అబద్ధాల వేట - నిజాల బాట/క్రైస్తవులు పునర్వికాసానికి దోహదం చేశారా ?

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
పునర్వికాస పరిణామం
క్రైస్తవులు పునర్వికాసానికి దోహదం చేశారా?

భారతదేశంలో క్రైస్తవులు మైనారిటీ వర్గంగా మూడోస్థానాన్ని ఆక్రమిస్తున్నారు. రెండోస్థానం ముస్లింలది. మెట్టమెదట కేరళలో అడుగుపెట్టిన క్రైస్తవులు, చాలా నెమ్మదిగా దేశంలో ప్రాకారు. యూరోప్ నుండి వచ్చిన వలస - సామ్రాజ్యవాదులంతా క్రైస్తవులే. ఆ విధంగా పోర్చుగీస్, డచ్, ఫ్రెంచ్,ఇంగ్లీషువారు ప్రత్యక్షంగా కొంత, పరోక్షంగా మరికొంత క్రైస్తవాన్ని దేశంలోకి తెచ్చారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీవారు భారతదేశంలో వ్యాపారం ప్రధానంగా భావించారు. మత, సాంఘిక విషయాలలో తటస్థంగా వుండాలనుకున్నారు. దేశంలో ప్రొటెస్టంట్ మతాన్ని ప్రచారంచేసే ఉద్దేశంతో 1698లో దేశీయ భాషలు నేర్చుకోవాలని పార్లమెంటు చట్టం చేసింది. కాని దేశంలో వ్యాపారం సాఫీగా సాగాలంటే మతం జోలికి పోరాదని కంపెనీ తన లౌకిక విధానంగా నిర్ణయించింది. ఆ పని పోర్చుగీసువారు చేయలేదు. 1546 నుండే పోర్చుగీసువారు గోవాలో కేథలిక్ శాఖను బలవంతంగా రుద్దారు. దేశీయ మతాచారాలపై ఆంక్షలు పెట్టారు. నేటికీ గోవాలో కేథలిక్ మతం వ్యాపించి వుండడానికి చారిత్రక కారణాలివే.

బ్రిటిష్ పాలకులు కొందరు తటస్థ వైఖరిని ప్రోత్సహించగా, మరికొందరు క్రైస్తవ మత ప్రచారాన్ని కాదనలేదు. కనుక మత ప్రచారకులు 1705 నుండీ తమ కార్యకలాపాలు పరిమితంగా సాగించారు. భారతదేశంలో మత ప్రచారాన్ని ప్రభుత్వపరంగా చేయాలనే ప్రయత్నాన్ని 1793లోనే బ్రిటిష్ పార్లమెంట్ నిరాకరించింది. 1813 నాటికి దేశంలో క్రైస్తవ మత ప్రచారకులకు అధికారిక స్థానం కల్పిస్తూ బ్రిటిష్ పార్లమెంటు ఆమోదం తెలిపింది. అమానుషమైన హిందూ ఆచారాలు కొన్ని తొలగించాలని మిషనరీలు పట్టుబట్టారు. సతీ సహగమనం, అంటరానితనం యిందులో వున్నాయి. లార్డ్ విలియం బెంటింగ్ గవర్నర్ జనరల్ గా సతీ సహగమనాన్ని నిషేధించడానికి భారతీయుల మద్దత్తు, సహకారం కోరాడు. రామమోహన్ రాయ్ వంటివారు నిషేధాన్ని అనుకూలించారు. ఛాందస హిందువులు వ్యతిరేకించారు. కుల ప్రాతిపాదికగా హిందువులలో వంశపారంపర్య ఆస్తి సంక్రమణ మొదలైన హక్కులు మతం మార్చుకున్న వారికి పోతాయి. ఇలా జరగరాదని 1832లో బెంగాల్ నిబంధన క్రింద శాసించారు. సనాతనులు ఎప్పటికప్పుడు తమ మత విషయంలో బ్రిటిష్ పరాయి పాలకులు జోక్యం చేసుకుంటున్నారంటూ అభ్యంతరపెడుతూనే వచ్చారు.

