అబద్ధాల వేట - నిజాల బాట/హిందువులు మళ్ళీ పునర్వికాసం ఆరంభించాలి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
పునర్వికాస పరిణామం
హిందువులు మళ్ళీ పునర్వికాసం ఆరంభించాలి

భారతదేశంలో హిందువులు అత్యధిక సంఖ్యలో వున్నారు. ముస్లింలు అల్పసంఖ్యాకులు. క్రైస్తవులు మరీ తక్కువ. సిక్కులు ఒక రాష్ట్రంలో అధికంగా వున్నారు. బౌద్ధులు, పార్సీలు కూడా అల్పంగానే వున్నారు. అల్పసంఖ్యాకులు భయపడడం, తమ సంస్కృతిని, మనుగడను కాపాడుకోవాలనుకోవడం సహజం. కాని అటువంటి ధోరణి అధికసంఖ్యాకులైన హిందువులు కనబరుస్తున్నారు. ముఖ్యంగా కొన్ని సంఘాలు హిందువుల సంఘటన పేరిట తరచు ఆందోళనలు చేస్తున్నవి. ముస్లింలను, క్రైస్తవులను, సిక్కులను చూపి రెచ్చగొడుతున్నారు. సంకుచిత భావాలతో ప్రజల్ని ఆవేశపరుస్తున్నారు. మతకలహాలు అప్పుడప్పుడూ సంభవిస్తున్నవి. మతద్వేషాలు నిరంతరం ప్రబలుతున్నవి.

బ్రిటిష్ వారి పాలనలో, చీలించి పాలించే ఎత్తుగడలు కూడా,హిందూ-ముస్లిం ద్వేషాలకు బాగా దోహదం చేశాయి. క్రైస్తవులుగా మార్చడంలో బ్రిటిష్ వారి మద్దత్తు లభించడం వలన అక్కడక్కడ క్రైస్తవ-హిందూ ద్వేషాలు ప్రబలాయి.

కాంగ్రెసు పార్టీ ఏర్పడిన నాటికే దేశంలో ఆర్యసమాజ్ ప్రబలి వుంది. కాంగ్రెస్ లో అతివాదవర్గం మతపరంగా హిందువులను పురికొల్పింది. రాజకీయాల్లోకి మతభావాలు ప్రవేశపెట్టిన బాలగంగాధర్ తిలక్ గణేష్ ఉత్సవాలను, శివాజి పేరిట హిందువుల ఐక్యతను కోరాడు. రాజకీయాల్లో అదొక శాపంగా పరిణమించింది. హిందూ-ముస్లిం ద్వేషాలు పెచ్చరిల్లాయి.

కాంగ్రెస్ లోని అతివాదులు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా హింసను ప్రోత్సహించినారు. జాతీయవాదాన్ని, వందేమాతరం పేరిట హింసాత్మకతను కలిపేశారు. తిలక్, అరవిందో, లజపతిరాయ్, బిపిన్ చంద్రపాల్ యిందులో ప్రముఖపాత్ర వహించారు. ముస్లింలు కాంగ్రెసు పార్టీ ద్వారా తాము పోరాడలేమనుకున్నారు. ముస్లింల సంరక్షణ జరగదనుకున్నారు. అతివాదుల మతనినాదాలు వారిని భయభ్రాంతులను చేశాయి. కాంగ్రెస్ కు దూరమై ముస్లీంలీగ్ పెట్టుకున్నారు. జాతీయోద్యమంలో అంటీ అంటనట్లే వున్నారు. కొద్దిమంది జాతీయ ముస్లిం నాయకులు కాంగ్రెస్ ఉద్యమాల్లో పాల్గొన్నా, అత్యధిక ముస్లింలు వేరుగానే వుంటూ వచ్చారు. 20వ శతాబ్దం మొదటి భాగంలో హిందూ సంఘటన సంస్థలు వెలిశాయి.

హిందూ మహాసభ

లాంఛనంగా హిందూ మహాసభ 1907 నాటికే ఏర్పడినా, అంతగా వ్యవస్థీకరణ చెందలేదు. ఆర్యసమాజ్ వారి శుద్ధి ఉద్యమాన్ని బలపరచిన హిందూ మహాసభ తొలుత బలంగాలేదు. తిలక్ శిష్యుడుగా బయలుదేరిన సావర్కార్ హిందూ మహాసభలో ప్రముఖ నాయకుడుగా ఆవిర్భవించాడు. ముస్లింలుగా మారిన హిందువులను మళ్ళీ శుద్ధిచేసి హిందువులుగా మార్చడానికి వీరు కృషి చేశారు. ముస్లింలలో యిందుకు నిరసన, ప్రతిఘటన వచ్చింది.

