అబద్ధాల వేట - నిజాల బాట/పదండి వెనక్కు - వేదాల్లో విమానాలున్నాయిట !

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
పునర్వికాస పరిణామం
పదండి వెనక్కు-వేదాల్లో విమానాలున్నాయిట!

వేదాల్లోనే అన్నీ వున్నాయి. వేదేతరమైనవన్నీ తృణీకరించాలి. ప్రతి ప్రమాణం వేదాలకు మాత్రమే వున్నది. కనుక వేదకాలంలోకి పోదాం. అంటూ 19వ శతాబ్దంలో దయానంద బయలుదేరాడు. ఆర్యసమాజ్ ను స్థాపించాడు. క్రైస్తవులుగా,ముస్లింలుగా మారిన హిందువులను శుద్ధిచేసి మళ్ళీ హిందువులుగా మార్చే ప్రయత్నం చేశాడు. ఇంగ్లీషు చదువుల్ని,పాశ్చాత్య ఆలోచనా ధోరణులను కాదన్నాడు - ఉత్తరభారతంలో దయానంద్ బాగా పర్యటించాడు. విపరీతంగా ప్రచారం సాగించాడు. వేదప్రమాణాన్ని నిలబెట్టడానికి సనాతన పండితులను ఎదుర్కొన్నాడు. ఆర్యసమాజ్ ప్రభావం జాతీయభావాలు గలవారిపై ఎంతో పనిచేసింది. జనాన్ని వెనక్కు నడిపించింది.

భారతీయ తత్వశాస్త్రం, మతజ్ఞానం పరికిస్తే వేదప్రమాణాలను కాదన్న హిందువులు అరుదు. బ్రహ్మసమాజ్ లో కొందరు వేదం అపౌరుషేయం అనడాన్ని ప్రశ్నించారు. మిగిలిన వారంతా వేదాల్ని శిరసావహించారు. అయితే వేదాలకుతోడు ఉపనిషత్తులకు సైతం ప్రమాణాన్ని ఆపాదించారు. మరికొందరు గీతనుకూడా ప్రమాణంగా స్వీకరించారు. హిందువులకు దూరంగా జరిగిన జైనులు, బౌద్ధులు మాత్రం వేదాల్ని ఒప్పుకోలేదు. చార్వాకుడు స్పష్టంగా వేదాల్ని తృణీకరించాడు. షడ్డర్శనకారులందరూ వేదప్రమాణాన్ని అంగీకరిస్తూనే, ఒకర్ని మరొకరు నిరసించి, పూర్వ పక్షం చేయడానికి ప్రయత్నించారు. మేం చెప్పేదే వేదాలకు అనుకూలంగా వున్నదని రుజువు చేయడానికి తర్కాన్ని ప్రయోగించారు.

దయానందుడు బయలుదేరేనాటికి భారతదేశం విదేశీ పాలకులందరినీ చవిచూసింది. ముస్లింపాలన అంతమై ఇంగ్లీషువారి పాలన స్థిరపడింది. బ్రిటిష్ వారు దేశీయుల మతం, సాంఘిక ఆచారాల జోలికి పోరాదని అధికార విధానంగా భావించారు. కాని ఇంగ్లీషు విద్యల ప్రభావంతో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, పునర్వికాసం మొదలైన భావాలు పరిమితంగా ప్రభావితం చేశాయి. యూరోప్ నుండి వచ్చి మిషనరీలు మారుమూల గ్రామాలకు సైతం వెళ్ళి మతమార్పిడులు చేశారు. క్రైస్తవులుగా మారినవారిలో ఎక్కువమంది అంటరాని వారుండడం గమనించాలి. అక్కడక్కడా కొద్దిమంది శూద్రకులాలవారు, చెదురుమదురుగా అగ్రకులాలవారు క్రైస్తవులయ్యారు. బ్రహ్మసమాజీకులపై క్రైస్తవ ఆలోచనా ప్రభావం బాగా వున్నది. వెనువెంటనే సనాతన పండితులు మతమార్పిడిని నిరసిస్తూ, ఈసడిస్తూ పోయారు.

