ రౌండ్ టేబుల్ సమావేశంలో అంబేద్కర్ వాదనల్ని బ్రిటిష్ పాలకులు అంగీకరించారు.

అప్పుడు జైలులోవున్న గాంధి 'ససేమిరా' అంటూ, అంటరానివారు హిందువులకు దూరం కారాదన్నారు. బ్రిటిష్ వారి ప్రతిపాదన వ్యతిరేకిస్తూ ఆమరణనిరాహారదీక్ష పూనారు. అంబేద్కర్ తన పట్టు మానాలన్నారు. కులనాయకులు, మతనాయకులు గాంధీపట్ల సానుభూతి ప్రకటించారు. గాంధీ చనిపోతే దేశం నాశనమౌతుందన్నారు. అంబేద్కర్ వత్తిడికి లొంగిపోయి,గాంధీజీ కోరినట్లు హరిజనులకు ప్రత్యేక నియోజకవర్గాలు కోరబోనన్నాడు. శాసనసభలలో అంతకుముందు 71 స్థానాలుంటే వాటిని 148 వరకూ కేటాయించడానికి ఒప్పుకొని, హరిజనులకు మేలు చేసినట్లు నటించారు. పూనా ఒడంబడిక పేరిట హరిజనుల్ని మనుషులుగా సమానత్వంతో బ్రతకడానికి వీల్లేకుండా గాంధిభాయి కృషిచేసి, హిందూమతంలో హెచ్చుతగ్గుల్ని తెలివిగా, జాగ్రత్తగా కొనసాగించారు. సనాతనులు సంతోషించారు.

హిందూ-ముస్లిం భాయి భాయి

గాంధి చేసిన కృషిలో పాకిస్తాన్ ఏర్పడకుండా వుండాలని, హిందువులు ముస్లింలు కలసిమెలసి వుండాలనేది ముఖ్యం. ఈ విషయంలో గాంధి స్పష్టంగా విఫలమయ్యారు. రాజకీయంగా ఆయన యిచ్చిన పిలుపుల్ని గౌరవించి, రంగంలోకి దూకినవారు, మతపరంగా ఆయన ఉద్దేశాలను ఆచరణలో పెట్టడానికి సిద్ధపడలేదు.

మతాన్ని రాజకీయాల్లోకి తెచ్చిన గాంధి, తెలిసి, కావాలని ఆ పని చేశారు. రాజకీయాలకు మతానికి సంబంధం లేదనే వారికి మతం అంటే ఏమిటో తెలియదని గాంధి తన సత్యాన్వేషణ స్వీయగాధల్లో అన్నారు. భారతదేశంలో రామరాజ్యం ఏర్పరచాలని నినదించిన గాంధి, శాకాహారం, అహింస, అర్ధనగ్నంగా వుండడం, మతగ్రంథాలు పట్టుకొని ప్రార్థనా సమావేశాలు జరపడం, ఉపవాసాలు, నిరాహారదీక్షలు ఇత్యాదులన్నీ చేశారు. అన్ని మతాల సారాంశం ఒక్కటేనని గాంధి పదేపదే చెప్పారు. ఈ విషయాన్ని ఏ మత సనాతనులూ అంగీకరించలేదు. ఎవరి మతం వారికి గొప్ప. ఇంకో మతాన్ని గొప్పది అనడం, వేదికలపై రాజకీయ ప్రయోజనాల నిమిత్తం పైపైకి చెప్పే విషయమే. గాంధిచేసిన ప్రతి పని వెనుక హిందూ ప్రభావాన్ని చూచిన ముస్లింలు, ఆయన్ను అంగీకరించలేదు. కాంగ్రెసులో హిందూ ఆధిపత్యాన్నే వారు చూచారు.

ముస్లింలను కాంగ్రెసులో అట్టిపెట్టాలని, దేశ స్వాతంత్ర్య పోరాటంలో కలుపుకపోవాలని చేసిన ప్రయత్న ఫలితంగా లక్నో ఒడంబడిక వచ్చింది. ముస్లింలకు ప్రత్యేక ఎన్నికలు జరపడానికి ఒప్పుకున్నారు. ఖిలాఫత్ ఉద్యమాన్ని గాంధి సమర్ధించడంలోనూ యీ ఉద్దేశ్యం వున్నది. ముస్లింల కొరకు గాంధి చాలాదూరం పోతున్నాడని,హిందువుల ఆసక్తులు పట్టించుకోవడం లేదని, సనాతనులు విమర్శించారు. గోవధ నిషేధం కూడా ముస్లింలకు వర్తించరాదని గాంధి అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వం ఏ ఒక్క మతాన్ని అంటిపెట్టుకొని వుండరాదని, అన్ని మతాలు ఒకటే గనుక,ప్రభుత్వం అందరినీ సమానంగా చూడాలని గాంధి ఉద్దేశం. భారతదేశంలో యిలాంటి అభిప్రాయం వలన,పైకి ఎలా చెప్పినా, హిందూ మతానిదే పైచేయిగా వుంటుందని ముస్లింల ఉద్దేశం.

