అబద్ధాల వేట - నిజాల బాట/పునర్వికాసానికి సిక్కుల అవరోధం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
పునర్వికాస పరిణామం
పునర్వికాసానికి సిక్కుల అవరోధం

భారతదేశంలో సిక్కులకు 500 సంవత్సరాల చరిత్ర వున్నది. గురునానక్ స్థాపించిన సిక్కుల మతం అటు హిందువుల, ఇటు ముస్లింల ఆచార సంప్రదాయాల సమ్మిళితంగా వచ్చింది. గురు పరంపర సంప్రదాయాన్ని పాటించే సిక్కులకు అర్జున్ వ్రాసిన ఆదిగ్రంధం ప్రమాణంగా వున్నది. గురుముఖ లిపిని పవిత్రంగా సిక్కులు పరిగణిస్తారు. సిక్కులు క్రమేణా వీరోచిత జాతిగా పరిణమించారు. ప్రత్యేక దుస్తులు ధరించడం, కృపాణం ధరించడం, జుట్టు పెంచడం వారి ప్రత్యేకత. సిక్కులు హిందువులలో భాగమేనని గాంధీజీ భావించినా, తరువాత అభిప్రాయం మార్చుకున్నారు. ముస్లింలకు పాకిస్తాన్ ఏర్పడినట్లే, తమకూ సిక్కిస్తాన్ కావాలని వారు బ్రిటిష్ వారిపై వత్తిడి తెచ్చారు. సిక్కులు ప్రత్యేక గురుద్వారాలు నిర్మించుకున్నారు. ఈ గురుద్వారాలకు విపరీతమైన ఆస్తులున్నవి. మహంతులనే పురోహితులకు వాటిపై అజమాయిషీ వున్నది. శిరోమణి గురుద్వార ప్రబంధక సంఘం యీ గురుద్వార ఆస్తులపై అజమాయిషీ వహిస్తుంది. వంశపారంపర్యంగా వీటిని నిర్వహిస్తున్న పురోహితుల పెత్తనానికి 1925లో చట్టపరంగా బ్రిటిష్ వారు స్వస్తి పలికారు. ఐదేళ్ళకో పర్యాయం ఎన్నికలద్వారా సిక్కులు ఎన్నుకునే సంఘానికి మతసంస్థలపై పెత్తనం ఏర్పడింది. ఈ సంఘానికి వున్న పెత్తనం దృష్ట్యా సిక్కులలో కలహాలు సంభవిస్తున్నాయి.

1920 డిసెంబరు 14న శిరోమణి అకాలీదళ్ ఏర్పడింది. అప్పటి నుంచీ సిక్కులు మతాన్ని రాజకీయాల్లోకి తెచ్చారు. పంజాబ్ లో సిక్కు జనాభా శాతం 13 మాత్రమే. అయినా శాసనసభలలో వీరికి జనాభాకు మించిన ప్రాతినిధ్యం లభిస్తూనే వున్నది. జాతీయోద్యమం ముమ్మరంగా సాగిపోతుండగా సిక్కులలో కొందరు ఉద్దాంసింగ్ నాగోకీ నాయకత్వాన దేశ స్వాతంత్ర్యానికి కృషిచేశారు. ఇందుకు భిన్నంగా జ్ఞాని కర్తార్ సింగ్ ఆధ్వర్యాన సిక్కులు కాంగ్రెసును ప్రతిఘటించారు. 1942 క్విట్ ఇండియా సందర్భంగా సిక్కుల చీలిక బయటపడింది. సిక్కిస్తాన్ కావాలనే ధోరణి వెల్లడైంది. సిక్కులు పాంథిక్ పార్టీని ఏర్పరచి, కాంగ్రెసును వ్యతిరేకించారు. (1946) వల్లభాయి పటేల్ వంటివారు సిక్కుల ప్రత్యేక సిక్కిస్తాన్ కోర్కెను తీవ్రంగా వ్యతిరేకించారు. దేశ స్వాతంత్ర్యం నాటికి పాకిస్తాన్ చీలినా, సిక్కుల కోర్కె తీరలేదు.