దేశంలో ముస్లింలుగా మారడం అప్పటికే యించుమించు పూర్తి అయింది. వందలాది సంవత్సరాల ముస్లిం పాలనలో యీ మార్పిడి జరిగిపోయింది. ఇందులోనూ తక్కువ కులాల నుండి ఎక్కువగా ఇస్లాంలోకి మారగా, పదవులు-హోదాలు ఇత్యాది కారణాల రీత్యా అగ్రకులాలలో కొందరు ముస్లింలుగా మారారు.

హిందువులలో తక్కువ కులాలవారిని నీచంగా చూడడం, అంటరానివారిని పశువులుగా పరిగణించడం శతాబ్దాలుగా వస్తున్నది. మత ధర్మశాస్త్రాలు యి ధోరణిని సమర్ధించాయి. అలాంటి హిందూ వ్యవస్త నుండి మతమార్పిడి జరిగింది. ఇది చారిత్రక వాస్తవం.

దయానందుడికి యీ విషయాలన్నీ తెలియకపోలేదు. అయినా హిందూ సమాజాన్ని పునీతం చేసి, కాపాడాలని కంకణం కట్టుకున్నారు. ఆయన ప్రభావం దృష్ట్యా ముందుగా జీవిత విశేషాలు తెలుసుకుందాం.

సన్యాసులందరివలె దయానందుడి అసలు పేరు మూలశంకరుడు. ఇతడి తండ్రి తివారి. తల్లి అమృతాబెన్. వారు శివభక్తులు. గుజరాత్ రాష్ట్రంలో కర్షన్ జిల్లాకు చెందినవారు. కుటుంబమంతా మత సంస్కృతి సంప్రదాయాలతో, భక్తిప్రపత్తులతో నిండివుండేది. 1824లో మూలశంకరుడు పుట్టాడు. సంస్కృతం చదివాడు. ఇంగ్లీషు జోలికి పోలేదు. మూలశంకరుడికి ఆప్తులు సన్నిహితులు, చదువు గలవారు అతడి సోదరి, అతడి మామ. వారిరువురూ చనిపోవడంతో అతడు మానసికంగా వికలత చెందాడు. ఇంట్లో సంప్రదాయాల బరువు, బాధ్యతలు సనాతన ఆచారవ్యవహారాలు చాలా హెచ్చు. ఉపవాసాలూ అంతే. అలాంటి ఒక సందర్భంలోనే మూలశంకరుడికి విగ్రహాల ప్రభావంపై అపనమ్మకం ఏర్పడింది. శివలింగంపై ఎలుకలు తిరగడంచూచి అలాంటి విగ్రహానికి విలువ ఏమిటని చేస్తున్న ఉపవాసం కాస్తా మూలశంకరుడు విరమించాడని ప్రతీతి. తల్లిదండ్రులకు యీ విషయం కోపంకూడా వచ్చిందట. అలా ఆలోచించిన మూలశంకరుడు తన ఆలోచనను తార్కికంగా విస్తరిస్తే ఎంతో ప్రయోజనం చేకూరేది. ఆ తరువాత మూలశంకరుడు గుజరాత్ లోని కౌషియాలో మతవిజ్ఞానం ఆర్జించాడు. అప్పటికే సన్యాసించాలనే భావన ప్రబలినట్లున్నది. తల్లిదండ్రులు పెళ్ళి తలపెడితే, మూలశంకరుడు తప్పించుకొని పారిపోయాడు. తండ్రి వెంటపడి, కుమారుని సన్యాసి కాకుండా సంసారిని చేయాలనే ప్రయత్నం విఫలమైంది.

19వ ఏటనుండే మూలశంకరుడు ఆశ్రమాలకు, సన్యాసులవద్దకు వెళ్లడంతో అతడి లక్ష్యం నిర్ధారణ అయింది.

