అబద్ధాల వేట - నిజాల బాట/పోపుగారి పాలు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
పోపుగారి పాలు

కేథలిక్ మతాధిపతిని పోప్ అంటారు. ఇతడిని కార్టినల్స్ రహస్యంగా ఎన్నుకుంటారు. ప్రపంచంలో నూరుకోట్ల కేథలిక్కులకు పోప్ బ్రతికున్న దైవదూత. అతది మాటను శిరసావహిస్తారు. ఇంత మంది జనానికి ఆధిపత్యం వహిస్తున్న పోప్ ను రాజ్యాధిపతులు గౌరవిస్తారు. ఓట్ల కోసం రాజకీయ నాయకులు పోప్ మాట వింటారు. ఇది ఆసరాగా తీసుకొని పోప్ తన పెత్తనాన్ని అనేక విధాల విస్తరింపజేసుకోడానికి ప్రయత్నిస్తాడు. ఇది ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచనాటకం.

పోప్ లు గతంలో చేసిన దుర్మార్గాలు, చేయించిన ఘాతుకాలు పెద్ద గ్రంథంగా చరిత్ర చెబుతున్నది.

ఇర్వింగ్ వాలెస్ తన లిస్టులు గ్రంథంలో పోప్ లియో సంభోగిస్తూ మరణించిన సత్యాన్ని పేర్కొన్నాడు. అదొక పరాకాష్ఠ.

మతాన్ని రాజకీయాలతో రంగరించిన పోప్ లు రాజులను తలదన్నే రారాజులుగా చెలామణి అయ్యారు.

ఫ్రెంచి నియంత నెపోలియన్ ఇద్దరు పోపులను జైలులో పెట్టాడు. 7వ పయస్, 8వ పయప్ లు అలా నెపోలియన్ వ్యతిరేకతతో కటకటాలు చూచారు.

19వ శతాబ్దంలో ప్రపంచ వాటికన్ సమితి ఒక నిర్ణయం చేసింది. ఇది 1870లో వెలువడింది. దీని ప్రకారం పోప్ నిర్ణయాలు తిరుగులేనివి. వాటిలో దోషం గాని, లోపం గాని వుండదు.

ఆధునికతను పూర్తిగా వ్యతిరేకించమని పోప్ 10వ పయస్ అందరికీ ఉత్తరువులిచ్చాడు. అలాంటి పోప్ రుషి(సెయింట్) అని పోప్ 12వ పయస్ పట్టం గట్టాడు.
12వ పయస్ పోప్ చరిత్రమలుపు తిప్పిన వ్యక్తి. అతడు మరొక రుషి అని నేటి పోప్ ప్రకటించాలనుకుంటున్నాడు. దీనికి కార్యక్రమం మొదలైంది.

12వ వయస్ పోప్ ఇటలీలో యూజివో కుటుంబీకుడు. 1876లో పుట్టిన యూజినో పచెలి చాలాభాషలు ధారాళంగా మాట్లాడేవాడు. వాటికన్ రాజకీయాలలో చాలా ప్రాధాన్యత వహించిన పచెలి, యూదు వ్యతిరేకి. వాటికన్ నిర్ణయాలలో ఇతడు అతిప్రముఖపాత్ర నిర్వహించాడు.

హిట్లర్ తో చెట్టపట్టాలు.

పోప్ గా ఎన్నికకాకముందే యూజినోపచెలి వాటికన్ ప్రతినిధిగా జర్మనీ రాజకీయాలలో నాటకాలాడాడు. అధికారానికి వస్తున్న హిట్లర్ తో జర్మన్ కేథలిక్కులు ఒడంబడిక కుదుర్చుకోడానికి యితడే కారకుడు. జర్మనీలో కేథలిక్కులకు విద్యా, వైద్య తదితర సౌకర్యాలు, ప్రచార అనుకూలతలు యివ్వడానికి హిట్లర్ అంగీకరించాడు. దీనికి బదులుగా హిట్లర్ కు వ్యతిరేకత లేకుండా జర్మనీలో కేథలిక్ రాజకీయ పార్టీని పార్లమెంటునుండి వైదొలగేటట్లు యూజినో పచెలి ఒప్పించాడు.

ఇంతటితో హిట్లర్ కు ప్రధాన ఆటంకం తొలగింది. నియంతృత్వాన్ని చట్టబద్ధం చేయడానికి హిట్లర్ కు యూజినో పచెలి బాగా తోడ్పడ్డాడు. ఇది 1933లో జరిగిన ఉదంతం. నాజీ నియంతృత్వానికి ఇలా మద్దత్తు యిచ్చిన కేథలిక్కులకు యూజినో పచెలి నాయకుడు. ఉత్తరోత్తరా యితడే పోప్ అయ్యాడు.

