అబద్ధాల వేట - నిజాల బాట/డిరోజియో ఉజ్వల ఆరంభం

వికీసోర్స్ నుండి
పునర్వికాస పరిణామం
డిరోజియో ఉజ్వల ఆరంభం

భారతదేశంలో పునర్వికాసం 19వ శతాబ్దం ఆరంభంలో మొదలయింది. మానవ హక్కులకు, విలువలకూ వ్యతిరేకంగా వున్న మత ఆచారాలూ, సంప్రదాయాలూ పరిశీలించి ప్రశ్నించడం ప్రారంభమైంది. మత గ్రంథాల ఆధారంతో కొందరు ఆచారాలను సంస్కరించాలని తలపెట్టగా, మరికొందరు తృణీకరించాలన్నారు. మొత్తం మీద సమాజంలో ఉన్న దోషాలను ఉభయులూ గుర్తించారు, మార్పు కోరారు. పాత పద్ధతులను గ్రుడ్డిగా అనుసరించరాదనే ధోరణి వ్యక్తమైంది. ఇది దేశంలో పునర్వికాసానికి నాంది. బెంగాల్, బొంబాయిలలో ఈ ఆలోచన మొదలైంది. అప్పట్లో ఆంగ్లేయులు పాలిస్తున్న భారతదేశానికి కలకత్తా రాజధాని. ఇంగ్లీషు విద్య కొత్తగా ప్రారంభించగా చదువుకున్నవారి సంఖ్య వేళ్ళపై లెక్కించటానికి వీలుగా ఉండేది. కలకత్తా జనాభా 2.5 లక్షలున్న రోజులలో కొత్తగా ఇంగ్లీషు బోధనా బాషగా హిందూ కళాశాలను 1817లో ప్రారంభించారు. రామమోహన్ రాయ్ కలకత్తా వచ్చి ఆత్మీయ సభ స్థాపించి చర్చలు కొనసాగించిన రోజులవి. బెంగాల్ సంపన్న కుటుంబీకులు కలకత్తాలో 1817లో కొందరు యూరోపియన్లతో కలసి హిందూ కళాశాల స్థాపించారు. భారత పునర్వికాసానికి ఈ కళాశాల ఎంతో తోడ్పడింది. బహుశ ఈ కృషికి శ్రీకారం చుట్టిన వ్యక్తిగా హెన్రీ లూయీ ఎవిలిన్ డిరోజియోను పేర్కొనవచ్చు.