కాంగ్రెసు మహాసభలు జరుగుతుండగా 1923లో బెల్గాంవద్ద హిందూ మహాసభ కూడా పెద్ద సమావేశం జరిపింది. ముస్లిం నాయకులతో సహా హిందూ ప్రముఖులు యిందులో పాల్గొని జాతీయోద్యమానికి మద్దతు ప్రకటించారు. హిందూ మహాసభ నాయకుడుగా ఆవిర్భవించిన వీరసావర్కార్ వ్రాసిన "హిందూత్వం" వారికి ప్రమాణ గ్రంథంగా మారింది. హిందువుల సంఘటన ప్రధాన నినాదమైంది. కాంగ్రెస్ కూ హిందూ మహాసభకూ అట్టేకాలం వియ్యం కుదరలేదు. 1930 తరువాత యిరువురూ ఎవరిదారిన వారు పోయారు. ఎన్నికలలో కాంగ్రెస్ కు పోటీగా హిందూ మహాసభ అభ్యర్థులను పెట్టింది. సావర్కార్ కొత్త నిర్వచనం ఇస్తూ, భరతభూమి తనదని భావించే ప్రతివారు హిందువేనని, యీ గడ్డపై పుట్టినవారంతా హిందువులని ప్రవచించాడు. హిందువులలో ముస్లింలు కలియరని, వారిని అనుమానాస్పదంగా చూడాలని సావర్కార్ అన్నారు. హిందూ మహాసభ అధ్యక్షుడుగా వున్న సావర్కార్ తన తీవ్ర ఉపన్యాసాలతో ముస్లింలను యింకా దూరం చేశాడు. హిందువులలో మాత్రం ఆయన అనుకున్నట్లుగా సంఘటన తీసుకరాలేకపోయాడు. హిందూ మహాసభ రాజకీయాలతో ఏనాడూ బలాన్ని పొందలేకపోయింది. సావర్కార్ హిందూ మహాసభ హిందువులు సొంతం చేసుకోలేదు.

హిందూమహాసభ సావర్కార్ నాయకత్వాన కొన్ని సంస్కరణలకు మద్ధత్తు ప్రకటించింది. అందులో హరిజనుల దేవాలయ ప్రవేశం ఒకటి. అంటరానితనం పోవాలన్నది.

స్వాతంత్ర్యం వచ్చాక, హిందూ మహాసభ అఖండ భారత్ నినాదాన్ని చేపట్టినది. పాకిస్తాన్- ఇండియా కలసిపోవాలని కోరారు. ఇందుకు అవసరమైతే యుద్ధం చేస్తామన్నారు. గోవధ నిషేధించాలన్నారు. శుద్ధి ఉద్యమం సాగిపోవాలన్నారు. హిందూ వివాహచట్టం తొలగించాలన్నారు. నిర్భంధ సైనిక శిక్షణ కావాలన్నారు. సావర్కార్ నినాదాన్ని పదేపదే ప్రచారం చేశారు. "రాజకీయాలు హైందవం కావాలి. హిందూమతం సైనిక ధోరణిలో సాగాలి" హిందూ సోషలిజం కావాలని హిందూమహాసభ నినదించింది. సావర్కార్, వి.జి.దేశపాండే, ఎన్.సి.చటర్జీ మొదలైన హిందూ మహాసభ నాయకులు హిందూ కోడ్ బిల్లును వ్యతిరేకించారు. భారతదేశంలో పునర్వికాసాన్ని అడుగడుగునా వీరు అడ్డుకొన్నారు. రాజకీయాలలో,ప్రతి ఎన్నికలలో హిందూ మహాసభ ఓటమిని చూచింది. అయినా వారు తమ ఫాసిస్టు ధోరణి విడనాడలేదు. రాజకీయాలలో నామమంత్రంగా నిలిచిన హిందూ మహాసభ సంస్కరణలకు అడ్డొస్తూ పునర్వికాసాన్ని ముందుకు సాగకుండా చేసింది.