1939లో యూజినో పచెలి పోప్ గా ఎన్నికయ్యాడు. హిట్లర్ కు మరింత కలసివచ్చింది! యూదులను హతమార్చడానికి హిట్లర్ వేసిన పధకాలకు కొత్త పోప్ పరోక్షదీవెనలు లభించాయి.

అంతకు ముందు చనిపోయిన పోప్ హిట్లర్ కు వ్యతిరేకంగా ప్రకటన యివ్వాలనుకున్నాడు. తగినంత సమాచారంతో అలాంటి ప్రకటన జారీచేయబోతుండగా 11వ పయస్ చనిపోయాడు. వెంటనే ప్రకటన స్వాధీనం చేసుకున్న 12వ పయస్ పచెలి మళ్ళీ దానిని వెలుగుచూడనివ్వలేదు.

యూదులను మట్టుబెడుతున్న హిట్లర్ కు వ్యతిరేకంగా గాని, ఫాసిస్టు నియంత ముసోలినీకి విరుద్ధంగా గాని పోప్ మాట్లాడలేదు. ఆనాడు పోప్ వ్యతిరేకించివుంటే యూదులు అలా హతమయ్యేవారుకాదు. అయితే పోప్ కూడా యూదుల వ్యతిరేకిగదా. మానవహక్కుల గొడవ వారికి పట్టదు. దైవహక్కుల పేరిట మానవుల్ని చంపడం వారిలీల! దీనిపై ప్రపంచంలో తీవ్ర విమర్శ వచ్చింది. పొప్ దుర్మార్గ ప్రవర్తన ఖండనకు గురైంది.

పోప్ 12వ పయస్ తన దర్శనార్ధం వచ్చిన సుప్రసిద్ధ బ్రిటిష్ కవి టి.ఎస్. ఇలియట్ సాహిత్యంపై బోధచేశాడు. ఫ్రాన్స్ లో కేథలిక్ మేధావి టైల్ డి షార్డిన పరిణామాన్ని గురించి రాజీపడగా పొప్ అతడ్ని ముప్పుతిప్పలు పెట్టాడు. చివరకు అతడు అమెరికా ప్రవాసం పోవలసి వచ్చింది. అలా శిష్యుల్ని కూడా కాలరాచారు.
కేథలిక్కులు స్త్రీలను ద్వితీయ పౌరులుగా,బానిసలుగా చూస్తారు. పోప్ పయస్ 12 దీనికి ఆమోదముద్ర వేశాడు.

అలాంటి పోప్, రండవ ప్రపంచ యుద్ధానంతరం, తనకు పడకగదిలో జీసస్ క్రీస్తు కనిపించాడని చెప్పడం మొదలెట్టాడు. ఇందుకు రుజువులు సాక్ష్యాలు అక్కరలేదుకదా. సాక్షాత్తు పోప్ చెబుతుంది భక్తులు నమ్మక ఏంచేస్తారు?

ఉద్యానవనంలో సూర్యుడు రంగురంగులుగా తిరుగుతున్నట్లు కనిపించాడని పోప్ మరొక విడ్డూరాన్ని ప్రచారం చేశాడు. అప్పుడు పక్కనే వున్న అతని డ్రైవర్ జవాని స్టెఫనోరి తనకు అలాంటి రంగులు కనిపించలేదన్నాడు.

అలాంటి పోప్ ఆధునిక వైద్యం బదులు, స్విట్జర్లాండ్ లో నాటు వైద్యం అనుసరించి బాధకు గురైనాడు. చివరకు ఆ చికిత్సలో చనిపోయాడు. స్విస్ ప్రాక్టీషనర్ పాల్ నెహాస్ పోప్ కు సెల్యుథెరపి పేరిట చర్మం అడుగున గొర్రె,కోతి పిండాలనుండి జీవకణాలను ఇంజక్షన్ల ద్వారా ఎక్కించారు. అది సర్వరోగనివారిణి అనేవాడు. అందుకు రుజువులు, ఆధారాలు లేవు.

1958 అక్టోబరు 9న యూజినో పచెలి పోప్ పయస్ 12 చనిపోయాడు.

ఇప్పుడు ఆ పోప్ గొప్ప రుషి అని ప్రస్తుత పోప్ ప్రకటించాలనుకుంటున్నాడు. ఇందుకు పోప్ అద్భుతాలు కొన్ని, రుజువు అయినట్లు చూపాలి. వాటి పరిశీలనకు ఒక సంఘం నియమించాడు. అలాంటి రుషి పట్టా మదర్ థెరిసాకు సైతం అంటగట్టాలని ప్రయత్నాలు మెదలయ్యాయి.

- హేతువాది, డిశంబరు 1999