డిరోజియో 1809 ఏప్రిల్ 19న కలకత్తాలో పుట్టాడు. తండ్రి ఫ్రాన్సిస్ డిరోజియో. ఇతడు చీఫ్ అకౌంటెంట్ గా జేమ్స్ స్కాట్ కంపెనీలో పనిచేస్తూ ఉండేవాడు. తల్లి సోఫియా జాన్సన్. 1806లో వీరి వివాహం జరిగింది. డిరోజియో పుట్టిన 6 సం॥లకే 1815లో తల్లి చనిపోయింది. తండ్రి మరొక వివాహం చేసుకున్నాడు. సవతితల్లి అన్నా మేరియా రివర్స్ డిరోజియోను బాగా చూచుకున్నది. 1851లో ఆమె చనిపోయింది. 1809 ఆగస్టు 12న కలకత్తా సెంట్ జాన్స్ చర్చిలో హెన్రీ డిరోజియో బాప్టిజం జరిగింది. డిరొజియో డ్రమండ్ అకాడమీలో చేరి పాఠశాల విద్యనభ్యసించాడు. డేవిడ్ డ్రమండ్ (1757-1843) కవి, తత్వచింతన కలవాడు. 1813లో ఇండియాకు వచ్చి అకాడమీని స్థాపించి చాలామందికి విద్యారంగంలో బీజాంకురాలు ఏర్పడటానికి తోడ్పడ్డాడు. ఈ స్కూలులో కవిత్వం, నాటకరంగాల గురించి ప్రత్యేక కృషి జరిగింది. పాఠశాలలో ఉండగానే డిరోజియో ఇంగ్లీషులో కవితలల్లాడు. ప్రతిభాశాలి అనిపించుకున్నాడు. ఐతే విద్యాభ్యాసం పూర్తికాకుండానే 14వ ఏట పాఠశాల వదలి తండ్రి పనిచేస్తున్న మర్కంటైల్ సంస్థలో రెండేళ్ళు ఉద్యోగం చేసి తరువాత భాగల్ పూర్ లోని తారాపూర్ నీలిమందు కంపెనీలో చేరాడు. ఉద్యోగం చేస్తున్నా నిర్విరామంగా కవితలు వ్రాస్తూనే ఉండేవాడు. ది ఇండియా గజెట్ లో సబ్ ఎడిటర్ గా ఉద్యోగంలో చేరే నిమిత్తం 1826లో కలకత్తా చేరుకున్నాడు. డా॥ జాన్ గ్రాంట్ కారణంగా ఈ ఉద్యోగం లభించింది. 1826 నవంబరులో నెలకు 150రూ. జీతంతో కలకత్తాలోని హిందూ కళాశాలలో టీచరుగా చేరాడు. అప్పటికే తన మొదటి కవితా సంపుటిని డా॥గ్రాంట్ కు అంకితం ఇచ్చాడు. కవిగా, రచయితగా రుపొందుతున్న డిరోజియో ఇంగ్లీషు పాఠకలోకంలో గుర్తింపు పొందనారంభించాడు. కలకత్తా మాగజైన్, బెంగాల్ మాన్యువల్ కేలడోస్కోప్, హేస్పెరస్, కలకటా లిటరరీ గజట్ వంటి పత్రికలలో తన కవితలూ, రచనలూ ప్రకటించాడు. సతీ సహగమన నిషేధాన్ని ఆహ్వానించాడు! ద్రీస్ విమోచనను శ్లాఘించాడు.

హిందూ కళాశాలలో డిరోజియో కొత్త పద్ధతిలో చరిత్ర బోధించాడు. ప్రశ్నించి తెలుసుకోవడం, వైజ్ఞానికంగా పరిశీలించడం అతడి ఆయుధాలుగా ఉండేవి. కాంట్ తత్వం పై తీవ్రవిమర్శచేస్తూ రచన సాగించాడు. పాశ్చాత్య ఆలోచనా ధోరణిలో విద్యార్థులు పయనించటానికి వీలుగా కృషి చేశాడు. ఇది హిందూ కళాశాల విద్యార్థులను ఆకట్టుకున్నది. కళాశాలలో ప్రథమ చర్చావేదికను ప్రారంభించారు. సంప్రదాయాలనూ,ఆచారాలనూ పట్టించుకోకుండా తిరుగుబాటు ధోరణి వ్యక్తపరిచారు. డిరోజియో ఇంట్లోకూడా చర్చలు కొనసాగాయి. హిందూమతంలోని జుగుప్సాకరమైన అనేక ఆచారాలను వీరు నిరసించారు. సత్యాన్వేషణ ఒక్కటే వారికి లక్ష్యంగా కనిపించింది. 1828లో అకడమిక్ అసోసియేషన్ ప్రారంభించి యథేచ్ఛగా చర్చలు చేశాడు. వారాంతంలో చర్చలు జరిపేవారు. అప్పట్లో కళాశాల విద్యార్థుల సంఖ్య కేవలం వందల్లోనే ఉన్నది. 1830 ఫిబ్రవరిలో ఎధీనీయం అనే పత్రికను కూడా హిందూ కలాశాల విద్యార్థులు ప్రారంభించి 2 సంచికలు వెలువరించారు. ఇందులో స్త్రీవిద్య, న్యాయాన్ని అందించటంలో అధికవ్యయం లేకుండా చూడటం, మూఢనమ్మకాలపై విమర్శ సాగించారు. ఐతే, డా॥హెచ్. హెచ్.విల్సన్ కలాశాల అధిపతిగా ఆ పత్రికను మూతవేయించారు. డిరోజియో తన ఉపన్యాస పరంపరలో బేకన్, బెంధాం, హ్యూం,లాక్, పెయిన్, స్మిథ్ ల తత్వాలను, ఆలోచనలను విద్యార్థులకందించారు. వలసవాదానికి వ్యతిరేకంగా విద్యార్థుల వాదన ప్రారంభమైంది. ఫ్రెంచి విప్లవాన్ని ఆవేశపూరితంగా సమర్ధించారు.