సిక్కిస్తాన్ కావాలంటూ స్వాతంత్ర్యానంతరం మాస్టర్ తారాసింగ్ ఆందోళనకు పూనుకున్నారు. 1949లో ఆయన్ను నిర్భంధించారు. అఖిలభారత అకాలీ మహాసభ 1951 మార్చిలో లూధియానోలో జరిపారు. సెక్యులర్ ప్రజాస్వామ్యం కావాలంటూనే సిక్కులకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలని సర్దార్ హుకుంసింగ్ నాయకత్వాన తీర్మానించారు.

సిక్కులలో కాంగ్రెసు,కమ్యూనిస్టు, అకాలీ పార్టీలకు చెందినవారున్నారు. అందరూ గురుద్వారాలపై పెత్తనం చలాయించే ప్రబంధక సంఘ ఎన్నికలలో తలపడుతూ వచ్చారు. మాస్టర్ తారాసింగ్ 1954లో యీ సంఘాధిపతిగా ఎన్నికయ్యారు. సిక్కుల మతం-రాజకీయాలు విడదీయరానివని ఆయన చాటారు. కాంగ్రెసును వ్యతిరేకిస్తూ సిక్కులకు ప్రత్యేక రాష్ట్రం కావాలన్నారు. హిందువులు పంజాబులో సిక్కులను అంతం చేయదలచారన్నారు. అలాంటి తారాసింగ్ రెండేళ్ళలో మాట మార్చి కాంగ్రెస్ లో విలీనం అయ్యారు! (1956 అక్టోబరు 2) మతపరంగా సిక్కుల ఆసక్తిని కాపాడుతూనే, రాజకీయంగా కాంగ్రెస్ లో వుండాలన్నారు.

ప్రబంధక సంఘ ఎన్నికలలో మాస్టర్ తారాసింగ్ 1958లో ఓడిపోయారు. ఆ తరువాత ప్రబంధక సంఘంలో నామినేటెడ్ సభ్యులను నియమించడానికి,సిక్కులు కానివారిని ఓటర్లుగా చేర్చడానికి చట్టాన్ని 1959లో మార్చారు. అమరణ నిరాహారదీక్ష బూనిన తారాసింగ్ ను శాంతింపజేయడానికి నెహ్రూ ఒక సంఘాన్ని నియమిస్తామన్నారు. పంజాబీ రాష్ట్రం కావాలని తారాసింగ్ నినదించారు. 1960 ఎన్నికలలో తారాసింగ్ ప్రబంధక సంఘంలో గెలిచారు. పంజాబీ సుబాకై ఆందోళన చేబట్టారు. అప్పుడే సంత్ ఫతేసింగ్ ను తారాసింగ్ రంగంలోకి దింపారు. తారాసింగ్ కు వ్యతిరేకంగా మరోవర్గం బయలుదేరింది. రాజకీయ పార్టీలు శిరోమణి ప్రబంధక సంఘంలో వుండరాదని పంజాబ్ ముఖ్యమంత్రి ప్రతాప్ సింగ్ కైరాన్ 1959 లో సూచించారు.

1962 అక్టోబరులో జరిగిన ఎన్నికలలో తారాసింగ్ నెగ్గారు. అప్పటి నుండే చీలిపోయిన సిక్కులు కలహాలకు దిగారు. హజారాసింగ్ గిల్ వర్గం 1965లో సంత్ ను అకాలీదళ్ నుండి బహిష్కరించింది. 1967లో అఖిల భారత సిక్కు కౌన్సిల్ ఉత్తమసింగ్ దుగ్గల్ నాయకత్వాన ఏర్పడింది.

