అబద్ధాల వేట - నిజాల బాట/ముందు స్వాతంత్ర్యం - తరువాత సంఘ సంస్కరణ
భారతదేశంలో పునర్వికాస ఛాయలు ముందుగా బ్రిటిష్ వారు పరిపాలించిన ప్రాంతాలలో కనిపించాయి. బెంగాల్, మద్రాసు, బొంబాయి రాష్ట్రాలలో కొత్త ఆలోచనలు వచ్చాయి. అలా మార్పుకు గురైన ప్రాంతాలలో మహారాష్ట్రను ప్రధానంగా పేర్కొనాలి.
మహారాష్ట్రలో బొంబాయి,పూనాలు చైతన్య కేంద్రాలుగా వుండేవి. మహారాష్ట్ర అంతటా హిందువుల సంఖ్య అత్యధికం. 88.5 శాతం హిందువులు కాగా, యిందులో బ్రాహ్మణులు కేవలం 45శాతమే వుండేవారు. వీరే మహారాష్ట్రలో 19శతాబ్దం చివర భాగంలోనూ, 20వ శతాబ్దం మొదట్లోనూ అన్ని రంగాలలో పెత్తనం చేశారు. 40 శాతం వున్న మరాఠీలు సమాజంలో మూగవారుగానే సేవలు చేశారు. వీరు ప్రధానంగా వ్యవసాయదారులు. అటు గ్రామ జీవితంలోగాని, ఇటు పట్టణ నాగరికతలో గాని సాంస్కృతిక, విద్యా, కళా రంగాలలో బ్రాహ్మణులే ఆధిపత్యం చేశారు.
బ్రాహ్మణులలో మళ్ళీ దేశస్థులనీ, చిత్ పవనులనీ రెండు శాఖలున్నాయి. బ్రాహ్మణులలో దేశస్థులు 45 శాతం వుండగా, చిత్ పవన బ్రాహ్మణులు 55వ వంతు వున్నారు. బ్రాహ్మణుల గురించి, అందునా చిత్ పవన శాఖ వారిని గురించి ప్రస్తావించవలసి వచ్చిందంటే, సామాజిక రంగంలో వారి ప్రాధాన్యత అంతగా వుందన్నమాట. చిత్ పవన శాఖ వారిలో 80 శాతం పూనాలో వుండేవారు. వీరు కట్టుగా వుంటూ తమ ఆధిపత్యాన్ని విస్తరింపజేసుకున్నారు. వీరికి శంకేశ్వర శంకరాచార్యుడు గురువు. ఆయనే వీరి కలహాలు తీర్చేవారు. మరాఠా సామ్రాజ్యంలో వార్తాహరులుగా పనిచేసిన చిత్ పవన బ్రాహ్మణులు ప్రభుత్వ రంగంలో అన్ని శాఖలలో విస్తరించారు. చివరకు పీష్వాలయ్యారు. ప్రభుత్వాలు వీరి సేవలకు బహుమానంగా మడులు మాన్యాలు యిచ్చి, పన్ను మినహాయించి సత్కరించాయి. బ్రిటీష్ వారి చేతుల్లో ఓడిపోయిన షీష్వాలు, కొత్త పరిస్థితులకు అనుగుణంగా పారిపోయారు. అది వారి సమయస్ఫూర్తికి, చతురతకూ నిదర్శనం. సాహిత్య, పౌరోహిత్య, సామాజిక రంగాలలో పెత్తనం మాత్రం తిరుగులేకుండా యీ బ్రాహ్మణులు నిర్వహించారు.
బ్రిటిష్ పాలనలో ముందుగా ఇంగ్లీషు చదువులు మొదలెట్టింది బ్రాహ్మణులే. బొంబాయి, పునా ఇంగ్లీషు పాఠశాలలు, కళాశాలల్లో బ్రాహ్మణులే అత్యధికంగా వుండేవారు. చిత్ పవన బ్రాహ్మణులు పౌరోహిత్యంలొ,వ్యవసాయంలో,వాణిజ్యంలో, విద్యలో, న్యాయ,వైద్య వృత్తుల్లో అల్లుకపోయారు. ప్రభుత్వోద్యోగాలలో అత్యధికసంఖ్యలో బ్రాహ్మణులే వున్నారు. ఈ విధంగా ఇంగ్లీషు విద్యవలన లభించిన సదవకాశాలను బ్రాహ్మణులే పొందారు. పత్రికారంగంలో కూడా యీ అవకాశాల్ని వారు వినియోగించుకున్నారు. విపరీతంగా సాహిత్య, చరిత్ర రచనలు కూడా బ్రాహ్మణుల కలంనుండే వెలువడ్డాయి.
అయితే బ్రిటిష్ వారు తెలివిగా సామాజిక మతరంగాల జోలికి పోలేదు. వాటిపై పూర్తి ఆధిపత్యం బ్రాహ్మణులదే. దేవాలయాల పెత్తనం బ్రాహ్మణులదే. వీటి ఆధారంగా సమాజ ఆలోచనారంగంపై వీరికి పట్టు వుండేది.
మహారాష్ట్రలో మహదేవ్ గోవింద రనడే, గోపాలకృష్ణ గోఖలే, బాలగంగాధర తిలక్, అగార్కర్ లు చిత్ పవన బ్రాహ్మణులే. వీరు భారత పునర్వికాస రంగంలో భిన్న పాత్రలు వహించారు. అందులో ప్రముఖంగా పేర్కొనదగింది పూనాలో స్థాపించిన సార్వజనిక సభ, 1870లో యిది ఆరంభమైంది. ఇది అన్ని కూలాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు పేర్కొన్నా, పెత్తనం చిత్ పవన బ్రాహ్మణులదే.