పాకిస్తాన్ కావాలనడంలో హిందూ వ్యతిరేకత వున్నదని, ఇస్లాం ప్రత్యేకతను కోరుకుంటున్నదనీ, కనుక పాకిస్తాన్ కు తాను వ్యతిరేకినని గాంధీ పదేపదే చెప్పారు. హిందూమతం-ఇస్లాం రెండు భిన్న సిద్ధాంతాలకు ప్రతినిధ్యం వహిస్తున్నట్లు తాను అంగీకరించనని గాంధీ అన్నారు. గీత-ఖురాన్ లలో దైవం ఒక్కటేనన్నారు. (చూడు : ఆనంద్ టి.హింగోరాని సంపాదితంలో టు ది హిందూస్ అండ్ ముస్లింస్-ఎం.కె.గాంధీ 1942 అలహాబాద్) ఇక్కడే ముస్లింలు గాంధీని వ్యతిరేకించారు. హిందువులూ ఆయన్ను అనుసరించలేదు. దేశంలోని ముస్లింలు అందరూ పాకిస్తాన్ వెళ్ళిపోవాలని సనాతన హిందువుల ఉద్దేశం. న్యాయం సమకూర్చడంలో, శాంతిభద్రతలు అందించడంలో,మురికి నీటిపారుదల, పరిశుభ్రత, రోడ్లు, రవాణా వంటి సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వ దృష్టిలో ముస్లింలని, హిందువులని తేడా వుంటుందా అంటారు గాంధి. కనుక ప్రభుత్వం మతరహితంగానే వ్యవహరించాలంటారు.

గాంధి చివరి దశలో తన అభిప్రాయాలు బాగా మార్చుకొని, సెక్యులరిజం అమలు జరగాలన్నారు. మత విషయాలలో ప్రభుత్వ జోక్యం ఏ మాత్రం వుండరాదన్నారు, కాని కాంగ్రెసులో సైతం నాయకులు పాకిస్తాన్ కు అనుకూలత చూపారు. దేశం విభజన జరిగితే శాంతి వుంటుదనుకున్నారు. బలవంతంగా గాంధీని ఒప్పించారు. మతపరంగా జరిగిన విభజన వలన లక్షలాది మంది చంపుకున్నారు. మతద్వేషాలు ఇంకా పెరిగిపోయాయి. బెంగాల్ లో గాంధీ పుణ్యమా అని కొంతవరకు తాత్కాలికంగా మతహింస ఆగింది. గాంధీ కోర్కెలకు విరుద్ధంగా దేశ విభజన జరిగింది. గాంధి సెక్యులరిజం విఫలమైంది.

గాంధి యిలా విఫలం గావడానికి మూలకారణాలు తెలుసుకోవడం అవసరం.

గాంధీ వైఫల్యం

మతంలోని సారాంశాన్ని సరిగా అర్థం చేసుకుంటే, హిందువులు ముస్లింలు కలసిమెలసి వుంటారని గాంధి నమ్మారు. ఈ "నిజం" అనేది ఎవరికి ఎట్లా అర్థమైనా,ఎవరి మతం యొక్క గొప్పతనం వారికి అట్టిపెట్టుకోవాలని, ఇతర మతాల కంటె తమది గొప్పదనీ భావించారు. అలా అనుకోకపోతే మతాలు పుట్టవు, పుట్టిన తరువాత వుండవు. మూర్ఖంగా నమ్మడం, ప్రశ్నించకపోవడం అనేవి మతానికి పునాదులు. మతం పట్ల మౌలికమైన అవగహన, పరిశీలన, పుట్టుపూర్వోత్తరాలు తెలిస్తే మతం సడలిపోతుంది. గాంధి కూడా హిందూమత సంప్రదాయాలలో మునిగి తేలిన వ్యక్తే. అందుకు ఆయన హిందూమతాన్ని ఏనాడూ శాస్త్రీయంగా పరిశీలించలేదు. అలాంటి ప్రయత్నం కూడా చేయలేదు. లౌకికంగా సమస్యల్ని చూచాడు. అది మతవాదులకు నచ్చలేదు.