మూలశంకరుడి పేరుమార్చి దయానంద అని నామకరణం చేసినవారు పరమానందుడు. ఆ తరువాత వివిధ ప్రదేశాలలో యోగాభ్యాసం, సంస్కృత వ్యాకరణం, తాంత్రిక విద్య కూలంకషంగా నేర్చాడు. వివిధ మఠాల తీరుతెన్నులు పరికించాడు. 1860 నాటికి విరాజానందస్వామి వద్దకు (మధుర) చేరాడు. అప్పటికి మూలశంకరుడికి 36 సంవత్సరాలు. అంధుడైన విరాజానందవద్ద మూడేళ్ళపాటు శుశ్రూషచేసి చాలా నేర్చుకున్నాడు. 1863 నుండి 75 వరకు దయానందుడు ఉత్తరాదిలో నిర్విరామంగా పర్యటించాడు. సుమారు 50 మత సమావేశాలలో పాల్గొని, చర్చలు జరిపి, వేదికలపై సనాతనులతో పోటీపడి, తనదే పైచేయి అనిపించుకున్నాడు.ఇంచుమించు 40 వివాదాస్పద సభలలో దయానందుడు తన వాదనా పటిమను నిరూపించాడు. వీటిలో కొన్ని క్రైస్తవుల, ముస్లింల సభలు కూడా వున్నాయి. హిందూమతంలో వేదేతరంగా జరిగే వాటిని ఎదుర్కొన్నాడు. వేదాలకు భాష్యం చెప్పాడు.

దయానందుడు తన మత ప్రచార పర్యటనలో బ్రహ్మసమాజవాదులైన కేశవచంద్రసేన్, దేవేంద్రనాద్ ఠాగోర్లను కలిశాడు. క్రైస్తవ మత ప్రభావం బ్రహ్మసమాజ్ పై ఎక్కువగా వున్నదని అభిప్రాయపడ్డాడు. గోవిందరనడే, ఆర్.జి. భండార్కర్లతో చర్చలు జరిపారు. ప్రార్ధనాసమాజ్ వారిని కలిశారు. ఇలా ప్రచారం సాగిస్తుండగా, దయానందుని పేరు అమెరికా వరకూ ప్రాకింది. దివ్యజ్ఞాన సమాజస్థాపకులైన బ్లావట్ స్కీ, ఆల్కాట్ లు తమ సంఘాన్ని దయానంద్ స్థాపించే ఆర్యసమాజ్ తో విలీనం చేస్తామన్నారు. ఆయన అందుకు అంగీకరించారు. 1879లో వారు భారతదేశానికి వచ్చి అనుకున్న ప్రకారం తమ సమాజ్ ను ఆర్యసమాజ్ తో కలిపారు. కాని ఆ సంయోగం అట్టేకాలం నిలువలేదు. 1881 లో విభేదాలతో వారు వేరయ్యారు.

1874 లో దయానందుడి సత్యార్థ ప్రకాశిక రచన వెలువడింది. తొలి ప్రచురణలో గోమాంసం సైతం కొన్ని పరిమితులలో తినవచ్చన్నాడు. ద్వితీయ ముద్రణ నాటికి ఆ అభిప్రాయం మార్చుకున్నాడు. క్రైస్తవ, ముస్లింలకు వ్యతిరేకంగా దయానందుడు రాసిన విషయాలను నేడైతే నిషేధించమనేవారే!

వీటిని తిరగరాశారు. సంస్కరణవాదులంతా యిా పని చేశారు రామమోహన్ రాయ్ ఏకేశ్వరవాదనకు అనుకూలంగా వున్నవాటినే స్వీకరించి మిగిలినవి వదలివేసినట్లు లోగడ గమనించాం గదా. అలాగే దయానందుడూ చేశాడు.

ఉదాహరణకు గాయత్రి జపంలో ప్రచోదయాత్ అనే పదాన్ని ప్రాణోదయాత్ అని మార్చేశారు. 'చోద్' అంటే అశ్లీలమైన అర్థం వుండటమే యిందుకు కారణం. అలాగే లింగం అంటే లైంగిక అర్థంలో చూడరాదని, వేదం ప్రకారం యీ పదానికి యజ్ఞస్ధూపం అని భావం అన్నారు. లింగాకారానికి లైంగిక అర్థం, చిహ్నం ఎలా లేకుండాపోతాయో ఆర్యసమాజ్ వారు చెప్పలేదు. సనాతనులు స్త్రీలకు పెట్టిన ఆంక్షలను ఆర్యసమాజ్ కొంతవరకు సడలించింది. స్త్రీలు వేదాలు చదవవచ్చనీ గాయత్రి జపం జపించవచ్చనీ, "ఓం" మంత్రోచ్చారణ చేయవచ్చనీ అన్నారు. సనాతనుల దృష్టిలో స్త్రీలంతా శూద్రులే! పరదా పధ్ధతి కూడా ఆర్యసమాజ్ ప్రోత్సహిం చలేదు. విధవలు మళ్ళీ పెళ్ళి చేసుకోవచ్చన్నారు. సతీసహగమనాన్ని తృణీకరించారు. ఇన్నాళ్ళుగా హిందూ సమాజంలో మతం పేరిట స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలను ఆర్యసమాజ్ కొంతమేరకు ఎదుర్కొన్నది. సనాతనుల అమానుష పద్ధతులను బట్టబయలు చేసింది.