బ్రిటిష్ పాలకులు 1850లో చట్టం చేస్తూ మతాన్ని మార్చుకున్న వారితో సహా అందరికీ విద్యాసంస్థలలో నిధులు సమకూర్చుతామనీ,మతం మార్చుకున్న వారికి సైతం రక్షణ కల్పిస్తామన్నారు. అప్పుడే క్రైస్తవ మిషనరీలు విద్యాసంస్థల్ని బాగా ప్రారంభించాయి. సెక్యులర్ ధోరణిలో విద్య సాగాలని ప్రభుత్వం కోరింది. హిందూమతం ప్రమాదంలో వున్నదని సనాతనులు గోలపెట్టారు. 1857 సిపాయి తిరుగుబాటు అనంతరం విక్టోరియా రాణి చేసిన ప్రకటనలో క్రైస్తవ మతాన్ని బలవంతంగా రుద్దబోమన్నారు. మతంలో జోక్యం చేసుకోమన్నారు.

కాని 19వ శతాబ్దం మధ్యనుండే బ్రిటిష్ ప్రభుత్వం బిషప్పులను నియమించింది. మతపరంగా తటస్థంగా వుంటామన్న బ్రిటిష్ వారు ఆ సూత్రాన్ని దాటేశారు. క్రైస్తవ మతంలోకి హిందువుల్ని మార్చడం కొనసాగింది. బిషప్పులు ఇందులో ప్రముఖపాత్ర వహించారు. ప్రభుత్వ అజమాయిషీ తమపై వుండరాదని బిషప్పులు, క్రైస్తవ మతాధిపతులు పట్టుబట్టారు. క్రమేణా ప్రభుత్వ పట్టు సడలగా, క్రైస్తవ మతసంస్థలు తమ మనుగడ సాగించాయి. 1927లో బ్రిటిష్ పార్లమెంటు చట్టరీత్యా ఇంగ్లండ్ లో బిషప్పులను నియమించి ఇండియాకు పంపడాన్ని ఆపేసింది. మతంపై బ్రిటిష్ ప్రభుత్వం పెత్తనం వదిలేసి, ఇండియాలో కార్యకలాపాలకు స్వేచ్ఛనిచ్చింది. మతాధిపతులు చట్టరీత్యా స్వతంత్రులైనా బ్రిటిష్ ప్రభుత్వంలో సన్నిహితంగానే వుంటూ వచ్చారు. ఏదో రూపేణా ప్రభుత్వం నుండి దేవాలయాల నిర్వహణకు నిధులు లభిస్తుండేవి. ఇంగ్లండ్ చర్చికి ప్రభుత్వం నుండి దేవాలయాల నిర్వహణకు నిధులు లభిస్తుండేవి. రోమన్ కాథలిక్, వెస్లీ, ప్రెచిటేరియన్, శాఖలకు యిలాంటి ప్రభుత్వ ఆదరణ లభించకపోయినా, వారికి విదేశీ సహాయం అందేది. భారతదేశంలో బ్రిటిష్ వారి క్రైస్తవ మత విధానానికి 1948 మార్చి 31న స్వస్తి పలికారు. అంతవరకూ వున్న భారత క్రైస్తవ మత చట్టాన్ని రద్దుగావించారు. (The Indian Ecclesiastical Establishment Act)'

భారత రాజ్యాంగం ప్రకారం మతస్వేచ్ఛ అందరికీ వున్నది. మతాన్ని యధేచ్ఛగా అనుసరించవచ్చు, ఆచరించవచ్చు,ప్రచారం చేసుకోవచ్చు. ప్రభుత్వం యీ విషయంలో కేవలం ప్రజారోగ్యం, నీతి, ప్రజా కట్టుదిట్టాల దృష్ట్యానే జోక్యం చేసుకోవచ్చు. ఆయా మత సంస్థలు తమ సంస్థల్ని కొనసాగించవచ్చు. ఆస్తుల్ని సంక్రమింపజేసుకోవచ్చు. చట్టానికి లోబడి తమ సంస్థల, ఆస్తుల పాలన సాగించడానికి రాజ్యాంగ రీత్యా మతపరమైన వారికి హక్కులు వచ్చాయి. ఇది ఆసరాగా తీసుకొని క్రైస్తవ మిషనరీలు తమ కార్యకలాపాలను దేశంలో సాగించారు. విద్యాసంస్థల్ని, ఆసుపత్రుల్ని పెట్టారు. అల్పసంఖ్యాకవర్గంగా క్రైస్తవులు కొన్ని ప్రత్యేక హక్కులు పొందారు. దేశంలోని కొన్ని ప్రాంతాలలో క్రైస్తవుల కార్యకలాపాల్ని సనాతన హిందువులు అభ్యంతరపెడుతూ వచ్చారు. ఇవి మతకలహాలు వరకూ దారితీశాయి.