సార్వజనిక సభను ఆదర్శంగా స్వీకరించి బెంగాల్, మద్రాసు తదితర చోట్ల సభలు వెలిశాయి. ఉత్తరోత్తరా వివిధ సభల మధ్య కొంత సమన్వయం కూడా సాధించారు. ప్రభుత్వ చర్యలలో అనుకూలమైన వాటిని సమర్ధించడం సమాజ వ్యతిరేకమనుకున్న వాటిని ప్రతిఘటించడం, సార్వజనిక సభ కార్యకలాపాలుగా వుండేవి. లిట్టన్ ప్రభువు తెచ్చిన దేశభాషల పత్రికాచట్టాన్ని ఈ సభ వ్యతిరేకీంచింది. ఉన్నత విద్యకు ప్రభుత్వ సహాయం ఉపసంహరింపవలసి వచ్చినప్పుడు కూడా వీరు ప్రతిఘటించారు. స్థానిక స్వపరిపాలన విస్తరించాలని సభ కోరింది. మొత్తం మీద రాజకీయ, సామాజిక రంగాలలో సార్వజనిక సభ చాలా కీలకపాత్ర వహించింది. తరువాత భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనకు యీ సభ దారి తీసిందనే విషయం గుర్తుంచుకోవాలి.
సార్వజనిక సభలో చిత్ పవన బ్రాహ్మణాధిపత్యం వున్నప్పటికీ దృక్పథాలలో తీవ్ర విభేదాలున్నాయి. అవి సభా కార్యకలాపాలలో బయటపడ్డాయి. ఇక్కడే తిలక్, గోఖలే, అగార్కర్, రనడే పాత్రలు పరిశీలించాలి. వీరి ప్రభావం దేశంలో చదువుకున్నవారిపై బడింది.
బ్రిటిష్ పాలకుల దృష్టిలో చిత్ పనవ్ బ్రాహ్మణులు ప్రమాదకారులు. 1897లో ఇద్దరు బ్రిటీష్ అధికారుల్ని చేపేకర్ సోదరులు చంపేయడంతో బ్రిటిష్ పాలకులు వీరిపై నిఘా వేశారు. చిత్ పవన బ్రాహ్మణులలో తిలక్ వర్గం దేశానికి స్వాతంత్ర్యం ముందు అవసరమని, ఆ తరువాత సాంఘికసంస్కరణల సంగతి చూచుకోవచ్చనీ అన్నారు. రాజ్యాంగబద్ధంగా రాజకీయాలలో పాల్గొంటూ, సాంఘిక సంస్కరణలు కొనసాగించాలని ఒక వర్గం తలపోసింది. రాజకీయాలలో మతం వుండరాదని, సెక్యులర్ గా వుండాలని గోఖలే, మతంలోనే దేశీయ జాతీయ భావన రేకెత్తించాలని తిలక్ ఉద్యమించారు. ఈ అభిప్రాయాలే సార్వజనిక సభలో బయటపడి తీవ్రస్థాయికి పోయాయి. ఒకదశలో సభ కార్యదర్శి పదవికి తిలక్ రాజీనామా యివ్వక తప్పలేదు. గోఖలే ఆ స్థానానికి వచ్చారు. తిలక్ పంతంతో, పగబట్టినట్లుగా తన ప్రత్యర్ధులైన అగార్కర్, గోఖలే, రనడేలపై ధ్వజమెత్తాడు. మరాఠిలో కేసరి పత్రికను, ఇంగ్లీషులో మరాఠ పత్రిక పెట్టి, తిలక్ తన భావాలు ప్రచారం చేశారు.
పూనాలో సార్వజనిక సభను ఆక్రమించుకోడానికి తిలక్ ప్రయత్నించి, తనవారిని ఎంపిక చేయించారు. గోఖలే బయటకు పోయారు. బ్రిటిష్ వారు హిందూ వివాహ వయోపరిమితి చట్టం తేడానికి ప్రయత్నిస్తే తిలక్ వ్యతిరేకించారు.
కాంగ్రెసు మహాసభలతో బాటుగా ఏటా అదే ప్రాంగణంలో సాంఘిక మహాసభలు జరిగేవి. రనడే వీటిలో చాలా ప్రముఖపాత్ర వహించాడు. కాంగ్రెసు సభలను సాంఘిక సభలను, వేరుచేయాలని పట్టుబట్టిన తిలక్ 1885 పూనా కాంగ్రెసు సమావేశాలనాటికి తన పంతం తగ్గించుకున్నాడు.ఆ విధంగా పునర్వికాసానికి తోడ్పడుతున్న రనడేను తగ్గించి, తిలక్ సంఘాన్ని కొంత వెనక్కు తీసుకెళ్ళాడు. సార్వజనిక సభ తిలక్ నాయకత్వాన పనిచేయలేక, స్థంభించిపోయింది. ఈ నష్టాన్ని తీర్చడానికి సాంఘిక మార్పుల దృష్ట్యా, డక్కన్ సభను స్థాపించి రనడే, గోఖలేలు కృషిచేశారు. అయితే సార్వజనిక సభ చేకూరలేదు. మరోవైపు తిలక్ పూర్తిగా రాజకీయాలలో నిమగ్నుడై, మతాన్ని ఆధారంగా ప్రజలతో రాజకీయ చైతన్యత తీసుకురావాలనుకున్నాడు.