దయానందుడు స్త్రీలపట్ల వింతగా ప్రవర్తించాడు. తన బోధనలకు స్త్రీలను రానిచ్చేవాడుకాడు. ఆర్యసమాజ్ వారు సహవిద్యను ప్రోత్సహించలేదు. విడిగానే పాఠశాలలు స్థాపించారు. అయితే స్త్రీలు కూడా ఆర్యసమాజ్ లో చేరవచ్చు. స్త్రీలను దూరంగా వుంచాలనే ధోరణి బుద్ధుడు మొదలు దయానంద వరకు చూపారు.

దయానందుడు అన్నింటినీ తృణీకరించి వేదాలవైపు భారతీయుల్ని నడిపించదలచాడు. కనుక వేదాలు మనల్ని ఎక్కడికి తీసుకపోతాయో చూడాలి.

1875 లో రాజకోటలో ప్రార్ధనా సమాజ్ ను పేరుమార్చి ఆర్యసమాజ్ గా దయానందుడు రూపొందించాడు. అది ఆరుమాసాలే కొనసాగింది. ఆ సంవత్సరం ఏప్రిల్ 10న బొంబాయిలో సంపన్న వర్తకుల మద్దతుతో ఆర్యసమాజ్ ను స్థాపించారు.

1877 జూన్ 24న లాహోర్ లో ఆర్యసమాజ్ ను స్థాపించారు. పంజాబ్ లో యిా సమాజం దశదిశలా వ్యాపించి తన ప్రభావాన్ని చూపెట్టింది.

ఆర్యసమాజ్ స్థాపించిన కొద్ది సంవత్సరాలకే దయానందుడు మరణించాడు.(1883 అక్టోబరు 10).

ఆర్యసమాజ్ ఒక సంస్కరణోద్యమ మత ప్రచారశాఖ, వేదాలవైపు వెనక్కు నడుద్దామని దయానందుడు ప్రచారం చేశాడు. హిందువులుగా వున్నవారు ఇతర మతాలలోకి మారరాదని, అప్పటికే మారినవారు, శుద్ధిపొంది, తిరిగి మాతృసంస్థలోకి రావచ్చునని దయానంద ఉద్బోధించారు.

దయానందుడు ఉపనిషత్తులతో సహా, వేదేతరమైన వాటికి శ్రుతి ప్రమాణాన్ని కాదనడం సాహసమే. బృహదారణ్యకోపనిషత్తులో దుర్భరమైన విషయాలున్నాయని (స్త్రీ పురుషుల లైంగిక ఆకర్షణ వంటివి) అలాంటి వాటికి శ్రుతి ప్రమాణం ఎలా కల్పిస్తారని ఆయన ప్రశ్నించాడు. అయితే వేదాలలో కూడా అంతకంటె దారుణ విషయాలు వున్నాయిగదా అవెలా సహిస్తావంటే, వేదాలలో విషయాలను గౌణఅర్థంలో చూడాలన్నారు. అంటే పైకి కనిపించే వాటికి నిగూఢమైన సూచనార్థం వుంటుదన్నారు. ఉపనిషత్తులను కూడా అలాంటి గౌణ(metaphorical) అర్థంలో చూడొచ్చుగదా అంటే, వీల్లేదన్నారు. నమ్మకాలకు తర్కం వుండదు. సహేతుకత వుండదు.