సనాతన హిందువులు డిరోజియో నాయకత్వాన జరుగుతున్న ధోరణులను గమనించి ఆందోళన చెందారు. బృందావన్ గోపాల్ అనే విద్యార్థి సనాతనులకు డిరోజియో సమాజంలో జరుగుతున్న విషయాలను చిలవలు పలవలుగా చెప్పి వారిని కలవరపరిచాడు. 1831 ఏప్రిల్లో కళాశాలలో జరుగుతున్న విషయాలను వ్యతిరేకిస్తూ సనాతనులు ఒక కరపత్రాన్ని ప్రచురించారు. అప్పటికే డిరోజియోకు హెడ్ మాస్టర్ యాక్స్ లమ్ కు సిద్ధాంతపరమైన వివాదం చెలరేగింది. 1831 ఫిబ్రవరి 5న కళాశాల సంఘం ఈ వివాదాన్ని సర్దుబాటు చేసింది. ఐతే, సనాతాన హిందువుల ఆందోళన కారణంగా డిరోజియోపై ఒక ప్రత్యేక విచారణ సంఘాన్ని ఏర్పరిచారు. కళాశాలలో అలజడికి దారితీసిన డిరోజియోను తొలగించాలనేది అభియోగం. 1831 ఏప్రిల్ 23న హిందూ కళాశాల డైరెక్టర్లు ప్రత్యేక సమావేశం జరిపి విషయాన్ని పరిశీలించారు. యువకులకను డిరోజియో చెడగొడుతున్నాడని ముగ్గురు సభ్యులు అభిప్రాయపడగా ఆరుగురు అందుకు సమ్మతించలేదు. విద్యార్థులపై కూడా చర్య తీసుకోవాలని, హిందూయిజంపై దాడిచేసే విద్యార్థులను కాలేజి నుండి తొలగించాలని ప్రతిపాదించారు. డిరోజియో దోషి అని కమిటీ తేల్చలేకపోయినా హిందువులలో ఉన్న వ్యతిరేక భావాన్ని దృష్టిలో పెట్టుకొని డిరోజియోను తొలగించాలని తీర్మానించారు. తొలగించనక్కరలేదని శ్రీకృష్ణసిన్హా వాదించారు. తొలగించటం ఆపద్ధర్మచర్యగా ప్రసన్న కుమార్ టాగోర్, రసమయిదత్త అభిప్రాయపడ్డారు. తొలగించడం అవసరమని చంద్రకుమార్ టాగోర్, రాధాకాంత్ దేవ్, రాం కమల్ సేన్, రాధామాధవ బంధోపాధ్యాయ తలపెట్టారు. 1831 ఏప్రిల్ 25న విల్సన్ సలహాపై డిరోజియో తన రాజీనామా లేఖను పంపారు. వదంతులుగా విల్సన్ పేర్కొన్న అభియోగాలను డిరోజియో ఎదుర్కొన్నారు. ఆయన ఒక లేఖ పంపిస్తూ నాస్తికవాదాన్ని చర్చించటం తప్పా అని అడిగారు. హ్యూం వాదనలను అందుకు వ్యతిరేకమైన అభిప్రాయాలను విద్యార్థులకు వినిపించామనీ,అందుకుగాను తనను సందేహవాదిగా, మ్లేచ్ఛుడుగా మతపరమైన వ్యక్తులకు అలవాటేనన్నారు. డిరోజియోను తొలగించిన తరువాత కొందరు విద్యార్థులు కూడా కాలేజినుండి వెళ్ళిపోయారు. డిరోజియో "ఈస్ట్ ఇండియన్" అనే దినపత్రికను స్థాపించి తన అభిప్రాయాలనూ, ఆదర్శాలనూ కొనసాగించారు. ఆంగ్లో ఇండియన్లు, భారతీయులూ సఖ్యంగా ఉండాలన్నారు. ఏకేశ్వరారాధనను ప్రచారం చేసి విగ్రహారాధనను వ్యతిరేకించిన బ్రహ్మసమాజవాదులు ముఖ్యంగా, ప్రసన్నకుమార్ టాగోర్ దుర్గపూజలో పాల్గొన్నందుకు డిరోజియో ఖండించారు. డిరోజియో అనుకూలురు, శిష్యులు కూడా వివిధ పత్రికలు పెట్టి, సంఘాలు స్థాపించి భావ ప్రచారానికి పూనుకున్నారు. 1831 డిసెంబరులో డిరోజియోకు కలరా వ్యాధి సోకింది. ఆ విషయం తెలిసి కూడా అతని మిత్రులు పడకచుట్టూ చేరి ఆతృతగా డిరోజియో చావుబ్రతుకులమధ్య కొట్లాడుతుండగా చెంత ఉన్నారు. డిసెంబరు 17న డిరోజియో చనిపోయాడు.