రామరాజ్య పరిషత్

హిందూమహాసభవలెగాక రామరాజ్య పరిషత్ ఇంకా సనాతనంగా భారతదేశంలో తలెత్తింది. ఇది ప్రాంతీయ ప్రభావంతోనే రాజకీయాలలో పాల్గొన్నది. సెక్యులరిజాన్ని అడుగడుగునా వ్యతిరేకించిన రామరాజ్య పరిషత్ ఎన్నికలలో పాల్గొన్నది. ఏనాడూ ఎక్కడా బలం సంపాదించలేని రామరాజ్య పరిషత్ ప్రజల నిరాదరణకు గురైంది. రాజస్తాన్ లో స్థానిక భూస్వాముల ప్రాపకంతో యీ పరిషత్ తలెత్తుకొని వున్నది. కులవృత్తులను వంశపారంపర్యతను సమర్థించే పరిషత్ కాంగ్రెసు తలపెట్టిన సంస్కరణలను నిరసించింది.

1949 ఏప్రిల్ లో ఏర్పడిన రామరాజ్య పరిషత్ 1952 ఎన్నికలలో పాల్గొన్నది. ఉత్తరాది రాష్ట్రాలలో పరిషత్తుకు కేవలం 21 లక్షల ఓట్లు మాత్రమే వచ్చాయి. స్వామి కారపత్రి, స్వామి స్వరూపానంద సరస్వతి, నందనాల్ శర్మవంటి వారి నాయకత్వం పరిషత్ కు లభించినా, ప్రజల మద్దతు సంపాదించలేకపోయారు. సెక్యులరిజాన్ని పాశ్చాత్య ప్రజాస్వామిక భావాలను పరిషత్ వ్యతిరేకించింది. క్రమేణ ఎన్నికలలో పాల్గొనడం కూడా మానేశారు.

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం (ఆర్.ఎస్.ఎస్.)

1925లో ఆర్.ఎస్.ఎస్. కేవలం కొద్దిమంది మిత్రులతో డా॥ఇశావ్ బలరాం హెడ్గేవర్ ఆధ్వర్యాన ఏర్పడింది. అనాధ బాలుడుగా హెడ్గేవర్ 1916 నుండి కాంగ్రెస్ లో పనిచేశారు. హిందూ-ముస్లిం కలహాలు చూచి, హిందువులు సంఘటితపడాలని ఆయన ఒక నిర్ణయానికి వచ్చి,ఆర్.ఎస్.ఎస్. స్థాపించారు. ఆయనతోపాటే పెరిగిన యీ సంస్థ హెడ్గేవర్ చనిపోయే నాటికి(1940 జూన్ 21) లక్షమంది సభ్యులతో దేశంలో వ్యాపించింది. హిందూ-ముస్లిం కలహాలు సంభవించినపుడు ఆర్.ఎస్.ఎస్.ప్రముఖపాత్ర వహించింది. కలహాలలో గాయపడిన హిందువులకు సేవలు చేసింది. హిందువులలో ముఖ్యంగా సనాతనులలో ముస్లిం వ్యతిరేకత ప్రబలడానికి, హిందూ ఐక్యత కావాలనడానికి ఆర్.ఎస్.ఎస్. తోడ్పడింది.

హెడ్గేవర్ నాయకత్వాన ఆర్.ఎస్.ఎస్. హిందువులను సంఘటితపరచడానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నది. ఇదొక సాంస్కృతిక సంస్థ అని, రాజకీయాలకు సంబంధం లేదని స్పష్టపరచారు. హిందు సమాజాన్ని మళ్ళీ సజీవంగా పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. హిందు యువకులను సమీకరించి,ఉదయమే కసరత్తు చేయడం, హైందవ వీరోచిత ప్రసంగాలు వినిపించడం, స్వచ్ఛంద సేవకులుగా మలచడం వీరి నిత్యకృత్యాలు. రాజకీయంగా తొలుత హిందు మహాసభను బలపరచారు. ఆర్.ఎస్.ఎస్.లో హెడ్గేవర్ అత్యున్నతాధిపతి. ఆయన్ను సర్ సంఘ సంచాలకుడనేవారు.