ఆర్యసమాజవాదులు ముఖ్యంగా దయానందుడు వేదాలలో సైతం కొన్నిచోట్ల మార్పులు చేశారు. తమ వాదనకు అనుకూలంగా వుండేట్లు ఉదాహరణకు కాలం గురించి వేదం ఏం చెబుతున్నది? కాలాన్ని కృత, త్రేతా, ద్వాపర, కలియుగాలుగా విభజించారు. కృతయుగం స్వర్ణయుగమన్నారు. తరువాత స్థాయిలో త్రేతాయుగం వున్నది. ద్వాపరలో పతనం మొదలైంది. ఇక కలియుగం పతనానికి, అవినీతికి నిలయం అన్నారు. యుగాంతంలో అంతా భగవంతునిలో లీనమై మళ్ళి కాలచక్రం కృతయుగంతో మొదలవుతుంది. ఇలాంటి కాలవిభజన ఎటువంటి పరిశీలనకూ నిలవదు.

సాపేక్షతా సిద్దాంత పరంగా వస్తున్న కాలానికీ, వేదాలలో ఆధారాలు లేని కాలానికీ సంబంధం లేదు. వేదకాలం కేవలం నమ్మకాలపై అంధవిశ్వాసాలపై వున్నది కనుక దయానందుడు మనల్ని అలాంటి కాలచక్రాన్ని నమ్మమంటే ఎలా వీలవుతుంది? వేదాల్లోకి పోవడమంటే వెనక్కు వెళ్ళి అంధకారంలో చిక్కుకుపోవడమే.

దయానందుడు హైందవ మతంలో అతివాదిగా జాతీయవాదులకు వీరత్వాన్ని ప్రసాదించి పెట్టాడు. క్రైస్తవం, ఇస్లాం కంటె హిందూమతం గొప్పదన్నాడు. ప్రపంచమంతా హిందూమతం వ్యాపించాలని, అందరినీ హిందువులుగా మార్చవచ్చుననీ ఆశించాడు. దయానంద భావాలను ఆచరణలోకి తేవడానికి లాలా మున్షీరామ్, లాలా హన్సరాజ్, లాలాలజపతిరాయ్, రామదేవ మొదలైనవారు కృషిచేశారు. ఆధునిక విజ్ఞానశాస్త్రంలోని మూల విషయాలన్నీ వేదాలలోనే వున్నాయని, రైళ్లు,విమానాల వంటివాటికి కూడా ఆనాడే బీజాంకురాలు పడ్డాయని దయానంద్ అభిప్రాయపడ్డాడు. సంఘాన్ని సంస్కరించాలని తలపెట్టిన దయానంద్, వేదాల ఆధారంగా అంటరానితనాన్ని తిరస్కరించాడు. వంశపారంపర్యంగా వచ్చే కులానికి వేదాలలో చోటులేదన్నాడు. అయితే ప్రతిభ ఆధారంగా వర్ణవ్యవస్థ వున్నదన్నాడు. బహుభార్యాత్వం కూడదన్నాడు. విగ్రహారాధన తప్పు అన్నాడు. వేదాలలో సంహిత మంత్రభాగం అంతా దోషరహితమని దయానందుడి ఉద్దేశ్యం. 19వ శతాబ్దంలో వచ్చిన రెండు సంస్కరణ ఉద్యమాలు జాతీయవాదులను ప్రభావితం చేశాయి. బ్రహ్మసమాజ్ మితవాదులను ఆకట్టుకున్నది. జాతీయ అతివాదులు ఆర్యసమాజ్ పట్ల ఆకర్షితులై విజృంభించారు. లజపతిరాయ్ ఇందులో అగ్రస్థానం వహించగా, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, సావర్కార్ లలో వివిధ రూపాలుగా వెల్లడైంది. కాంగ్రెసు పార్టీలో వీరు ఉగ్రవాదాన్ని ప్రబలింపజేశారు. వీరంతా మతాన్ని రాజకీయాల్లోకి తెచ్చారు. దయానంద్ వ్యక్తపరచిన ముస్లిం వ్యతిరేకతను పుణికిపుచ్చుకున్నారు. అది చిలవలు పలవలుగా పెరిగి తీవ్ర పరిణామాలకు దారితీసింది. సెక్యులర్ ధోరణి రాకుండా అడ్డుకట్ట వేసింది. "హిందూ మహాసభ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘలు ఉత్తరోత్తరా బయలుదేరి ద్వేషాల్ని రెచ్చగొట్టాయి. దీనికి మారుగా ముస్లింలీగ్, తదితర ముస్లిం మతసంస్థలు కూడా వేర్పాటువాదానికి దారితీశాయి. ముస్లింలు పరిపాలించిన, మతం మార్చిన చోట, ముఖ్యంగా పంజాబ్, నైజాం, హైదరాబాద్ లో ఆర్యసమాజ్ తన పాత్ర వహించింది. మిగిలిన చోట్ల ఆర్యసమాజ్ ప్రభావం నామమాత్రమే.