కేరళలో క్రైస్తవ విద్యాసంస్థలకు ప్రభుత్వ నిధులు భారీగా అందుతుండేవి. 1957లో సంబూద్రిపాద్ ముఖ్యమంత్రిగా కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడి, క్రైస్తవుల మతాధికారాల్ని తగ్గించే చట్టం తెచ్చారు. దీని ప్రకారం కొన్ని పరిస్థితులలో మత విద్యాసంస్థల యాజమాన్యాన్ని అవసరమనుకుంటే ప్రభుత్వం చేబట్టవచ్చు. సుప్రీంకోర్టు యిందుకు అభ్యంతరపెట్టింది. అయితే ఫీజుల వసూళ్ళు, ఉపాధ్యాయుల నియామకం, జీతాల చెల్లింపులో క్రమబద్ధత పాటించేటట్లు ప్రభుత్వం జోక్యం చేసుకోవచ్చని సుప్రీంకోర్టు పేర్కొన్నది. కేరళలో క్రైస్తవులు కమ్యూనిస్టు ప్రభుత్వ వ్యతిరేక ఆందోళన తీవ్రతరం చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కేరళలో క్రైస్తవుల ప్రవర్తన, దీనికి కాంగ్రెసు వారిచ్చిన మద్దత్తు వలన, సెక్యులరిజం అర్థం మారిపోయింది. మతం విజృభించి తన పరిధిని విస్తరించింది.

1909లో బ్రిటిష్ పాలకులు ఇండియాలో మతస్తులకు ప్రత్యేక ఓటు హక్కు యిచ్చారు. దీని ప్రకారం క్రైస్తవులు, ముస్లింలు, సిక్కులు తమ మతపరమైన అభ్యర్థులను ఎంపిక చేసుకునే హక్కు వున్నది. శాసనసభలలో ఆ విధంగా మత ప్రాతినిధ్యం వుండేది. భారత రాజ్యాంగం రూపొందించిన తరువాత యీ పద్ధతికి స్వస్తి చెప్పారు. బ్రిటిష్ పాలకులు సెక్యులర్ వ్యతిరేక ధోరణిలో మతాన్ని ప్రోత్సహించగా,క్రైస్తవులు దీనిని ఆసరా చేసుకొని మతవ్యాప్తికి కృషి చేశారు. భారత రాజ్యాంగం ప్రకారం మతపరంగా ఎలాంటి పన్నులను వసూలు చేయరాదు. కాని ప్రభుత్వపరంగా మత సంస్థలకు లభిస్తున్న సహాయం పరోక్షంగా పౌరులిచ్చే పన్నుల నుండే వస్తున్నది. సెక్యులర్ ధోరణులు దెబ్బతీయడానికి ప్రభుత్వ మతధోరణి బాగా తోడ్పడింది. రాధాకృష్ణన్, గాంధి ధోరణులు సెక్యులరిజాన్ని బాగా దెబ్బతీశాయి. నెహ్రూ రాజీపడ్డారు.