1966లో పంజాబీసుబా ఏర్పడింది. మాస్టర్ తారాసింగ్ 1967 నవంబరు 22వ చనిపోయారు. సర్దార్ గుర్నాంసింగ్ నాయకత్వాన పంజాబ్ లో ఏర్పడిన అకాలీదళ్ మంత్రివర్గం అంతర్గత కలహాల వలన పడిపోయింది. చీలిపోయిన ముఠాలు 1968లో తాత్కాలికంగా కలిశాయి. అయినా చీలికలు ఆగలేదు. సర్దార్ గుర్నాంసింగ్ ఒక ముఠాకు, ప్రకాశ్ సింగ్ బాదల్ మరో ముఠాకు నాయకత్వం వహించారు. ఇలా చీలిపోయి, కలయికలు సాగిపోతుండగా, చండీఘడ్ నగరం పంజాబ్ లో వుండాలంటూ సంత్ ఫతేసింగ్ తాను అందుకై ఆత్మాహుతి గావిస్తానన్నాడు. 1972లో శిరోమణి అకాలీదళ్ అనే పార్టీ ఏర్పడింది. గుర్ బక్ష్ సింగ్ దీనికి నాయకత్వం వహించాడు. సంత్ ఫతేసింగ్ రాజకీయాలనుండి విరమిస్తానని, మళ్ళీ రంగప్రవేశం చేశారు. 1973లో జలంధర్ లో మరో అకాలీదళ్ ముఠా ఏర్పడింది. ఈ విధంగా అకాలీదళ్ చీలికలు గందరగోళాన్ని సృష్టించాయి. రానురాను వీరి పోరాటం కాస్తా, తీవ్రవాద స్థాయికి పోయింది. కాంగ్రెసు పార్టీ కొన్నాళ్లు భింద్రన్ వాలా అతివాద నాయకత్వాన్ని బలపరచింది. అప్పుడు జైల్ సింగ్ హోంమంత్రిగా వున్నారు. సిక్కులలో ఒక వర్గం తీవ్ర నిర్ణయం తీసుకొని సిక్కులకు ఖలిస్తాన్ కావాలన్నది. కొందరు సిక్కులు ఇందుకు అంగీకరించలేదు. ఖలిస్తాన్ కోరినవారు భయానక వాతావరణం సృష్టించ ప్రారంభించారు. విదేశాలలో శిక్షణ పొందడం, ఆయుధాలు సేకరించడం తీవ్రస్థాయిలో జరిగింది. శత్రు సంహారం చేపట్టారు. ప్రధాని ఇందిరాగాంధి హయంలో పంజాబ్ లో పరిస్థితి చేయిదాటిపోయింది. అతివాదులు గురుద్వారాలను, అమృత్ సర్ లోని స్వర్ణమందిర ప్రాంగణాన్ని ఆక్రమించారు. వారిపై సైనికచర్య తీసుకున్నారు. సిక్కులు అనేకులు చనిపోయారు. ఇది తీవ్ర నిరసనకు గురైంది. ప్రధాని ఇందిరాగాంధి భద్రతా సిబ్బందిలో వున్న సిక్కులు ఆమెను కాల్చి చంపారు. ఢిల్లీలోనూ, ఇతరచోట్లా సిక్కులను విచక్షణారహితంగా చంపేశారు. ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ సంఘటన సిక్కులలో చాలామందిని కాంగ్రెస్ కు, హిందువులకు దూరం చేసింది. విచారణ సంఘాలను నియమించినా ఉపశమనం జరగలేదు.

1989లో జరిగిన సాధారణ ఎన్నికలలో సిక్కులు కొందరు పంజాబ్ నుండి లోక్ సభకు ఎన్నికయ్యారు. రాష్ట్రపతి పాలనలో వున్న పంజాబ్ లో అతివాదుల చర్యల్ని అదుపులో పెట్టలేకపోయారు. వి.పి.సింగ్ ప్రధానిగా పంజాబ్ వెళ్ళి సిక్కుల సమస్య శాంతియుతంగా పరిష్కరిస్తామన్నారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా వున్నంతకాలం సిక్కులు శాంతం వహించలేదు.

మతాన్ని-రాజకీయాలను కలిపేసిన సిక్కుల సమస్య జటిలమైనదే.పునర్వికాసానికి, సెక్యులరిజానికి సిక్కుల ధోరణి ఆటంకమే.

- హేతువాది, మార్చి 1990