హెడ్గేవర్ వారసుడుగా ఎం.ఆర్. గోల్వాల్కర్ సర్ సంఘ సంచాలకుడయ్యారు(1940). నాగపూర్ యీ సంస్థ కేంద్రం. వీరి సంస్థల్లో కార్యకలాపాలు రహస్యంగా సాగుతాయి. బహిరంగంగా సంఘ లక్ష్యాలు,ఆశయాలు తొలుత ప్రకటించలేదు. ఎన్నికలు కూడా ప్రజాస్వామికంగా జరిగినట్లు ఆధారాలు లేవు. గోల్వాల్కర్ నాయకత్వాన ఆర్.ఎస్.ఎస్. బాగా

తీవ్రస్థాయిని సంతరించుకున్నది. ఇదొక ఫాసిస్టు లక్షణంగా కాంగ్రెస్ కు,ఇతర పార్టీలకు అనిపించింది.

గాంధీజీని నాధూరాంగోడ్సే 1948 జనవరి 30న ఢిల్లీలో కాల్చి చంపిన తరువాత, ఆర్.ఎస్.ఎస్.ను ప్రభుత్వం నిషేధించింది. గొల్వాల్కర్ ను అనేకమంది ఆర్.ఎస్.ఎస్. వారిని నిర్భంధించారు. చట్టవ్యతిరేక సంస్థగా ఆర్.ఎస్.ఎస్.ను పేర్కొన్నారు. తమపై నిషేధం తొలగించమని ఆర్.ఎస్.ఎస్. డిసెంబరు (1948)లో సత్యాగ్రహం చేసింది. ఆర్.ఎస్.ఎస్. లక్ష్యాలను లిఖితపూర్వకంగా తొలిసారి ప్రకటించారు. 1949 జులై 8న నిషేధం తొలగించారు. రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా రావడానికి గోల్వాల్కర్ నిరాకరించారు. నెహ్రు మంత్రిమండలిలో వున్నా డా॥శ్యాంప్రసాద్ ముఖర్జీని ఒప్పించి, ఒక హిందూ సంస్థను రాజకీయపరంగా స్థాపించడానికి పూనుకొన్నారు. వసంతరావు ఓక్ ఇందులో ప్రధానబాధ్యత స్వీకరించారు. ఆర్.ఎస్.ఎస్. లోపాయికారిగా మద్దతు యిచ్చే అంగీకారంతో జనసంఘ్ పార్టీ ఏర్పడింది.

1948లో ఆర్.ఎస్.ఎస్.ను నిషేధించిన తరువాత ఎత్తుగడల రీత్యా గోల్వాల్కర్ అనేక ప్రకటనలు చేసినా, మూల లక్ష్యం నుండి మారలేదు. హిందువులను సంఘటిత పరచడం, ముస్లిం వ్యతిరేకత,సెక్యులర్ వ్యతిరేకత స్పష్టంగా బయటపెట్టారు. జనసంఘ్ తోనూ, తరువాత భారతీయ జనతాపార్టీగా మారిన రాజకీయ పక్షంతోనూ ఆర్.ఎస్.ఎస్. సన్నిహితంగా వున్నది. ఈ విషయమై తరచు వివాదం తలెత్తింది. 1978లో కేంద్రంలో జనతాపార్టీ అధికారంలోకి వచ్చినపుడు బి.జె.పి. ద్వంద్వ సభ్యత్వంపై గొడవ చెలరేగింది. ఇందిరాగాంధి ఎమర్జన్సీ ప్రవేశపెట్టినప్పుడు ఆర్.ఎస్.ఎస్. ప్రతిఘటించింది. కొందరు నిర్భంధానికి గురైనారు. గోల్వాల్కర్ వారసుడుగా సర్ సంఘ్ సంచాలకుడుగా దేవరజ్ వచ్చారు. జనసంఘ్,భారతీయ జనతా పార్టీలలో చాలామంది ప్రముఖులు ఆర్.ఎస్.ఎస్.నుండి వచ్చిన వారున్నారు. గోల్వాల్కర్ అభిప్రాయాలు అధ్యయనం చేసే ఆర్.ఎస్.ఎస్. వారు హింస సంఘటన విషయమై ఫాసిస్టు ధోరణి అవలంభించారు. హిందువులతో సమానంగా ముస్లింలకు,క్రైస్తవులకు సమాన హక్కులివ్వడం ఆర్.ఎస్.ఎస్.కు యిష్టం లేదు. దేశంలో పునర్వికాసానికి ఆర్.ఎస్.ఎస్. ప్రధాన అడ్డంకిగా నిలిచింది. మానవ హక్కులను,సమానత్వాన్ని హర్షించలేని యీ సంస్థ సంకుచిత సంస్కృతిని సమర్ధిస్తున్నది. 20వ శతాబ్దం నుండి 21వ శతాబ్దంలోకి పోవాల్సిన దేశాన్ని,వెనక్కు నడిపించాలని ఆర్.ఎస్.ఎస్. ప్రయత్నిస్తున్నది. అధిక సంఖ్యాకులైన హిందువులకు అప్పుడు ముస్లింలను,క్రైస్తవులను బూచిగా చూపి,కరడుగట్టిన సిద్ధాంతాలను యింకా ఆర్.ఎస్.ఎస్.నూరుపోస్తున్నది. ఈ సంస్థ అభిప్రాయాలను యధాతధంగా కాకున్నా, సడలించిన ధోరణిలో భారతీయ జనతా పార్టీ ప్రతిబింబిస్తున్నాయి.