క్రైస్తవ మతస్తులు 1953లో నాగపూర్ లో సమావేశమై మతపరమైన విషయాలన్నీ వ్యక్తుల స్వేచ్ఛకు వదలివేయాలన్నారు. క్రైస్తవ మతంలోకి పేదవారిని మార్చే పద్ధతులు మత మిషనరీలు సాగిస్తూ పోయారు. ఇలా మతపార్పిడి చేస్తే హిందూ మతాచారాలు, ఆచార వ్యవహారాలు,భాష, వేషం, అన్నీ మారిపోతాయని గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. (హరిజన్ 1935 మే 11 క్రైస్తవ మిషనరీలు,దెయిర్ ప్లేస్ ఇన్ ఇండియా, 1941 నవజీవన్ ప్రెస్) మతమార్పిడి చట్టరీత్యా ఆపాలని కూడా గాంధి అన్నారు. (హరిజన్ 1935 మే 11) క్రైస్తవ బిషప్పులు యీ విషయమై హిందువుల ధోరణిని నిరసిస్తూ వచ్చారు. క్రైస్తవులుగా మారిన వారిని శుద్ధిచేసి తిరిగి హిందువులుగా మార్చడాన్ని కూడా గాంధి ఖండించారు.

మొత్తం మీద క్రైస్తవులు మతమార్పిడి ద్వారా తరచు మతకలహాలకు దారి చూపారు.

క్రైస్తవుల విమర్శల వలన భారతదేశంలో, ముఖ్యంగా 19వ శతాబ్దంలో బ్రహ్మసమాజ్ బాగా ప్రభావితమైంది. రామమోహన్ రాయ్, కేశవ చంద్రసేన్ యిందుకు నిదర్శన. ఆర్యసమాజ్ క్రైస్తవ వ్యతిరేకత చూపించింది.

తర్జన భర్జనలు సాగాయి. పరిమితంగా చదువుల్లో క్రైస్తవ మత ప్రచార ప్రభావం కనిపించింది. పేదరికం క్రైస్తవమతవ్యాప్తికి బాగా తోడ్పడింది. వైద్యం, విద్య, ఆహారం అస్త్రాలుగా ప్రయోగించి, క్రైస్తవ మిషనరీలు మారుమూలల్లో పేదల్ని ఆకట్టుకున్నారు. హరిజనుల్లో మతపార్పిడి చాలా చోట్ల చేయగలిగారు. బలవంతమైన మైనారిటీ శక్తిగా క్రైస్తవులు దేశంలో తలెత్తారు. మతమార్పిడి విషయమై క్రైస్తవులు రాజీపడలేదు. అది తమ హక్కుగా వారు భావిస్తున్నారు. క్రైస్తవ మతం విదేశీయం కాదనేటంత వరకూ పోయారు.

జవహర్ లాల్ నెహ్రూ ప్రధానిగా క్రైస్తవమతం భారతదేశంలో ప్రాచీనమైనదని, ఇంగ్లండ్ కు పోక ముందే భారతదేశానికి సిరియన్ క్రైస్తవులు వచ్చారన్నారు. (1955 డిసెంబరు 3 నెహ్రూ లోక్ సభ ప్రసంగం)

విద్యాసంస్థలలో మతబోధన చేస్తున్న క్రైస్తవుల ధోరణి పట్ల హిందువులలో నిరసన వ్యక్తమైంది. మతం అని సూటిగా అనకుండా నీతి పేరిట బైబిల్ లోని విషయాలు బోధించడం క్రైస్తవుల ఎత్తుగడ అయింది. మత ప్రచారం చేసుకునే స్వేచ్ఛ విషయమై ఎన్ని అవరోధాలు, చట్టపరిమితులు వున్నా, క్రైస్తవులు రాజీపడలేదు. బలవంతంగా మతమార్పిడి జరగరాదని రాజ్యాంగం చెబుతున్నా, ఆచరణలో యిది తేల్చడం కష్టమై పోయింది. రాజ్యాంగ నిర్మాతలలో కె.ఎం. మున్షి, వల్లభాయి పటేల్ వంటి వారు మత స్వేచ్ఛను సమర్ధించారు. అదొక వరంగా క్రైస్తవులు వాడుకుంటున్నారు.

మతం మార్చుకున్నప్పటికీ పౌరహక్కులు, ఆస్తిహక్కులు కోల్పోరని 1850లోనే బ్రిటిష్ వారు శాసనం చేసారు.