చిన్న వయసులోనే జీవితాన్ని చాలించిన డిరోజియో చాలామంది యువకులను ప్రభావితం చేసి యువకులను ఉత్తేజపరచి పునర్వికాస ఉద్యమానికి నాంది పలికారు. డిరోజియోకు, రాంమోహన్ రాయ్ కూ స్నేహం ఉన్నదీ లేనిదీ స్పష్టపడలేదు. డిరోజియో స్థాపించిన అకడెమిక్ అసోసియేషన్ ప్రభావంతో ఆయన అనంతరం యువబెంగాల్ సంఘాన్ని స్థాపించారు. ఇది ఒక ఉద్యమంగా పెంపొందలేకపోయింది గాని ఇంచుమించు 10 సం॥ల పాటు డిరోజియో ప్రభావంతో కొందరు కృషిచేసినట్లు స్పష్టపడింది. టాం పెయిన్ "ఏజ్ ఆఫ్ రీసన్" చదవటం, బెంథాం సూత్రాలను అనుసరించటం,ఏడం స్మిత్ ఆర్థిక సూత్రాలను అధ్యయనం చేయటం వీరి ప్రధాన లక్షణాలుగా కనిపించాయి. డిరోజియో అనుచరులలో రసిక్ కృష్ణమల్లిక్, తారాచంద్ర చక్రవర్తి, రాంగోపాల్ ఘోష్,దక్షిణరంజన్ ముఖోపాధ్యాయ, కృష్ణమోహన్ బంధోపాధ్యాయ,రాధానాధ్ సిక్దర్ పేర్కొనదగినవారు. డిరోజియో స్థాపించిన అకడమిక్ అసోసియెషన్ కు డా॥హేర్ అధ్యక్షులుగా కొనసాగుతూ డిరోజియో ధోరణి ప్రచారంచేశారు. డేవిడ్ హేర్ హిందూ కాలేజి స్థాపకులుగా స్కూల్ సొసైటీనీ,స్కూల్ బుక్ సొసైటీనీ స్థాపించి మెడికల్ కళాశాలను 1835లో ప్రారంభించారు. డిరోజియోకు శిష్యులు బొంబాయి, గుజరాత్ లలో కూడా ఉండేవారు. 1838 ఫిబ్రవరి 28న విజ్ఞానార్జనకు సమాజాన్ని ఏర్పరచి తారాచంద్ చక్రవర్తి అధ్యక్షతన మూడు సంపుటాలు ప్రచురించారు. డిరోజియో సంఘాలన్నీ సాంస్కృతిక సమితులుగా ప్రారంభమై రాజకీయాలలోకి దారితీశాయి. సత్యాన్వేషణ జరపాలనే డిరోజియో ధోరణి వీరంతా కొంతకాలం కొనసాగించి పునర్వికాస ఉద్యమానికి హేతువాద ధోరణికి నాంది పలికారు. కాని,అది అట్టేకాలం నిలవలేకపోయింది. మత సంస్కరణ వాదం ఒకవైపున, సనాతనవాదం మరొకవైపున సమాజాన్ని ఆకట్టుకున్నాయి.

- హేతువాది, డిసెంబరు 1988