అంటరానితనాన్ని, కులాన్ని కాదంటున్న బి.జె,పి హిందూ సంస్కృతే భారతీయ సంస్కృతి అంటున్నది. రాజకీయాలలో చురుకుగా వుండదలచిన యీ పార్టీ కొంత పట్టు విడుపులతో వ్యవహరిస్తున్నది. మొత్తంమీద ఏదొక నెపంతో ముస్లిం, క్రైస్తవ, శిక్కు, వ్యతిరేకతలు ఈ పార్టీ కనబరుస్తున్నది. గోవధ నిషేధం,హిందూ కోడ్ బిల్లు వంటి సమస్యలలో వీరికీ ఆర్.ఎస్.ఎస్.కూ తేడాలేదు. ప్రజల ప్రధాన సమస్యల్ని పక్కదారి పట్టించే రీతిలో మత విషయాలకు అధిక ప్రాధాన్యత యిస్తుంటారు. రామజన్మభూమి, బాబ్రీ మసీదు వివాదాలు ఇందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు. మతద్వేషాలు రెచ్చగొట్టి తద్వారా ఓట్లు ఆకర్షించాలనే ధోరణి వున్నంతవరకూ పునర్వికాసానికి చోటులేదు. మతం వ్యక్తి గత విశ్వాసంగా భావించి,వీధుల్లోకి నమ్మకాలను తీసుకురానంతవరకూ ఫరవాలేదు. బి.జె.పి. అలాంటి ధోరణి అవలంభించడం లేదు. ముస్లింలు అంతకన్నా సెక్యులర్ వ్యతిరేక ధోరణిలో పయనిస్తున్నారు. ఎవరి మతాన్ని వారు బలప్రదర్శనకు, ఓట్లు ఆకర్షణకు సంఘటితం, క్రమశిక్షణ, ఐక్యత, సంస్కృతి పేరిట వాడినంతవరకూ మానవహక్కులు అమలు జరగవు.