కాని హిందూ ఆస్తి సంక్రమణ చట్టం అందుకు విరుద్ధంగా వుంది. మతమార్పిడిని నిరుత్సాహపరచాలని హిందూ వంశపారంపర్య చట్టం (1956) ఉద్దేశించారు. మతం మారితే విద్యాసంస్థలో హరిజనులకు యిచ్చే ప్రభుత్వ సౌకర్యాలు వుండవని 1947లోనే బొంబాయి ప్రభుత్వం శాసనం చేసింది. ఇలాంటి ధోరణి యితర రాష్ట్రాలు పాటిస్తున్నాయి. మతపరంగా వచ్చిన యీ విచక్షణ సెక్యులర్ ధోరణులకు తీవ్ర ప్రతిబంధకమైంది. సమస్యను మనుషుల పరంగా చూడక, చట్టాలు చేసేటప్పుడు మతాన్ని దృష్టిలో పెట్టుకున్నారు. క్రైస్తవ మిషనరీల పట్ల ఒకవైపున సనాతన హిందువులు నిరసన వ్యక్తపరుస్తుంటే, ఉదారవాదులు వారి సేవల్ని ప్రస్తుతించారు. వారి విద్యావిధానాన్ని మెచ్చుకుంటూ తమ పిల్లల్ని మిషనరీ స్కూళ్ళకే పంపిస్తున్నారు. వారి "క్రమ శిక్షణ"ను తెగ పొగుడుతున్నారు.

స్వాతంత్ర్యానంతరం దేశంలో క్రైస్తవ మిషనరీలు విపరీతంగా పెరిగిపోయి 1952 నాటికే 4683 వరకూ వచ్చాయి. ఇందులో విదేశీయులు చాలా ఎక్కువగానే వుండేవారు. ఉత్తరోత్తరా వారి సంఖ్య తగ్గిపోగా, దేశీయులు ఆస్థానాల్లోకి వచ్చారు. క్రైస్తవుల చదువుల పట్ల మెప్పు వున్నా, మిగిలిన అన్ని విషయాల్లో వారి పట్ల దేశంలో చిన్నచూపు వున్నది. 1952 నుండీ క్రైస్తవ విదేశీ మిషనరీలకు వీసాలు యివ్వడం అదుపులోపెట్టారు. తీవ్రవాదులైన హిందూ సనాతనులు క్రైస్తవ వ్యతిరేక ప్రచారాన్ని ఉధృతం చేశారు. రామరాజ్యపరిషత్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, ఆర్యసమాజ్, హిందూ మహాసభ యిలాంటి కార్యకలాపాలు చేబట్టాయి. మధ్యప్రదేశ్ లో, నాసిక్ లో క్రైస్తవులకు వ్యతిరేకంగా హిందూ మహాసభ చేసిన ఆందోళన వలన 1954లో నియోగి సంఘాన్ని మధ్యప్రదేశ్ (పరగణాలు) ప్రభుత్వం నియమించాల్సి వచ్చింది.

క్రైస్తవులు మతమార్పిడి కార్యకలాపాలు ఎక్కువ చేసి అస్సాం నాగాలను, బీహార్ జార్ఖండ్ లను, మధ్యప్రదేశ్ లో ఆదివాసులను మార్చేస్తున్నారని హిందూ సంఘాలు ఫిర్యాదు చేశాయి. నియోగి సంఘం విచారణ జరిపింది. 1956లో (ఏప్రిల్ 18) యీ నివేదిక వెల్లడైంది. డా ఎం.బి. నియోగి నాగపూర్ హైకోర్టునుండి రిటైర్ అయిన ప్రధానన్యాయమూర్తి, ఆరుగురు సభ్యులు కూడా యీ విచారణ సంఘంలో వున్నారు. ఇందులో ఎస్.కె. జార్జి అనే సిరియన్ క్రైస్తవుడు కూడా వున్నారు. విచారణ పట్ల కేథలిక్కులు అభ్యంతరం తెలిపారు.