వేదాల్లో ఏముంది?

దయానందుడు ఆర్యసమాజ్ పెట్టి, హిందువులందరినీ వేదాల్లోకి నడిపించదలచాడు. మిగిలిన వాటినన్నీ కాదని, వేదాలు పట్టుకోడానికి అందులో ఏముంది? వేదాలు ప్రాచీనకాలంలో ఎందరో ఆలోచిస్తూ, ఆడుతూ, పాడుతూ, కంఠస్తం చేసిన విషయాలే. అవి సంప్రదాయబద్ధంగా విన్నంత , జ్ఞాపకమున్నంత ప్రచారంలోకి వచ్చాయి. ఎ ఒక్కరూ ఏర్చి కూర్చినవి కావు గనుక, మూల రచయిత ఎవరూ లేరు. రానురాను వీటికి దివ్యత్వాన్ని అంటగట్టారు. అపౌరుషేయాలన్నారు. ప్రమాణం అన్నారు. సుమారుగ చెప్పడం తప్స వేదాలు ఎప్పుడు బయటపడ్డాయో కాలనిర్ణయం కూడా ఖచ్చితంగా లేదు.

వేదాలలో ప్రార్ధనలన్నీ దేవుళ్ళను, దేవతలను, ప్రకృతిని ఉద్దేశించినవే. ఆరోగ్యం, సంపద, దీర్ఘకాలిక జీవనం, ధైర్యసాహసాలు, గెలుపు, వర్షాలు, పంటలు, బంగారం, కీర్తి మొదలైనవి కావాలని ప్రార్థనల సారాంశం. ఇదంతా ఆదిమ మానవుడి మనస్తత్వాన్ని సూచిస్తుంది. కార్యకారణవాదంలో ఆనాడు ప్రతిదానికి దేవుళ్ళు కారణం అనుకొని ప్రార్ధించారు. వేదాలలో చాలామంది దేవుళ్ళున్నారు. ఇంద్రుడు, సూర్యుడు, వరుణుడు మొదలైనవారు గద్దెనెక్కుతూ దిగుతూ, ప్రజేచ్చ ప్రకారం మారారు! మానవులు తమ లక్షణాలను, బలహీనతలను దేవుళ్ళకు అంటి తమలో లేని శక్తిని దైవానికి ఆపాదించారు. అలాంటప్పుడు చేసిన ప్రార్థనలలో అందమైన ఆకర్షణ పూరిత మంత్రాలు, శ్లోకాలు వున్నాయి.ఇది ఉద్వేగానికి సంబంధించిన విషయం. ఏకేశ్వరారాధన, బహుదేవతారాధన, ఏకశక్తి వూహ యిత్యాదులన్నీ వేదాలలో కనిపిస్తాయి. ఉత్తరోత్తరా పెంపొందిన దర్శనాలు,పురాణాలు, స్మృతులు అన్నీ వేదాలనే ప్రమాణంగా ఉదహరించడానికి యింత భిన్నత్వం, వైవిధ్యమే కారణం. దయానందుడు కులాన్ని కాదన్నా, వేదాల్లోని వర్ణవ్యవస్థను అంగీకరించాడు. ఈ వర్ణాలే కులపద్ధతికి మూలం. వేద మతాచారాలను ఉల్లంఘించిన శుాద్రులకు మరణదండన విధించిన స్మృతులు వేదోక్తంగానే చేశాయి.