జీవితమంతా మతాన్ని అంటిపెట్టుకున్న గాంధీకి,చివరిదశలో జ్ఞానోదయమైంది. పాకిస్తాన్ విభజనతో, లక్షలాది హిందూ-ముస్లింలు చనిపోయిన తరువాత గాని మతంలోని ప్రమాదాలు గాంధీకి తెలిసిరాలేదు.

"మతం వ్యక్తిగత విషయం వ్యక్తి స్థాయిలో మతాన్ని అట్టిపెట్టగలిగితే రాజకీయ జీవన రంగమంతా చక్కబడుతుంది" అని గాంధీ 1947లో హరిజన్ పత్రికలో రాశారు (మే 16, 23, ఆగష్టు 31 సంచికలు) ప్రభుత్వం ఏ విధంగానూ మతం జోలికి రాకూడదని,సహాయం చేయరాదని ఆయన అన్నారు. ప్రభుత్వ సహాయంతో కొనసాగే మతం వలన చాలా బాధలకు గురైనాం. ప్రభుత్వ నిధులపై ఆధారపడే మతం, మతమే కాదు అన్నారు గాంధీ (చూడు హరిజన్ 1948 మార్చి 23) అందుకు భిన్నంగా నేడు ప్రభుత్వ సంస్థగా మతం మారింది.

గాంధి సాధించిందేమిటి?

స్వాతంత్ర్యోద్యమంలో సామాన్యుల్ని చైతన్యవంతుల్ని చేయడంలో మతాన్ని ఆయుధంగా వాడి, గాంధి కొంతవరకు సాధించారు. ఆయన పిలుపు యిస్తే చాలు, జనం రంగంలోకి దూకారు. అయితే అటు హిందూ సనాతనులు, ఇటు ముస్లిం చాదస్తులు గాంధీ విధానాలను వ్యతిరేకించారు. రాజకీయ ప్రయోజనాల నిమిత్తం, వేదికలపై ఈశ్వర-అల్లా తేరేనాం అని పాడినా, ఉభయ మతాల వారు, ఎవరి గొప్పదనం వారిదే అనుకున్నారు. హిందూమతాన్ని ధ్వంసం చేస్తున్నాడని హిందూ కరడుగట్టిన తీవ్రవాదులు గాంధీపై కన్నెర్ర చేశారు. ముస్లింలు గాంధీని నమ్మకుండా, తమ పొయ్యి తామే ఏర్పరచుకుంటామన్నారు.

స్వాతంత్ర్యం వచ్చే నాటికి మతం నిర్వహిస్తున్న పాత్ర ప్రభుత్వం దాని పట్ల అనుసరించాల్సిన విధానం గాంధీకి స్పష్టమైంది. కాని అప్పటికే చాలా ఆలశ్యమైపోయింది. ఏ మత సామరస్యత కోసం గాంధీ పోరాడాడో ఆ మత ఛాందసం, అసహనం, హింసకే గాంధి ఆహుతయ్యాడు.

మతాన్ని అవగహన చేసుకోవడంలో గాంధి సామాన్య లౌకిక ధోరణి ప్రదర్శించారు. శాస్త్రీయ పంథా ఏనాడూ ఆయన చేబట్టలేదు. అందువలన గాంధీ విఫలం గాక తప్పలేదు. అయితే రాజకీయ రంగంలో మత విధానాలు వాడడానికి బ్రిటీష్ వారి పాలనలో సరిపోయింది. కాని, ఫాసిజం, కమ్యూనిజం, ముస్లిం ఇస్లాం రాజ్యాలలో ఇది సాధ్యమయ్యేదా? అని ప్రశ్నిస్తే, సాధ్యం కాకపోయేదే అనుకోవలసివస్తుంది. 20వ శతాబ్దంలో గాంధేయ అహింసా విధానాలతో స్వాతంత్ర్యోద్యమాలు జరగడం గొప్ప విశేషం. భవిష్యత్తు తరాల వారు ఆదర్శంగా తీసుకోగలిగిన అహింసాయుత పద్ధతులు గాంధీ అవలంబించారు. మతపరంగా ఆయన విధానాలు పూర్తిగా విఫలమయ్యాయి. సెక్యులర్ పద్ధతులకు దేశంలో గట్టి పునాదులు వేయలేని గాంధి మత అసహనానికి గురయ్యారు.

- హేతువాది, డిసెంబరు 1989; జనవరి 1990