విచారణ సంఘ నివేదికను బట్టి, మతమార్పిడి దేశ ఐక్యతను విచ్ఛిన్నపరచే ఉద్దేశ్యంతో జరుగుతున్నది. ముస్లింలీగ్ వలె క్రైస్తవులు కూడా ప్రత్యేక రాష్ట్రాన్ని (దేశాన్ని) కోరవచ్చు. మతమార్పిడి చేస్తున్న మిషనరీలను ఉపసంహరించాలి. విదేశీయులను అదుపులో పెట్టాలి. మతప్రచార స్వేచ్ఛను భారతీయులకే పరిమితం చేసేట్లు రాజ్యాంగ సవరణ చేయాలి. మత ప్రచారాన్ని పూర్తిగా తొలగించే శాసనం కూడా ఉత్తరోత్తరా చేయాలని నియోగి సంఘం కోరింది.

ప్రభుత్వ అనుమతి లేకుండా క్రైస్తవ మత ప్రచార గ్రంథాలు పంచనివ్వరాదన్నారు. విద్యారంగాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే పూర్తిగా అట్టిపెట్టాలని, మతసంస్థల జోక్యం వుండరాదనీ అన్నారు. నియోగి సంఘ సిఫారసులను క్రైస్తవులు వ్యతిరేకించారు. హరే కృష్ణ మెహతాబ్, అల్లాడి కృష్ణస్వామి వంటివారు కూడా నియోగి సంఘ సిఫారసులను నిరసించారు. కాని సనాతన హిందూ మనస్తత్వాన్ని నియోగి సంఘ నివేదిక ప్రతిబింబించింది. సెక్యులర్ ధోరణులకు పచ్చి వ్యతిరేకతను చూపిన యీ నివేదికను అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చించారు.

క్రైస్తవుల-కమ్యూనిస్టుల దోబూచులాట!

కమ్యూనిస్టులు-కేథలిక్కులు దేశంలో సెక్యులరిజంతో బాగా ఆడుకున్నారు. కేరళలో కేథలిక్కులు కమ్యూనిస్టుల్ని కోపు వేసుకోవడం బిషప్పులకు వింతగా తోచింది. అలాంటి కమూనిస్టు మద్దత్తుదారులను మతం నుండి వెలిచేస్తామని బిషప్పులు బెదిరించారు. 1960లో కేరళలో కమ్యూనిస్టుల్ని బలపరచిన కేథలిక్కులను త్రివేండ్రం ఆర్చ్ బిషప్ వెలివేశారు. కమ్యూనిస్టుల్ని బాహాటంగా బలపరచినా, ఓటువేసినట్లు తెలిసినా అలాంటి కేథలిక్ లు వెలికి గురయ్యారు. ఇది అన్యాయమని కమ్యూనిస్టులు భావించారు.

లోక్ సభలో తరిమెల నాగిరెడ్డి కమ్యూనిస్టు సభ్యుడుగా బిల్లు ప్రవేశపెడుతూ రాజకీయల్లోకి మతం చొచ్చుక రావడాన్ని ఆపాలన్నారు. కేథలిక్ చర్చిని రాజకీయ ప్రయోజనాలకు వాడడాన్ని ఆపాలని బిల్లు ఉద్దేశించారు.

కమ్యూనిస్టుల బిల్లు ఓడిపోయినా,ఆసక్తికరమైన చర్చ సాగింది. తమ ఆధ్యాత్మిక ధోరణికి వ్యతిరేకంగా వున్న రాజకీయ పార్టీకి ఓటువేయవద్దని చెప్పే అవకాశం కేథలిక్కులకు వున్నదని హోంమంత్రి బి.ఎన్.దాతార్ వాదించారు. ఇందుకు సుప్రీంకోర్టు తీర్పుల్ని ఉదహరించారు. సనాతన హిందూలు, కొందరు కాంగ్రెస్ వారు సైతం నాగిరెడ్డి బిల్లును సమర్ధించారు. బిల్లు వీగి పోయిందనుకోండి.