వేదాలలో నరబలి అంగీకరించారు. (తర్కతీర్థ లక్ష్మణశాస్త్రిజ్యోషి-ఎ క్రిటిక్ ఆఫ్ హిందూయిజం,పుట 102) ఈ ఆచారాన్ని బ్రిటిష్ పాలకులు నిషేధించారు. బహుళ ప్రచారం పొందినట్లు ఆధారాలు లేవుగాని, ఆర్యులు నరబలి యిచ్చి సంపద పెంచుకోడానికి అది తోడ్పడుతుందని నమ్మినట్లు ఆధారాలున్నాయి.

రుగ్వేదంలోనే వర్ణాల ప్రసక్తి వున్నది. బ్రాహ్మణ, క్షత్రియ ప్రస్తావన వున్నది. ఆర్యులు, దస్యులు(బానిసలు)అని పేర్కొన్నారు. ఆర్యులే మొట్టమొదట దండెత్తి వచ్చి, వర్ణాలను సృష్టించారు. ఆధిపత్యం వహించిన ఆర్యులలో బ్రాహ్మణ క్షత్రియ, వైశ్య వర్ణాలు వచ్చాయి. వీరే సమాజంపై పెత్తనం చేశారు. వీరందరికీ సేవలు చేసేవారిని శూద్రులు అన్నారు. వేదయజ్ఞం చేసే అర్హత శూద్రులకు లేదు. సమాజంలో 75 శాతం ప్రజల శ్రమను అగ్రవర్ణాలవారు ఆనాటి నుండి దోపిడీ చేస్తూ, వస్తున్నారు. ఈ వేద వర్ణవ్యవస్థను దయానందుడు సమర్ధించాడు. అక్కడికి పోదామంటాడు. శూద్రుడు పితికిన పాలు కూడా అపవిత్రమన్న వేదంలోకి మనల్ని తీసుకెళ్ళాలని దయానందుడు ఉద్దేశించాడు. దయానందుడు ఎంత సంస్కరణవాది అయినా, పుట్టింది, పెరిగింది అగ్రవర్ణమైన బ్రాహ్మణకులంలోనే. ఆయన నేర్చిన విద్య కూడా బ్రాహ్మణాధిపత్యాన్ని ఆపాదించేదే.

వేదకాలంలోనే బ్రాహ్మణాధిపత్యంపై క్షత్రియుల తిరుగుబాటుకు ఆధారాలున్నాయి. బ్రాహ్మణులు శూద్ర స్త్రీతో వ్యభిచరించ వచ్చును. ఆ పని శూద్రుడు గనుక బ్రాహ్మణ స్త్రీతో చేస్తే నరికేయాలన్నారు. ఇలాంటి తారతమ్యాలు, జుగుప్సాకర విషయాలు వేదాలలో వున్నాయి. వాటికి ఆసరాగా స్మృతులు వెలువడ్డాయి. గౌతమ, వశిష్ట, ఆపస్తంబ, మనువు, యాజ్ఞవల్క్య, నారద, బృహస్పతి, శంఖలిఖిత స్మృతులలో మానవులను నాలుగు కులాలుగా చీల్చి అమానుష నియమాలు చూపారు.

వేదకాలంలోని యజ్ఞాలకు,జంతుబలులకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు వచ్చాయి. బౌద్ధవిప్లవం అందుకు ఒక ఉదాహరణ. వేదకాలంలోని అమానుషత్వాన్ని చార్వాకుడు బయటపెట్టాడు. మత అసహనం ఆనాటినుండే ప్రబలింది. చార్వాకుడిని తిట్టడానికి అతడి రచనల్ని ఉదహరిస్తే అవే నేడు మనకు ఆధారాలయ్యాయి. అంతకు మించి అతడు పూర్తిగా ఏమి రాశాడో లభించకుండా నాశనం చేశారు. అలాంటి వేదకాలంలోకి దయానందుడు మనల్ని పొమ్మంటున్నాడు.

వేదాలలో తన వాదనకు అనుకూలమైన వాటినే దయానందుడు స్వీకరించాడు. మిగిలినవన్నీ సూచనమాత్రంగా తీసుకోవాలేగాని, వాస్తవంగా భావించరాదంటాడు. ఇస్లాంకు, క్రైస్తవ మతానికి వ్యతిరేకంగా వచ్చిన ఆర్యసమాజం, దయానందుడి నాయకత్వాన దేశాన్ని కొంత మేరకు వెనక్కు నడిపించింది.

- హేతువాది, మే 1989