ప్రొఫెసర్ బలరాజ్ మధోక్,డా॥శ్యాంప్రసాద్ ముఖర్జి,దీన్ దయాళ్ ఉపాధ్యాయ అద్వాని, వాజ్ పేయి మొదలగు నాయకులు వివిధ దశలలో జనసంఘ్ ను, భారతీయ జనతాపార్టీని ముందుకు నడిపించారు. వీరు పేర్కొనే భారతీయ సంస్కృతి అంటే హిందూ సంస్కృతి మాత్రమే. పాకిస్తాన్ తో ఇండియాకు యుద్ధం సంభవించినప్పుడు, బంగ్లాదేశ్ విమోచనకు భారత్ సహాయపడినప్పుడు బి.జె.పి. ప్రభుత్వాన్ని సమర్ధించింది. ప్రధాని ఇందిరాగాంధీని భారతమాతగా వాజ్ పేయి శ్లాఘించారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ జనసంఘ్ నాయకుడుగా గాంధీజీని జాతిపిత అనడాన్ని ఖండించారు. (1961) జవహర్ లాల్ నెహ్రూ సెక్యులర్ పద్ధతులను జనసంఘ్ తీవ్రంగా ఖండించింది. ఉత్తరోత్తరా భారతీయ జనసంఘ్ తన పంధాను మార్చుకొని గాంధీజీని మహాత్ముడని గుర్తించింది. సతీ సహగమనాన్ని పూరీ శంకరాచార్య సమర్ధిస్తే బి.జె.పి. ఆయన్ను ఖండించింది. ఎటొచ్చీ ముస్లింల సమస్య వచ్చినప్పుడే బి.జె.పి. తన నిజస్వరూపాన్ని చూపుతున్నది. సెక్యులరిజం పేరిట ముస్లింలను దువ్వుతున్నారనేది బి.జె.పి. విమర్శలో సారాంశం. భారతీయ జనతాపార్టీ ఎన్నికలలో పాల్గొంటూ అనేక ఒడిదుడుకులకు లోనైంది. 1978లో కేంద్రంలో అధికారానికి వచ్చిన వారిలో బి.జె.పి. కూడా వున్నది. మళ్ళీ 1989లో బి.జె.పి. కేంద్రంలో ఏర్పడిన జాతీయ ఫ్రంట్ ప్రభుత్వాన్ని సమర్ధించింది. క్రమేణా కొన్ని రాష్ట్రాలలో బి.జె.పి. బలం అధికమైంది. పంజాబులో సిక్కుల సమస్య,కాశ్మీర్ లో ముస్లింల వివాదం,ఒకే పౌరస్మృతి వంటి సమస్యలు పరిష్కరించవలసి వచ్చినప్పుడు బి.జె.పి. సనాతన మతతత్త్వం బయటపెట్టవచ్చుననే ఆందోళన వున్నది. దేశంలో పునర్వికాసం రాకుండా బి.జె.పి. అడ్డుపడుతుందనే సూచనలు వున్నవి.

దేశంలో అత్యధిక సంఖ్యలో వున్న హిందువుల పక్షాన పార్టీలు ఏర్పడడం,వారిని రెచ్చగొట్టడం,వారి సంస్కృతిని కాపాడే పేరిట యితర మతస్తులపట్ల ద్వేషాన్ని ప్రబలించడం ఇత్యాదులన్నీ ఫాసిస్టు-నాజీ లక్షణాలే. కర్మ పునర్జన్మ వంటి మౌలిక దోషాలతో వెనుకబడి వున్న హిందువులు అంటరానితనం, కులం, మానవుల హెచ్చుతగ్గులనే భావాలతో మానసికంగా ఇతరత్రా కుంగిపోయారు. పవిత్ర గ్రంథాల ప్రమాణంగా ఆచరిస్తున్న యీ భావాలను పోగొట్టుకోవాలి! హిందువులలో పునర్వికాసానికి రామమోహన్ రాయ్, డిరోజియోలు 19వ శతాబ్దంలో నాంది పలికారు. రానురాను అవి వెనుకంజవేసి, మతమౌఢ్యం పెరిగింది. అందుకే ప్రపంచంలో ఇతరులతో బాటు ముందుకు పోలేకపోతున్నారు. ఇందుకు కృషి జరగాలి. వెనుకటి స్వర్ణయుగం అనుకుంటూ,రామరాజ్యం అనే భ్రమపూరిత నినాదాలతో ప్రజల్ని కొంతకాలం మభ్యపెట్టారు. శాస్త్రీయ పంధాలో, మానవవిలువలతో ముందుకు సాగాలంటే,గతం నుండి వస్తున్న దోషాల్ని, భారాన్ని తొలగించుకోవాలి. రాజ్యాంగానికి అడ్డొస్తున్న వాటిని దూరంగా పెట్టాలి. ముఖ్యంగా మతాన్ని వ్యక్తిపరంగా వుంచి, వీధుల్లో ప్రదర్శించనివ్వకుండా సాగాలి. ప్రజల్ని వెనుకబడినతనంలో అట్టిపెట్టి వారి ఓట్లతో ముందుకుపోదామనే పార్టీలు, సంస్థలు వ్యక్తులు పునర్వికాసానికి పెద్ద అవరోధం అని గ్రహించాలి. ఈ అడ్డంకి తొలగించుకోవడంలోనే విజ్ఞత వున్నది.

- హేతువాది, మే 1990