లోక్ సభలో మరో కమ్యూనిస్టు సభ్యుడు ఎస్.వి.పరులేకర్ ప్రవేశపెట్టిన తీర్మానం కూడా ఆమోదించలేదు. ప్రార్థనా ప్రదేశాలు, యాత్రాస్థలాలు రాజకీయ ప్రచారానికి వినియోగించరాదని యిందలి సారాంశం. 1961 ఫిబ్రవరిలో వచ్చిన యీ అనధికార తీర్మానాన్ని సభ తిరస్కరించింది. ఈ విధంగా సెక్యులర్ వ్యతిరేక ధోరణులు చట్టసభలలో అధికారపక్షం ప్రదర్శిస్తూనే వచ్చింది.

భారతదేశ విద్యావిధానంలో మతపరమైన చదువు చెప్పాలని మన ప్రథమ విద్యామంత్రి అబుల్ కలాం ఆజాద్ అభిప్రాయపడ్డారు. ప్రధాని నెహ్రూ దీనిని వ్యతిరేకించారు. క్రైస్తవులు మతం అనకుండా, తమ పాఠశాలల్లో నీతిపేరిట క్రైస్తవేతరులకు బైబిల్ చెప్పినట్లే, హిందువులు ఆధ్యాత్మిక విలువల పేరిట చెప్పాలని కొందరు పేర్కొన్నారు. సి. రాజగోపాలాచారి మాత్రం మతపరమైన విద్య వుండాలన్నారు. ఏదో ఒక విధంగా మత విద్య వుండాలన్న వారిలో జాన్ మత్తై, ఎస్.ఆర్.దాస్ (భారత ప్రధాన న్యాయమూర్తి) రుక్మిణి అరుండేల్, డా॥సంపూర్ణానంద్ మొదలైనవారున్నారు. విద్యాసంఘాలు, ముఖ్యంగా రాధాకృష్ణన్ సంఘ నివేదిక సైతం ఏదో ఒక రీతిలో అన్ని మతాల కలగాపులగపు చదువునే కోరింది. అన్ని మతాల ఐక్యతా సూత్రాలు చెప్పాలన్నారు. అయితే క్రైస్తవులు ఇందుకు అంగీకరించలేదు. అన్ని మతాలు ఒకటే అనే సూత్రం ఏ మతానికీ అంగీకారం కాదని గ్రహించాలి.

ఒక మతం చెప్పిందే ఇంకోమతం కూడా చెబితే ఇక మతమార్పిడి దేనికి? "మా మతం, మా దేవుడు, మా వ్యవస్థ గొప్పది" అనే సూత్రం, నమ్మకంపైనే మతప్రచారం సాగుతుంది. మతమార్పిడి కూడా అంతే. అన్ని మతాల సారాంశం ఒక్కటే అనడం రాజకీయాల్లో వేదికలపై ఉపన్యాసాలకు పనికిరావచ్చు. మతకలహాల అనంతరం యిలాంటి ఉపన్యాసాలు తరచు చేస్తుంటారు. కాని మత నాయకులు, ముల్లాలు, పూజారులు, ఫాదరీలు ఎవరూ అన్ని మతాలు ఒకటే అనే సూత్రం అంగీకరించరు. గాంధి తన జీవితాంతం యీ సూత్రాన్ని ప్రచారం చేశారు. బేసిక్ విద్యలో సైతం యీ సూత్రమే ప్రతిపాదించారు. అయితే కొన్ని క్రైస్తవ పాఠశాలల్లో సాధారణ ప్రార్థనలకు అంగీకరించారు. ఇది ఎదురీత వద్దనుకొని చేసిన పనిమాత్రమే నీతిబోధన తరగతులకు తప్పనిసరిగా రానక్కరలేదని క్రైస్తవ విద్యాసంస్థలు పెర్కొన్నాయి. క్రైస్తవ విద్యాసంస్థలలో క్రైస్తవేతర ప్రార్థనలు వుండకపోయినా తప్పులేదని కలకత్తా హైకోర్టు తీర్పు చెప్పింది.(1957 ఎ.ఐ.ఆర్. కలకత్తా పుట 524)

దేశంలో క్రైస్తవులు విద్యారంగంలో తీవ్ర కృషి చేశారు,చేస్తున్నారు. 'వారి క్రమశిక్షణపై' జనానికి, ముఖ్యంగా మధ్యతరగతి, ఉన్నత వర్గాలకు సదభిప్రాయం వున్నది. ప్రాథమిక, నర్సరీ స్థాయి నుండే కాన్వెంట్ విద్యకు పిల్లల్ని పంపడం విలాసమై పోయింది. ప్రతిష్ఠతో కూడిన విద్యగా కాన్వెంట్ చదువులు వున్నాయి. క్రైస్తవులను అనుకరిస్తూ గ్రామాలలో, నగరాలలో విపరీతంగా కాన్వెంట్లు తలెత్తాయి. కేరళలో విద్యారంగంలో అక్షరాస్యతలో అగ్రస్థానంలోవున్న క్రైస్తవులు, నాగాలాండ్ వంటి కొండ ప్రాంతాల్లో తమ విద్యావిధానంతో జనాన్ని ఆకట్టుకున్నారు. కాలాగుణంగా క్రైస్తవులు మారి, దేశీయభాషలలో మతబోధ చేయడం కూడా వారి మత లౌక్యానికి, ఎత్తుగడకూ, పట్టుదలకూ సూచనలే. అవసరమైతే హిందూ ఆచార వ్యవహారాలతో రాజీపడి కట్టుబొట్టు పాటిస్తూనే, మతప్రచారం సాగిస్తున్నారు.

క్రైస్తవులలో మతం మినహాయిస్తే మిగిలిన హిందూ దోషాలన్నీ అంటుకునే వున్నాయి. ముఖ్యంగా కులాన్ని, అంటరానితనాన్ని పాటించడం ఘోరం. వారి దేవాలయాలలో సైతం ఉన్నత కులాలు, అంటరానివారిని వేరుగా కూర్చున్న సందర్భాలున్నాయి. కులాంతర వివాహాలు చేసుకోవడంలేదు. ఎన్నికలలో తమకులం అభ్యర్ధికి ఓట్లువేయడం క్రైస్తవులలో వున్న జాడ్యమే. మతం మారినప్పటికీ సెక్యులర్ విలువలు రాకపొవడానికి యీ కారణాలన్నీ వున్నవి. సిద్ధాంతరీత్యా, మతం మారినవారికి కులం వుండరాదు. ఆ దృష్టితోనే మతం మారిన హరిజనులు ప్రభుత్వం యిచ్చే సౌకర్యాలకు అనర్హులన్నారు. క్రైస్తవ హరిజనుల్ని హిందూ హరిజనులతో సమానంగా చూడడంలేదు. ఆందోళనల ఫలితంగా వీరిని "ఇతర వెనుకబడిన తరగతులు" గా పరిగణిస్తున్నారు.

భారతదేశంలో పాశ్చాత్యీకరణ, మానవ విలువలు, వ్యక్తి స్వేచ్ఛ వ్యాపించడానికి క్రైస్తవుల విద్య చాలావరకూ ఉపకరించింది. కాని మతపరంగా వ్యవస్థలు, కులాలు, ప్రచారాలు, మతమార్పిడి సెక్యులరిజానికి అడ్డుగా నిలిచాయి. క్రైస్తవుల ప్రాబల్యం దేశంలో కొన్ని ప్రాంతాలకే పరిమితం. మతకలహాలు కూడా క్రైస్తవుల పరంగా వున్నవి తక్కువే. దేశంలోని జనాభాలో వీరిశాతం 3 మాత్రమే. కాని మతపరంగా సమస్యలు పరిస్కారం కావాలని క్రైస్తవులు కోరుకున్నంతకాలం కలహాలు తప్పవు. అందరికీ ఒకే చట్టం వుండాలని అంగీకరిస్తేనే సెక్యులరిజం వస్తుంది. అందరూ చట్టం ముందు సమానం అని అంగీకరించక, క్రైస్తవులుగా తాము ప్రత్యేక చట్టాన్ని కోరుకుంటామన్నప్పుడే చిక్కువస్తుంది. అందుకే పునర్వికాస ఉద్యమానికి పరోక్షంగా తోడ్పడిన క్రైస్తవులు, ప్రత్యక్షంగా అడ్డుపడుతున్నారు!

- హేతువాది, ఫిబ్రవరి 1990